సుధ వస్తానంది ఇవాళ. ఎన్నాళ్లయ్యిందో తనని కలిసి. ఒకే ఊళ్లో ఉంటాంగానీ కలవాలంటే దూరాభారాలు. అంతకుముందు అడపాదడపా కలిసేవాళ్లం. గత ఏడాదిన్నరగా బాగా తగ్గిపోయింది. తనకేమో ఆఫీసులో ఏవో ట్రైనింగులు, ప్రోజెక్ట్స్‌తో బిజీ…నేను ప్రెగ్నంట్ అయ్యాక బయటికి ఎక్కువగా వెళ్ళింది లేదు. పాపాయి పుట్టాక వస్తానంది. ఇవాల్టికి తీరిక చిక్కింది కాబోలు అమ్మగారికి. తను వస్తానని చెప్పిన దగ్గరనుండీ నాకు ఒకటే సంతోషం. ఎప్పుడెప్పుడొస్తుందా అని ఆత్రంగా ఉంది. బోల్డన్ని కబుర్లు చెప్పేసుకోవాలి. వీలైతే దానితో కలిసి ఎక్కడికైనా వెళ్లాలి…షాపింగ్ లేదా హొటల్ కి…ఎక్కడికో ఒకచోటుకి…బయటికి వెళిపోవాలి. కాస్త బయట గాలి పీల్చుకోవాలి. కాలింగ్ బెల్….సుధే అయ్యుంటుంది.
‘సుధా….రావే… ఎన్నాళ్లయిందే నిన్ను చూసి!’
‘హాయ్ నీలూ, Congratulations! నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా! నువ్వు పాప కావాలి…పాపే కావాలి అని ఎంతలా అనుకున్నావ్! చిట్టితల్లి పుట్టేసింది నీకు.’
‘థాంక్సే. ఎన్నాళ్లకి కలిసావు! రా…రా…’
‘పాపేది? పడుకుందా? ముందు బుజ్జిదాన్ని చూడాలి.’
‘లోపలికిరా, ముందు. చూద్దువుగాని.’
‘దారంతా దాని గురించే అనుకుంటూ వచ్చాను, తెలుసా! ఫొటోల్లోనే ఎంత ముద్దొచ్చేసిందో! దాన్ని ఎత్తుకుని నలిపేయాలి, బుగ్గలు పిండేయాలి.’
‘ఓయ్…ఓయ్.. ఏమిటా బండ ముద్దు! దాన్ని నిజంగానే నలిపేస్తావా ఏం?’
‘అలా పిండేస్తేగానీ ముద్దు తీరదు. పాప ఏది ఇంతకీ?’
‘పడుకుంది. దాన్ని ఇప్పుడు లేపకు తల్లోయ్. ఇప్పుడే కాస్త కునుకు తీసింది. కాసేపు పడుకోనీ. ఆడుకుందువుగానిలే, ఉంటావుగా సాయంత్రం వరకు. అది లేచే లోపల గబగబ మనం మన కబుర్లు చెప్పేసుకుందాం. కూర్చో..మంచినీళ్లవ్వనా?’
‘ఒక్కసారి దూరంనుంచి చూసొస్తా. లేపను. ప్రామిస్.’
‘హహ..సరే, రా. గదిలో పడుకుంది. చూద్దువుగాని.’
‘ఎంత ముద్దుగా ఉందే! అచ్చం నీలాగే ఉంది. బుజ్జిపాప!’
‘సరే..సరే..చూసింది చాల్లే, చప్పుడు చేస్తే లేచిపోతుంది…బయటికి రా.’
‘కాసేపట్లో దాన్ని లేపేయాలి. సరేనా? దానితో ఎప్పుడెప్పుడు ఆడుకుంటానా అని ఉంది!’
‘అలాగేలే! కూర్చోవే…ఎలా ఉన్నావు? నీ జాబ్ ఎలా ఉంది? ఏదో ట్రైనింగ్ అన్నావు, అయిపోయిందా?’
‘నేను సూపర్! ఆ ట్రైనింగ్‌తోనే చావగొట్టారేబాబూ. అయిపోయిందిలే!’
‘పాప పుట్టగానే వస్తానన్నావు! ఇప్పుడా వచ్చేది!’
‘వద్దామనే అనుకున్నా. కానీ, అంత చిట్టి పాపని ముట్టుకుని, ముద్దు పెట్టేసుకుని, మన పైత్యాలన్నీ దానికెక్కించడం ఎందుకని..నాలుగైదు నెలలయ్యాక వద్దామని ఆగాను.’
‘వచ్చావు, అదే సంతోషం. నిన్ను చూసాకే నాకు కాస్త ఊపిరాడుతున్నట్టుందే! పొద్దున్నుంచి ఎప్పుడొస్తావా అని ఎదురుచూస్తూ కూర్చున్నా. నీ సంగతులు చెప్పు? మన ఫ్రెండ్స్ ఎవరైనా కలిసారా ఈ మధ్య? ఉండు టీ పెడతా..తాగుతూ కబుర్లు చెప్పుకుందాం.’
‘కాసేపయ్యక తాగుదాంలే, నువ్వు కూర్చో. నా సంగతి అలా ఉంచు. నువ్వేంటి అలా ఉన్నావు? ఇలా పీక్కుపోయావేంటి! అంత నీరసంగా ఉన్నావేంటి! సరిగ్గా పడుకోవట్లేదా? కళ్ళు చూడు ఎలా ఉన్నాయో! చిట్టితల్లి పుట్టింది, ఎక్కడో గాల్లో తేలుతుంటావనుకుంటే ఇంత దిగాలుగా ఉన్నావేమిటే!?’
‘హ్మ్! లేదే…బానే ఉన్నాను. అనుకున్నట్టే పాపాయి పుట్టింది. సంతోషమే!’
‘కదా! అసలు ప్రెగ్నంట్ అయిన దగ్గరనుండీ అమ్మాయే పుడుతుందని ధీమాగా కూర్చున్నావు. భలే ఆశ్చర్యమే! ఒక్కసారి కూడా అబ్బాయి అన్న మాటే అనలేదు నువ్వు.’
‘తావీజ్ మహిమ…అంబ పలుకు, జగదంబ పలుకు. ఆకాశవాణి పలికింది…అమ్మాయే పుడుతుందని చెప్పింది.’
‘హహ గొప్పేలే! సరేగానీ, కొత్తగా అమ్మవయ్యావు. పాపతో బాగా ఎంజాయ్ చేస్తున్నావా! ఎలా ఉంది motherhood?’
‘Motherhood….హ్మ్…100 సలహాలు, 200 బాధ్యతలతో అయోమయంగా ఉందే!’
‘అదేమిటే!?’
‘అదేమిటంటే ఏం చెప్పమంటావ్! మా…తృ…మూ…ర్తి పాత్రను పోషిస్తున్నా, అలాగే ఉంటుంది. అసలు అమ్మంటే అదనీ..అమ్మంటే ఇదనీ, అమ్మతనం అనీ…అమ్మ మీద పాటల రాసినవాళ్లెవరైనా నాకంటికి కనిపించాలి…చెప్తా వాళ్ల సంగతి.’
‘హహహ…..సారీ…అలా కోపంగా చూడకు…నువ్వలా అంటుంటే నాకు నవ్వోస్తోంది కానీ ఏదో జాలిగాధ ఉందని అర్థమవుతోంది…చెప్పు..చెప్పు.’
‘ఏం చెప్పేది నా మొహం…కడుపుతో ఉన్న దగ్గరనుండీ మొదలయ్యింది నస. సుఖం అన్నది పోయిందనుకో! నేను కడుపుతో ఉండడం, పిల్లని కనడం ప్రతీవాళ్లు, వాళ్ల బాధ్యతగా ఫీల్ అయిపోతున్నారు. నాకేమీ తెలియదన్నట్టు, అన్నీ వాళ్ళకే తెలుసనట్టు…అబ్బబ్బబ్బా!
పిల్ల పుట్టాక…ఇంక అడక్కు. రోడ్ మీద వెళ్ళే ముక్కూ మొహం తెలియనివాడు కూడా ఓ సలహా పడేస్తాడు…ఖర్మ!’
‘మనకి అది మామూలేగా! మనవాళ్లకి సలహాలివ్వడం కన్నా ప్రీతిపాత్రమైది మరోటి ఉండదు. పాపాయి కబుర్లు చెప్పు. పాలిస్తున్నావా? తాగుతోందా?’
‘పాలు…తల్లి పాలు, బిడ్డ తాగుతుంటే ఆవిడగారు తన్మయత్వంతో కళ్లు మూసుకోవడం, బొటబొటా కన్నీళ్లు కార్చేయడం….ఆవు దగ్గర పాలు తాగుతున్న లేగదూడని చూపించడం…అమ్మతనాన్ని రొమాంటిసైజ్ చేసినవాడు గానీ నాకు దొరకాలీ…వాడి సిగదరగ….బూతులొచ్చేస్తున్నాయి నాకు.’
‘కంట్రోల్…కంట్రోల్…మింగేయ్…బూతులు మింగేయ్…అయితే అలా ఏమీ ఉండదా?’
‘ఏమిటి అలా ఉండేది!? ఇలా ఉండేది!? అలాగ ఇలాగ కాదు…రకరకాలుగా ఉంటుంది. పుట్టగానే తల్లి చన్నులు వెతుక్కుంటూ వచ్చేసే పిల్లలు సగం మందే. మిగతా తల్లులందరికీ నానా యాతన. తెలుసా? కొందరు పిల్లలకి పీల్చడం రాదు. పాలతో స్తనాలు బరువెక్కిపోతుంటాయి, కానీ బిడ్డ పీల్చలేదు. ఆ నరకం ఎలా ఉంటుందో తెలుసా! ఇన్నేసి పాలుంచుకుని, బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే, పట్టలేక పౌడర్ పాలు పడుతుంటే, అమ్మతనమా పాడా…ఎందుకీ జన్మ అనిపిస్తుంది! గంటల తరబడి బిడ్డ నోటికి చన్నులు అందిస్తూ…పీలుస్తుందేమోనని నడుము, మెడలు వంగిపోయేలా ప్రయత్నిస్తూనే ఉండడం…ఊహించగలవా ఎలా ఉంటుందో! ఇంక లాభం లేదని, మిషన్ తెచ్చి పిండుకోవడం ఎంత యాతనో తెలుసా! పుట్టగానే పాలు తాగే పిల్లలు చాలా కొద్దిమంది. కొందరికి ఒక పూట పడితే, కొందరికి రోజులు, కొందరికి నెలలు పడుతుంది. అసలు బిడ్డ పుట్టాక, ఆస్పత్రుల్లో నర్సులు, డాక్టర్లు పాలు ఎలా ఇవ్వాలో ట్రైనింగ్ ఇస్తారు, తెలుసా? తల్లులు ప్రాక్టీస్ చెయ్యాలి. ఈ విషయం ఎవ్వరైనా ఎక్కడైనా చెప్పారే మనకు?! ఏ సినిమాలోనైనా చూపించారా? ఏ రచనలోనైనా కనిపించిందా?
ఇదొకరకం అయితే, పాలు పడనివాళ్ళ బాధలు ఇంకో రకం. పాలు పడడం కోసం నానా రకాల గడ్డీ తింటూ..ఎవరేం చెప్తే అది తినేసి, తాగేసి…మరో ఆలోచన లేకుండా 24 గంటలూ పాల ఉత్పత్తి ఎలా పెంచుకోవాలి అన్నదే తపనగా ఉంటూ ఒళ్ళు పాడు చేసుకునేవాళ్ళ పరిస్థితి మరో నరకం. సంధ్య గుర్తుంది కదా నీకు! దానికి, నాకు ఒక నెల తేడాతో పిల్లలు పుట్టారు. ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటుంది పాలు పడట్లేదని.
ఒక్కోసారి అనిపిస్తుంటుంది…ఏమిటి నా జీవితం..పిల్ల, పాలు తప్ప ఇంకేమీ లేదా అని…విరక్తి వచ్చేస్తుంటుంది అనుకో!’
‘నిజమా! పాలు పట్టడం సాధారణంగా జరిగిపోదా! ఇంత ప్రహసనమా! హ్మ్! నువ్వెందుకిలా పీక్కుపోయావో ఇప్పుడు అర్థమవుతోంది. పోనీ, పడుకుంటున్నావా రోజులో కొంతసేపైనా?! పిల్ల పడుకున్నప్పుడే నువ్వూ పడుకుండిపోతుండు.’
‘ఇదిగో..ఇదిగో…ఈ దిక్కుమాలిన సలహానే..నాకు చిర్రెత్తిపోతుంటుంది…ప్రతీవాడు ఇచ్చే గొప్ప దరిద్రపు సలహా ఇది. పిల్ల పడుకున్నప్పుడు నేనూ పడుకుంటే మిగతా పనులు ఎవడే చేస్తాడు? నీ బాబు….’
‘కూల్…కూల్…’
‘ఓకే….ఓకే…బూతులు మింగేస్తున్నా…అది కునుకు తీసిన కాసేపే నేను కాస్త లేచి గాలి పీల్చుకునేది. ఇంట్లో పనులు ఏవో ఒకటి ఏడుస్తాయిగా…అవి చేసుకునేది అప్పుడే! చంటిది లేచున్నప్పుడు ఎవరి దగ్గరకీ వెళ్ళదు…నన్నే అంటి పెట్టుకుని ఉంటుంది. అప్పుడు, దాన్ని చూసుకోవడం, దాని పాలు, దాని డైపర్లు మార్చడం…ఇవే ఉంటాయి బుర్రలో. అది పడుకున్నాకే, కాస్త వేరే ఆలోచనలొస్తాయి.’
‘అవును కదా! అదీ నిజమే!’
‘ఏమిటి అలా చూస్తున్నావు?’
‘చాలా కొత్తగా ఉంది నిన్నిలా చూస్తుంటే. మనమధ్య ఎప్పుడూ రాని మాటలు, ఎన్నడూ ఊహించని కబుర్లు….ఇప్పుడు చెప్పుకుంటుంటే వింతగా ఉంది!’
‘చెప్పాను కదా…జీవితమే మారిపోయిందని. నా జీవితం నా చేతుల్లోకీ మళ్ళీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నానంటే నమ్ముతావా?’
‘వస్తుందిలే…పద టీ పెట్టుకుందాం.’
‘వంటిల్లు కొత్త కొత్తగా ఉందే! ఇవన్నీ పాప సామానులేనా!? దానికో అర ఏర్పడిపోయింది అప్పుడే! భలే! ఒక కొత్త జీవితం మన చేతుల్లో…ఎంత ముచ్చటగా ఉంటుందో కదా! ఇదేమిటే? నలుగుపిండా!? పాపకి స్నానం…నలుగు అవీ నువ్వే పెడుతున్నావా? బాగా రుద్దితేనో, నొక్కితేనో ఒళ్ళు గట్టిపడుతుందంటారు. అవన్నీ చేస్తున్నావా? అన్నట్టు ఎక్కడెక్కడ ఏ రకం గా నొక్కాలో సలహాలివ్వట్లేదే ఎవరూనూ?’
‘ఎందుకివ్వరు తల్లీ!! ధారాళంగా ఇస్తారు. పాప తలనిట..అలా గుండ్రంగా తిప్పుతూ ఒత్తుతూ ఉండాలిట….అప్పుడు ఎగుడుదిగుడులు లేకుండా గుండ్రంగా ఉంటుందిట తల. అదేమైనా చపాతీ పిండా ఒత్తితే గుండ్రంగా రావడానికి! ముక్కు రోజూ నొక్కుతూ ఉండాలిట…అప్పుడు చప్పిడిముక్కు పోయి సూదిగా కొనదేరి వచ్చేస్తుందిట. అది ముక్కా, చేగోడీనా కొనదేరినట్టు నలపడానికి!! ఒక మనిషి శరీరం అంత తేలికా tamper చెయ్యడానికి!! శరీరాన్నే మార్చేస్తారా రుద్దేసి, నొక్కేసి!! వీళ్ళ అతిశయం పాడుగానూ!’
‘హహహ…మిగతా హార్మోనులతోపాటు నీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ హార్మోన్ కూడా బాగా పెరిగినట్టుంది.’
‘హిహిహి…సంతోషించాంలే! అట్టే నవ్వకు…టీ ఒలిగిపోతుంది. ఇంకో పిచ్చి పీక్స్ కి వెళ్ళే విషయం చెప్పనా! ఒకరోజు పాపని చూడ్డానికి చుట్టాలొచ్చారులే…అప్పుడు పాపయి ఒత్తిగిల్లి పడుకున్నదల్లా బోర్లా పడిపోయి పడుకుంది. నేనలాగే వదిలేసాను. వాళ్లల్లో ఒకావిడ నన్ను పక్కకు పిల్చి, రహస్యం చెబుతున్నట్టు ‘ఆడపిల్లల్ని బోర్లా పడుకోనివ్వకమ్మా’ అంది. ఎందుకలా? నాకు చిన్నప్పటినుండీ బోర్లా పడుకోవడమే అలవాటు అన్నాను. ‘అయ్యో!’ అని ఏదో పెద్ద ఘోరం జరిగిపోయినట్టు నా మొహం ఒకసారి, నా బ్రెస్ట్ వైపొకసారి చూసింది. ఆవిడ వాలకం ఏమిటో అర్థం కాక వింతగా చూస్తుంటే, రహస్యంగా నా చెవి దగ్గరకొచ్చి ‘ఆడపిల్లలు బోర్లా పడుకుంటే బ్రెస్ట్ పెద్దదైపోతుంది, బావుండదు’ అంది. నాకు ఒళ్లు జలదరించిందనుకో! తేళ్లు పాకినట్టయ్యింది. ఆవిడ వయసుకి గౌరవమిచ్చి…అయితే అయ్యాయిలెండి అని అక్కడినుండి వెళిపోయాను.’
‘ఛీ ఛీ…ఏమిటే అది! ఏ లోకం లో ఉన్నారు వీళ్ళు!!’
‘మరేమనుకున్నావ్! అమ్మ అంటే ఈ సృష్టికి మూలం తొక్క తోలు అని కవితలు రాసుకోడానికి, పాటలు కట్టడానికి పనికొస్తుంది తప్పితే new mom అంటే అందరికీ లోకువే! ప్రతీవాళ్లు వద్దన్నా సలహా పడేస్తుంటారు. పైగా అది తమ హక్కు, అధికారం…ఈ భూమికి సేవ చేసేస్తున్నాం, నన్ను ఉద్దరించేస్తున్నాం అన్న ఫీలింగ్ లో ఉంటారు. అక్కడే నాకు ఇంకా కాలుతుంది.
అమ్మలకి బయటికెళ్లే హక్కు లేదు. హోటల్‌కి వెళ్లకూడదు, పక్కనున్న పార్క్ కి కూడా వెళ్లకూడదు. పిల్ల ఏడుపు వినిపించకూడదు. వినిపిస్తే దానికి ఆకలేసిందనే లెక్క. చుట్టుపక్కల పదిమందీ, తమ పనులు మానుకుని మరీ వచ్చేస్తారు ‘పాలు పట్టమ్మా’ అని ఒక్క సలహా ఇవ్వడం కోసం. ఇప్పుడే తాగిందన్నా వినిపించుకోరే బాబూ! ఈమధ్య, పిల్ల ఏడవగానే దానివైపు చూడ్డం మానేసి చుట్టూ చూడ్డం మొదలెట్టాను ఎవరెక్కడినుంచి పరిగెత్తుకొచ్చేస్తున్నారోనని! ఆ!
పోనీ! కొన్ని నాకు తెలీవు, ఒప్పుకుంటాను. ఎవరినైనా అడిగామనుకో…మొదలెట్టేస్తారు. వాళ్ళేమో కృష్ణపరమాత్ములు, నేను అర్జునపిపీలకాన్ని అన్నట్టు అభయహస్తం పైకెత్తేసి ఆరంభిస్తారు సోది . ఎందుకు అడిగాంరా బాబు అని తలబాదుకోవాలి చివరికి. వాళ్ళ అనుభవాలే కాక వాళ్ళ అమ్మలవి, అమ్మమ్మలవి, పక్కింటివాళ్ళవి, ఎదురింటివాళ్ళవి, వేరే ఊర్లో వాళ్ళవి కూడా ఏకరువు పేట్టేసి..వాళ్ళందరూ ఎంతటి త్యాగధనులో, ఎన్నెన్ని కష్టాలు పడ్డారో, తల్లులై ఈ ప్రపంచాన్ని ఎంతెంత ఉద్ధరించారో, వాళ్ళకి crisis situations ఎలా వచ్చాయో, వాటిని ఎంత చాకచక్యంగా ఎదుర్కొన్నారో పుంఖానుపుంఖలుగా వివరించేస్తారు. అమ్మో…అదో రకం టార్చర్! బాబోయ్!
keep it simple అన్నామనుకో..ఒసోస్ మేమూ కన్నాము, మేమూ పడ్డాము ఇలాంటివన్ని! అమ్మతనమా మజాకా! అంటారు. అదే keeping it simple వాళ్ళ దృష్టిలో. ‘
‘అమ్మబాబోయ్! ఇదెక్కడి గొడవే! ఇంతలా వాయించేస్తుంటారా!!’
‘…..’అమ్మ’ బాబోయ్ అను. ఇది సగం కథేనే బాబూ! ఇంకా చాలా ఉంది. వీళ్ళందరి దృష్టిలో నా బుర్ర ఒక dump yard. వాళ్ళ, వాళ్ళ జ్ఞాన భాండాగారాలన్నీ తవ్వి, తోడి నా బుర్రలోకి ఒంపేస్తుంటారు. తద్వారా దేశసేవ, భూమికి ఉద్ధరింపూనూ!’
‘హహహ నీకెంత జ్ఞానం ఫ్రీ గా వచ్చేస్తోందో చూడు. అదే, నీ తల కాస్త పెద్దదయినట్టుందేమిటా అనుకున్నా! హార్మోన్స్ వల్ల కాబోలు, ఒళ్ళొచ్చి అలా అనిపిస్తున్నాదేమో అనుకున్నా. ఇదా సంగతి! జ్ఞానంతో బరువెక్కిందా!’
‘మరే! ప్రతీ నెల మా పాపాయిని vaccine కి తీసుకెళతాం కదా, అప్పుడు దాని height, weight, తల చుట్టుకొలత చూస్తారు. ఈసారి నా తల చుట్టుకొలత కూడా చూడమంటాను!’
‘అప్పటీగానీ, ఆ డాక్టరు ఉద్యోగం వదిలేసి పారిపోదు.’
‘హహహ …అదిగో పాపాయి లేచింది. ఇవాళంతా దాన్ని నువ్వే ఎత్తుకుని ఆడించు. నేను కాళ్ళు జాపుకుని కూర్చుంటా…రెస్ట్ తీసుకుంటా.’
‘అందరూ ఇన్నేసి సలహాలిస్తున్నారు. నేను కూడా ఒకటి ఇస్తా. పసిబిడ్డ తల్లికి రెస్ట్ అనేది…’
‘ఇంకొక్క ముక్క మాట్లాడావనుకో నేను నీకు ఒక్కటిస్తా…’
‘అమ్మ…బాబోయ్!’
(నవ్వులు)
*
అమ్మకి భూదేవంత ఓర్పు, సహనం ఉండాలమ్మా! చి న
ఉందిగా..అందుకే ఇంత కథ రాసాను 🙂
తప్పదండీ …!!! కాలేజిలోనేనా బాలింతలలో లేత బాలింత కి ఆ మాత్రం ర్యాగింగ్ ఉండాల్సిందే
ragging is an offence, now 🙂
ఓ పెద్దావిడ సలహా …. డైపర్ వెయ్యటం మంచిది కాదమ్మా, గుడ్డలు కట్టి ఎప్పటికప్పుడు తల్లే ఉతికి ఆరెయ్యాలి.
పేరెంటింగ్ సైట్ చదివిన న్యూ మామ్ సలహా, పిల్లల్ని అస్సలు కసురుకోకూడదు, ఓపికగా చెప్పిందే పదే పదే చెప్పాలి.
గిన్నెలో చెంచాడు నెయ్యి వేసి అన్నం మెత్తగా కలిపి పిలల్ల వెనక కీళ్లు అరిగిపోయేలా తిరుగుతున్నప్పుడు కురుస్తుంది వర్షం, సలహాల వడగళ్ల వానేవాన 🙂
haha I hear you 🙂
సరే గానీ ఈ కథంతా పాప పడుకున్నప్పుడే రాశారు కదా.. తను మేలుకుని ఉండగా ఇలాంటి పన్లు చెయ్యకూడదమ్మా.. ????
సలహా నంబర్ infinte 😀
బిడ్డకి పాలుపట్టటం, అందులో కష్టాలు, పాలు ఉన్నా ఇవ్వలేని పరిస్థితులు, మెషీన్ ఉపయోగించటంలో శారీరక మానసిక బాధ, అప్పుడు ఆమె మానసిక పరిస్థితి వంటివి… చదివితేనో, వింటేనో తెలియదు.
మా వాడికి సంవత్సరం దాటినా, రాత్రిళ్లు పాలకోసం ఏడుస్తాడు. డబ్బాపాలు కలిపే టైమ్ కూడా ఇవ్వడు. అమ్మలక్కలేమో… ఎన్నిసార్లు ఇచ్చినా సలహా ఉచితం కాబట్టి… అదే తల్లిపాలయితేనా వాడంత ఏడ్చే బాధ ఉండదు కదా… అంటారు!
ఇక మీరు చెప్పిన చాలావాటికి ఈ సంవత్సరంలో నేనూ సాక్షినే!
తండ్రులు కూడా ఈ విషయంలో involve అవ్వడం చాలా సంతోషంగా ఉంది. New geneeation fathers…మంచి పరిణామం.
హ…హ…ఈ కథ వ్రాసినవాళ్ళు కనపడాలి అప్పుడు చెపుతాను ????????????????
ఇక్కడే ఉన్నా….కనిపిస్తూ 🙂
Nice story Sowmya.. కాలానికి తగ్గట్టుగా ఉంది..
నిజమే మీరన్నది సలహాలివ్వటం ఎంత తేలికో…
‘నువ్వు మంచి తల్లివి కాదు’ అనేస్తారేమోనని భయంతో పూర్వం తల్లులు మాట్లాడేవారు కాదు. ఇక్కడ response చూస్తుంటే సంతోషంగా ఉంది..తల్లులు, తండ్రులు కూడా బాహాటంగా మాట్లాడుతున్నారు.
మా పిల్లలు చిన్నప్పుడు జనాలు చెప్పిన సలహాలు గుర్తొచ్చాయి.
ఆడవాళ్లకి అమ్మతనం అంటే పునర్జన్మతో సమానం. ఎన్నో కష్టాలు ఓర్చితే బిడ్డ నేలపై పడి బతికి బట్టకడతాడు.
మీరు చాలా బాగా రాసారు!
thank you. I am glad fathers are also getting connected with my story. Three cheers to new generation fathers.
నీకో దండం తల్లీ…. ఇన్నాళ్ళు నేను రాయాలనుకున్నవి రాసి… ఏకి పడేసావ్!!! వీళ్ళు వీళ్ళ చెత్త సలహాలు. అమ్మతనం అంటే నరకం అన్నంతగా మీనింగ్ మార్చేసారు. ఆ పిల్ల నిద్రపోయినపుడు నిద్రపోవడం అనేది ఒక చచ్చు పుచ్చు సలహా…. ఆ పురిటి బిడ్డకి పాలు పట్టడం ఒక శిక్ష….. పిల్లల్ని నిద్రపుచ్చడం ఒక కళ…. పిల్ల ఏడిస్తే… ఎందుకు ఏడ్చిందో అనే గాభరా కంటే ఎవరెక్కడ అడుగుతారో అనే భీతే ఎక్కువ! వామ్మో!!! అసలు ఈ జనాల దెబ్బకే పిల్లలంటే విసుగొచెస్తుంది… అయినా పాపం పసిపిల్లలు… బుజ్జిమొహాలు….. వాళ్ళ చిరునవ్వు చాలు ఈ దిగుళ్ళన్నీ ఎగిరిపోవడనికి
Excellent స్టోరీ! Congratulations
haha I hear you 🙂
“ఎందుకివ్వరు తల్లీ!! ధారాళంగా ఇస్తారు. పాప తలనిట..అలా గుండ్రంగా తిప్పుతూ ఒత్తుతూ ఉండాలిట….అప్పుడు ఎగుడుదిగుడులు లేకుండా గుండ్రంగా ఉంటుందిట తల. అదేమైనా చపాతీ పిండా ఒత్తితే గుండ్రంగా రావడానికి! ”
ఇది మాత్రం నిజం అండి. మా అక్క కూతురు కి తల కొంచం పొడవు గా పుట్టింది. మా నాయనమ్మ రోజు తల మీరు చెప్పినట్టు గా చేశారు . చిన్నప్పుడు వాళ్ళ తలలు మెత్తగా ఉంటాయి . అందువల్ల అవి కొంచం మార్చచ్చు. ఏడునెలల కి చాల వరకు తగ్గింది . ఏడాది కి మొత్తం తగ్గింది. కాకపోతే ఇలాంటివి చాల చాల జాగర్తగా చెయ్యాలి . బాగా రాసారు . నెనర్లు
thank you.
చాలా బాగారాసారు!!
thank you.
నా జీవితం నా చేతుల్లోకీ మళ్ళీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నానంటే నమ్ముతావా. అచ్చంగా ఇలాగే అనుకునేదాన్ని.☺️
I know 🙂
సౌమ్య గారూ..
ఈసారి పెళ్ళయిన ఏడాదిక్కూడా బిడ్డ పుట్టని స్త్రీకి ఇచ్చే సలహాలు, అడిగే ప్రశ్నలు, చేసే ఛీదరింపుల మీద.. ఒకటి రాసెయ్యండి.
వరిమళ్ళ మధ్య పనిచేసేప్పుడు నేనిలాగే ఎన్నిసార్లు అనుకున్నానో! సినిమాల్లో, పుస్తకాల్లో వరిమడిని ఎంత అందంగా చూపిస్తారో వాళ్ళు ఒక్కనాడు కూడా వరిమడికి నీరు కట్టి వుండరు, వరిమడి కోసి వుండరు. ఎంత దురద.. ఎంత దురద! ఒక్కరూ దాని గురించి చెప్పరు, రాయరు. పైగా ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అని ఆలుమగలూ గూడ వేయడాన్ని అలుపూసొలుపూ లేకుండా చూపెడతారు. వేసేవాళ్ళకు ఎరుక అలుపేంటో, చూసేవాళ్ళకేం తెలుసు.
మా అమ్మ ఈ మధ్యే చెప్పింది.. మా అన్న పుట్టినపుడు పాలు సరిగ్గా పడకపోతే ఆమె పడిన పాట్లు. ఎవరేం చెబితే అదల్లా తెచ్చి పెట్టడానికి మా తాత పడిన అగచాట్లు!
yes. This is all to reinforce chauvinistic rules. Romanticising village life …ఇంకో జాఢ్యం.
కథ బాగుంది. కథనం కూడా బాగుంది.ఈ కధ ద్వారా ఏమి చెప్పదలిచారో స్పష్టత లేదు. మాతృత్వం అనేది నిజానికి ఒక భావన. కవులో సాహిత్య కారులో వర్ణించేంత తన్మయత్వం అయితే ఏమీ ఉండదని న్యూ మామ్ తేల్చేయడం నచ్చింది. కానీ సలహాలు ఇచ్చే సలహాలమ్మలక్కలు ఆడబిడ్డకు ఒకలా! మగబిడ్డకు మరోలా సలహాలు ఇచ్చేస్తుంటారు. కథా నిడివి దృష్ట్యా అనేక సున్నిత విషయాలు మిస్సయ్యాయి అనుకుంటా…ఏది ఏమైనా సౌమ్యా మేడం గారు కథను ఆసక్తిగా చదివించారు. వారికి ధన్యవాదాలు
Thank you.
Good story, but expect more details. May be you were in some hurry, i don’t know. Like if the kid keeps awake all night, and the mother has to keep awake (on pretext that he has to go to work next day, dad sleeps ). That is very painful period. Today I am surrounded by all those memories of bringing up our kids. We were only two, and thankfully there were no advices from anybody. To that extent lucky. There are two parts in your story. One of the difficulties in child care particularly the mothers, and second that of keeping mother in high altar, and thus denying her natural justice. You can still write in continuation, like you do in your metro kathalu.
Thank you. Yes..there are many more issues including the one you mentioned. I had to pick a few to discuss here keeping length in mind.
చదివించగలగడమే రచనకు మొదటికొలబద్దకాబట్టి చదివించారు. అమల్లో వున్న అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయాన్ని బాధిత వర్గం తరపున రాశారు. భిన్నమైన అభిప్రాయ వ్యక్తీకరణలో సహజంగానే ఆవేశం వుంటుంది. బయటి వ్యక్తులు దీన్ని చప్పున కొట్టిపారేసే అవకాశం మెండు. మీరు రాసిన అభిప్రాయానికి విరుద్దమైన అభిప్రాయమున్న చదువరి చదివినా మీ అభిప్రాయం చదివిన తర్వాత ఒక్క క్షణమైనా ఆలోచించేట్లు చెయ్యాలికదా! అది కథనంలోనో, పాత్రలోనో..ఎక్కడో ఒకచోట రావాలిగా. మీ ప్రధానపాత్ర విరుచుకుపడుతోంటే మరో అమాయపు చెవుల పాత్ర వినడం అంతేనా.. మీ ప్రధానపాత్రకు విరుద్దమైన ఆలోచనకు ఏ అత్తనో, బామ్మనో ఎందుకులేదు? (సమయం కేటాయించి మరీ రాశా, పత్రిక రెమ్యునరేషన్ ఇస్తే వాటా ఇవ్వాలి మరి!)
Thank you. మీ కామెంట్ ఆలోచింపజేసింది. conflict లేదు, నిజమే! కానీ ఎందుకు లేదు అని ఆలోచిస్తే నాకు తోచిన విషయాలు….న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో బామ్మలు, అత్తలు లేరు కాబట్టి . కథ లో చెప్పిన విషయానికి opposite వాదన ఇన్నాళ్ళూ వింటూ వచ్చాం కాబట్టి.
Thank you again, టైమ్ తీసుకుని రాసినందుకు. విమర్శ కథకు, రచయితకు చాలా అవసరం.
I got your point.
చాలా బావుంది సౌమ్య. చాలా నవ్వుకున్నాను…చాలా ఆలోచించాను…baagundi.
thank you.
చాలా బాగుందండీ!
“అమ్మ” తనం లో ఉన్న కమ్మదనం తో బాటు.. ఘాటు కూడా ఎలా ఉంటుందో మీరు చెప్పిన తీరు అద్భుతం!
“అమ్మ” లు గా మారబోయే అమ్మాయిలు ….
“అమ్మ” గా జన్మెత్తిన రోజుల్లో జ్ఞాపకాలు మరోసారి గుర్తుచేస్కొంటూ పెద్దోళ్ళు…
అందరూ చదివితీరాల్సిన వాస్తవం!
(ఇది కధ కాదని నా ఉద్దెశం! )
ఈ సారంగం ప్రింట్ లో దొరుకుతుందా?
Thabk you. Saaranga is a web magazine.
అద్భుతంగా రాశారు.. పుట్టాక అబ్బాయిల జీవన శైలి లో కూడా చాలా మార్పులు జరుగుతున్నాయండీ.. పితృత్త్వం లో ఉన్న ఆనందం ,సాధక బాధల్ని కూడా వివరిస్తూ ఒక కథ రాయండి..:p
Thank you.
ఎవరి కథలు వారే రాసుకోవాలిట 🙂
మీరు రాసిన కథ లో కంటెంట్ చాలా బాగుంది అండి. కథ చెప్పే పద్దతి సంభాషణా రూపం కాకుండా సంఘటన లతో చెప్పి ఉంటే ఇంకా impact ఉండేదేమో అని చిన్న ఆలోచన అండ్ నా అభిప్రాయం.
Thank you, I shall keep it in mind.
అమ్మబాబోయి, అచ్చు ఇలాంటి సిట్యుయేషన్ ఏ మా ఇంట్లో ఇప్పుడు. ఎన్ని కష్టాల్లో, వచ్చినవాళ్ళు ఊరుకోరు, ఎదో ఒక సలహా, ప్రతి ఒక్కరూ డాక్టరే..
చాలా బాగుందండీ కధ
ha ha…all are experts in this matter 🙂
సౌమ్య.. పాల మిషన్ అనే ఫీలింగ్ ఉంటుంది చూసావు.. ఈ కథ అంతా కనిపించింది. Keep writing ❤️❤️❤️
I know…నరకం.
సౌమ్యగారూ.. కథ చాలా బావుంది.
అవసరాన్ని మించి గ్లోరిఫై చేయడంద్వారా కొన్నింటినీ, అసలు ప్రస్తావించడమే అపరాథంలా మార్చి కొన్నింటినీ అసలు చర్చకు రాకుండా చూడడంలో మానవసమాజం చాలా అత్తెలివిని ప్రదర్శిస్తూ వచ్చింది. దాని ముసుగు కొన్నిసార్లు చాదస్తంగానూ, కొన్నిసార్లు ఆదర్శంగానూ కనిపిస్తూ.. ఇవి నిజంగానే అవసరమేమో అనే భ్రమకి లోనుచేస్తూ వుంటాయి. ఆ ప్రమాదాన్ని దూరంగా వుంచడానికి ఇలాంటి సాహిత్యం చాలా అవసరం. Nice message, and మీదైన హాస్యం బోనస్..????
thank you
భలే రాసారు కళ్ళకు కట్టినట్టు. చాల బాగా అనిపించింది చదవగానే. Expecting more from you.
thank you
ఈ కష్టాలన్నీ మర్చిపోవటానికే కదా అమ్మతనాన్ని అంత కీర్తించేది! (మళ్ళీ బూతులొస్తున్నాయా? కంట్రోల్. కంట్రోల్…)
నిజమే కదా! జీవితంలో ఇవన్నీ సహజమేమో …. కానీ కథ బాగుంది. ఏది మీకు జరిగిన సంఘటనా లేక ఊహించి రాశారా?
నాకు నేను ఊహిస్తూ చదివాను.
మ్యూజింగ్స్ బావున్నాయి ! మ్యూజింగ్స్ వరకూ అయితే ఓకే కానీ, సాహిత్యానికి ఇలాంటి బాధిత వర్గ కథలు అవసరమన్న ఒక పాఠకుడికి మరో కోణం చెప్పాలనిపించింది. (రచనపై కాదు నా అభ్యంతరం. ఏవో సరదా మ్యూజింగ్స్. కానీ, దీనికి సామాజిక ప్రయోజనం ఆపాదించదలిచిన చదువరుల కోసం… ఇదంతా!)
నాణానికి మరోవైపు… (బూతులు తిట్టుకున్నా ఫర్లేదు :–) బూతులు నవనాగరీక సమాజాన్ని రిప్రెజెంట్ చేసేందుకు అత్యంతావశ్యకమిప్పుడు. ) గ్లోరిఫై చేయటం- అవసరాన్ని మించి గ్లోరిఫై చేయటమూ కొన్నిచోట్ల అవసరమే. చంటిపిల్ల/పిల్లాడికి అమ్మ/నాన్నగా మారినపుడు తల్లిదండ్రుల్లో విపరీతమైన సహనం, ఓపిక ఉండాల్సి వస్తుంది. హార్మోన్లలో మార్పులతో ఆ సమయంలో కలిగే చిరాకు/అసహనం ఇవన్నీ సహజమే, తరతరాలుగా పాతుకుపోయిన కొన్ని (అమ్మతనం, త్యాగగుణం ఎట్సెట్రా ఎట్సెట్రా )భావజాలాల్లో ఉన్న ఆ మాయాజాలమేదో కాస్తయినా ఆవరించి మనల్ని ఆ అసౌకర్యాలని సంతోషంగా అనుభూతించేలా చేస్తే … అటు పాపాయికీ, ఇటు కొత్త తల్లిదండ్రులకీ మంచిదే కదా. It’s just all in mind అండ్ depends on how we take ఇట్.
సలహాలంటారా… మనపై శ్రద్ధ ఉన్నవారు చెబితే స్వీకరిస్తాము, లేదంటే, మన స్వభావాన్ని బట్టి – చిరునవ్వుతోనో, ముడిపడ్డ నొసటితోనో ఓ చూపు చూసి వదిలేస్తాము. అసహనం కలిగించే సలహాలుండొచ్చు కానీ, అన్ని సలహాలూ తీసేయదగ్గవే అయుండవు. అయినా… ఇలాంటి సలహాలపై కామెడీ గా ఎన్ని కథలయినా రాసుకోవచ్చు. సరదాగా చదవటానికి బానే ఉంటాయి.
ఎటొచ్చీ,
తల్లితనాన్ని గ్లామరైజ్ చేయటం అనేది ఏ ఒక్క సమాజానికో జరుగుతున్న అన్యాయంగా పరిగణించాల్సిన అవసరం లేదు … తల్లి బాధిత వర్గానికి చెందినది కాదు.బడుగు,బాధితవర్గాలను చట్రాల్లో ఇమిడ్చే ప్రయత్నాల పట్ల అసహనం అత్యవసరం. కానీ, ఇక్కడ తల్లి కానీ, తండ్రి కానీ బాధితులు కాదు. బాధ్యత కలవారంతే. చేయాల్సింది వారేకనుక ఇష్టంగానో, కష్టంగానో చేస్తారు.
చిన్ని చిన్ని అసౌకర్యాలని భారంగా భావించే తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్న పాపాయిలు బాధిత వర్గమవుతారు. కనుకే కాస్త మోటివేషనల్ గా ఇలా పకడ్బందీగా అమ్మానాన్నలని తప్పని చిన్న ఇబ్బందులని, అసౌకర్యాలని ఇష్టంగా అనుభూతించేలా కొన్ని గ్లామరైజ్డ్ చట్రాల్లో ఇమిడ్చారని నా వ్యక్తిగత అభిప్రాయం. If the glamorized image is really scripted, I take it as… Positive Enforcement!
మరోసారి – నిజాయితీగా తనకనిపించింది సరదాగా చెబుతూ వెళ్ళిన సౌమ్య పై కాదు ఈ ఆక్షేపణ. ఈ సరదా రచనలోనూ, సామాజిక ప్రయోజనం వెదికి పట్టుకునే ప్రయత్నం చేసిన ఓ పాఠకుడిపై మాత్రమే. 🙂
న్యూక్లియార్ ఫ్యామిలీస్ లో సలహాలిచ్చే వారే కరువై ఆన్లైన్లో సలహాలడిగే దౌర్భాగ్య స్థితి మనది. సమాజంలో ఆర్థికంగా పైకెదిగే కొద్దీ సలహాలిచ్చేవాళ్లు దాదాపు కనపడకుండానే పోతారు. ఏదైనా అడిగితే ఆర్టిఫిషియల్ స్మైల్ ఇవ్వడంతప్ప నోరే మెదపరు కొందరు. మరొకరైతే ఏమీ గుర్తులేదనో, నేను ఆ స్టేజీ దాటిపోయాననో చెప్పేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో సలహాలిచ్చేవారిని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పడం రచయితలుగా మనం స్టడీ చేయాల్సిన ఆవశ్యకత గురించి చెప్పకనే చెబుతుంది.