…..అలాగని మరీ మొద్దునూ కాదు!

బ్రాహ్మణులే బాగా చదువుకుంటారు అన్న ఆలోచనేదో లోలోపల ఉండేది. అందువల్ల బాగా శ్రద్ధ పెట్టి బ్రహ్మాండంగా చదువుకోవాలన్న పట్టుదల ఉండేది కాదు.

2

ఎదిగే కాలం

మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి జిల్లాలోని పెద్ద పట్టణ ప్రాంతానికి మకాం మార్చడం వల్ల ప్రపంచానికి కిటికీ తెరుచుకున్నట్టయ్యింది మాకు. పట్నాల్లో ప్రజల జీవనసరళిని పరిశీలించే అవకాశం దొరికింది. అయితే ఒకేసారి ఆ జీవితంలో ఇమడలేక, మా కుటుంబం కొంత గ్రామీణ శైలిని, కొంత పట్టణ శైలినీ కలగలిపి పాటించేది.

ఉదాహరణకు ఊళ్లో మా కుటుంబంలో భాగమైన గేదెను మా అమ్మ బెజవాడ కూడా తోలుకొచ్చింది. అప్పటికి అక్కడివారు పాలు, పెరుగుల కోసం చుట్టుపక్కల గ్రామాల మీద ఆధారపడేవారు. గ్రామీణులు ఇక్కడివరకూ వాటిని తోలుకొచ్చి, కొనుక్కొనేవారి ఇంటి ముందరే పాలుపితికేవారు. కాని మా గేదెను తోలుకురావడం వల్ల మాకు అలా ఆధారపడవలసిన పరిస్థితి తప్పింది, డబ్బు పోసి పాలు, పెరుగు కొనవలసిన పరిస్థితి కూడ తప్పింది.

బెజవాడకు తూర్పుగా ఉన్న సూర్యారావుపేటలో ఇల్లు తీసుకున్నారు మా నాన్న. మొగల్రాజపురం కొండల దగ్గర ఉన్న ఆ ప్రాంతం అప్పటికి పట్టణానికి దూరమనే చెప్పుకోవాలి. చుట్టూ పొగాకు తోటలు, కంది మడులు ఉండేవి. ఇళ్ల కన్న పొగాకు శాలలు ఎక్కువగా ఉండేవి. గవర్నరుపేటకు కూతవేటు దూరంలో ఉండేది. మా ఇల్లు ఇటుకలతో కట్టింది, పెరడు ఉండేది. ఈ ప్రాంతానికి పట్టణ ప్రాంత సదుపాయాలు కొన్ని ఉండేవి. కరెంటుతో వెలిగే వీధి దీపాలు, నీటి సౌకర్యం వంటివి. మా ఇంటికి అవేవీ లేవనుకోండి, మేం పూర్వంలాగే కిరోసిన్ బుడ్డీల మీద, పెరట్లోని బోరింగు పంపు మీద ఆధారపడేవాళ్లం. మా పొరుగువాళ్లకు కొంతమందికి ఇంట్లో విద్యుచ్ఛక్తి ఉండేది. మేమా సౌకర్యం అనుభవించడానికి మరో దశాబ్ద కాలం పట్టింది.

మాకు దగ్గరగా కొందరు బంధువుల కుటుంబాలుండేవి. వాళ్లెవరంటే మా పెద్ద పెదనాన్నగారబ్బాయి. అరిగపూడి పూర్ణచంద్రరావు. (మా ఇంట్లో తొలి గ్రాడ్యుయేట్ అయినవాడు) ఇతని పెళ్లి, మా అక్క పెళ్లి ఒకే సమయానికి, ఒకే వేదిక మీద చేశారని చెప్పాను కదా. కాని దురదృష్టవశాత్తు పెళ్లి తర్వాత మా వదిన అనారోగ్యం బారిన పడి చనిపోయింది. కొంత కాలం తర్వాత మా అన్న మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడొచ్చిన వదిన చదువుకున్నది, బిషప్ అజరయ్య హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయినిగా పనిచేసేది. ఆమెకూ చిన్నతనంలోనే భర్త పోవడంతో ఈ పెళ్లి జరిగింది.

వాళ్లింట్లో మా అన్నవదినలతో పాటు మా పెద్దమ్మ, చెల్లెలు ఉండేవారు. అలాగే వదిన అక్కగారు, నాన్నగారు ఉండేవారు. అలాగే ఆమె చెల్లెళ్లు ముగ్గురు పాఠశాల చదువుల్లో ఉండేవారు. (వారిలో ఒకరిపేరు కొండపల్లి కోటేశ్వరమ్మ. తర్వాత ఆమె మాంటిస్సోరి కోటేశ్వరమ్మగా పేరు పొందారు. నన్ను ‘ఏరా ప్రేమా’ అంటూ ముద్దుగా పిలిచేవారు) మా అన్న స్కూల్లో టీచరుగా ఉద్యోగం సంపాదించాడు, వాళ్లకు ఆరుగురు పిల్లలు కలిగారు. వారిలో పెద్దవాడు (నాకన్నా కొంచెం చిన్న) భారతీయ సైన్యంలో మేజర్ జనరల్ స్థాయికి ఎదిగాడు.

చెప్పొచ్చేదేమంటే, వాళ్లంతా ఉండే ఆ ఇల్లు నాకు మరో ఇల్లు లాంటిది. నేను పొద్దున్నుంచి రాత్రి దాకా అక్కడే వాళ్ల సంరక్షణలో ఆటపాటలతో గడిపేసేవాణ్ని. ఇంట్లో చంటిపిల్ల మా చెల్లి సంరక్షణతో మా అమ్మకు కాలం గడిచిపోయేది. వాళ్లింట్లో వేరే చిన్నపిల్లలెవ్వరూ లేకపోవడంతో, నాకు బోలెడంత గారాబం దొరికేది. ఎలెక్ట్రిక్ స్విచ్చులను వేస్తూ ఆర్పుతూ ఆడుకునేవాణ్ణని గుర్తు. నాకు స్వీట్లు అవీ పెట్టేవారు, వీధిలో ఐస్క్రీమ్ బండివాడు వచ్చాడంటే నాకు తప్పనిసరిగా ఒకటి కొనిపెట్టేవారు. మా వదిన నన్ను తరుచూ స్కూలుకు తీసుకుపోతూ ఉండేది. వాళ్లందరి అభిమానం నాకు పెట్టని కోటలా ఉండేది.

మా నాన్న అభిమానం బయటకు తెలిసేది కాదు. చాలా స్ట్రిక్టుగా ఉండేవారు. ఆయన పిలిచినప్పుడే దగ్గరకు వెళ్లేవాళ్లం. మా అమ్మ అలాక్కాదు. ఆమె ప్రేమాభిమానాలు బాహాటంగా తెలిసేవి. నాకు మా అన్న ఇంట్లో క్రమశిక్షణలో పెట్టేవారెవ్వరూ ఉండేవారు కాదు, పైగా వాళ్ల వాత్సల్యం అడుగడుగునా స్పష్టమయ్యేది. అది నా బాల్య జ్ఞాపకాల్లోంచి ఎప్పటికీ చెరిగిపోదు.

మాకు తెలిసిన మరో కుటుంబం ఈడుపుగంటి బాలవీర రాఘవయ్యగారిది. వాళ్లది కూడా మాకు దగ్గర్లోని ఊరే. ఆ రోజుల్లోనే గ్రాడ్యుయేట్, పెద్ద భూస్వామి అయిన ఆయన తన ముగ్గురు పిల్లలనూ చదివించడం కోసం గ్రామాన్ని వదిలి పట్టణానికి చేరుకున్నారు. అక్కడ వ్యాపార అవకాశాలు ఏమున్నాయా అని విచారించేవారు. ఆయన పొడుగ్గా, తెల్లగా స్ఫూరద్రూపిగా ఉండేవారు. ఎప్పుడూ చేతిలో గొడుగు పట్టుకునేవారు. రాఘవయ్యగారు మా నాన్నగారికి మంచి స్నేహితుడు. తరచూ కలుస్తూ మంచిచెడ్డలు, రాజకీయాలు మాట్లాడుకునేవారు.

ఆయన కొడుకులు ఇద్దరు నాకన్నా పెద్దవారు, కూతురు నాకన్నా చిన్నది. అప్పట్లోనే వాళ్లు తమ తల్లిదండ్రులను ఫాదర్, మదర్ లేదా డాడీ, మమ్మీ అంటూంటే మాకు విచిత్రంగా ఉండేది. దానివల్ల వాళ్లను చుట్టుపక్కలవారు మరింత నాగరికులు అనుకునేవారు. కొడుకులిద్దరూ చాలా అల్లరివాళ్లు, వాళ్ల నాన్న చేతిలో దెబ్బలు తినేవాళ్లు. పెద్దయ్యాక వాళ్లిద్దరూ వ్యాపారాల్లో స్థిరపడ్డారు, పెద్దవాడు సినిమా నిర్మాతగా మారి ‘సంస్కార్’ తీశాడు. దానికి రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. చిన్నవాడు స్పిన్నింగు మిల్లుల ఓనరయ్యాడు. మా చిన్నప్పుడు నాకసలు బొమ్మలే లేనప్పుడు వాళ్ల బొమ్మలతో నన్ను ఆడుకోనిచ్చేవారు. కాని నాకు బొమ్మలు లేవన్న లోటు తెలిసేది కాదు, మా అన్న కుటుంబం ఆప్యాయత వల్లనేమో మరి.

నాకు మొదటిసారి విదేశీయులను చూడటం తటస్థించింది బెజవాడలోనే. అది చైనాను జపనీయులు ఆక్రమించిన కాలం. అందువల్ల కొంతమంది చైనీయులు భారతదేశానికి వలస వచ్చి ఆశ్రయం వెతుక్కునేవాళ్లు. కొందరు చైనా గంటలను, గోడలకు తగిలించే బొమ్మలను అమ్ముతూ ఉండేవారు. అలాగే టౌన్లో కొందరు కాబూలీవాలాలుండేవారు. వాళ్లు చాలా పొడుగ్గా ఉండేవారు, అది చాలనట్టు తలమీద పొడుగైన కుచ్చు ఉండేలా తలపాగాలు చుట్టుకునేవారు. (రవీంద్రనాథ్ టాగోర్ రాసిన కాబూలీవాలా కథ చాలా ప్రాచుర్యం పొందింది, సినిమాగా కూడా విజయవంతమయ్యింది) వాస్తవానికి కాబూలీవాలాలు డబ్బు అప్పుగా ఇచ్చేవారు, గడువులోగా తీర్చకుంటే రుణగ్రహీతలను నలుగురిలో పట్టుకుని కొట్టేసేవారు. అది అప్పు తీసుకున్నవారికి చెడ్డ అవమానంగా ఉండేది. అందువల్లనే కాబూలీవాళ్లంటే అందరికీ చచ్చేంత భయంగా ఉండేది. వాళ్లు వస్తున్నారంటే చాలు, మావంటి పిల్లలు ఇళ్లలో దూరి దాక్కునేవాళ్లం!

పట్టణ జీవితంలో చెప్పుకోదగినది విశేషం ఏదంటే సినిమా హాళ్లు అందుబాటులో ఉండటం. అప్పటికి తెలుగు సినిమా పరిశ్రమ బాల్యావస్థలోనే ఉన్నదని చెప్పుకోవాలి, కాని ప్రజలను అలరించడానికి తగినన్ని సినిమాలు ఉండేవి. టికెట్టు తక్కువగానే ఉండేది, అలాగే తల్లులు చంకనెత్తుకుని వచ్చే చిన్నపిల్లలకు టికెట్టు ఉండేది కాదు. కాని ఆ సౌకర్యాన్ని ఎంతోమంది తల్లులు దుర్వినియోగం చేసేవారు. ఎదిగినపిల్లలను కూడా సినిమా థియేటరు దగ్గర ఎత్తుకునేవారు. మా అమ్మ దీనికి అతీతం ఏమీ కాదు. దాదాపు ఐదేళ్లు నిండుతున్నా సరే, నన్ను ఎత్తుకుని వెళ్లేది. దుర్గా కళా మందిర్ (దుర్గా ఆర్ట్స్ సెంటర్) మాకు నచ్చినది. అది చాలా పెద్ద హాలు. ఆ రకంగా తెలుగు సినిమాల పట్ల నా ఇష్టం చాలా చిన్న వయసులో మొదలైంది, కాని పెద్దయి ఢిల్లీ వెళ్లాక, తర్వాత వాషింగ్టన్లోనూ అది మరుగున పడిపోయింది, ఒకటీ రెండు కాదు, దాదాపు 30 ఏళ్ల పాటు! అలాగని వాటిపట్ల పెద్ద బెంగేమీ ఉండేది కాదు. తర్వాత వీసీఆర్లు, డీవీడీల కాలం వచ్చేసింది, ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని సినిమాలన్నీ చూడగలుగుతున్నాం.

ఇక నేను బడిలో చేరి అక్షరాలు నేర్చుకోవలసిన సమయం ఆసన్నమయ్యింది. మా ఇంటి ఎదురుగానే ఒక బ్రాహ్మణ టీచరు స్కూలు నడుపుతూ ఉండటం వల్ల నేను స్కూల్లో చేరడం అసాధ్యం కాలేదు. పైగా నేను రోజూ చూసే పిల్లలందరితో కలిసి నేను కూడా స్కూలుకు వెళ్లడం నాకు సంతోషంగా ఉండేది. స్కూలంటే పెద్ద స్కూలేం కాదు. ఆయన ఇంటిలోని ముందు గది అంతే. ఆయన అక్షరాలు, అంకెలు చెప్పి, మేం వాటిని దిద్దడమో, వల్లె వెయ్యడమో చేస్తున్నప్పుడు ఇంటి పనులు చేసుకునేవారు. పొట్టిగా ఉండి, తలమీద పిలకతో ఉండే ఆయన చేతిలో పెద్ద బెత్తం ఉండేది, కాని దానికి ఎప్పుడూ పని ఉండేది కాదు. ఆ బెత్తాన్ని చూస్తూనే కావలసినంత నిశ్శబ్దంగా, క్రమశిక్షణగా ఉండేవారు పిల్లలు. ఆయన భార్య చాలా ఆచారపరురాలు, అబ్రాహ్మణ పిల్లలకు తగలకుండా దూరంగా ఉండేది. అప్పట్లో మాకది మామూలే, ఏదో వివక్షగా అనుకునేవాళ్లం కాదు. ఆమె తరగతి గదిలోకి వచ్చినప్పుడు మాత్రం మేం తగులుతామంటూ ఆమెను అల్లరిపెట్టేవాళ్లం.

*

ఈ బడిలో చెప్పుకోదగిన జ్ఞాపకాలేం లేవు. నేను పెద్ద తెలివైనవాణ్నీ కాదు, అలాగని మరీ మొద్దునూ కాదు. నాకు మంచి జ్ఞాపకశక్తి ఉండేది, అది పరీక్షలప్పుడు ఉపయోగపడేది. ఏడాదంతా శ్రమపడాల్సిన అవసరాన్ని అది తగ్గించేది. బడికెళ్లడం, నాతోటి పిల్లలతో కాలం గడపడం, ఆడుకోవడం ఇదంతా బాగానే ఉండేది. దసరాల సమయంలో పిల్లలంతా బాణాలు, పువ్వులు, రంగు పొడి తీసుకొని ఇంటింటికీ ఊరేగింపుగా వెళ్లేవాళ్లం. ప్రతి ఇంటి ముందూ ఆగి దసరా పద్యాలు, పాటలు పాడేవాళ్లం. మాకు తినడానికి ఏవో తినుబండారాలు పెట్టేవాళ్లు, మా మాస్టరుగారికి చిన్నచిన్న కానుకలు ఇచ్చేవాళ్లు గృహస్తులు. అయితే ఇది ప్రాథమిక పాఠశాలకే పరిమితం. తర్వాత కూడా చేస్తే బాగుండని మాకుండేదిగాని, ఎందుకో అలా చేసేవారు కాదు. ఈ సరదా తల్చుకున్నప్పుడు ఎప్పటికీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులుగానే ఉండిపోతే బాగుండేదని అనుకునేవాళ్లం.

ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మా నాన్నకు బోనస్ (అప్పటికి ఆ మాట మాకు తెలియదనుకోండి) వచ్చినప్పుడల్లా మాకు కొత్త బట్టలు కొని తెచ్చేవారు. ఆయన ఇన్సూరెన్స్ వ్యాపారం పెరిగింది, కాని దాంతోపాటే కుటుంబ అవసరాలూ పెరుగుతూ వచ్చాయి. దాంతో ఆయన మరింత ఎక్కువ సంపాదనకు అవకాశాలు ఏమున్నాయని అన్వేషిస్తూ వచ్చారు. ఈ అన్వేషణకు ఆయన అల్లుడు, బావమరిది తోడయ్యారు.

మా బావ (పెద్దక్కయ్య భర్త) చాలా పొదుపరి, మా అక్క కూడా అంతే. అప్పటికింకా వాళ్లకు పిల్లల్లేరు (తర్వాత కూడా కలగలేదు) కాని కుటుంబ బాధ్యతలు చాలా ఉండేవి. ఆయన తల్లి, అక్కచెల్లెళ్లు, మరో ఇద్దరు కజిన్స్… ఇలా ఆయన మీద చాలా బాధ్యత ఉండేది. వీళ్లుగాక వారాల అబ్బాయిలు ఓ ఇద్దరు వచ్చేవారు. స్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా ఆయనకొచ్చే జీతమే వీళ్లందరికీ ఆధారం.

అలాగే మా పెద్ద మేనత్త భర్తకు చాలా డబ్బుండేది, పొదుపుగా బతికి వారసత్వ ఆస్తికి మరింత చేర్చగలిగాడు. వాళ్ల ఏకైక పుత్రుడు పొట్లూరి శివరావు స్కూలు చదువు ఆపేశాడు, ఏ పని లేకుండా ఉండేవాడు. అతని బుర్రకు తగినంత వ్యాపకం కల్పించడానికి వాళ్లకు ఏదైనా వ్యాపారం చేద్దామనిపించింది.

ఈ ముగ్గురి అవసరాలు ఏవైనప్పటికి, అందరికీ డబ్బు అవసరం అనేది సత్యం.

ఈలోగా రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. దాంతో ప్రపంచ రాజకీయాలు ఒక మలుపు తిరిగాయి. యుద్ధం బెజవాడ వరకూ ఎప్పుడూ రాలేదుగాని, అది అంతోఇంతో దైనందిన జీవితాలను ప్రభావితం చేసింది. వీధి దీపాలు తొందరగా ఆరిపోయేవి, ‘ఎయిర్ రెయిడ్ షెల్టర్’ ల పేరిట బాంబుదాడి జరిగితే తల దాచుకోవడానికి నిర్మాణాలు జరిగేవి. అలాగే బాంబు దాడి జరిగితే మంటలు ఆర్పడానికి వాటర్ ట్యాంకులను నిర్మించేవారు. పవరుహౌసు, రైల్వేస్టేషన్ లో రాత్రి దీపాల వెలుతురు తగ్గించేవారు. బెజవాడ రైల్వేస్టేషన్ గుండా పోలీసు, ఆర్మీ పటాలాలు రాకపోకలు సాగించేవి.

మా నాన్న వ్యాపార ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం మొదలయ్యింది. ఉయ్యూరులో కిరోసిన్, సిమెంట్, వంటచెరుకు అమ్మే దుకాణం ఒకటి ప్రారంభించాలనుకున్నారు. అలాగే ‘ద హిందూ’ ‘ఆంధ్రపత్రిక’ దినపత్రికల ఏజెన్సీ తీసుకున్నారు. క్రమంగా ఇతర పేపర్లు, పత్రికలు తీసుకోవాలని ఆలోచన. ఉయ్యూరు అప్పటివరకు ఒక సాధారణ గ్రామంగాని, పంచదార మిల్లు రావడంతో అభివృద్ధి పథంలోకి రాబోతూ ఉన్న రోజులవి. అదీగాక అది కడవకొల్లుకు దగ్గరగనుక వస్తూ పోతూ ఉండొచ్చని మా నాన్న ఉయ్యూరు పట్ల మొగ్గు చూపారు. ఈ ఆలోచనలన్నిటినీ అమల్లోకి పెట్టడానికి, తన భాగస్వాములతో మంతనాలు జరపడానికి వీలుగా ఉంటుందని మా నాన్న కుటుంబాన్ని గుడివాడకు మార్చారు.

1941లో మేం అక్కడికి మారాం. ఉన్నది కొద్ది నెలలే అయినా అక్కడి జ్ఞాపకాలు మూడు నాకు బాగా గుర్తున్నాయి.

గుడివాడలో మేం అద్దెకు దిగిన ఇల్లు మా అక్కయ్య ఇంటికి కూతవేటు దూరమే. మా కుటుంబానికి అది చిన్న ఇంటికిందే లెక్క. అయినా, మేముండేది కొద్ది నెలలే అని తెలిసి సర్దుకుపోయాం. మాకు ఇల్లు అద్దెకిచ్చినావిడ కళావంతుల కుటుంబానికి చెందిన స్త్రీ. కళావంతులు అంటే జపాన్ లో గెయిషా, కొరియాలో కెయిషాలాగా అన్ని కళలూ నేర్చుకున్న వారు, కాని వారు అవి పురుషులను రంజింపజెయ్యడానికి ఉపయోగిస్తారు. ఆమె ఆ వయసు దాటిపోయారు, చాలా పొట్టిగా, లావుగా ఉండే ఆమె మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు. ఆమెకు నా వయసు వాడే ఒక కొడుకు, నాకన్నా ఒకటి రెండేళ్లు చిన్నదైన కూతురు ఉండేవారు. ఆవిడ చాలా దయార్ద్రహృదయురాలు, చాలా నాగరికమైన ప్రవర్తన కలది, తన పిల్లలంటే ప్రాణం పెట్టేది. ఆవిడ కొడుకు నాకు మంచి స్నేహితుడు కావడం వల్ల ఆమె నాతో కూడా ఆప్యాయంగా ప్రవర్తించేవారు. ఆ పిల్లల తండ్రి అక్కడికి సమీపగ్రామంలోని ఒక బ్రాహ్మణ వ్యక్తి. భూస్వామి, కవి కూడా. ఆయన ఈ పిల్లలకు ఆస్తిపాస్తులనూ, తన ఇంటి పేరునూ కూడా ఇచ్చారు. అందువల్ల వాళ్లకు సమాజంలో సరైన గుర్తింపు ఉంటుందని ఆశించారు. ఆ పని ఆ రోజుల్లో చాలా అరుదు, అందువల్ల ఆయన పెద్ద మనసుకు మంచి పేరు వచ్చింది. ఈ పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఆస్తులనేగాక, ఇంటిపేరునూ ఇవ్వడం అనేది ఆయన వ్యక్తిత్వానికి తార్కాణంగా నిలిచింది. ఆయన తరచూ వచ్చేవారు, వచ్చినప్పుడల్లా పిల్లలకు తినుబండారాలేవో తీసుకువచ్చేవారు. పొరుగింటి పిల్లవాడిగా నాకూ వాటిలో భాగం దొరికేది. ఆయన కూడా నా పట్ల వాత్సల్యం చూపేవారు.

గుడివాడలో నా రెండో జ్ఞాపకం రాజకీయ ఖైదీలకు సంబంధించినది. శిక్ష పడి పెద్ద జైలుకు వెళ్లేదాకా వాళ్లకు అక్కడున్న సబ్ జైల్లో ఉంచేవారు. ఆ జైల్లో నీటి సౌకర్యం లేదు. అందువల్ల వాళ్ల స్నానపానాదుల కోసం ప్రతిరోజూ మా అక్క ఇంటి ముందున్న పెద్ద నూతి దగ్గరకు తీసుకొచ్చేవారు. దానిలో ఎప్పుడూ బోలెడన్ని నీళ్లుండేవి, పుల్లీ ఉండేది అందువల్ల ఆడవారు సైతం సునాయాసంగా నీళ్లు తోడుకోగలిగేవారు. నూతి చుట్టూ చప్టా ఉండటం వల్ల స్నానానికి వీలుగా ఉండేది. జైలు ఖైదీలను ఉదయం, సాయంత్రం అక్కడికి తీసుకొచ్చేవారు. వాళ్లు పళ్లు తోముకోవడం, స్నానం చెయ్యడం పూర్తయ్యాక, తమతో తెచ్చుకున్న పాత్రల్లో తాగునీటిని పట్టుకుని తిరిగి వెళ్లేవారు.

ఖైదీల్లో ఎక్కువమంది రాజకీయ ఖైదీలే కావడంతో యువకులు. వాళ్ల తల్లిదండ్రులు వాళ్లను చూడటానికి ఆ సమయాల్లో నూతి దగ్గరకు వచ్చేవారు. మా అక్కయ్య ఇంటి మెట్ల మీద కూర్చుని వాళ్లు వచ్చేవరకూ వేచి చూసేవారు. వాళ్లు కనిపించగానే తల్లులు ఒకటే గోల, శోకాలు పెట్టేవారు. తాము అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలను సాధారణ ఖైదీలుగా చూడవలసి రావడం వాళ్లకు గొప్ప కష్టంగానే ఉండేది. పోలీసులకు తృణమోపణమో ఇచ్చి, తమ పిల్లలతో మాట్లాడుకునేవారు. పోలీసులు స్థానికులే, అందరికీ తెలిసినవారే కావడంతో ఇది సామాన్యంగా జరిగిపోయేది.

ఈ ఖైదీల్లో మా నాన్న మేనల్లుడు శివరావు కూడా ఉండేవాడు. అతను స్వయంగా ఏమీ చెయ్యకపోయినా, స్థానిక రాజకీయ శక్తులతో సంబంధమున్నదని ఆరోపించి అతన్ని జైల్లో పెట్టారు. తర్వాత అవి వీగిపోయాయి. అయినా అతను జైల్లో ఉన్న కొద్ది కాలంలో మా మేనత్త, మావయ్య తరచూ వచ్చి నూతి దగ్గర అతన్ని కలుస్తూ ఉండేవారు. మా మావయ్య కొడుకు ముందు ఏడిచేవాడు కాదుగాని, ఖైదీలు వెళ్లిపోయిన తర్వాత వరండాలో కూర్చుని చాలా శోకించేవాడు. ఆయన భావోద్వేగాలు అర్థమయ్యే వయసు మాది కాదు, అయినా ఆయన్నలా చూడటం మాకు ఇబ్బందిగానే ఉండేది.

ఇక ఆ ఊరికి సంబంధించి నా మూడో జ్ఞాపకం – నేను హైస్కూల్లోకి ప్రవేశించడం. ఆరోజుల్లో మిడిల్ స్కూలు, హైస్కూలు ఉన్న అతి కొద్ది ఊళ్లలో గుడివాడ ఒకటి. మిడిల్ స్కూలు ధాన్యం మిల్లుల మధ్యలో ఒక పెద్ద ఇంట్లో అద్దెకు నడిచేది. నేను హైస్కూల్లో చేరడానికి ప్రవేశ పరీక్ష రాయాలని మా నాన్న నిర్ణయించారు. ఐదో తరగతితో మొదలై పదకొండో తరగతి వరకూ ఉండేది హైస్కూలంటే. పదకొండో తరగతిని సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ – ఎస్సెస్సెల్సీ అనేవారు. దానికి పరీక్షను మద్రాసు ప్రెసిడెన్సీ విద్యాశాఖలోని సెకండరీ స్కూలు బోర్డు నిర్వహించేది. అది పాసవడం పెద్ద విషయమే అప్పట్లో. కాని హైస్కూల్లో చేరడం, ఎంట్రన్సు పరీక్ష అనేవి స్థానిక వ్యవహారాలే. అవేం పెద్ద కష్టం కాదు. పిల్లవాడు మరీ సరిగ్గా చెయ్యలేకపోతే వచ్చే ఏడు రమ్మనో, లేదంటే ఓ క్లాసు తగ్గించి వెయ్యమనో మేస్టర్లు సూచించేవారు.

నేను, మా ఇంటి ఓనరుగారబ్బాయి, ఇద్దరం ప్రవేశ పరీక్ష రాశాం. ఇద్దరికీ మంచి మార్కులే వచ్చాయి, హైస్కూల్లో (ఐదో క్లాసులో) చేరిపోయాం. అంటే రోజంతా ఇంటికి దూరంగా స్కూల్లో ఉంటామని మాకు అర్థమయ్యింది. అలాగే మధ్యాహ్న భోజనం మేమే కేరేజీల్లో తీసుకెళ్లాలి. తిన్న తర్వాత దాన్ని పంపు దగ్గర కడగాలి. స్కూలు నుంచి సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు స్థానిక ట్రావెలర్స్ బంగళా ఆవరణలో ఒకటోరెండో ఫుట్ బాలు మ్యాచులు ఆడుకునేవాళ్లం. ఈ ఆటలన్నీ ఎక్కువకాలం నడవలేదు, మా నాన్న అప్పటికే మకాం మార్చెయ్యడానికి సిద్ధపడ్డారు మరి.

ఉయ్యూరులో మా ఇల్లు రెండు భాగాలుగా ఉండేది. ఒకదానిలో మేముంటే మరో భాగంలో ఒక వస్త్ర వ్యాపారి ఉండేవారు. వాళ్ల దుకాణం మెయిన్ వీధిలో ఉండేది. అయితే ఆ ఇంటి ఓనర్ మా నాన్నకు స్నేహితుడు కావడంతో మాదగ్గర అద్దె తీసుకునేవాడు కాదు. దుకాణానికి మాత్రం అద్దె ఉండేది. బెజవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే ప్రధాన రహదారి మీద దుకాణం ఉండేది. ఇల్లు, దుకాణం అన్నీ అమరిన తర్వాత మా నాన్న మమ్మల్ని బోటు మీద గుడివాడ నుంచి ఉయ్యూరుకు తరలించారు. ఒక సాయంత్రం చీకటి పడిన తర్వాత మేం అక్కడికి చేరుకున్నాం.

*

ఉయ్యూరు కావడానికి పెద్ద గ్రామమే అయినా, అప్పటి ప్రభుత్వ లెక్కల ప్రకారం దాన్ని టౌనుగానే గుర్తించేవారు. నాలుగు విషయాలకు అది ప్రసిద్ధి పొందింది. మొదటిది కోస్తాంధ్రలో తొలి పంచదార మిల్లు నిర్మాణం అక్కడే జరిగింది. కొత్తలో ఆ ప్రయత్నం విమర్శల పాలయ్యింది, సరిగా నడవదేమో అనుకున్నారుగాని 1940ల మొదట్లోకల్లా అది చాలా బాగా నిలదొక్కుకుంది, వ్యవసాయంలో ఒక కొత్త పంథాకు నాంది పలికింది. ఆర్థర్ కాటన్ కాలానికి అటూఇటూగా దాదాపు ఆ ప్రాంతమంతా వరి ఒక్కటే పండేది, కాస్త మెట్ట ప్రాంతాల్లో పొగాకు, కూరగాయలు లేదా పండ్ల తోటలు వేసేవారు. కృష్ణా జిల్లాలో చెరుకు వెయ్యడం ఈ మిల్లుతోనే మొదలయ్యింది. అప్పటికింకా ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించడం అమల్లోకి రాలేదు. మార్కెట్ స్థితిగతులకు అనుగుణంగా ఫ్యాక్టరీ మేనేజ్ మెంట్ ధర ఇంతని నిర్ణయించేది. అయినా చెరుకు రైతులకు మంచి సంపాదనే లభించేది. పంచదార తయారీ క్రమంలో లభించే ఉప ఉత్పత్తులకు అంతగా ప్రాచుర్యం రాని రోజులవి. చెరుకు పిప్పిని పెద్ద ఫర్నేసులకు ఇంధనంగా వాడేవారు, మొలాసిస్ ను మట్టితో కలిపి ఎరువుగా వాడేవారు.

ఉయ్యూరులో ఉన్న కెనెడియన్ బాప్టిస్టు మిషన్ హాస్పిటల్ రెండో పెద్ద విషయం. 1920ల నడుమన ఎప్పుడో దాన్ని స్థాపించారు. హాస్పిటల్ నిర్వహణ ఒక్కటే కాకుండా మిషన్ క్రిస్టియన్ పిల్లల కోసం ఒక ఆడపిల్లల మిడిల్ స్కూలు (రెసిడెన్షియల్) కూడా నడిపేది. మిషన్ భవనాలన్నీ చూడముచ్చటగా ఉండేవి. పెద్ద జాగా కొనడం, దాని మధ్యలో భవనాన్ని నిర్మించడం, మిగిలిన జాగా అంతటిలో దట్టంగా తోట, పూలమొక్కలను పెంచడం అనేది వాళ్ల అభిరుచిని తెలియజేసేది. చుట్టూ నాలుగు అడుగుల ఎత్తులో ప్రహరీ ఉండటంతో ఆ తోట, భవనాల అందం మరింత పెరిగిందేమో అనిపిస్తుంది.

రెసిడెంట్ పాస్టర్ పేరు బెన్నెట్. స్థానికులతో స్నేహపూర్వకంగా ఉండేవాడు, తనను కలవడానికి ఎవరొచ్చినా శ్రద్ధగా వినేవాడు, ఆంగ్ల యాసతో ఆయన మాట్లాడే తెలుగు విచిత్రంగా ఉండేది. మిషన్ హాస్పిటల్ ఇంగ్లిషు డబ్ల్యు అక్షరం ఆకారంలో ఉండేది. అది ఎక్కువగా ఆడవారి ఆరోగ్యసమస్యలనే నయం చేస్తుందన్న పేరు తెచ్చుకుంది. ప్రసవానికి ముందు, తర్వాత అక్కడ ఎక్కువగా చేరేవారు. అక్కడున్నదల్లా లేడీ డాక్టర్లే మరి. వాళ్లలో ముగ్గురు కెనడా దేశానికి చెందినవారు, ఒకామె కేరళకు చెందినావిడ. వాళ్లకు రోగులు మాట్లాడే భాష అర్థమవడంలో ఇబ్బంది ఉండేది, కాని క్రమంగా సైగల ద్వారా, ఎంతోకొంత అనువాదం చేసుకుని వాళ్ల సమస్యలు అర్థం చేసుకుని, తగిన చికిత్స అందించేవారు. బెజవాడ తప్పితే చుట్టుపక్కల 15 మైళ్ల దూరంలోని గ్రామాలన్నిటికీ ఆ హాస్పిటల్ మాత్రమే ఆరోగ్య కేంద్రంగా నిలబడేది. అందువల్లే అక్కడికి గ్రామీణ మహిళల తాకిడి ఎక్కువగా ఉండేది.

ఉయ్యూరులో మూడో విశేషం అక్కడ ప్రధాన రహదారి పక్కన ఉన్న వీరమ్మ గుడి. బెజవాడ నుంచి మచిలీపట్నం వెళ్లేవారెవరికైనా ముందు దర్శనమిచ్చే గుర్తు అదే. ఏడాదికోసారి జరిగే జాతరకు భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా దూరతీరాల నుండి కూడా బళ్లు కట్టుకొని, కాలినడకన, ఎడ్ల బళ్లమీద వచ్చేవారు. స్థూలంగా వీరమ్మ కథ ఇదీ : ఆమె స్థానిక యాదవ కుటుంబానికి చెందిన యువతి. ఆమెను స్థానికంగా సంపన్నుడైన బ్రాహ్మణ వ్యక్తి ఒకరు వేధించారు. ఆ వేధింపులకు తాళలేక, అతనికి లొంగలేక ఆమె తనను తాను అంటించుకుని మంటల్లో చనిపోయింది. కాని చనిపోయేముందు, ఆ వ్యక్తి కుటుంబంలో ఏడు తరాలవారు నాశనమైపోతారని శాపమిచ్చింది.

మేమక్కడ ఉన్న కాలంలో నిజంగానే ఆ కుటుంబం చాలా దరిద్రంలో మగ్గిపోయేది. ఆ ఇంటి ఇద్దరు కుర్రాళ్లు నాకు హైస్కూల్లో సీనియర్లు. ఇద్దరికీ చదువు అబ్బేది కాదు. తర్వాత కొంతకాలానికి వాళ్లలో పెద్దవాడు పిచ్చివాడయిపోయి వీధుల్లో నగ్నంగా తిరిగేవాడు, దయ తలచి ఎవ్వరేది పెడితే అది తినేవాడు. దాన్నిబట్టి వీరమ్మ మహిమగల దేవత అనుకునేవారు అందరూ.

వీరమ్మ ఇల్లు మా ఇంటికి కాస్త దూరంలోనే ఉండేది. కేవలం జాతర సమయంలోనే ఆమె విగ్రహాన్ని దేవాలయానికి తీసుకెళ్లేవారు. మిగిలిన రోజులన్నీ ఈ ఇంట్లోనే ఉంచేవారు. ఆడవాళ్లకు ఆమెను విశేషంగా పూజించేవారు. పెళ్లయినా పిల్లలు కలగని ఆడవారు అక్కడికి వచ్చి, గుడి పక్కనున్న చెరువులో స్నానం చేసి, ఆ తడిబట్టలతో గుడిచుట్టూ మూడు మార్లు పొర్లు దండాలు పెట్టేవారు జాతర రోజుల్లో. అలాచేస్తే తమ కడుపు పండుతుందని నమ్మేవారు.

ఆ కాలంలో ఆడపిల్లలకు రజస్వల అవుతూనే వివాహం చేసేవారు. గర్భనిరోధక సాధనాలన్నవే తెలియని రోజులవి. అందువల్ల పెళ్లయిన మూడునెలలో, ఆరునెలల్లోనో గర్భవతి కాకపోతే ఆమెలో ఏదో లోపమున్నదని భావించి ఇరుగుపొరుగువారు చులకనగా చూసేవారు. ఎక్కువకాలం పిల్లలు కలగకుంటే ‘గొడ్రాలు’ అన్న ముద్ర వేసి ఆమెను దూరంగా ఉంచేవారు. అందువల్ల ఆరోజుల్లో సంతానవతులు కావడం అనేది పెళ్లయిన యువతులకు అత్యంత అవసరంగా ఉండేది.

ఉయ్యూరులో నాలుగో విశేషం ఏమంటే – అక్కడ నుంచే పుల్లేరు కాలువ ప్రయాణానికి అనుకూలంగా మారేది. బందరు కాలువకు పుల్లేరు కాలువ పిల్లకాలువ అన్నమాట. ఉయ్యూరు దగ్గర లాకులుండటంతో, మనుషులు తిరగడానికి, సరుకు రవాణాకూ అది అనుకూలంగా ఉండేది. ఉయ్యూరు నుంచి గుడివాడకు కల్లు సరఫరా జరిగేది, దానికి ప్రతిగా గుడివాడ హోల్ సేల్ మార్కెట్ నుంచి బోటుల్లో పండ్లు వచ్చేవి. ఇదిగాక మనుషుల రాకపోకలకు విడిగా బోట్లుండేవి. ఉయ్యూరు నుండి గుడివాడ దాకా నడుస్తూ పడవ లాగేవాళ్లు, తమ కష్టాన్ని మర్చిపోవడానికో ఏమో వాళ్లు జానపద గీతాలను ఎలుగెత్తి పాడుతూనే ఉండేవారు.

ఉయ్యూరు ఊరంతా ఈ పుల్లేరు కాలవ, బెజవాడ – మచిలీపట్నం ప్రధాన రహదారి మధ్యనున్నదే. దూరతీరాలనున్న బ్రిటిష్ నేల నుంచి వేల మైళ్ల సముద్ర ప్రయాణం చేసి వచ్చిన బ్రిటిష్ సైనికులు హైదరబాదు వెళ్లడానికి ఇదే ప్రధాన మార్గంగా ఉండేది.

ఊళ్లో నాలుగు పెద్ద కులాలు. యాదవులు, బ్రాహ్మణులు, వైశ్యులు, ముస్లిములు. ఎవరి వీధులు వారివే. కాలువకెళ్లే దారికి అటూఇటూ బ్రాహ్మలు, కోమట్లు ఉండేవారు. మెయిన్ రోడ్డుకు అటూ ఇటూ యాదవులు, ముస్లిములు నివసించేవారు. ముస్లిం స్త్రీలు పరదా పాటించేవారు, సాధారణంగా బయట కనిపించేవారే కాదు. ముస్లిముల వస్త్రధారణ వల్ల వాళ్లను సులువుగా గుర్తుపట్టేసేవాళ్లు.   అదీగాక, ఉర్దూ కలిసిన వారి తెలుగు ఇట్టే తెలిసిపోయేది. మామూలుగా వాళ్లు పేదలే అయినా, కాళ్లకు వేసుకునే షూల పట్ల పట్టింపుగా ఉండేవారు. ఉయ్యూర్లో మంచి చెప్పుల దుకాణం ఉండేది ఆరోజుల్లోనే. మిగిలిన కులాల వారు మాత్రం కుట్టించిన చెప్పులతోనే తృప్తి పడేవారు. చిన్నపిల్లలకు, మహిళలకు చెప్పులుండేవే కాదు. యాదవులు కలివిడిగా ఉండేవారు, ఎక్కువగా వ్యవసాయంలో నిమగ్నమై ఉండేవారు, సంపన్న బ్రాహ్మణ, వైశ్యులు వాళ్లకు అద్దెకిచ్చిన భాగాల్లో నివసించేవారు. వైశ్యులు ఎక్కువగా బట్టల వ్యాపారాల్లో ఉండేవారు. యాదవులు, ముస్లిములు చదువుకునేవారు కాదు. వైశ్యులు తమ పిల్లలకు లెక్కలు, పద్దులు తెలిసేంత చదువు వస్తే చాలన్నట్టు ఉండేవారు. బాగా చదువుకునేది ఎవరంటే కేవలం బ్రాహ్మణులే.

ఉయ్యూరు అవడానికి కోస్తాంధ్రకు మధ్య భాగంలో, కాలవల సమీపంలో ఉన్నప్పటికీ అక్కడ తాగునీటి ఎద్దడి అధికంగా ఉండేది. నూతులు తవ్వినా, పంపులు వేసినా ఉప్పునీరు తప్ప మంచినీరు పడేది కాదు. బెజవాడ దగ్గర కృష్ణా నదికి ఆనకట్ట కట్టడానికి పూర్వం సముద్రపు నీరు ఈ ప్రాంతాలను ముంచెత్తేదని, సముద్రపు నీటితో బురద నేలగా ఉండేదనడానికి ఆ బావులు సాక్ష్యంగా నిలిచేవి. స్టేట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ కార్యాలయం ఆవరణలోని నూతిలో మాత్రం మంచినీరు ఉండేది. ఆడవాళ్లు, మగవాళ్లు అందరూ అక్కడికే వెళ్లి తాగునీరు తెచ్చుకునేవారు.

ఇక కాలకృత్యాలకు పుల్లేరు కాలవే దిక్కు. ఎవ్వరికో తప్ప చేతి గడియారాలు లేకపోయినా, ఉదయం లేచి అందరూ తమ పనులను సమయానుసారంగా గతి తప్పకుండా చేసుకుపోయేవారు. జమిందారుగారి కార్యాలయంలో ఒక గంట ఉండేది, అది మోగితే సమయం ఇంతని తెలుసుకునేవారు ప్రజలు. ఆ శబ్దం ఊరంతటికీ వినిపించేది.

ఊళ్లో ధనిక పేద తేడాలు స్పష్టంగా కనిపించేవి. సాధారణంగా వైశ్యులు సంపన్నులుగా ఉండేవారు, పెద్ద ఇళ్లు, ముంగిళ్లు, పెరళ్లతో వాళ్ల ఇళ్లు విశాలంగా ఉండేవి. పెళ్లిళ్లప్పుడు వారి వైభవం మరింత స్పష్టంగా తెలిసేది. కాని మామూలప్పుడు వారు అందరితో బాగుండేవారు, తమ పనేదో తాము చూసుకునేవారు. పేదల ఇళ్లు చిన్నగా ఉండేవి. చిన్న వ్యాపారాలు, వృత్తులు, వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండేవారు.

ఊళ్లో దాదాపు 20 మంది గ్రాడ్యుయేట్లు ఉండేవారు, అందరికీ ‘ద హిందూ’ వార్తాపత్రిక చదివే అలవాటుండేది. ఒక రిటైర్డ్ హెడ్ మాస్టరుండేవారు, ఆయనకు పాత పేపర్లను జాగ్రత్తగా భద్రపరిచే అలవాటుండేది. ఏది అడిగినా ఆయన ఇట్టే తీసి ఇచ్చేవారు.

దినపత్రికలు చదివే అలవాటు అప్పుడప్పుడే కొంత పెరగడం మొదలయ్యిందిగాని, రేడియో అందరూ వినేవారు. ఎవరింట్లో వారికి రేడియో ఉండటం కల. పంచాయితీ ఆఫీసులో ఉన్న రేడియో ద్వారా వచ్చే సాయంత్రం వార్తలను అందరూ గుమిగూడి వినేవారు. అప్పట్లో వార్తలంటే ఎక్కువగా యుద్ధవార్తలే. పాశ్చాత్య దేశాల్లో పరిణామాలేమిటో తెలిసేవి.

మేం ఉయ్యూరు చేరుకునే కాలానికి అక్కడి స్థానిక పరిస్థితుల్లో మార్పులు వస్తూ ఉండేవి. కాలవ గట్టుకు ఆనుకుని ఊరికి ఓ మైలు దూరంలో ఉన్న పంచదార మిల్లు చదువుకున్న వారిని, సాంకేతిక నైపుణ్యాలున్నవారిని పనిచెయ్యడం కోసం ఆహ్వానించేది. ఫ్యాక్టరీకి కూతవేటు దూరంలో సీనియర్ అధికారుల బంగళాలుండేవి. వాటికి విద్యుత్ సౌకర్యం ఉండేది, నీటి సరఫరా కొళాయిలుండేవి. ఆ రకంగా చూసినప్పుడు ఫ్యాక్టరీ ప్రదేశానికి, ఊరికి మధ్య అంతరాలు స్పష్టం కావడం మొదలైంది. అలాగే అక్కడ విభిన్న జాతిమతాలవారుండేవారు. ఉదాహరణకు అక్కడి చీఫ్ కెమిస్ట్ ఒక బ్రాహ్మణుడు, వారింటి పక్కనే శూద్ర కులానికి చెందిన అగ్రికల్చరల్ ఆఫీసరు కుటుంబం నివసించేది. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ అనేవి కులాధారిత వ్యవస్థను పక్కకు నెట్టేస్తాయని అప్పుడే అర్థం కావడం మొదలైంది.

ఫ్యాక్టరీలో ఇద్దరు ఆంగ్లేయులు కూడా పనిచేసేవారు. జనరల్ మేనేజర్ స్థాయిలో పనిచేసే ఒకాయన పేరు ‘రైట్’, బట్టతల యూదుడొకాయన సైంటిఫిక్ అడ్వైజరుగా పనిచేసేవారు. వాళ్ల కుటుంబాలు కూడా అక్కడే ఉండేవి, కాని వీళ్లు బయట కనిపించడం అరుదు. వాళ్లకు ఏం కావాలన్నా బెజవాడ వెళ్లి స్పెన్సర్స్ దుకాణం నుంచి తెచ్చుకునేవారు. వాళ్ల ఇళ్లలో పనిచేసేవాళ్లంటే ఊరిలో ప్రత్యేకత చూపించేవారు.

వాణిజ్యపరంగా ఎదుగుతున్న ఉయ్యూరులో మిడిల్ స్కూలుగాని, హైస్కూలుగాని ఉండేవి కాదు. ముస్లిములకు వాళ్లదైన ప్రాధమిక పాఠశాల ఉండేది. ఒక ఉపాధ్యాయుడు తన ఇంట్లోనే విడిగా స్కూలు నిర్వహించేవారు, అంతే. ఉయ్యూరుకు దగ్గర్లోని పాఠశాల ఏదంటే రెండున్నర మైళ్ల దూరంలోని తాడంకి స్కూల్లో. మా సొంతూరులాగే ఈ ఊరికీ తనదైన పేరు లేదు. తాడంకి – మంటాడ – గురుజాడ కలిపి మాట్లాడుకునేవారు. ఆ రకంగా తాడంకి హైస్కూలు చుట్టుపక్కల ఇరవై గ్రామాలకు విద్యా కేంద్రంగా ఉండేది.

*

ఉయ్యూరులో వ్యాపారం ప్రారంభించడానికి మా నాన్నకు ఎక్కువ సమయం పట్టలేదు. ఆయన ఓ ముస్లిం, ఓ రెడ్డి – ఇద్దరు యువకులను పనిలో పెట్టుకున్నారు. అప్పట్లో ద హిందూ, ఆంధ్ర పత్రిక – ఇవి మద్రాసులో ప్రచురితమయ్యేవి. సాయంత్రం ఎడిషన్ను డాక్ ఎడిషన్ అనేవారు. దాన్ని వాళ్లు మద్రాసు – కలకత్తా మెయిల్లో వేస్తే ఆ పత్రికలు రాత్రంతా ప్రయాణం చేసి పడుతూలేస్తూ వచ్చేవి. బెజవాడ రైల్వే స్టేషన్ లో ఏజెంటు వాటిని తీసుకుని ‘రాయల్ మెయిల్’కు ఎక్కించేవారు. రాయల్ మెయిల్ అనేది తపాలా చేరవెయ్యడానికి ఉద్దేశించిన బస్సు. దాని టాప్ పైన పెద్ద ఎర్ర పెట్టె ఉండేది. బెజవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే రాయల్ మెయిల్ను ఉయ్యూరులో ఆపి, ఆ వార్తాపత్రికలను అందుకోవడం వాటిని చందాదారులకు అందజెయ్యడం ఆ ముస్లిం కుర్రాడు చెయ్యవలసిన పని. ఒకవేళ మద్రాసు మెయిల్ ఆలస్యమైతే ఈ బస్సుకు వార్తాపత్రికలు అందేవి కాదు. అప్పుడు తర్వాత వచ్చే ఏదో ఒక బస్సుకు బెజవాడ ఏజెంటు పంపేవారు. అలాంటప్పుడు ఉయ్యూరులో పని కష్టమయ్యేది. అంటే మచిలీపట్నం వెళ్లే ప్రతి బస్సునూ ఆపి ‘పేపర్లు వచ్చాయా’ అని అడగాల్సి ఉండేది.

హిందూ, ఆంధ్ర పత్రికలకు ఉయ్యూరులో ఉన్నది కొద్దిమంది చందాదారులు. ఆంధ్రపత్రిక తొలి తెలుగు పత్రిక, దానిలో వాడే భాష విశిష్టంగా ఉంటుందని పేరు పొందింది. మద్రాసు నుంచి ప్రచురితమయ్యే మూడు పెద్ద ఇంగ్లిష్ పత్రికల్లో హిందూ ఒకటిగా ఉండేది. సంప్రదాయమైన పత్రిక అని పేరు పొందింది. అది జాతీయోద్యమానికి మద్దతు ఇస్తున్నప్పటికీ దానికి సంబంధించిన వార్తలను మాత్రం సెన్సేషనల్ చెయ్యకుండా అప్పటి సంపాదకులు జాగ్రత్త పడేవారు. అప్పట్లో లండన్ నుంచి వచ్చే ద టైమ్స్ పత్రిక ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందినది. దానిలో మొదటి పేజీ అంతా ప్రకటనలే ఉండేవి. ఆ సంప్రదాయాన్నే హిందూ కూడా పాటించేది. ఎంత నిష్టగా ఉండేదంటే, 1948లో మహాత్మా గాంధీ హత్యకు గురయినప్పుడు కూడా దానికి సంబంధించిన వార్తలను అది లోపలి పేజీల్లోనే ప్రచురించింది! వార్తల విషయంలో ఇంత గట్టిగా ఉన్నప్పటికీ, దానికి పాఠకులకు కొదవేం ఉండేది కాదు, అలాగే ఆ పాఠకులు కూడా మరో పేపరు వైపు కన్నెత్తి చూసేవారు కాదు.

రాయల్ మెయిల్ బస్సులో వచ్చే దినపత్రికలను అందుకున్న కుర్రాడు ఉయ్యూరులో చందాదారుల ఇళ్లకు వాటిని చేరవేసేవాడు. ఆ తర్వాత కొన్ని మిగిలితే వాటిని బస్టాండులో ప్రయాణికులకు అమ్మేవాడు. కాని అలా మిగిలే కాపీలు కొన్నేగనక, అతని పని మధ్యాహ్నానికి ముందే పూర్తయ్యేది. ఆ తర్వాత అతను సిమెంటు దుకాణంలో కూర్చునే రెడ్డికి కొంత సాయం చేసేవాడు. ఎప్పుడూ ఇంత సజావుగా సాగితే ఎలా ఉండేదో తెలియదుగాని, ఈ కుర్రాడు తరచూ ఆలస్యంగా రావడం, కొన్ని రోజులు అస్సలు రాకపోవడం వంటివి చేసేవాడు. వాడికేమయ్యిందో చూడటానికి నన్ను వాళ్లింటికి పంపేవారు. అలాంటప్పుడు అతను మలేరియా జ్వరం తిరగబెట్టిందనో, మరొకటో…. ఏదోకటి చెప్పి పంపేవాడు. అప్పుడు అతని పని నేను, మా రెండో అన్నయ్య చెయ్యవలసి వచ్చేది. మా అన్నయ్య చందాదారులకు అందజేస్తే, బస్టాండులో పేపర్లమ్మే పని నాది. మేమిద్దరం దాన్ని పొద్దున్నే పూర్తిచెయ్యాలి, మళ్లీ స్కూలుకెళ్లాలి. రెడ్డి సాధారణంగా పది దాటాక వచ్చి సిమెంటు దుకాణంలో కూర్చునేవాడు.

ఉయ్యూరులో మా కుటుంబం కుదురుకోవడానికి కాస్త సమయం పట్టింది. ముఖ్యంగా మేమున్న ఇంట్లో జాగా లేక గేదెను తీసుకురాలేదు. దాన్ని మా మావయ్య కుటుంబం దగ్గరకు పంపించేశారు. అది లేకపోవడంతో మా అమ్మకు చెయ్యివిరిగినట్టనిపించేది. పెళ్లయినప్పటి నుంచి, ఉదయం లేవగానే అది కనిపించాలి, పాలు తియ్యాలి – ఇదే తొలి పని మా అమ్మకు. ఆ గేదె పాలు, పెరుగు ఆధారంతోనే తన బిడ్డలను పోషించుకున్నాననే అభిమానం ఆమెకు. అటువంటి గేదె ఇంట్లో లేదనే విషయం ఆమెను ఇబ్బంది పెడుతూ ఉండేది. దానికితోడు, పాలకోసం ఎవరో ఒకరిని చూసుకోవలసిన అవసరం పడింది.

నిజానికి ఆ రోజుల్లో పసిపిల్లలు తప్ప మరెవ్వరూ పాలు తాగేవారు కాదు. పెద్దలకు కాఫీ, టీల వంటివి అస్సలు తెలియదు. అందరికీ కావలసింది పెరుగు, మజ్జిగలే. ఇంటికెవరైనా వచ్చినా మజ్జిగే ఇచ్చేవారు.

ఉయ్యూరులో చాలామంది పాల సప్లై కోసం గండిగుంట గ్రామం మీద ఆధారపడేవారు. అయితే అక్కడివాళ్లెవ్వరూ మా ఇళ్లకు తెచ్చిపొయ్యడం చేసేవారు కాదు. ఉయ్యూరువాళ్లే తమ ఇళ్ల నుంచి ఎవరో ఒకర్ని అక్కడికి పంపేవారు. నెలవారీ వాడుకలుండేవి. ఎప్పుడైనా ఎక్కువ కావాలంటే, ముందుగానే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అమ్మేవారు పాలలో నీళ్లు కలపడం, డబ్బు ఎక్కువ తీసుకోవడం చేస్తుండేవారు. కాని మా అదృష్టంకొద్దీ మాకు దూరపు బంధువులామె మాకు సరిపడా పాలు ఇచ్చేది. దానికేమీ వెల పుచ్చుకునేది కూడా కాదు. వాళ్లింట్లో ఆమె, భర్త, కొడుకు మాత్రమే ఉండేవారు. సాధారణంగా పాలు లేదా మజ్జిగ తీసుకురావడానికి గండిగుంట నేనే వెళ్లేవాణ్ని. దీనికోసం నన్ను ఇంకా తెల్లారక ముందే లేపేసేవాళ్లు. కాలం గడిచేకొద్దీ, నాకీ పని బాగానే పట్టుబడింది. నా అంతట నేనుగా లేచి, గండిగుంట వెళ్లే ఇతర కుర్రాళ్లతో కలిసేవాణ్ని. ఒకటిన్నర మైలు దూరం ఒకవైపు చులాగ్గానే నడిచేసేవాళ్లం. కాని అటునుంచి వచ్చేప్పుడు మజ్జిగ, పాలు ఒలికి పోకుండా తీసుకురావడమే పెద్ద పని. మా రెండో అన్నయ్య ఇంకాస్త బరువు పనులు అంటే కావడితో నీళ్లు తీసుకురావడం వంటివి చేసేవాడు.

తెచ్చిన మజ్జిగను అమ్మకిచ్చేసి వెంటనే కాలువకు వెళ్లేవాణ్ని. అందరు పిల్లలు, బ్రాహ్మణులు సాధారణంగా కాలకృత్యాలు, స్నానాలు కాలువ దగ్గరే చేసేవారు. వేసవిలో కాలువ ఎండిపోయినప్పుడు నీటి కోసం ఇంకాస్త ఎక్కువ దూరం నడవాల్సి వచ్చేది. కాలవలో స్నానానికి వెళ్లడం, రావడమే పెద్ద వ్యాయామంలాగా ఉండేది. మేమంతా ఈత నేర్చుకున్నదీ కాలవల్లోనే. యుక్తవయసులో నేను కాలవ అవతలిగట్టు దాకా ఈదుకుంటూ వెళ్లి తిరిగి వచ్చేవాణ్ని. పెద్దవాళ్లు కొందరు స్నానాలయ్యాక ఇళ్లకు వెళ్లే దారిలో దేవాలయానికి వెళ్లేవారు. కాని ఉదయం ప్రసాదం ఏమీ పెట్టరు గనక పిల్లలకు దేవాలయానికి వెళ్లే సదుద్దేశాలు ఉండేవికాదు, నేరుగా ఇంటికే వచ్చేవారు. అప్పుడు ఇంట్లో పెట్టిన అన్నం తిని, మరింత కేరేజీలో కట్టుకుని బడికి బయల్దేరేవాళ్లం. అది మా ఇంటికి రెండున్నర మైళ్ల దూరంలో ఉండేది!

నాకు గుర్తున్నంత వరకు ఆ సమయంలో బడికి వెళ్లే పిల్లల బృందంలో నేనే అందరికన్నా చిన్నవాణ్ణి. ఉదయాన్నే గండిగుంట వెళ్లి రావడం మళ్లీ బడికెళ్లి రావడం, అదిగాక కాలవకకు పోయి రావడం – అంటే దాదాపు ఎనిమిది పది మైళ్ల నడక ప్రతి రోజూ. దాన్ని గమనించిన మా నాన్న స్కూలుకెళ్లి రావడానికి నాకో సైకిలుంటే బాగుంటుందనుకున్నారు. లేదంటే తాడంకి బస్సులోనైనా పంపించాలనుకున్నారు. ఒంటరిగా సైకిలు మీద వెళ్లొచ్చేంత వయసు నాకు లేదనిపించింది ఆయనకు. బస్సులు సమయానికి రావు, వచ్చినా టికెట్టు బోలెడవుతుంది. దాంతో అవి రెండూ కుదరలేదు. అయితే అప్పటికి బస్సుల్లో కండక్టర్లుగా దూరపు బంధువులు కొందరు పనిచేస్తుండేవారు. వాళ్లు మమ్మల్ని చూస్తే, మంచి మూడ్ లో ఉంటే తప్పకుండా ఎక్కించుకుని స్కూలు దగ్గర దింపేసేవారు.

స్కూల్లో చేరిన తొలి ఏడాదే నాకు నడక ఎక్కువయ్యింది. రెండో ఏడాదికల్లా మా నాన్న సైకిలు కొన్నారు. దాన్ని మా రెండో అన్నయ్య ఉదయాన్నే పేపర్లు పంచడానికి, తర్వాత స్కూలుకెళ్లడానికి వాడేవాడు. నా మరో స్నేహితుడికి కూడా సైకిలుండేది. నేను మా అన్నయ్య వెనకాల లేదా స్నేహితుడి వెనకాల కూర్చుని స్కూలుకెళ్లిపోయేవాణ్ని. ఆ తొలి ఏడాది కూడా, మా నాన్న స్నేహితులొకాయన వాళ్ల పిల్లలను ఎడ్లబండిలో స్కూలుకు పంపేవారు. నేను కూడా వాళ్లతో వెళ్లొచ్చే ఏర్పాటు చేశారు మా నాన్న.

ఆ స్నేహితుడికి ముగ్గురు కొడుకులు, నలుగురు కూతుళ్లు. వాళ్లలో అందరికన్నా పెద్దమ్మాయి అప్పటికే విశాఖపట్నం మెడికల్ కాలేజీలో చదువుతూ ఉండేది. మరో ఇద్దరు కూతుళ్లకు స్కూలుకెళ్లేంత వయసు లేదు. మగపిల్లల్లో పెద్దవాళ్లిద్దరూ కాలినడకనే వెళ్లిరావడానికి ఇష్టపడేవారు. ఎందుకంటే గూడుబండిలో కూర్చుని వెళ్లడం వారి దృష్టిలో చిన్నపిల్లలు, ఆడపిల్లలు చెయ్యవలసిన పని. వాళ్లిల్లు మా ఇంటికి మైలు దూరంలో ఉండేది. నేను కాస్త ముందుగా బయల్దేరి అక్కడకు చేరేవాణ్ని. ఆ ఎద్దు మంచి కోడెవయసులో ఉండేదేమో, దాదాపు పరుగెత్తినట్టే ఉండేది, అందుకే మేం కాలినడకన వచ్చే ఎంతోమంది పిల్లల కన్న ముందు బడికి చేరేవాళ్లం.

తాడంకి స్కూలు బెజవాడ – మచిలిపట్నం ప్రధాన రహదారిని ఆనుకునే, రోడ్డుకు అటూఇటూ ఉండేది. ఎర్ర ఇటుకల గోడలతో ఉన్న భవనం ఒకటి. దాన్ని గ్రంధాలయంగానూ, హెడ్ మాస్టరుగదికీ ఉపయోగించేవారు. దానికి ఆనుకుని కట్టిన మట్టిగోడల గదిలో మాకు నేత పని నేర్పించేవారు. ఎర్ర ఇటుకల బిల్డింగుకు ఎదురుగా క్రోటన్స్ మొక్కలతో కొంత పచ్చదనం ఉండేది. అక్కడే ఒక పెద్ద వేపచెట్టు కూడా ఉండేది. ఆ చెట్టు కొమ్మలకే ఒక ఇనుప బెల్లు తగిలించి ఉండేది. దానికో తాడు కట్టి స్కూలు ప్యూను మోగించేవాడు. హెడ్ మాస్టరు గదికి అభిముఖంగా మూడు వరసల్లో చిన్నచిన్న షెడ్డుల్లాగా ఉండేవి. ప్రతి దానిలోనూ రెండేసి క్లాసులుండేవి. ఇక్కడ ఐదు నుంచి మూడో ఫారం అంటే ఎనిమిదో తరగతి వరకూ క్లాసులు నడిచేవి. రోడ్డుకు అటువైపు రెండు పెద్ద షెడ్లుండేవి, అందులో పైతరగతుల పిల్లలుండేవారు. అక్కడే పెద్ద ఫుట్ బాల్ మైదానం కూడా ఉండేది. నేను ఎక్కువగా ఆడలేకపోయేవాణ్ని, ఎందుకంటే ఎడ్లబండిలో తొందరగా వచ్చెయ్యాలి కనుక. అదే కాలినడకన వచ్చే పిల్లలు ఇంకాస్త సమయం ఆడుకోగలిగేవారు.

క్లాసురూముల్లో బల్లలుండేవి. ఒకో బల్లమీదా ముగ్గురేసి విద్యార్థులు కూర్చునేవారు. ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. వాళ్లు టీచరుకు ఎడమచేతి వైపు విడిగా కూర్చునేవారు. మగపిల్లలంతా టీచరుకు అభిముఖంగా కూర్చునేవారు. నా ఐదో తరగతి మొదలు ఐదో ఫారం వరకూ నా సెక్షన్లో ఆడపిల్లలే లేరు. ప్రాధమిక విద్య పూర్తవుతూనే చాలామందికి పెళ్లి చేసేసేవారు ఆ రోజుల్లో. చదివిద్దామనుకున్నా కూడా, బడులు దూరంగా ఉండటంతో వెనకాడేవారు. నేనెక్కే ఎడ్లబండిలో అంతా ఆడపిల్లలే, అందరిలోకీ నేనే చిన్నవాణ్ని కావడంతో నన్ను అభిమానంగా చూసుకునేవారు. మాకు కాస్త అటూఇటూగా సీనియర్లు సైకిళ్ల మీద వచ్చేవారు. అందువల్ల మాకు రక్షణగా అనిపించేది. ఆ రోజుల్లో అందరూ ఒకరికొకరు తెలిసినవారే, బంధువుల పిల్లలే. అందువల్లేనేమో, మా స్కూలు రోజుల్లో ఆడ – మగ పిల్లల మధ్య (స్కూలు స్థాయిలో) ఆకర్షణ, ప్రేమలు, లేదా ఏడిపించడాలు వంటివి ఉండేవి కాదు. వరసయినవాళ్లు కూడా మామూలుగా ఉండేవారు.

చదువు మీద శ్రద్ధ నిలిపేంత వయసు నాది కాదు. అయినా అప్పట్లోనే కొందరు విద్యార్థులు చదువు పట్ల ఇష్టంగా కృషి చెయ్యడం గమనించేవాణ్ని. నాకు చదువు పట్ల ఇష్టమూ ఉండేది కాదు, అలాగని విముఖతా ఉండేది కాదు. తల్లిదండ్రులు స్కూల్లో చేర్పించారుగనక వెళ్లిరావడం, క్లాసురూములో ఉపాధ్యాయులు చెబుతారుగనక వినడం, చదువుకోవడం అన్నట్టే ఉండేది నా ధోరణి. అదీగాక, బ్రాహ్మణులే బాగా చదువుకుంటారు అన్న ఆలోచనేదో లోలోపల ఉండేది. అందువల్ల బాగా శ్రద్ధ పెట్టి బ్రహ్మాండంగా చదువుకోవాలన్న పట్టుదల ఉండేది కాదు. వాస్తవానికి మా క్లాసులో అందరికన్నా బాగా చదివేది బ్రాహ్మణులబ్బాయికాదు, ఒక చాకలివాళ్లబ్బాయి. అతను తనను తాను చదువుకు అర్పించుకున్నాడన్నంత దీక్షగా చదివేవాడు, మేమెవ్వరం అతని దరిదాపులక్కూడా వెళ్లగలిగేవాళ్లం కాదు, చదువులో. అతని ఉచ్చారణ సుస్పష్టంగా ఉండేది. ప్రవర్తన సైతం ఉన్నతంగా ఉండేది. వీటన్నిటికీ ప్రతిఫలంగా అన్నట్టు, మేం అతన్ని మా క్లాసు మానిటర్గా ఎన్నుకున్నాం.

మా ఉపాధ్యాయుల్లో కూడా, ఎవరో ఒకరో ఇద్దరో తప్ప, మిగిలినవాళ్లంతా చదువంటే ప్రాణం పెట్టేవాళ్లే. వాళ్లలో ఎక్కువమంది ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు పట్టాలుపొందినవాళ్లు, సరైన ఉపాధి దొరకక, చాలాకాలం నిరుద్యోగులుగా ఉన్నవాళ్లు. వాళ్ల జీతాలు తక్కువే అయినా, ఇంకా అప్పటికి ట్యూషన్ల జాడ్యం అంటలేదు. వాళ్లపట్ల సమాజం గొప్ప గౌరవమర్యాదలు కలిగిఉండేది. మా హెడ్ మాస్టరుగారికి అప్పటికి రెండు ఎమ్మే పట్టాలుండేవి, షేక్ స్పియర్ రచనల మీద ఆయన పట్టు చెప్పనలివి కానిదని అనుకునేవారు. ఆయన ఎస్సెస్సెల్సీ వారికి ఇంగ్లిష్ బోధించేవారు, వాళ్లెవ్వరూ ఈనాటికీ ఆయన శైలిని మర్చిపోలేదు. ఆయన చేతిలో ఎప్పుడూ ఒక బెత్తం ఉండేది, కాని అది ఎప్పుడూ విద్యార్థుల మీద ఆయన ప్రయోగించలేదు. అంతెందుకు, స్కూలు ఆవరణలోకి వచ్చే వీధికుక్కలను సైతం ఆయన అదిలించడం మేమెవ్వరం చూడలేదు.

ఇక లెక్కలు, సైన్సులకు సైతం మంచి మంచి టీచర్లుండేవారు. ముఖ్యంగా సైన్సు మాస్టారు ఉమారామలింగశర్మగారంటే అందరికీ చాలా ఇష్టంగా ఉండేది. గుండు, పిలకతో ఆయన సంప్రదాయంగా ఉండేవారు, విద్యార్థులతో తగినంత దూరం ఉంచేవారు. కాని ఏడాది చివర్లో ఆయన ఒక మాజిక్ లాంతరు తీసుకొచ్చి ప్రదర్శన ఇచ్చేవారు. దానిలో ఆలీబాబా నలభై దొంగల కథ చెప్పేవారు. దాన్ని ఎన్నిసార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలని ఉండేది. దానికోసం ఏడాదంతా ఎదురుచూసేవాళ్లమంటే అతిశయోక్తి కాదు.

ఆయనేగాకుండా గొప్ప ఉపాధ్యాయులు మరికొందరు కూడా ఉండేవారు. మాకు భౌగోళికశాస్త్రం చెప్పే గుత్తా రాఘవులుగారు కారు నలుపు. వాళ్లబ్బాయి కూడా మా క్లాసులోనే ఉండేవాడు. ఆయన సబ్జెక్టును పాటలుగా మార్చి చెప్పేవారు. ఉదాహరణకు ఈశాన్య, నైరుతి రుతుపవనాలు, ట్రాన్స్ – సైబీరియన్ రైల్వేలో స్టేషన్ల పేర్లు… ఇలా ఏదైనా పాటగా చెప్పేవారు. దాంతో మాకందరికీ అది కంఠతా వచ్చేసేది, ఎప్పటికీ మర్చిపోయేవాళ్లం కాదు. అనంతరకాలంలో ఉద్యోగ నిమిత్తం నేను మాస్కో వెళ్లినప్పుడు నా దుబాసీని ఆ రైల్వే స్టేషన్ల గురించి అడిగాను. అతను చెప్పలేకపోయాడుగాని, నేను చిన్నప్పుడు నేర్చుకున్న పాట పాడి వాటి పేర్లన్నీ చెప్పేశాను. అంత చిన్నవయసులో అవన్నీ నేర్పుతారా ఇండియాలో అని, ఇంత పెద్దయినా అంత బాగా గుర్తు పెట్టుకున్నందుకూ చాలా ఆశ్చర్యపోతూనే ప్రశంసించాడు!

తమ వృత్తి పట్ల గొప్ప నిబద్ధత ఉన్న ఉపాధ్యాయులు మాకు లభించడం వరమనే భావిస్తాను. అలాగే ఏదో పొట్టకూటికోసం అన్నట్టుగాకుండా తమ ఉద్యోగాలతో వాళ్లు గర్వంగా ఉండేవారు. అలాగే సమాజం పట్ల బాధ్యత ఉన్నదని దాన్ని తప్పక నెరవేర్చాలని అనుకునేవారు. నేను పెద్దయి ఉపాధ్యాయుణ్ణయ్యాక (స్కూల్లో కాదు, యూనివర్సిటీలో) థామస్ మాన్ అనే పెద్దమనిషి రాసిన ‘ద మాజిక్ మౌంటెన్’ అనే సుప్రసిద్ధ నవల్లోని వాక్యాలు సదా గుర్తొస్తూ ఉండేవి.

జేమ్స్ హిల్టన్ సృష్టించిన మిస్టర్ చిప్స్ అనే కారెక్టర్లాగా మా ఉపాధ్యాయులు మామీద బలమైన ముద్ర వేశారు. అలాగని అందరూ అద్భుతమైనవాళ్లే అని చెప్పలేను. ఒకరోఇద్దరో అవలక్షణాలుండేవాళ్లు లేకపోలేదు. అలాగే, మా టీచర్లంతా మమ్మల్ని చాలా ముద్దుగా చూసేవారనీ కాదు. ఇచ్చిన హోమ్ వర్కులు చెయ్యకపోతే, క్లాసులో లెక్కలు చెయ్యలేకపోతే దెబ్బలు పడేవి. విద్యార్థులకు ఇచ్చే శిక్షలు సాధారణంగా మూడు రకాలుండేవి. మొదటిది, క్లాసు జరిగినంతసేపు అంటే దాదాపు గంటపాటు బెంచీ మీద నిల్చోవడం. లేదా పూర్తిగా క్లాసు బయట ఎండలో నిల్చోవడం. సాధారణంగా తరగతి గదుల మధ్య గోడలుండేవి కాదుగనక, శిక్ష పడితే అది అందరికీ తెలిసేది. నిల్చోవడం వల్ల కలిగే కాళ్ల నొప్పి, ఎండ వంటివి కన్న, సాటి విద్యార్థుల మధ్య అవమానం ఎక్కువ బాధించేది. ఇవి రెండూగాక, మూడో శిక్ష ఏమంటే, డస్టర్ తిరగేసి, చెక్క భాగంతో విద్యార్థుల మండలు, వేళ్ల మీద కొట్టడం. ఇది చాలా ఎక్కువ నొప్పిని కలిగించేది. కన్నీళ్లు రాకుండా ఆపుకోవడం కష్టమయ్యేది.

ఇవన్నీ ఉన్నా, టీచర్లంటే విద్యార్థులకు గొప్ప గౌరవం ఉండేది. దేన్నీ వ్యక్తిగతంగా తీసుకునేవారు కాదు. ఉపాధ్యాయుల పట్ల తరగతిగదిలోనైనా, బయటైనా చాలా మర్యాదగా ప్రవర్తించేవారు. తల్లిదండ్రులు కూడా అల్లరిపిల్లలను దారిలో పెట్టడానికి ఉపాధ్యాయులు అవలంబించే దండోపాయమే సరైనదని నమ్మేవారు. ఒకవేళ దెబ్బలు తిన్న పిల్లలు ఇంటికొచ్చి టీచర్లు కొట్టారని చెప్పినా ఎవ్వరూ ‘అయ్యో’ అనే మాటైనా అనేవారు కాదు. అంతేకాదు, తమ ఇళ్లలో తయారైన నెయ్యిలాంటివి, పొలాల్లో పండే కూరగాయాలు, ధాన్యం వంటివీ వాళ్లకు తరచూ పంపుతూ ఉండేవారు. బడి పంతుళ్లు ఎవరు కనిపించినా రైతులు, ఇతరులు లేచి నిల్చొని మాట్లాడేవారు. స్కూలు వ్యవహారాల్లో ఎవ్వరూ తలదూర్చేవారు కాదు, అవన్నీ చక్కబెట్టుకోగల సమర్థులు వాళ్లే అనుకునే మన్నన ఉండేది.

చదువు సంగతి ఎలా ఉన్నా, మేం స్కూల్లో బోలెడన్ని ఆటలు ఆడుకునేవాళ్లం. అప్పటికి ప్రాచుర్యంలో ఉన్నవే కాదు, కొత్త ఆటలు కనిపెట్టి మరీ ఆడేవాళ్లం. అందులో ఒకటి నాకు ఇప్పటికీ గుర్తుంది. మా తరగతి గదులు మెయిన్ రోడ్డు మీదనే ఉండేవి కనుక మాకు వచ్చిపోయే బస్సులు అన్నీ కనిపిస్తూ ఉండేవి. ప్రైవేటు వ్యక్తులు బస్సులు నడిపే కాలం అది. ఆ రోడ్డు మీద 17 బస్సులు నడిచేవి. ఒక్క రాయల్ మెయిల్ కు ఒక నిర్దిష్ట సమయం ఉండేది కాని, మిగిలిన వాటికి ఉండేది కాదు. మా ఆట ఏమంటే – ఎవర్ని అడిగితే వాళ్లు తర్వాత వచ్చే బస్సు నెంబరేదో ఊహించి చెప్పాలి. సరిగ్గా చెబితే విజేత అయినట్టు. పాఠాలు వింటున్నట్టు నటిస్తూనే ఈ ఆట కొనసాగించేవాళ్లం. మా టీచర్లకు మామధ్య ఏదో ఆట జరుగుతోందని తెలుసు, కాని అదేమిటో వాళ్లకు స్పష్టంగా తెలియదు. మేం చాలా నిశ్శబ్దంగా ఆడేవాళ్లం, అడిగినప్పుడు పేపరు ముక్క మీద ఆ బస్సు నెంబరు రాయడమే. ఎవరెంత సరిగ్గా చెప్పారన్నది, విజేత ఎవరన్నది, క్లాసు చివరన తేల్చుకునేవాళ్లం.

స్కూల్లో వసతులు పెద్దగా ఏమీ ఉండేవి కాదు. పైకప్పు నీడనిచ్చేదిగాని, అంతా కన్నాలే. వర్షాలు పడినప్పుడు కారిపోయేది. పొడిచోట్లకు మా బెంచీలను జరుపుకునేవాళ్లంగాని, అదీ పెద్ద ఫలితాలనిచ్చేదికాదు. గోడలు లేకపోవడంతో పెద్ద జల్లు కొడితే క్లాసంతా తడిసిపోయేది. అలాంటప్పుడు స్కూలుకు సెలవిచ్చేవారు. వానలో తడుస్తూనే ఇళ్లకు పరుగెట్టేవాళ్లం. రెండున్నరమైళ్ల దూరం! వానకాలం చదువులని సామెత ఇలాగే వచ్చిందేమో. మాకు ఆ కాలంలో బోలెడన్ని సెలవులు దొరికేవి. స్కూలుకు వెళ్లడం, సెలవని ప్రకటించాక తిరిగి వచ్చెయ్యడం – మాకో పెద్ద ఆటగా ఉండేది.

నేను, మా రెండో అన్నయ్య చేరేక మా నాన్నకు తాడంకి స్కూలు నిర్వహణ పట్ల ఇష్టం కలిగింది. అప్పటికే ఆయన సొంతంగా ఒక స్కూలు పెట్టినవారు, టీచరుగనక ఆయన అభిప్రాయాల్ని స్కూలు ఉపాధ్యాయులు, స్థానికులు సైతం గౌరవించేవారు. తాడంకి స్కూల్లో మా నాన్న ప్రయత్నాల్లో మొదటిది, కొత్తది కూడా ఏమంటే – పేరెంట్ టీచర్ అసోసియేషన్, పిల్లల మార్కులను తల్లిదండ్రులకు పోస్టుకార్డు మీద రాసి పంపడం. ప్రతి క్వార్టర్లీ, హాఫియర్లీ పరీక్షల తర్వాత ఏయే సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయి అనేది హెడ్ మాస్టారుగారి సంతకంతో ప్రతి విద్యార్థి ఇంటికీ పోస్టు కార్డు వెళ్లిపోయేది. అప్పుడే తెలిస్తే, వార్షిక పరీక్షల సమయానికి తమ చదువును సరిదిద్దుకునే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఆ పరీక్షల మార్కులు తెలిపేవారు. విద్యార్థులకూ, వారి తల్లిదండ్రులకూ అదొక హెచ్చరికగా పనిచేసేది.

ఈ పోస్టుకార్డుల వల్ల పిల్లల్లో ఉండే అబద్ధాలరాయుళ్ల ఆటకట్టయ్యింది. ఎవరివరకో ఎందుకు, తన కొడుకులిద్దరూ చదువులో పెద్ద రాణించడం లేదన్న విషయం మా నాన్నకు ఆ పోస్టు కార్డుల ద్వారానే తెలిసింది. మా ఇద్దరికీ బాగా దెబ్బలు పడ్డాయి కూడా. నిజానికి నా మార్కులు మా అన్నకన్నా నయమే అయినప్పటికీ స్కూల్లో బుద్ధిగా ఉండకుండా కాస్త పెడసరంగా ఉన్నానన్న మాట విని నాకు మరి రెండు అదనంగా తగిలించారు మా నాన్న. కొన్నేళ్ల పాటు ఈ పోస్టుకార్డుల సంప్రదాయం పద్ధతిగా నడిచింది. మా తర్వాత ఎప్పుడో క్రమంగా మూలకు పోయింది.

నా వరకు నేను బెస్ట్, బ్రైటెస్ట్ అనే జాబితాల్లో ఉండేవాణ్ని కాదు. అయినా ‘అబౌవ్ ఏవరేజ్’ జాబితాలో మాత్రం ఉండేవాణ్ని. ‘శ్రద్ధ పెడితే ఇంకా బాగా రాణిస్తాడు’ అనేదే మా ఉపాధ్యాయులకు నామీద ఉండే అభిప్రాయం. సంవత్సరాంత పరీక్షల ముందు జాగ్రత్తగా చదివి బాగా రాయడానికి ప్రయత్నించేవాణ్ని. ఎక్కువమంది నాలాగే ఉండేవారు. ఆ వయసులో లేదా ఆ దశలో చదువు పట్ల నాకేం పట్టింపు ఉండేది కాదు. ఒక్క చదువు అనేకాదు, దేనిపట్లా ఆ సీరియస్నెస్ ఉండేది కాదు. రోజులు సంతోషంగా గడపడం, స్కూలుకెళ్లి రావడం, ఆటపాటలు… ఇంతే లోకంగా గడిపేసేవాళ్లం. శ్రద్ధగా చదివి ఏం చెయ్యాలని అనుకునేవాణ్ని. ఒక్కముక్కలో చెప్పాలంటే, బ్రహ్మాండంగా చదవడానికి అవసరమైన స్ఫూర్తి ఏదో నాలో కొరవడింది.

1942 అనేది సమాజపరంగానే కాదు, మా కుటుంబాన్ని సైతం మలుపుతిప్పిన సంవత్సరంగా మాకు గుర్తుండిపోతుంది. మా నాన్న సిమెంటు వ్యాపారం బాగుండేది. అందులో వచ్చే లాభాలతో ఆయన, భాగస్వాములు సంతోషంగా ఉండేవారు. దానికి ముందు మా నాన్నకు ఎలాంటి వ్యాపార అనుభవమూ లేకపోయినా, రోజువారీ కార్యకలాపాలను పట్టించుకుంటూ ఉండడంతో అది అభివృద్ధి చెందింది.

యుద్ధప్రభావాన్ని తట్టుకోవడానికి కొన్ని ప్రదేశాల్లో ప్రభుత్వ పెట్టుబడులు పెరిగాయి. కృష్ణా జిల్లా అందులో ఒకటి. ఉదాహరణకు గన్నవరంలో విమానాశ్రయం కట్టాలన్న ఆలోచన కార్యరూపం దాల్చింది అప్పుడే. (కొన్నేళ్ల తర్వాత దాన్ని విజయవాడ మునిసిపాలిటీ పరిధిలోకి తీసుకురావడంతో దాన్ని విజయవాడ విమానాశ్రయం అని వ్యవహరించడం ప్రారంభమైంది).

బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసినా అది సైనిక అవసరాలకే అన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. ఉదాహరణకు బ్రిటిష్ సైనికులను రప్పించడానికి మచిలీపట్నం ఓడరేవును అభివృద్ధి చేశారు. ఆ తర్వాత మద్రాసు నుంచి కలకత్తా దాకా ఉన్న ముఖ్య ప్రాంతాలను కలుపుతూ గ్రాండ్ ట్రంక్ రైల్వే లైను, రోడ్డు నిర్మాణం చేశారు. అప్పటివరకూ చిన్నచిన్న బృందాలుగా స్థానిక యుద్ధాల్లో పాల్గొంటూ ఉండే బ్రిటిష్ ఆర్మీ, ఆ తర్వాత పెద్ద దళాలుగా, సైన్యంగా బలపడింది. రైల్వే, రహదారి – రెండూ అందుబాటులోకి వచ్చినతర్వాతే మచిలీపట్నం పోర్టు వైభవం తగ్గిపోవడం మొదలయ్యింది.

చెప్పొచ్చేదేమంటే, 1942 నాటికి యుద్ధం గగనతలాలకు సైతం విస్తరించింది. ప్రత్యర్థుల దాడుల నుంచి తట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం మద్రాసు ప్రెసిడెన్సీ అంతటా చిన్న విమానాశ్రయాల నిర్మాణానికి నడుం బిగించింది. బెజవాడ, కడప, రాజమండ్రి విమానాశ్రయాలు, అప్పుడు అలా కట్టినవన్నమాట.

గన్నవరంలో విమానాశ్రయానికి ఒక ఎత్తైన ప్రదేశాన్ని ఎంచుకున్నారు. అయితే దాన్నిండా తాటి చెట్లుండేవి. వాటిని కొట్టడం, భూమిని చదునుచెయ్యడం తొలి దశ. తర్వాత నిర్మాణాలు. వీటన్నిటికీ బోల్డంతమంది కాంట్రాక్టర్లు, మధ్యస్థాయి సూపర్ వైజర్లు, వేలమంది శ్రామికుల అవసరం పడింది. వేతనాలు బాగుండేవి. దాంతో గన్నవరం చుట్టుపక్కల అనేకాదు, జిల్లా నలుమూలల నుంచి ఆ ప్రదేశానికి జనాలు తరలివచ్చారు. ముఖ్యంగా అప్పటివరకూ కష్టమోనష్టమో వ్యవసాయంలోనే ఉన్నవారు, చదువుకోనివారు, కుటుంబం ఒప్పుకోకనో, పరిస్థితులు అనుకూలించకనో, ధైర్యం చాలకనో సైన్యంలో చేరడానికి జంకిన యువకులు ఈ ఉద్యోగ అవకాశాలను వినియోగించుకున్నారు. నిర్మాణ పనులు ఊపందుకోవడంతో స్థానిక ఆర్థిక, సామాజిక పరిస్థితులు మారిపోవడం మొదలయ్యింది. జిల్లాలో అదొక్కటే పెద్ద పని కావడం వల్ల కొన్నేళ్లపాటు, ఎంతోమందికి స్థిరమైన ఉపాధి చూపగలిగింది.

గన్నవరంలో అప్పటికప్పుడు అంతమందికి ఆవాసాలు దొరకడం కష్టం. అందువల్ల వచ్చినవారికి టెంట్లు వేసి ఉంచేవారు. వారికి నీళ్లను బెజవాడ నుంచి ట్యాంకర్లతో తెచ్చిపోసేవారు. వారిలో మా నాన్న మేనల్లుళ్లు సైతం ఉండేవారు. ఈ టెంటు టౌనులోకి తర్వాత మహిళా కూలీలు కూడా వచ్చి చేరారు. ఆ తర్వాత ఆకస్మికంగా సుఖవ్యాధులు విజృంభించాయి. యాంటీబయాటిక్స్ తెలియని, అందుబాటులో లేని రోజులు కావడం వల్ల చాలామంది చిన్నవయసులోనే మరణించేవారు. అలా మరణించినవారిలో మా మేనబావ ఒకడుండేవాడు. నన్ను అతను చిన్నప్పుడు సైకిల్ మీద తిప్పేవాడని జ్ఞాపకం. అందువల్ల అతను పోయాడని తెలిసినప్పుడు నేను కూడా విచారించాను.

మా కుటుంబంలోనూ ఆ సమయంలో కొన్ని కీలకమైన పరిణామాలు సంభవించాయి. మా పెద్దన్నయ్య రమేశ్ చౌదరి హరిద్వార్ లోని గురుకులంలో వైదికమైన చదువు పూర్తిచేసుకుని తిరిగివచ్చేశాడు. అతని చదువుకు తగిన ఉద్యోగ అవకాశాలు ఉయ్యూరు, బెజవాడ వంటి ప్రాంతాల్లో దొరకడం కష్టం. అయినా తన కాళ్ల మీద తాను నిలబడాలనే పట్టుదల అతనిలో మెండుగా ఉండేది. దాన్ని గమనించిన నాన్న అతన్ని బెజవాడలో బ్రహ్మానందం అనే ఒక బ్రాహ్మణ పెద్దమనిషి సంరక్షణలో పెట్టారు. ఆయన నాన్నకు స్నేహితులు, హిందూ పేపరుకు ఏజెంటుగా పనిచేసేవారు. మరోవైపు కాంగ్రెసు పార్టీ పనుల్లో తలమునకలుగా ఉండేవారు. ఆయనకు ఉబ్బసం వ్యాధి ఉండటంతో, పేపరు పనుల్లోనూ, పార్టీ పనుల్లోనూ ఆయన కొడుకులు సాయపడుతూ ఉండేవారు. నలుగురు కొడుకులతో కలిసి మచిలీపట్నం రోడ్డులో పెద్ద ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా నివసించేవారు. ఆ రోజుల్లో జిల్లా కాంగ్రెసు పార్టీ కార్యకలాపాలకు ఆ ఇల్లే విడిదిగా ఉండేది. ఎందరో నాయకులు నిత్యం వచ్చిపోతూ ఉండేవారు.

బ్రహ్మానందంగారింట్లో మూడో అంతస్తులో మా అన్నయ్యకో గది ఇచ్చారు. భోజనం వాళ్లే పెట్టేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే మరో కొడుకులాగా చూసుకునేవారు. కాని మా అన్నయ్యకు తెలుగు రాదు, అతనికి వచ్చిన ఇంగ్లిష్, హిందీ మాట్లాడగలిగేవాళ్లు ఆ ఇంట్లోనూ, ఊళ్లోనూ కూడా తక్కువే. అందువల్ల అన్నయ్య అందరితోనూ కలవలేకపోయేవాడు. ఇంగ్లిష్ దినపత్రికల్లో ఏదోక ఉద్యోగం వస్తుందనే ఆశతో దరఖాస్తులు పంపిస్తూ, తనకు తోచినవి రాసుకుంటూ ఉండేవాడు. తర్వాతి కాలంలో తాను అనుకున్నది సాధించిన వ్యక్తిగా అందరి మన్ననలూ అందుకున్నాడు.

అప్పటికి మా పెద్దక్కయ్య నాగరత్నమ్మకు వివాహమై తొమ్మిదేళ్లు కావొచ్చేది. ఆమెకు సంతానం కలగలేదని మా నాన్నకు బెంగగా ఉండేది. అప్పటికింకా మేనరికాల దుష్ప్రభావాలు అందరికీ తెలియవు. ఆడపిల్లలను అయితే ఇటు మేనమామలకు లేదంటే నాన్నవైపు మేనబావలకు ఇచ్చి పెళ్లి చెయ్యడం సర్వసాధారణం. అలాగే సాధారణంగా అందరికీ చక్కటి పిల్లలే పుట్టేవారు. మరి మా అక్కయ్యకు ఎందువల్ల పుట్టలేదో అనేది మా తల్లిదండ్రులను వేధించేది. నాన్న తనకు తెలిసిన డాక్టర్లకు చూపించారామెను. అందరూ ఆమెకు శస్త్రచికిత్స అవసరం అని తీర్మానించారు. అది ప్రమాదకరం కావొచ్చు, అంతా సవ్యంగా జరిగినా పిల్లలు కలుగుతారనే గ్యారెంటీ ఏమీ లేదని కూడా వాళ్లు ముందే చెప్పారు. గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయని మాత్రమే వాళ్లు చెప్పారు. ఎన్ని ఇబ్బందులున్నా ఎదుర్కొని ఉయ్యూరు సీబీఎమ్ ఆస్పత్రిలో ఆమెకు ఆపరేషన్ చేయించాలని నిర్ణయించుకుని గుడివాడ నుంచి మా ఇంటికి తీసుకొచ్చారు.

అక్కయ్య శస్త్రచికిత్సకు చాలా సమయం పట్టింది. ఆ తర్వాత ఆమెకు తెలివి రావడానికి కూడా చాలా గంటలు పట్టాయి. అంతసేపూ మేమంతా ఆస్పత్రిలో ఆందోళనగా ఎదురుచూశాం. ఆ తర్వాత దాదాపు నెల రోజులు ఆమె ఆస్పత్రిలోనే ఉండిపోవలసి వచ్చింది. 1942 ఆగస్టు 9న మా అక్కయ్య తిరిగి ఇంటికి వచ్చింది.

ఆ రోజు నా స్మృతిపథంలో నిలిచిపోతుంది.

ఎప్పట్లానే పిల్లలమంతా మజ్జిగ, పాలు తేవడానికి ఉదయాన్నే గండిగుంట బయల్దేరాం. దారిపొడుగునా టెలిగ్రాఫ్ స్తంభాల నుంచి తీగలు తెగి వేలాడ్డం గమనించాం. మేం చాలా చిన్నవాళ్లం కావడంతో కాంగ్రెస్ పార్టీ ఉధృతం చేసిన క్విట్ ఇండియా తీర్మానం, సహాయ నిరాకరణ ఉద్యమాల గురించి మాకేమీ తెలియదు. అందువల్ల ఈ తీగలను ఎవరు తెంపి పారేశారు అని ఆలోచిస్తూ నడిచాం. అక్కణ్నుంచి వచ్చాక మళ్లీ స్కూలుకెళ్లాలన్న తొందరలో అంతకుమించి ఆలోచించలేదు.

తీరా స్కూలుకెళ్లాక మా సీనియర్లు ‘ఇవాళ స్కూలుకు వెళ్లాల్సిన పనిలేదు, స్ట్రైకు చేస్తున్నాం’ అని చెప్పారు. కాని స్కూలు మానేశామని చెబితే మా నాన్న ఏమంటారో అని మేం స్కూలు మానకుండా అక్కడే కూర్చున్నాం.

ఈలోగా బెజవాడలో పోలీసులు అనుమానం ఉన్న రాజకీయ (కాంగ్రెసు) వ్యక్తులందరినీ పట్టుకోవడం, సోదాలు, అరెస్టులు ప్రారంభించారు. వాళ్లలో బ్రహ్మానందంగారి పెద్దబ్బాయి కూడా ఉన్నాడు. మా అన్నయ్య ఉన్నది అతనితోనే. మూడో అంతస్తులో వెతికితే మా అన్నయ్య పుస్తకాలు, పేపర్ల గుట్ట మధ్యన కనబడ్డాడు. సరైన క్షురకర్మ లేక, తెలుగు మాట్లాడలేని యువకుడు వాళ్లకు అనుమానాస్పదంగా, తిరుగుబాటుదారుడిలాగా కనిపించాడు. కాసేపు మాట్లాడి, అరెస్టు చేసి జైలుకు తీసుకుపోయారు. అక్కడ తల్లిదండ్రులు, కుటుంబం గురించి అడిగి తెలుసుకుని రిజర్వు పోలీసు దళం నేరుగా ఉయ్యూరు వచ్చేశారు. మా నాన్నను సైతం అక్కడికక్కడే అరెస్టు చేసేశారు.

ఆ ఉదయమే ఆస్పత్రి నుంచి వచ్చిన అక్కయ్య కోసం ఇంట్లో అన్ని ఏర్పాట్లూ చేశారు నాన్న. తర్వాత ఆఫీసుకు వెళ్లి సిమెంటు పని, దినపత్రికల పని చూసుకుంటూ ఉండగా పోలీసులు వచ్చేశారు. పోలీసులను చూడటమే ఆశ్చర్యమనుకుంటే, వాళ్లు అప్పటికే పెద్దన్నయ్యను అరెస్టు చేశారన్న వార్త విని ఆయన మ్రాన్పడిపోయారు. ఈలోగా దినపత్రికల్లో పెట్టి, ఆయన అభ్యంతరకరమైన పాంప్లెట్లు పంచుతున్నారన్న అభియోగం మోపి, అరెస్టు చేస్తున్నట్టు చెప్పారు పోలీసులు. (అవి వాళ్లతో తీసుకొచ్చి, ఆఫీసులో దొరికినట్టు చెప్పారు) తమ వ్యానులోనే ఇంటికి తీసుకొచ్చి, మా అమ్మకు చూపించి, వార్త చెప్పేసి తమతో తీసుకుపోయారు. మొదట బెజవాడకు, అక్కణ్నుంచి నూజివీడు సబ్ జైలుకూ తీసుకుపోయి, తండ్రీకొడుకులను ఒకే సెల్లో పెట్టేశారు.

దీనంతటినీ చూస్తున్న రెడ్డి వెంటనే స్కూలుకొచ్చి నన్ను, మా రెండో అన్నయ్యనూ ఇంటికి తీసుకొచ్చేశాడు. మా నాన్న అరెస్టయితే ఏమవుతుందన్న ఆలోచన కలిగేంత వయసు నాకింకా లేదు. కాని మా అక్కయ్య, అమ్మ శోకానికి అంతులేకుండా పోయింది. అప్పుడే కుట్లు మానుతున్న శరీరం ఏమవుతుందోనని భయపడేంతగా మా అక్కయ్య ఏడిచింది. ఈలోగా గుడివాడలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మా బావకు కబురు అందింది. ఆయన బెజవాడ, అక్కణ్నుంచి నూజివీడు వెళ్లి వాళ్ల విడుదల కోసం ఏం చెయ్యాలో తెలుసుకుని వచ్చారు.

నిజానికి మా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. మా నాన్న సంపాదన లేకపోతే ఇల్లు గడిచే రోజులు కావు. మా బావ వచ్చి పోలీసులతో మాట్లాడటానికి మా నాన్న స్నేహితులను పోగుచేశాడు. సబ్ డివిజనల్ జెయిలుకు తరలించే సమయంలో మా నాన్నతో మాట్లాడే అవకాశం కల్పించారు, అది అన్నయ్య విషయంలో జరగలేదు. పెద్దక్కయ్య, చిన్నక్కయ్య, రెండో అన్నయ్య నేను, అమ్మ అంతా వీరమ్మ ఆలయం దగ్గర వేచి చూశాం. పోలీసు వ్యాను నుంచి దిగిన మా నాన్న ముఖం పాలిపోయి ఉండటాన్ని మేం గమనించాం. కాని ఏమీ జరగనట్టు ఉండటానికి ఆయన ప్రయత్నించారు. భవిష్యత్తు ఎలా ఉంటుందని, ఏం జరుగుతుందని అందరి మనసుల్లోనూ ఒకటే ప్రశ్న. కొద్ది నిమిషాల తర్వాత మళ్లీ వ్యానెక్కించి పోలీసులు ఆయన్ను తీసుకుపోయారు. ఇంటికొచ్చిన మేమంతా ఎవరి ఆలోచనల్లో వాళ్లు ఉండిపోయాం. ఆ రోజు మా ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలింది.

విడుదల కావాలంటే క్షమాపణపత్రం రాసివ్వమని పోలీసులు మా నాన్నను నిర్బంధించారు. వారు చెబుతున్న తప్పేమీ తాను చెయ్యలేదుగనక అలా రాసివ్వడం ఆయనకు ఇష్టముండేది కాదు. అసలు వాళ్లు చూపిస్తున్న పాంప్లెట్ ను అంతకు ముందు తాను కనీసం చూడను కూడా చూడలేదని ఆయన బాధపడ్డారు. అందువల్ల క్షమాపణ పత్రం రాయనని భీష్మించుక్కూర్చున్నారుగాని, ఆయన స్నేహితులు కుటుంబశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రాసివ్వమని ఒత్తిడి చేశారు. తన సత్యానికి, కుటుంబ క్షేమానికి మధ్య ఆయన నలిగిపోయారు. కాని వాళ్లు చెప్పినట్టే రాసిచ్చాక, ఓ పదిహేను రోజుల తర్వాత ఆయనను విడుదల చేశారు. కాని తర్వాత జీవితమంతా ఆయన దానికి బాధపడుతూనే ఉన్నారు.

ఇక అన్నయ్య మీద మోపిన అభియోగాలు రకరకాలు. అయితే అన్నయ్యకు తాను స్వయంగా వాదించుకునే అవకాశం దక్కింది. ఆయన కోర్టులో స్పష్టమైన, స్వచ్ఛమైన ఇంగ్లిషులో తానే తప్పూ చెయ్యలేదని చెప్పుకొన్నాడు. ఆనాటి సబ్ కలెక్టరు మిస్టర్ గిలెట్ మా అన్నయ్య మేధస్సును, భాషాపటిమనూ పొగిడాడు. కాని న్యాయవ్యవస్థ పద్ధతుల ప్రకారం అలీపూర్ జెయిల్లో బి క్లాసు ఖైదీగా ఆరునెల్లపాటు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు. మా అన్నయ్య ఆ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నాడు. అప్పటికి అక్కడ శిక్ష అనుభవిస్తున్న ఎంతోమంది గొప్పవారితో పరిచయాలు చేసుకున్నాడు. తర్వాత ఆయన పాత్రికేయుడిగా వృత్తి జీవితం ప్రారంభించినప్పుడు అవన్నీ ఎంతో అక్కరకొచ్చాయి.

కాని జైలు నుంచి ఇంటికొచ్చేనాటికి మా అన్నయ్య ఎముకల పోగులాగా కనిపించాడు. ఎన్నో గాయాలతో రక్తాలోడుతూ ఉండేవాడు. ఎన్నో నెలల పాటు మళ్లీ చంటిబిడ్డను సాకినట్టు సాకింది మా అమ్మ. ఆరోగ్యం పుంజుకున్నాక మా అన్నయ్య మద్రాసు వెళ్లి హిందూ పత్రికలో జర్నలిస్టుగా చేరాడు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆయనకు ప్రభుత్వం ఐదెకరాల భూమి, మరికొన్ని సదుపాయాలను ఇచ్చింది.

*

అప్పుడే మన ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు వచ్చాయి. అన్నిటికీ మూలం అప్పటికి జరుగుతున్న రెండో ప్రపంచయుద్ధమే. ప్రభుత్వం ఎన్నో ప్రైవేటు వాహనాలను స్వాధీనం చేసుకుంది, పౌర సరఫరాలను తగ్గించి సైన్య అవసరాలకు మళ్లించింది. వాటిలో భాగంగా కొన్ని వస్తువుల అమ్మకాలు కుదిరేది కాదు. ఆ ప్రభావంతో సిమెంటు అమ్మకాల మీద ఆంక్షలు వచ్చాయి. అలాగే కిరోసిన్ అమ్మకాలు కూడా. మార్కెట్లో ఎర్ర కిరసనాయిలు అని మరొకటి వచ్చిందిగాని ఏది ఎప్పుడు దొరుకుతుందో తెలియని అనిశ్చితి వల్ల జనాలు తమకు వీలయినన్ని వస్తువులను వీలున్నంత వరకు కొని దాచిపెట్టుకోవడం మొదలుపెట్టారు. దాంతో కంట్రోల్లో ఉన్న వస్తువులకు ధరలు పెరిగి బ్లాక్ మార్కెట్ ఏర్పడింది. వీటన్నిటి ఫలితంగా మా నాన్న వ్యాపారం స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. దాంతో భాగస్వాములు కలిసి చర్చించుకుని అప్పటికి దాన్ని మూసేసి కేవలం దినపత్రికల వ్యాపారం మీద దృష్టి కేంద్రీకరించాలనుకున్నారు. దాంతో మా నాన్న వివిధ వార, పక్ష పత్రికల డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. అప్పట్లో బొంబాయి నుంచి వచ్చే ‘ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ’ గొప్ప సంచలనంగా ఉండేది. దానికో ప్రత్యేకమైన వాసన కూడా ఉండేది. అది నాకీనాటికీ గుర్తుంది. ఉయ్యూరులో ఈ పత్రికలను కొనేదంతా చక్కెర మిల్లు ఉద్యోగులే. అంత తక్కువమంది చందాదారులుంటే అమ్మకాలు తక్కువ, నాన్నకు వచ్చే కమిషన్ తక్కువ, అది కుటుంబ అవసరాలకు సరిపోయేదేం కాదు.

ఈలోగా మా రెండో అక్కయ్య హైస్కూలు చదువు పూర్తిచేసింది. కాకినాడలో బాలికలకు ప్రత్యేక హాస్టలుండటంతో అక్కడ ఆమెను కాలేజీలో చేర్చారు. ఆరోజుల్లో సామాన్యంగా ఆడపిల్లలను చదివించేవారు కాదు. ఒకవేళ చదివించినా హైస్కూలు వరకే. ఆపైన పెళ్లి చేసి పంపడమే. కాని మా నాన్నకు బాలికా విద్య పట్ల స్థిరమైన అభిప్రాయాలుండేవి. అందువల్ల మా అక్క ఎంతవరకు చదివితే అంతవరకూ చదివించాలనుకున్నారు. మా అక్క కాకినాడలో చేరింది.

ఒక విద్యార్థిని హాస్టల్లో ఉంచి చదివించడమంటే మాటలు కాదు. ఆ ఖర్చును తట్టుకోవాలంటే రాబడి పెంచుకోవాలి. ఆ ఉద్దేశంతో మా నాన్న కంకిపాడులో కూడా న్యూస్ పేపర్ ఏజెన్సీ పెట్టాలనుకున్నారు. అది ఉయ్యూరు వంటి టౌనే. ఎనిమిది మైళ్ల దూరం. ఆ వ్యాపారాన్ని చూడటానికి నన్ను, మా రెండో అన్నయ్యను అక్కడ పెట్టారు. మాకిద్దరికీ సాయంగా ఓ విధవరాలైన బంధువు వచ్చారు. మా చదువు, ఇంటికి సంబంధించిన పనులతో పాటు ఈ పేపర్ ఏజెన్సీ పనులు కూడా చూడాల్సి వచ్చేది మాకు.

మేమే కాదు, అప్పట్లో అందరూ ‘లోటు’ను తట్టుకోవడానికి పాట్లు పడుతూనే ఉండేవారు. పెట్రోలు కొరత వల్ల బస్సులు, కార్లు బొగ్గు వినియోగించడం మొదలుపెట్టాయి. వేసుకునే గుడ్డలకూ కొరతగానే ఉండేది. చొక్కాలు, ప్యాంట్లు, చీరలు, ధోవతులు – అన్నిటికీ ఒకటే దొరికేది ‘స్టాండర్డ్ క్లాత్’ అని. దానికీ కటకటే. ఎప్పుడో ఒకప్పుడు అమ్మేవారు. మా అక్కయ్య చీరల కోసం నేను మా రెండో అన్నయ్య గంటల పాటు క్యూలో నిల్చొనేవాళ్లమని నాకు గుర్తుంది. ఇదంతా ఓ ఏడాది పాటు నడిచాక, మా నాన్న కంకిపాడులో ఏజెన్సీ ఎత్తివేసి నన్నూ అన్నయ్యనూ ఉయ్యూరు తీసుకొచ్చేశారు.

అప్పటికి నేను ఐదో ఫారమ్ లోకి వచ్చాను. అప్పుడు మేం చదువుతున్నవాటికి తోడు ఒక ఆప్షనల్ సబ్జెక్టు అదనంగా ఎంచుకోవాలి. లెక్కలు, ఫిజిక్సు, చరిత్ర, కెమిస్ట్రీ వంటివి. సాధారణంగా అందరూ అయితే లెక్కలు లేదంటే చరిత్ర ఎంచుకునేవారు. ప్రయోగశాలలు మాకు అందుబాటులో లేవుగనక ఫిజిక్సు, కెమిస్ట్రీ ఎంచుకునేవారు కాదు. మా అన్నదమ్ముల్లో ఒకరు ఇంజినీరు, మరొకరు డాక్టరు కావాలనేది మా నాన్న అభిలాషగా ఉండేది. అందువల్ల మా రెండో అన్నయ్య లెక్కలను ఎంచుకోవాలని ఆయన పట్టుపట్టారు. కాని అతనికి అందులో ఇష్టం లేదు. ఐదో ఫారం గట్టెక్కించాడుగాని, తర్వాత మెట్రిక్యులేషన్ సమయానికి మా అన్నయ్య లెక్కల సబ్జెక్టు ఎంచుకోవడం తప్పని తేలిపోయింది.

ఇప్పుడిక నా వంతు. నాకు లెక్కలంటే అస్సలిష్టం లేదని, ఆల్జీబ్రా అంటేనే గుండె గాభరా అని మా నాన్నకు తెలుసు. కాని పట్టుదలగా శ్రమిస్తే సాధించలేకపోతానా అని ఆయనకు నమ్మకం మెండుగా ఉండేది. అదే కొన్నేళ్ల క్రితం మా రెండో అక్కయ్య విషయంలో ఆమె చరిత్ర ఎంచుకుంటే ఆయన సమ్మతించారు. కాని మా విషయంలో ఆశ ఎక్కువగా ఉండి, లెక్కలు తీసుకోమని ఒత్తిడి చేశారు. దేవుడి దయ వలన నాకు మొదటి ఏడాది రంగాచారిగారనే మంచి లెక్కల ఉపాధ్యాయుడు దొరికారు. సంప్రదాయానికి రూపం అనేట్టుండే ఆయన నుదుటన నిలువు నామాలు, గుండు పిలకతో కనిపించేవారు. ఆప్షనల్ మేథమేటిక్స్ ను అర్థం చేసుకునేందుకు నేను ఆయన ఇంటికి ట్యూషన్ కు వెళ్లేవాణ్ని. ఉదయాన్నే వెళితే గంటో, రెండో గంటలో కూర్చోబెట్టి అన్నీ అర్థమయ్యేలా చెప్పి చేయించేవారు. విద్యార్థుల పట్ల ఆయన కరుణ, నిబద్ధత వల్లే నేను వార్షిక పరీక్షల్లో గట్టెక్కగలిగాను. అప్పట్లో డిటెయిన్ చేసే పద్ధతి ఉండేది. అదేమంటే ఎవరైనా విద్యార్థి ఏదైనా పరీక్ష బాగా రాయలేకపోతాడనుకుంటే హెడ్ మాస్టరు వారిని ఆ ఏడాది పరీక్షలు రాయనివ్వకుండా డిటెయిన్ చేసేవారు. తర్వాత ఏడాది పరీక్షలకు సిద్ధం కమ్మని చెప్పేవారు. మా అన్నయ్య అటువంటి అవమానం ఎందుకని, పరీక్ష రాశాడు, కాని ఫెయిలయ్యాడు. దానివల్ల మేమిద్దం ఒకే క్లాసులోకి వచ్చేసినట్టు అయ్యింది.

మమ్మల్నిద్దరినీ ఒకే స్కూల్లో ఒకే క్లాసులో ఉంచడం భావ్యం కాదని మా నాన్నకు అనిపించింది. దాంతో నన్ను ఉయ్యూరుకు ఎనిమిది మైళ్ల దూరంలో ఉన్న పామర్రుకు మార్చేశారు. అప్పటికే మా బావ అక్కడ హైస్కూల్లో పనిచేస్తున్నారు, క్రమశిక్షణ విషయంలో చండశాసనుడని పేరు తెచ్చుకున్నాడు. ఆయన నీడన నేను బాగా చదువుతానని ఆయన అనుకున్నారు. మా బావ మంచివాడు, అభిమానస్తుడు అయినప్పటికీ కోపం వస్తే మనిషి కానట్టుండేవాడు. అతని ఆగ్రహాన్ని పూర్వం నేను చవిచూశాను కూడా.

నేను ఉదయమే లేవాలి, రాత్రి పొద్దు పోయేదాకా చదవాలన్న నిబంధన పెట్టాడు మా బావ. ఉదయం లేవడం నాకు అలవాటుంది కనుక పర్లేదుగాని, రాత్రి చదవాలన్నదే నాకు కష్టంగా ఉండేది. కాని గత్యంతరం లేక పెద్ద దీపం ముందు కూర్చుని కునికిపాట్లు పడుతూ చదివేవాడిని. అప్పటికే స్కూలు ఫైనలు ఫెయిలయిన మరో విద్యార్థి సైతం వాళ్లింట్లో ఉండేవాడు. బావ వేరే గదిలో ఉన్నా, అతనికి వినిపించేలా పెద్దగా చదవాలి మేమిద్దరం. మా కంఠాలు ఏమాత్రం తగ్గినా వెంటనే బావ వచ్చి అరిచేవాడు. కాని మేం ఎప్పుడెప్పుడు నిద్ర పోదామా అని ఎదురుచూస్తూ ఏదో మాటవరసకు చదివేవాళ్లం.

ఈలోగా మా కుటుంబంలోనూ, బయట రాజకీయాల్లోనూ కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. చాలా ఏళ్లుగా మంచి ఏజెంటుగా పనిచేస్తున్నందున మా నాన్నను ఆంధ్రపత్రిక తెనాలికి కూడా ఏజెంటుగా నియమించింది. తెనాలి ఉయ్యూరుకు నాలుగైదు రెట్ల పట్టణం. కలకత్రా మద్రాసు మెయిన్ రైల్వే లైనులో ఉంది. ఈ పరిణామానికి మా నాన్న చాలా సంతోషించారు, వెంటనే కుటుంబాన్ని తెనాలికి తరలించే పనిలో పడ్డారు. అప్పటికి మా రెండో అన్నయ్య చదువు మధ్యలో ఉన్నందున వాడిని తాడంకిలోనే తెలిసినవారింట్లో ఉంచేట్టుగా మాట్లాడారు. ఆ తర్వాత వేసవిలో ఇంటికొచ్చిన మా పెద్దన్నయ్యకు మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు.

ఆపాటికి రెండో ప్రపంచ యుద్ధం అయిపోవచ్చింది. మన దేశానికి సంబంధించి జాతీయ నాయకులు చర్చలు జరుపుతూ ఉండేవారు. ఇక దేశానికి స్వాతంత్య్రం వచ్చేస్తుందని అందరూ అనుకునేవారు. మద్రాసు ప్రెసిడెన్సీలో కాంగ్రెసు పార్టీ నేతలతో ఒక మధ్యంతర ప్రభుత్వం నడుస్తూ ఉండేది, అలాగే ఢిల్లీలో కాంగ్రెసు పార్టీ, ముస్లిమ్ లీగ్, ఇతరుల సమన్వయంతో ఒక ప్రభుత్వం పనిచేస్తూ ఉండేది. ప్రెసిడెన్సీలోని యువతలో మంచి పట్టున్న కమ్యూనిస్టు పార్టీ తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ ఉండేది. స్వాతంత్ర్యం ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, వస్తే ఏమవుతుంది, తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఎవ్వరికీ పూర్తిగా ఏమీ తెలియని స్థితి. ఏదైనా స్వాతంత్య్ర భారతం గురించి అందరికీ ఒక ఆశావహమైన దృక్పథం ఉండేది.

*

ఆ వేసవి, నాకు మా రెండో అన్నయ్యకు చాలా బాధాకరంగా గడిచింది. ఇద్దరమూ ఫైనల్ పరీక్షల్లో ఫెయిలయ్యాం మరి. మా సంగతి చూసి మా నాన్నకు చాలా విచారం కలిగింది. ఇద్దరినీ ఏం చెయ్యాలో భవిష్యత్తు ఏమిటో తెలియక ఆయన కలవరపడ్డారు. నేను ఫెయిలయ్యింది ఆప్షనల్ మేథమేటిక్స్ లోనే గనక, నేను హిస్టరీకి మారిపోయి మళ్లీ స్కూలుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఆయన నన్ను మళ్లీ లెక్కలు తీసుకోమని చెప్పారుగాని చదువుతున్నవాణ్ని నేను, నాకేమేం వచ్చో రాదో నాకే తెలుసు అంటూ గట్టిగా వాదించాను గనక ఇక మళ్లీ ఏమీ అనలేదు. మా రెండో అన్నయ్య పూర్తిగా చదువే వదిలేద్దాం అనుకున్నాడుగాని, మూడోసారి ప్రయత్నించి వదిలేద్దాం అనుకున్నాడు.

అప్పట్లో ఒక్క సబ్జెక్టు తప్పి అదే క్లాసులో మళ్లీ చదివేవారిని సప్లిమెంటరీ విద్యార్థులు అనేవారు. అది మానసికంగా కొంచెం ఇబ్బందిగానే ఉండేది. జూనియర్లు వచ్చి నాతో సమానం కావడం, టీచర్లు సప్లిమెంటరీ అనడం – ఇవి అవమానకరంగా ఉండేవి. కాని రెండో ఏడాది పరీక్షకు ఆప్షనల్ మార్చుకున్న వాడిని ఆ స్కూలు చరిత్రలో నేనే మొదటివాడిని. అటువంటిది కుదురుతుందో లేదో తెలియక హెడ్ మాస్టర్ పై అధికారులకు లేఖ రాశారు. వాళ్లేమో సాధ్యమేనన్నారు.

నేను క్లాసులో ఉండటం చరిత్ర మాస్టారికి కూడా కాస్త ఇబ్బందిగానే ఉండేదిగాని శ్రద్ధగానే చెప్పి చూద్దాం అన్న ధోరణిలో ఉండేవారు. దసరా ముందు జరిగే మూడు నెలల పరీక్షల్లో నా నిర్ణయం మంచిదేనని నాకు, మాస్టారికీ కూడా తెలిసిపోయింది. ఎందుకంటే నేను 70శాతం కన్నా ఎక్కువ మార్కులతో క్లాసు ఫస్టు వచ్చాను. ఆ ఏడాదంతా అటువంటి ప్రభనే కొనసాగించాలని నాలో నేనే నిర్ణయించుకున్నాను, దానికోసమే కృషి చేశాను కూడా. అది నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆ ఏడాది పరీక్షలు పూర్తయ్యేసరికి నేను బ్రహ్మాండంగా రాశానన్న సంగతి నాకు తెలిసిపోయింది, మా అన్నయ్య కూడా చక్కగా రాశాడు.

*

(సశేషం)

ఫోటో:యువ ప్రేం చంద్ కుటుంబ సభ్యులతో తల్లీ తండ్రివెంకట్రామయ్య, నాగరత్నమ్మ. అక్క, బావ, అన్నయ్యలు

అనువాదం: అరుణా పప్పు

అరిగపూడి ప్రేమ్ చంద్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అప్పటి పరిస్థితి కళ్లకు కట్టినట్లు వుంది

  • “యుద్ధప్రభావాన్ని తట్టుకోవడానికి కొన్ని ప్రదేశాల్లో ప్రభుత్వ పెట్టుబడులు పెరిగాయి. కృష్ణా జిల్లా అందులో ఒకటి. ఉదాహరణకు గన్నవరంలో విమానాశ్రయం కట్టాలన్న ఆలోచన కార్యరూపం దాల్చింది అప్పుడే.”
    ప్రభుత్వ పెట్టుబడి ( అప్పూ. ఖర్చూ) ఒక వైపు పారిశ్రామిక వర్గాన్నీ, మరో వైపు కార్మిక వర్గాన్నీ తయారు చేస్తాయని ఈ పేరా మరో సారి రుజువు చేసింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు