అలిపిరిలో గోసంగి దాసరి

‘‘ఊ.. త్వరగా పదండి తెల్లవారేసరికల్లా తొండమనాడును చేరుకోవాలి. శత్రు దుర్భేద్యమైన, మొసళ్ళతో కూడుకొన్న కందకాన్ని దాటి కోట ద్వారాన్ని బద్దలు కొట్టి లోనికి ప్రవేశించాలి…ఈ యుద్ధం మనకు చావో రేవో లాంటిది. పైగా మనం ఢీ కొట్టనుంది మన పల్లవ ప్రభువులను… మన చోళులు వారికి ఇప్పటి వరకు సామంతులమే…     ఇకపై మనమే చక్రవర్తులం కావాలి… సామంతులుగా మనం కప్పం కట్టి కట్టి విసిగి వేజారిపోయాం… ఇక తొండమనాటి యుద్ధంతో మన సంకెళ్ళను తెంచుకోవాలి… ఇన్నాళ్ళు మనం అదనుకోసం ఎదురు చూశాం… ఇప్పుడు పల్లవ రాజు బలహీనపడ్డాడు… ఇదే మనకు మంచి అవకాశం… తొండమనాడును యుద్ధంలో స్వాధీన పరచుకొంటే మనకు ఇక ఎదురేలేదు… మన చతురంగ బలాలను ముందుకురికించండి… యుద్ధంలో ముందుండి పోరాడే గోసంగులకు బహుమానాలను ప్రకటించండి… సైన్యంలో ముందు వరుసల్లో ఉండి శౌర్యపరాక్రమాలతో దూసుకెళ్ళే గోసంగుల వల్లే మనకు విజయం చేకూరుతుంది… వాళ్ళను ముందు ఉత్సాహపరచండి’’ అన్నాడు వీరావేశం కట్టలు తెంచుకొంటూ సేనాధిపతితో పల్లవులకు సామంత రాజైన చోళరాజు.

క్రీ.శ.620 ప్రాంతంలో పల్లవ మహేంద్రవర్మ తిరుమలేశుని ఆలయ పునర్నిర్మాణం చేసిన తర్వాత కొంత కాలానికి ఈ తిరుపతి ప్రాంతంలో వారి ప్రాబల్యం తగ్గింది. ఇదే అదనుగా పల్లవ మహేంద్రవర్మ సామంతరాజులైన చోళులు శ్రీకాళహస్తికి పడమటి వైపు స్వర్ణముఖి నది ఒడ్డునున్న తొండమనాడు పైకి దండయాత్రకు వెళ్ళారు. పల్లవులు, చోళుల మధ్య తొండమనాడులో యుద్ధం హోరాహోరీగా జరిగింది. విజయం చోళుల వశమైంది. యుద్ధంలో గెలిచిన చోళులు పక్కనే ఉన్న తిరుమలేశుని దర్శనానికొచ్చారు. సైన్యాన్ని కపిలతీర్థం ముందున్న కోట ఊరు అనే కొత్తూరులో విడిది ఏర్పాటు చేసి చోళరాజు తన పరివారంతో తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికెళ్ళాడు. సైన్యం కొత్తూరులో విందులు, వినోదాలతో గడుపుతుంటే వారిలోని ఒక  గోసంగి సైనికుడు మాత్రం తిరుపతి కొండను వింతగా, ఆశ్చర్యంగా, పులకించి పోతూ కల్లార్పకుండా తన్మయత్వంతో చూస్తూ అలాగే ఉండిపోతాడు. మరో ప్రపంచం తన కళ్ళ ఎదుట సాక్షాత్కరిస్తున్నట్లు భావోద్వేగంతో స్థానువులా నిలబడిపోయాడు.

‘‘రేయ్‌! రంగనాథన్‌!! తెల్లారి నుండి చూస్తున్న ఆ కొండకేసి అలా చూస్తూనే ఉన్నావు…అలా ఎంతసేపు చూస్తావురా? రారా… మధ్యాహ్నం భోజనాలు సిద్ధమయ్యాయి… తిని వచ్చి మళ్ళీ చూసుకో… ఎంతసేపు చూసినా అది కొండే కదరా? పోదాం పదా…ముందు కూడు తింటేగానీ ఆత్మారాముడు శాంతించడు… ఇంకా ఆలోచిస్తూ చూస్తున్నావేమి? పదపదా’’ అన్నాడు రంగనాథన్‌ బావ, గోసంగి సైనికుల్లో ఒకడు రామన్‌.

‘‘బావా! ఎందుకో ఈ కొండ నన్ను విపరీతంగా ఆకర్షిస్తోంది. కొండమీదున్న వెంకట పెరుమాళ్ళును చూడాలనిపిస్తోంది. రాజుగారు మన సైన్యాన్ని కూడా తీసుకెళ్ళి దైవ దర్శనం చేయించవచ్చు కదా?’’ అన్నాడు రంగనాథన్‌.

‘‘ఒరేయ్‌! మనం గోసంగులం… ఏ రాజ్యంలోనైనా, ఏ యుద్ధంలోనైనా ముందుండి యుద్ధం చేసేది

మనేమే. మనకు యుద్ధం చేసే కరుకు తనమే కాదు… భగవంతునిపై పాటలు పాడి నృత్యం చేసే సున్నిత హృదయాన్ని కూడా భగవంతుడు మనకు ప్రసాదించాడు. అలా మనం యుద్ధంలో శౌర్యాన్ని, మామూలు సమయాల్లో సంగీత నృత్యాలను ప్రదర్శించే కళాకారులం. భగవంతుణ్ణి కీర్తిస్తూ నృత్యం చేయడం మన రక్తంలోనే యిమిడి ఉంది. అదే మన జీవన శైలి. తరతరాలుగా వస్తున్న వారసత్వం. అయినా మనల్ని ఈ సమాజంలో అంటరాని తెగకు చెందిన వారిగా గుర్తించడం బాధాకరం. మనం ఈ వేంగడం కొండ ఎక్కడానికి అర్హులం కాదు. కింది నుంచే కొండను దర్శించుకొంటే వేంకటేశ్వర స్వామిని చూసినంత ఫలం వస్తుంది’’ అన్నాడు రామన్‌.

‘‘అవునా బావా నువ్వు చెప్పేది నిజమేనా?’’ ఆశ్చర్యంగా అడిగాడు రంగనాథన్‌.

‘‘అవును… నేను చెప్పేది అక్షరాల నిజం. నువ్వు యుద్ధంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. నేను గతంలో ఒక యుద్ధానికెళ్ళేటప్పుడు స్వర్ణముఖి నది ఒడ్డు నుండి వెళ్ళేటప్పుడు ఈ కొండను చూసి ఆశ్చర్యపడ్డాను. ఒకరోజు నది ఒడ్డున విడిది చేసినప్పుడు నీలాగే నేను ఈ కొండను తదేకంగా చూస్తున్నప్పుడు దారిలో పోయే ఒక సన్యాసి కొండ రూపును గూర్చి వివరించాడు. ఈ వేంగడం కొండను చూస్తే తిరుమలేశుడు సాక్షాత్కరిస్తాడు. కొండ ప్రారంభంలో శ్రీవారి నుదురు, ముక్కు, నోరుతో అచ్చం స్వామివారిలో కొండ కనిపించడం విడ్డూరమే కదా? అలిపిరి పక్కనుండే కొండ అంచుమీద గరుత్మంతుడి ఆకారంలో పెద్ద బండ ఈ లోయనంతా గమనిస్తున్నట్లుండడం వింతగాక మరేమిటి? ఒకప్పుడు ఆళ్వారులు కొండ ఎక్కేవారు కారట. స్వామి వారే కొండ రూపంలో పడుకొని ఉన్నాడని, ఆయన మీద కాలు మోపరాదని నమ్మాళ్వారు వరకు ఆళ్వారులు భావించి కొండకు దూరం నుండే కొండను స్వామిగా తలచి దర్శనం చేసుకొని ఆరాధించి వెళ్ళేవారని ఆ సన్యాసి నాకు వేంగడం కొండ మాహాత్మ్యాన్ని విడమరచి చెప్పాడు’’ అన్నాడు రామన్‌.

‘‘నేను కూడా ఆళ్వారులలాగే కొండను ఆరాధిస్తూ, వేంకటేశ్వర స్వామిని ధ్యానిస్తూ కొత్తూరు వెలివాడలోనే నివశిస్తాను. మన వెల్లూరుకు పోయి మీ చెల్లెల్ని ఇక్కడకు పంపు. ఆమెకు ఇష్టం లేక రాకపోతే నేనేవిూ బాధపడనని చెప్పు. ఇక నేను ఈ కొండనొదలి వచ్చే ప్రశ్నేలేదు. నా ప్రాణమున్నంత వరకు ఈ కొండ పాదాల చెంతే నా జీవితం. మీతోపాటు తిరుగు ప్రయాణం చేయను బావ’’ అన్నాడు రంగనాథన్‌ ధృడ చిత్తంతో.

‘‘సరే దేవుడు ఎలా పెడితే అలాగే జరుగుతుంది. యుద్ధంలో నీ అసమాన ప్రతిభా పాఠవాలను చూసి, నీ ధైర్య సాహసాలను చూసి రాజుగారు మెచ్చుకొన్నాడని మన దళపతి నాతో అన్నాడు. నువ్వు సైన్యంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తావనుకున్నాను. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు సూదంటు రాయిలా ఈ కొండ నిన్ను ఆకర్షించింది. ఇదంతా దైవలీల. నీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. నీ భార్య నిన్ను వదలి ఉండదు. ఆమె నీ తోటే లోకంగా బతుకుతోంది. ఆమెను తీసుకొచ్చి వదలి పెట్టే బాధ్యత నాది. పద భోం చేద్దాం ఆకలవుతోంది’’ అంటూ రంగనాథన్‌ను రామన్‌ తన వెంట భోజన శిబిరానికి తీసుకెళ్ళాడు.

రాజుతో పాటు అతని పరివారం, సైన్యం తిరిగి వెళ్ళి పోయింది. రంగనాథన్‌ భార్య లక్ష్మిని కొత్తూరుకు తీసుకొచ్చి వదలి పెట్టారు రామన్‌, అతని భార్య. ఈమె రంగనాథన్‌ సోదరి. అక్కా బావలు తిరుగు ప్రయాణమవుతున్నప్పుడు వాళ్ళ కళ్ళలో నీళ్ళను చూశాడు రంగనాథన్‌.

‘‘అక్కా! బావా!! నాగురించి మీరు బెంగపెట్టుకోవద్దండి. నాకు ఆ ఏడుకొండలవాడు తోడుంటాడు. ఆ నమ్మకం నాకుంది. మీరు క్షేమంగా వెళ్ళిరండి’’ అన్నాడు రంగనాథన్‌.

‘‘బావ బాగు కోరుతాడు. నీకు ఏ కష్టమొచ్చినా కాకితో కబురంపు. నేనొచ్చి నిన్ను తీసుకొని వెళ్తాను’’ అని అంటూ రామన్‌ తన భార్యతో పాటు బయలు దేరాడు.

బాగా పొద్దెక్కింది… సూర్యుడు ఉదయించి చాలా సేపయింది…

‘‘లక్ష్మీ! పద పద ఇంటికి…ఈ రోజు మంచి రోజు. నేను సైనికుడి నుండి దాసరిగా మారాలి. ఇంకో గడియలో శుభముహూర్తం ఉంది. కావలసిన సరంజామాను ఇంటి నుండి తీసుకొని మాలాడ గుండానికి బయలుదేరాలి. అక్కడ స్నానం చేసి ఈ సైనిక దుస్తుల్ని అక్కడే వదలేసి…నేను దాసరిగా మారాలి’’ అంటూ  లక్ష్మీతో పాటు రంగనాథన్‌ వెలివాడలోని తన ఇంటికెళ్ళాడు.

తనకు అవసరమైన వస్తువులను, సరంజామాను, దుస్తుల్ని అప్పటికే సిద్ధంగా ఉంచుకొన్న జోలెను భుజానికి తగిలించుకొని కపిలతీర్థం పక్కనుండే మాలాడ గుండానికి బయలుదేరాడు. కొండ బండరాళ్ళను దాటుకొని జలపాత ధారను అనుసరిస్తూ స్వచ్ఛమైన నీళ్ళు దుముకుతున్న మాలాడ గుండాన్ని చేరుకొన్నాడు. సైనిక దుస్తుల్ని మూటకట్టి పొదల్లోకి విసిరేశాడు. గోచీ పెట్టుకొని గుండంలో దూకి గుండ్రంగా ఈతకొడ్తూ స్నానం చేశాడు. నామం కొమ్ము అరచేతిలో సాది తెల్లని పెద్ద నామాలు పెట్టాడు. కుంకుమ సాది ఎర్రని నామాన్ని తెల్లని నామాల మధ్య దిద్దాడు. కొప్పుముడి వేసి తలకు టెక్కీ అంటే టోపీ పెట్టుకొన్నాడు. కంప చెట్లు శరీరానికి గుచ్చుకోకుండా తోలుచొక్కాను ధరించాడు. కొత్త చల్లడము వేసుకొన్నాడు. ఇత్తడితో చేసిన శంఖచక్రాలను   చెవికుండలాలుగా పెట్టుకొన్నాడు. నడుముకు ఒక పక్క మూరడుండే పిడికిలి పట్టుకొనే విధంగా ఉండే చేతి కత్తిని అంటే పిడిబాకును తోలు వరలో ఉంచి కట్టుకొన్నాడు. మరో వైపు చురకత్తిని కట్టుకొన్నాడు. గోసంగులు భక్తులైనా వీరత్వాన్ని వదులుకోరు. చేతిలో దివెదారి కొమ్ము అనే దీపస్తంభాన్ని, పసుపుపొడుండే తోలుతిత్తిని, జోడమ్ము అనే చేయమ్మును, మెడపైన మొగులాకు గొడుగును, పాదరక్షను, చంక పుటికలో చిటితాళాలు, తులసి పూలహారాన్ని కంటెగా, దారం కట్టిన కిన్నెరను భూజాన వేలాడేసుకొని మాలాడ గుండం దిగి అలిపిరి దగ్గరకు వెళ్ళాడు. యాత్రికులు గోవిందలు కొడ్తూ, అడిపడి అంటే మొదటి మెట్టు నుండి కర్పూరం వెలిగించి కొబ్బరి కాయలు కొడ్తూ తన్మయత్వంతో రెండు చేతులెత్తి మొక్కుతూ గోవింద ఘోషలతో గుంపులు పాదాల మంటపంలోని స్వామి వారి చెప్పులను నెత్తిన పెట్టుకొని పాదసేవ చేశాక, అక్కడే మెట్ల పక్కనున్న లక్ష్మీనరసింహస్వామి ఆలయానికెళ్ళి దర్శనం చేసుకొని గుంపులు గుంపులుగా కొండకెళ్తుంటే అలిపిరి ముందు నుండి చూస్తూ పులకించి పోయాడు. తన దృష్టిని చుక్కల పర్వతం వరకు నిలిపి, కొండంతటనూ తన చూపులతో స్పర్శంచి తన్మయత్వం పొందేవాడు. అలిపిరి ముందు దీపస్తంభాన్ని ఉంచి, దాని చుట్టూ తిరుగుతూ, తన చేతిలోని కిన్నెరను మీటుతూ అలిపిరి ప్రారంభ మెట్ల పక్కనుండే చింత చెట్టుకింద యాత్రికులందరూ చూసే విధంగా నృత్యం చేస్తూ, వేంకటేశ్వర స్వామి పై అనేక రకాల గేయాలను పాడేవాడు. కిన్నెర వాద్యంతో పాటు, తన చంక పుటికలో ఉన్న చిటితాళాలు ఒక దానితో ఒకటి తగిలి వంత వాద్యంగా వీనుల విందు చేస్తూ యాత్రికులను భక్తి సాగరంలో ముంచెత్తుతున్నాయి. ఇతని ఆటపాటల్లో పడి యాత్రికులు ఆయన చుట్టూ గుంపు చేరిపోయి వీక్షిస్తూ అలాగే ఉండి పోయేవారు.

‘‘మామా! మామా!! ఇక ఆడిపాడింది చాలు లే వచ్చి చెట్టు కింద కూర్చో కూడు తెచ్చాను…తిని సేదతీరి  మళ్ళీ ఆడిపాడుదువుగానీ’’ అంది లక్ష్మీ అన్నం తెచ్చిన మూటను చెట్టుకింద ఉన్న తిన్నెపై కూర్చుంటూ విప్పింది.

‘‘లక్ష్మీ! రోజూ నా కోసం కొత్తూరు నుండి ఇక్కడకు అన్నం తీసుకొని రావడం మంచిది కాదు. దారి పొడవునా అడవి ఉంది. ఒంటరిగా వచ్చి వెళ్ళడం ప్రమాదం. పొద్దుపోయాక నేనే ఇంటికొస్తాను. అప్పుడు స్నానం చేసి నువ్వొండిన వంటను తింటాలే’’ అన్నాడు.

‘‘మరి నీకు తిండీ నీళ్ళు ఎలా మామా?’’

‘‘అంతా ఆ ఏడుకొండల వాడే చూసుకొంటాడు…ఆయనకు అన్నీ తెలుసు’’

‘‘మామా! మన వాడ నుండి ఎవరైనా ఇటు వైపు వస్తుంటే ఎప్పుడైనా ఇక్కడకొచ్చి నీ ఆటపాటల్ని చూస్తాను మామా!’’

‘‘అలాగే’’

‘‘మామా! మన గోసంగులు ప్రాణాలకు తెగించి పోరాడే యుద్ధ వీరులు. అలాగే మనకు దేవుడు కళలను కూడా ప్రసాదించాడు. వీరత్వం, కళలు మన రక్తంలో ఉంది. అందుకే నువ్వు సైనికుడిగా పని చేశాక, కళల ద్వారా దేవుణ్ణి ఆరాధించాలనుకొన్నావు. పైగా మనం వైష్ణవ భక్తులం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే నువ్వు ఇలా మారిపోయావు మామా. నీ మాటను నేనెప్పుడూ కాదనను. నువ్వు లేకుండా నేను బతుకలేను మామా! ఆ శ్రీహరి నీకు మోక్షం ప్రసాదిస్తే నన్ను కూడా వైకుంఠానికి తీసుకెళ్తావా మామా?’’

‘‘తప్పకుండా… ఇద్దరం కలిసే వెళ్తాం’’

రోజూ నిద్రలేస్తూనే రంగనాథన్‌ మాలాడ గుండంలో స్నానం చేసి, అలిపిరిలో ఆడిపాడుతుండేవాడు. ఇతనికి రంగనాథన్‌ పేరు కనుమరుగైపోయింది. దాసరి కావడం వల్ల గోసంగి దాసరి అని అందరూ పిలిచేవారు. వెలివాడలో లక్ష్మి ఈత చాపలల్లడం, కోళ్ళను పెంచడం, చాటమంత్రం అనే జ్యోతిష్యం చెప్పడం, కథలకు వంతలు పాడుతూ భర్తలేనప్పుడు కాలక్షేపం చేసేది.

అలిపిరిలో భక్తులు గోసంగి దాసరి వినయ విధేయతల్ని, ప్రవర్తనను చూసి ఆశ్చర్యపడేవారు.

‘‘ఈ గోసంగి దాసరి రాళ్ళు కరిగిపోయేలా తన నృత్య గానాలతో భక్తులను అలరిస్తున్నాడు. ఇతని ఆట పాటల కోసమే కొత్తూరు నుంచి వస్తుంటాను. ఇతను అలిపిరి పక్కనున్న లక్ష్మీనరసింహస్వామి దేవాలయం దగ్గర తన పరికరాలను దించి, పులకలు పొటమరించే దేహంతో చండాలిక అనే కిన్నెరను మీటుతూ, చెక్కిళ్ళ పై సంతోషాశ్రువులు ప్రవాహంలా పారుతుంటే ఎన్నో గేయాలను, స్తుతులను పాడి ఆడుతుంటాడు. ఈ గోసంగి దాసరి ఎండా, వాన, గాలి, ఆకలిని లెక్కచేయడు. భక్తి తారాస్థాయికి చేరుకోగానే ఉధృత తాండవాన్ని మధ్యాహ్నం వరకు ఆడతాడు. అలా చాలా సేపు ఏడుకొండల వాడిని సేవించి, సాష్టాంగ ప్రణామాలు చేస్తాడు. లక్ష్మీ నరసింహస్వామి గర్భగుడిలో కడిగినప్పుడు వచ్చే నీళ్ళు రాతితొట్టి నిండి కాలువగా పారి, గుడి నుండి బయటకు వచ్చే కలక జలాన్ని ఎవడో ఒక శూద్రుడు అందివ్వగా దానిని తీర్థంగా తాగుతాడు. అదే విధంగా ఈ గోసంగి దాసరి ఉన్నత జాతుల వారు కనిపిస్తూనే దూరంగా తొలిగిపోతాడు. ఎండా వానలను లెక్కచేయకుండా ఎంత సేపైనా కానీ స్వామి ప్రసాదాన్ని ఉన్నత జాతుల వారికి పంచే వరకు కాచుకొని ఉంటాడు. ఆ తర్వాత ఎవరైన శూద్ర జాతుల వారు ఇతని ఆటపాటలను మెచ్చి దయతో ఇచ్చే ప్రసాదాన్ని కిన్నెరను సాచి తీసుకొని ఎంతో శ్రద్ధా భక్తులతో భుజిస్తాడు. అలాగే ప్రసాదం ఇచ్చిన వాడు పోసే తీర్థాన్ని తాగుతాడు…ఆలయం బయటి ప్రాకారాన్ని మాత్రమే ప్రదక్షిణం చేసి సాయంత్రం వేళకు తనుండే వెలివాడకు వెళ్తుంటాడు’’ అన్నాడు కొత్తూరు వాసి అక్కడున్న ఒక భక్తునితో.

అది పెరటాసి నెల కొండవిూద పదకొండు రోజుల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలోని శనివారాలు ఎంతో పవిత్రమైనవి. కొత్తూరు వెలివాడ ప్రజలు మాలాడ గుండంలో స్నానాలు చేసి కొండకేసి మొక్కుకొని తమ మొక్కులు తీర్చుకొంటున్నారు. అప్పుడు అక్కడ గోసంగి దాసరి తన సతీమణితో సహా హాజరై అక్కడే వేంకటేశ్వరస్వామిని తలుస్తూ ఆడిపాడాడు. అక్కడున్నవారు ఏదో అసంతృప్తితో ఉన్నారని తెలిసి కారణమడిగాడు.

‘‘గోసంగి దాసరీ! మాలాడగుండంలో వేంకటేశ్వరస్వామి ప్రతిమ లేకపోవడం బాధాకరం. ఏం చేయాలో అర్థం కావడం లేదు. చెక్కిద్దామంటే ఈ గుండంలోకి శిల్పులు రావడం లేదు. ఈ గుండానికి వేంకటేశ్వర స్వామి ప్రతిమ లేకపోవడమే వెలతి’’ అన్నాడు వెలివాడ పినపెద్ద.

పూజలయ్యాక మాలాడగుండం నుండి అందరూ నట్టిళ్ళల్లో తళిగలేయడానికి వెళ్ళిపోయారు. గోసంగి దాసరి భార్య లక్ష్మి కూడా. అందరూ వెళ్ళిపోయాక గోసంగి దాసరి మాలాడ గుండం గట్టు మీద ఉధృతంగా తాండవమాడుతూ ఎన్నో స్తుతులను పాడాడు. అలసిసొలసి అక్కడే వాలిపోయి సొమ్మసిల్లి పోయాడు. గోసంగి దాసరి ఎంతకూ రాకపోయే సరికి లక్ష్మి, వెలివాడలోని కొంతమందిని వెంటబెట్టుకొని అలిపిరికి వెళ్ళింది. అక్కడ గోసంగి దాసరి లేకపోయేసరికి మాలాడ గుండం ఎక్కి చూసేసరికి గోసంగి దాసరి స్పృహలో లేడు. అయితే అక్కడున్నవారు గుండం పైనున్న కొండకు వేంకటేశ్వర స్వామి ప్రతిమ ఉండడాన్ని చూసి అవాక్కయ్యారు. వెంటనే వెలివాడంతా ఈ విషయం పాకిపోయింది. అప్పటికే చీకటి పడింది. అందరూ తండోపతండాలుగా దివిటీలు చేతబట్టుకొని వెంకటేశ్వరుని ప్రతిమను పూలతో అలంకరించి, కొబ్బరికాయలు కొట్టి, హారతులిచ్చి, గోవిందనామ స్మరణం చేశారు. దాంతో దాసరి కళ్ళు తెరచి స్వామిని చూసి తనను తన వారిని కరుణించినందుకు కన్నీరు మున్నీరయ్యాడు. ఆనందభాష్పాలతో స్వామి పాదాలను అభిషేకించాడు. స్వామికి గుండాల వెంకన్న అనే పేరు పెట్టాడు. అప్పుడే కొండమీద గరుడ సేవలో ఊరేగుతున్న స్వామి పెద్ద కాంతి పుంజంతో వెలిగిపోయాడు. ఈ సంఘటనతో గోసంగి దాసరికి గౌరవ మర్యాదలు పెరిగిపోయాయి. ఒకరోజు యథాప్రకారం అలిపిరిలో ఆడిపాడుతున్న గోసంగి దాసరి చుట్టూచేరి భక్తులు మంత్రముగ్ధులై చూస్తున్నారు.

‘‘ఏయ్‌! ఎక్కడి వారక్కడే ఉండండి. కదిలితే నరికి చంపేస్తాం. మేము దారి దోపిడీ దొంగలం. మీ పెళ్ళాం బిడ్డలు ప్రాణాలతో ఉండాలంటే మీ ఒంటి మీదున్న నగలను, మీ చేతిలో ఉన్న డబ్బుల్ని మధ్యలో ఉంచి వెళ్ళండి. లేదంటే…’’ అంటూ కత్తులు, ఈటెలతో విరుచుకుబడ్డారు. దొంగలు మొత్తం పదిమంది వరకుంటారు.

‘‘నేను ఇక్కడ ఉండగా ఎవరినీ ఏవిూ చేయలేరు. భక్తులారా భయపడకండి… నేను మొదట సైనికుడ్ని, ఎన్నో యుద్ధాల్లో మృత్యువుకే భయం చూపించిన వాడ్ని… ఎవరూ దమ్మిడీ పోగొట్టుకోవలసిన పనిలేదు. వీళ్ళ సంగతి నేను చూస్తాను’’ అంటూ దొంగల గుంపు మీద పడి తన దగ్గరున్ను కత్తితో వీరవిహారం చేశాడు. దొంగల్ని ఒక్కొక్కరిని గాయపరచి, ఒకరిద్దర్ని చంపాల్సి వచ్చి చంపాడు. యాత్రికులు చాలా సంతోషించి కానుకలు ఇవ్వజూపారు. గోసంగి దాసరి వాటిని సున్నితంగా తిరస్కరించాడు.

ఈ వార్త స్థానిక ప్రభువుల దృష్టికి వెళ్ళింది. గోసంగి దాసరిని ఎంతో మెచ్చుకొన్నారు. అతనిని అలిపిరికి కాపలాదారుగా శ్రీవారే నియమించుకొన్నాడని భావించారు.

‘‘గోసంగి దాసరి నీ వీరత్వం మరువరానిది. నీ వల్లే యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు. అదే నువ్వు లేకపోయుంటే ఎంత ఘోరం జరిగిపోయుండేదో… నీకు ఇనాంగా కొంత భూమిని ఇస్తాం. సేద్యం చేసుకొంటూ అలిపిరికి కాపలాగా ఉండు’’ అన్నాడు స్థానిక పాలకుడు.

‘‘నాకెందుకయ్యా భూమి, సేద్యం స్వామి వారిని కీర్తించడం కన్నా నాకు మరొకటి అవసరం లేదు. స్వామి భక్తులను రక్షించడం కూడా నా బాధ్యతే. నా ఊపిరున్నంత వరకు స్వామి భక్తులకు ఎలాంటి హాని కలుగనివ్వను’’ అని వారికి నచ్చ చెప్పి పంపేశాడు.

అలిపిరి సంఘటనతో దొంగల ముఠాలన్నీ ఏకమయ్యాయి.  గోసంగి దాసరిని ఎలాగైనా మట్టుబెట్టాలనుకొని సమయం కోసం కాచుకొని ఉన్నారు. అలిపిరిలో జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు దాసరిని చంపితే తమను చూస్తే జనం భయపడతారని భావించారు. ఆ రోజు కొండ మీద ఆణివార ఆస్థానం. భక్తులుపెద్ద సంఖ్యలో అలిపిరికొచ్చారు. యథాలాపంగా కొండను ఎక్కబోయే ముందు గోసంగి దాసరి ఆటపాటలను చూస్తూ మైమరచిపోయారు. ఈ సారి వంద మందికి పైగా వివిధ దొంగల ముఠాలొచ్చాయి. చాట మంత్రం చెప్పే గోసంగి భార్యకు తన భర్తకు ఆపద కలుగుతుందని జోష్యంలో తెలిసింది. వెంటనే అంబుల పొదిని, విల్లును తీసుకొని వీరనారిలా అలిపిరికి వచ్చింది. అదే సమయంలో తన భర్త పై విరుచుకుపడ్తున్న దొంగల ముఠాపై ఎడతెరపి లేకుండా బాణాలను సంధించింది. చాలా మంది దొంగలు నేలకొరిగారు. గోసంగి తన దగ్గరున్న కత్తితో, మరో చేతిలోని చురకత్తితో ఒక్కొక్కరినీ మట్టి కరిపించాడు. భార్యాభర్తల యుద్ధ నైపుణ్యానికి అక్కడున్న భక్తులు నోరెళ్ళబెట్టారు. దొంగలందరూ చచ్చారనుకుంటుండగా ఒక దొంగల ముఠా నాయకుడు భక్తుల మధ్యలో నుండి చాటుమాటుగా వచ్చి లక్ష్మిని కత్తితో పొట్టలో పొడిచాడు. వెంటనే గోసంగి దాసరి వాడి తలను ఖండించాడు. చావుబతుకుల మధ్య ఉన్న లక్ష్మిని పొదివి పట్టుకొని అలిపిరి ముందు లక్ష్మి అంటూ బిగ్గరగా అరుస్తూ రోధిస్తాడు. ఆ అరుపు కొండల్లో ప్రతి ధ్వనిస్తుంది. భక్తులందరూ దుఃఖిస్తారు. పెద్ద వెలుగు అలిపిరినంతా ఆక్రమిస్తుంది. వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షమవుతాడు.

‘‘గోసంగి దాసరీ! నువ్వెక్కడుంటే నేనక్కడే ఉంటాను. నేను వైకుంఠంలో ఉండను. నేను యోగుల హృదయాలలో ఉండను. నా భక్తులు ఎక్కడ గానం చేస్తుంటారో నేను అక్కడే తిష్టవేసుకొని కూర్చుంటాను. నీ శ్రీమతి నిన్ను ఒక కోరిక కోరింది నీతో పాటు వైకుంఠానికి తీసుకెళ్ళమని. ఆమెకు నీ మీద ఎంత నమ్మకమో? నువ్వు ఖచ్ఛితంగా మోక్షం పొందుతావని ఆమె చాట మంత్రంలో తెలుసుకొంది. చాట మంత్రం మీ గోసంగి స్త్రీలకు తప్ప ఎవరికీ తెలియదు. నన్ను ఎన్నో ఏళ్ళుగా నీ ఆటపాటలతో రంజింపజేశావు. నువ్వు కొండకొచ్చి నన్ను చూడాలని ఏనాడూ కోరుకోలేదు. లభించిన పరిమితుల్లోనే నన్ను కొలిచావు… ఆరాధించావు… నా భక్తుల్ని కంటికి రెప్పలా కాపాడావు… నా దివ్య మంగళ రూపాన్ని ఇక్కడున్న వారిలో నీకు, నీ భార్యకే దర్శించే యోగం కల్పిస్తున్నాను. ఇక్కడున్న వాళ్ళందరికీ ఇక్కడేమి జరుగుతుందో తెలియదు. అందరి దృష్టినీ కట్టిపడేశాను. నా దర్శన భాగ్యంతో నువ్వు నీ భార్య, ఇప్పుడే వచ్చిన నీ బావ, అక్కలకు కూడా మోక్షం ప్రసాదిస్తున్నాను’’ అన్నాడు వేంకటేశ్వరస్వామి.

‘‘ధన్యోస్మి ఈ జన్మకు ఇంతకన్నా ఏమి కావాలి’’ అంటూ గోసంగి దాసరి స్వామి వారికి కత్తిని పక్కన బెట్టి సాష్టాంగ నమస్కారం చేశాడు.

‘‘గోసంగి దాసరీ! నువ్వు ఇక్కడే ఇలాగే శిలగా మారుతావు…అలిపిరి మొదటి మెట్టు ముందు నిన్ను దర్శించే నా భక్తులు కొండెక్కుతారు. నీలాంటి భక్తులే నాకు ఎనలేని కీర్తిని తెస్తారు’’ అంటూ స్వామి అంతర్ధానమవుతాడు. ఇప్పటికీ గోసంగి దాసరిని అలిపిరిలో మాల దాసరిగా చెప్పుకొంటారు.

*

పేట శ్రీనివాసులు రెడ్డి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చల్లా శ్రీరామచంద్రమూర్తి కాశీ హిందూ విశ్వవిద్యాలయం says:

    తెలుగు భక్తులు,మీరు ప్రత్యేకంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుల కథలు రాయడం పేటాశ్రీ గారు సిద్ధహస్తులు.వారి కథలెన్నో చదివాను.సరళశైలిలో తెలుగు వారందరికీ ఆయా భక్తులను గుర్తు చేయాలనే తపన శ్రీనివాస రెడ్డి గారిది.మంచి మనిషి ఆచార్య పేటాశ్రీ గారికి ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు నమస్సుమాంజలి

  • నమస్కారములు

    ” అలిపిరి గోసంగి దాసరి ” కథ
    అద్భుతమైన కథ… శ్రీ కృష్ణదేవరాయల ఆముక్తమాల్యద లోని మాలదాసరి కథ మదిలో మెదిలింది.

    కథాకథనం హృదయాన్ని తంబూరా చేస్తూ రాగాలు మీటినట్లు వాక్యాలు వాక్యాలుగా భక్తిభావలయలు సరిగమలై…… మోక్షరసపదవీ భక్తిమార్గం లో

    ” దేశి” పద్ధతిలో భక్తి తక్కువదేమీ కాదని పాల్కురికి సోమనాథుని బసవపురాణంలో ప్రబల చారిత్రక సాక్ష్యాలు కవిత్వీకరింపబడినవి.

    నేటి పరిశోధక ఆచార్య వర్గంలో ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి సర్ ది పెద్దపీట పేరే. వారికి నా శుభాకాంక్షలు నమస్కారములు
    *— గురిజాల రామశేషయ్య*

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు