అరుణోదయ రామారావు చివరి రచన

ఒక యోధునికి మరో యోధుడి అక్షరాంజలి!
అరుణోదయ రామారావు చివరి రచన
ఒక ప్రజాగాయకుడు మరో విప్లవ నాయకుడి అస్తమయంపై స్పందిస్తే ఆ మాటలు నిజంగానే ఎంతో ఆర్తిగా ఉంటాయి. ఉద్యమపథాన సాగిన వారి ప్రస్థానాన్ని గుర్తుచేస్తాయి. ఇదిగో ఈ వ్యాసం అలాంటిదే. నిన్నమొన్ననే కన్నుమూసిన అరుణోదయ రామారావు రాసిన చివరి వ్యాసం ఇది. ఇదొక అరుదైన రచన. తన జీవితమంతా ప్రజాఉద్యమాలకు అంకితం చేసిన, కడవరకూ తాను నమ్మిన విలువలకు కట్టుబడిన కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్‌ కాకి లక్ష్మారెడ్డి సంస్మరణ సభ (27- 01- 2019) సందర్భంగా వేసిన ప్రత్యేక సంచికలో రామారావు అన్న సమర్పించిన అక్షర నివాళి ఇది.

కత్తుల వంతెనపై కవాతు కామ్రేడ్‌ కె.లక్ష్మారెడ్డి

కాలం కల్లోలం. ఊర్లు నోర్లు బంద్. చీమ చిటుక్కు మనాలన్నా ఖాకీల అనుమతి కంపల్సరీ. అలాంటి పరిస్థితిలో నేను మెట్పల్లి బస్టాండ్లో దిగాను. ఎటు పోవాలో తెలియదు. పది నిమిషాల తర్వాత ఒక పెద్దమనిషి స్కూటర్ దిగి నా దగ్గరికి వచ్చాడు.
“ఏం రామారావ్, బాగున్నావా !” “అయ్యో.. మీరా!” అన్నాను. “తిన్నవా?” అన్నాడు. “లేదు” అన్నాను.
సందులు తిరుగుతూ తిరుగుతూ ఒక ఇంటిముందు ఆగింది స్కూటర్. లోపలికెళ్లాక మరో మిత్రుడు వచ్చాడు. అక్కడి పరిస్థితి గురించి వివరించాడు. “ఎవరూ ఎక్కడా కదలలేని పరిస్థితి. అయినా మన కప్పజెప్పిన బాధ్యత అమలుచేయాలి గదా కాట్రేడ్” అన్నాడు. అన్నం తిని 2 స్కూటర్లపై పక్కనున్న గ్రామానికి వెళ్లాము. సాయంత్రం 4.30 గంటల అయ్యింది. ఊరుముందు చెట్టు దగ్గర కూర్చున్నాము. మమ్మల్ని చూసి అక్కడ కూచున్న జనం ఒక్కరొక్కరే వెళ్లి పోతున్నరు. నా చేతిలో కంజీరా వాయించడం మొదలుపెట్టానో లేదో ఒక జీపు వచ్చి మా ముందు ఆగింది. మామూలు దుస్తుల్లో వున్న పోలీసులు.. తుపాకులతో ధనధనమంటూ దిగి మాముందు కొచ్చారు. జనం నిశ్శబ్దం. నాకు లోలోపల భయం ప్రారంభమయ్యింది. మా పెద్దాయన నా దగ్గరకొచ్చి “పాడు ఏం పర్వాలేదు. నేనున్నాను” అన్నాడు.
ఇగ “ఎగబడుదా మురో ఎములడ రాజన్నా” అంటూ మొదలుపెట్టానో లేదో ఒక పోలీసు వచ్చి “రేయ్! ఎవర్రా మీరు” అంటూ నా చేతిలో కంజీరా గుంజుకొని తన కాలికింద ఏసి తొక్కాడు. “రేయ్! నీ పేరు ఏందిరా” అంటూ నా చెంపమీద కొట్టాడు. “ఏమండీ! అట్లా కొడతారెందుకు”.. “ఏయ్! ముసలోడా! నువ్వెవ్వరు? ఎక్కణ్ణించి వచ్చారు?” “నాపేరు కాకి లక్ష్మారెడ్డి. ఇతని పేరు రామారావు. రైతుకూలి సంఘం కార్యకర్తలము. కరీంనగర్లో మీటింగ్ వుంది. ప్రచారానికి వచ్చాము” అన్నాడు. ఒక పోలీసు “ఇద్దర్ని జీపెక్కించండి..” అన్నాడు. “మేము ఏం తప్పు చేశాము?”.. “రేయ్ ! ముసలోడా! ఇక్కడకు రావడమే తప్పు. ఎక్కువ మాట్లాడితే ఇక్కడే ఎన్‌కౌంటర్ చేస్తా.. వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపొండి”. “మీ ఇష్టమొచ్చింది చేస్కొండి. మా పని మేము చేసి వెళ్తాము” అన్నాడు పెద్దాయన. “ఇక్కన్నుంచి వెళ్తారా లేదా.. పెద్దమనిషి అని చూడకుండా వాతలు పెడ్తాము..” అంటూ ఇద్దర్ని జీపు ఎక్కించుకొని మెట్పల్లి బస్లాండ్లో వదిలివేస్తూ.. “బస్సెక్కి వెళ్లిపొండి” అంటూ నన్ను ముందుకు తోశారు. వెళ్లపోయారు. పెద్దాయన నన్ను పట్టుకొని “ఇవన్ని ఇక్కడ మామూలే.. అన్ని మనం తట్టుకొని ముందుకెళ్లాలి.. అంతే, పద..” అంటు భుజంమీద చెయ్యేసి ధైర్యం చెప్పాడు.
అంతటి భయానక వాతావరణంలో, స్మశాన నిశ్శబ్దంలో ఖాకీల క్రౌర్యాన్ని ఎదిరించి మాట్లాడి, చాలా ఓర్పుతో వుంటూ నాకు ధైర్యాన్ని నింపిన పెద్దాయన కామ్రేడ్ కాకి లక్ష్మారెడ్డి. ఎక్కడో కర్నూలు జిల్లాలో పుట్టిన సాధారణ కళాకారుణ్ణి అయిన నన్ను అక్కున చేర్చుకున్న అ దృశ్యం నామనస్సులో బలంగా నాటుకొంది. అప్పటినుండి మా మధ్య అనుబంధం పెరుగుతూ వచ్చింది. కల్లోలిత ప్రాంతంలాంటి ఆ కత్తుల వంతెనపై కవాతు చేయడం కొందరికే సాధ్యం. అ కొందరిలో కామ్రేడ్‌ కె.ఎల్ ఒకరు. ఆ ధైర్యసాహసాలు, క్రమశిక్షణ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి గుండెకాయనిచ్చిన విప్లవ ఖిల్లా, నల్లగొండ జిల్లా పోరాట సాంప్రదాయాల నుండి వారసత్వంగా అలవరుచుకున్న సంస్కృతి అది.
“ఏ ఇంట్లో ఏ బిడ్డడు, ఎందుకొరకు సచ్చెనని, అడగండి ప్రతి పల్లెను, ప్రతి చెట్టును, ఆత్మకథను చెప్పునవి.. పోరుజ్వాల ఆగదని..” నినదించిన నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకా రావిపాడు గ్రామం రైతుకుటుంబంలో పుట్టినవాడు కామ్రేడ్‌ కె.ఎల్. తెలంగాణ పోరాటపులి.. వేకువలో లేచి రెక్కవిప్పిన రెవల్యూషన్ కామ్రేడ్‌ కె.ఎల్. సిపిఐ, సిపిఎంలు ఇంకెంత మాత్రం విప్లవ పార్టీలు కావని, కామ్రేడ్‌ చండ్ర పుల్లారెడ్డి అందించిన ప్రతిఘటనా పోరాట పిలుపునందుకొని మొత్తం జిల్లా కార్యకర్తలు, నాయకులు వేసిన పోరాటదారిలో నడిచినవాడు కామ్రేడ్‌ కె.ఎల్. పొట్ట గడవటం కోసం సంసార శకటాన్ని లాగుతూ, అటు బొప్పారం నుండి కర్నూలు, బళ్ళారి మీదుగా అమర్‌నగర్ చేరిన తన ఆశయం కోసం పనిచేస్తూనే వచ్చాడు. “మన అభిప్రాయాలను మన కన్న పిల్లల మీద రుద్దలేం కదా” అనే నానుడిని కాదని తన పిల్లల్ని విప్లవ క్రమశిక్షణతో పెంచాడు. కామ్రేడ్‌ కె.ఎల్. ఇవాళ వాళ్ళు ఎన్ని పరిమితులున్నా తమతమ స్థాయిల్లో కృషి సాగిస్తున్నారు.
“ఇదేనండి, ఇదేనండి, ఎర్రెర్రని నల్లగొండ” మరియు “నిజంగానే నిజంగానే తెలంగాణ మాగాణం, అనాదిగా అరుణారుణ వీరులకే జయగానం” రెండు పాటలు పాడి కిందికి వచ్చాను. స్థలం కోదాడ. సందర్భం పి.డి.యస్.యు. తొలి జనతర కౌన్సిల్. అమరుడు కామ్రేడ్‌ చెరబండరాజు రాసిన రెండు పాటలు పాడి కిందికి రాగానే మనసారా కౌగిలించుకొని “శభాష్! చాలా బ్రహ్మాండంగా పాడావు కాట్రేడ్! మరోసారి తెలంగాణ పోరాట తొలిరోజులను గుర్తుకు తెచ్చావ్! కలసి ప్రయాణం సాగిద్దాం!” అన్నాడు. అక్కడినుండి హుజూర్నగర్, ఆత్మకూరు, పాత సూర్యాపేట మొదలైన గ్రామాలు తిరుగుతూ కామ్రేడ్‌ కె.ఎల్. గారి ఉపన్యాసం, నా పాటగా సాగింది ప్రయాణం. అదే కె.ఎల్. గారితో తొలి పరిచయం. అక్కడినుండి జిల్లాలో నిత్యం మీటింగులు, కె.ఎల్. తదితరులు ప్రసంగాలు నేను, కామ్రేడ్‌ విమల పాటలు సాగుతువచ్చాయి.
అక్కడి నుండి జిల్లాలోనే కాకుండా నిజాంబాద్, కరీంనగర్ జిల్లాల దాకా మా ప్రయాణం సాగింది. పరిస్థితి ఎక్కడ బాగలేకుంటే అక్కడ కె.ఎల్. గారు ప్రత్యక్షం. ఆయనతో పాటే నేను. ప్రముఖ విప్లవకవి కాశీపతి, లక్ష్మారెడ్డిగారు తదితర ఎందరో ప్రముఖుల ఉపన్యాసాలు, అరుణోదయ కళారూపాలు ముఖ్యంగా రామనర్సయ్య బుర్రకథ, విమల పాటలు, మా గురువు కానూరిగారు ప్రత్యక్షం. ఏ ఊర్లో మీటింగ్ ఉంది అంటే బళ్ళు కట్టుకొని జనం తయార్ తెల్లారేదాకా సాగేది. పాట పాడు పాడు అని కోరేవాడు. అదొక సుదీర్ఘ అనుభవం. ఎన్నెన్నో జ్ఞాపకాలు. మధ్యలో కె.ఎల్. లాంటివారు విప్లవోద్యమ అనుభవాలు, కమ్యూనిస్టు ప్రస్థానం, రోజువారి రాజకీయాలపై వ్యాఖ్యానంలాంటివి ఎన్నెన్నో విషయాలు. చాలా చక్కని ఉచ్చారణతో విపులంగా వివరించే వారు. ముఖ్యంగా నిర్బంధం అనే కల్లోలంలో నలిగిపోతున్న కరీంనగర్ జిల్లాకు వెళ్లాలన్నపుడు ఏ మాత్రం ఆలోచించకుండా వెళ్లి పోరాటవాణిని వినిపించి జనానికి అండగా నిలిచినవాడు, నడిపించిన వాడు కె.ఎల్! ఆ క్రమంలో ఎదల మీద గన్ను గురిపెట్టినా.. విప్లవానికే నా జన్మ విప్లవమే నా జీవితాశయం.. మృత్యువులోనే పాట పాడుతాం, విప్లవమా! నీకు లాల్‌సలామ్! అని ఎదురొడ్డి నిలిచినవాడు కామ్రేడ్‌ కె.ఎల్. అలాంటి యోధుడితో నా సహచర్యం మరుపురానిది.
కామ్రేడ్‌ కె.ఎల్. గారూ! నీకిదే భాష్పాంజలి. అందుకో అరుణాంజలి.
నీ మార్గం దుర్గమం, క్లిష్టతరం
ఇన్నాళ్ళూ మాతో ఒక విప్లవ చైతన్యమై నడిచావు
ఇంత కాలం మాతో గడిపిన నీ అనుభవం కేవలం ఒక జ్ఞాపకమేనా..!?
నో! నీ అనుభవం, ఆశయం, జ్ఞానం.
తరంతరం నిరంతరం నిత్యమై మా చేతిలో కాగడాగా వెలుగులీనుతూనే వుంటుంది….
సెలవ్
– అరుణోదయ రామారావు

ఎడిటర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు