ప్రేమ గొప్పది. అయితే కాలానుకూలంగా అది మారుతూ ఉంటుంది. మన చిన్నప్పుడు మొదటిసారి చూసే తల్లి ప్రేమ, యవ్వనంలో తెలుసుకొనే ప్రియురాలి ప్రేమ, పెళ్ళైన తర్వాత దొరికే భాగస్వామి ప్రేమ, జీవితపు చివరిరోజుల్లో కోరుకునే మన పిల్లల ప్రేమ… ఇలా ఎన్నో ప్రేమలు మనం కోరుకున్నా, చూసినా.. మనకి బాగా గుర్తుండే ప్రేమ మాత్రం తల్లి ప్రేమ, కోరుకునేది మన తొలి ప్రేమ. అలాంటి తొలి ప్రేమ అమ్మకి కూడా ఉండి, అది తన జీవితపు చివరి రోజుల్లో మళ్ళీ కనిపిస్తే..!? అప్పుడు తన ముప్పై ఏళ్ల వైవాహిక జీవితం, పిల్లలు, ఎలా స్వీకరిస్తారు..!? ప్రేమలో సెకండ్ ఛాన్స్ అనేది వస్తే ఎలా ఉంటుంది..!? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే రవి మంత్రి రాసిన “అమ్మ డైరీలో… కొన్ని పేజీలు!” అనే పుస్తకం చదవాల్సిందే..
ఈ నవలలో కథ చాలా చిన్నదే.. “సారిక ఒక సింగిల్ మదర్. హైదరాబాద్ లో తన కొడుకు జిత్తుతో పాటు నివసిస్తూ ఉంటుంది. ఒక రోజు అనుకోకుండా తను కాలేజ్ లో ప్రేమించిన అభిరామ్ కనిపిస్తాడు.. అలా మళ్ళీ తన కాలేజీ రోజుల జ్ఞాపకాల్లోకి వెళ్లిన సారిక, చివరికి ఏమి చేసింది.!? అభిరామ్ ని మళ్ళీ ప్రేమించడం మొదలు పెట్టిందా!!? .. అప్పుడు తన కొడుకు జిత్తు ఎలా స్వీకరిస్తాడు అనేది మిగతా కథ”…
ప్రేమ కథలు అనగానే అవే నాటకీయంగా సాగే మాటలు, నిజ జీవితానికి దూరంగా ఉండే ఆశల వల్ల, ప్రేమ కథలను పెద్దగా ఇష్టపడని నేను కూడా ఎంతో ఆసక్తితో పుస్తకాన్ని పూర్తి చేశాను. ఇందులోని పాత్రలు అన్నీ ఎంతో పరిణితి చెందిన వ్యక్తులు మాట్లాడినట్టు ఉన్నాయి.. ముఖ్యంగా సారికకి, తన తల్లికి మధ్య, అలానే సారికకి, అభిరామ్ కి మధ్య జరిగే సంభాషణలు అన్నీ కూడా మనకి మళ్ళీ మళ్ళీ చదివిలా, ఆలోచించుకునే విధంగా ఉన్నాయి..
ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రచయిత రవి మంత్రి రాసే సంభాషణలు. మామూలుగా కథలోని సన్నివేశాలను తృతీయ పురుష(3rd person) లో చెప్తారు.. కానీ రవి గారు మాత్రం అన్నీ కూడా పాత్రల మధ్య మాటలతోనే చెప్తారు. అది నాకు చాలా బాగా నచ్చింది.
ఇక్కడ నాకు బాగా నచ్చింది, పాత్రలు పాడుకొనే పాటలు గురించి.. అవి ఎంత సందర్భోచితంగా ఉన్నాయి అంటే.. ఆ పూర్తి పాట మనం వింటే, ఆ పాత్ర మానసిక స్థితి ఎలా ఉందో మనకి మరింత బాగా అర్థమవుతుంది. అలానే ఈ పాటల ప్రయోగం ద్వారా నాకు కూడా ఎన్నో కొత్త పాటలు తెలిశాయి.
ఈ నవలలో మనకి ప్రేమలో ఎదురైన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు కూడా దొరుకుతాయి. ప్రేమకి, ఆకర్షణ కి మధ్య వ్యత్యాసము గురించి కానీ, తల్లి ప్రేమను అర్దం చేసుకొనే విధానం కానీ, జీవితంలో రెండో అధ్యాయం (Second Chance) మొదలుపెట్టాలి అనుకునే వాళ్ళకి కానీ.. ఇలా జీవితంలో వివిధ దిశల్లో ఉన్న అందరు మనల్ని మనం చూసుకొనే విధంగా ఉంది.
ఈ నవల కేవలం ఒక సాధారణ ప్రేమ కథలా కాకుండా నేటి తరం వాళ్ళకి ప్రేమ గొప్పతనం, ప్రేమలో ఉండే ఆటుపోట్ల గురించి తెలుసుకొనే పుస్తకంలా కూడా ఉపయోగపడుతుంది.
ప్రేమ కథలు అన్నీ స్థూలంగా ఒకే విధంగా ఉండటం వలన, ఈ నవలలో కూడా తర్వాత జరగబోయే కథను మనం ఊహించే విధంగానే ఉంటుంది.. ఐతే సంభాషణలు, చమత్కారంతో కథాంశం ఆసక్తిగా ఉన్నాయి.
“జీవితంలో ప్రేమ కేవలం ఒక్కసారి మాత్రమే అవుతుంది. తర్వాత ఎన్ని వచ్చిన అవి అన్ని కూడా సర్దుబాట్లు మాత్రమే” అని చెప్పినా, “మనుషుల్లో మంచి, చెడు ఉండరు. కేవలం పరిస్థితులు వలన మాత్రమే అలా మారుతారు” అని చెప్పినా, “జీవితం చాలా చిన్నది. మనకి కావాల్సిన వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలీదు. కాబట్టి ప్రేమను వ్యక్తపరచండి”అని చెప్పి తన చెప్పాలి అనుకున్న ప్రేమ కథను మనకి చెప్పారు రవి మంత్రి.
కొత్తగా తెలుగు పుస్తకాలు చదవాలనుకునే వాళ్ళు ఈ పుస్తకంతో మొదలుపెట్టొచ్చు. అలానే ప్రేమ కథలు అంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు, ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలి.
ఈ పుస్తకం ఇండియా వాళ్ళ కోసం Amazonలో ఉంది. అమెరికాలో ఉండే వాళ్ళు Aju Publications వాళ్ళకి Instagram లేదా Facebook లో మెసేజ్ చెయ్యవచ్చు. యూరోప్ లో ఉండే వాళ్ళు రచయితకి స్వయంగా మెసేజ్ చేసి పుస్తకం తీసుకోవచ్చు.
పుస్తకం ధర : ₹200/-
ఇండియా లో ఉండే వాళ్ళ కోసం Amazon Link : https://amzn.to/4637BnE
దయచేసి పుస్తకాలను కొని చదవండి!
*
ధన్యవాదాలు ఆదిత్య గారూ.. పుస్తకం చదివి ఓపికగా రివ్యూ ఇచ్చినందుకు. ఇలాంటి మాటలు విన్నప్పుడే కష్టం అంతా మర్చిపోతాము. మొదటి నవల ప్రింట్ చేసే అవకాశం ఇచ్చినందుకు అజు పబ్లికేషన్స్ కి శ్వేతా,మల్లిలకి మరొక్కసారి నా కృతఙ్ఞతలు. Thanks a lot Saarnga 🙂