అవన్నీ నా చుట్టూ జరిగిన అనుభవాలే!

* హాయ్ గౌస్! ‘చోంగా రోటీ’ కథా సంకలనంలో మీ కథ ప్రచురితమైనందుకు ముందుగా అభినందనలు. ఈ అవకాశం ఎలా వచ్చింది?

థ్యాంక్యూ! సారంగ వెబ్ పత్రికలో ‘పీర్ల పండగ’ అనే కథ రాశాను. అది చూసి రచయిత వేంపల్లి షరీఫ్ గారు ఫోన్ చేశారు. ఇంకా ఏవైనా కథలు రాశావా అని అడిగారు. ఈ కథా సంకలనం గురించి చెప్పి ఒక కథ రాసి పంపమన్నారు‌. అలా నా ‘రెండో జత’ కథ అందులో చేరింది. పుస్తకం రాసేముందు అందులో ఉన్న రచయితల గురించి ఏమీ తెలియదు. పుస్తకం చేతికొచ్చాక అందులో‌ ఉన్న రచయితల గొప్పతనం తెలిసింది. వారి కథల మధ్య నా కథ ఉండటం ఆనందంగా అనిపించింది.

* మీ కథా రచన ఎలా మొదలైంది?

నేను పుట్టి పెరిగింది అనంతపురం జిల్లా తాడిపత్రి. చిన్నప్పుడు మా స్కూల్ పక్కనే లైబ్రరీ ఉండేది. అప్పుడప్పుడూ అక్కడికి వెళ్లి పుస్తకాలు చదవడం అలవాటు. హైస్కూల్లో చేరాక చదవడం తగ్గింది. ఆ తర్వాత నాకు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. అక్కడ మాకు ల్యాప్‌టాప్‌లు ఇచ్చారు. అందులో మా సీనియర్లు చదివిన నవలల పీడీఎఫ్‌లు ఉండేవి. అక్కడున్న ఆరేళ్లు ఆ పీడీఎఫ్‌లు విపరీతంగా చదివాను. ముచ్చర్ల రజనీ శకుంతల గారు రాసిన ‘ఒక గుండె సవ్వడి’ నేను చదివిన తొలి నవల. యండమూరి వీరేంద్రనాథ్ గారి నవలలు చాలా వరకు అక్కడే చదివాను.

* నవలా సాహిత్యం బాగా చదివారు కదా! మరి కథలు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

ఇడుపులపాయలో ఉన్న టైంలోనే దాదాపు 50 వరకు చిన్న చిన్న కవితలు రాశాను. వాటిని కినిగె ద్వారా ఆన్‌లైన్‌లో రెండు పుస్తకాలుగా పెట్టాను. ‘నీ కోసం’, ‘నీ ఊహల్లో’ అని పేరు పెట్టిన పుస్తకాలను వేల మంది పాఠకులు చదివారు. అదే టైంలో నా స్నేహితుడి వల్ల చలం, శ్రీశ్రీ రచనలు పరిచయమయ్యాయి. బీటెక్ మొదటి సంవత్సరం తర్వాత ‘నిర్ణయం’ పేరుతో ఒక నవల రాసి ఆన్‌లైన్‌లో పెడితే దాదాపు 32 వేల వ్యూవ్స్ వచ్చాయి. ఆ సమయంలో కథల జోలికి వెళ్లలేదు. ఉద్యోగం కోసం హైద్రాబాద్ వచ్చాక కథలు రాయడం మొదలుపెట్టాను. అదే టైంలో యువరచయిత వి.మల్లికార్జున్ పరిచయమయ్యారు. తన సలహాలతో కథా రచన గురించి తెలుసుకున్నాను. 2020 ఫిబ్రవరి 2న నా తొలి కథ ‘చిల్డ్రన్స్ డే’ ప్రచురితమైంది. ఇప్పటికి ఐదు కథలు అచ్చయ్యాయి.

* మీ మీద ప్రభావం చూపిన రచయితలు ఎవరు?

నేనెక్కువగా నవలలు చదివాను. అందులో ప్రధానంగా నన్ను ప్రభావితం చేసింది కేశవరెడ్డి గారు. ఆయన నవలల్లో ‘సిటీ బ్యూటిఫుల్’ నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత గోపీచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’ చదివి భయపడ్డాను. మున్షీ ప్రేమ్‌చంద్ ‘నిర్మల’ కూడా చాలా నచ్చింది. దేవిరెడ్డి వెంకట్రెడ్డి అనే రచయిత రాసిన ‘సీమ బొగ్గులు’ పుస్తకం చదివిన ప్రభావంతో కథలు మొదలుపెట్టాను.

* మీకు నచ్చిన కథలు?

శంకరమంచి సత్యం గారు రాసిన ‘అమరావతి కథలు’ పుస్తకంలోని ప్రతి కథా బాగుంటుంది. కథను ఒక్క వాక్యంతోనే మరో స్థాయికి తీసుకువెళ్లే ఆ నేర్పు అద్భుతం అనిపిస్తుంది. ‘కొత్త కథ 2019’ పుస్తకంలో కుప్పిలి పద్మ రాసిన ‘వే టు మెట్రో’ కథ నాకు చాలా నచ్చింది. ఆ కథ చదివాక మల్లికార్జున్ ద్వారా పద్మగారితో మాట్లాడాను. అదే పుస్తకంలో మిథున ప్రభ రాసిన ‘శీలానగర్ రెండో మలుపు’ కథ కూడా చాలా నచ్చింది. ఇటీవల విడుదలైన ‘నల్లగొండ కథలు’లో ‘జుత్పాల ఆకు’‌ కథ బాగుంది.

* ఎలాంటి కథలు రాయడానికి ఇష్టపడతారు? కథారచన మీద మీ అభిప్రాయం ఏమిటి?

నాకు ఏ విషయమైనా జనంతో పంచుకోవడం ఇష్టం. ఎక్కువ మంది తెలుసుకుంటే బాగుంటుంది అనిపించే విషయాలను కథలుగా రాస్తాను. అవన్నీ నా చుట్టూ జరిగిన అనుభవాలే! మా ఇంట్లో వాళ్లు అవి చదివి, ‘ఇంత చిన్న విషయాలు కూడా కథలవుతాయా?’ అని అడుగుతుంటారు. కథా రచన అవసరమైన ప్రక్రియ. చెప్పాల్సిన కథలు ప్రతిచోటా ఉన్నాయి. కొంత ఆలస్యమైనా అవన్నీ బయటికొస్తాయి.

*

స్కూల్ ఫస్టు

“గణేషూ, ఈసారి స్కూలు పస్టు ఎవురొస్తారనుకుంటాండావ్?” ఇంటికి పోనీకి స్కూల్ బ్యాగు సర్దుకుంటా అడిగినాడు శంకరు. 

ఏమో అన్నట్టుగా తన రెండు భుజాలు ఎగరేసినాడు గణేషు. “నువ్వే వస్తావని సారోళ్ళంతా అనుకుంటాన్నారు” అని శంకరు అన్యాక “ఇంగా పరీక్షలే స్టార్టు కాల్యా. అప్పుడే ఎట్ల చెప్పేది? చూద్దాము. ఏమైతాదో?” అనేసి స్కూల్ బ్యాగు తీస్కోని ఇంటికి బయల్దేరినాడు గణేషు.

గణేషు, శంకరు ఇద్దరూ ఏడో తరగతి. ఆరో తరగతి వరకు ఆడుకుంట, తిరుగుకుంట చేసినారు. ఏడో తరగతికి పబ్లిక్ ఉందని సారోళ్ళు చెప్పడంతో అప్పట్నుండి బాగా చదివినారు. ఇంగొక వారం రోజుల్లో పబ్లిక్ పరీక్షలు. 

గణేషు ఇంటికిపోయి బ్యాగు గోడకానిచ్చి పెట్టినాడు. వాళ్ళమ్మ దగ్గర తెల్ల కుసాల(ఖర్బూజా విత్తనాలు) ప్యాకెట్లు తీసుకున్యాడు. ఇంటి బయట గోడకానిచ్చి నిలబెట్టిన అట్లాస్ సైకిల్ పక్కకి తెచ్చి నిలబెట్టినాడు. ఆ తెల్ల కుసాల ప్యాకెట్లు సీట్ యెనకాల స్టాండ్ మీద పెట్టుకున్యాడు. సీట్ మీదెక్కి కూర్చుంటే కాళ్ళు అందవని, సైడునుండి అడ్డపెటల్ తొక్కుతాడు.

అట్ల ఆ ప్యాకెట్లన్ని తీస్కపోయి ఊర్లో ఉన్న చిన్న చిన్న చిల్లర అంగళ్లకి ఇయ్యల్ల. వాళ్ళిచ్చినే లెక్క తీస్కోనొచ్చి ఇంట్లో అమ్మకియ్యల్ల. ఒక్కోసారి ఆ సైకిల్ మీదనే అడ్డపెటల్ తొక్కుకుంట నాలుగు కిలోమీటర్లు పోయిపోయి పక్కనూర్లో ఉండే అంగళ్లకు కూడా ఆ ప్యాకెట్లు ఇచ్చేసి వస్తాడు.

అట్ల ఆరోజు గుడక ప్యాకెట్లు ఇచ్చొచ్చేకి పోదామని బయల్దేరినాడు. సరిగ్గా ఆ టైముకి గణేషు క్లాసుమేట్లందరూ ట్యూషనుకి పోతాన్నారు. వాళ్ళల్లో ఒక పిల్లోడు “వాడు చూడులే ట్యూషనుకి గుడ రాడు” అనంటే ఇంకో పిల్లోడు “వానికేం లేబ్బా, ట్యూషనుకి రాకపోయినా పస్టు వాడే వస్తాడు” అనేది వినపడి ముసిముసిగా నవ్వుకుంట సైకిల్ మీద బయల్దేరినాడు గణేషు.

*****

పని చేస్కుంట సదువుకునేది గణేషుకి కొత్త కాదు. ఒక్కోసారి వాళ్ళమ్మతో కలిసి కూలీపనికి పోతాడు. ఆదివారాలొస్తే తెలిసినోళ్ళతో ఫ్యాక్టరీ పనికి పోతాడు. పిల్లోడే కదా అని వాళ్ళు సగం కూలి ఇస్తారు. ఆ సగం కూలైనా అమ్మకి సాయమైతాది కదా అని అట్లే పోతాడు. కానీ స్కూలుందంటే మాత్రం ఇవన్నీ చెయ్యడు. స్కూలుకే పోతాడు.

ఆ స్కూల్ కరెస్పాండెంటు గణేషు వాళ్ళ నాయనకి బాగా తెలిసిన మనిషి. అదీ కాక గణేషు చిన్నప్పట్నుండే బాగా సదివేటోడు. అందుకని గణేషుకి స్కూల్ ఫీజు సగమే. బుక్కులకి మాత్రం లెక్క కట్టల్ల. బోర్డు మీద లెక్కల సారు ప్రశ్న రాసి లెక్క చేసేలోపే గణేషు నోట్ బుక్కులో ఆ లెక్క స్టెప్ బై స్టెప్ ప్రింట్ అయిపోయి ఉంటాది. సైన్స్ బొమ్మలైతే ఇంగ చెప్పనక్కర్ల్యా. “కప్ప జీవిత చరిత్ర” బొమ్మ గీస్తే టెక్స్ట్ బుక్ మీద పేపర్ పెట్టి గీసినాడేమో అనుకోవాల్సిండేదే. అంత మంచిగ గీస్తాడు. అల్లరి గురించి తప్ప చదువు గురించి ఎప్పుడూ దెబ్బలు తినేవాడు కాదు.

*****

పబ్లిక్ పరీక్షలు వచ్చేసినాయి. అందరూ పోయి పరీక్షలు రాసేసి వస్తాన్నారు. వాళ్ళతో పాటే గణేషు గూడ. పరీక్షలన్నీ బాగా రాసినాడు. సారోళ్ళు “ఎన్ని మార్కుస్తాలొస్తాయిరా?” అనడిగితే “ఐదు వందలకి తగ్గవు సార్” అన్యాడు ఆలోచించకుండా. 

అనుకున్నట్టుగానే ఐదు వందలకి తగ్గకుండా వచ్చినాయి మార్కులు. ఆ మండలంలోనే టాప్. ఐదువందల పది మార్కులు. దాని ముందు సమచ్చరం ఐదువందల ఏడు మార్కులు. అది కూడా గణేషు వాళ్ళ స్కూలు కాదు. వేరే స్కూలు. మామూలుగా ఆ స్కూలోళ్ళే ఫస్టొస్తారు. 

ఈసారి గణేషు ఫస్టొచ్చేసరికి అందరూ గణేషు గురించి మాట్లాడుకుంటాన్నారు. వాడు మాత్రం నాకిదంతా సన్బంధం లేదన్నట్లు పరీక్షలు అయిపోయిన రోజు నుండి పనికి పొయ్యేది, విత్తనాల ప్యాకెట్లు ఇచ్చేసి రావటం చేస్తాన్నాడు. 

అట్ల ఒకరోజు పనికి పొయ్యొచ్చేసరికి ఇంటి బయట ఎవరివో చెప్పులు కనపడినాయి. దాంట్లో షూసు గూడ ఉన్నాయి. ఎవరొచ్చినారుబ్బా అనుకుంట లోపలికి పొయినాడు. ఎప్పుడూ ఫస్టొచ్చే స్కూలోళ్ళు. ఇద్దరు టీచర్లు, హెడ్ మాస్టరు వచ్చినారు. “మీ అబ్బాయిని మా స్కూల్లో జాయిన్ చేయండి. అక్కడ సగం ఫీజు కడుతున్నారు కదా, మాకు ఆ సగం ఫీజు కూడా వద్దు. ఫ్రీగా జాయిన్ చేస్కుంటాం” అని అడుగుతాన్నారు.

“ఏమో సార్. వాళ్ళ నాయన వచ్చినాక మాట్లాడతాను” అని చెప్పి వాళ్ళని పంపేసింది గణేషు వాళ్ళమ్మ. మరుసటి రోజు ఇంగొక స్కూలోళ్ళు వచ్చినారు. మళ్ళ వాళ్ళు గూడ “మీ అబ్బాయిని మా స్కూల్లో జాయిన్ చేయించండి. అక్కడ సగం ఫీజు, పుస్తకాల ఫీజు కడుతున్నారు కదా! మాకు అదేమీ వద్దు. మొత్తం ఫ్రీ. మీ అబ్బాయి మా స్కూల్లో చదివితే చాలు” అన్యారు. 

అయితే గణేషు వాళ్ళమ్మ “మొత్తం ఫ్రీ” అని విన్నా కూడా “ఏమో సార్? వాళ్ళు చిన్నప్పట్నుండి సగం ఫీజుకి సదువు చెప్పినారు కదా. ఇప్పుడు మానేస్తే బాగుండదు” అని చెప్పి పంపించేసింది. 

ఇదంతా తెలుసుకోని గణేషు వాళ్ళ స్కూల్ కరెస్పాండెంట్ “ఆ సగం ఫీజు కూడా వద్దు. ఫ్రీ” అని చెప్పినాడు గణేషు వాళ్ళ నాయనతో. 

*****

సెలవులయిపొయినాయి. స్కూళ్ళు మొదలైనాయి. పిల్లోళ్ళందరూ బడికి పోతాన్నారు. కానీ గణేషు మాత్రం ఆ అట్లాస్ సైకిలు మీద పనికి పోతాన్నాడు. ఇంట్లో పరిస్థితికి స్కూల్ మానేయాల్సిన టైమొచ్చింది. స్కూల్ ఫీజంటే ఫ్రీ అన్నారు కాబట్టి పర్వాల్యా. ఇంట్లో ఖర్చులకి, అప్పులకి లెక్క యాడనుండి వస్తాది? బడికిపోతే డబ్బులొచ్చి అకౌంట్లో పడ్తాయా? అట్ల ఏడో తరగతి మండల ఫస్ట్ వచ్చిన్నే పిల్లోడు ఎనిమిదో తరగతికి బడికే పోకుండ మానుకున్యాడు. మూడు సమచ్చరాలు గడిచిపొయినాయి. గణేషు క్లాసుమేట్లందరూ టెన్త్ పాసయినారు. గణేషు మాత్రం “సెవెన్తు పాసయినా” అని చెప్పుకునేటోడు ఎవరడిగినా. 

ఒకనాడెందుకో ఎట్లన్నాకానీ టెన్త్ పాస్ కావాల అనుకున్యాడు. ఓపెన్ స్కూల్ అని ఒకటుంటాదని తెలుసుకోని ఆ పరీక్షలకి ఫీజు కట్టినాడు. పొద్దన పనికి పొయ్యేముందు, సాయంత్రం పనికి పొయ్యొచ్చినాక ట్యూషనుకి పొయ్యేటోడు. అట్లనే సదివినాడు. స్కూలుకి పొయ్యింటే ఎన్ని మార్కులొచ్చేటివో, ఫస్టొచ్చేటోడేమో గానీ ఓపెన్ టెన్తులో మాత్రం మూడొందల మార్కులతో పాసయినాడు. అప్పటికి వాని క్లాసుమేట్లందరిదీ ఇంటర్ అయిపోయింది. చేతిలో టెన్తు క్లాసు సర్టిఫికేటు పట్టుకోని టౌనుకి పోతాంటే ఎవరో అడిగినారు “పనికి పోకుండా యాటికి పోతాన్నవ్ లే?” అని. “ఓపెన్ ఇంటర్ ఫీజు కట్టనీకి” అని చెప్పేసి బయల్దేరినాడు గణేషు.

*

షేక్ మొహమ్మద్ గౌస్

తక్కువ సమయంలో ఎక్కువ రాస్తూ గుర్తింపు పొందిన రచయిత. స్వస్థలం అనంతపురం జిల్లా తాడిపత్రి. జననం: 1997. బీ.టెక్ కంప్యూటర్ సైన్స్ చదివారు. తొలికథ 'చిల్డ్రెన్స్ డే' 2020లో వెలువడింది. ఇప్పటివరకూ 30 కథలు రాసి వాటిలో రాయలసీమ యాసలో రాసిన కథలన్నీ కలిపి 'గాజులసంచి' గా వెలువరించారు. శిల్ప ప్రాధాన్యంగా రాయడం సాధన చేస్తున్నారు. ఐటీ రంగంలో ఉద్యోగం. ప్రస్తుత నివాసం: హైదరాబాద్.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కాలేజీ యాసను గుర్తుకు తెచ్చారు… బ్రదర్… చాలా బావుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు