అవధిలేని యాత్ర, ఈ ప్రేమ యాత్ర

1

వియత్నంలోని Hạ Long Bay లో Cruise Ship లో ఉండగా ఒక స్లోవేనియా యువ జంట నన్ను పలకరించారు. వారి backpacks పాతబడి మాసిపోయి ఉన్నాయి. వాటిని చూశాక అర్థమయింది, వారు నిజమైన యాత్రికులని, just money burn చేసుకోవడానికి వచ్చిన టూరిస్టులు కాదని. అటువంటి genuine యాత్రికులంటే నాకు గౌరవం. వారికి డబ్బు దాచుకోవాలని, ఆస్తులు పోగు చేసుకోవాలని ఉండదు. ఒక నిరంతరమైన తేలికదనంతో జీవిస్తారు.

వారి backpacks పక్కన నా backpack మెరుస్తూ polished గా కనిపించే సరికి నాకే సిగ్గనిపించింది. వారు నిజమైన యాత్రికులు, నేను కాదనిపించింది. వాళ్ళు  Hạ Long Bay cruise కి రావడం 4 వ సారి అని చెప్పారు. వారికి 30 ఏళ్ళు దాటవు. వారి దేహాలు తేలికగా, చురుకుగా కదులుతున్నాయి. ఎక్కడికైనా వెళ్ళడానికి, ఏ కొత్త అనుభవాన్నయినా స్వీకరించడానికి వారి మనసులు సిద్ధంగా ఉన్నాయి. వారి హృదయాల్లో ఏ భారాలూ లేవు. ఉన్నా వాటిని ఎప్పటికప్పుడు విడిచి పెడతారని వారి మాటల్లో తెలిసింది.

నేను దక్షిణ భారతీయుడినని తెలుసుకున్నాకా వారు “మీ మాతృభాష తమిళమా?” అని అడిగారు.

మీది ఏ దేశం అని ఎవరయినా అడిగితే ఇబ్బందిగా ఉంటుంది. “నాది ఏ దేశం?” అని నాలో నేనే ప్రశ్నించుకుంటాను. చలం గారి మాటలు గుర్తుకు వస్తాయి. ఈ భూమి మీద ఎక్కడో దగ్గర పుట్టాలి కాబట్టి పుట్టాను. అయినంత మాత్రాన ఏదో ఒక దేశానికి చెందిన వాడిని నేను అవుతానా! దేశభక్తి, జాతీయవాదాలే మానవజాతి దైన్యానికి, యుద్ధాలకు, హింసరక్తపాతాలకు కారణం అని అర్థం చేసుకున్న నేను ఒక దేశ పౌరుడిగా ప్రకటించుకోవడానికి ఎప్పుడూ ఇబ్బంది పడతాను. భగవంతుడు అంతమనేది లేకుండా సృష్టించిన ఈ విశ్వంలో నేను ఒక దేశానికి చెందినవాడిని అనుకోవడం ఎంత ఇరుకుతనం!

“అంతమనేది లేకుండా సృష్టించావు నన్ను. నీకది విలాసం.” అన్న టాగోర్ మాటలు అనుభవంలోకి వస్తాయి, యాత్రలో ఉన్నప్పుడు.

నా మాతృ భాష తెలుగు అని చెబితే ఆ స్లోవేనియన్లు తెల్లముఖం వేశారు. వారు అప్పటికే భారత దేశమంతా 3 సార్లు తిరిగారట. అయినప్పటికీ తెలుగు భాష పేరు తెలియదని చెప్పారు. ఈ దుస్థితికి కారణాలను విశ్లేషించే పని ఇప్పుడు నేను చెయ్యాలని అనుకోవడం లేదు. ఇదొక collective sin. ఎవరిని బాధ్యులను చెయ్యగలం!

ఇంతకీ నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే ఆ జంట పేదవారు. వారు live in relationship లో ఉన్నారు. విస్తృతంగా పర్యటనలు చేసారు. సంవత్సరంలో సగం రోజులు యాత్రలోనే గడుపుతామని చెప్పారు. అన్నింటికీ డబ్బు అడ్డంకి కాదని వారిని జీవనశైలిని చూశాక అర్థమైంది.

విలాసంగా పర్యటన చెయ్యడానికి వారు రాలేదు. యాత్ర అనేది వారి passion. యాత్రలో వారు జీవితంతో connectedness ని పొందుతున్నారు. చాలా వరకూ వారు మౌనంగా కూర్చుని నిశ్శబ్ధంగా ప్రకృతి దృశ్యాలను అనుభూతి చెందుతూ కనిపించేవారు. తెలిసిన వారంతా వెళుతున్నారని పోటీపడి Instagram లో  ఫోటోలు పెట్టుకోవడానికి వారు యాత్రకి వెళ్ళడం లేదు.

ఏ యే దేశాలలో పర్యటన ఖర్చులు చవకగా ఉంటాయో, ఏ నగరాలలో, ఏ ప్రాంతాలలో హోటల్స్, ఆహారం చవకగా, నాణ్యతతో ఉంటాయో, పర్యటనల్లో ఖర్చుల్ని  ఎలా అదుపులో ఉంచుకోవాలో, ఎలా బాధ్యతాయుతంగా, అర్థవంతంగా ఖర్చు చెయ్యాలో వివరంగా వారు చెప్పారు. వారి నుండి విద్యార్థిలా నేను ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఒక విషయాన్ని ఎంతగానో ప్రేమించి దాని కోసం జీవితం అంకితం చేసుకునే వారి వద్ద మనం నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉంటాయి. అవి పుస్తకాలలో దొరకవు.

ప్రతి మనిషిలో ఒక ప్రత్యేకమైన విభాగానికి సంబంధించి ఎంతో జ్ఞానం ఉంటుంది. దానిని వారి నుండి నేర్చుకోవడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. కేవలం ఒక అజ్ఞాని మాత్రమే నాకు తెలుసు అనే ఆత్మవిశ్వాసంతో ఉండగలడు. అన్నీ తెలుసు అనుకునేవారు ఎప్పటికీ ఏదీ తెలుసుకోలేరు. ఎందుకంటే నేర్చుకోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. అది పుస్తకాలలో ఇమడదు.

2

యాత్ర ఎన్నో విషయాలను మనకు నేర్పిస్తుంది. ఎన్నో అనుభవాలను ఇస్తుంది. నీవుండే నీ కలుగే జీవితం కాదనీ, జీవితం అనంతంగా విస్తరించి ఉందనీ ఎరుక పరుస్తుంది.

యాత్ర సముద్రం పై నురుగులా మనం వర్తమానం పై తేలియాడేలా చేస్తుంది. ఆత్మ శోధనని initiate చేస్తుంది. మరింత, మరింత ఆత్మ లోతుల్లోకి మనం పయనించేలా చేస్తుంది.

మీరు యాత్రకి వెళితే నిశ్శబ్దంగా అన్నింటినీ మీలోకి తీసుకుంటూ, అన్నింటికీ సాక్షీభూతంగా ఉంటూ గడపండి. యాత్ర అనేది నామట్టుకు నాకు ఒక ధ్యానం. ఒక పవిత్రమైన సాధన. ప్రతి క్షణం విస్మయం, ఆశ్చర్యాలతో నిండిన ఆధ్యాత్మిక ప్రక్రియ. లోపలికి లోలోపలికి, అంతరాంతర హృదయ దేవాలయంలోకి మనల్ని మనం absorb చేసుకునే ప్రక్రియ. యాత్ర మనల్ని మూలానికి తీసుకెళుతుంది. మహా విశ్వంలో నువ్వు కేవలం కరిగిపోయే నురుగువనే స్పృహను ఇస్తుంది. అంతూదరీలేని విస్తృతిలో నీ ఉనికిని మెల్లమెల్లగా కరిగించి వేస్తూ ఉంటుంది.

యాత్రలో పరిచయమయ్యే వారంతా నీ ముఖాలే అనిపిస్తుంది. You are the God of the many faces అనిపిస్తుంది.

యాత్ర ఒక ధ్యానం. ఒక ఆత్మానుభవం.

3

ఆ స్లోవేనియా జంట పేదవారైనా ఎలా యాత్ర చేయగలుగుతున్నారు? నిజంగా మీరు యాత్రను ప్రేమిస్తే ప్రకృతి సహకరిస్తుంది. మీకు ఏదో ఒక రూపంలో సహాయం అందుతుంది. ఇది యాత్రకు మాత్రమే వర్తించదు. జీవితానికి కూడా వర్తిస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాలే మీ జీవితాన్ని నిర్దేశిస్తాయి. పూర్తి స్పష్టతతో, వివేకంతో తీసుకున్న నిర్ణయాలు జీవితంలో అద్భుతాల వైపుగా మిమ్మల్ని తీసుకు వెళతాయి. కొత్త ద్వారాలను మీ కోసం తెరుస్తాయి. ఈ దృగ్విషయం కొందరికి అర్థం కాకపోవచ్చు. జీవితాన్ని నిజాయితీగా, నిశితంగా పరిశీలిస్తే దాని గమనాన్ని అర్థం చేసుకోవడం అంత కష్టం కాదు.

“ఒకరు ప్రకృతిలో జీవించాలనుకుంటే జీవించగలరా? ఆర్థిక ఇబ్బందుల్ని ఎలా అధిగమించాలి” అనేది కొందరికి ప్రశ్న. ఈ ప్రశ్నను మిత్రులు నన్ను తరచుగా అడుగుతూ ఉంటారు.

 వేటూరి గారు జీవితమంతా గోదావరి ఒడ్డున పాపికొండల నడుమ పర్ణశాలను కట్టుకొని, అక్కడ జీవించాలని కలలు కన్నారు. కానీ అది నెరవేర్చుకోలేకపోయారు. ఆయనకు డబ్బు లేక కాదు. ప్రతి కల కేవలం డబ్బుతో సాకారం కాదు.

మీరు నిష్పూచీగా ప్రకృతిని ప్రేమిస్తే, సంపూర్ణంగా ప్రకృతిలో జీవించడంలోని అమరికను అర్థం చేసుకుంటే ఎప్పటికీ నగరంలో మీరు జీవించలేరు. స్పష్టతలో ఎప్పుడూ second option మాయమైపోతుంది. మీరు ప్రకృతితో ఉంటారు. అంతే. ఊగిసలాట ఉండదు.

యాత్ర కూడా అంతే. యాత్ర అంటే ఏమిటో అనుభవం అయితే, దానిని మీరు ప్రేమిస్తే మీరు యాత్రలోనే ఉంటారు. ఇంటిని పూర్తిగా వదిలివేయడం అని కాదు దీని అర్థం, యాత్రను వదలలేకపోవడం అని. ఆ వదలలేనితనం మీలో ఏర్పడితే అదే మిమ్మని తనతో కొత్త లోకాల్లోకి, కొత్త అనుభవాల్లోకి లాక్కెలుతుంది.

4

యాత్రలో ఏమి జరుగుతుంది. మొదట మనసు నిశ్చలమయిపోతుంది. నీ గతం అదృశ్యమయిపోతుంది. లోకం అంతనేదే లేకుండా మీ ముందు తెరుచుకుంటుంది. అవును, ఈ విశ్వానికి అంతనేదే లేదు. ఈ దారికి కూడా. కొత్త నగరాలు, కొత్త గ్రామాలు, కొత్త సంస్కృతులు, కొత్త జీవన విధానాలు, కొత్తగా కనిపించే ప్రజలు, కొత్త భాష, కొత్త ఆహారాలు- మనం ఒక కొత్త స్వప్నాన్ని జీవిస్తాము. మన ఉనికి అనంతంగా ఎలా విస్తరించి ఉందో అర్థమయితే మన పరిమిత జీవనం నుండి బయట పడతాము.

మీరు దేనినైతే ప్రేమిస్తున్నారో అదే మీ జీవితాన్ని నిర్దేశిస్తుంది. మీరు సంపూర్ణ అవగాహనతో ప్రేమించినప్పుడు options అన్నీ మూసుకుపోయి వెళ్లాల్సిన దారి మాత్రమే కనిపిస్తుంది. ఆ దారిలో ముందుకు వెళుతుంటే అది అనంతంగా తెరుచుకుంటూ ఉంటుంది.

అందుచేత నేను చెప్పేది ఏమిటంటే జీవితంలో కొత్త అనుభవాలకు తలుపులు తెరవండి. ఒక చిన్న యాత్రతో మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి. ఆ ప్రయాణంలో జీవితాన్ని అర్ధం చేసుకోండి. మనుషులతో ప్రేమగా మాట్లాడండి. వారిని అర్ధం చేసుకోండి. వారి ప్రేమను స్వీకరించండి. ప్రకృతి వేల రూపాల్లో మనకు ప్రేమను పంచుతుంది. ఆ ప్రేమను స్వీకరించాలంటే మీరు యాత్ర మొదలు పెట్టాలి.

ఒక టూరిస్ట్ ప్రదేశాలను మాత్రమే చూస్తాడు. కానీ ఒక యాత్రికుడు ఎక్కడకు వెళ్ళినా ఆ ప్రాంతాలలో తన ఆత్మను వెతుక్కుంటాడు. దేశాలలో, నగరాలలో, పర్వతాలలో, నదుల్లో, ప్రజల కళ్ళల్లో, నవ్వుల్లో తనను తాను గుర్తు పడతాడు. తానే ఈ విశ్వమంతా పరచుకుని ఉన్నట్టు తెలుసుకుంటాడు. తనని తానే అన్వేషిస్తూ, తనని తానే తెలుసుకుంటూ విస్మయం చెందుతాడు.

చివరిగా చిక్కాల కృష్ణారావు గారి మాటలతో ఈ వ్యాసం ముగిస్తాను.

“అంతులేని అవధిలేని యాత్ర, ఈ ప్రేమ యాత్ర.”

జీవితాన్ని పూర్ణ హృదయంతో ప్రేమించండి.

తాజాకలం:

నేను గతంలో రాసుకున్న నోట్స్ నుండి ఒక భాగాన్ని ఇక్కడ ఇస్తున్నాను. తాజాకలం అని చెప్పి దానికి విరుద్ధంగా పాత నోట్స్ ఇవ్వడం ఏంటి అనుకోకండి. చదివితే మీకే అర్థమవుతుంది.

a)

మహా సముద్రం, ఆకాశం ఒక్కటిగా మారిన ఏకీకృత అనంత నీలిమలో, మహా శూన్యంలో – గురుత్వాకర్షణలేని చీకటి చోటులో యుగాలుగా తేలియాడుతున్న ఒక అనామక పక్షి ఈకలా – నువ్వు భారరహితంగా తేలియాడుతున్నప్పుడు,  ఎల్లలులేనితనాన్ని అర్థం చేసుకోలేక, మహా భయద సౌందర్యాన్ని లోనికి తీసుకోలేక  నీ మనసు ఒక్క సారిగా ఆగిపోయినప్పుడు, ఎవరు నీవు?

సముద్రాలు, దేశాలు, పట్టణాలు, అరణ్యాలు, పర్వతాలు దాటుకుంటూ వెళుతున్నప్పుడు ఈ మహావిశ్వంలో నీ ఉనికి ఏమిటి? నువ్వు ఒక నలుసువు కూడా కాదు ఈ మహా విస్తృతిలో. లేదా ఈ మహా విస్తృతి అంతా నీవే అయివుండాలి.

ఆకాశంలో, మేఘాలలో తేలియాడుతున్నప్పుడు నీవు ఏ ప్రాంతానికి చెందిన వాడివి? నువ్వు బంతిలా ఉండే నేలపైనే ఎందుకు జీవించాలి? నువ్వు ఏ పరిస్థితికైనా ఎందుకు పరిమితం కావాలి? ఎందుకు నువ్వు ఈ దేహంలోనే ఉండాలి? ఎందుకు ఈ భూమి పైనే ఉండాలి?

ఊరికే ఈ ఆకాశాన్ని, ఈ మేఘాలను అలా చూడడంలో ఒక గంభీరమైన అనిశ్చితి ఉంది. ఆ అనిశ్చితిలో నీ ఉనికికి అర్థం లేదు. కాని అనిశ్చితిలో స్వేచ్ఛ ఉంది. జీవితం ఉంది.

నిజమైన యాత్రికుల జీవితం ఎలా ఉంటుందో అర్థమయింది. యాత్ర అంటే గతాన్ని కుబుసంలా విడువడం. గతం నుండి పారిపోవడం కాదు. నువ్వు గతాన్ని విడువకుంటే సత్యాన్ని దర్శించ లేవు. ఈ క్షణంలో, great uncertinity లో జీవితాన్ని స్వేచ్చగా జీవించలేవు.

b)

ఒకసారి ఆకాశాన్ని దాని అనంత విస్తృతిలో దర్శించిన వ్యక్తి  భూమిపైకి వచ్చాక ఎప్పటిలా జీవించలేడు.  ఆకాశం యొక్క అనంత విస్తృతి నీ దేహంలోకి, ఆత్మలోకి ఎంతో కొంత ఇంకుతుంది. నీవు ఈ భూమి పై సృష్టించుకున్న అల్పమైన సమస్యల్లో, నీవు అతి ముఖ్యమని భావించుకున్న అనిత్యమైన జీవన వ్యాపారాల్లో నీ తలను దూర్చి ఇక ఎన్నటికీ కాలాన్ని వృధా చెయ్యలేవు.

నేలపై ఉన్న మన mundane జీవితానికి  అతీతంగా ఆకాశం అనంతంగా విస్తరించి ఉంది. ఆకాశం. అది ఎప్పుడూ నిన్ను పిలుస్తూనే ఉంది.

నిజంగా నీవు ఆకాశంలోకి ఎగరాలని తపిస్తే నీకు రెక్కలు మొలుస్తాయి. నీవు నీ జీవితమని భావించకుంటున్న భ్రమలో బ్రతకాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు.

ఒక్కసారి రెక్కలు చాచి ఎగురు. నీవిక వెనక్కి తిరిగి రాలేవు.

సౌందర్యం అనంతం. అదే జీవితం. అదే సత్యం.

 ‘సౌందర్యం’, ‘mystery’ అనే జీవితపు రెండు రెక్కలు సాయంతో నీవు కాలాన్ని, లోకాల్ని దాటి వెళ్ళగలవు.

  నువ్వు ఈ భూమి పై జీవించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు.

పక్షి పుట్టేది గూటిలోనే కావచ్చు. కాని దాని ఇల్లు ఆకాశం. దాని గమ్యం ఆకాశం. దాని జీవితం ఆకాశం.

అవధి లేని ఆకాశం. చిదాకాశం.

*

శ్రీరామ్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నేను ట్రావెల్ గురించి. రాస్తున్న వాక్యాలు, కొన్ని భావాలు ఇంచు మించు ఉన్నా,నే కవితాత్మకం గా ఉన్న నీదయిన వాక్యాలు అద్భుతం
    నువ్వు చెప్పినట్లు, ట్రావెలర్ కి టూరిస్ట్ కి చాలా తేడా ఉంది,
    అచ్చు ఆ దంపతుల బ్యాక్ ప్యాక్ ల్లాగా

    చిన్న జ్ఞాపకం అప్రస్తుతమే
    అయినా!
    ఇలాంటి దంపతులు నాకు 2013 లో ఇదే మహా కుంభమేళ కి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు రైల్లో (స్లీపర్ కోచ్ ) లో మాతో ప్రయాణించారు
    ఫ్రెంచ్ వాళ్ళు, పేర్లు ఏదో గుర్తు లేవు, బట్టలు పాత గా అయ్యి ఉన్నాయి
    ఇక్కడ కూడా కొన్ని ఖరీదు గా ఉన్నాయి అన్నారు. స్నానాల వల్ల జ్వరం వస్తె వల్లే టాబ్లెట్స్ ఇచ్చారు
    నీ వల్ల.వాళ్ళ నీ మరోసారి స్మరణకు తెచ్చుకున్నాను

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు