రెండేళ్ల నుంచి మంచం లోనే తెల్లారుతుంది పొద్ద్కూతుంది
జ్వరం వచ్చినా డాక్టర్ చూపించే వాడిని
బాగుపడుతుందంటే
ఆస్పత్రిలో చేర్చే వాడిని
అమ్మ నిరంతరంగా మాట్లాడేది పనిచేసేది నడిచేది
ఒక్క జాగల కాలు నిలువక పొయ్యేది
కాలు కదపకుండా ఇన్ని రోజులు మంచంలోనే ఎలా ఉందో
కూర్చోరాదు లేవరాదు నడవరాదు బాయిలోనుంచి పలికినట్టు గొంతులో నుంచి మాట పెగులదు
అయితే కోడలును
కాకుంటే నన్ను
పగలు రాత్రి భేదం లేకుండా పిలుస్తూనే ఉంటుంది
ఏమి నొస్తుందో
ఎక్కడ నొస్తుందో ఏమౌతుందో ఎందుకు అవుతుందో చెప్పలేదు చెప్పినా మాకు అర్థం కాదు
ఎంత పరిశుభ్రతను పాటించేది పొద్దున ముఖం కడిగి
చాయ్ తాగితే
మధ్యాహ్నం ఒంటి గంటకి తినేది పొద్దున టిఫిన్లు ఎంత తినుమన్నా అరికీసు తినేది కాదు
మళ్ళీ సాయంత్రం
కోపెడు చాయ్ తాగేది
రాత్రి బుక్కెడు బువ్వ తినేది
ఇప్పుడు ముఖం కడుక్కోరాదు స్నానం చేయరాదు
పూజ చేసుకోరాదు
చిన్నగా చుక్కోలె
విభూతి బొట్టు పెట్టుకోరాదు
రోజువారీ పనులన్నీ మాయమయ్యాయి
తిండీతిప్పలు నిద్ర
అన్నీ మారిపోయాయి
చిన్నపిల్లల లాగే అన్నీ డైపర్లోనే
తెల్లారుతుంది పొద్దూకుతుంది తేదీలు మారుతున్నాయి కానీ కొంచెం కూడా
అమ్మ ఆరోగ్యం
ఏ మాత్రం సుదురాయించుతలేదు
మా అమ్మ మంచంలోనే
నరక యాతన అనుభవిస్తుంది
అప్పుడే లేపట్ట మంటుంది లేపట్టగానే
పడుకోబెట్ట మంటుంది
అప్పుడే మనుమరాల్లను పిలుస్తుంది కలవరిస్తుంది
కన్నీళ్ళు పెట్టుకుంటుంది
ఏం బతుకు నాది
చావన్నా వస్తలేదు
ఈ గోస ఎన్నొద్దులు అని
తీవ్ర దుఃఖానికి లోనవుతుంది
బాధను చూడరాదు
చూస్తూ ఉండరాదు ఒకరు
ఎత్తుకునేది దించుకునేది కాదు
అప్పుడే
మన ఇంటికి పోదాం అంటుంది ఇది మన ఇల్లే అంటే
కాదు అంటుంది
కళ్ళల్లో నీళ్ళు నింపుకొని
గోసోలె చూస్తుంది
మా అమ్మ ఇప్పుడు
చంటిపిల్ల అయిపోయింది
తల్లి ఆరుగురిని
ధైర్యంగా సాది సంరక్షించిన
అమ్మ చెంచరిల్లి పోతుంది
ఏనుకున్న మొక్కను బలవంతంగా మట్టి నుంచి మమతల పందిరి నుంచి
ఎవరో పెకిలించి వేస్తున్నట్టు తల్లడం మల్లడం అవుతుంది
అప్పుడే క్యాలి తప్పుతుంది మరుక్షణమే మంచిగా మాట్లాడుతుంది
పూటకో తరీక ఉంటుంది
మా ఇంట్లో పడినప్పటి నుండి ఎన్ని కష్టాలు ఎన్ని కష్టాలు
ఎంతో ఇష్టంగా భరించింది
విస్తర్లు కుట్టి నాట్లు వేసి
కలుపు కలిసి వరి కోసి
ఏ పని దొరకనప్పుడు
ఏమట్టి పనో చేసి
పిల్లల ఆకలి తీర్చడానికి
తన కడుపును మంచినీళ్లతో ఎన్నిసార్లు నింపుకున్నదో
అమ్మ మక్క కంకుల
బూరు తీయడానికి పోయి
కైకిలి కింద నాలుగు చేతుల కంకులను తెచ్చి
ఒలిచి దంచి గటుకను రొట్టెలను చేసి సగం కడుపుకు తిని పిల్లలకు పొద్దటి కోసం దాచిపెట్టేది
సరిగ్గా లేని వంటింటి తలుపు
లోంచి
కుక్క వచ్చి రొట్టెలను ఎత్తుకపోతే అమ్మ పెట్టుకున్న శోకం
యాదికి వచ్చి
నా కడుపులో దుఃఖం
ఎత్తేసుక వస్తుంది
అమ్మా
నీ చివరి రోజులు గిట్ల అయిపోయే
ఏమి పుల్లెందల వచ్చెనే
నువ్వు అందరి మేలును కోరావు క
ఏ ఒక్కరికీ అపకారం తలపెట్ట లేదు
బాపు చనిపోయినప్పుడు
నువ్వు ఇంటిని పేరుకు తెచ్చావని అందరూ అంటే
ఎంతో పొంగిపోయాను
ఇప్పుడు కుంగి కుమిలి పోతున్నాను
రోజుకింత నీ మొఖం
కళ తప్పుతుంది
మనసు పరిపరి విధాలుగా పరితపిస్తోంది
మా పెద్ద బిడ్డ రెండేళ్లప్పుడు జ్వరం వస్తే నడుముల వంటి మానేరు వాగు దాటి
పిల్లల డాక్టర్ చూయించి తీసుకువచ్చిన విషయం మూడేళ్లకు స్కూల్లో చేర్పించితే బడి ముందే
ఒంటి గంట వరకు గద్దెలపై
కూర్చుని మనవరాలిని
సంకలో ఎత్తుకొని
ఒక చేత్తో బుట్టను పట్టుకొని ఇంటికి వచ్చేదానివి
ఒకటారెండా ఎన్నో జ్ఞాపకాలు నన్ను తుఫాన్లో వణికిపోయే లేచిగురుటాకుల చెట్టును చేస్తుంది
అమ్మ కొట్టిన తిట్టినా బాగుండేది
లేచి ఎప్పటిలా నడిస్తే చాలు
మా అమ్మ ఎటైనా ఊరికి పోతే నోట్లో నాలిక పెట్టుకొని నిలారంగా వచ్చేది
అమ్మ కడుపులో
పేగులను మూటగట్టుకొని మమ్ములను సాదింది
అమ్మకు మంచంలోనే తెల్లారుతుంది పొద్దూకుతుంది
అమ్మ
కన్న ప్రేమ ముందు
అన్నీ చిన్న పోతయి
అమ్మ ఒక మహా మహాకావ్యం
*
ఈ కవిత రాయడానికి నేపథ్యం స్పందన మా అమ్మనే ఎందుకంటే మా అమ్మ వయసు ఇప్పుడు 86 సంవత్సరాలు గత రెండు సంవత్సరాలుగా మంచంలోనే పొద్దు దూకుతోంది మంచంలోనే తెల్లారుతుంది ఎవరికోసమో ఎదురుచూస్తూ ఉంటుంది రోజూ పని మనిషి వచ్చి ముఖం కడిగించి స్నానం చేయించి డైపర్ మార్చి పడుకోబెట్టి పోతది మా అమ్మకు ఆరుగురం పిల్లలం నలుగురు కొడుకులు ఇద్దరు బిడ్డలు 14 గు మంది మనవళ్లు మనవరాళ్లు కానీ నీ మొదటి నుంచి నా వద్దే ఉంటుంది చాలా కష్టపడి మా అమ్మ మమ్మల్ని పెంచి ప్రయోజకులను చేసింది నా వయస్సు ఇప్పుడు 64 నాకు బుద్ధి తెలిసి 50 ఏళ్ల కాలంలో అమ్మ జీవితమంతా కళ్ళల్లో గిర్రున తిరిగింది మనసు ఆవిసి పోయి రెండేళ్ల నుంచి మా అమ్మ మంచంలో పడుతున్న నరకయాతన చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి గుండెల్లో గుండు సూది తో గుచ్చినట్టు తడ తడ పెట్టింది మనసు గూడు పట్లు కదిలిపోయి కవితగా అవతరించింది చెప్పడం మరిచాను మా బాపు 1980 లో నే చనిపోయాడు
Baadhanthaa kalamlo
‘అమ్మ’ అమ్మే ఇంకో మాట లేదు !
ఎన్నిన్ని గాయల్ని ,జ్ఞాపకల్ని కవిత్వం చేశారు సర్…అమ్మ కి వదనం💐💐
రంధిని కవిత చేసినట్లుంది జగన్నాధం సార్