- ‘రెండు నెలవంకలు’ సంపుటిలోని కవితల పుట్టుకను గురించి చెప్పండి ?
కెక్యూబ్ వర్మ : కవిత్వం నా రాజకీయ కార్యాచరణ. నా కవితలన్నీ ఎక్కువగా సంఘటనల ప్రేరణగా వచ్చినవే. భారతదేశ హిందూ కార్పొరేట్ ఫాసిస్ట్ పాలకులు మధ్య భారతములోని ఖనిజ సంపదను స్వదేశీ కార్పొరేట్ పెట్టుబడిదారుల ద్వారా విదేశీ MNC లకు చౌకగా దోచి పెట్టడానికి అక్కడి ఆదివాసీ ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించేందుకు లక్షలాది పారామిలటరీ బలగాలను మోహరించి ప్రజలకు అండగా నిలుస్తున్న విప్లవ పార్టీ నాయకత్వాన్ని నిర్ములించడానికి అత్యాధునిక టెక్నాలజీనీ వాడుతూ ప్రజలపైనే యుద్ధం ప్రకటించింది. విప్లవకారుల పేరుతో వందలాది ఆదివాసీ యువతి యువకులను పసిపిల్లలను చంపుతున్నారు. స్త్రీలను హత్యాచారానికి గురిచేస్తున్నారు.
వారికి అండగా వున్న మేధావులు, హక్కుల కార్యకర్తలను జైల్లో నిర్భందిస్తున్నారు. అలాగే అటు పాలస్తీనాలో అమెరికా అండతో ప్రజల తరపున పోరాడుతున్న హమాస్ సంస్థ వారిని ఉగ్రవాదుల పేరుతో ఏడాదిగా సుమారు 50వేల మందికి పైగా పిల్లలను స్త్రీలను యువకులను హత్య చేసి లక్షలాదిమందిని అవిటి వారిని చేసారు. కార్పేట్ బాంబింగ్ చేస్తూ ఆసుపత్రులను పాఠశాలాలను కూల్చి వేసి నిలువ నీడలేకుండా చేసింది ఇజ్రాయేల్. ఈ రెండు జరుగుతున్న అప్రజాస్వామిక యుద్ధాలు నా కవితలకు ప్రేరణయ్యాయి. వారి అసహాయ పోరాట పటిమ నన్ను కదిలించింది. ఎక్కువ భాగం కవితా వస్తువులుగా ఈ సంపుటిలో వుంటాయి. అలాగే మన పాలకుల పట్ల ప్రజల నిరసన ఉద్యమాలు అవి ఎంత చిన్నవైనా వారి నిబ్బరాన్ని ఎత్తి పట్టేవి కాబట్టి వాటిని చెప్పడానికి ప్రయత్నించాను.
- “భూమిని మాట్లాడనివ్వు” తర్వాత వెంటనే ఏడాదిలో ‘రెండు నెలవంకలు’ తీసుకురావడానికి ప్రధాన కారణమేమిటి ?
కెక్యూబ్ వర్మ : ముందు జవాబులో చెప్పుకున్నట్లుగానే జరుగుతున్న యదార్ధ యుద్ధ గాధలే నా కవితా వస్తువులు. కనుక వాటిలోని గాఢత పాఠకులకు చేరువ కావాలంటే ఈ ఏడాదిగా వచ్చిన వాటిని ఇలా వారి ముందుకు తీసుకు రావడమే మార్గమని వెంటనే ప్రచురించాలనిపించింది. ఇది సోషల్ మీడియా కాలం కూడా కనుక ఆలస్యంగా వస్తే ఆ సంఘటనలు మరిచిపోయి కవితల వస్తువు చేరువకాదనీ ఆలోచన కూడా కారణం. కవితను ఆస్వాదించాలంటే అందులోని వస్తువు శిల్పము రెండు పాఠకుడి ఆలోచనలకు దగ్గరగా ఉండాలని కోరుకోవడము ఒక కారణం. వారి హృదయ స్పందనలకు ఉత్ప్రేరకంగా వుండాలని ఆశ కూడా.
* రెండు సంపుటాల మధ్య సారూప్యతను మీరెలా నిర్వచిస్తారు ?
కెక్యూబ్ వర్మ : ఈ సారూప్యత రెండు నెలవంకలు, భూమిని మాట్లాడనివ్వు మధ్యనే కాదు- నా మొదటి సంపుటి ‘వెన్నెల దారి’తోనూ పోల్చదగ్గ సారూప్యత అలా కొనసాగూతూనే వుంది. ఎందుకంటే నేను యుద్ధ భూమి నుండి మాట్లాడుతున్నాను. ఇక్కడి నేల కోసం జరుగుతున్న పెనుగులాట నా కవిత్వానికి ప్రేరణ. తెలంగాణ నుండి ఉద్దానం వరకు తిరిగి ఆంధ్ర ఒడిశా సరిహద్దుల నుండి దండాకారణ్యం వరకు అటు కాశ్మీర్ నుండి మణిపూర్ ప్రజల పోరాటం నా వస్తువు కాబట్టి విస్తరిస్తున్న ప్రజా ఉద్యమాలు వారి త్యాగాలు ఆ నెత్తురంటిన మట్టిని దోసలిలోకి తీసుకున్న అనుభవం నన్నిలా నడిపిస్తోంది. కవిత్వం రాస్తున్నానా అని సందేహం వెంటాడుతున్నా రాస్తూనే వున్నా. ఇది ఒక కార్యాచరణగా.
*స్మృతికవిత్వం రాసినప్పుడు మీ మీద గాఢంగా పనిచేసిన ప్రభావం గురించి చెప్పండి.
కెక్యూబ్ వర్మ : ఇది చెప్పడం కాస్త కష్టం. ఎందుకంటే పరిచయమైన వాళ్ళకోసమే కాదు కదా రాసింది. త్యాగాల బాటలో కొనసాగుతున్న వారి నొప్పి తెలిసిన వానిగా వారి పట్ల ఏదో పేగు బంధం ఉన్నట్లుగా నాలో దుఃఖం పొరలు విప్పుతుంది. దగ్గరగా వలపోతను పంచుకునే అవకాశం లేక అది గుండెలో సుళ్ళు తిరిగి వాక్యంగా బయటకు వస్తుంది. వారి పట్ల వున్న గాఢమైన అభిమానం, ప్రేమ కన్నీటి పొరల మధ్య దాగి వాక్యంగా మారుతుంది. సమాజం కోసం ఉద్యోగాలతో వెలగబెట్టేది ఏమీ ఉండదు అది ఆ చిరుగుల బొంతలో ఓ చిరుగుగానే మిగిలిపోతుంది. కానీ సమాజం కోసం కోట్లాది బతుకుల్లో రావాల్సిన నిజమైన మార్పు కోసం ఏ తల్లి కన్నబిడ్డలో అందరి తల్లులలో తమ అమ్మను చూస్తూ నిబ్బరంగా పోరాడుతూ ప్రాణాలు ధారబోస్తున్న వారికి ఓ కన్నీటి చుక్కను ఇవ్వగలిగే అసమర్ధున్ని కదా.
* మీ మీద (మీ కవిత్వం మీద) విప్లవోద్యమం వేసిన గాఢమైన ముద్రని ఒక్కమాటలో చెప్పండి.
కెక్యూబ్ వర్మ : యుద్ధ కాలంలో యుద్ధం గురించి తప్ప మరో మాట రాయలేని అశక్తున్ని.
*
మంచి సమాధానాలు
ధన్యవాదాలు సర్