అమ్మ సభ

నీ జన్మదిన నివాళి కోసం
అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి
నీ స్మారక పురస్కారాలు ప్రకటితమయ్యాయి
నీ జయంతి వేడుకల్ని
అలా చెయ్యాలనీ
ఇలా చెయ్యాలనీ
పిల్లలిద్దరూ పెద్ద ఎత్తున ప్రణాళిక వేశారు
వేదిక మీద
నీ తైల వర్ణ చిత్ర పటాన్ని
రంగు రంగుల పూలతో
అందంగా అలంకరించాలని ఆశించారు
అభ్యాగతులందరికీ ఆప్యాయంగా అందించాలని
తేనీటి విందుని
ఆనాటి కోసం
ముందే అనుకున్నారు
అమ్మ సభ కోసం
నా కూతుళ్లిద్దరూ కార్యక్రమాన్ని కళ్ళల్లో పెట్టుకుని
కాళ్లకు బలపాలై తిరిగారు
ఇదిగో ఆ తేదీ రాబోతుంది
అదిగో ఆ ఘడియ నిజం కాబోతుంది
ఈలోపు హఠాత్తుగా
ఎక్కడ నుంచి ఎగిరి వచ్చిందో గాని
తీతువు పిట్టలా
సభను చెడగొట్టడానికి కుట్రలా
కరోనా రూపంలో కాలుమోపింది
మృత్యు క్రిమి అమీబాలా
ప్రపంచమంతా పరివ్యాప్తిoచింది
నగరమంతా కర్ఫ్యూ మేఘాల నిషిద్ధచ్ఛాయలు
ఎటుచూసినా గృహ నిర్బంధాలు
ఎక్కడికెళ్లినా
నిషేధాజ్ఞల హాహాకారాలు
భారతదేశంమంతా
ఒక బందీఖానాగా భయావహ వాతావరణం
నా పుట్ల హేమలతా!
నా పట్ల అవ్యాజానురాగం చూపిన
నిన్ను అదృష్టవంతురాలివనాలో
దురదృష్టవoతురాలివనాలో
కరోనా చూడకుండానే కన్ను మూశావు
నువ్వే బతికుంటే
‘స్త్రీల మీద కరోనా ప్రభావమని’
ఎన్ని వ్యాసాలు రాసి వుండేదానివో
ఎన్ని కొత్త కోణాలను ఆవిష్కరించేదానివో
ఏమైతేనేం? సంతాప వార్తలా!
నీ పుట్టిన రోజు
సభ రద్దయిపోయింది
ఇంత మాత్రమే లోకానికి తెలుసు
కానీ కరోనా సాక్షిగా
కడదాకా మిగిలిన
ముగ్గురు దుఃఖ శ్రోతల నడుమ
నుస్రత్ ఫతే అలీఖాన్
కన్నీటి ఖవాలిలా
నీ జన్మదిన నివాళి
తెలియకుండానే
తెల్లారి దాకా కొనసాగింది
శిష్యుడిలాంటి సూర్యుడు
వందన సమర్పణ చేశాడు కవిలా!
అందరికీ శుభోదయమంటూ…
రేపటి కొత్త వాగ్దానంతో సభోదయమంటూ..!
( మార్చి 26న ప్రముఖ రచయిత్రి డా. పుట్ల హేమలత స్మారక పురస్కారాల సభ రద్దైన సందర్భంగా)

ఎండ్లూరి సుధాకర్

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • శిష్యుడు లాంటి సూర్యుడు వందన సమర్పణ చేయడం ..గొప్ప ఎక్స్ప్రెషన్ సర్..అమ్మ సభ విజయవంతం అయింది..అమ్మకు నివాళి…

    • కవిని కన్న తల్లే కాదు భార్య కూడా ధన్యురాలు

  • కరోనా జబ్బు అమ్మ సభకు అడ్డుపడింది. కవిత హృదయ విదకారంగా ఉంది సార్

  • జీవిత భాగస్వామి పట్ల మీ అనురాగానికి నమస్సులు🙏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు