సూపరుసంచి (యూరియా సంచి)తో కుట్టిన స్కూల్‌బ్యాగులోంచి ఆరో తరగతి నోర్సు తీసినా.
ఎనకల పేజీలు గబగబా తిప్పినా. కల్మాలు అయ్యి. బట్టీ పడతానా.
-“అవ్వల్ కలిమా..
లా ఇలాహ ఇలల్లాహు..
మహమ్మద్ రసులుల్లాహీ- ” అంటూ ఒకటేమైన చదువుతానా. వచ్చినట్లే వచ్చానాయి నోటికి.. రేత్రిపడుకున్యాక గాలికి పోతాంది ఆ చదువు.
మా మేనమామ రాసుకున్య బుక్కులోంచి కల్మాలు చూసి రాసుకున్యా.
రోజూ చదువుతానా కానీ.. నోటికి అబ్బడంలా. ఒకనాడు మాయమ్మకు తెగేసి చెప్పినా ‘మా నా చేత కాదుమా ఇయ్యి చదువుకోవడం.. పెద్దయినాంక చదువుతామా’ అంటి.
‘నీకు జ్క్షాపకశక్తి జాచ్చీ ఉంది. నువ్వు నేర్సుకో ఎట్టయినా.నీకే పెద్దయినాక బాగుంటాది. ఒకరి దగ్గర తలొంచుకోకూడదు. చదింపులు చేయాలన్నా, హలాల్ చేయాలన్నా కష్టం కదా’ అన్యాది మాయమ్మ.
‘ఒమా నాకు అయ్యి రాల! ఏం చేయాల. నేను సీలు తినను, కోడి, పొట్లి గొంతులు కొయ్యను’ అన్యా కోపంగా.
‘బాగుండావే. పాపర్నాకొడకా..నీయాకు జించ.. మన ఇద్య రాకుంటే ఎట్లా’ అన్యాది పండ్లు కొరుకుతా కోపంగా తిట్నాది. మగం మాడ్సుకున్యాది.
మాయమ్మ కోపం రోంత తగ్గినాక దగ్గరికి పోయినా.
‘నాయిన ఇయ్యి ఎట్ల చదివినాడో’ అన్యా.
‘మీ నాయిన రెండో తర్తి కూడా చదవల. పాపం.. జీవాలకు పోతాన్యాడంట’ అనింది.
మా నాయిన అప్పుడే వట్టి చీనాకాయ చెట్ల పుల్లలను పొయ్యిలోకి కొట్టడానికి మచ్చుకోతి ఇసక రాయిమింద నూరతానాడు. మాయమ్మ ఇంటికాడ ఉందని పాకం పొప్పు చెయ్యటానికి చనక్కాయలు వొలుచ్చాంది. మా పాప పక్కనే ఉండాది.. ఇత్తనాలు పక్కకు ఏరతా.
మెల్లగా మా నాయిన కాడకు పోయినా.
‘నా.. నువ్వు సదువుకోలేదా?’ అనడిగినా.
‘యాడ.. మూడో తర్తి పోయినానేమో. మతికిలేదు. నూటికిపైన మేకలుండ. ఆ జివాలకు పోడానికే సరిపోతాండ. బూపొద్దప్పుడు టిపెనులో బువ్వ తీసుకోని పోతే పొద్దుగినికినాక వచ్చాంటి. జివాలు కాయలేక అమ్మినాం. అట్లనే రోంత వయిసోన్నయినాక టాక్టరు నేర్చుకున్యా’ అంటా అంటా బయటికి ఎల్లబారినాడు.
ఔ.. పాలుపిండుకుంటా.. కాఫీ తాగి కట్టెలు కొడుదువులే అనె మాయమ్మ. కాఫీ తాగి మా నాయిన బయటికి పాయ.. మచ్చుకోతి తీస్కోని.
ఇట్లయితే కాదని మాయమ్మ దగ్గరికి పోయినా.
చెనక్కాయలు వలుచ్చాంటే వసారాలోకి పోయినా. నేను చనక్కాయలు వల్చడం మొదులుపెట్నా. గబగబా వొల్చల్లి కసువు నూకాల బయట అన్యాది మాయమ్మ. ఒలుచ్చానాం నేను, మా రజియా. ‘ఒమా..! కల్మాలు మా నాయిన ఎట్ల నేర్చుకున్యాడో. బాగ నేర్చుకున్యాడు కదా’ అన్యా.
‘అవును వాళ్ల అన్నగార్లు ఇద్దరికి రాదు ఇద్య. వాళ్ల పెదనాయిన, చిన్నాయిన పిల్లోల్లకు రాదు. ఎట్లొచ్చినాదో ఈయప్ప ఇచిత్రమే. మీనాయిన హలాల్ చేయబట్టి మనకు పొట్లిసీలకు కొదవలేదు. ఒక మాంచి ముక్కిరి గుండె, మెత్తని సీలు వచ్చానాయి మనకు రూపాయి ఖర్చు లాకుండా. ఇంగా.. మీ నాయిన చర్మం తీచ్చే తలకాయ ఎంకలు కూడా ఇచ్చారు.అయ్యి మల్లాడతాయి మూడుపూట్లకి మనకు’ అనింది. మాయమ్మ మాటలు నచ్చల. నాకెందుకో నత్తర అన్యా, సీలన్నా భయం. కోళ్లను, జివాలను సంపడానికి ఇది నేర్చుకోవాల్లనా అనుకుంటి మంచులో. మల్లా మంచంమిందికి పోయి కూర్చున్యా. నోర్సు తీసి ‘అవ్వల్ కలిమా.. లా యిలాహి.. ‘అంటా గట్టిగా అరుచ్చా చదువుతానా.
చనక్కాయలు వల్చడం అయిపోయినాది. బొప్పిలు దూడకేసినాది. అది కరుంకరుం అంటాంది. పైన వసార్లో జొన్నకంకిలను పొడుచ్చా కిచకిచా అరుచ్చానాయి పిచ్చికలు. ఎనుములు ఒకమైన తొక్కులాడతాంటే.. మేపు ఏసినాది. అయి కరుంకరుం అని సప్పిడిసేచ్చా తింటానాయి. మాయమ్మ గూట్లో పరక తీసుకోని గబగబా ఇంట్లో, బయట కసువులు దొబ్బినాది.
పని అయినాక.. మాయమ్మ పొయ్యికాడికి పోయి పుల్లల పొయ్యి ముట్టిచ్చింది, చనక్కాయలు పెనంమింద ఏంచినాది. ‘చలాకు తీసుకోని మాడకుండా చూడ’మన్యాది నన్ను. కింద నల్లగా ఉండే తపాలా తీసుకున్యాది. నీళ్లు పోసినాది. వాకిలి కాడ గుండ్రాయితో గబగబా బెల్లంరాళ్లు నలగ్గొట్టింది. పాకానికి వేసింది. పైన అల్లా బండ మీద ఉండే బొరుగులను నోటిలెక్కతో కొల్చుకున్యాది, చెనక్కాయల తిక్కు చూసింది. పాకం అయినాక బొరుగులు, ఏంచిన చెనక్కాయలు కలిపి పాకంపొప్పు ముద్దలు చేసినాది, ‘చల్లగయినాక తిందురులే’ అన్యాది. కొట్లం పొయ్యికాడనుంచి ముగ్గరం బయటికొచ్చినాం. టవాలతో సర్తు తుర్సుకుంటా. మాయమ్మ బువ్వకు ఎసురేసినాది. పద్దన పొప్పు ఉండాదిలే అనింది. సూచ్చాండంగానే పొద్దు గునికింది. కరెంటు రాల. మాయమ్మ బయట కూచ్చోని యవరాలు సేచ్చాంది. ‘కొట్రీ ఇంట్లో బుడ్డి ముట్టీపో.. బుషీ’ అన్యాది మాయమ్మ. కొట్రీ ఇంట్లో పంచన అరుగుమీద ఉండే గబ్బునూన బుడ్డీ తీసుకున్యా. ‘గబ్బునూనె అయిపోయినాదిమా’అంటి లోపలనుంచి. బయట టిన్నులో ఉండాది వంచుకో నాయినా అన్యాది మాయమ్మ గట్టిగా. బయటకొచ్చి గబ్బునూనె టిన్నుమూత తీసి లొడిగ పట్టుకున్యా. బుడ్డీ మూత తీసి వత్తి జారిపోకుండా పైకెత్తి లొడిగతో గబ్బునూనె పోసినా నిండాకు. సీసా బుడ్డి వత్తి గట్టిగా చేత్తో పురితిప్పి అగ్గిపిట్టతో ముట్టిచ్చినా. అంతలోకే మాయమ్మ ఇంట్లోకి వచ్చి దీపారాజన చేసినాది.
రాత్రి పడుకున్యాక.. ‘నువ్వేమయినా చేయి.. నోటికి నేర్సుకో కల్మాలు’ అన్యాది. కష్టంగా ఉందిమా అన్యా. పిల్లప్పుడే ఏమయినా నేర్సుకోవాల. మతికి ఉంటాయి. నాకు చూడు. పిల్లప్పుడు నేర్చుకున్య ‘ ప్రభవ, విభవ..’గుర్తుండాయని గబగబా ఒప్పచెప్తాంటే.. నోరెళ్లబెట్టి చూసినా. అంతలోకే అక్షయ వచ్చినాది.
‘ఏందిమా.. ఏం సదువుకున్యావుమా.. ఐదోతరగతా’ అన్యా.
“మాయి పెద్దచదువులు కాదు. మా అయివార్లు మంచోళ్లు. నాకు గ్యాపకశక్తి ఎక్కువ. మీ యవ్వకూడ ‘మా ఇమాంబికి బో తెలివి ఉందంటాండ.
‘అవునామా.. నీకెంత తెలివో’ అన్యా.
‘నాకు నూటాముప్ఫయి కల్మాలన్నీ వచ్చాయి’ అనె.
‘ఏందిమా’ అంటా గొప్పగా సూచ్చిమాయమ్మను.
మీ తాత వాళ్లు ఐదుగురు అన్నదమ్ములు. సిమాపల్ల (సింహాద్రిపురం) కాడనుంచి ఒక ఖాజీ సాబు వచ్చాండ. మన యాపచెట్టు కింద పద్దన్నే పెద్దోళ్లందరూ వచ్చాండ్రి. చిన్నాయిన, పెద్దనాయిన పిల్లోల్లు వచ్చాండ్రి. ఆయప్ప కల్మాలు చెప్తాంటే.. పలుకుతాండ్రి. కొందరు మా పెదనాయినగారు, చిన్నాయినగారు ఎగరగొడ్తాండ్రి. నోరు తిరక్క పనులుండాయని చెప్తాండిరి. పనులకాలం పనులు సేచ్చాండ్రి. అందుకే వాళ్లకు అబ్బేది కాదు. పనుల్లేని కాలంలోనే ఖాజీ సాబు రెండ్రోజులకోసారి వచ్చాండ. అట్ల ఆయప్ప నెలలు పట్నాది అన్నీ నేర్పించడానికి. ఒకరోజు ఖాజీసాబు బాగా రెడీ అయ్యి వచ్చినాడు. ‘మీ చదువంతా అయిపోయినాది ఒప్పజెప్పినోళ్లకు సెలవు ఇచ్చా’ అన్యాడు. మీ తాత నేర్చుకుండే ఇద్య అప్పజెప్పినాడు. సెలవిచ్చినాక ఖాజీసాబు కాళ్లు ముక్కున్యాడు తాత. తెల్లచక్క, పంచ, బొచ్చుటవాల ఇచ్చినాడు అయ్యకు. టవాల్లో పదకొండురూపాయలో ఎంతనో తెల్దు సిల్లర ఇచ్చినారు. మేం పిల్లోల్లం కదా దగ్గరకి పోల. అట్ల నేర్చుకున్యోళ్లందరికీ అయ్య సెలవిచ్యినాడు. ఎవురికి వాళ్లు అయ్యకు గౌరవించుకున్యారు. కొందరికి అబ్బుతాది చదువు.. కొందరికి అబ్బదు. మీరందరూ అయినోళ్లే కదా. ఎన్నికొట్టాటలున్యా, సరిపోనోళ్లున్యా మనం చదువుకున్న ఇద్యతో సాయం చేయాల. అల్లా మీకు మంచి సేచ్చాడు అన్యాడు. అప్పజెప్పినోళ్లు సర్లెయ్యా సర్లెయ్యా అంటూ ఒకటేసారి అన్యారు. ఆయప్ప సంతోషపడినాడు.
నేను మధ్యలో అయ్య దగ్గరికి పోయినా.
అదికూడ.. మాయమ్మ పొమ్మనింటే అయ్యముందుకు పోయినా.
మా నాయిన, చిన్నాయినోళ్లు, పెదనాయినోళ్లు అందరూ కింద కూర్చున్యారు.
అయ్య పీటమింద కూర్చున్యాడు.
‘ఏమి ఇమాంబులు’ అన్యాడు.
‘అయ్యా,. నేను చెప్తా చూడు కల్మాలు’ అన్యా.
‘చెప్పు సీ(అమ్మాయి)’ అన్యాడు.
‘అవ్వల్ కలిమా లాయిలాహు.. ‘ అంటా గబగబా నూటముప్ఫయి కల్మాలు గుక్కతిప్పకోకుండా ఒప్పచెప్పినా.
అందురూ నా తిక్కు సూచ్చానారు. అయినా తప్పుచెప్పలా. తొణక్కుండా సెప్పినా.
‘అబ్బ.. ఎంత బాగ చెప్తివమ్మా.. ఎంత గ్యాపకశక్తి పక్కీరప్పా, సైదమ్మ నీ బిడ్డకు’ అని పొగిడినాడు.
‘అమ్మా,,, ఇమాంబులు ఎట్ల నేర్చుకుంటివి’ అన్యాడు.
‘అయ్యా.. మా నాయినోళ్లకు చెప్తాంటే, పద్దన్నే లేచి పనిసేచ్చా ఇంటాంటి. పనికి పోయినప్పుడు నాకు నేను ఒప్పజెప్పుకుంటాంటి’ అన్యా.
‘నువ్వు చదువుకోంటే బాగుండు. గొప్ప గ్యాపకశక్తిమా. ఏమనుకోకుమా ఇమాంబులు. నువ్వు ఇక్కడున్నోళ్లందరికంటే మేలు. ఆడిపిల్లోల్లకు నేను సెలవు ఇవ్వలేను, ధర్మం ఒప్పుకోదు. సెలవిచ్చే నాకు సెడ్డ పేరొచ్చాది.నా హయాములో ఇప్పటివరకూ ఎవురికి ఆడిపిల్లోల్లకు సెలవు ఇవ్వలా’ అన్యాడు.
‘మర్సిపోవాకుమా ఇద్య.నీ బిడ్డలకు ఉంటాది’ అని తలకాయమీద చెయ్యి పెట్టి అయ్య సిమాపల్లెకు ఎల్లబారినాడు. ఆ పొద్దు ఎద్దల బండ్లో ఇర్సివచ్చినారు. నేను ఆ పొద్దు ఏర్సి బువ్వకూడా తినలా’ అని గతాన్ని తల్చుకోని మాయమ్మ కండ్ల నీళ్లు పెట్టుకుంది. నా కండ్లల్లో నీళ్లు దిగినాయి.
‘ఆ పొద్దు సందిపులకు అన్నా సెలవు ఇయ్యమని’ బతిమాలినా. అయ్య వొప్పుకోల. ఇప్పుడేముంది ఆడోళ్లు అన్ని రకాలుగా బాగుండారు, సదింపులు చదువుతానారు, అరబ్బీలో ఖురాను చదువుతాండారు మనోళ్లు’ అన్యాది మాయమ్మ గర్వంగా.
గబగబా కల్మాలు వొప్పచెప్తాంటే నేను, మా చెల్లెలు తిక్కబట్నట్లు చూసినాం.
‘మర్సిపోయినా కొన్ని . యాడ పిల్లప్పుడు నేర్సుకున్నేయి. మల్ల ఒకసారి చెప్తే గుర్తొచ్చాయి’ అనె.
‘ఏందోమా.. ఆ తురకం నాకు అర్థం కాడం’ లా అన్యా.
‘తురకం నేర్చుకుంటేనే ఇలవ మనోళ్లకు. రోంతయినా నేర్సుకోవాల. ఈ మద్దె.. దూదేకలోళ్లయినా తురకం వచ్చే ఎచ్చలుగా మాట్లాడతారు, నాకొచ్చాది, అయినా బాష రాకుండా మనం ఒకరిముందర ఎందుకు తలకాయ వంచుకోవాల్ల, అప్పుడు మనకు, ఎద్దులకు తేడా ఏముందీ’ అన్యాది.
నాకు పౌరుషం వచ్చినాది.
‘అవ్వల్ కలిమా .. లా ఇలాహు’ అని గట్టిగా అర్సినట్లు చదివినా.
‘అరిచ్చే రాదు, మంచు పెట్టాల’ అన్యాది మాయిమ్మ.
నేను తలూపినా.
*
-(మొన్న నలభై రోజులు పురుడు ఫంక్షన్‌లో కోళ్లు పట్టకచ్చుకున్యాం రేత్తిరి. పద్దన్నే పరుపులు కుట్టే మా గుట్టమింద తాత(బంధువులాయప్ప)ను పిల్చకచ్చినాం. ఆయప్ప హలాలు సేచ్చాంటే.. మాయమ్మ మాటలు గుర్తొచ్చి సిగ్గుపడ్నా. ఇద్య నేర్చుకుంటే బాగుండునే అనుకున్యా. ఇపుడు నేను కోడిసీలు, పొట్లిసీలు తింటాన. పదేండ్లయ్యింది సీలు తినబట్టి)
అభినందనలు
ధన్యవాదాలు
రాజావలి గారు పితృస్వామిక పెత్తనాన్ని చాలా సూక్ష్మంగా చెప్పారు.
Avunu sir . Thanks for your responce