అది
నీ ఎదుట నిలబడుతుంది!
నీ సిగ్గును చిదిమేసి..
వివస్త్రుడిగా నిన్ను నీకు చూపిస్తుంది!
నీ మానాన్ని అడుక్కంటా తొక్కి..
నిర్లజ్జాంకితుడిగా నిన్ను నీకు పరిచయం చేస్తుంది!
గొడ్డలివేటుతో అహంకారాన్ని నరికేసి..
వెంపలి చెట్టుకు నిచ్చెన వేయగలిగిన
కుబ్జరూపుడిగా నిన్ను,
నీ పాదాలవద్దనే నిలబెడుతుంది!
ఆ దెబ్బకు స్వాభిమానం మ్లానమై,
ఆత్మశోధనాత్మకమైన గ్లాని..
నీ నరాలలో ప్రవాహమై,
నీ కండరాలలో నివాసమై,
నీ దేహగుణాన్ని దిగనాసిల్లజేస్తుంది!
ఆ ధాటికి ఆత్మవిశ్వాసం మాయమై,
అదృశ్యగా మిగిలిన గాయం..
నీ బుద్ధిలో చెదపురుగై,
నీ ఆలోచనలో విషబిందువై,
నీ ఆత్మగుణాన్ని హననం చేసేస్తుంది!
అప్పుడిక నువ్వు,
నిన్ను నీలోంచి మైనస్ చేసుకున్న నువ్వు,
కాష్టంలో ఉద్భవించిన భస్మదేహుడిలాగా ,
లేచి నిల్చుంటావు!
వ్యభిచారాత్మక నవ్వు ఒకటి తొడుక్కుంటావు..
వంచనాత్మక మాటల సంచయాన్ని అవధరిస్తావు..
దోసిలొగ్గుతావు.. జోలె పడతావు!
==
తెలిసిపోయింది లే..
దానిపేరు ‘డబ్బు’ కదా.. అంటావు నువ్వు,
విజయహాసపు చారు వీక్షణలతో!
అవునా.. ‘అవసరం’ అనుకున్నానే..
రుంజుకుంటాను నేను!!
*
బావుంది
థాంక్యూ సర్
కవిత ఆసాంతం వైవిధ్యభరితంగా సాగింది.
నిర్లజ్జాంకితుడు, కుబ్జరూపుడు, భస్మదేహుడు, వ్యభిచారాత్మక నవ్వు… భాషపై ప్రేమ ఉన్న కవి తన పదసంపదను ఇట్లాగే అభివృద్ధి చేసుకుంటాడు.
ముగింపు వాక్యం కవితకు ప్రాణం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కవి మునిసురేష్ పిళ్లెకి అభినందనలు.
– ఎమ్వీ రామిరెడ్డి
థాంక్యూ అన్నయ్యా