వాకిలి వుండదక్కడ
వాడ బ్రతుకుక్కిచోటుండదక్కడ
ఆవుని కోసుకున్న బ్రతుక్కి …
ఆ ఆవు నుదుట బొట్టుపెట్టిన బ్రతుక్కి ..
చూపులో చాలా దూరం….
ఆ వీధిలో
శుభోదయవేళ
శ్లోకాల్ని తులసికోట వినమ్రంగా వింటుంది
గోదానంలోపొందీ…
తనఇంట గోడకు ఆవాల కట్టిన గోవు మాత్రం
తనపాలపొదుగును తాకిన
పంచముడిపై ప్రేమతో మడికీ..మానవుడికీ మధ్య గెంతులేస్తోంది .
పాలు పితికీ..పితికీ…
వెన్ననో..నెయ్యినో.ఇచ్చే ఆ నల్ల వేళ్ళ కదలిక ఆగగానే
శాస్త్రం గెంతులేస్తూ
అతని చెమట దేహంచుట్టూ
పసిపిల్లలా ఆటలాడుకుంటుంది.
ఇదంతా
మా వూరిలో తెల్లమనుషుల వీధిచిత్రం
తెల్లారగట్టే పంతులోరి ఇంటికెళ్లి
పాలుపితకమన్న మా అమ్మ
అమాయకపు ఆమాస చిత్రం .
2
వేదమూ…..వేదనా..!
అప్పుడు
అగ్రహారం నుండి అగరు పోగల మద్య
స్మశానానికి చేరిన శవాన్ని కాల్చిన మా తాత
కపాళం పగిలిన శబ్దాన్ని విని
శబ్ద రత్నాకరం కంటే విపులంగా
వివరించి చెప్పేవాడు
వేదం నేతిలో కాలిందప్పుడు.
ఇప్పుడు
అగ్రహారం లోనూ… అంటరాని వాడ లోనూ..
ఒకటే ఘోష.
వూరే.. స్మశాన వాటిక.
ఇప్పుడిక్కడ,
వేదమూ.. వేదనా.. ఒకటైన చోట
వీరబాహుడు… విప్ర నారాయణుడూ..
స్మశానం లో నిలబడి
తెగ తగవు పడుతున్నారు.
*
Superb poems
ఇద్దరూ స్మశానంలో ఒకే చోట నిలబడి తగువు పడడం… పోయెమ్ ని పీక్ కి తీసుకుపోయిందన్నా. సూపర్బ్ !