తెలుగు వాళ్లు ఆరంభశూరులనే మాట వింటూ ఉంటాం. ఎదుటి వారు ఎదుగుతుంటే ఓర్వలేరని కూడా అదనంగా వినిపిస్తూ ఉంటుంది. ఒకడు ముందుకు పోతుంటే కాలు పట్టుకుని లాగే అలవాటు వల్ల అన్ని రంగాల్లో ఎదుగూ బొదుగూ లేకుండా ఉన్నారని పలు నాల్కలుగా మాటలు వినిపిస్తూ ఉంటాయి. సామూహికంగా వచ్చినపుడు ఆత్మనింద, వ్యక్తిగతంగా వచ్చినపుడు పరనిందా అవశ్యమని గుర్తించినందువల్ల అలా అనిపిస్తుంది తప్పితే అదేమీ సత్యప్రమాణం కాదు. మనవాళ్లు చాలావాటిలో ముందున్నారు. వలస అభివృద్ధికి సంకేతం అని గుర్తించి దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన వాళ్లలో మనం అగ్రస్థానాన ఉన్నామో లేదో తెలీదు కానీ అగ్రజాబితాలో అయితే ఉన్నాం. అమెరికా ఐటిలోనూ వారణాసి వీధుల్లోనూ చార్ధామ్ పర్వతాల్లోనూ మాత్రమేకాదు. గోవా కేసినోలో కూడా ఎక్కువలో ఎక్కువ తెలుగోళ్లే. సహకారం లేకుండానే ఇంత దూకుడు ఉండదు. ఇతర రంగాల్లోనే కాదు, సాహిత్యంలోనూ ఈ మేము సైతం ఉంది. మనకు మూడు సార్లు గ్నాన్ పీఠ్ వస్తే అందులో రెండు సందర్భాల్లో తెలుగువారు –శివ శంకర్, పల్లం రాజు మానవ వనరుల మంత్రులుగా ఉన్నారు. ఆ మూడో సందర్భంలోనూ “మన కంచి- మన బళ్లారి” మనిషి డాక్టర్ వికెఆర్ వి రావు సదరు శాఖకు మంత్రివర్యులుగా ఉన్నారు. వాళ్లు మంత్రులుగా ఉండడం వల్లే అవార్డు వచ్చిందా అనేది నిర్థరించలేకపోవచ్చు. కానీ కాలు లాగే లాజిక్ అయితే వర్తించదు. ఆ మాటకొస్తే గ్నానపీఠానికి ఇతర సర్కారీ అవార్డులతో పోల్చినపుడు కూసింత ప్రొఫెషనల్ ప్రాసెస్ అయితే ఉంది-అమలు సంగతి ఏమో గాని. దేశంలోని నాలుగు ప్రాంతాల నుంచి కమిటీ సిఫారసులు, ఆ తర్వాత సెంట్రల్ కమిటీ సెలక్షన్ లాంటి ప్రాసెస్ బోలెడంత ఉంది. సాహిత్య అకాడమీకి కూడా ఉంది కానీ అక్కడ రచయిత స్వయంగా అప్లికేషన్ పెట్టుకోవడం లాంటిది ఏదో ఉంది. అది గ్నానపీఠానికి ఉన్నట్టు లేదు.
చాలామంది అవార్డు గ్రహీతలు తాము పొందిన అవార్డు పవిత్రమ్మన్నీ అలౌకికమ్మనీ ఎదుటి వ్యక్తులు పొందిన అవార్డు తుచ్ఛమైనదీ, ఇహపరమైన భవబంధాలతో ముడిపడినదనీన్నూ చెపుతూ ఉంటారు. ఏదైనా అవార్డు ఆశించి భంగపడిన ఎవర్ని ఏ కారణంతో కలిసినా ఆ సందర్భంలో అవార్డు పొందిన మనిషి ఏఏ క్షుద్రమైన పనులుచేసి తెచ్చుకున్నారో ప్రత్యక్ష పురాణంగా వివరిస్తూ ఉంటారు. మామూలుగా అభిప్రాయప్రకటనలకు ఆధారాలు వెతుక్కోవడం అనే అలవాటు అస్సలే లేని రచయితలు కూడా ఈ సందర్భంలో మాత్రం ప్రత్యర్థి(వచ్చినోళ్లు ఆటోమేటిగ్గా ప్రత్యర్థి అయిపోతారు. అది సీజనల్) ఎలా అవార్డు తెచ్చుకున్నారో వివరించడానికి ఆధారాలను చూపిస్తూ ఉంటారు. ఎక్కువగా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఉంటుంది. చాలాసూటిగా నినాదప్రాయంగా రాసే రచయిత కూడా ఇక్కడకొచ్చేసరికి ఇన్ఫరెన్సులు లాగుతాఉంటారు. ప్రధానంగా సర్కారీ అవార్డులతోనే ఈ గొడవ ఎక్కువ ఉంటది. తెలుగు రచయితల్లో ఉన్నంతమంది రాజ్యవ్యతిరేకులు మరే భాషలోనూ లేరేమో అన్నట్టు ఉంటదా, మళ్లీ సర్కారీ అవార్డు దగ్గరకొచ్చేసరికి కూడా తొడతొక్కిడి మన దగ్గరే ఎక్కువేమో అన్నట్టుంటది. తానా ఆటా లాంటి వాళ్లు అపుడపుడూ చేసే సర్ప్రైజ్ లను మినహాయిస్తే రచయితలకు కూసింత నదురైన నగదు, ప్రయోజనాలు ఇవ్వగలిగేది సర్కారీ అవార్డులు మాత్రమే. సాహిత్యపరమైన విషయాల్లో జీవితాంతం ఒక రకమైన ప్రొటోకాల్ ఉంటుంది. జీవితాంతమూ ఆ అవార్డును సఫిక్స్ గానో ప్రిఫిక్స్ గానో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. రైళ్లు, రాయితీలు వగైరా ఉండనే ఉంటాయి. రచన వేరే భాషల్లోకి వెడుతుంది. బుల్లెబ్బాయ్ మరియు బుల్లెమ్మ పేర్లమీద వారి సుపుత్రుడు మరియు గ్రానైట్ వ్యాపారి అబ్బాయిబాబు పెట్టిన అవార్డులకు ఇవ్వన్నీ ఉండవు. ఆతండు మహా అయితే అవార్డు ఇచ్చిన రోజు ఆరేళ్ల టీచర్స్ మూత తీస్తాడు. పైగా ఇక్కడ ఇలాంటి సరుకు దొరకదు సార్, సిటీ నుంచి తెప్పిచ్చినా అని అంతోటి నస కూడా దాని నిషాతో కలిపేస్తాడు.
మనం మనం బరంపురం
ఎవరేం చెప్పినా అవసరార్థమో సందర్భానుసారమో ఎన్ని రకాల భాష్యాలిచ్చినా అవార్డుల్లో సరుకైనవి సర్కారీ అవార్డులే. సర్కారీ పోస్టుల వలెనే. ఏవగించుకునేవాళ్లలో రహస్య ఆరాధకులెక్కువ. ఫలానా సర్కారీ సభల సందర్భంగా ఫలానా మనిషి టార్గెట్ అవుతాడనుకుందాం. ఆ సభలు అయిపోయి నెలలు గడవకముందే కనీసం తొమ్మిది నెలలు నిండకముందే ఆతండు ఆ ఏవగింపు వారి వేదికల మీద ప్రత్యక్షమవుతూ ఉంటాడు. సర్కారీ పోస్టులమీద అంత ఏవగింపు ఉంటే అతనెలా మీ వేదికల మీద అంత త్వరగా కనిపిస్తారనే ప్రశ్న అందరికీ వస్తుంది కానీ ఎవ్వరూ వేయరు. అంతా కుటుంబ వ్యవహారం. అంత త్వరగా రాసుకుపూసుకు తిరగాలనే తహతహ ఉన్నపుడు అంత ఏవగింపు ప్రదర్శంచడమెందుకు, అంతంత పెద్ద పెద్ద మాటలు అనడమెందుకు?
పార్లమెంటరీ రాజకీయ నాయకులు అవకాశ వాదులని నోరు పొడుగైనంతమేరా అంటూ ఉంటాం. కానీ దానికి భిన్నమనిచెప్పుకునే స్రవంతుల్లో కూడా అంత భిన్నమేమీ లేదు. దీనికి కారణం మళ్లీ వ్యక్తుల్లో మాత్రమే చూసి సంస్థలను ఉన్నతంగా ఉంచాలనే పిచ్చి ప్రయత్నం చేస్తాం కానీ అది తప్పు. అది సంస్థాగతమైన లోపమే. ఆ వ్యక్తులకేమైనా తిక్కా, తమకు అత్యంత ఇష్టమైన మనిషి, రేపో మాపో మళ్లీ అలాయ్ బలాయ్గా వేదికలు పంచుకోవాల్సిన మనిషిని పట్టుకుని తిట్టడానికి! ఆ సందర్భంలో అలా తిట్టినట్టు ఉండాలి. తర్వాత మన అవసరాల రీత్యా మన వేదికలకు ఆహ్వానించినట్టూ ఉండాలి. ఈ అలిఖిత రహస్య ఒప్పందం తిట్టించుకునే మనిషికి తెలుసు కాబట్టే ఆయన తిట్ల సందర్బంగా ఎదురుతిరగడు. ఎంతైనా మనోళ్లు మనోళ్లు బాపతు వ్యవహారం రెండువైపులా సాగుతుంటది. వాళ్లే పోస్టులో ఉన్నా అదొక అన్యోన్యదాంపత్యమే. నేరుగా ముఖ్యమంత్రి కాకపోతే చాలు, ఇంకే పోస్టయినా సందర్భాన్ని బట్టి లవ్ హేట్ రిలేషన్ షిప్ పెట్టుకోవచ్చు. ఉద్యమం వల్ల వచ్చే ప్రభుత్వాలు ఉద్యమశ్రేణుల్లో కొన్నింటికి ప్రభుత్వ యంత్రాంగంలో పట్టం కట్టాయనుకోండి. అపుడు బయటికొచ్చే లాజిక్ తెలిసిందే. ‘‘నువ్వు భావజాలాన్ని తాకట్టు పెట్టి కక్కుర్తి పడి సర్కారీ ఎంగిలిమెతుకులకు ఆశపడ్డావు’’ లాంటి భాష ఇటువైపు, ‘‘లోపల ఉంటే ఎంతో కొంత మేలు చేయొచ్చు’’ అని అటువైపు వాదనలొస్తాయి. ఇది టెంప్లెట్. ఎవరు ఆ గుంపులో చేరినా అదే టెంప్లెట్. ఆ చేరిన వారు అంతకుముందు ఎపుడైనా అలా మాట్లాడి ఉన్నారా ఆవిషయం తమకు పదవి వచ్చినపుడు మాత్రమే గుర్తుకు వచ్చిందా అనేది పక్కన బెడదాం. చాలా సార్లు మనం ఉన్న స్థితిని బట్టి పదజాలం భావజాలం మారుతూ ఉంటాయి. పోనియ్యండి. ఇటువైపు ఏమైనా ప్రిన్సిపుల్డ్ స్టాండ్ ఏడ్చిందా, ఏదైనా సందర్భం వచ్చినపుడు చీల్చి చెండాడి నాలుగు రోజులు పోయాక ఓపలేని విరహంతో కౌగిలించుకుని వేదికల మీద కనిపిస్తే చూసేవారికి ఏమనిపిస్తుంది. మనం మనం బరంపురం అని సామెత టైపు. ఇందులో ఐడియాలజీ లేదు, పచ్చికట్టె లేదు. వాళ్లకు పదవి కావాలి(పదవులు వేరు, పొట్టకూటికోసం చేసే ఉద్యోగాలు వేరు_తేడా క్లిష్టమైనప్పటికీ). కానీ ఇంతకాలం పాటు కొనసాగిన భావజాలపు ప్రయాణంలో వచ్చిన కీర్తి పోగొట్టుకోకూడదు. అవ్వ-బువ్వ అను రెండు గుర్రాల సవారీ. బోయినమా, విశ్వాసమా అనేది సన్నజీవుల మీమాంస. ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాల్సి రావడం వాళ్లకున్న ఒకే ఒక ఆప్షన్. పెద్దోళ్లకు అట్లా కాదన్నమాట. వాళ్లది చెర్రీ పికింగ్. ఆడా వుంటా ఈడా ఉంటా తరహాలో వాళ్లు అన్నింటిలోనూ సర్వాంతర్యామివలే ఉండగలరు. అది వారి ప్రివిలేజ్. అందుకోసం ఏం చేస్తారు? భావజాలపు బాపతు వారు తిట్టినపుడు వాళ్లేమీ రెచ్చిపోయి మాట్లాడరు. సైలెన్స్ ప్లీజ్ అన్నట్టు ఏలేసుకుంటారు, తర్వాత ఏలుకోవచ్చులే అనే ధీమా! అసలు ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పటికీ గంభీరమైన పరిభాషలో చెప్పుకోవాలంటే రాజ్యపు బంట్లుగా ఉన్నప్పటికీ సాధారణంగా ఈ భావజాలపు వాళ్లతో ఘర్షణ పడే సందర్భాలను తప్పించుకుంటూ ఉంటారు. అదైపోయాక మళ్లీ ఇటు రావాలి కదా! ఇటు వీళ్లకూ తెలుసు! మనం ఉన్నదే గుప్పెడు మందిమి, మనోడు ఎక్కడో చోట పవర్ఫుల్ పొజిషన్లో ఉండడం మనకూ ఎప్పుడో సారి ఉపయోగపడుతుంది కదా, అందుకని నేను తిట్టినట్టు చేస్తా నువ్వు పడినట్టు చేయి అని సంసారానికి ఆషాఢపు సెలవు పెట్టి తర్వాత ఎంచక్కా హనీమూన్ కొనసాగిస్తూ ఉంటారు. ఈ అన్యోన్యత వారితో పాటు బయటివారికి కూడా తెలుసుకాబట్టి వారు కూడా ఏమీ ఆశ్చర్యపోరు. ఇంత అసహ్యకరమైన అన్ ప్రిన్సిపుల్డ్ వైఖరి సహజం అనిపించేంతగా మన రక్తంలో ఇంకిపోవడంలోనే ఇబ్బంది అంతా ఉంది.
సాధారణంగా రాజకీయ వ్యవహారాల్లో వీలైనంత కచ్చితంగానూ వ్యక్తిగత వ్యవహారాల్లో వీలైనంత మృదువుగానూ(మృదువు అంటే రాజీ అని అర్థం కాదని మనవి) ఉంటే మానవసంబంధాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. రాజకీయాలు పురోగమిస్తాయి. ఆఅభిప్రాయాలను విభేదించేవారితో కలవకూడదని స్నేహం చేయకూడదని(మరీ మౌలికంగానే దుర్మార్గమైన అబిప్రాయాల సంగతి కాదు)లేదు కదా! కానీ మనది రివర్స్ గేర్. కొంతమందికి అన్ని శాస్ర్తాలు తల్లకిందులుగానే కనిపిస్తాయి. రాజకీయ విభేదాలను వ్యక్తిగత వ్యవహారాల్లోనూ వ్యక్తిగత విభేదాలను రాజకీయాల్లోనూ తేల్చుకుందామని ప్రయత్నిస్తాం. అది కూడా మోర్ మోరలిస్టిక్ దేన్ పొలిటికల్. ఇట్స్ ఓకె టు హావ్ డిఫరెంట్ పొలిటికల్ ఒపీనియన్ యాజ్ లాంగ్ యాజ్ ఇటీజ్ రియల్లీ యాన్ ఒపీనియన్ అని అనుకోం. ఎవ్వరైనా మన మాట వినలేదనుకో, వారిని నేరుగా పొలిటికల్గా ఎదుర్కోము. ఆయన అదో టైపులేండి, ఆవిడ(కొంచెం మాట తడబడే వేళల అది) కొంచెం ఆ టైపులేండి అని మాత్రమే మాట్లాడుతూ ఓరల్ శాటిశ్ఫాక్షన్ పొందుతూ ఉంటాం. ఫేక్ ఓరల్.
ఇక్కడకూడా ఇపుడిపుడే కీర్తి చక్రాల్లోకి ప్రవేశిస్తున్నవారికి ఆల్రెడీ అక్కడ తిష్టవేసుకుని కూర్చున్న పెద్దోళ్లకి తేడా ఉంటది. దేన్నైనా సుదీర్ఘకాలంగా అనుభవిస్తున్న వాడికి అందులోని నట్లు బోల్టులూ క్షుణ్ణంగా తెలిసిఉంటాయి. సౌండ్ రాకుండా ఆపరేట్ చేయగలరు. హడావుడి కనిపించకుండా చేయగలరు. నింపాదిగా చేయగలరు. లేకి అనిపించకుండా చేయగలరు. వారికి అది ప్రివిలేజ్. కానీ ఇపుడిపుడే కీర్తి అంచుల్లోకి చేరుకున్న వారి పరిస్థితి అలా ఉండదు. కూసింత ఆబ లక్షణం బయటపడుతూ ఉంటుంది. దాచుకోలేరు. వెంటనే బయటపడిపోద్ది. కొందరుంటారు, పుట్టిందే అన్ని రకాల సంపదలను ఆధిపత్యాలను కీర్తి చక్రాలను ధిక్కరించడానికి అన్నట్టు అన్నింటిమీదా చేయి కాలూ శిశ్నం కూడా చేసుకుంటూ ఉంటారు. ఊరికే అనట్లే. వాళ్లసలు అన్నింటిమీదా ఉచ్చలు పోసి మండిస్తా ఉంటారు. వాళ్లకు కానీ వారి కుటుంబ బంధుమిత్ర సపరివారంలో కానీ ఎవ్వరికైనా కూసింత కీర్తి పొడతగిలిందా, నా సామిరంగా! ఇహ చూళ్లేం, పట్టలేం, యాడచూసినా అదే మాట, అదే పుటవా! ఎవ్వరూ ఏమీ అనరు. అంటే ఏ ముద్ర పడతదో అని భయం. ఎందుకొచ్చిన గొడవలే సామీ అని రౌడీకి దారిచ్చి తొలిగిపోయినట్టు చేస్తుంటారు. తొలిదశలో సమూహం కోసం వ్యక్తిని అంకితం చేసుకున్న ఐడెంటిటీ పాలిటిక్స్ నాలుగు రోజులు గడిచేసరికి సమూహపు బాధను/అణచివేతను/వివక్షను తన వ్యక్తిగత సుఖానికి/కీర్తికి/పదవులకు పణంగా వాడుకునే దశకు చేరాయి(అందరూ అలా ఉన్నారని కాదుగానీ అది ఇప్పటి ప్రధాన ధోరణి). నీకు ఏదైనా మీటింగ్ కి ఆహ్వానం రాలేదనుకో. నాకు రాలేదు అనవు. మా సమూహానికి రాలేదు. మేమంటే చిన్నచూపు అనంటావు. నీకు అవార్డు రాలేదనుకో. మా కులపోళ్లకు అన్యాయం జరిగింది అంటావు. తరాలుగా నీ సమూహము అనుభవించిన వ్యధకు సంబంధించిన నీ వ్యక్తీకరణ నీకు గుర్తింపు రావడం రాకపోవడం అనేదానిమీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇందులో ఫెయిర్ జెండర్ కూడా అంత ఫెయిరేమీ కాదు. బయట ఆడవాళ్లమీద ఎంత వెకిలిమాటలుంటాయో ఈ ప్రపంచంలోనూ అంతే. ఆ అవార్డు ఎందుకొస్తుందో జ్యూరీలో ఎవరున్నారో నీకు తెలీదా నాకుతెలీదా అని ఒక నవ్వు, ఆ అవార్డు తీసుకున్న ఫొటో/ఇంటర్వ్యూ ఫలానా పేపర్లోనే ఎందుకొస్తదో తెలీదా ఏంది అని ఇంకో నవ్వు, పలానా పుస్తకంలో కథ ఎందుకొస్తదో తెలీదా అని మరో నవ్వు ఇలా బిట్వీన్ ది ….ఎటకారాలుంటాయన్నట్టు. మామూలు ప్రపంచం మంచికి గానీ చెడుకుగానీ మగవాళ్లకు ఆడవాళ్లకు ఎలాంటి వేర్వేరు స్టీరియోటైప్ లక్షణాలు ఆపాదిస్తాయో ఇక్కడా అలాంటివే. ఎవ్వరూ ఏమీ తీసిపోరు. ఏ సమూహమూ తక్కువది కాదు. సహ రచయితల పట్ల వాళ్లుపైకి చూపించే ప్రేమ వెనుక చూపించే ద్వేషం చూస్తే గుండె ఆగిపోద్దన్నట్టు! కీర్తి యావ మిగిలిన అన్ని యావల్నీ మించిపోయి కుష్టుకంటే జిబజిబలాడుతూ అసహ్యంగా తయారైంది. పైగా సోషల్ మీడియా దెబ్బతో ఇది ఇన్ స్టంట్ లక్షణం సంతరించుకుంది. యమార్జెంట్గా అది దగ్గరికి రాకపోతే ఏమైనా చేయగలం అన్నట్టు!!
అవార్డులు నాలుగు విధములు
సరే, మళ్లీ అవార్డుల దగ్గరకే వద్దాం. అవార్డులను స్థూలంగా నాలుగు విధాలుగా విభజించుకోవచ్చు. మొదటిది- ప్రభుత్వ అవార్డులు. రెండు- ఏదో ఒక భావజాలమో లేక నిర్దుష్ట సాహిత్య రూపమో ప్రాతిపదికగా ఉండేవి. మూడోది వ్యక్తులు, జిల్లాలు, నదులు, రకరకాల పేర్లతో అందించే అవార్డులు. ఈ మూడూ కాక ఎన్ఆర్ఐలు ముఖ్యంగా అమెరికన్ ఎన్ఆర్ఐలు ఏదో ఒక పేరుతో అందించే అవార్డులు ఉంటాయి. ఇందులో మొదటివాటికి నాలుగో వాటికి ఉన్నంత గ్లామర్, పోటీ మిగిలిన వాటికి ఉండదు. వేదికమీద ఎన్నెన్ని మాటలు చెప్పుకున్నా సారాంశంలో ఆర్థికాంశ పనిచేస్తూ ఉంటుంది. ప్రభుత్వ అవార్డుతో నేరుగా ఎంత డబ్బు ఇస్తారు అనేదానికంటే తర్వాత వాళ్లు కొనసాగించే ప్రయోజనాలు ముఖ్యమైనవి. రైళ్లలో రాయితీల దగ్గర్నుంచి అనేక రాష్ర్టాల్లో జరిగే సాహితీసమావేశాల్లో ఆహ్వానాల వరకు బోలెడన్ని ఉంటాయి. అవి కాకుండా ఎవరూ కాదనలేని ప్రయోజనం ఇతర భాషల్లోకి అనువాదం కావడం. అసలు ఒకసారి అంటూ ఆ లిస్ట్ లో చేరిపోయాక తెలీకుండానే ఆ ప్రివిలేజ్ ఏదో రూపంలో అపుడపుడూ పనిచేస్తూ ఉంటది. రూపాయికి డాలర్కు మారకం విలువలో ఉన్న తేడా వల్ల అమెరికన్ ఎన్ ఆర్ ఐలు ఇచ్చే అవార్డులకు కంటికి నదురైన మొత్తమే ఉంటది. అంత గ్లామర్ లేకపోయినా మిగిలిన అవార్డుల్లో భావజాలం వల్ల, అవి ముడిపడిన వ్యక్తుల వల్ల కొన్నింటికి ఎక్కువ గౌరవమూ, ప్రచారమూ ఉంటాయి.
గ్నానపీఠాన్నుంచి అచ్చిగారి బుచ్చయ్య అవార్డు అవార్డు వరకూ సాధారణంగా ఎక్కువ శాతం అవార్డులకు ఏదో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపిక కమిటీలు కూడా ఉంటాయి. ఎంతో కొంత సబ్జెక్టివిటీ లేని మనిషి ఉండడు, కాబట్టి నిర్ణేతల సబ్జెక్టివిటీ కూడా అంత ఇష్యూ కాదు. కానీ ఎందుకు మనకు గౌరవం ఉండడం లేదు. (అసలు మనల్ని ఒకడు గుర్తించేదేంటెహె అనుకునే వారి గురించి నేను మాట్లాడడం లేదు, వాళ్లు అరుదు. అది నిజమైన వైఖరే అయితే వాళ్లు నోబెల్ వచ్చినా అలాగే ఉండగలరు. వాళ్లు అరుదాతి అరుదు.) అంటే పతంజలి గారిని గుర్తుచేసుకోవాలి. ‘‘మన జ్ఞానానికి సార్థకత లేదు. మన విశ్వాసాల మీద మనకు విశ్వాసం లేదు. మన విలువల మీద మనకు గౌరవం లేదు. మన దేవుడి మీద మనకు భక్తి లేదు. మన నాస్తికత్వం మీద మనకు నమ్మకం లేదు. మన తోటివాళ్ళ మీద మనకు మమకారం లేదు. మన ప్రజాస్వామ్యం మీద మనకు అవగాహనగానీ గురిగానీ లేదు. మన జ్ఞానానికీ, విశ్వాసానికీ పొంతన లేదు. విశ్వాసానికీ ఆచరణకీ పొందిక లేదు. భూమి బల్లపరుపుగా ఉన్నపుడు మాత్రమే ఇలాంటి జీవితం కళ్ళబడుతుంది.’’
తమకు రాని ప్రతి అవార్డు వెనుక ఏదో కులమో మతమో ప్రాంతమో పరిచయమో ఇంకేదో పనిచేస్తుందని, సాహిత్యకారులు చాలామంది నమ్ముతూ ఉంటారు.ఇంకా మురికైన కారణాలు కూడా ఉంటాయిని నమ్ముతారు. అలా అని దూరంగా ఉండలేరు. ఎన్నికల ఆటలో రాజకీయ నాయకుల్లాగే ఎక్కువమంది ఈ అవార్డుల రివార్డుల ఆటలో భాగమవుతూ ఉంటారు. అది వచ్చిన చిక్కు. మనలాంటి ప్రతిభావంతుడికి ఇవ్వని నిర్ణేతకు ఏం ప్రతిభ ఉన్నట్టు-ఇంకేదో లొల్లాయివ్యవహారం కాకపోతే!
ఏది విలువైనది?
ఇపుడు మళ్లీ మొదటికొద్దాం. బరువైన వాటిమీదే దృష్టి ఎక్కువగా ఉంటుంది. సర్కారీ అవార్డులు రివార్డులు, అమెరికన్ సంస్థలు ముఖ్యంగా తానా ఇచ్చే పురస్కారాలు. ఏదైనా తీసుకోవడం వల్ల అతని భావజాలం మారిపోయి అందులో భాగం అయిపోతారు అనేదానికి కానీ తీసుకోకపోవడం వల్ల దానికి దూరంగా ఉంటారనుకోవడానికి గానీ స్పష్టమైన ప్రమాణాలుకనిపించడం లేదు-ఇపుడు మనమున్న వాతావరణంలో. రెండువైపులా ఉదాహరణలు చూపించొచ్చు. నిజంగానే అస్సలు ప్రభావం ఉండదని కాదు. అది ఉండగలిగే స్థాయివేరు. మన నాయకులు వేదికల మీదమాట్లాడుతుంటారే అంత విశాల ప్రజారాశులను చేరే రచయితలున్నపుడు కథ వేరు. రెండువేల కాపీలు అమ్ముడుపోతేనే వంకర్లు తిరిగిపోతూ మాట్లాడే రచయితలు ఏది రాస్తే ఏంది, ఏది రాయకపోతే ఏంది? కాబట్టి అవార్డు రివార్డు తీసుకోవడం తీసుకోకపోవడం అనేది ప్రస్తుత దశలో వ్యక్తి చేతనకు ఇచ్ఛకు సంబంధించిన వ్యవహారం. రాజ్యమూ బంట్లూ లాంటి పెద్ద పెద్దమాటలు ఉపయోగించే స్థితిలో మన సాహిత్యమూ లేదు. సాహిత్య కారులూ లేరు. అవార్డుల రివార్డుల వ్యతిరేకతను ఏదో ఒక ప్రత్యేక సందర్బంలో సింబాలిజమ్ లాగా వాడే పరిస్థితి వేరు. థూథూ ఛాఛా వ్యవ హారం అనవసరం. పైగా అదేదో శాసనమన్నట్టు అవార్డుల వ్యతిరేకతను శీలపరీక్ష స్థాయికి తెచ్చి ఆచరణ సాధ్యం కాని బండ ప్రమాణాలు పెట్టడమంటే హిప్పోక్రసీ పెరగడంలో మన వంతు పాత్ర పోషించడమే అవుతుంది.
రచనలోనూ జీవితంలోనూ ఎక్కడ నిలబడాలి అనేది రచయిత నమ్మే విలువల పైన ఆధారపడి ఉంటది. చెప్పే విలువలు కాదు. నమ్మే విలువలు. రెంటికీ తేడా ఉంది. సింపుల్గా అది వ్యక్తి చేతన. ఒక రచయితమీద ఒత్తిడి తెచ్చి ఫలానా వేదికమీదకు పోకుండా ఆపడంలో గొప్ప విలువేమీ లేదు. అదేదో లెజెండ్ లాగా చెప్పుకునే వాతావరణం అశ్లీలమైనది . తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం ముఖ్యంగానీ టెక్నికల్గా చేతులతో తీసుకున్నారా లేదా అనేది సరుకైన విషయంబు కాదు. చేతనకు సంబంధించిన విషయాలను తంతుల స్థాయికి మార్చకూడదు.
రచయిత పుట్టుక మీద ఆధారపడిన ప్రివిలేజెస్ కు వ్యతిరేకంగా నిలబడ్డారా లేదా అనేది ముఖ్యం. రచయిత శ్రమ వైపు నిలబడ్డారా లేక దోపిడీ వైపు నిలబడ్డారా అనేది ముఖ్యం. కులం వైపు నిలబడ్డారా కుల నిర్మూలన వైపు నిలబడ్డారా అనేది ముఖ్యం. అంతిమంగా సమాజంలో సమానత్వాన్ని సున్నితత్వాన్ని పోనీ కనీస మానవీయమైన బంధాలను బలపరిచేవిగా అక్షరాలు ఉన్నాయా వంకరటింకర విన్యాసాలు వేస్తున్నాయా అనేది ముఖ్యం. ఇవేవీ అవార్డులతో వాటికవి ప్రభావితం అవుతాయి అని అనుకోనక్కర్లేదు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారనేది గానీ ఎందుకు ఆశపడి ప్రయత్నిస్తున్నారనేది గానీ తెలీకుండానే చేసే రచయితలున్నట్టే ఎందుకిస్తున్నారో తెలీకుండా ఇచ్చే సంస్థలు కూడా ఉంటాయి. ఊర్కే ప్రతి యేటా అదొక ఆనవాయితీగా తంతుగా సాగేవి కొన్ని ఉంటాయి. బయట అలవాటైన వత్తిడి వల్లే వ్యతిరేకత ప్రదర్శించడం, బయట ఫొటోలు-ప్రచారం వల్ల అవేవో అత్యంత విలువైనవి అనుకుని అదే పనిగా ఆరాటపడడం రెండు ధోరణులూ కనిపిస్తాయి.
మామూలుగా అయితే ప్రభావితం కావాల్సిన విషయాలే కానీ మనకున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల వాతావరణంలో తేడా వచ్చింది. దేన్నైనా ఆనవాయితీగా తంతుగా మార్చుకునే వాతావరణం మన సొంతం. దేన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నామో దేన్ని ఎందుకు భుజాన వేసుకుంటున్నామో సొంతంగా తెలుసుకుని చేసే వాళ్లు తక్కువ. మన అక్షరాలకు శక్తి తక్కువ. చదివేవాళ్లు తక్కువ. మినహాయింపులను పక్కనపెడదాం. మనం ఎవర్ని వ్యతిరేకిస్తున్నామో వాళ్లకి గానీ ఎవరి కోసం రాస్తున్నామని అనుకుంటున్నామో వాళ్లకి గానీ పట్టింపు ఉండాల్సిన అవసరమే లేదు. అందుకోసమే పైవాళ్లు కూడా అక్షరాలను పట్టించుకోవడం మానేశారు. మెజారిటీ దృష్టిలో పాపం వాళ్లేదో టైపు! కనెక్షన్ పోయింది. పోయినా పవర్ ఉన్నట్టుగానే ఏవో బటన్స్ నొక్కుతున్నట్టుగానే ఇంకేవో ఆపరేట్ అవుతున్నట్టుగానే నటిస్తూ ఉండడమొక్కటే మిగిలింది. అందుకే సాహిత్యంలో ట్రెండ్ పెద్ద గుంపునుంచి ఐడెంటిటీ అనే చిన్న గుంపుల మీదుగా ఇపుడు నేనే కేంద్రకం వైపు వేగంగా పరుగులెత్తుతోంది. అది ఎక్కడిదాకా పోయిందంటే వ్యక్తి కేంద్రకం బాపతు వాళ్లు గుంపు కేంద్రకం వాళ్లమీద సెటైర్లు వేస్తుంటే గుంపుకేంద్రకంలోనే కొందరు చప్పట్లు కొట్టి భలే అనేదాకా పోయింది. అయ్యారే!
ఇంతకీ చెప్పొచ్చే దేమిటంటే సూత్రరీత్యా ప్రభుత్వ అవార్డులు తీసుకునే వారి అక్షర తూణీరాలు ఆ తర్వాత వంగిపోతాయి అనే మాట ఇన్ ప్రిన్సిపుల్ కరెస్టే కావచ్చుగానీ మనకున్న ప్రత్యేక వాతావరణం వల్ల మనకింకా ఆపరిస్థితి లేదు. అవార్డుల వల్ల అక్షరాల రంగూరూపూ మారిపోయే సన్నివేశాలు అంత స్పష్టంగా లేవు. పైగా అలాంటి రచయితల పట్ల సాహితీ ప్రపంచంలో ఏమాత్రం వ్యతిరేకత కూడా లేదు. దానర్థం సాహితీ ప్రపచం దాదాపు యావత్తూ(కొద్ది మినహాయింపులతో) ఆమోదిస్తున్నదనే అర్థం. అక్షరాల్లో రాయడం సంగతికాదు నేను మాట్లాడుతున్నది. ఏ అవార్డు గురించైనా థూ ఛా అనడం మనకు సంక్ర మించిన అనేక వారసత్వపు ఆనవాయితీల్లో ఒకటి. ఈ థూ ఛాల్లో ఎంతమంది తమకు రాలేదని వ్యతిరేకిస్తున్నారు, ఎంతమంది ఇహ రాదని వ్యతిరేకిస్తున్నారు, ఎంతమంది ప్రిన్సిపుల్డ్గా వ్యతిరేకిస్తున్నారనేది కదా ప్రధానం! మరి వారు ఆమోదిస్తున్నారు అని మాత్రం ఎలా చెప్పగలరు, నీ దగ్గరున్న సాక్షాధారములేమి అనే ప్రశ్నన్యాయంగా రావాలి. సాక్షమేమిటంటే ఈ థూఛాల వాళ్లు సదరు అవార్డు గ్రహీతలు తారసనపడినప్పుడు చూపించే గౌరవ మర్యాదలు చూస్తే ‘‘అబ్బే అది ఇంకెవరి కోసమో అన్నమాటే కానీ నేనైతే ఇదే, నువ్వు లేక నేను లేనని నీకు తెల్సుకదే’’ అని చూపించుకోవాలనే ఆరాటం ఎంతగానే కనిపిస్తుంది. అది అధికారం మీద మమకారం లాంటిదే. అధికారాన్ని చీల్చిచెండాడేవాడికి అధికారం ఇచ్చి చూడాలి-నాసామి రంగా! పది మంది కూడిన సంఘంలోనే ఎన్నెన్ని పవర్ పాలిటిక్సో! ఇది మోరల్ చర్చ కాదు. వాస్తవానికి రాజకీయాల్లో మోరలిస్టిక్ చర్చ వల్ల పెద్దగా ప్రయోజనముండదు. కానీ మనకున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల రాజకీయాలు మోరలిస్టిక్ అంశ లేకుండా చర్చించుకునే వాతావరణం లేదు.
ఈ మాయను తొలగించుకోలేమా?
ఇన్ని మాటలేల, అవార్డుల పట్ల మన వ్యతిరేకత బూటకం. పదవుల పట్ల అంతకంటే బూటకం. నిజంగా వ్యతిరేకించేవారి సంఖ్య అతి స్వల్పం. లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేనంత అనే అర్థం వచ్చే పదం ఏవో గణితంలో ఉంది. అంత స్వల్పం అన్నమాట. ఎక్కువమంది వ్యతిరేకత తమకు రాలేదనో, ఇక రాదనో. కానీ అనువంశికంగా వచ్చిన రాజకీయ వాసన వల్ల ఈ విషయంలో కుళ్లిపోయిన సైలెన్స్ రాజ్యమేలుతుంటుంది. రాజకీయాలు ఇంకాస్త పారదర్శకంగా సూటిగా ఉండడం అవసరం, అందుకోసమైనా ఈ బూటకత్వాన్ని తగ్గించుకుని నేనిదిరా బయ్ అని ఓపెన్గా గట్టిగా చెప్పుకునే అవకాశం రచయితలకు ఉండాలి. పదవి వచ్చినపుడు దొంగలాగా వెళ్లిసీట్లో కూర్చోకుండా దర్జాగా వెళ్లి కూర్చునేట్టు ఉండాలి. కొంతకాలం ఏవో రాజకీయాలు మాట్లాడినందుకో రాసినందుకో వారికెందుకా శిక్ష. రాజకీయాలు శిక్ష కాకూడదు కదా. అలాగే దొంగల్లాగా వెళ్లి కలిసి శుభాకాంక్షలు చెప్పి అన్నా మంచిపనిచేసినవ్ అని అనే దుస్థితి నుంచి చాలామంది రచయితలను కాపాడిన వాళ్లమవుతాము. పాపం మనోడు ఒక మంచి పదవిలో కూసుంటే బరాబర్ పోయి అలాయ్ బలాయ్ అనుకునే పరిస్థితిలేకపోతే ఎట్లా.
ముందు వాటి చుట్టూ పరుచుకున్న మాయని తొలగిస్తే తప్ప దాని చుట్టూ రోజురోజుకు పేరుకు పోతున్న రోతని తొలగించలేము. లోలోపల కోరిక ఉండి సామాజిక ఒత్తిడి వల్ల పైకి అబ్బేబ్బే అట్టే వద్దండీ అనే ఏ వ్యవహారమైనా రోతగా మారుతుందని మన అనుభవాలు చెపుతున్నాయి-సెక్స్ లాగే ఇదీన్నూ. ఆ కోరిక మీద ఆంక్షల వల్ల లెజ్టిమసీ లేకపోవడం వల్ల ఓ వైపు చొంగలు కారుస్తూ చొక్క గుడ్డతోనో జాకెట్ ముక్కతోనో తుడుచుకుంటూ నోటితో అబ్బే అదంతా రాజ్జెమండీ, అదంతా అధికారపు చెడ్డీలో దూరిపోడమండీ అనే వ్యవహారముంది చూశారూ అది అన్నింటికన్నా రోతాతిరోతైన వ్యవహారం. అలాంటి వాతావరణం తెలుగుసాహిత్య రంగాన ఏర్పడి ఉన్నకారణాన అవార్డుల చుట్టూ కూడా అంతే రోత పేరుకుపోయి కనిపిస్తున్నది. మాయ మంచిది కాదు. తొలగించుకుందాం.
*
అవును రామ్మోహన్, ఆ కాసింత మాయతెర తొలగిపోతే బావుణ్ణు.
అవార్డ్ వాపసీల గూర్చి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పుచ్చుకున్నప్పుడు రాని గుర్తింపు అవార్డ్ డబ్బుని అట్లాగే ఉంచుకుని ఫలకాన్ని, సర్టిఫికేట్ నీ మాత్రం తిరిగిచ్చినప్పుడు వచ్చింది. ఏ కీర్తయినా గానీ చిచ్చుబుడ్లలాగే క్షణికాలు అని నిరూపింపబడ్డాయి.
వెటకారం ఎక్కువగా స్పష్టమైన ప్రతిపాదన తక్కువగా ఉంది. బూతులు లేకుండా కూడా విమర్శ చేయవచ్చు.
మరల పతంజలిని తలపించిన రాత, కాదు మన చుట్టూ లేదా మనం ఉన్న సమాజ రీతి.
పాపం రచయితలు అమాయకులండి.రాజ్యం మాయచేస్తోంది.గమనించలేకపోతున్నారు.జాలి తలుద్దాం.
క్షమించాలి ఇలా రాస్తున్నందుకు.
ఈ వ్యాసం అనేక విషయాలను ప్రస్తావించినప్పటికీ, బొత్తిగా స్ట్రక్చర్ లేకుండా ఉంది. ఉదాహరణకి, ఆ నాలుగు రకాల గురించి మధ్యలో వస్తుంది (అవి అంతకు ముందే ప్రస్తావించినప్పటికీ). ఇంకా పేరాగ్రాఫ్ మధ్య ట్రాన్సిషన్ “అసలు విషయానికి వద్దాం” లాంటివి వస్తుంటే, మరి పక్క విషయాలకే అంట ఎక్కువగా పోవడం ఎందుకు. ఒక బిగి, ఫోకస్ పోయింది.
ఇక ముఖ్య విషయం ఏమిటి? హిపోక్రసీ? అది అందరికీ తెలిసిందే కదా? ఇందులో కొత్త విషయం ఏమన్నా ఉంటుందా? ఉండవచ్చు: ఇది మంత్రి పదవుల్లాగా, వర్గ, కుల, మత, ప్రాంత proportional వ్యహారాలవ్వవచ్చు. ఇవ్వడం లో పారదర్శకత లేదు సరికదా, ఇచ్చినది ఎందుకో సరైన వివరణ కూడా లేక పోవచ్చు. లేదా, ప్రస్తుత ఫాషన్ ల మీద ఆధారపడి బహుకాలం నిలిచి ఉండే అవార్డు ఇవ్వడం సమంజసం కాకపోవచ్చు.
ఇది కేవలం తెలుగుతనమేనా? నోబెల్ ప్రైజ్ లోనూ లేదా? చర్చిల్ కి లిటరేచర్ ప్రైజ్ ఎందుకొచ్చింది? బాబ్ డీలాన్ కి రావడం రాజకీయ, సాంఘిక వాతావరణం మీద ఆధార పది ఉందా? మరి ప్రపంచం తో పోల్చి చూస్తే, తెలుగు ప్రపంచం ఎక్కడ తేడాగా ఉంది? లేదా ఎక్కడ అదే విధంగా ఉంది?
ఇంకా, దీనికి ఏదయినా విరుగుడు మందు ఉందా? ఉదాహరణకి, ఇంత వరకు వచ్చిన అవార్డుల గురించి, ఏదైనా క్లాసిఫికేషన్ చేసి, చూడగలమా? ఒక ట్రాన్స్పరెన్సీ తెప్పించగలమా?
ఇక ఆపేస్తాను. జర్నలిజం స్థాయిలో రాయవలసిన ఈ వ్యాసం, తెలుగు ఫిక్షన్ లాగ ఉందని, ఇంత విషయం చెప్పిన మీరు దాన్ని అక్షరాల మరుగున పడేశారని రాసాను. నన్ను మన్నించగలరు.
Poynter.org has several pointers about writing powerful essays — I learnt a lot from it. https://www.poynter.org/shop/self-directed-course/the-writers-workbench-50-tools-you-can-use/ is a free course that anybody can do it. I loved it.
క్షమించడం ఎందుకు సర్, హాయిగా విమర్శించొచ్చు. పైగా తెలిసిందే మాట్లాడేవాళ్లంటే ఇష్టం. తెలుసుకుని మాట్లాడేవాళ్లంటే గౌరవం. క్లుప్తంగా రాయడమెలా అన్నదాని గురించి మీరిచ్చిన సిలబస్ కు ధన్యవాదాలు. కాకపోతే ఎరుక ఉండడం, లేకపోవడం మీదే అన్నీ ఆధారపడి ఉండవు సార్. మీరు ఆ సిలబస్ కూడా తెలుసుకోవాలేమో! నేను పదిహేనేళ్లకు పైబడి జర్నలిజం పాఠాలు చెపుతున్నాను. సులభమైన పదాలు, చిన్న వాక్యాలు, చిన్న పేరాలు లాంటి విషయాల గురించి నేను కూడా నాకు తెలిసినంతలో చెపుతూ ఉంటాను. అలా రాసినవి ఉన్నాయనే అనుకుంటాను.
విషయం సూటిగా ఉన్నపుడు వాక్యం గంతులేస్తది. సూటిగా చెప్పలేని ఇబ్బందులున్నపుడు కుంటుతది. ముఖ్యంగా మిత్రులతో అరుచికరమైన విషయాలు మాట్లాడాల్సి వచ్చినపుడు వాక్యం నానా తిప్పలు పడతది. చాలా విషయాలు ఇన్ఫరెన్సుల ద్వారా చెప్పాల్సివస్తది. హిపోక్రసీ అనే మురికి గురించి నలుగురికీ తెలీని విషయాలు తక్కువ. తెలిసీ చూడని, చూడదల్చుకోలేని విషయాల గురించి మాట్లాడుతున్నపుడు విషయం కంటే మనం తేవాలనుకున్న ఫీల్ ముఖ్యమవుతుంది. దానికోసం రెఫరెన్సులు లాగి సంకేతాత్మకమైన భాష వాడాల్సి ఉంటది. అటూ ఇటూ నాలుగువాక్యాలు పేని అందులో ఇరికించి మనం చెప్పదల్చుకున్న చేదు విషయం చెప్పాల్సివస్తది. అందరికీ ఇలా ఉంటుందో ఉండదో తెలియదు. కానీ నాకైతే మిత్రులతో అరుచికరమైన విషయాలు మాట్లాడాల్సివచ్చినపుడల్లా ఈ ఇబ్బంది వస్తూనే ఉంటుంది. అది మోమాటం కూడా కాదు. మోమాటపడి మనసులో లేనిది చెప్పింది ఎన్నడూ లేదు. కానీ లోలోపల నలిగిపోవడం ఉంటది. అలాంటప్పుడు మిత్రులని ఎందుకు అనుకోవాలి, ప్రత్యర్థులతో వ్యవహరించినట్టే ఘాట్టిగా మాట్లాడొచ్చు గదా అని పెద్దలు చెప్పబోదురేమో! మోరలిస్టిక్ స్టాండ్ తీసుకుంటే మిగిలేదెవ్వరు? ఉన్నదే ఉడ్డా నలుగురం-మన ఫేస్బుక్ పేజీ చూసుకుని అదే ప్రపంచం అనుకుంటే తప్ప. కాబట్టి ఇలాంటి విషయాలు రాస్తున్నపుడు ఇబ్బంది ఉంటది. ఇటీవల ఈ ఇబ్బంది తరచుగా వస్తున్నది. వాక్యం ఇబ్బంది పడుతున్నది. అదీ కథ.