అవ్యాజం

“ఓరేయ్, పోయి దానితో గొడవపడటం అంటే మన మొల మీద గుడ్డ మనం ఊడబీక్కొని ముఖమ్మీద వేసుకోవడంలాంటిదిరా. పొయిపొయి దాని నోట్లొదూరబాక”

దాదాపు పదిమూడేళ్ల క్రిందటి మాట చెవుల్లో గరగరలాడుతున్నట్లనిపించి ఉలిక్కిపడి లేచి, సర్దుకొని కూర్చున్నాడు సుబ్బయ్య. ఇంకా నలభై కిలోమీటర్లుంది. బస్సు జనంతో కిటకిటలాడుతుంది. ఈ దారిలో ప్రయాణం అతనికి చాలా పరిచితం. ఇంకో గంటా ఇరవై నిమిషాల దూరంలో ఊరు ఉన్నప్పటికీ, అదెప్పుడూ వాడి గుండెల మీద మోతంత దగ్గరగానే ఉంటుంది.

“చాలాసార్లు వాళ్ల లోపల ఏముందో అదే మాట్లాడతారు జనం.  మనలో ఏముందో ఎవరికి అవసరంలేదు” అనుకున్నాడు నిట్టూర్చుతూ.

**

ఆ బజార్లో నుంచి గోళీలు ఎగరేసుకుంటా పరిగెత్తుకొస్తున్న పదేళ్ల పెద్ద కొడుకుని చూసి ఉలిక్కిపడి ఆలోచనలోపడ్డాడు సుబ్బయ్య. ఏదో తెలియని సన్నని జలదరింపు వెన్నులోంచి తలలోకి పాకింది.  ఇక అంతే, ఆ ఊళ్లో ఉండబుద్దెయ్యలేదు.

దాదాపు వందేళ్లక్రితం ముత్తాతలు వలసొచ్చిన ఊరు. ఏడెకరాల పొలం, సొంత ఇల్లు. మంచి భార్య. ఇద్దరు  కొడుకులు. తనమానానతాను బతికే కుటుంబం.

దాయాదులు చెప్పిచూసారు. ముసలోళ్లొచ్చి సముదాయించారు. అమ్మలక్కలు సర్దిచెప్పారు. కుర్రోళ్లు వింతగా చూసారు. పిల్లల్ని హాస్టల్లో వేయి. దాని బారినుంచి తప్పించుకోవాలంటే. అంతే కాని పుట్టిపెరిగిన ఊరిని వదిలిపోయేదేంటని మందలించారు. అయినా నువ్వు దాని కొట్టు దగ్గరకు పొయ్యే ఏళ్లవుతుంది, ఇంకా ఈ భయాలేంటి అన్నారు కొందరు.

కాని ఎవరి మాట అతని చెవిలో దూరడం లేదు. ఎవరితోను తన భావాలు పంచుకోలేదు. తొడమీద మచ్చ అతని చెవుల్ని మనసుని మూసేస్తుంది. ఓ నెల్లోనే వచ్చినకాడికి పొలం, ఇల్లు అమ్మేసుకొని, ఆ ఊరికి దూరంగా పట్నానికి వెళ్లిపోయాడు సుబ్బయ్య. శివార్లలో  ఎకరం పొలం, బర్రెలు కొనుక్కొని కొత్త జీవితం ప్రారంభించాక, మళ్లీ ఊరి వైపు రావడం ఇదే మొదటిసారి.

“నేనెందుకు వెళ్లిపోయానో ఊరెప్పుడన్నా అర్థం చేసుకుంటుందా? కనీసం ఆమెన్నా?” అనే ప్రశ్న అతనిలో ఇప్పుడే కాదు, ఎప్పుడూ లేదు.

అసలు ఆలోచనే లేనప్పుడు ప్రశ్నను ఆశించడం అవివేకం.

**

ఊర్లో దూలది అంటే చులకనో, ప్రేమో, ఆరాధనో అర్థం కాదు.  ఏమేం సంగతులు పంచుకుంటారో తెలియదుకాని ఎప్పుడూ గలగలలాడే ఆడాళ్ల పరాచికాలతోనో, ఏమేం తలుచుకొని సిగ్గుపడతారో తెలియదుకాని గుట్టుగా అపానవాయువు వదిలినంత సౌఖ్యంగా కుళ్లుజోకులతో పబ్లిగ్గా పకపకలాడే నడివయస్కుల, ముసలోళ్ల నవ్వులతోనో, లోపల్లోపల ఎలాంటి కోరికలతో కుతకుతలాడుతుంటారో కాని కుర్రాళ్ళ బరువైన కళ్లతోనో,  కొంత మంది తల్లిదండ్రుల, అమ్మాయిల భయాలతోనో దాని అంగడి మాత్రం ఎప్పుడూ నిండుగా కళకళలాడుతుండేది.

**

వీరిగాడి రెండోపెళ్లాంగా పదహారేళ్ల వయసులో ఊర్లోకి అడుగుపెట్టింది, వాడికి ముప్పైకి కొంచెం అటుఇటుగా ఉంటాయేమొ. ఊరికి ఎడంగా పెద్ద పెంకుటిల్లు, బయట చిన్నకొట్టు. ఏకాంతవాసంలాంటి జీవితం. అప్పట్లో అక్కడికెళ్లి ఏమన్నా కొనేవాళ్లు తక్కువ. ఆర్నెల్లు తిరక్కుండానే డబ్బులిస్తాడే వీడు అంటు వాడి స్నేహితుల్ని అలవాటు చేసి, తాగడానికి వెళ్లిపోయేవాడు వీరిగాడు.

ఏ అర్థరాత్రో వాళ్లిచ్చిన డబ్బుతో తాగొచ్చి బండబూతులు తిట్టి, మూలనున్న కర్రతో రాలగొట్టి వాడి అసమర్ధతని, అసహనాన్ని కప్పిపుచ్చుకొనేవాడు. ఇందుకే మొదటి భార్య ఆత్మహత్య చేసుకుందని పెరట్లో బాదం చెట్టుపైన గూడు కట్టుకున్న కాకికి తెలుసు. మూడేళ్లైనా దీనికి కడుపు రాకపోవడంలోని రహస్యం ఎప్పుడొ దానికి జ్వరం వచ్చినప్పుడు చేయించిన ఆపరేషన్ అని కూడా దానికి తెలుసు. ఇంకో ఆరునెల్లకి వీరిగాడు తాగి చచ్చాడో, ఇది మందు పెట్టి చంపిదో కూడా దానికే తెలుసు.

**

ఆమె ఏడ్వటం ఎప్పుడూ ఎవరూ చూడలేదు, నిండుగా నవ్వడం తప్ప. కొట్లొ బేరాలు పెరిగాయి. వచ్చిన వీరిగాడి స్నేహితుల్ని అందరి ముందు విసిరికొట్టేది. వాళ్లు తలలెత్తుకోలేనంత బండబూతులతో.

పెంకుటిల్లు ఆమె సామ్రాజ్యం.  క్రమంగా ఓ సంవత్సరం గడిచేలోగానే నెలలో ఓ నలుగురైదుగురు కుర్రాళ్ళకు మాత్రం దానిలోకి అనుమతి దొరికేది. వాళ్ల చేతిలో పదిరూపాయిలు పెట్టిందనే కాని, ఎవడి నుంచైనా ఒక రూపాయి తీసుకుందని చెప్పినోడు ఒక్కడూ లేడు. ఏ రాత్రన్నా తలుపు తీసి ఉంటే అది ఎవరికైనా ఆహ్వానమే. కాని అలాంటి అవకాశం దక్కించుకున్నోళ్లెవరూ పెద్దగా లేరని ఊర్లో చాలా మందికి తెలుసు. క్రమంగా దాని పేరు వీరిగాడి పెళ్లాం నుంచి దూలదిగా పరిణామం చెందింది.

“ఆమె ఊర్ని వాడుకుంటుందా? ఊరు ఆమెను వాడుకుంటుందా?” అనేది చెట్టుమీద కాకికెప్పుడూ ఒక కుతూహలమైన ప్రశ్న.

**

ఊర్లో సగంమంది కుర్రాళ్లకు ఆమె పక్కమీద తొలిపాఠం పూర్తయ్యేదన్నది పుకారేమి కాదు. చాలా సాధారణమైన నిజం. ఎంత మంది అనేది ఆ మూలనున్న కుండలోని రాళ్లకు తెలుసు. హైస్కూల్ పిల్లకాయల్ని రానివ్వదు కాని, పదహారు, పదిహేడేళ్ల వయసులో తొలి అనుభవం కోసం తహతహలాడే వాళ్లకి అదొక ఓపెన్ రిక్రూట్మెంట్ సెంటర్లాంటిది. మొగుడు చచ్చిన దానికి అదొక ఆటయ్యిందని ఈసడించుకున్నా ఊరెప్పుడూ ఆమెను వెలెయ్యలేదు. అదెందుకు అలవాటయ్యిందో, ఊరికి, ఆమెకు, బాదం చెట్టుపైన కాకికి కూడా తెలియదు.

ఎయిడ్స్ వచ్చిన కొత్తల్లో రెండు మూడేళ్లు ఊరుఊరంతా బిక్కుబిక్కుమంటున్నా, ఇద్దరు ముగ్గురు చచ్చినా, ఆమెకి ఎప్పుడూ పాజిటివ్ రాకపోవడం ఊరికి ఆశ్చర్యంగానే ఉండేది. ఆమె ఎన్నికలోని మహత్యమది అని జోకులేసేవాళ్లు. కాని ఆమె కోసం కొట్టు చుట్టూ తచ్చాడే కుర్రకారులో మాత్రం పెద్దగా మార్పు రాలేదు.

**

పన్నెండేళ్లప్పుడు గోళీలు ఆడతా, ఆమె కాళ్ల దగ్గర పడ్డ గోళీ కోసం వెతుకుతున్నప్పుడు, “ఏందిరా అప్పుడే చూడాలా” అంటూ లంగా ఎత్తి ముఖాన విదిలించినప్పుడు, కళ్లు బైర్లుకమ్మడమో, మెరుపులు కళ్లల్లో మిగలడమో, శరీరమంతా బిత్తరపోవడమో, ఏమైందో తెలియదు కాని చుట్టూ ఉన్నోళ్ల ఘొల్లుమనే నవ్వులతో తెలివొచ్చి పరిగెత్తడం మాత్రమే గుర్తు.

మళ్లీ ఎప్పుడూ అక్కడికి వెళ్లాలనిపించలేదు, ఒక అవమానంలా అనిపించిందది.

పదహారేళ్ళప్పుడు పొలాన పిడుగు పడి అమ్మనాన్నలు పోయి, పూర్తిగా ఒంటరైపోయా. దాయాదులిచ్చే కౌలుడబ్బులు తీసుకుంటా, ఎప్పుడన్నా కూలికెళ్తా, ఒకరకమైన నైరాశ్యంలో ఉన్నప్పుడేమో మళ్లీ అక్కడికెళ్లా.

“ఏందిరా అన్నం వండుకోవడం వచ్చిందా? కూరలు నేర్పించేదా!” అంటూ ఆటపట్టిస్తూ, చనువుగా పక్కన కూర్చొని, “మీసాలు వస్తున్నాయ్, రాత్రుళ్ళు నిక్కర్ తడిపేస్తున్నావా?” అని చెవులకు పెదాలు ఆన్చి రహస్యంగా అడిగినప్పుడు ఆ వారంలో ఆమె నన్ను ఎంచుకోబోతుంది అని అర్థమైనాక శరీరంలో విద్యుత్ ప్రసరిస్తున్నట్లుండేది. లోపలకు తీసుకెళ్లి తలను తొడలమధ్య అదుముకొని పేలను తీయడం, చెవులొ గుబిలి తీస్తున్నట్లు మరింత దగ్గరవ్వడం, ఇదంతా నన్ను సిద్ధం చేయడమని తెలుస్తుంది.

ఆమెకప్పుడు ఇరవైమూడుంటాయా!

**

ఇది ఊర్లో చాలామంది నా ఈడు కుర్రాళ్లకు ఎవరూ చెప్పకుండానే, ఏమీ పెద్దగా చర్చించకుండా ఎలాంటి అలజడి లేకుండా జరిగిపోయే విషయమేనని అందరికీ తెలుసు. కాని ఆమెను నిలదీసేవాడు, అక్కడకెళ్లి గొడవపడే మగాడు కాని ఆడది కాని లేకపోవడం ఆశ్చర్యమే.

బాదం చెట్టు మీద కాకి నవ్వుకునేది “ఇదే పని ఏ మగాడో చేసుంటే, చావకొట్టి చెవులు మూసేవారని.”

**

ఆ ఇంట్లో వారంపైన, దాదాపు పదిరోజులుంది నేనేనేమో!

ఎంత మంది ఈర్ష్య పడ్డారో తెలియదు.

 

నాకోసం చూసేవాళ్లెవరు లేకపోవడంతో నేను అక్కడ్నుంచి అడుగు బయటపెట్టిందే లేదు. పగలు నిద్రపోవడం, రాత్రుళ్లు వీలున్నంత మేలుకోవడం. ఎలా గడిచాయి ఆ రోజులు, ఈ ప్రపంచమంతా ఆ పెంకుటిల్లే అనేంత వింత అనుభవాలతోనా!

వచ్చేటప్పుడు “నేను వెళ్లను, నన్ను ఇక్కడే ఉంచుకో” అని ఏడవడం గుర్తుంది.

“ఓరేయ్ పిచ్చోడా! నీ పొలం నువ్వే చేసుకో, కౌలుకోసం ఎదురుచూస్తా పొలాన్ని పోగొట్టుకోకు. ఆ పనులు నువ్వే నేర్చుకో.  బేల్దారి పనులకెళ్లకు. కావాలంటే అప్పోసొప్పో చేసి రెండు బర్రెల్ని కొనుక్కో. కొంచెం స్థిరపడ్డాక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. ఇదిగో ఈ వంద నీ దగ్గరుంచు.  రేపు ఆ బోసుబాబు దగ్గరకెళ్లు. నీరుపొక్కులొస్తాయేమో మందులిస్తాడు. ఇలాంటి దూలదాని కోసం ఇంకెప్పుడూ ఆశపడకు” అని తలపులేసేయడం ఇంకా ఎక్కువ గుర్తుంది, ఆ పది రోజుల్లో ఏం జరిగిందన్న దాని కంటే కూడా.

**

ఆమె నాకేమిచ్చింది బలాన్నా, ఆత్మవిశ్వాసాన్నా, బతకగలననే ధైర్యాన్నా!

ఏమిచ్చిందో తెలియదు కాని,  ఆరేడేళ్లలో రెండెకరాలు ఐదెకరాలయ్యింది. పాతిల్లు కొత్త మిద్దైంది.  దూరపు బంధువులమ్మాయి భార్యగా వచ్చింది. ఇద్దరబ్బాయిలు పుట్టారు. పెరిగారు. ఆమె ప్రస్తావన, అక్కడికెళ్లే ధైర్యం ఎప్పుడూ చేయలేదు గత పదిహేడేళ్లలో. బహుశా ఆ బజార్లోకి అడుగుపెట్టకుండానే జీవితం గడిచిపోయింది.

**

మధ్యలో వచ్చిన పారిపేడులో వెంకట్రావు బస్సెక్కాడు, గుర్తుపట్టి కేకేసాడు సుబ్బయ్య. నెమ్మదిగా జనంలోంచి నెట్టుకుంటూ దగ్గరకొచ్చి, పక్కన సర్దుకున్నాడు.

“ఏంటి, అది పోయిందని మళ్లీ ఊర్లోకి వస్తున్నావా?” అనేది మొదటి మాట.

“ఆమె చచ్చిపోయిందా? ఏమయ్యింది?” సుబ్బయ్య ముఖంలో కదిలాడే భావాలను చదవే శక్తిలేని వెంకట్రావు చెప్పడం మొదలుపెట్టాడు.

“అవును సుబ్బా, దానికి వయసు పెరిగినా కుర్రోళ్లను వదిలేది కాదు. మూడేళ్ల క్రితం మన బ్రహ్మిగాడి కొడుకుని లోపలకి పిలిచింది. వాడు దానికి తెలియకుండా వాడి ఫ్రెండ్స్  ఇంకో  ముగ్గుర్ని పిలిచాడంట. వాళ్లందరూ కలిసి సెల్ ఫోన్లు పెట్టుకొని దానికేం చూపించారో, ఏం చేసారో తెలియదుకాని నాలుగురోజుల్లో పిచ్చిదాన్ని చేసి పారిపోయారు. అప్పట్నుంచి దానికి కొట్టు లేదు, పెంకుటిల్లు లేదు. నిండుగా బట్టలు చుట్టుకొని రామాలయం అరుగు మీదే భయంభయంగా  ఉండేది.

ఎవరిని ఏమీ అడిగేది కాదు, అనేది కాదు. ఆడోళ్ళు ఈసడించుకున్నారు. మనోళ్లే కొంచెం అన్నం పెట్టేవాళ్లు.  ఎవరైన పిల్లలు సెల్ ఫోన్తో కనిపిస్తే చాలు వెంటబడి మరీ ఫోన్ను పగలకొట్టేది. పొరపాటున పడిందో లేదా అదే దూకిందో, ఓ నెల క్రితం ఊరబావిలో శవమై కనిపించింది. సరే, ఇక కేసులు గీసులు ఎందుకని ఊరు బయట దాని స్థలంలోనే సమాధి కట్టారు. ఆ పెంకుటిల్లు చదును చేసారు. పెద్ద స్థలం కదా  ఊరోళ్లు దాన్ని పిల్లల పార్కు చేద్దామనుకుంటున్నారు” అంటూ చెప్పుకుంటా పోతున్న వెంకట్రావు మాటలేవి అతనికి చేరడం లేదు.

బాదంచెట్టు మీద కాకి ఎప్పుడో ఎగిరిపోయింది, ఆ నలుగురి చేతిలో దాని నరకయాతన చూడలేక.

**

“అదిగో అదే దాని సమాధి” అని చిన్నగా గొణిగినట్లన్నాడు వెంకట్రావు.

ఊరింకా అర కిలోమీటరు దూరం ఉంది. పక్కనున్న గుడ్డ సంచిని చేతిలోకి తీసుకుంటా, హఠాత్తుగా లేచి నిల్చున్నాడు సుబ్బయ్య. కిటికీ పక్కన ఇనపరేకును చేత్తో బాదుతా, బస్సు ఆపమని కంగారుగా అరిచాడు.

“మీ వదినకు చెప్తా అన్నానికి ఇంటికొచ్చెయ్” వెంకట్రావు అరుపు చెవులో వేసుకుంటా బస్సు దిగాడు. రైట్, రైట్ అన్న కండక్టర్ కేకతో ఏదో ఊపిరి పీల్చుకున్నంత తేలికగా బస్సెళ్లిపోయింది.

సమాధికి దగ్గరయ్యే కొద్ది మనసుకి భారంగా అనిపించింది. అడుగుల వేగం మందగించింది. నెమ్మదిగా వెళ్లి సమాధి పక్కన కూర్చున్నాడు. వణుకుతున్నచేతులతో సంచిలోంచి పెళ్లి కార్డు తీసి సమాధిపైన పెట్టి కళ్లు మూసుకున్నాడు.

“వీడికి నిన్ను అమ్మలాగే ఉంచాలనుకున్నాను. ఉంచాను. వాడి మొదటి పెళ్లి కార్డు నీకు ఇద్దామని వచ్చాను, తీసుకెళ్లి అక్షింతలు వేయిద్దామనుకున్నా. ఇప్పుడు నాకా అదృష్టం లేదు. వాడ్ని ఆశీర్వదించు”  అంటూ సమాధిని రెండుచేతులతో తాకి వెనుతిరిగాడు.

రోడ్డు మీద నిలబడి, వస్తున్న బస్సుని చెయ్యెత్తి ఆపాడు.

**

ఒకప్పుడు ఆమె ఉందని ఊరిని వదిలేసి వెళ్లిపోయాడు.

ఇప్పుడు అతనికి ఆమె తప్ప ఊరు పెద్ద ముఖ్యం అనిపించలేదు.

బస్సు నింపాదిగా పట్నం వైపు పరుగుతీస్తుంది.

ఓ కన్నీటి చుక్క గాల్లో ఎగురుకుంటా నేలను చేరకుండానే ఆవిరైపోతుంది.

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం 

భాస్కర్, కె.

23 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • భాస్కర్ కె గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు… ప్రవృత్తి రీత్యా సాహితీ ప్రియుడు, కవిహృదయుడు. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణం సమీపం లోని గ్రామీణ ప్రాంత రైతు కుటుంబ నేపధ్యం నుంచి మానవతా మౌలిక విలువలు సంతరించుకున్న వారు.

    కరువులో పుట్టి, కరువులో పెరిగి, కరువు మధ్య మరణించే కనిగిరి సీమ జనాన్ని ఉద్యమాల వైపు మళ్లించి గుప్పెడు చైతన్యాన్ని వారికి పంచిన మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ యోధ్ధుడు సూరా పాపిరెడ్డి గారిని అభిమానిస్తారు.

    “నూతిలో గొంతుకలు” కవి ఆలూరి బైరాగి నుండి, హైకూ కవితల మాంత్రికుడు గాలి నాసర రెడ్డిగారి వరకూ అందరూ వారికి ఇష్టులే. గౌతమ బుధ్ధుడు చూపిన ధర్మపధం నుండి, అరుణాచల ఆధ్యాత్మికవేత్త రమణ మహర్షి ఉపదేశించిన ఆత్మజ్ఞానం, స్వీయ శోధనల పట్ల ఆశక్తి చూపుతారని వినికిడి.

    మార్పే సత్యం, తర్కమే జ్ఞానం, ప్రశ్నే మార్గం, సత్యజ్ఞాన మార్గమే జీవితం అనే తాత్వికతో భాస్కర్ మాస్టారు గారు రాసిన కవితలు పిన్నమనేని మృత్యుంజయ రావు, డా. శ్రీసుధ మోదుగు గార్ల సంపాదక పర్యవేక్షణలో ” ఆమె… బేకారీలు ” అనే కవితల పుస్తకంగా వచ్చింది.

    “అవ్యాజం” భాస్కర్ కె మాస్టారు రాసిన మొదటి కధదేమో.

    • నా ఇంట్రో మీరు ఇచ్చేసారు సర్, థాంక్యూ. అవును సర్ కథ రాయడం నా వల్ల కాదు అనుకున్నా కాని రాశాను, మొత్తంమ్మీద.

  • నిజాయితీతో కూడిన కథనం , కాన్సెప్ట్ లో విభిన్నత చాలా బాగా వొచ్చింది భాస్కర్ గారు …

  • తొలి కథే అయినా జవజీవాలున్న కథ. ఒక నమ్మకమైన కథకుడిని వాగ్ధానం చేస్తున్న కథ. రసికత మీదుగా రసజ్ఞతని పరిచయం చేయిస్తూ రాసిన ఒక భూదేవి కథ. ఇలాంటి వారు వృత్తిదారులు అయినా కాకున్నా ఎన్నెన్ని ఆవేశాలని చల్లబరిచి ఎందరెందరు యువతుల మానాలని కాపాడారో అన్నదొక పచ్చి వాస్తవం. ఇలాంటి వారికోసం ఒక పాత్రచేత అయినా కన్నీరు కార్పించినందుకు సంతోషం భాస్కర్ గారూ.

    ఒక జీవితం కళ్లముందు ఆవిష్కరించారు. అభినందనలు.

    • మీ ప్రోత్సాహం ఇంకో కథకు దారి తీసేట్లుంది. మీరు జీవితాన్ని చూసారు.థాంక్యూ పద్మాకర్ గారు,

  • గొప్ప కితాబు, రచయిత ప్రాణం పోసిన పాత్ర కు.

  • ఇలాంటి సబ్జెక్టును ఎంచుకున్న మీ ధైర్యానికి ఆశ్చర్యం కలిగింది.మొదటి కథ అయినా చాలా నిజాయితీగా రాసినందుకు అభినందనలు భాస్కర్ గారు.

    • నిజానికి ఈ కథ రాసిన వెంటనే భయపడ్డాను సర్, అసలు ఇది కథేనా అని, మిత్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో అది ఇక్కడికి చేరింది. థాంక్యూ సాయి గోరంట్ల గారు.

  • చాలా బావుందండీ… మొదటి కథ అంటే నమ్మలేం! బస్సులో మనపక్కనే పరిచయం లేని ఓ మనిషి కథ ఇదే కావచ్చు అనిపించింది.

    • థాంక్యూ మనోజ గారు, నిజమే మన పక్కన వ్యక్తిలో ఎలాంటి కథ ఉంటుందో మనం అంచనావేయలేమేమో చాలా సార్లు

  • డియర్ భాస్కర్ గారూ,

    కథ బాగుంది.

    ఆమె కారెక్టర్ను కొంచం తక్కువ చేసారేమో అనిపించింది.

    ఊర్లూ ఉమ్మడి ఆస్తులూ మనుషుల మధ్య బంధాలూ లుప్తమైపోతున్న ఈ రోజుల్లో మీరు ఎన్నుకున్న కథాంశం బాగుందిగానీ కథను వేగిరం చెప్పాలనే తొందరలో కొన్ని సున్నితమైన విషయాలు వదిలేశారా అని..

    • అవునండి, కొన్ని పొరపాట్లు జరిగిఉండచ్చు. కొన్ని ఎక్కువ చెప్పాలనుకోకపోవడం, ఒక లైన్ కే పరిమితం చేసిందేమో కథను. థాంక్యూ చంద్రశేఖర్ గారు

  • 🙂 నా ఇంట్రో మీరు ఇచ్చేసారు సర్, థాంక్యూ. అవును సర్ కథ రాయడం నా వల్ల కాదు అనుకున్నా కాని రాశాను, మొత్తంమ్మీద.

  • మొదటి కథలాగాలేదు. ఆమోదించబడిన నమూనాకు భిన్నంగా ధైర్యంగా రాశారు. మీరేమి చెప్పాలనుకున్నారో అది వ్యక్తమైంది.

  • చాలా బలమైన పాత్రని చక్కగా ప్రదర్శించారు. పల్లెటూరి జీవితంలో వాడవదిన పేరుతో ఇలాంటి పరిణిత స్త్రీలు ఉండేవారు. వారి నైతికత సమాజ లైంగికనీతికి బాహిరమైనదైనా ఊరు చిత్రమైన ఉదారదృష్టి ప్రదర్శించేది. మా పల్లెటూర్లలో ఆనాటి వాతావరణం గుర్తుచేసారు. తొలికథ అంటే నమ్మశక్యంకాకుండాుంది. కాని మీ గురించి రామయ్యగారు రాసింది చదవాక మీరు పరిణుతులని తెలిసింది. అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు