ఇవాళ ప్రపంచం నలుమూలలా తెలుగువాళ్ళు వున్నారు. దేశదేశాల్లో తెలుగు మాట వినిపిస్తోంది. అనేక దేశాల్లో తెలుగు సమాజాలు గట్టిగా పనిచేస్తున్నాయి. ఇంటర్నెట్ ఆ సమాజాలన్నిటినీ కలిపికుట్టే దారంగా పనిచేస్తోంది. అమెరికా నుంచి దుబాయి దాకా అనేక తెలుగు ఇంటర్నెట్ చర్చాబృందాలు చాలా చురుకుగా పనిచేస్తున్నాయి.
అయిదేళ్ళ క్రితం నలుమూలలా చెల్లాచెదురుగా పడి వుండి, ఎవరి దేశంలో వాళ్ళు అపరిచితంగా మాత్రమే మిగిలిపోయినట్టున్న తెలుగు వాళ్ళు ఇప్పుడు దూరాల్ని జయించి దగ్గిరవుతున్నారు. ఒకప్పుడు మహా అయితే ఒక వూళ్ళో ఏ పండగ సందర్భంలో అయితేనే కలిసేవాళ్ళు. ఇప్పుడు కలుసుకోడానికీ,మాట్లాడుకోడానికి అవకాశాలు పెరిగాయి. రకరకాల ఇంటర్నెట్ తెలుగు గ్రూపులు ఇప్పుడు వున్నాయి. అనేక విషయాల మీద చర్చలు జరుగుతున్నాయి. భావాలు వేగంగా బట్వాడా అవుతున్నాయి. వాటికి దేశాల సరిహద్దులు లేవు. కాల వ్యత్యాసాలు లేవు.
మనోవేగానికి ఇప్పుడు ఎలాంటి అడ్డంకులూ లేవు. దీనికి తోడు, పత్రికావ్యవస్థ మరింత చేరువయింది. తెలుగు పత్రిక చదవడానికి ఇప్పుడు పెద్ద కష్టపడక్కర్లేదు. అలాగే, తెలుగునాట ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోడానికి సౌకర్యాలు పెరిగాయి. ఆ మాటకొస్తే, అక్కడి వాళ్ళ కంటే దూరంగా ఏ అమెరికాలోనో వున్నవాళ్ళకే తెలుగుపత్రికలు కొన్ని గంటలు ముందుగా చేరుతున్నాయి. ఈ పరిస్థితి అక్కడి – ఇక్కడి తెలుగువాళ్ళ సాంస్కృతిక జీవనాన్ని ఎట్లా ప్రభావితం చేయబోతుందో ఇప్పుడే చెప్పలేం. కాని, దూరం తరిగిపోతుందని మాత్రం ఇప్పటికి చెప్పుకోవచ్చు.
‘డయాస్పొరా ’ సాహిత్యసంస్కృతిగా మనవాళ్ళ కృషిని చెప్పుకోవచ్చా లేదా అన్న చర్చకి ముందు – సంక్షిప్తంగా – అమెరికా తెలుగు సాహిత్యసంస్కృతి ఎట్లా ఏర్పడిందో చూడడం అవసరం. నిజానికి 1960లలో వచ్చిన తెలుగు సాహిత్యాభిమానులు ఏం చదివేవాళ్ళో, ఏం రాసేవాళ్ళో ఇప్పుడు మనకి గుర్తులేదు. అలాగే, అప్పటి తెలుగు సమూహాలు ఎలా వుండేవో, వాటి స్వభావం ఏమిటో మనకి తెలియదు. అయితే, పూర్తిగా కొత్త లోకంలోకి, కొత్త వ్యవస్థలోకి వచ్చిన పరిస్థితుల్లో విపరీతమైన మానసిక, శారీరక వొత్తిళ్ళస్త్ర సాహిత్యం జోలికి రానివ్వవు. చదవాలన్న ఆసక్తి వున్నా దానికి కావలసిన తీరుబాటు దొరకదు. రాయాలన్న ఉత్సాహం ఏ మూలనో వున్నా, రాయడానికి కావలసిన తక్షణ ప్రేరణనిచ్చే వాతావరణం వుండదు.
ఇలాంటి వాతావరణం అమెరికన్ తెలుగు సమూహాల్లో 1970లలో కాస్త ఏర్పడడం మొదలైంది. దీనికి కారణం – 60లలో కంటే 1970లలో తెలుగువాళ్ళకి అమెరికాకి రాకపోకలు పెరిగాయి. మెడికల్, సైన్సు రంగాల వాళ్ళు అమెరికా వచ్చి, కాలు నిలదొక్కుకోవడం మొదలైంది. ముఖ్యంగా- వైద్యరంగంలో వున్నవాళ్ళు. ఈ రంగంలో వున్నవాళ్ళకి బయటి సమాజంతో సంబంధాలు తప్పనిసరి. ఆ సంబంధాల సంఘర్షణ చెప్పాలన్న తపన కొంతమందిని రచనలవైపు మళ్ళించింది.
‘ప్రతిక్షణం డాక్టరుగా పనిచేస్తున్నప్పటికీ చాలా సంగతులు చూసినప్పుడు మనస్సు కలవరపడేది. మా ఇండియాలో అయితే ఇలా జరగదు అనిపించేది. ముఖ్యంగా డివోర్స్‌డ్ కపుల్స్ మానసిక సమస్యలతో వచ్చినప్పుడు ఎదుగుతున్నన యువతీయువకులు డ్రగ్ సమస్యలతో వచ్చినప్పుడు ‘ఛ’ అనిపించేది. వీళ్ళ అలవాట్లపై చిన్న చూపు. మెల్లగా దాని వెంటనే అసహ్యం పేరుకుంటూ వచ్చాయి. అందుకనే అందరికీ ‘హాయ్’ చెప్పి ఆమడదూరంలో వుంటూవచ్చాను..’ (రాణీ సంయుక్త కథ ‘వంచన’)
‘ప్రస్తుతం ఇంట్లో ఒంటరిగా వున్నాను. ఇక్కడ పనివారెవరూ వుండరు. మావారు మా అమ్మాయిని తీసుకుని ఏదో పార్టీకని వెళ్ళారు. నాకు ఇష్టం లేక వెళ్ళలేదు. వెళ్ళే ముందు దానికో పెద్ద గొడవ. నన్నూ రమ్మంటారు. ఆ పార్టీలు ఎంత రొటీనుగా, ఎంత కృత్రిమంగా వుంటాయో…సీతాపురంలో పేరంటాళ్ళు, పట్టుచీరల గరగరలు, కమ్మని పలకరింపులు, తియ్యని ఆప్యాయతలు రుచిచూసిన నాకు ఇక్కడి వాతావరణంలోని చేదు నచ్చడం లేదు..’(నోరి రాధిక కథ ‘పొరుగింటి పుల్లకూర’)
బయటి జీవితం కేవలం బయటి విషయాలకే పరిమితం కాదు. అది వ్యక్తి మానసిక జీవితాన్నికూడా ప్రభావితం చేస్తుంది. దీనికి సంబంధించిన సంఘర్షణ ఈ దశలో ఎక్కువగా కనిపిస్తుంది. రచయితకి ఇది చాలా ముఖ్యమైన సన్నివేశం. ఈ సన్నివేశమే మన భాషనీ, మన సంస్కృతినీ బలంగా గుర్తు చేస్తుంది. 1970లలో వచ్చిన సాహిత్యానికి ఈ తలపోత ప్రధానమైన ముడిసరుకు. గతాన్ని తలచుకునే ప్రయత్నంలో భాగంగా రాయడం. వాటిని రాత పత్రికల్లో తామే ప్రచురించుకోవడం ఈ దశలో కనిపిస్తుంది. ఆలా మొదలైంది ‘తెలుగు భాషా పత్రిక’. మొదట అది రాతపత్రిక. ఆ తరవాతే అచ్చుపత్రిక. ఈ సాహిత్యసంస్కృతికి ‘నాస్టాల్జియా’ ముఖ్యనేపధ్యం. అది తెలుగునాట తమ గతజీవితాన్ని గుర్తుచేసుకోవడంతోనే పరిమితం కాలేదు. తమ భాషనీ, సంస్కృతినీ తలుచుకోవడం అందులో ముఖ్యమైన అంశం.
మొదటి రెండు తరాల తెలుగు సాహిత్య సంస్కృతికి ఇంకా ‘అమెరికన్ తెలుగు’దనం అబ్బలేదని మనకి అర్ధమవుతుంది. ఆ సంస్కృతికి గతజీవితం తలపోతలు, వర్తమాన జీవితంతో సమన్వయించుకోలేని సంఘర్షణా, మన సంస్కృతి విలువైందన్న స్థిరాభిప్రాయం – అప్పటి రచనల్లో కనిపిస్తాయి. ఈ కారణాల వల్ల అమెరికన్ సంస్కృతి మీద ఫిర్యాదులు ఎక్కువగా వినిపిస్తాయి. రెండో బలమైన కారణం – అమెరికాలో స్థిరపడాలన్న కాంక్ష బలంగా లేకపోవడం. రెండో తరవంవాళ్ళ వొత్తిడి వల్ల తరవాత తరవాత ఈ కాంక్ష బలపడింది తప్ప, మొదటి తరంలో ఎక్కువ మంది తెలుగువాళ్ళకి ఇంకా అమెరికాతో కేవలం ‘వృత్తి’గతమైన అనుబంధం మాత్రమే వుండేది. ఆ ప్రతిఫలాలే వాళ్ళ రచనల్లో, సాంస్కృతిక చరిత్రలో కనిపిస్తాయి.
అమెరికా తెలుగు డయాస్పొరా సంస్కృతి వున్నట్టుండి చుక్కలా రాలిపడలేదు. దీనికి ముందు సుదూర చరిత్రా, తక్షణ చరిత్రా రెండూ వున్నాయి. సుదూర చరిత్రలో మొదటితరం రచయితల ప్రయత్నాలు 1990ల తరవాత వొక స్థిరరూపం దాల్చడం మొదలెట్టాయి. సాహిత్యసంస్కృతి స్థిరత్వానికీ, అమెరికాలోని తెలుగు సమూహాలు స్థిరపడడానికీ దగ్గిర సంబంధం వుంది. వృత్తిగతమైన సంబంధాల నుంచి వ్యక్తిగతంగా అమెరికా నేలకి దగ్గిరవడం, రెండోతరం రావడం, వాళ్ళ ఎదుగుదలకి ఇక్కడి స్థానికతలో పునాదులుండడం, ఇల్లూవాకిలీ, ఇరుగూపొరుగూ, కుటుంబం, వృత్తి, వ్యక్తిత్వం, అభిరుచి లాంటి మౌలిక భావనల్లో పూర్తి మార్పు ఈ దశలో సాధ్యపడింది.
‘అదేలే.. ఈ మధ్య అమెరికాలో తెలుగువాళ్ళకి కొత్త కేకలొచ్చాయి. అందులో ఈ డయాస్పొరా అన్న మాట వొకటి..అంటే పవిత్ర తెలుగుదేశాన్ని వదిలేసి అమెరికాలోనూ, ఇతర దేశాల్లోనూ పూర్వం జ్యూయిష్ వాళ్ళలా పరాయిదేశాల్లో సెటిల్ అయిపోయిన తెలుగు వాళ్ళన్నమాట.’(వంగూరి చిట్టెన్ రాజు కథ ‘స్వామి డి. ఆనంద్ మహరాజ్ కథ’,2000)
గత జ్ఞాపకాల నుంచి బయటపడి, అమెరికన్ సమాజంతో కలుపుగోలుగా వుంటూ, వాటి ప్రభావంతో తెలుగువాళ్ళు తమ జీవనానుభవాల్ని కలగలిపి రాసే ధోరణి 1990ల నుంచి గట్టిగానే వున్నా, తమలోని సాహిత్య భిన్నత్వాన్ని తరచి చూసుకునే సందర్భం 2000దాకా రాలేదు. వాస్తవానికి 1998 అట్లాంటా సమావేశాల్లోనే తెలుగు డయాస్పొరా ప్రాధాన్యాన్ని ఇక్కడి రచయితలు గుర్తించారు. ఇంకో రెండేళ్ళ తరవాత షికాగోలో జరిగిన అమెరికా తెలుగుసాహితీ సదస్సులో ‘తెలుగు డయాస్పొరా గురించి ప్రత్యేకంగా చర్చాగోష్ఠులు జరిగాయి. .మనం ఇక ఇమిగ్రెంట్లం కాదు, డయాస్పొరా’ అంటూ గట్టి వాదనని ముందుకు తీసుకువచ్చారు. ( ఈ చర్చలికి సంబంధించిన వివరాలకు చూడండి: వంగూరి ఫౌండేషన్ ఆప్ అమెరికా ప్రచురించిన రెండవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు సభావిశేష సంచిక: 2002)
అమెరికాలోనూ, ఇతర దేశాల్లోనూ ఇప్పుడు క్రమంగా తెలుగు సమూహాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా స్థలకాలాల ప్రాముఖ్యం బాగా తగ్గిపోయిన ప్రస్తుత స్థితిలో భావప్రసారానికి వేగం పెరిగింది. సాంస్కృతికంగా ఇంతకుముందు వున్న కట్టుబాట్లు, వొత్తిళ్ళు ఇప్పుడు లేవు. స్వయం నిర్మిత చట్రాలు నెమ్మదిగా వదులవుతున్నాయి. మిగిలిన సంస్కృతుల్ని లీనం చేసుకుంటూ, వొక స్వతంత్ర భావన వైపు ఈ తెలుగు సమూహాలు ప్రయాణిస్తున్నాయి. సంప్రదాయాన్ని, సంస్కృతిని ఏకశిలగా మలిచే ప్రయత్నాలు జరుగుతున్నా, సాహిత్య సామాజికతని అవి పెద్దగా శాసించలేకపోతున్నాయి.
అలాంటి కృత్రిమ ఏకత్వం కన్నా, భిన్నత్వం తెలుగు డయాస్పొరా జీవలక్షణంగా మారుతోంది. పెరుగుతున్న రచయితల సంఖ్య, ప్రచురణ సౌకర్యాలు, స్థానికంగా ఏర్పడుతున్న లిటరరీ క్లబ్బులు, టెక్నాలజీని ఇంకా సమర్ధంగా వుపయోగించుకోవాలన్న తపన తెలుగు డయాస్పొరాకి బలాన్నిస్తాయి. ఇవి క్రమంగా మిగిలిన దేశాలలో తెలుగువాళ్ళతో గట్టి అనుబంధాన్ని పెంచుతాయి. అలాంటి సంభాషణకి ఇది మొదలు. సాహిత్యం ఆ సంభాషణకి వొక ఆధారభూమిక.
*
ప్రపంచ తెలుగు సాహితీ పిపాసుల సామూహిక వేదికగా అమెరికాలో పరిణామ క్రమాన్ని చిత్రించిన తీరు ప్రశంసనీయం.
👌🌿