అమూల్యానుభవాల సృజనాత్మక ‘వ్యూహం’

వృద్ధాప్య సమస్యలపైనా, వృద్ధాశ్రమాలపైనా కథలు తామరతంపరగా వస్తున్నాయనీ; ఆ సబ్జెక్టు జోలికి వెళ్లకపోవటమే మంచిదని చాలామంది విమర్శకులు చెబుతుంటారు. దానర్థం జీవన చరమాంకంలో వేలాడుతున్న మనుషుల గురించి, వారి బాగోగుల గురించి కథలు రాయకూడదని కాదు.

ద్యకవిగా, వచనకవిగా, కథ-నవలా రచయితగా, వ్యాసకర్తగా, విమర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశీలి విహారి (జె.ఎస్.మూర్తి). సాహిత్య ప్రస్థానంలో షష్టిపూర్తి జరుపుకొన్న అరుదైన అనుభవం ఆయన బలం. ఆ బలంతో సృజించిన పదహారో కథాసంపుటి ‘‘వ్యూహం’’. 20 కథల సమాహారం.

ప్రధానంగా మధ్యతరగతి మనుషుల జీవితాలే విహారి గారి కథలు. బతుకు వనరుల్ని అనుక్షణం లెక్కజూసుకుంటూ రేపటికోసం రెక్కలు కట్టుకునే ఆ సంసారాల్లోని సుఖదుఃఖాలూ కోపతాపాలూ ఆవేశకావేషాలూ సజీవంగా ఆవిష్కృతమవుతాయి. అనుభవాలతో పండిపోయిన జీవితాలు దర్శనమిస్తాయి.

పుడుతూనే పేదరికంతో స్నేహం పెంచుకొని, పెరుగుతూ ఆ సంకెళ్లను తెంచుకొని, జీవితంలో నిలదొక్కుకునేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంటూ ఎదిగే మనుషులు కథల రూపంలో మనతో మాట్లాడతారు. ఉదరపోషణార్థం ఉద్యోగం చేసే నిర్భాగ్యులు, చిరువ్యాపారాలతో కాలం వెళ్లబుచ్చే అభాగ్యులు, కళాకారులు, దివ్యాంగులు ఇట్లా చాలామంది తారసపడతారు. ముఖ్యంగా, జీవన చరమాంకంలో ఉన్న మనుషుల భారమైన నిట్టూర్పులు వినిపిస్తాయి. ఆ నిశ్వాసల వెనక నిబిడీకృతమైన అనుభవాలు విలువైన పాఠాల్లా ప్రత్యక్షమవుతాయి.

అట్లా అని రచయిత అన్నీ ఒలిచి నోట్లో పెట్టరు. మనుషులతో ముడిపడి ఉండే సంఘటనల్ని వైనంగా ఒక దారానికి చుట్టుకుంటూ వెళ్తారు. అల్లిన దండను కథ రూపంలో మన చేతుల్లో పెడతారు. ఆ పరిమళాన్ని ఆస్వాదించటం పాఠకుడి వంతు. చదువరి చైతన్యపు స్థాయిని పెంచటం ఆ కథనంలో ఓ భాగం.

రమణ ఓ ప్రైవేటు కంపెనీలో హెచ్‌ఆర్ మేనేజర్. రిక్రూట్‌మెంట్ కమిటీ ఛైర్మన్. కీలకమైన ఓ ఉద్యోగానికి ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఎవర్ని సెలెక్ట్ చేయాలి? సత్తా ఉన్న పేదవాడినా లేక భారీ సిఫారసు ఉన్న పెద్దింటి కుర్రాడినా! రమణలో ఉవ్వెత్తున మథనం. కమిటీలోని మూడో వ్యక్తి శేఖర్‌ మాటలకు తప్పనిసరై తలొగ్గి, చివరికి ఇద్దర్నీ సెలెక్ట్ చేస్తాడు. తద్వారా ఆ కంపెనీ ఎండీ ఆశీస్సులతో శేఖర్ ప్రమోషన్ కొట్టేస్తాడు. ఇలాంటి వ్యవహారాల్లో తెర వెనక చాలా తలకాయలుంటాయనీ, ‘తల’కో రేటు ఉంటుందనీ రచయిత ఎక్కడా వ్యాఖ్యానించరు. పాఠకుడు ఫీలవుతాడు. అదే రచయిత ‘‘క్రీనీడలు’’ కథలో సాధించిన విజయం.

ఎప్పుడూ పెద్దలేనా నీతులు చెప్పేది? వాళ్లేనా సమాజాన్ని బాగు చేసేది? పిల్లల్లోనూ ఆ చైతన్యం నిబిడీకృతమై ఉంటుంది. చిన్నారుల్లోనూ సామాజిక సేవాభిలాష గూడు కట్టుకొని ఉంటుంది. ఇంటా బయటా కళ్లెదుటే అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నా, తమెకుందుకులే అన్నట్లు మిన్నకుండిపోయే పెద్దలకు భిన్నంగా పిల్లలూ గళం విప్పుతారు. పెడదారి పడుతున్న పద్ధతుల్ని వ్యతిరేకిస్తారు. కట్టు తప్పి వ్యవహరిస్తున్న వ్యక్తుల్ని- వాళ్ల తల్లిదండ్రులైనా సరే- నిలదీస్తారు. ఇలాంటి లక్షణాల్ని పుణికిపుచ్చుకున్న ఓ ఇంటర్మీడియెట్ అమ్మాయి పాత్రను కథకు వెన్నెముకగా చిత్రించాలన్న ఆలోచనే వైవిధ్యం. అదే విహారి గారి సిసలైన రచనా ‘‘వ్యూహం’’.

చిదంబరానికి చదువంటే ప్రాణం. అతనికున్న పెద్ద కోరిక – రాత్రివేళ చదువుకోటానికి సొంత లాంతరు కావాలి! తల్లిదండ్రులకు ఆ స్థోమత లేదు. అంతమాత్రాన కుంగిపోడు. పెరట్లో కాసే కాయగూరలు అమ్మి, లాంతరు కొనుక్కుంటాడు. ఆ కోరిక తీరాక, పుస్తకాలు పెట్టుకోటానికి ఓ జాజిచెక్కల ర్యాక్ ఉంటే బాగుండుననుకున్నాడు. పేపర్ బాయ్‌గా పనిచేసి, దాన్ని సమకూర్చుకుంటాడు. రాత్రిపూట మెస్‌లో పనిచేసి, సైకిల్ కొనుక్కున్నాడు. సంగం డెయిరీ పాలను కొన్ని ఇళ్లల్లో పోసి, ఆ సంపాదనతో టెక్స్ట్ బుక్స్ కొనుక్కుంటాడు. డిగ్రీ చదువుకుంటూనే, ట్యూషన్లు చెబుతాడు. తన సంపాదనపై అయినవాళ్లే ఆశలు పెంచుకున్న విషయం గమనించి, వాళ్లను కాదనుకుని ఒంటరి జీవితం ప్రారంభించాడు. బ్యాంకు ఉద్యోగం. శుభతో పెళ్లి. రియల్ ఎస్టేట్ వ్యాపారం. షేర్ల క్రయవిక్రయాలు. అయినా ఏదో వెలితి. ఇంకా ఏదో సాధించాలన్న యావ. అయిన వారెవ్వరూ దగ్గర కాలేదు. వృద్ధాప్యం దగ్గరవుతున్నా పరుగాపలేదు. ఆరోగ్యం క్షీణించి, మరణం వాకిట నిలబడి ఉన్నా తాపత్రయం తగ్గలేదు. ఇంతకీ ఈ సంపాదించిందంతా ఎవరి కోసం? చివరి దశలో చిదంబరానికి తోడుగా నిలిచిందెవరు? వందో మైలురాయి చేరుకోటానికి మిగిలున్న ఆ అడుగు ముందుకే పడిందా? ఆ ‘చిదంబర’ రహస్యాన్ని ‘’99 క్లబ్’’ కథగా రచయిత చెప్పిన తీరు అపూర్వం.

ఇవాళంటే అపార్టుమెంట్ల నిండా న్యూక్లియర్ ఫ్యామిలీలే. ఒకప్పుడు ఇలా కాదు. తండ్రి మంచాన పడ్డా, మరణించినా పెద్ద కొడుకే సంసారభారం నెత్తికెత్తుకోవాలి. దాన్ని భారంగా కాక బాధ్యతగా స్వీకరించేవాళ్లు. ఆ క్రమంలో అతగాడు చాలా త్యాగాలు చేయాల్సివచ్చేది.

నాన్న పోయాక ఒక చెల్లి, ముగ్గురు తమ్ముళ్ల చదువుసంధ్యలు, పెళ్లిపేరంటాల బాధ్యతను అతను తలకెత్తుకున్నాడు. తలో దారి చూపించాడు. బంధుమిత్రుల అవసరాలకూ ఆసరాగా నిలిచాడు. ఏం లాభం, అవసరం తీరాక ఒక్కరైనా పలకరించే దిక్కులేదు. ‘పిల్లాపీచూ లేని అతని సంపాదన’పైనే వాళ్ల దృష్టి. అర్ధాంగి పూర్ణ మాత్రమే సంపూర్ణ సహకారి. మూడో బాబాయి కూతురు లావణ్య ఓ అర్ధరాత్రి తలుపు తట్టి, తనతో వచ్చిన ముస్లిం యువకుణ్ని పెళ్లాడానని చెప్పి, తమకు రక్షణ కల్పించమని అడిగిన రోజు మాత్రం పూర్ణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. భార్యకు తెలియకుండా ఆ కొత్త జంటను హైదరాబాదు పంపి, సలీమ్‌కు లారీ డ్రైవరుగా బతుకుబాట చూపిస్తాడు. ఉన్నంతలో హాయిగా బతుకుతున్నామంటూ అప్పుడప్పుడూ సమాచారమిచ్చేది లావణ్య. కానీ, హఠాత్తుగా సలీమ్ మరణవార్త తెలిసి హతాశుడవుతాడు. భార్యతో కలిసి హైదరాబాదు చేరుకున్న ఆ మానవీయమూర్తి ఏం చేశాడో తెలియాలంటే ‘‘పూర్ణోక్తి’’ చదవాల్సిందే. మహిళలకివ్వాల్సిన ప్రాధాన్యం గురించి మన అవగాహనను విశాలం చేసుకోటానికి ఇలాంటి కథలు ఉపకరిస్తాయి.

‘నివురు’ కథలోని చిదంబరం కూడా ఇలాంటి బాధ్యతల వలయంలోనే బందీ అవుతాడు. నలుగురు సంతానంలో పెద్దవాడైన చిదంబరం పేదరికాన్ని చిరునవ్వుతో భరించటం చిన్నప్పట్నుంచే అలవాటు చేసుకుంటాడు. కష్టమే జీవితంగా ఎదిగాడు. కొడుకును చదివించాడు. అతగాడు అమెరికా వెళ్లి, అక్కడే ఓ బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. చిదంబరం భార్య కాత్యాయని దిగులుతో కుంగిపోతుంది. వ్యాపారం దెబ్బ తింటుంది. హఠాత్తుగా భార్యాబిడ్డలతో ఇంటిముందు కారు దిగిన కొడుకును చూసి చిదంబరం, కాత్యాయని ఉప్పొంగిపోతారు. కానీ, పలుకూ వినికిడీ లేని మనవరాల్ని చూసి హతాశులవుతారు. కొడుకు, కోడలు మాత్రం పాపను అక్కడే వదిలేసి, కోల్‌కతా వెళ్లిపోతారు. కాత్యాయని మంచం పట్టింది. ఏడాదిపాటు తీసుకొని లోకం విడిచి వెళ్లిపోయింది. అయినా, చిదంబరం ఓడిపోలేదు. శాంత సాయంతో ఓ ఆశ్రమం ప్రారంభించాడు. ఇంతకీ శాంత ఎవరు? ఆశ్రమం ఏమిటి? మనవరాలు ఏమైంది? ఇన్ని సుడిగుండాలు దాటి, విజయాల ఒడ్డున ధీమాగా నిలబడిన చిదంబరాన్ని లోకం ఎందుకు ఆడిపోసుకుంటోంది? ‘‘నివురు’’ కథ విప్పే జీవిత రహస్యాలు అమూల్యం.

వృద్ధాప్య సమస్యలపైనా, వృద్ధాశ్రమాలపైనా కథలు తామరతంపరగా వస్తున్నాయనీ; ఆ సబ్జెక్టు జోలికి వెళ్లకపోవటమే మంచిదని చాలామంది విమర్శకులు చెబుతుంటారు. దానర్థం జీవన చరమాంకంలో వేలాడుతున్న మనుషుల గురించి, వారి బాగోగుల గురించి కథలు రాయకూడదని కాదు. సదరు సమస్యల్ని చిత్రించటంలో మరింత లోచూపు అవసరమని! విహారి గారు రాసిన ‘‘రోగం’’ కథ చదివితే ఆ రహస్యం తెలుస్తుంది. ఆర్థిక సంబంధాలతోపాటు కులమతాల వంటి సామాజికాంశాలు మనుషుల జీవితాలతో మమేకమై ఉండే విషయాన్ని ఈ కథలో ఆయన ప్రస్తావించిన తీరు ప్రశంసనీయం.

వరుడి అన్వేణలో ఇద్దరు యువతుల విచక్షణను విలక్షణంగా వర్ణించిన కథ ‘‘దిగంతమూ… ఆవల…?’’. ‘అప్పూ! నీకు తగిన మొగుడు దొరికాడోచ్’- మాటలు ఎగిరి గిరికీలు కొట్టినై… అంటూ ప్రారంభమవుతుంది ఈ కథ. ఇతివృత్తపు బరువును గుణాత్మకంగా తూచేందుకు ఈ కథను ‘ద్వితీయ పురుష’లో రాయటం రచయిత అనుభవానికి నిదర్శనం. వైవిధ్య కథనంతోనూ ఆకట్టుకోగల నైపుణ్యం విహారి గారికి ప్రత్యేకం.

*****

విహారి గారి కథల్లో ఆర్భాటాలుండవు. అతిశయోక్తులుండవు. ఆధునిక మాయాజాలాలుండవు. సాముగరిడీలుండవు. అసాధ్యాల ప్రస్తావనలుండవు.

జీవితాలుంటాయి. అనుబంధాలుంటాయి. ఘర్షణలుంటాయి. వాదనలుంటాయి. వేదనలుంటాయి. మార్మిక భావనలుంటాయి. మానవీయ ఘట్టాలుంటాయి.

ఈయన కథల్లో హీరోలుండరు. విలన్లూ ఉండరు. అతీంద్రియ శక్తులున్న మెజీషియన్లుండరు. అమానుషంగా ప్రవర్తించే రాక్షసులుండరు.

మనుషులుంటారు. రక్తమాంసాలున్న వ్యక్తులుంటారు. పేదరికంతో ఏళ్ల తరబడి అంటకాగిన అభాగ్యులుంటారు. జీవితాల్ని భుజాలమీద బుద్ధిగా మోస్తున్న జీవులుంటారు. కాకపోతే మోసం, దగా, కుట్ర, కుతంత్రం, బాధ్యతారాహిత్యం వంటి మానవ సహజ లక్షణాలను కూడా వెంటబెట్టుకొని కనిపిస్తుంటారు. ఎన్నిసార్లు కిందపడ్డా లేచి నిలబడటానికే ప్రయత్నిస్తుంటారు. డొల్లతనం పైకి కనిపించకుండా మొహమంతా నటన పులుముకొని తిరుగుతుంటారు. ఆకాశానికి నిచ్చెన్లు వేసే ప్రయత్నాలు కొనసాగిస్తూ నేలపైనే జీవనం సాగించే ఆశాజీవులుంటారు.

పేదరికంలో పుట్టి, చిన్నతనంలోనే చిన్నాచితకా పనులు చేస్తూ, సంసారాలకు అండగా నిలబడే మనుషులు ‘నివురు’, ‘పూర్ణోక్తి’, ‘99 క్లబ్’ కథల్లో కనిపిస్తారు. జీవనయానంలో మైలురాళ్లు దాటేకొద్దీ ఆ అనుభవాల వెలుగులో తాత్విక దర్శనం పొందుతారు. ఈ తరానికి విలువైన పాఠాలుగా మిగులుతారు. మాధ్యమం ఏదైనా మానవ కర్తవ్యాన్ని బోధించటమే రచయిత ప్రాధమ్యం. ‘జీన్స్’ కథలో తండ్రి నుంచి కోపాన్ని వారసత్వంగా పొందిన ప్రసాద్‌ని కూడా అర్థవంతంగా మనకు పరిచయం చేస్తారు.

ఈ కథల్లో మంచి మనుషులూ ఉంటారు. మానవీయ సంస్పందనలతో అలరారుతుంటారు. నలుగురి నోట్లో నాలుకల్లా ఉంటారు. పదిమందికీ చేదోడుగా ఉంటారు. ‘జీన్స్‌’ కథలో సుబ్బమ్మత్త, ‘వేరువేరు గమ్యాలు’లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఝాన్సీ, ‘నిలిచీ నిలువని విలువ’లో సుందరమ్మత్తయ్య అలాంటివారే.

ఉరుములూ మెరుపులూ లేని సరళసుందర శైలి విహారి సొంతం. భాషమీద పట్టు, పలుకుబళ్లపై అవగాహన, సహజ సంభాషణలు, సామెతల గుభాళింపు, వాక్యంపై సాధికారత… ఇవన్నీ కలిసి ఆయన శైలికి సొగసులద్దాయి. కథాసంవిధానంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రకు బాటలు వేశాయి.

‘99 క్లబ్’ కథలో ఓ ఇంటి వాతావరణాన్ని వర్ణించటానికి రచయిత ఎంత పకడ్బందీగా వాక్యాల్ని తీర్చిదిద్దారో చూడండి…

‘‘రైలుపెట్టెలాంటి మూడు గదుల రేకులషెడ్డు. మధ్య తలుపుల్లేని ఆ అద్దె ఇంట్లో మండిగం మీద ఉండే దీపపు బుడ్డి. రెండు గదులకీ అదే వెలుగు. ఆ వెలుతుర్లో చిదంబరం చదువుకుంటుంటే తమ్ముళ్లిద్దరూ కూడా చేరేవారు. అల్లరిగా ఆ గదిలోకీ ఈ గదిలోకీ తిరిగే రెండేళ్ల చెల్లెలు. రెండో బుడ్డీ వంటింట్లో ఉండేది. అక్కడే కూచొని నోట్సు రాసుకోవాలని చిదంబరం వెళ్లగానే, వాళ్లమ్మ దాన్ని తీసుకుపోయి- స్నానానికో, రోట్లో పచ్చడి నూరటానికో పెరటిగుమ్మం మండిగం మీద పెట్టుకునేది.’’

పాఠకుణ్ని ఆసక్తిగా కథలోకి లాక్కెళ్లటానికి చాలా వాక్యాల్ని చిత్రిక పట్టాలి. అయిదారు పదాల సమ్మేళనంతోనే గంభీరమైన భావాన్ని ఆవిష్కరించాలి. అనుభవంతో పండిపోయిన విహారి కలం నుంచి వెలువడిన అక్షరశిల్పాలు కొన్ని…

‘‘సూర్యం, సుజాతల పరస్పర సాన్నిధ్యంలో మౌనప్రస్థానం చేస్తోంది- రాత్రి’’ (నీడలు).

‘‘ముడిచిన రాగిపళ్లెంలా మారి సాగర్‌లోకి దిగిపోతున్నాడు సూర్యుడు!’’ (నీడలు).

‘‘సహనం ఎంత బరువైందో ఆమె మాటల్లోని మార్దవం చెబుతోంది’’ (జీన్స్).

‘‘బయట వేసవి ఎండ గద్దిస్తోంది. లోపల సెగ చిరచిరలాడిస్తోంది’’ (క్రీనీడలు).

‘‘ఆమెని కమ్ముకున్న భీతితో ఆ నవ్వు ఎంతమాత్రం పలచబడలేదు’’ (నీడలు).

‘‘మా అత్తగారిల్లు మూర్ఛరోగిలా బాధతోనూ, దుఃఖంతోనూ కొట్టుకోసాగింది’’ (లో జ్వరం).

‘‘కాలం భీతిల్లింది. గదంతా నిశ్శబ్దపు కుమ్మపొగ’’ (దిగంతమూ… ఆవల…?).

ఇలాంటి వాక్యాలు చదివే కాబోలు, మధుర కథకులు మధురాంతకం రాజారాం ‘‘వాక్యం తయారు చేసినట్టుండగూడదు. జనుల అనుదిన వ్యవహారశైలి నుంచే ఊడిపడ్డట్టుండాలి. విహారి కథల్లో అలాంటి వాక్యాలుంటాయి’’ అంటూ కితాబిచ్చారు.

కథ ఎక్కడ, ఎట్లా మొదలవ్వాలో; ఎప్పుడు, ఎట్లా ముగియాలో తెలిసిన రచయిత విహారి.

‘‘ఉన్నట్టుండి ఝాన్సీ నోరు విప్పింది. గొంతు పెంచింది’’… ఇదీ ‘వేరువేరు గమ్యాలు’ కథలోని ప్రారంభ వాక్యం. కథ- దానికి సొగసైన కొనసాగింపు.

ముగింపు విషయంలోనూ అంతే. శుభం కార్డు వేయటానికి అవసరమైన సమయసందర్భాలను పనిగట్టుకొని సమకూర్చాల్సిన అవసరం లేదని ఈయన కథలు నిరూపిస్తాయి.

డ్రుళ్లాట, ఈరెలుగు, మేఘచ్ఛిన్నైర్దుర్దినం, ఆశ్వాసాంతాలు, కించిదాశ్చర్యం, నాలిముచ్చు, మండిగం వంటి పదాలు విహారి గారి విస్తృత సామాజిక పరిశీలన, భాషాభిమానాన్ని పట్టిస్తాయి. ‘సెల్‌ఫోన్ సంచలించింది’ వంటి వాక్య ప్రయోగాలు కూడా అందులో భాగమే.

నిరంతర అధ్యయనం, సృజనాత్మక సాధన, సామాజిక సమస్యలపై అవగాహన, కాలంతోపాటు అప్‌డేట్ కావటం వంటి బలమైన అంశాలే విహారి గారి కథల విజయ రహస్యాలు.

ప్రసిద్ధ రచయిత మునిపల్లె రాజు గారి మాటల్లో చెప్పాలంటే…

‘‘ప్రతిభా దారిద్ర్యం లేని రచయిత మాత్రమే తన ఊహాశక్తిని వాస్తవిక ధోరణిలో మిళితం చేసి శబ్దాధికారంతో- కథానికలను కవితా శకలాలుగా తీర్చిదిద్దగలడు. విహారి రాసిన చాలా కథల్లో కవిత్వ లయను ఆస్వాదించవచ్చు.’’

తప్పనిసరిగా చదవాల్సిన కథాసంపుటి ‘‘వ్యూహం’’.

(ప్రతులకు: విహారి @ 98480 25600)

ఎమ్వీ రామిరెడ్డి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు