ఈ రోజు మీకు ఒకే ఒక్క కథ చదివే అవకాశం, సమయం వుందని అనుకుందాం.
కథలో మొదటి వాక్యం మాత్రమే చదివి ఏదో ఒక కథ ఎంచుకోవాలని షరతు. మీ ముందు ఇక్కడ ఇచ్చిన పది కథల ప్రారంభ వాక్యాలు ఉన్నాయి. వీటిలో ఒకదానికి ఒకటి సంబంధం లేదు. వీటిలో మీరు ఏ కథని చదవాలనుకుంటారు?
- ఉదయం ఆరుగంటలు. అప్పుడే సూర్యుడు ఆకాశాన్ని ఆక్రమిస్తున్నాడు. పచ్చటి పొలాల మధ్యగా పారుతున్న పంటకాలువ చప్పుడు ఆహ్లాదకరమైన సంగీతంలా వినిపిస్తోంది.
- “తాగెయ్. ముందు కొంచెం చేదుగా వుంటుంది. తరువాత ప్రాణం ఎప్పుడు పోయిందో కూడా తెలియదు” చెప్పాడతను ఆమెతో
- “గణగణగణ” అలారం మోగటంతో లేచి కూర్చున్నాడు భాస్కర్. రాత్రి వచ్చిన పీడ కల గురించి ఆలోచిస్తూ అలాగే బెడ్ మీద వుండిపోయాడు.
- ఆరిఫ్ చాలా మంచి కుర్రాడు. పద్దతిగా వుంటాడు. రోజు ఐదుసార్లు నమాజ్ చేస్తాడు. రంజాన్ వచ్చిందంటే నెలంతా రోజా వుంటూ మసీదు దగ్గరే అందరికీ సేవ చేస్తూ వుండిపోతాడు.
- ఇది నా ఆఖరు ఉత్తరం. మళ్లీ కలుస్తానన్న నమ్మకం కూడా లేదు. దయచేసి చింపకుండా చదువు.
- చనిపోవడానికి ముందు ఆఖరుసారిగా “అమ్మా” అన్నాడా పిల్లాడు. ఆమె పలుక లేదు. పలుకలేదు కూడా.
- ఆ కాలనీలో ఎత్తైన బిల్డింగులు వున్నాయి. ఒకోకటి ఇరవైకి తక్కువ కాకుండా అంతస్థులు. ప్రతి ఇంటిలో బాగా డబ్బున్నవాళ్లు. ఎక్కువమంది రిటైరైన కలెక్టర్లు, గవర్నమెంట్ అధికారులు.
- నా మీద రేప్ జరిగి అప్పటికి నాలుగు నెలలు. ఈ విషయం నేను ప్రపంచానికి చెప్పాలి అని నిర్ణయించుకున్నది అప్పుడే.
- కార్తీకమాసపు చల్లగాలులు నెమ్మదిగా వీస్తున్నాయి. రాత్రంతా నైట్ క్వీన్ పరిమళాలతో కలిసి ఆడిన గాలి అప్పుడే తెరిచిన తలుపులో నుంచి లోపలికి వచ్చింది. అది పీలిస్తూ అదితి ఆవులించింది.
- తల మీద నల్లటి టోపి పెట్టుకున్నాడు. కళ్లద్దాలు సర్దుకున్నాడు. ఇయర్ పాడ్స్‌లో ఇళయరాజా పాటలు. కాళ్లకు చెప్పులు వేసుకుంటున్నప్పుడు నడుము కట్టుకున్న బెల్ట్ బాంబ్ సరిగ్గా వుందా లేదా అని చూసుకోని వీధిలోకి వెళ్లి, జనంలో కలిసిపోయాడు.
***
- “తాగెయ్. ముందు కొంచెం చేదుగా వుంటుంది. తరువాత ప్రాణం ఎప్పుడు పోయిందో కూడా తెలియదు” చెప్పాడతను ఆమెతో
- ఇది నా ఆఖరు ఉత్తరం. మళ్లీ కలుస్తానన్న నమ్మకం కూడా లేదు. దయచేసి చింపకుండా చదువు.
- నా మీద రేప్ జరిగి అప్పటికి నాలుగు నెలలు. ఈ విషయం నేను ప్రపంచానికి చెప్పాలి అని నిర్ణయించుకున్నది అప్పుడే.
- చనిపోవడానికి ముందు ఆఖరుసారిగా “అమ్మా” అన్నాడా పిల్లాడు. ఆమె పలక లేదు. పలకలేదు కూడా.
అందరూ కాకపోయినా దాదాపు ఎనభై శాతం మంది ఇవే ప్రారంభాలని ఎంచుకుంటారు అని నా నమ్మకం. అనుభవం కూడా.
ఈ శీర్షికలో నేను చెప్పబోయే కొన్ని అంశాలు ఒక ఫేస్‌బుక్ పేజీలో కొంత కాలం క్రితం పోస్ట్ చేశాను. పైన ఇచ్చిన ప్రారంభాలు కూడా ఒకసారి పోస్ట్ చేసి ఏ కథ చదవాలనిపిస్తోందో చెప్పమన్నాను. చాలామంది ఈ నాలుగు ప్రారంభాలే చెప్పారు, ఒకరిద్దరు “తల మీద నల్లటి టోపి పెట్టుకున్నాడు” అనే ప్రారంభాన్ని కూడా ఎంచుకున్నారు. మరో సందర్భంలో LGBTQ మిత్రులకు కథలు రాయటం గురించి ఒక సెషన్ తీసుకున్నప్పుడు ఇదే ప్రశ్న అడిగాను. సమాధానాలు దాదాపు ఇదే విధంగా ఉన్నాయి.
ఏమిటీ ఈ ప్రారంభాల ప్రత్యేకత? తెలుసుకుందాం. కానీ మిగిలిన వాటిలో సమస్య ఏమిటో తెలుసుకోవడంతో ప్రారంభిద్దాం.
ఉదయం ఆరుగంటలు. అప్పుడే సూర్యుడు ఆకాశాన్ని ఆక్రమిస్తున్నాడు…
“గణగణగణ” అలారం మోగటంతో లేచి కూర్చున్నాడు భాస్కర్…
ఇలాంటి వాక్యాలతో ప్రారంభమయ్యే కథలు తెలుగు సాహిత్యంలో కొన్ని వేలు వచ్చి వుంటాయి. అయితే మళ్లీ రాయకూడదా అని అడగకండి. తప్పకుండా రాయచ్చు. కానీ ఆ వాక్యాల వల్ల కథకి ఎంత ప్రయోజనం కలుగుతుంది? ఆ వాక్యం ఒక పాఠకుణ్ణి బలంగా లాక్కొచ్చి కథలో పడేస్తుందా? అని ఆలోచించుకోని రాయచ్చు.
పాఠకుడిని లాక్కొచ్చి కథలో పడేయటం. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. మళ్లీ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మరికొన్ని ప్రారంభాలని పరిశీలిద్దాం.
ఆరిఫ్ చాలా మంచి కుర్రాడు. పద్దతిగా వుంటాడు. రోజు ఐదుసార్లు నమాజ్ చేస్తాడు…
ఆ కాలనీలో ఎత్తైన బిల్డింగులు వున్నాయి. ఒకోకటి ఇరవైకి తక్కువ కాకుండా అంతస్థులు. ప్రతి ఇంటిలో బాగా డబ్బున్నవాళ్లు.
కార్తీకమాసపు చల్లగాలులు నెమ్మదిగా వీస్తున్నాయి. రాత్రంతా నైట్ క్వీన్ పరిమళాలతో కలిసి ఆడిన గాలి అప్పుడే తెరిచిన తలుపులో నుంచి లోపలికి వచ్చింది.
ఈ ప్రారంభాలు ఎలా ఉన్నాయి? చప్పగా వున్నాయనిపిస్తుంది కదా? లేదా? అయితే ఒక పని చెయ్యండి. పైన ఉన్న వాక్యాలకి చివర “అయితే ఏంటి” అనే రెండు పదాలని జోడించి చదవండి.
ఆరిఫ్ చాలా మంచి కుర్రాడు. పద్దతిగా వుంటాడు. రోజు ఐదుసార్లు నమాజ్ చేస్తాడు. అయితే ఏంటి?
మిగిలిన ప్రారంభాలని కూడా ఇలాగే అయితే ఏంటి అని జోడించి చదవండి. ఏమైనా తేడా తెలుస్తోందా?
ఇది పాఠకుడు అడిగే ప్రశ్న – “అయితే ఏంటి?”
ఈ ప్రశ్న పాఠకుడు అడిగాడు అంటే ఆ కథ చదవటంలో ఉత్సుకత చూపించడం లేదు అని అర్థం. ఉత్సుకత చూపించని పాఠకుడు మీ కథని చదవకపోవచ్చు. చదివినా మీరు చెప్పాలనుకున్న విషయాన్ని అర్థం చేసుకోకపోవచ్చు. మీరు ఒక పాఠకుడిని (ఒకోసారి శాశ్వతంగా) కోల్పోవచ్చు.
నేను పాఠకుడి కోసం రాయటం లేదు నా కోసమే రాసుకుంటాను అంటారా? సంతోషం. అయితే మీరు ఈ శీర్షిక చదవాల్సిన అవసరం లేదు. నేను చెప్పబోయేవి ఏవీ డైరీలు రాసుకునేవాళ్లకి వర్తించవు.
ఇంకో రెండు రకాల వాదనలు ఉన్నాయి. అవి కూడా మాట్లాడేసుకుని ముందుకు వెళ్దాం.
మా కథ మా ఇష్టం.
చాలా సంతోషం. మా సాంబార్ మా ఇష్టం – ఎనిమిది ఏలకులు వేస్తాం. చాలా సంతోషం. మా పాయసం మా ఇష్టం, రెందు చెంచాల బట్టల సోడా కూడా వేస్తాం. చాలా చాలా సంతోషం. నన్ను మాత్రం మీ ఇంటికి భోజనానికి పిలవకండి. కిచెన్‌ని కెమిస్ట్రీ ల్యాబ్‌గా మార్చుకున్న మహానుభవులు. మా వంటల పుస్తకం మీకు కూడా పనికిరాదు.
కథ అనేది పాపులారిటీ కోసం రాసేది కాదు. కథైనా, నవలైనా ఏ సాహితీ ప్రక్రియకైనా ఒక సామాజిక బాధ్యత ఉంటుంది. ఒక సామాజిక ప్రయోజనం ఉంటుంది. సంఘ హితమే సాహిత్యం.
ఇది చాలా విలువైన, నిజమైన వాదన. దీనికి నా సమాధానం – పాపులారిటీ కోరుకునే రచయిత కన్నా, సమాజ హితం కోరుకుని రచనలు చేసే రచయిత ఎక్కువమంది పాఠకులని చేరాలి. అలాంటి రచయితకే ఎక్కువమంది పాఠకులు, అభిమానులు ఉండాలి. ఇది నేను మనఃస్పుర్తిగా కోరుకుంటాను. కానీ, ఎవరైనా చేదు మందు, చేదుగానే పెడతాను అనే డాక్టర్ దగ్గరికి వెళ్తారా లేక అదే చేదు మందుని రుచికరంగా సుగర్ కోటింగ్ వేసి ఇచ్చే దాక్టర్ దగ్గరికి వెళ్తారా?
సినిమాల నుంచి వందలాది ఉదాహరణలు ఇవ్వగలను. తాము నమ్మిన సిద్ధాంతాలను ప్రేక్షకులకి చెప్పడానికి చాలా మంది సినిమాలు తీసారు. తెలుగులో ఉదాహరణకి ఇద్దర్ని తీసుకుందాం. కె. విశ్వనాథ్, మాదాల రంగారావు. ఈ ఇద్దరు సైద్ధాంతికంగా రెండు రకాలు (రెండూ పరస్పర వ్యతిరేకం అనట్లేదు). పాశ్చాత్యపు పెనుగాలులకి రెపరెపలాడుతున్న భారతీయ సాంస్కృతిక, సంప్రదాయ జ్యోతి ఆరకూడదనే తపన విశ్వనాథ్ గారిది. పల్లెటూరి పెత్తందారు భూస్వామి నుంచి పశ్చిమ దేశపు క్యాపిటలిస్ట్ వరకు తమకన్నా తక్కువ స్థాయి వారిని ఎలా దోచుకుంటున్నారో చెప్పే ప్రయత్నం రంగారావుగారిది. సిద్ధాంతం ఏదైనా ఆ సిద్ధాంతం జనంలోకి వెళ్లేది ఎప్పుడు? ఆ సినిమాని సినిమాగా తీసి, దాన్ని ప్రేక్షకులకి చేర్చి, ఆ సినిమా చూడాలని ప్రేక్షకులకి అనిపించేలా చేసి, థియేటర్‌కి రప్పించి, సినిమా చూపించి, మెప్పించినప్పుడే కదా? ఈ విషయంలో విశ్వనాథ్‌గారు సాధించినంత రంగారావుగారు సాధించలేదని నా అభిప్రాయం. నేను చెప్పదల్చుకున్న సిద్ధాంతం గొప్పది, ప్రేక్షకులే అర్థం చేసుకోలేదు అని రంగారావుగారు అనచ్చు కూడా. ఏ ప్రేక్షకుడు సిద్ధాంతాలు తెలుసుకుందామని థియేటర్‌కి రాడు. థియేటర్‌కి రప్పించి, ఒప్పించి, మెప్పించడం అందుకే అవసరమని చెప్తున్నాను. ఇదే కథ, నవల లాంటి అనేక సాహితీ ప్రక్రియలకు వర్తిస్తుంది. మీకు అర్థం అవడానికి పైన చెప్పిన వాక్యాన్నే మరో రకంగా చెప్తాను – ఏ పాఠకుడు సిద్ధాంతాలు తెలుసుకుందామని ఫిక్షన్ చదవడు. కథ/నవల లోకి రప్పించి, ఒప్పించి, మెప్పించడం అవసరం. వీటిల్లో రప్పించడం గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. మీరు రాసిన కథ, నవల ఏదైనా సరే అందులో ఉన్న మొదటి వాక్యాలు పాఠకుడిని లాక్కొచ్చి కథలో పడేయాలి. అది పల్ప్ ఫిక్షన్ అయినా సరే, లిటరరీ ఫిక్షన్ అయినా సరే.
మేం చెప్పాలనుకుంటున్న కథ మేం చెప్పుకోకూడదా?
తప్పకుండా చెప్పచ్చు. తప్పకుండా చెప్పాలి కూడా. కథని మార్చమని నేను చెప్పలేదు. చెప్పను కూడా. నేను చెప్తున్నదల్లా – మొదటి పది వాక్యాలు రాసే ముంది ఒక్క నిముషం ఆలోచించండి. ఈ వాక్యాలు పాఠకుడికి మీ కథ/ నవల వెంటనే చదవాల్సిన అవసరం కల్పిస్తున్నాయా? లేదా? అని ఒక్కసారి సమీక్షించుకోండి.
ఈ ఉదాహరణ చూడండి –
“గణగణగణ” అలారం మోగటంతో లేచి కూర్చున్నాడు భాస్కర్. రాత్రి వచ్చిన పీడ కల గురించి ఆలోచిస్తూ అలాగే బెడ్ మీద వుండిపోయాడు.
ఇదే కథని పీడకలతో ఎందుకు మొదలుపెట్టకూడదు?
భాస్కర్ పరుగెడుతున్నాడు. ఆగేందుకు అవకాశం లేని పరుగు. వెనుకనుంచి తరుముకొస్తున్నది ఎవరో తెలియటం లేదు. కానీ భయం మాత్రం అణువణువులో కాళ్లజర్రిలా పాకుతోంది. అలసట. దూరంగా ఎవరిదో ఇల్లు. వేగం పెంచాడు. రొప్పుతున్నాడు కానీ పరుగెత్తుతూనే వున్నాడు. మరో అడుగు వేస్తే ఆ ఇంట్లోపలికి వెళ్లిపోతాను అనుకుంటుండగా భూమి మధ్యకు చీలినట్లై అందులోకి పడిపోయాడు. అగాధం. ఎంత లోతు వుందో అర్థం కావటం లేదు. ఓ రెండు నిముషాల తరువాత నేలని తాకాడు.
ధభ్! మంచం మీద నుంచి కిందపడ్డాడు భాస్కర్. మరో పక్క గణగణమంటూ అలారం మోగుతోంది.
మీరు రాసేది నవల అయితే పైన రాసిన పేరగ్రాఫ్‌కి చోటు ఉంటుంది. అదే కథైతే ఇంత రాసే అవకాశం ఉండకపోవచ్చు. పైగా కథకు సంబంధంలేని కల అయితే రాయకపోవటమే మంచిది. ఏది ఏమైనా మొదటి ప్రారంభానికీ, రెండవ ప్రారంభానికి తేడా ఏమిటి?
అర్థమవ్వాలంటే మనం మరో టాలీవుడ్ దర్శకుణ్ణి కలవాలి.
మీరు ఏదో పెద్ద హోటల్లో వున్నారు. లిఫ్ట్‌లో అనుకోకుండా రాజమౌళి కనిపించాడు. “మీరు రైటర్ కదా? ఏదీ సినిమాకి పనికొచ్చే కథ ఏదైనా చెప్పండి” అన్నాడనుకుందాం. కథ ఎలా మొదలుపెడతారు? లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్‍కి వెళ్లే లోగా చెప్పాలి. ఆ తరువాత ఆయన కార్ ఎక్కి వెళ్లిపోతాడు. మొదలుపెట్టండి –
“అప్పుడే తెల్లవారింది సార్. సూర్యుణ్ణి ఎర్రగా చూపిస్తాం. చెట్ల మీద పక్షుల కిలకిలరావాలు…”
ఇది బాగుందా? పోనీ ఇలా చెప్తే ఎలా ఉంటుంది?
“చెల్లెల్ని రేప్ చేసి చంపేసిన ముగ్గురు దుర్మార్గులని చంపి పగతీర్చుకునే మెజీషియన్ కథ వుంది రాజమౌళిగారూ. మూడు హత్యలూ పోలీసులు, లాయర్ల కళ్ల ముందే చేస్తాడు కానీ వాళ్లు కనుక్కోలేరు”
ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ రాలేదు. మిగిలిన టైమ్‌లో ఆయన మీ నెంబర్ అడిగి ఫీడ్ చేసుకునే అవకాశం ఎక్కువ కదా?
అర్థం అవడం కోసం ఈ ఉదాహరణ. ఇప్పుడు ప్రతి పాఠకుడూ రాజమౌళే అనుకోండి. ఎవరి దగ్గరా అంత టైమ్ లెదు. మొదటి వాక్యం, కనీసం మొదటి పేరగ్రాఫ్ ఆకట్టుకోకపోతే ఆ తరువాత మీరు ఎంత గొప్పకథ రాసినా దాని ఫలితం అంత గొప్పగా వుండకపోవచ్చు. తీరిగ్గా చదివే వెసులుబాటు వున్న వాళ్లకీ, సాహిత్యం మీద అభిమానం వున్నవాళ్లకి ప్రారంభం కన్నా మిగిలిన కథ ముఖ్యం కావచ్చు. వాళ్లకోసమే రాయాలనుకుంటే ఎలా మొదలుపెట్టినా ఫర్లేదు. అలా కాకుండా సామాన్య పాఠకులు కూడా (ఎక్కువమంది) చదివి ఆనందించాలి అనుకుంటే ప్రారంభం ఆకట్టుకునేలా రాయక తప్పదు.
“ఈ రోజు అమ్మ చనిపోయింది. బహుశా నిన్ననుకుంటా. ఏమో. నాకు గుర్తులేదు” ఆల్బర్ట్ కామూ రాసిన ఔట్సైడర్ నవలా ప్రారంభం ఇది. ఉత్కంఠతని దట్టించిన ప్రారంభం కదూ ఇది.
ఇలా ఉత్కంఠత లేదా ఉత్సుకత కలిగించే హుక్ మొదటి వాక్యమే కానక్ఖర్లేదు. పైన ఇచ్చిన ఉదాహరణలలో ఇది గుర్తుందా –
తల మీద నల్లటి టోపి పెట్టుకున్నాడు. కళ్లద్దాలు సర్దుకున్నాడు. ఇయర్ పాడ్స్‌లో ఇళయరాజా పాటలు. కాళ్లకు చెప్పులు వేసుకుంటున్నప్పుడు నడుము కట్టుకున్న బెల్ట్ బాంబ్ సరిగ్గా వుందా లేదా అని చూసుకోని వీధిలోకి వెళ్లి, జనంలో కలిసిపోయాడు.
ఇందులో మొదటి వాక్యం చాలా సాదాసీదాగా వుంది. కానీ మొదటి పేరగ్రాఫ్ చివరికి వచ్చేసరికి మెలికపడింది. బెల్ట్ బాంబ్ పెట్టుకున్న వ్యక్తి గుంపులోకి వెళ్లి ఏం చెయ్యబోతున్నాడో అన్న ఉత్సుకత రేకెత్తించగలిగింది. మరీ పెద్దది కాకుండా ఒక పేరగ్రాఫ్ రాసి ఆ పేరా చివరిలో ఉత్సుకత రేకెత్తించగలిగినా చాలు.
ఇదంతా చదివి, వర్ణనలతో కథ మొదలుపెట్టకూడదని అనుకోవద్దు. వర్ణనతో మొదలైన అద్భుతమైన కథలు ఎన్నో వున్నాయి. అయితే అలాంటి కథల్లో ఈ వర్ణనలు ఆ కథ జరుగుతున్న వాతావరణం, భౌగోళిక స్వరూపం గురించి చెప్తూనే ముందు ముందు కథ నడవబోతున్న మార్గంలోకి తీసుకెళ్ళేవిగా వుంటాయి. ఆ మూడ్‍ని సెట్ చేసేవిగా వుంటాయి. గమనించండి.
ఉదాహరణకి కొన్ని ప్రారంభ వాక్యాలు ఇస్తున్నాను. ఆ కథ దేని గురించి (కథాంశం) ఊహించి కామెంట్ చెయ్యండి
మళ్లీ కలిసినప్పుడు మరికొంత ముందుకు వెళ్దాం…
చంద్రుడు ఏ నక్షత్రంతో సరసమాడుతున్నాడో తెలియకుండా మబ్బుల దుప్పటి కప్పుకున్నాడు. మబ్బుల చాటున ఏం జరుగుతోందో తెలిసిన మిగిలిన నక్షత్రాల కళ్లు మిలమిల మెరుస్తున్నాయి.
మా ఊరి మధ్యలో చలివేంద్రంలా ఉంటుందొక బావి. ఆ బావిలోంచి నీళ్లు తోడుకునేందుకు వచ్చే ఆడవాళ్ల గాజుల చప్పుడు, బావి గిలక చప్పుడు కలిసి యుగళగీతం పాడుతున్నట్లు ఉంటుంది.
ఆ రాత్రి చీకటి మరీ ఎక్కువగా ఉంది. అడవిలో కౄరమృగం దాడి చేస్తుందని తెలుసుకోలేక అల్పప్రాణులు బలైపోయే చీకటి అది. అలాంటి చీకటిలో ఒంటరిగా నడుస్తున్నాడు రాకేష్.
ఆ అపార్ట్‌మెంట్ బిల్డింగ్ చాలా పెద్దది. దూరం నుంచి ఒంటి స్థంభం మేడలా కనిపిస్తుంది. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ఒంటరిగా ఉంటుంది.
ఎప్పుడో నవాబుల కాలంలో కట్టిన కట్టడం అది. చాలా కాలం ఖాళీగా ఉండేది. జిల్లా కోర్టును అక్కడికి మార్చారు కాబట్టి జనం సంచారం పెరిగింది. లాయర్ల హడావిడి పెరిగిన తరువాత అప్పటిదాకా అక్కడ ఉన్న అరుదైన జలగలు మాయం అయ్యాయని అంటారు.
*
Bagundi . kaani writerski voka pandhaa sahajamgaa vastundi .vaallu alage raaya galugutaaru .
Inkolaa rayaleru …ani voka writer ga nenu anukuntaanu . kondaru mugimpulo chamakku vutkantha suspension vundaali appude ekkuva paathakulaku ishtam vuntundi try cheyamani chebutoo vuntaaru .entha chadivinaa aa style raadu kondariki .
idi naa idea .
super sir
good direction to story writers
with best examples.
thank you sir