గంభీరమైన నిశ్శబ్దమే అరుపు. ఊపిరాడనీయకుండా, ధ్వంసం చేయబడ్డ, ఉనికినే నిరాకరించబడ్డ పీడితుల వాస్తవికత ఆ అరుపు. అది ఆరతి అరుపు. ఆరతి ఎక్కడ వుంది? ఎక్కడికి పోలేదు.
అరుపు ఎక్కడికి పోలేదు.
ఆ అరుపు అంటరానితనం తో దూరం చేయబడ్డ వారిది. వనరులు కాపాడటానికి ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడుతున్న పీడితులది. పీడితులందరి నిశ్శబ్దాన్ని ఒక దగ్గరకి చేర్చే అరుపు అది. భూమి అరుపు అది. తంగళాన్ తో పక్కన కూర్చుని ఎన్ని సార్లు నిశ్శబ్దంగా మాట్లాడిందో ఆరతి.
కుల పీడన నుంచి దూరంగా, మనిషిని మనిషిగా గుర్తించే చోటుకు వెళుదామనుకున్న ఆ మనిషికి దారంతా ప్రకృతి గుర్తు చేస్తూనే వుంది. భూమి నాది అన్న వారికి ఆ భూమిలోని వనరులను దోచే శక్తుల గురించి హెచ్చరికలు చేస్తూనే వుంది. ఆరతిని తంగళాన్ కు పరిచయం చేయటం ఒక కలెక్టివ్ గుర్తింపుకు అవసరం అనే దృశ్యాన్ని పా రంజిత్ అద్భుతంగా ఆవిష్కరించారు. ఆరతి ఒంటరి కాదు. ఆమెకో సమూహం వున్నది. తంగళాన్ ఒంటరి కాదు. అతనికో సమూహం వున్నది. పాములు ఒంటరి కావు. అవి గుంపుగా వున్నవి.
ఈ పోరాట ప్రతీకలు ఉద్యమ ritual ను తెలియచేస్తాయి. ritual కు తెలుగులో సరైన పదం నాకు దొరకటం లేదు కానీ, వాస్తవికతను అతీతంగా ritual ను చూపిస్తూ ,నూతన ప్రాపంచిక దృష్టికోణంతో పీడితుల ఐక్యతను దృఢపరచటమే పా రంజిత్ సినిమా ద్వారా చేసిన గొప్ప పోరాటం. ritual అనేది పోరాటంలో ఒక ఆచరణ.
లోతైన అర్థాన్ని సూచించే భౌతిక వాస్తవాన్ని ritual దృశ్యం వ్యక్తీకరిస్తుంది. అందులో పాల్గొనటం ద్వారానో ,దానిని గమనించటం ద్వారానో లక్ష్యాలను చెప్పగలగడం లేదా ఆ లక్ష్యాలను సాధించే దరి దాపులలోకి వెళ్లామనే భావన కలుగుతుంది.
వ్యక్తిగతం నుంచి సామూహికం అయ్యే ప్రక్రియ. రవికె గంగమ్మ ఒక్కరి కోసమే కాదు.అది ఆ సమూహానికి సంబందించిన మహిళలందరిది. ఆ లక్ష్యం సాధించగలమనే నమ్మకం. అది వేడుక చేసుకునే ritual.
ఆ తరవాత జరిగే సంఘర్షణలు, అభద్రతలు, కోరికలు , వేదనల దృశ్యాలన్నిటిలో రవికె పోరాట ప్రతీకగా పా రంజిత్ కొనసాగిస్తారు. తంగళాన్ , గంగమ్మ ల కొడుకు పేరు అశోక. ఆ పేరును ఆ బాలునికి ఇవ్వటం పా రంజిత్ కు వున్న లోతైన అవగాహన. అశోకుని చూపులు వాస్తవాలను తెలియచేస్తాయి. జందెం తంతు చూసేటప్పుడు తిరస్కారం, బయటి సమాజం ముట్టని తన చేయి సహాయం తీసుకుని ఇంకో తెల్లజాతి బాలుడు బండి దిగినప్పుడు, తన శరీరం పట్ల తనకు కలిగిన ప్రేమ. బుద్ధుని తలను హత్తుకుని తిరిగి తల వేరైన శరీరానికి (విగ్రహానికి ) అతికించే పట్టుదల- అశోకుడు నిరంతర చైతన్య ప్రతీకగా మనకు కనపడుతాడు. అన్యాయం, అణిచివేత నుంచి బయట పడాల్సిందే అని గుర్తుచేస్తూ ఆరతి అరుపును అందిపుచ్చుకుంటాడు. పోరాట ritual ను మన కళ్ళకు కనపడేలా చేస్తాడు.
బుద్ధుని విగ్రహం వుంది, ఎవరు వెళ్ళలేని ప్రదేశం వుంది. బుద్ధుని ఎదురుగా, ఆ ప్రదేశం మధ్యలో పోరాడే శక్తుల గుర్తింపు ఏర్పాటుకు తోడ్పడే, పరస్పర గుర్తింపుతో పీడితులకు పోరాటం సాధ్యమనే ఆ కోరికలు నెరవేర్చుకునే ritual ను ఆరతి ద్వారా పా రంజిత్ తెలియచేసారు. ఐక్యత నిర్మితమైనా, విరోధాలతో కూడిన సంఘర్షణలు పీడితులను చీల్చివేస్తాయని, వాటిని అధిగమించమని, పీడితులకు ఏది కావాలో తేల్చుకోమని ఆరతి చివరి వరకు చెపుతూనే ఉంటుంది. భూమి నాది అన్నవారు భూమి కాపాడటం అవసరం అని దూరంగా పొమ్మని చెప్పే పాములు, పెట్టుబడి దగ్గర బానిస కావద్దని, ఆ భూమిలోని ఖనిజం తీస్తే నిన్నే కాదు, ప్రకృతి కూడా నాశనం అవుతుందని చెప్పే ఆరతి… ఇన్ని పోరాట ప్రతీకలతో కూడిన గొప్ప ritual లో మనల్ని పాల్గొనేలా పా రంజిత్ చేస్తారు. పీడితుల collective ritual అయ్యేంతవరకు ఆరతి అరుపు వినపడుతూనే ఉంటుంది.
*
మంచి సినిమా రివ్యూ ఇది, సినిమా చూసి అర్ధం కాలేదు అనేవాళ్ళు కచ్చితంగా చదవాల్సిన ఆర్టికల్ ఇది. అరుపులో ఉన్న అవసరాన్ని మంచి గా అర్ధం అయ్యేటట్లు వివరించారు. Thank you Madhoo.
చాలా మంచి పరిశీలన. థాంక్యూ మధు