అలా, ఆ ఏకాంత వాసంలో కథ మొదలైంది!

వరి కథ సంగతి వాళ్ళు చెప్పుకుంటే బాగోదు. కానీ, ఇవాళా రేపూ ప్రతి ఒకరూ రాత పనిలో ఆరితేరి, ఫేస్ బుక్, ట్విట్టర్, బ్లాగ్, ఇలా ఎక్కడో ఒకచోట ఏదో ఒకటి రాస్తూ హడావిడిగా వుండటం వల్ల, పక్క వాళ్ళ కథలూ, రాతలూ పట్టించుకొని రివ్యూ రాసే తీరిక, ఆసక్తి తక్కువ. ఇంచుమించు నేను కూడా అదే గుంపులో సభ్యురాలిని అనేది ఈ సందర్భంగా సిగ్గు పడకుండా ఒప్పుకోదగిన విషయం. లిటరసీ రేటు ఇబ్బడి ముబ్బడిగా పెరగటం, సమాజానికి ఎలాంటి మేలు చేస్తుందో తెలీదు కానీ, ఇదిగో నాలాంటి వాళ్లకి, స్వంతానికి నా కథని నేనే విశ్లేషించుకునే ప్రమాదానికి నెట్టింది. పోనీ, చాట్ జిపిటీ సహాయం తీసుకుందాం అంటే, తెలుగు కథకి నేను ఎనాలిసిస్ రాయను పొమ్మంది. కాబట్టి, తప్పదు, నేనే రాసుకోవాలి!

కథ రాసిన తరవాత, సంతోషం, ధైర్యం కలిగితే ఆ కథ బాగున్నట్టే. తప్పకుండా ఈ కథ పత్రికలో వేస్తారు అని మనసుకి రాయంగానే తెలుస్తుంది. అలా నాకు తెలిసిపోయిన కథ, ‘తెరవు’. టైటిల్ ఇంకోటి అనుకుంటే బావుంటుంది అని ఎడిటర్ గారు చెప్పినా నేను మొండిగా ‘తెరవు’కి ఫిక్స్ అయ్యాను. బతుకు తెరవు అంటే అదేదో పాత సినిమా టైటిల్ లాగా వుంటుంది. అదే, తెరవు అంటే సూక్ష్మంగా బాగుంటుంది అనిపించింది. బ్రివిటి మేధావుల ఆత్మ అన్నాడు కదా షేక్స్పియర్. మేధావి సంగతి ఎందుకు కానీ, సూక్ష్మత దాకా ప్రయత్నం చేద్దాం.

తెరవు కథని శింజిని వారు youtube లో విశ్లేషణ చేశారు. నేను కూడా, స్నేహితులు చెబితే, లింక్ ద్వారా విన్నాను. చాలా చక్కని విశ్లేషణ చేస్తూ, protagonist జగదీశ్వరిని ఉదాత్తమైన పాత్రగా చెప్పారు. నేను ఆ కామెంట్ కి కొంత ఆశ్చర్య పోయాను.

మిగతా దేశాల సంగతి నాకు తెలీదు. తెలుగు ప్రాంతంలో మాత్రం కరోనా దిగువ, మధ్య తరగతి జీవితాలను ప్రమాదంలోకి నెట్టి వేసింది. స్కూల్స్ మూసివెయ్యడం వల్ల, ముఖ్యంగా  ప్రైవేట్ స్కూల్ టీచర్లు రోడ్డున పడ్డారు. తేనే, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు అమ్మిన వాళ్ళు, కూలి పనులకు వెళ్ళిన వాళ్ళు ఎంతమందో.

మేం టీచర్లు కావడం వల్ల,  ఇలాంటి వార్తలు వింటూ సానుభూతిగా అయ్యయ్యో అనుకున్నాం. 

ఏప్రిల్ చివర్లో,  పూట పూటకీ, మాచవరంలో ప్రతి సందులో శవ యాత్రలు కనబడేవి. ఏ పక్కనించి కరోనా కబళిస్తుందో అని భయపడిపోయి, ఇంకా జనాలు ఒక్కళ్ళు కూడా చేరని నలభై పోర్షన్ల అపార్ట్ మెంట్ లోకి మేం షిఫ్ట్ అయ్యాం. నలభై ఖాళీ పోర్షన్ల మధ్య ఒక్కళ్ళమే, కొన్ని నెలలు గడిపాం. ప్లేగు ముంచుకు వస్తే, పాత రోజుల్లో అలా ఊరు వదిలేసి, ఏకాంతంగా ఉంటూ కథలు చెప్పుకునే వారు అని మనకి అందుబాటులో వున్న సాహిత్యం ద్వారా తెలుస్తోంది. ఏదో వరల్డ్ ఫేమస్ బుక్ కూడా ఉండాలి, పేరు గుర్తు రావడం లేదు. అలా, ఆ ఏకాంత వాసంలో తెరవు కథ మొదలు అయింది.

కరోనా క్రమంగా నెమ్మదించిన తరువాత, కొత్త మెయిడ్ కోసం వెతికాను. ఒకామె వచ్చింది. అంట్లు తోమడానికి ఐదు వేలు జీతం అడిగింది. నా స్థాయికి ఆ అంకె కొత్తగా అనిపించింది. నువ్వు అడగటం తప్పు లేదు కానీ, నేను అంత ఇవ్వలేను అని పంపించి వేశాను. మర్నాడు వచ్చి, రెండున్నర వెయ్యి ఇవ్వండి చాలు అంది. 

పని దొరకడమే మహద్భాగ్యం అనే రోజులు. ఐదు వేలు కాస్తా, తెల్లారేసరికి రెండున్నర అయ్యింది. ఈ కథకి స్పూర్తి ఇచ్చిన సంఘటన అదే. రాస్తూ, రాస్తూ, గంగ చద్రముఖిగా మారిపోయినట్లు, నేను జగదీశ్వరి లోకి పరకాయ ప్రవేశం చేశాను. కథలో నేను అమెరికా ప్రవాస పౌరుల్ని గురించి తప్పుగా రాశానని, వాళ్ళమీద అక్కసు చూబించా అని విమర్శ వచ్చింది. అయితే, ఒక సాధారణ మధ్య తరగతి స్త్రీ, పైగా వుద్యోగం పోగొట్టుకున్న మహిళ, విమానం ఎక్కి అమెరికా వెళ్లి పెద్ద ఇంట్లో సౌకర్యంగా బతికే అమెరికా వాళ్ళ మీద అక్కర కాదు, అక్కసే కలిగి వుంటుంది. ఇందులో తప్పూ లేదు, ఒప్పూ లేదు. అది అంతే. దాన్ని అలానే చూబించాలి అనుకున్నా. ఇంకా, ఈ కథ డిగ్నిటీ అఫ్ లేబర్ గురించి చెప్పింది అన్నారు. రాజేశ్వరికి డిగ్నిటీ అఫ్ లేబర్ సిద్దాంతం తెలీదు. ఆ మాటకి వస్తే, భారత దేశంలో పనిని గౌరవించే మైండ్సెట్ తక్కువే. హోదాలకే మన్నన వుంది, ఇవాళ కూడా. కథ టోన్ లో కూడా డిగ్నిటీ వగైరా ఏవీ లేవు. ఉత్త అవసరం. అవకాశం దొరికింది. న్యాయంగా సుప్రియకి రావలసిన ఉద్యోగాన్ని కాజేసింది. కరోనాలో బిఎడ్ సర్టిఫికేట్ కన్నా, సర్టిఫికేట్ అవసరం లేని కూలి పనికే డిమాండ్ ఉండింది మరి.

కథ ఇలా రాయాలి అనుకుని ఆ పరిధిలో రాసేవాళ్ళు కొందరు వుంటారు. కానీ, నేను మాత్రం ఏదో ఒకటి రాస్తూ కథతో పాటు వెళ్లిపోతాను. అలాపోతూ వుంటే, ఆ వుద్యోగం ఏదో నాకే ఇప్పించకూడదా అని రాజేశ్వరి బతిమలాడింది. డిగ్నిటీ అఫ్ లేబర్ కాదండీ బాబూ, అవసరం. ఒక సాధారణ స్త్రీని కన్నింగ్ ఫెలో గా మార్చేసింది. మళ్ళీ చివర్లో దానికి దేవుడు కూడా మద్దతు ఇస్తే బాగుంటుంది అని శివుడూ, పార్వతీ  దగ్గర కొబ్బరికాయ లంచం ఇచ్చి దణ్ణం కూడా పెట్టుకుంది, ‘స్వీపర్ పని టీచరమ్మ కాజేసింది అని సుప్రియాకి తెలీకుండా నువ్వు చూసుకో దేవుడా’అని.

నేను రాసిన కథల్లో, నాకు నచ్చిన ఒక మహా విషాదాంతపు కథ, తెరవు. 

( ఈ కథ,  12 సెప్టెంబర్ 2021  ఆదివారం ఆంధ్ర జ్యోతి లో పబ్లిష్ అయింది)

 

తెరవు

“నాన్నా,  ఇబాకో” పొద్దుటినుంచి పిల్ల ఐస్క్రీం కోసం ఒకటే గోల

“ఆర్డర్స్ తీసుకుని ఇచ్చి రావడమే నాపని.  అవ్వన్నీ ఇంటికి తేవడం కుదరదు”అంటాడు నెల్లాళ్ళ కిందట జొమాటోలో చేరిన మాఆయన.

“కరోనా కదా.  బైటివి తినకూడదు.  సాయంత్రం నేను చేసి ఇస్తాగా”బుజ్జగించాలి అని చూస్తాను నేను.  పది రూపాయల రియో బిస్కెట్ ప్యాకెట్, చించకుండా పప్పు గుత్తితో చెత్తమత్తంగా చితగ్గొట్టి, తరవాత కవరు కొద్దిగా కట్ చేసి లోపల పాలుపోసి, ఓ చిన్న ఐస్క్రీం స్టిక్ పెట్టి ఫ్రిడ్జ్ లో పెడితే ఐస్ ఫ్రూట్ లాంటి బ్రహ్మ పదార్ధం ఏదో వస్తుంది.  కరోనా వచ్చాక(ఎదురింటి ఆంటీగారు చనిపోయాక!) ఇబాకో ఐస్ క్రీం దగ్గర్నుంచీ సింగినాదం వంటకాలదాకా అన్నీ ఇంట్లోనే.

ఐస్ క్రీం తినక ఎన్ని రోజులో అయింది అని, నిన్న ఆంటీగారి అబ్బాయి వాసు ఫోన్ చేస్తే, మా సిరి పిల్లదానికి గుర్తు వచ్చింది.  ఆంటీగారు వున్నపుడు మాటి మాటికీ ఇలాంటివి తెప్పించి బుజ్జిదానికి  ఇచ్చేది.

“వాసు, పిల్లలు కూడా ఇప్పుడు ఇక్కడవుంటే బాగుండేది” అని అమెరికాలో వున్న కొడుకు, మనవరాళ్ళని తలుచుకుని నిట్టూర్చేది.

“డబ్బులు ఖర్చు అయినా ఫర్వాలేదు.  మా అమ్మ  లేనప్పుడు కూడా అమ్మ వున్నప్పుడు ఇల్లు ఎంత బాగా వుందో అలావుండాలి” అని చెప్పాడు.  అమెరికాలో వుండేవాళ్ళకి డబ్బుకొదవ ఏముంది.  అమెరికాలో కూడా పైసాపైసా లేక్కేసే పీనాసోళ్ళు బోలెడుమంది వుండి తీరాల్సిందే అనుకోండి; కానీ వాసు, అంటీగారు అలాకాదు.  డబ్బులకోసమే ఆశించే మనిషి అయితే తల్లిపోగానే ఇల్లు అద్దెకి ఇవ్వడం గురించి ఆలోచించేవాడు.  ఎంత లేదన్నా పాతికవేలు అద్దె వస్తుంది.

“జీతం ఎంత ఇస్తారని చెప్పను?”ఇవాళ రేపు పనిమనుషుల రేట్లు ఎలావున్నాయో నాకూ తెలీదు.  ఊడ్చి తడిగుడ్డ వెయ్యడానికి రెండుమూడు వేలు అడుగుతారేమో.

“పదివేలదాకా ఇద్దాం అక్కా”నోరారా అక్కా అని పిలుస్తాడునన్ను.  మొదట్నించీ అదే అలవాటు.

పదివేలు!  కరోనా ముందు నేను పదేళ్ళు ప్రైవేటు స్కూల్లో టీచర్ వుద్యోగం చేశాను.  చివరి ఏడాది నా జీతం పదివేలే!   గవర్నమెంట్ హాస్టల్స్ లో వుండి చదువుకున్నాను.  బిఇడి చేసేప్పుడు ఖర్చుల కోసం ట్యూషన్ చెప్పాను.  తరవాత ప్రైవేటు స్కూల్లో చేరాను. ప్రైవేటు స్కూల్ పనిలో మునిగితే,  గవర్నమెంట్ వుద్యోగం దక్కించుకుని తేలడం కష్టం.  మనిషిని పిండి పిప్పి చేస్తారు.  చదువుకునే టైం వుండదు.  వస్తుందో రాదో తెలీని వుద్యోగంకోసం చేతిలో వున్న పనిమాని ప్రిపరేషన్ కోసం పోలేము.

పనులకు కరువు పట్టిన కాలంకదా.  మనిషికావాలని  అలా వాకబు చేశాను, ఇలా సాయంత్రం అవుతుంటే ఈమె వచ్చింది.

“అమ్మా, నువ్వు చేసే ఐస్క్రీం కాదు.  మంచిది కావాలి.  మంచిది.  బజార్లోది”ఇల్లు చూబించడానికి తాళాలు, సానిటైజేర్ డబ్బా పట్టుకొని నేను వెళ్తుంటే సిరి కూడా ముక్కు మీది మాస్క్ సర్దుకుంటూ, నా వెనకనే వచ్చింది.

“ఇల్లు శుభ్రంగా పెట్టడమే పని.  ఎంత ఇవ్వమంటావు?”తాళాలు తీసి, చేతికి సానిటైజేర్ రాసుకుంటూ పనామె వంక ఎగాదిగా చూశాను.   చేతికి మట్టిగాజులు నిండా వేసింది. మధ్య పాపిడితీసి జుట్టు చెదరకుండా నూనెరాసి జడ వేసింది.  బొట్టు కాస్త పెద్దదే పెట్టింది.  పాపిటలో కూడా బొట్టు పెట్టుకుని వుంది.  మెడలో పసుపు తాడుకు ప్రతి రోజూ పసుపు రాస్తుంది గావున, పచ్చగా మెరుస్తోంది.  మెడ దగ్గర చర్మం నల్లబడింది.  బంగారు తాడు వేస్తే, కొందరికి నలుపు తిరుగుతుంది కదా, అలా! పనిపిల్ల వాలకం కాదు.  లేత ఆకుపచ్చ రంగు అంచుతో, చేతితో కుట్టిన పూలపూల పచ్చరంగు సిల్కు చీర కట్టుకుంది.

నా చీర కన్నా ఆమెదే బాగుంది.

నాకు ఇప్పుడు స్కూల్ లేదుగా.  ఇంటి వరకే అని మూడు నాలుగు చీరలే కడతాను.  చిన్న కోల బొట్టు పెట్టి పిన్నులు పెట్టకుండా జాయిగా జడ వేస్తాను.  మెళ్ళో మెటల్ బొందు వేసుకుని, ఏదైనా పేరంటానికీ, వేడుకలకీ వెళ్ళేటప్పుడు, బంగారం రంగు మెటల్ గాజులు, మట్టి గాజులు కలిపి వేసుకుంటాను.  ఇప్పుడు పెళ్ళిళ్ళూ, పెరంటాళ్ళ పిలుపులు లేవు.  ఉత్త మట్టిగాజులే వేశాను.

“ఐదు వేలు ఇవ్వండి”

ఇల్లు అంతా చూసింది.  మూడు బెడ్ రూములు.  వెనక తోట. ముందు పోర్టికో.  కార్ పార్కింగ్ కోసం కట్టిన షెడ్డు.  అందులో ఖరీదైన, కవరు వేసిన కారు.  వచ్చినపుడు తీసి వాడతారు.   ఇంత పెద్ద ఇంట్లో ఒక్కరే వుండేవారు ఆంటీగారు.  వాసు కుటుంబం  ఇదివరకు ఏడాదికి ఒకసారైన వచ్చే వారు.  రెండేళ్ళుగా రాలేదు.  రావడానికి కుదరని పరిస్థితి.  కరోనాకదా.  రావడమైతే ఎలాగోలా రావచ్చు.  మన దేశానికి రానిచ్చేస్తారు!  కానీ, వచ్చాక మళ్ళీ తిరిగి వెళ్ళడంలో ఏవో ఇబ్బందులు వున్నాయంట.  అందుకే రాలేదు.  తల్లి చనిపోయినా కూడా.

“పేరేమిటి అన్నావు?”

“సుప్రియ”

“బాగుంది”పైకి అన్నానే గానీ, పని మనిషికి నరసమ్మ, లక్ష్మమ్మ పేర్లు వుండాలి గానీ, సుప్రియ ఏమిటో.  నా పేరు జగదీశ్వరి.

జగదీశ్వరి అనే పేరుకన్నా, సుప్రియ మోడరన్గా వుందికదా.

“పెద్ద ఇల్లు కదమ్మా.  ఇదంతా చిమ్మాలా, తుడవాలా” అంది.  నేను బేరం గీరం ఏమీ అడగకుండానే.  ఇల్లు పది సెంట్లు వుంటుంది మొత్తం.  రాతితో ఎత్తుగా కట్టిన కాంపౌండ్ గోడ, ముందు భాగంలో చిన్న నీళ్ళ కొలను మాదిరి కుంట, మధ్యలో చప్టా మీద నల్ల రాతితో చెక్కిన కృష్ణుడి బొమ్మ.  చాలా అందమైన ఇల్లు.    పదేళ్ళు పైన అయింది కట్టి.  అప్పుడు వేసిన మొక్కలు బాగా పెరిగి ఆకులు, పువ్వులు, కాయలు రాలుస్తున్నాయి.  అవి నేలమీద పడి చిమ్మేవాళ్ళు లేక మొత్తం తివాచీ లాగా పరుచుకున్నాయి.  ఆంటీగారు  ఎప్పుడూ మొక్కల మధ్య బైటనే తిరుగుతూ వుండేది.  ఇప్పుడు పలకరించేవాళ్ళు లేక తోట ఈసురోమంటోంది. ఆవిడ  మాటలు ఎంత బాగుండేవి.  నేను స్కూల్ నుంచి వస్తూ వుంటే, చూసి పిలిచేది.  పెరట్లో కాసిన కూరగాయలు,  సీజన్ వారిగా పట్టే ఊరగాయలు, కొన్ని పాత రోజుల కబుర్లు పంచేది.  వాసువాళ్ళు వచ్చినపుడు,  వాళ్ళ ఇద్దరు పిల్లల్ని నా దగ్గరకు తెలుగు రాయడం చదవడం నేర్పడానికి పంపేవాళ్ళు.   సిరితో ఆ పిల్లలు ఆడుకునేవారు. అమెరికా ఎచ్చులకు పోకుండా  మా ఇంటికి వాళ్ళు వచ్చేవారు.   తిరిగి వెళ్ళేప్పుడు అమ్మని కనిపెట్టుకుని ఉండమని  మరీ మరీ చెప్పిపోయేవారు.  ఆ కుటుంబంలో నాకు ఏళ్ల తరబడి అనుబంధం, స్వతంత్రం వున్నాయి.   పాపం!  కరోనా వుందని తెలిశాక ఐదు రోజులుబ్రతికింది ఆవిడ.   తూర్పు నుంచి వచ్చిన అమ్మాయి వుండేది వంటకీ, మిగిలిన పనులకీ. కరోనా అనేప్పటికి బట్టలు సర్దుకుని, ఏదో వంకచెప్పి పారిపోయింది.  తరవాత నేనే అన్నం, కూర, మందులు గుమ్మంలో పెట్టి వచ్చేదాన్ని.  హాస్పిటల్లో చేరాలి అంటే, ఎక్కడా బెడ్లు ఖాళీ లేవు.  ఆవిడా ఆసుపత్రికి పోవడానికి ఇష్టపడలేదు.  బానే ఉందిలే,  ఇక్కడ ఉంటేనే నాకు బాగుంటుంది అన్నది.  అసలు చనిపోయే రోజు కూడా బానే వుంది.  మద్యాహ్నం భోజనం ఇచ్చి వచ్చాను.  సాయంత్రం టీ ఇద్దామని చూస్తే మనిషి పలకలేదు.   ఫోన్ చేసి వాసుకి చెప్పాము.    ఇప్పుడు మంచికీ చెడుకీ ఫోనేగా!   కొడుకూ, కోడలూ వీడియో కాల్ చేస్తే, అందులోనే చావు ఏడుపు  ఫార్మాలిటీ పూర్తి చేశారు.   ఇద్దరు ముగ్గురు బంధువులు వస్తే, సాయం పట్టి చివరి కార్యక్రమాలు మేము జరిపించాం.

“మీ ఇల్లు ఎక్కడ?”పని మనిషిని పెట్టేప్పుడు ఇంటికి  దగ్గరవాళ్ళని పెట్టుకోవాలి.  వాళ్ళు రానప్పుడు చప్పున కారణం కనుక్కోవచ్చు.  ఎంత ఫోన్లు వచ్చినా కూడా, పాత పద్దతిలో పోవడం మంచిది.  ఈ మనిషి కేవలం ఇల్లు సవరించే పనికే.  రోజువారీ ఈమె కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి అడపా దదడపా మానేసినా నష్టం లేదు.  కానీ వాళ్ళు నన్నునమ్మి ఒకపని అప్పచెప్పారు.  అది సక్రమంగా చెయ్యాలి కదా.

తన ఇల్లు వుండే దిక్కుకి చేత్తో సైగ చేసి చూబించింది .  కనుచూపు దూరంలో కనబడుతున్న అపార్ట్మెంటు!

“రెండు బెడ్రూముల పోర్షను.   ఐదేళ్లుగా అక్కడే వున్నాం.  మా ఆయన కట్టుబడి పనికి వెళ్తాడు”  నా లెవలు ఈ పనికన్నా చాలా ఎక్కువ.  ఏదో తప్పక వస్తున్నా అని దర్పంగా చెప్పినట్లు వుంది మాటతీరు.

“మాది అదిగో, ఎదురు ఇల్లు” సందర్భమో, అసందర్భామో; అడక్కపోయినా చెప్పాను!  మాది అపార్ట్మెంటు కాదు, నేలమీద కట్టడం.  చిన్నది.  ఆంటీగారి ఇంటికీ మా ఇంటికీ మధ్యలో రోడ్డు అడ్డం.  పోరంబోకు స్థలంలో కట్టినది.   పైన సిమెంటు రేకులు.  ఒక హాలు, చిన్న వంటిల్లు, చిన్న బెడ్ రూము.  వేడి దిగకుండా థర్మకోల్ సీలింగ్.   ముందు వైపు గ్రిల్ వరండా.

సుప్రియా వాళ్ళ ఇల్లు, మా ఇల్లు మార్చి మార్చి చూస్తే, సుప్రియా ఇల్లే బాగున్నట్లు తోచింది!

“ఇంకెవరి ఇంట్లో అయినా  చేస్తున్నావా?”

“ఎక్కడా చెయ్యట్లేదు మేడం.  సూపర్ మార్కెట్లో చేసేదాన్ని.  మానేశాను.  వచ్చేపోయే జనాలు కదా మేడం. భయం వేసింది.  ఇళ్ళలో పనికి ఇప్పుడే రావడం.  ఏ పనీ లేకుండా, మొగాయన ఒక్కడి మీదే సంసారం ఎన్నాళ్ళు నడుస్తది? నాలుగు నెల్లుగా ఖాళీనే.  ఏదో ఒక పనికి వెళ్తే  డబ్బులు వస్తాయి కదా మేడం.  పని చేసుకుంటే తప్పు ఏముంది? అద్దె కట్టాలా, అన్నీ జరగాలా తినాలా ”

“అమ్మా, ఆకలి.  ఐసుక్రీము”

“నన్ను తినవే”ఐసుక్రీము ఆకలి సతాయింపు నడుస్తూనే వుంది.

“ఒద్దు.  నాకు చల్లగా ఐసుక్రీము కావాలి”ఇదో తింగరిది.

“నీ నంబరు ఇచ్చి వెళ్ళు సుప్రియా.  నేను వాసుని అడిగి చెబుతాను”

“ఇప్పుడే చేసి అడగండి మేడం”

“వాళ్లకి ఇప్పుడు అర్ధ రాత్రి.  ఫోన్ చెయ్యడం కుదరదు”

సుప్రియ వెళ్ళిపోయింది.  సిరి గోల చేస్తూనే వుంది.  నా సొంత ఫార్ములా ఐసు చేశాను.  దానికి నచ్చలేదు. అన్నానికి లేని పరిస్థితి బైట.  ఇది ఐస్క్రీం కోసం ఏడుస్తోంది.  ఎవరి బాధ వారిది.  ఫలానా దాని కోసం ఏడ్చే ఏడుపే ముఖ్యం అని ఎవరు లెక్క వేసి చెప్పగలరు?  టైముకి ఇంత ఇంటి బ్రాండ్ పచ్చడి ముద్దవేస్తే తిని చప్పుడు చెయ్యకుండా పడి వుండేవాళ్ళం మాచిన్నప్పుడు.  ఇప్పుడు పిల్లలికి చద్దికూడులో కూడా ఏ ఏ  ఇంటర్నేషనల్ బ్రాండ్లు వున్నాయో తెలుసు.  స్మార్ట్ ఫోనుల గడ్డు కాలం,  దాచి పెట్టాల్సిన సంగతులే దాచలేని పరిస్థితి.  ఏడ్చి ఏడ్చి నిద్ర పోయింది.  చిన్న చిన్న సరదాలు, ఆశలు తీరలేదని అల్లాడే మనుషులం.   రేపు పెద్ద అవసరాలు వస్తాయి.   ఆ మాయదారి రోగం మా ఇంట్లోకి వస్తే?  బలమైన తిండి ఏర్పాటు చేసుకోడానికి, మందులు కొనుక్కోడానికి డబ్బులు ఎలా?  నేను ఇదివరకు పని చేసిన స్కూలు ఎత్తేశారు.  సిరి అందులోనే చదివేది.  ఇప్పుడు మునిసిపల్ స్కూల్లో  మూడో తరగతిలో పేరు వేయించాను.   కొత్త వుద్యోగం వెతుక్కోవాలి.  స్కూలు వుద్యోగాలైతే ఇప్పట్లో దొరికే అవకాశం లేదు.

గ్రిల్ వరండాలో రెండు మంచాలు,  దోమతెర వేసి, ఒకమంచంమీద అలిగి నేలమీద నిద్రపోయిన సిరిని ఎత్తుకుని తీసుకొచ్చి పడుకోబెట్టాను.

“లోపల పడుకుందాం కదా”మా ఆయన మంచం తియ్యబోయాడు.

“వద్దు ఇక్కడే బాగుంది.  లోపల గాలి లేదు”

“ఇదేమన్నా నడి వేసవి కాలమా? లోపల కూడా చల్లగానే ఉందిగా”

“ఇవాళ ఇక్కడే పడుకోవాలని వుంది, మనీ ప్లాంట్ దగ్గర”

“మనీ ప్లాంట్ దగ్గర పడుకోవడం ఏమిటో!  కోరి చేసుకుని మరీ ఈ పిచ్చిదాని పాలబడ్డాను”మా ఆయన సణుక్కుంటూ నడుం వాల్చాడు. జీరో లైట్ వెలుగులో మనీ ప్లాంట్ మెరుస్తోంది.

“తెల్లారేప్పటికి ఈ మొక్కనిండా బోలెడు రంగుల పువ్వులు పూస్తే భలే వుంటుంది కదా?”అటునుంచి జవాబు రాలేదు.  మంచం లోపల వెయ్యనివ్వలేదని  కోపంలో వున్నట్లు వున్నాడు.  మామూలుగానే నా ‘దమ్మిడీకి కొరగాని’ భావుకతకి స్పందన తక్కువ.  ఇలాంటి సమయాల్లో చెప్పనే అక్కర్లేదు.   పచ్చని తీగవంక చూస్తూ ఆలోచిస్తూ వున్నాను, డబ్బుల చెట్లు అని కథల్లో వుంటాయి.  అలా డబ్బులు కాస్తే?  పోనీ ఐస్ క్రీములు, పీసు మిఠాయిలు కాస్తే భలే వుంటుంది.  నా కూతురు కోరేవన్నీ కాసేచెట్టు కావాలి.  చిన్న చీర మొగ్గతొడిగి పెరిగి పెద్దపెద్ద పట్టు చీరలు కాసే చెట్టు?  కథల్లో కూడా ఎవరూ రాసి వుండరు.  ఇంకా బుజ్జి ఇల్లు మొగ్గ రావాలి.  దాన్ని కోసి నేల మీద పెడితే పెద్ద ఇల్లు అయిపోవాలి” మొక్క వంకా, సిరి వంకా చూశాను.   పిచ్చి ఆలోచనలు.  అలాంటి చెట్టు ఎప్పటికీ రాదు.  చెట్లు వస్తువులని తయారు చేయలేవు.  మనుషులే వాటిని ఏర్పాటు చెయ్యగలరు.  మనుషులే, అంటే సుప్రియా, నేను.  వేకువ జాము దగ్గర పడుతుంది అనగా నిద్ర పట్టింది.  తెల్లారి లేచేప్పటికి వాకిట్లో సుప్రియ.

“మేడం, వాసు సార్తో ఫోన్లో మాట్లాడారా?  ఎప్పటి నుంచీ రమ్మన్నారు?”అంత పొద్దున్నే తను రావడం నాకు  నచ్చలేదు.

“నీ గురించి చెప్పాను. చూద్దాం అన్నారు.  ఫోను వస్తే కబురుపెడతాను.  నెంబర్ ఇచ్చావుగా”నీ ఆత్రం కూల.  పొరపాటున వాసు నంబరు ఇస్తే ఇంక బతకనివ్వవు నువ్వు. మనసులో అనుకున్నాను.

“నాలుగు వేలు ఇచ్చినా చేస్తాను అని చెప్పండి మేడం”

“సరే.  అలాగే”.  నేను వాసుతో అసలు ఇంకా మాట్లాడనేలేదు.  కానీ అలాఅన్నాను ఏమిటో, మనీప్లాంట్ మొక్కకు నీళ్ళు పోస్తూ ఆలోచించుకున్నాను.

మద్యాహ్నం భోజనం చేస్తూ టివి చూస్తోంటే అంబానీల గురించి చెప్తున్నారు.  ధీరుబాయి అంబానీ వాళ్ళ నాన్న చిన్న పల్లెటూళ్ళో స్కూల్ టీచరు. అంబానీ ఒక సమయంలో పెట్రోల్ బంకులో పని చేశాడంట. చిన్న స్కూల్ టీచరు కొడుకు. స్కూల్ టీచర్!

“ఈ నెల్లో సిరి పుట్టిన రోజు వస్తోంది” మా ఆయనతో అన్నాను.   చెప్పబోయే విషయానికి వుపోద్ఘాతమో, గొణిగినట్లు చెప్పడం వల్ల స్వగతమో  అర్ధం కాక అయోమయంగా చూసి,

“అవును”అని మాత్రం అన్నాడు.

“చుట్టుపక్కల పిల్లల్ని పిల్చి వున్నంతలో బాగా చేసేవాళ్ళం.  ఇప్పుడు ఎవర్నీ పిలవడానికి లేదు.  పిలవడం మంచి పని కూడా కాదు.  కానీ కనీసం బీసెంట్ రోడ్ద్ దాకా వెళ్లి ఒక కొత్త డ్రెస్ కొనాలి.  పైగా పిల్ల ఎదుగుతోంది.  బట్టలు బిర్రు అయిపోతున్నాయి.  ఇంట్లోకి వేసుకోవడానికి అయినా రెండు మూడు జతలు కావాలి కదా”

“కొందాం”మళ్ళీ పొడిగా జవాబు ఇచ్చాడు

“ఎప్పుడు?”కాస్త గట్టిగా అడిగాను

“ఈ వారంలో కొందామా?”తను మామూలుగానే చెప్పాడు.

“డబ్బులు ఉన్నాయా? తక్కువలో తక్కువ వెయ్యి కావాలి”

“చూద్దాం ఎలాగోలా”

“ఇదివరకు వారంలో రెండు సార్లు చికెన్ తెచ్చుకునేవాళ్ళం.  పేపర్ కొనుక్కుని చదివేవాళ్ళం.  పాలపేకెట్లు రెండు కొనేవాళ్ళం.  ఆ రోజులే లగ్జరీ.  ఇప్పుడు ప్రతి చిన్నదానికి కటకట”నా పాటికి నేను మాట్లాడుతుంటే,  ఈ సోది రోజూ వుండేదే, ఆర్చేదీతీర్చేదీ ఏదీ లేనట్టు అన్నం తింటున్నాడు.

“కోటీశ్వరుల ఇళ్ళలో అంట్లు తోమేవాళ్ళ జీవితం మేలు. గవర్నేస్లు అని వుంటారు.  ముకేష్ అంబానీ ఇంట్లో హౌస్ కీపింగ్ కోసం వందలమంది వున్నారు.  హౌస్ కీపింగ్ వాళ్ళు అంటే తెలుసా?  ఇల్లు తుడవడం, సర్ది పెట్టడం, అంట్లు తోమడం లాంటివన్నీ చేసేవాళ్ళు.  ఆ పనివాళ్ళ జీతం రెండు లక్షల పైనే అంట.  ”

“అబ్బా!”

“గవర్నమెంట్ వుద్యోగం కన్నా గొప్ప కదా? అంబానీ ఇంట్లో పనివాళ్ళ  పిల్లల్లో కొందరు అమెరికాలో చదువుకున్నారంట”

“అదృష్టం”

“గౌరవం, అభిమానం;  ఫలానా పని గొప్పది, ఫలానాది తక్కువది  అనుకుంటాం గానీ, బతక నేర్చినతనమే గౌరవం ఈ రోజుల్లో.  దేనికి డబ్బులు బాగా వస్తే అదే గొప్ప పని”

“అంతేకదా మరి”

“కదా.  మరి నేను చెప్పేది ఒక మాట విను”

“వింటున్నా కదా.  చెప్పు?”నేను కొంచం సేపు తటపటాయించాను.  ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చాను.

“వాసు వాళ్ళ ఇంటి పని నేను తీసుకోవాలని అనుకుంటున్నా.   పదివేలు వస్తాయి.  ఈ రోజుల్లో, మనుషుల మధ్య ఉండాల్సిన అవసరం లేని పని దొరకడం కూడా మంచిదే.  ఎదురు ఇల్లే.  కరోనా భయం లేదు.  దూరం కూడా వెళ్ళక్కర్లేదు.  పరిస్థితులు చక్కబడ్డాక వేరే జాబ్ వెతుక్కోవచ్చు”అవును, కాదు అనకుండా మా ఆయన నా వంక తెల్లబోయి చూశాడు.

“హటాత్తుగా ఈ ఆలోచన ఎలా వచ్చిందో అడక్కు.  నాకూ తెలీదు.  పిల్లకి ఒక ఇసుక్రీం కొనలేక పోతున్నా అని ఉక్రోషంలోంచి వచ్చి ఉండొచ్చు.  లేదా ఉన్నట్టుండి జ్ఞానం వెలిగింది అనుకో.   ముందుగా ఈ ఉపాయం వుంటే సుప్రియాని పిలిచేదాన్నే కాదు”

ఐస్క్రీం పార్లెర్లో సిరి కోరిన ఐస్ క్రీం ఇప్పించి వస్తోంటే సుప్రియ ఎదురుపడింది.

“మా ఇల్లు కురుస్తోంది.  బాగుచేసేదాకా  మమ్మల్ని వాళ్ళ ఇంట్లో రెండు గదుల్లో ఉండమన్నారు.  మనుషులు వుంటే ఇల్లు బానే వుంటుంది కదా.  మేం మా ఇల్లు బాగు చేయించుకుని ఖాళీ చేసేప్పటికి వాళ్ళని అడిగి పని సంగతి చెప్తాలే”అడ్డదిడ్డంగా ఏదో మాట్లాడాను.

“సర్లే మేడం.  మర్చిపోకుండా చెప్పండి.   వేరే ఎవరైనా అడిగినా నా పేరు చెప్పండి”నిన్నటి దర్పం ఇవాళ తగ్గింది.  పని చిక్కక డీలా పడింది.   నేను నిమిషం నిలబడకుండా దొంగలాగా తొందర తొందరగా వచ్చేశాను.

ఆంటీగారి ఇంట్లో అవసరం అయినంతే వస్తువులు చేర్చుకుని కొన్ని మా ఇంట్లోనే వదిలేశాం.  మా పిచ్చి పిచ్చి సామాను ఈ ఇంటికి మ్యాచ్ కావు.   నా బిఇడి సర్టిఫికేట్ కూడా, అవసరం అయినప్పుడు తెచ్చుకోవచ్చులే అని ఇంట్లో చెక్క అల్మారాలో ఉంచేశా.

“స్వీపరు పని టీచరమ్మ కాజేసింది అని సుప్రియాకి అనుమానం రాకుండా మీరే చూసుకోవాలి”కొత్త ఇంట్లో దీపం పెట్టి శివుడూపార్వతీ పటం దగ్గర కొబ్బరికాయ కొట్టి దణ్ణం పెట్టుకున్నాను.

* 

కృష్ణ జ్యోతి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు