అలా వచ్చి, ఇలా వెళ్ళిపోయిన కిషోర్!

నాకు తెలుగు సంగీత, నాటక, సాహిత్య, కళా రంగాలలోకి ప్రత్యక్ష పరిచయం చేసిన ఆ నలుగురిలో కిషోర్ ప్రత్యేకత కిషోర్ దే!

1966 నుంచి మూడేళ్ళు నేను బొంబాయి ఐ.ఐ.టి. హాస్టల్ 1….పోస్ట్ గ్రాడ్యుయేట్స్ హాస్టల్ లో ఉన్నప్పుడు ఒక పది మంది తెలుగు మూక కల కలలాడుతూ ఉండేది. అందరిలోకీ తల్లాప్రగడ పూర్ణ చంద్ర కిషోర్ ఒకడే రచయిత. అతను వ్రాసిన రిహార్సల్స్ అనే నాటిక లో నేను నా జన్మలో మొట్టమొదటి సారి నటుడిగా వేదిక ఎక్కాను. ఆ తరువాత ఇద్దరం కలిసి “యమ సభ” అనే నాటకం వ్రాశాం. ఎస్వీరంగారావు, సావిత్రి,  ముళ్ళపూడి వారి అప్పుల అప్పారావు..వీళ్ళందరూ భూలోకంలో చనిపోయాక యమలోకానికి వెళ్లి అక్కడ యముడినీ, చిత్రగుప్తుడినీ నరక యాతన పెట్టి స్వర్గానికి వెళ్ళడం ఆ నాటకం థీమ్. కిషోర్ కీచకుడుగా రంగారావు పాత్ర వేశాడు. నేను “ఓ ఫైవుందా?” అని ప్రేక్షకులలో అందరినీ అడుగుతూ అప్పారావు వేషంలో రంగప్రవేశం చేస్తాను.   చందూ దర్శకత్వం.

చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే ఇందులో యమ ధర్మరాజు వేషం కిషోర్ అన్నయ్య మోహన్, సావిత్రి వేషం అతని భార్య సుబ్బలక్ష్మి వేశారు. అప్పటి నుంచీ ఆ దంపతులతో నాది జీవిత కాల అనుబంధం. ఆ రోజుల్లోనే పరిచయం అయిన డా. బి. తిరుమల రావు పూనా లో నేషనల్  ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో డాక్టరేట్ చేసిన మేధావి. అంతటి వాడు ఉద్యోగం వెతుక్కుంటూ ఐ.ఐ.టి కి వచ్చి, అక్కడ మెటలర్జికల్ డిపార్ట్మెంట్ లో చేరి అంచెలంచెలు గా ప్రొఫెసర్ స్థాయికి ఎదిగి, నేను ఇప్పటికీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు కలుసుకునే మరొక ఆత్మీయ మిత్రుడు. మేము ఏదో తెలుగు సాంస్కృతిక కార్యక్రమం పెడదాం అని ఆలోచిస్తున్నాం అని తెలిసి ఆయన మా రూమ్ కి వచ్చి “నాకు పాడడం వచ్చును” అన్నారు.

అప్పటి వరకూ ఆయన్ని మేము ఎప్పుడూ చూడ లేదు కాబట్టి “నిజంగా పాడతారా?” అని అనగానే “ఏం పాడి వినిపించమంటారా?” అన్నాడు కొంచెం కోపంగా. వెంటనే ఓ ఘంటసాల పాట బాగానే పాడాడు. ఆసలు ఆ రోజుల్లో ఎవరు పాడినా ఘంటసాల పాటలే కదా!. అంతకంటే ముఖ్యంగా నాలుగు ఘంటసాల పద్యాలు సరిగ్గా ఆయన బాణీ లోనే పాడే సరికి మేము భలే ముచ్చట పడిపోయాం. ఎందుకంటే మా పి.ఆర్.కె. రావు గొంతుక కొంచెం పీలగా ఉండి బాగా తక్కువ శ్రుతిలో ఉన్న ఘంటసాల పాటలు కొన్ని బాగా పాడ గలిగే వాడు. ఇక హిందీ పాటలు, తలత్, రఫీ గజల్స్ చాలా బాగా పాడే వాడు. కానీ అందరం ఘంటసాల అభిమానులమే కాబట్టి అత్యంత మిత భాషి అయిన తిరుమల రావు గారు మాతో మొదలుపెట్టి తర్వాత ముఫై ఏళ్ళపాటు ఐ ఐ టి కి తెలుగు మా ఆస్థాన గాయకుడు అయిపోయాడు.

దుర్యోధనుడు

ఇక పవయ్ లో …అంటే బొంబాయిలో మా ఐ ఐ టి ఉన్న ప్రాంతం…లో మేము ఇలా ఉధృతంగా నాటకాలు వేస్తున్నాం అని తెలియగానే ఒక సారి బొంబాయి అంధ్ర మహా సభ నుంచి “మరో మొహంజదారో” నాటకం వేద్దాం అని ఆచారి అనే ఆయన మాకు కబురు పెట్టారు. అందులో కిషోర్ హీరో, నేను లాయర్ పాత్ర. ఎన్.ఆర్. నంది గారి చాలా సంచలనాత్మకమైన ఆ నాటకం వెయ్యడం ఆ రోజుల్లో నాటక రాయుళ్ళకి చాలా కష్టమైన, ఇష్టమైన పని. ఆ నాటిక ప్రదర్శన తోటే స్వర్గీయ చాట్ల శ్రీరాములు గారు పాశ్చాత్య, ప్రాచ్య నాట్య పోకడలను తెలుగు రంగస్థలానికి పరిచయం చేసి గొప్ప ప్రయోక్త గా పేరు తెచ్చుకున్నారు. దానికి ఆచారి దర్శకుడు, ఒక ముఖ్య పాత్ర కూడా వేశాడు. అతను సాక్షి రంగారావు బాణీ నటుడు. అన్నింటికీ నటులు కుదిరారు కానీ బొంబాయి మొత్తం మీద ఆ నాటకంలో నటించడానికి హీరోయిన్ పాత్రకి నటీమణులు లేరు. మొత్తానికి నానా అవస్తా పడి “నాళం” వారి అమ్మాయిని ఒప్పించాడు ఆచారి.

అనకూడదు కానీ ఆ అమ్మాయి అంత అందగత్తె కాదు. కానీ ఈ నాటకంలో హీరో కిషోర్ గాడు హీరోయిన్ చెయ్యి పట్టుకుని ఆకాశంలో చంద్రుడిని చూస్తూ “పద తులసీ (?), ఈ ధూర్త లోకం నుంచి ఇద్దరం కలిసి దూరం గా పారిపోదాం”…లాంటి ఎంతో ప్రేమ, ఉద్వేగం గా చెప్పే పొడుగాటి డైలాగ్ ఒకటి ఉంది. కానీ కిషోర్ ఎంత ప్రయత్నించినా ఆ ప్రేమ భావం మొహంలోకి వచ్చేది కాదు. శుద్ద బ్లాంక్ మొహంతో చెప్పేవాడు. నేను వాడిని పక్కకి పిలిచి “ఏమిట్రా వెధవాయ్. నీ మొహం చూస్తుంటే ఆ అమ్మాయి రియాక్షన్ కూడా దారుణంగా ఉంది. కాస్త ప్రేమ నటించు” అని క్లాస్ పీకాను. దానికి వాడు వెర్రి మొహం పెట్టి “ఎలా గురూ?. ఆ అమ్మాయి మొహం చూస్తూ, చూస్తూ ప్రేమ డైలాగ్ చెప్పడం ఎన్నార్ కీ, ఎన్టీఅర్ కీ కూడా అసాధ్యం” అని భోరుమన్నాడు. “సరేలే. నా సంగతి చూడు. మరో మూడు సీన్లు తర్వాత నా లాయర్ పాత్ర, మరో ఇద్దరం కలిసి ఆ అమ్మాయి మీద అత్యాచారం చెయ్యాలి. ఉత్తినే చెయ్యి పట్టుకున్నట్టు నటిస్తూ వెధవ డైలాగ్ చెప్పడానికే నువ్వు ఇంత ఇది అయిపోతే మరి మా సంగతో?” అని వాడిని దారి మళ్ళించి సరి అయిన దారికి తెచ్చాను. యాభై ఏళ్ల తర్వాత ఇప్పుడు తలచుకుంటే ఎంత సిగ్గుగా ఉందో అంత నవ్వు కూడా వస్తోంది. మరొక తమాషా జ్ఞాపకం ఏమిటంటే ఆచారి ఆ పాత్రలో (పాత్ర పేరు శంకరయ్య అని గుర్తు) లీనమై పోయి అలా నటించుకుంటూ పోయి, పోయి సైడ్ వింగ్ లోంచి నేల మీద పడిపోయి లేవ లేక పోయాడు. మిగిలిన పాత్రలన్నీ స్టేజ్ మీదే ఉండడం తో ఏమయిందో తెలియక భలే గొడవ అయిపోయింది.

కిషోర్

ఆంధ్ర మహాసభలో ఈ నాటకం వెయ్యడానికి స్వర్గీయ సోమంచి యజ్ఞన్నశాస్త్రి గారు చాలా సహాయం చేశారు. ఆ మాట కొస్తే ఆ రోజుల్లో బొంబాయి లో తెలుగు వారి ఉనికి చాటుకోడానికి ప్రధాన కారణం సోమంచి వారే. ఆయన బొంబాయి మ్యునిసిపల్ కార్పోరేషన్ డెప్యూటీ కమీషనర్ గా ఉండే వారు. చాలా మంచి రచయిత. ఆయన వ్రాసిన “పేరయ్య రాజంట” నాటకం చాలా పేరున్న నాటకం. అందులో ఒక సారి నేను చాకలి పేరి గాడి పాత్ర వేశాను..అంటే ప్రతాప రుద్రుడి ని డిల్లీ సుల్తాన్ పట్టుకుపోయినప్పుడు ఆయన మంత్రి యుగంధర్ రాజు గారి స్థానంలో సింహాసనం మీద రాజు గారి పోలికలో ఉన్న చాకలి వాడిని కూచో బెట్టి పరిపాలన పాత్ర. సోమంచి వారే బొంబాయి మాటుంగాలో రెండు, మూడు ఎకరాల స్థలాన్ని బొంబాయి ఆంధ్ర మహా సభ వారికి కేటాయించి, అక్కడ ఒక చిన్న రంగ స్థలం, ఐదారు గదులతో చిన్న భవనం కట్టించడంలో ప్రధాన పాత్ర వహించారు. ఆయనతో పరిచయం కలగడం నా అదృష్టమే!

మరో మొహంజొదారో బొంబాయి ఆంధ్ర మహా సభలో విజయవంతంగా వేశాక పూనా తెలుగు సంఘం వాళ్ళు కూడా మమ్మల్ని పిలిచారు. అక్కడ ఆ నాటకం ప్రపంచ ప్రఖ్యాత “బాల గంధర్వ ఆడిటోరియం” లో ప్రదర్శించడం నిజంగా నా అదృష్టమే.! మా డ్రామా ముఠా అందరితోటీ తిరుమల రావు గారు కూడా మాతో పూనా వచ్చి సహాయం చేశారు.

ఇక మరో మొహంజొదారో డ్రామా వలన ప్రొఫెసర్ పాత్ర వేసిన కస్తూరి చలపతి రావు, జమీందార్ పాత్ర వేసిన MBBSR శర్మ అనే అతను అప్పటి మంచి పరిచయాలు. అయినా గత నలభై ఐదేళ్లలో వాళ్ళని కానీ, ఆచారిని కానీ నేను మళ్ళీ చూడ లేదు. అదీ జీవితం అంటే!

కస్తూరి చలపతి రావు కె. విశ్వనాథ్ గారి దగ్గర రెండు, మూడు సినిమాలలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ప్రతిభావంతుడు. అప్పుడే “యువ” మాస పత్రిక బాణీ లో బొంబాయి నుంచి “రవళి” అనే పత్రిక మొదలు పెట్టాడు. అప్పటికి నేను ఇంకా రచనా వ్యాసంగంలో అడుగు పెట్ట లేదు. అంచేత నేను అందులో ఏమీ వ్రాయ లేదు కానీ పత్రిక రూప కల్పనలో సహాయం చేసేవాడిని. ఆ నాటకం ద్వారానే MBBSR శర్మ అనే నటుడు పరిచయం అయ్యాడు. అతని భార్య మా కాకినాడ అమ్మాయే. అతని గొంతుక చాలా బావుండేది. ఆ రోజుల్లో తలనొప్పి కి ఏస్ప్రో మాత్రకి పోటీగా పవరిన్ అనే కొత్త మాత్ర వచ్చింది. ఆ మాత్రకి సినిమాలలో కమర్షియల్ ప్రకటనలకి అతని మంచి విగ్రహం, గొంతుక నచ్చి ఆ కంపెనీ వాళ్ళు అతడినీ, నన్నూ పిలిచారు. బొంబాయి లో ఒక స్టూడియో లో షూటింగ్ చేశాం. అతను ప్రధాన పాత్ర. నాది రెండో ది. అంతా అయ్యాక మా ఇద్దరికీ కలిపి 120 రూపాయలు ఇచ్చారు. మేం మా అదృష్టానికి ఎగిరి గంతులేసుకుంటూ, బొంబాయి లోకల్ రైలు ఎక్కగానే మా ఖర్మ కాలిపోయి అతని జేబు కొట్టేశారు. దాంతో అంత డబ్బూ, గోవిందా, గోవింద. ఆ తరువాత అతను ఆ కమర్షియల్స్ చాలానే చేశాడు అని విన్నాను కానీ చదువులో పడ్డ నాకు ఆ యోగం పట్ట లేదు.

కిషోర్ వ్రాసిన మరొక మంచి నాటకం మడుగులో దాక్కుని అంతర్మధనం చేసుకుంటున్న దుర్యోధనుడు. ఇందులో నలుగురు దుర్యోధనులు ఉంటారు. అసూయ, రాజసం, పౌరుషం ఒక్కొక్కరు గా దుర్యోధనుడి వ్యక్తిత్వాన్ని, జరిగిన సంఘటనలనీ నాటకీయంగా అభినయిస్తారు. ఇందులో అసలు దుర్యోధనుడిగా కిషోర్, అసూయ, రాజసం, పౌరుషం, దుర్యోధనులుగా మూర్తి, చందూ, ఎమ్. విశ్వేశ్వర రావు వేయగా సాంకేతికంగా ఎంతో ఉన్నత స్థాయిలో కావలసిన లైటింగ్, సౌండ్, వెనకాల మ్యూజిక్ వగైరాలు అన్నీ నేను చేశాను. ఆ విధంగా ఆయా విద్యలు నేర్చుకునే అవకాశం కలిగింది.

మేము ఐ ఐ టి లో చేరిన రెండు, మూడు సంవత్సరాల దాకా మా ముగ్గురు బ్రహ్మచారులకీ బొంబాయిలో తెలుగు పెళ్లి కూతుళ్ళ సంబంధాలు  ముఖ్యంగా బొంబాయి నగర ప్రముఖులైన ముక్కవల్లి వెంకటేశ్వర్లు గారి ద్వారా వస్తూ ఉండేవి. కానీ అవేమీ ఎవరికీ అతక లేదు. ఈ సందర్భంగా చెప్పుకోదగిన అమ్మాయి కేంపస్ లో ఉండే సర్వ మంగళ. చాలా చక్కటిది. లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం బాగా పాడేది. అక్కడే కెమిస్ట్రీ లో మాస్టర్స్ డిగ్రీ చదువుతూ ఉండేది. ఆ అమ్మాయి ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో గురునాధం గారు అనే ఆయన చెల్లెలు. ఆయన మంచి తెలుగు కవి, పండితుడు. నాకు కేంపస్ లో సుమారు ఆరేడు సంవత్సరాలు చిరు పరిచయం ఉన్న ఆ నాటి సర్వ మంగళ తర్వాత పెళ్లి చేసుకుని అమెరికా వచ్చాక కూడా తనూ, భర్త ఆంజనేయులు గారు, ఈ నాటికీ నాకూ, మా ఆవిడకీ ఇక్కడ మాకున్న చాలా సన్నిహితులైన కుటుంబ స్నేహితులు.

ఇక ఏ సంవత్సరమో గుర్తు లేదు కానీ ఒక రోజు మా పి.ఆర్.కె. రావు వచ్చి చాలా యాదాలాపంగా “మన పెళ్లి కుదిరింది. మద్రాసులో…నువ్వు వస్తే బావుంటుంది” అన్నాడు. ఆ మాట విని కాస్త ఆశ్చర్య పోయినా అతను పెళ్ళాడేది తన అక్కయ్య గారి అమ్మాయినే అని తెలిసి సంతోషించాం. రావు పెద్దక్క గారి కూతురైన ఆ అమ్మాయిని మరో అక్కగారైన గాయని పి. సుశీల గారు కూతురులా పెంచుకున్నారు. రావు పెళ్లి మద్రాసులో సుశీల గారి ఇంట్లోనే జరిగింది. బొంబాయి నుంచి నేనూ, కిశోరూ రావు పెళ్ళికి మద్రాసు వెళ్లాం. ఇంట్లో సంబంధమే కాబట్టి పెళ్ళికి వచ్చిన వారు అందరూ దగ్గర బంధువులే. ఆ మాట కొస్తే “మగ పెళ్లి వారి” తరఫున పై వాళ్ళం నేనూ, కిషోర్. ఇద్దరమే. చెప్పొద్దూ, మేం ఇద్దరం సుశీల గారి ఇంట్లో రావు పెళ్ళిలో భయం, భయంగానే ఉన్నాం ఆ రెండు రోజులూనూ. పెళ్లి కి సినిమా రంగం వాళ్ళు ఎవరూ రాలేదు కానీ సుశీల భర్త డా. మోహన రావు గారు మంచి స్నేహితులు అయ్యారు. ఆయన ఆ తరువాత అమెరికా వచ్చినప్పుడల్లా పలకరించే వారు. 1968 లో మాస్టర్స్ డిగ్రీ అయ్యాక రావు హైదరాబాద్ లో ఉస్మానియా లో లెక్చరర్ గా చేరాడు అని జ్ఞాపకం.

కిషోర్ పెళ్ళిలో నేను, మూర్తి, రావు,

1967 లోనో 68 లోనో కిషోర్ జియాలజీ లో ….అంటే రాళ్ళు, రప్పల శాస్త్రం అని వేళాకోళం చేస్తే వాళ్ళం-  మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాక, మేము ఎవరూ ఊహించని విధంగా హైదరాబాద్ లో బయోలాజికల్ ఇవాన్స్ అనే కంపెనీలో చదివిన చదువుకి ఎక్కడా సంబంధ లేని మెడికల్ రిప్రజెంటేటివ్ గా ఉద్యోగంలో చేరాడు. కానీ అతని అన్నయ్య మోహన్ ఐ ఐ టి లోనే మెటలర్జికల్ డిపార్ట్ మెంట్ లోనే ఉండే వాడు కాబట్టి అతని సంగతులు, ఉద్యోగంలో పురోగతి తెలుస్తూనే ఉండేవి. 1972 లో అనుకుంటాను. కిషోర్ పెళ్లి అయింది. ఎక్కడో హైదారాబాద్ దగ్గర చిన్న ఊరు అనే జ్ఞాపకం.  బొంబాయి నుంచి నేనూ, మూర్తీ, హైదరాబాద్ నుంచి రావూ, అతని మేనల్లుడు దాసూ కిషోర్ పెళ్ళికి వెళ్లాం. దాసు అంటే ఎవరో కాదు. సినీ నేపధ్య గానం లో తరువాత దశకంలో కొన్ని వేల పాటలు పాడి ఎంతో పేరు తెచ్చుకున్న  వి. రామకృష్ణ. అప్పటికి ఇంకా పదహారు, పది హేడు ఏళ్ళు ఉంటాయి. అప్పటికీ ఘంటసాల బాణీలో పాటలు బాగా పాడడం నేర్చుకున్నాడు. పి.సుశీల కి అక్కయ్య, రత్తక్కయ్య అని పిలిచే వారు – కొడుకు. కిషోర్ పెళ్ళిలో అతని చేత చాలా పాటలు పాడించుకున్నాం. మా ఇద్దరికీ చాలా దగ్గర స్నేహం కుదిరి, నన్ను “మామా” అని పిలవడం మొదలుపెట్టాడు. రామకృష్ణ దాసు తో  స్నేహం 2015 లో అతని ఆకస్మిక మరణం దాకా కొనసాగింది.

ఇక ఆఖరి అంశంగా..

నేను 1974 లో అమెరికా వస్తున్నప్పుడు కిషోర్ నన్ను దిగపెట్టడానికి బొంబాయి వచ్చాడు. ఆ తరవాత నేను హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళినా కిషోర్ ని చూసే వాడిని. అతను ఉద్యోగంలో బాగా ఎదిగి చాలా సంపాదించడం మొదలు పెట్టి “నా బేంక్ లో ఎనిమిది లక్షలు ఉన్నాయి. అమెరికా వెళ్లావుగా నువ్వెంత సంపాదించావ్?” అనే వాడు. బోట్ క్లబ్ కీ, ఇతర ఖరీదైన చోట్లకీ గర్వంగా తీసుకెళ్ళే వాడు. కానీ అతని ఇంటికి వెళ్ళగానే అతని నాన్న గారు గోపాల కృష్ణ గారు, తల్లి కామేశ్వరమ్మ గారు నన్ను చూడగానే ఆప్యాయంగా కావిలించుకుని ”వీడిని నువ్వే మార్చ గలవు, రాజూ” అంటూ కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకునే వారు. ఎందుకంటే కిషోర్ కి మద్య పానం, సిగరెట్లు అలవాటు నుంచి పూర్తి వ్యసనంగా మారి ఆరోగ్యం దెబ్బ తినడం మొదలయింది. కళా తృష్ణ బాగా తగ్గింది. నేను అతడిని ఆఖరి సారి చూసినప్పుడు భార్య, ఆరేడేళ్ళ కొడుకు, మూడు, నాలుగేళ్ల కూతురు తో  తల్లిదండ్రులని చూసుకుంటూ బాగానే ఉన్నాడు.

నా కంటే సరిగ్గా రెండు నెలలు ముందు పుట్టిన తల్లాప్రగడ పూర్ణ చంద్ర కిషోర్, సహస్ర పూర్ణ చంద్ర దర్శనాలకి సగం కంటే ముందే తన 43వ ఏట, ఏప్రిల్ 1, 1988 హైదరాబాద్ లో స్వంత ఇంట్లో మేడ మీద నుంచి దిగుతూ, తల్లిదండ్రులు, కుటుంబం కళ్ళ ముందే మెట్ల మీద నించి పడి ప్రాణం వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు.

నాకు తెలుగు సంగీత, నాటక, సాహిత్య, కళా రంగాలలోకి ప్రత్యక్ష పరిచయం చేసిన ఆ నలుగురిలో కిషోర్ ప్రత్యేకత కిషోర్ దే!…..కొన్నేళ్ళు పరిమళించి అందని చోటికి అలా వెళ్లి పోయాడు ..పూర్తిగా వికసించకుండానే!

వంగూరి చిట్టెన్ రాజు

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఏమిటో ఈ స్నేహాలు ఈ జీవితాలు అనిపించింది అంతా చదివాక…
    వైరాగ్యం లాటి ఫీలింగ్.

    • అంతే కదా!
      మీ స్పందనకి ధన్యవాదాలు.

  • హాయ్ రాజు,

    నాకు కిశోరె సంగతులు ఏమి తెలియవు. కానీ నువ్వు అతనికి చాల దగ్గర స్నేహితువుడు అని తెలుసు. ఇప్పుడు ఇంకా చాలా విషయాలు మరియు కిశోరె రచయిత అనే సంగతి నీ ద్వారా నే తెలిసింది. చాల బాగా రాసావు. జ్ఞాపకాల వీధి లోకి తీసుకొని వెళ్ళావు. ఆ రోజులే వేరు. తలచు కొంటె తమాషాగా ఉంటుంది. నిన్ను గిరిజని కలవడం కూడా ఇంకొక విచిత్రము. ఈ స్టోరీ పంపిచినందుకు చాల సంతోషము.

    సర్వమంగళ

    • నువ్వు చదివి ఇంత త్వరగా స్పందించినందుకు చాలా సంతోషం, సర్వమంగళా. నువ్వు కేంపస్ కి వచ్చేటప్పటికి బహుశా కిషోర్ హైదరాబాద్ వెళ్ళిపోయి ఉంటాడు. ఈ ఐటీ పరంపరలో ఇది వరకూ నేను వ్రాసినవి, ఇక ముందు రాసేవీ కూడా చదువు. అన్నీ మంచి జ్ఞాపకాలే….

  • చాలా ఆసక్తికరంగా సాగిన పోస్టు , ఒక్కసారి మనసు బరువెక్కించింది. చదువుతోపాటూ కళారంగంలో, సాహిత్యరంగంలో, నాటకరంగంలో మీదయిన ముద్రవేస్తూ మీతరం సర్వతోముఖంగా సాగించిన ప్రయాణం చాలా బాగా రాసారండి

    • ధన్యవాదాలు, శశికళ గారూ

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు