అర్జెంటీనాలో గుండెకోత

ఊహించని విధంగా, నిరంకుశ ప్రభుత్వాలు అరెస్టులుచేసే పద్ధతి నా కంటబడింది; అది మర్చిపోలేని సంఘటన.

షిప్‌లో నాలుగేసి గంటల చొప్పున మూడు వాచ్‌లు ఉంటాయి – (నేవిగేషన్ బ్రిడ్జ్‌మీద సెకెండ్ ఆఫీసర్, ఇంజిన్‌రూమ్‌లో థర్డ్ ఇంజినీర్), 4 నుంచి 8 (ఛీఫ్ ఆఫీసర్-సెకండ్ ఇంజినీర్), 8-మధ్యాహ్నం 12 (సెకండ్ ఆఫీసర్-థర్డ్ ఇంజినీర్), మళ్లీ అవే రిపీట్ అవుతాయి. ప్రొపెల్లర్ తిరుగుతూనే ఉంటుంది; ‘ట్వెల్వ్-టు-ఫోర్’, ‘ఫోర్-టు-ఎయిట్’, ‘ఎయిట్-టు-ట్వెల్వ్’ – వాచ్-కీపర్లు ఒకళ్లనొకళ్లు – అటు నేవిగేషన్ బ్రిడ్జ్‌పైనా, ఇటు ఇంజిన్‌ రూమ్‌లోనూ – రిలీవ్ చేసుకుంటూనే ఉంటారు. రోజులు, వారాలు, ఒక్కోసారి నెలలు గడచిపోతూనే ఉంటాయి.

నా అనుభవంలోని సుదీర్ఘమైన నౌకాయానాల్లో ఒకటి – బ్రెజిల్ నుంచి బోంబేకి – నలభై రోజుల పాటు సాగిన యాత్ర. అలాగే వాన్‌కూవర్ (కెనడా) నుంచి సింగపూర్‌ మీదుగా బొంబే ప్రయాణం; అది అనుకోని కారణాలచేత రెండు నెలలకు పైగా సాగింది; ఆ ప్రయాణంలోనే మా ఓడ మునిగిపోయే ప్రమాదం నుండి బయటపడింది; నేను ప్రాణగండం నుండి తప్పించుకున్నాను. అవి వేరే కథలు.

సూయెజ్, కీల్, లేదా పనామా కాలువల గుండా ప్రయాణించేటప్పుడు, పోర్టులోకి ప్రవేశించేటప్పుడు, లేదా పోర్టుని వదిలిపెట్టేటప్పుడు – అదనపు గంటల పని, బాధ్యతలు తప్పవు. పోర్టులో ఉన్నప్పుడు డెక్ ఆఫీసర్లకి కార్గో సంబంధిత కార్యకలాపాలు ఉంటాయి. ఇంజినీర్లు – పోర్టు రాగానే మైన్‌టెనెన్స్ మరమ్మత్తులతోనూ, నిత్యం జరిగే సర్వేలూ, ఇన్స్‌పెక్షన్‌లతోనూ ఊపిరి సలపనంత పనుల్లో మునిగిపోతారు. నావికుల సంఖ్య పరిమితం గనుక ప్రతీ ఒక్కరూ తమ డ్యూటీలను సక్రమంగా, సంపూర్ణంగా నిర్వర్తించాల్సిందే. ఏ ఒక్కరు వెనకబడ్డా, లేదా అనారోగ్యం పాలైనా, గాయపడినా మిగతా వాళ్లకి అదనపు పనిభారం తప్పదు. సెలవు ప్రసక్తే లేదు.

1980 చలికాలంలో, అమెరికా తూర్పు తీరం నుండి బయలుదేరి, బ్రెజిల్ కోస్తా వెంబడి అర్జెంటీనాకు ప్రయాణం కట్టాం. భూమధ్యరేఖను దాటి, దక్షిణార్ధ గోళంలోకి ప్రవేశిస్తూనే వాతావరణం మారిపోయింది. బ్రెజిల్ తీరాన్ని సమీపించేనాటికి చలికాలం కాస్తా వేసవిగా మారిపోయింది. ఉత్తరార్ధ, దక్షిణార్ధ గోళాలలో ఋతువులు విలోమంలో ఉంటాయని స్కూల్లో నేర్చుకున్నానుగాని, ఆ భౌగోళిక విశేషం, అంత స్పష్టంగా స్వీయానుభవంలోకి రావాడం అదే తొలిసారి. ఇంకో రెండు రోజుల్లో అర్జెంటీనా చేరుకుంటామనగా, రాత్రి వాచ్‌లో బ్రిడ్జ్ మీద ఉన్న సెకండ్ ఆఫీసరు, ఇంజిన్ రూమ్‌లో ఉన్న నాకు ఫోన్‌చేసి,

“నీ వాచ్ కాగానే ఒకసారి బ్రిడ్జ్ మీదకి రా! నీకొకటి చూపిస్తాను,” అన్నాడు. నేను అర్ధరాత్రి 12-తెల్లవారుఝామున 4గం. (‘ట్వెల్వ్-టు-ఫోర్’) వాచ్‌లో ఉన్నాను.

సముద్రం అన్ని రోజుల్లోనూ ఒకేలా ఉండదు. గంభీర ప్రశాంతతను, అల్లరి వెదజల్లే చిందులాటనూ, ఉధృతమైన పోటునూ, తుఫాను బీభత్సాన్నీ ప్రదర్శిస్తూ – ఒక్కోమారు ఒక్కొక్క అవతారం ఎత్తుతూంటూంది. రాత్రివేళల్లో ప్రశాంత సముద్రం కూడా అనంతమైన చీకటిని కనుచూపుమేరా నింపి భయం గొలుపుతుంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటే ఇక చెప్పనక్ఖరలేదు; మానవుడి అల్పత్వాన్ని, అశక్తతనూ బహిరంగపరుస్తుంది. అయినప్పటికీ, సముద్రయానం – మానవులను సాహసకృత్యాల వైపుగా ఉసిగొలిపే పెనుసవాలుగా, ప్రమాదభరితమైన ఆకర్షణగా నేటికీ కొనసాగుతున్నది.  శతాబ్దాలుగా ప్రాణాలను పణంగా పెట్టి సముద్రాలను శోధిస్తూ, కొత్త మార్గాలను కనుక్కొంటూ, వ్యాపారాలను, బౌద్ధంతో మొదలుపెట్టి, వివిధ మతప్రచారాలని కొనసాగిస్తూ, సామ్రాజ్యాల్నీ నిర్మిస్తూ సాగిపోయిన మనిషి ప్రయాణాలకు సముద్రుడే సాక్షి. మానవ చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు మహా సాగరాలతో పెనవేసుకుపోయాయి.

సెకండ్ ఆఫీసరు పిలుపుని అందుకొని, బ్రిడ్జి మీదకి చేరినప్పుడు చంద్రుడులేని ఆనాటి ఆకాశంలో తారలు స్వతంత్రాన్ని ప్రకటించుకొని, ఉజ్వలంగా వెలిగిపోతున్నాయి. ఆ నక్షత్రాల అమరికను నేను అంతకు ముందెన్నడూ చూడలేదు.

“అవును, దక్షిణార్ధ గోళంలో కనిపించే తారలే వేరు!” అన్నాడు నా మిత్రుడు. డెక్ ఆఫీసర్లు అంటే నేవిగేటర్‌ల చదువులో, ట్రెయినింగులో ఖగోళశాస్త్రం ఒక ముఖ్యమైన భాగం.

అతడు కొన్ని నక్షత్రాలను, రాశులను చూపించి వాటి పేర్లు చెప్పాడు. అవేవీ గుర్తులేవుగానీ, నన్ను ముఖ్యంగా ఆకట్టుకున్నది – దిగంతాలకు వ్యాపిస్తూ, బ్రహ్మాండమైన చారలా, మహా చిత్రకారుడైన సృష్టికర్త తన కుంచెను పరీక్షించుకుంటూ, పరధ్యానంగా, గీసిన రేఖలా, ఆకాశమంతటా పరచుకున్న పాల పుంత (Milky Way)!

మరో రెండు రోజుల్లో అర్జెంటీనా రాజధాని అయిన బ్యూనోస్ ఎయిరెస్ చేరుకున్నాం. మొదటి రోజునే నైట్ డ్యూటీ అయిపోయాక, కాసేపు నిద్రపోయి, మధ్యాహ్నానికల్లా టాక్సీ పట్టుకొని, నగరంలోకి వెళ్లాను. రెండువైపులా పచ్చని చెట్లతో, విశాలమైన ప్రధాన రహదారులు, పురాతమైన భవంతులు ఎంతో అందంగా కనిపించాయి.

“రోడ్లు చాలా విశాలంగా, అందంగా ఉన్నాయి,” అన్నాను, టాక్సీ డ్రైవర్‌తో. అతనికి అర్థం అయినట్టుంది.

తన చూపుడు వేలుతో ఆ స్క్వేర్‌ని చూపిస్తూ, “ప్లాజా డి మాయో,” అన్నాడు, కొంచెం గర్వంగా.

టాక్సీ డ్రైవర్ దూరంగా ఉన్న ఒక బ్రహ్మాండమైన భవంతివైపు చూపించి, “కాసా రొసాడా!” అన్నాడు. ‘కాసా రొసాడా’ అంటే లేత గులాబీరంగు భవనం అని తెలుసుకోగలిగినంత స్పానిష్ నాకు వచ్చు. వచ్చీరాని ఇంగ్లీషులో, “అదే మా ప్రెసిడెంట్‌ ఉండే ప్యాలెస్!” అంటూ వివరించాడు, డ్రైవర్. చుట్టూతా సాయుధులైన కమాండోల పహారా. దూరం నుంచి చూడాల్సిందేగాని దగ్గరకు పోవడానికి వీలులేదు.

1976లో కరడుగట్టిన కమ్యూనిస్టు వ్యతిరేకి, మిలిటరీ ప్రభుత్వాధినేత అయిన జనరల్ విడేలా, అమెరికా సహాయ సహకారాలతో దొడ్డిదారిన పదవిలోకి వచ్చాడని మా షిప్పుకి వచ్చే ‘టైమ్’, ‘న్యూస్‌వీక్’ పత్రికల్లో చదివి గ్రహించాను.

అక్కడొక దృశ్యం నా కంటబడింది. స్కేర్ చుట్టూ గుమిగూడి, కొన్ని వందలమంది నినాదాలు ఇస్తున్నారు. వాళ్ల చేతులలో స్లోగన్‌లు రాసిన అట్టలున్నాయి. వాళ్లల్లో ఎక్కువమంది స్త్రీలు. “వాళ్లంతా ఎవరు?” అని టాక్సీ డ్రైవర్‌ని అడిగాను.

“లాస్ మాద్రేస్ డి లా ప్లాజా డి మాయో” అన్నాడు. ‘మాద్రేస్’ అంటే తల్లులు అని తెలుసు.

“దేని గురించి ఈ నిరసన?” అని అడిగితే, ఏదో చెప్పాడుగానీ, నాకు అర్థం కాలేదు. చేత్తో, ‘ఎటో పోయారు,’ అన్నట్టు సైగ చేశాడు. అప్పుడు అర్థం అయింది. సైనిక పాలనలో అంతర్థానం అయిన తమ బిడ్డలకోసం తల్లులు చేస్తూన్న నిరసన ప్రదర్శన అది!

టాక్సీని ఆపమంటే కుదరదన్నాడు. నెమ్మదిగా పోనిచ్చాడు. వందలాది తల్లులు నినాదాలు ఇస్తున్నారు. వాళ్లు తమ తలలకు చుట్టుకున్న తెల్లని స్కార్ఫ్‌లు, చంటిబిడ్డలకు చుట్టే గుడ్డలను పోలినవనీ, వాటిపై తమ పిల్లల పేర్లు అల్లిక చేసుకున్నారనీ, ఆ ఏడేళ్లలోనూ 2,000సార్లు ప్రదర్శనలో పాల్గొన్న మహిళలు కూడా ఉన్నారనీ తరువాత తెలిసింది.

ఆనాటి నుండి లాటిన్ అమెరికాలో సామ్రాజ్యవాదుల దుర్మార్గాల గురించిన సమాచారాన్ని సేకరిస్తూ వచ్చాను. సైనిక పాలన అమలులోకి వచ్చి ఏడాది కాకుండానే, ప్రజస్వామిక వాదులు, నియంతృత్వాన్ని ఎదిరించినవాళ్లు, ముఖ్యంగా కమ్యూనిస్టు యువతీ యువకులు మాయం అయిపోసాగారు. 1983లో జనరల్ విడేలా గద్దె దిగే నాటికి 30,000మంది అదృశ్యం అయ్యారని అంచనా. సైనికపాలన ఉన్నంతకాలం (1976-1983) ‘ప్లాజా డి మాయో’ కేంద్రంగా సాగిన ఈ నిత్య నిరసనకు నాయకత్వం వహించిన మహిళలు కూడా మాయమయ్యారు.  తరువాతి కాలంలో జరిగిన దర్యాప్తులలో ఎన్నో దారుణాలు, విషాదాలు వెలుగులోకి వచ్చాయి.

అంతకు ముందు, 1973లో చిలే దేశపు మార్క్సిస్టు అధినేత, ప్రజాస్వామికంగా ఎన్నుకోబడ్డ సాల్వడార్ అయేండెని సి.ఐ.ఏ. సహకారంతో హతమార్చి, జనరల్ పినోఛెట్ అధికారాన్ని చేజిక్కుంచుకున్నాడు. అప్పుడు కూడా చిలేలో ఇదేవిధమైన మారణకాండ జరిగింది. ఆ సందర్భంగా ‘సృజన’లో శివసాగర్, ‘వీవా లా శాంటియాగో!’ అనే ఉత్తేజకరమైన కవితను వ్రాశాడు. వేమన వసంతలక్ష్మి తెలుగులోకి అనువదించిన అర్జెంటైన్ రచయిత ఏరియల్ డార్ఫ్‌మేన్ రచన ‘మిస్సింగ్’లో చాలా వివరాలు లభిస్తాయి. పినోఛెట్ ఏజెంట్లు, సుప్రసిద్ధ చిలియన్ కవి, నొబేల్ బహుమతి గ్రహీత, పాబ్లో నెరూడాను సైతం హత్యచేశారు.

ఊహించని విధంగా, నిరంకుశ ప్రభుత్వాలు అరెస్టులుచేసే పద్ధతి నా కంటబడింది; అది మర్చిపోలేని సంఘటన. ఒకనాటి మధ్యాహ్నం, బ్యూనోస్ ఎయిరెస్ నగరపు సందులలో, ఆరుబయట కుర్చీలు, టేబిల్సూ, అమర్చి, వడ్డన చేసే రెస్టారెంట్‌లో లంచి తింటున్నాను. ఉన్నట్టుండి నల్లటి పోలీసు వ్యాను వచ్చి ఆగింది. కమాండోలు హడావుడిగా దిగి, ఎదురుగా ఉన్న బిల్డింగులోకి, గబగబా మెట్లెక్కుతూ వెళ్లారు. పై అంతస్తులో కిటికీవద్ద నిల్చున్న ఒక అమ్మాయి, లోపలికి వెళ్లిపోయింది. రెస్టారెంట్‌లో ఉన్న వాళ్లు, పాదచారులు, ఏమీ జరగనట్టే తమ పనుల్లో తాము మునిగి ఉన్నారు. మరికాసేపట్లో ఐదారుగురు యువకులు, కిటికీవద్ద కనబడ్డ అమ్మాయి, తలల పైకి చేతులు పెట్టుకొని బయటకు వచ్చారు. కమాండోలు వాళ్లని వ్యాన్ ఎక్కించారు. “ఎవరు వాళ్లు?” అని వెయిటర్‌ని అడిగాను, ‘నాకేం తెలుసు?’ అన్నట్టు భుజాలు ఎగరేశాడు. వాళ్లెవరో? ఏమైపోయారో?…. దిగులుగా షిప్పు చేరుకున్నాను.

నన్ను చూస్తూనే మా ఫోర్త్ ఇంజినీర్, “అదేమిటీ? నువ్వు ఫ్లోరిడా స్ట్రీట్‌కి వెళ్లనే లేదా!? అక్కడ నీకు బ్రహ్మాండమైన బ్లేజర్లు, సూట్లు దొరుకుతాయి,” అంటూ అతగాడు కొన్నవి చూపించాడు. చాలా బాగున్నాయి. ధరలు అడిగాను.

“క్వాలిటీ కావాలనుకుంటే ధరలను పట్టించుకోకూడదు,” అన్నాడు.

ఫ్లోరిడా స్ట్రీట్ చుట్టుపక్కలకి వెళ్లకూడదని నాకు అర్థం అయిపోయింది.

మర్నాడు బ్యూనోస్ ఎయిరిస్ నుంచి ఉత్తర దిశగా, పరానా నదిలో, ఉత్తర దిశగా సుమారు 300 కి.మీ. ప్రయాణించి, రొజారియో పట్టణం చేరుకున్నాం. మా కంపెనీ స్థానిక ఏజెంటు – కేప్టెన్, ఛీఫ్ ఇంజినీర్లతో మాట్లాడి వెళ్లిపోతూంటే,

“ఎక్స్‌క్యూజ్ మి, మిమ్మల్ని ఒకటి అడగాలి,” అన్నాను.

ఏమిటన్నట్టు చూశాడు. అతడు నడివయస్కుడు. షిప్పులో మెట్లు ఎక్కడానికి ఆయాస పడుతున్నాడు. దిగడానికి ఇబ్బంది పడుతున్నాడు.

“చే గెవారా రొజారియోలోనే పుట్టాడు కదా?” అన్నాను.

“నీకెలా తెలుసు?” అని అడిగాడు, అనుమానంగా.

1968నాటి మాట.  ఉపాధ్యాయసంఘ నాయకులైన మా నాన్నగారు, విజయవాడ వెళ్లేటప్పుడల్లా తెచ్చే పుస్తకాల్లో, చే జీవిత సంగ్రహం కూడా ఉంది. అంతకు ముందు ఏడాదే అతడిని బొలీవియాలో హతమార్చారు. ఆ పుస్తకం చిన్నదేగానీ, చాలా సార్లు చదివాను. రొజారియోలో చే పుట్టాడని గుర్తుండిపోయింది. అవన్నీ చెప్పలేక,

“నాకు తెలుసు, ఎక్కడో చదివాను,” అన్నాను.

“అయితే ఒక పని చెయ్యి. ఇదిగో ఈ రెండు రోడ్ల కూడలిలో అతను పుట్టిన ఫ్లాట్ ఉన్న భవనం ఉంటుంది. అది పెద్ద పాతకాలపు భవనం. నాకు తెలిసి అతను పుట్టాక, అతని తల్లిదండ్రులు కొన్ని నెలలు మాత్రమే రొజారియోలో ఉన్నారు,” అంటూ ఒక చిన్న కాగితం మీద ఆ వీధుల పేర్లు రాశాడు; స్కెచ్ గీశాడు.

కాగితం నా చేతికిస్తూ, “దీన్ని గుర్తుపెట్టుకో,” అని తిరిగి తీసుకొని, చించేశాడు.

“మరో ముఖ్యమైన విషయం. దారినపోయే వాళ్లని, ‘సార్! ఎర్నెస్టో చే గెవారాగారు పుట్టిన ఇల్లెక్కడండీ?’ అని అడగకు, వెర్రివెంగళప్పలాగ! కొంపలంటుకుంటాయి!” అని హెచ్చరించాడు.

ఆ రోజు సాయంత్రమే, నా డ్యూటీ అయ్యాక, ఆ వీధుల్లో కాసేపు తచ్చాడాను. అక్కడున్నవన్నీ పురాతన భవనాలే. ఏదై ఉంటుందో నాకు తెలియరాలేదు. ‘ఇక్కడే, ఈ వీధుల్లోనే, చంటిపాపడు ఎర్నెస్టోని ఎత్తుకొని, అతని తల్లిదండ్రులు సంచరించి ఉంటారులే,’ అని సరిపెట్టుకున్నాను.

అదిప్పుడు మ్యూజియంగా మారింది; నిత్యం సందర్శకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. సరిగ్గా అతని శత్రువులు భయపడినట్టే అయింది. అర్జెంటీనా, చిలే, మెక్సికో, క్యూబా, బొలీవియా దేశాలలో అతని అడుగుజాడలను వెతుక్కుంటూ వెళ్లే సందర్శకుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.

భూమిపై నిర్భాగ్యుల కోసం,

ఎప్పటికీ ఆరిపోని జ్వాల మండుతూనే ఉంటుంది.

ఈ చీకటి రాత్రి కూడా ముగుస్తుంది,

మళ్లీ సూర్యుడు ఉదయిస్తాడు.        

                                                       – విక్టర్ హ్యూగో, ‘లే మిజరబల్స్’ (‘విగత జీవులు’)

[చిత్రాలు: వీకీపీడియా]

 

ఉణుదుర్తి సుధాకర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు