అమాయక ప్రజలను దోచిన బ్యాంకులు

బ్యాంకింగ్ కథలూ వ్యథలూ-3

 

వెల్స్ ఫార్గో (Wells Fargo) అనే అమెరికన్ బ్యాంక్ అమెరికాలోని నాలుగు అతిపెద్ద బ్యాంకులలో ఒకటి. ఈ బ్యాంక్ చేసిన కక్కుర్తి పనులు బయటపడి పెద్ద సంచలనాన్ని సృష్టించింది అమెరికాలో గత నాలుగైదేళ్ళగా. ఖాతాదార్లకు (customers) తెలియకుండా వాళ్ళ అనుమతి లేకుండా, ఈ బ్యాంక్ ఉద్యోగులు ఇరవై లక్షలకు పైగా కొత్త బ్యాంక్ డిపాజిట్ అక్కౌంట్లు, క్రెడిట్‌కార్డ్ అక్కౌంట్లు వాళ్ళ ఖాతాదార్ల పేర్ల మీద సృష్టించారు. ఇలాంటి డిపాజిట్ అక్కౌంట్లు, క్రెడిట్‌కార్డ్ అక్కౌంట్లు సృష్టించినందుకు వాళ్ళ ఖాతాదార్ల దగ్గర నుంచి ఫీజులు (fees) కూడా గుంజారు. ఈ విషయం చాలా కాలం ఖాతాదార్ల దృష్టిలో పడలేదు.

ఎప్పుడయితే ఖాతాదార్లు తమ అక్కౌంటుల్లో కొత్త అక్కౌంట్లకు సంబంధించిన చార్జీలు చూసి గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారో విషమేమిటని దర్యాప్తు మొదలుపెడితే ఈ మోసమైన పని బయటకు వచ్చింది. పాపం, ఐదువేల కంటే ఎక్కువ బ్యాంక్ ఉద్యోగుల ఉద్యోగాలు ఊడినాయి. కోర్టులు, రెగ్యులేటర్లు అంతా కలిపి మొత్తం 3 బిలియన్ల డాలర్ల (అంటే దాదాపు పాతిక వేల కోట్ల రూపాయలు) జరిమానా విధించాయి వెల్స్ ఫార్గో మీద. ఈ మోసపూరితమైన ఖాతాదార్ల జేబు కత్తిరింపు తంతు 2002 నుంచి 2016 వరకు జరిగిందని తేలింది.

ఇదొక్కటే కాదు, ఐదు లక్షలకు పైగా అనవసరమైన కార్ బీమా పథకాలను (insurance policies) ఖాతాదార్లకు అంటగట్టినందుకు, ఖాతాదార్ల దగ్గర నుంచి లేనిపోని ఫీజులు గుంజినందుకు కూడా రెగ్యులేటర్లు జరిమానా విధించారు వెల్స్ ఫార్గో మీద. పదేళ్ళకు పైగా సాగుతున్న ఈ భాగోతం గురించి పై అధికారులకు మొదటి నుంచి తెలిసినా నిమ్మకు నీరెత్తినట్టు వున్నారని తెలిసింది దర్యాప్తులలో. అమెరికన్ బ్యాంకులలో పరిస్థితి గురించి దర్యాప్తు చేసి రెగ్యులేటర్లు తెలుసుకున్నదేమిటంటే నకిలీ అక్కౌంట్ల గజ్జి మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ అంతా పాకివున్నట్టు. కాకపోతే రెగ్యులేటర్లు తమ రిపోర్టులను బహిరంగ పరచలేదు, బహుశా మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ మీద ప్రజల నమ్మకం వమ్మౌతుందని భయపడి కాబోలు.

ఇంక అమెరికా వదిలి మనం బ్రిటిష్ భూమి మీద అడుగుపెడితే అక్కడ బ్యాంకులు ఎలాంటి మోసాలు చేస్తున్నాయని మచ్చుకి లాయిడ్స్ అనే బ్యాంక్ కథ తెలుసుకుందాము. బ్రిటిష్ బ్యాంకులు “పర్చేస్ ప్రొటెక్షన్ ఇన్స్యూరెన్స్” (purchase protection insurance) అనే బీమా పథకాన్ని దాదాపు రుణం తీసుకున్న ప్రతీ సామాన్య జనాలకు అవసరం ఉన్నా లేకపోయినా అంటగట్టి చాలా డబ్బు గుంజుకున్నాయి ఖాతాదార్ల దగ్గర నుంచి. ఖాతాదార్ల ఫిర్యాదులు తారాస్థాయికి చేరుకుని దర్యాప్తు చేస్తే తేలింది బ్యాంకులు నిజంగానే ఖాతాదార్లను మోసం చేస్తున్నట్టు. ఉదాహరణకు రూ. 100 రుణంతో పాటు రూ. 40 ఒక్క బీమా పథకాన్ని అమ్మి పెడితే, బీమా కంపెనీ బ్యాంక్‌కి రూ. 30 కమీషన్ రూపంలో తిరిగి ఇస్తుందనే దురాశతో, తమ పొట్ట నింపుకోవడం కోసం బ్యాంక్ అలాంటి బీమా పథకాలను సామాన్య జనాలకు అవసరం ఉన్నా లేకపోయినా అంటగట్టడం తప్పు కదా.

బ్రిటిష్ బ్యాంకుల మీద ఆంక్షలు విధించారు రెగ్యులేటర్లు, ఆ ఆజ్ఞలను పాటిస్తూ బ్రిటిష్ బ్యాంకులు 19 బిలియన్ల పౌండ్ల నష్టపరిహారం (అంటే రూ. 1,70,000 కోట్ల కంటే ఎక్కువ) ఖాతాదార్లకు చెల్లించాయి, 2011 నుంచి 2015 వరకు. ఇందులో కేవలం ఒక్క లాయిడ్స్ బ్యాంక్ మాత్రమే ఖాతాదార్లకు 12 బిలియన్ల పౌండ్ల నష్టపరిహారం (అంటే రూ. 1,05,000 కోట్ల కంటే ఎక్కువ) చెల్లించింది. ఈ కథల నుంచి తెలిసేదేమిటంటే ఇలాంటి దుష్ప్రవర్తన ఒక్క బ్యాంకో రెండు బ్యాంకులకో పరిమితం కాదని, ఇది మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో చాలా లోతుగా పెనవేసుకుని ఉందని అర్థం అవుతుంది.

ఇలా ఎందుకు చేసారయ్యా బ్యాంకర్లు అంటే దానికి ఎన్నో కారణాలు. వెల్స్ ఫార్గో ఉద్యోగులు మీద తీవ్రమైన పని వత్తిడి, అసాధ్యమైన వ్యాపార లక్ష్యాలు – ప్రతీ ఉద్యోగి రోజుకొక కొత్త అక్కౌంటు తీసుకుని రావాలి అంటే ఏమి చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో తమ ఉద్యోగాలు నిలబెట్టుకోవడానికి ఇలాంటి పిచ్చి పనులు చేసి కొన్ని వేలమంది ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. తప్పెవరిది? ఉద్యోగులదా? లేదా అసాధ్యమైన వ్యాపార లక్ష్యాలను ఇచ్చి వాళ్ళను ప్రతీ రోజు మానసిక చిత్రవధలకు గురిచేసిన పై అధికారులదా? “అతి సర్వత్రా వర్జయేత్” అని బహుశా వూరికే అనలేదు పెద్దలు. అతి ఎప్పుడూ అనర్ధాలకే దారి తీస్తుందని మాత్రం అర్థం అవుతుంది పైన విషయాలు చూస్తే.

బ్రిటిష్ బ్యాంకుల పరిస్థితి వేరు. కొన్నేళ్ళ క్రితం బ్రిటన్‌లో బ్యాంకుల రెగ్యులేషన్ బ్యాంకుల చేతిలోనే ఉండేది. బ్రిటిష్ బ్యాంకులు, సెల్ఫ్ రెగ్యులేషన్ (self-regulation, అంటే మమ్మల్ని మేమే స్వచ్ఛందంగా నియంత్రించుకుంటాము అనే ఒక్క మార్గం) అని చెప్పి ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటి (FSA –Financial Services Authority) అనే స్వచ్ఛంద సంస్థను సృష్టించి, ఎఫ్ఎస్ఏ నిబంధనల ప్రకారం బ్యాంకింగ్ వ్యవస్థను నడిపేవి. ఇంకేముంది, దొంగల చేతికి తాళాలు దొరికితే దొంగలూ దొంగలూ కలిసి ఊళ్ళు పంచుకున్నట్లు బ్యాంకులు మోసపూరితమైన పనులకు పాల్పడి ఎన్నో ఏళ్ళు నిరాఘాటంగా ప్రజలకు కల్లిబొల్లి కథలు చెప్పి అవసరమున్నా లేకపోయినా వాళ్ళకు నానారకాల చచ్చుపుచ్చు పథకాలు అమ్మి సొమ్ము చేసుకున్నాయి.

బ్రిటిష్ బ్యాంకులు తమను తాము స్వచ్ఛందంగా నియంత్రించుకోవడంలో ఘోర విఫలమైనట్టు బ్రిటిష్ ప్రభుత్వం గ్రహించి ఒక్క పార్లమెంటు కమిషన్ని సృష్టించి, ఆ కమిషన్ రిపోర్టులను బహిరంగ పరచి, వాటి అనుసారంగా బ్యాంకుల రెగ్యులేషన్ని బ్యాంక్ ఆఫ్ లండన్‌కు (బ్రిటిష్ సెంట్రల్ బ్యాంక్ అంటే భారతీయ రిజర్వు బ్యాంక్ లాంటిది) అప్పచెప్పింది. ఏది ఏమైనా బ్యాంకుల నియంత్రణ గురించి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పారదర్శకత్వం, అమెరికన్ రెగ్యులేటర్లు బ్యాంకులను తీవ్రంగా దండించిన పద్ధతి ప్రశంసనీయమైనవి. ఎన్నో దేశాల్లో బ్యాంకులు పని చేసే తీరు ఎంతో కొంత మోసపూరితంగా వున్నా వాటికి సరైన కళ్ళేలు వెయ్యలేకపోతున్నాయి ప్రభుత్వాలు.

బయటి లింకులు

https://edition.cnn.com/2020/02/21/business/wells-fargo-settlement-doj-sec/index.html

https://www.bloomberg.com/opinion/articles/2016-09-09/wells-fargo-opened-a-couple-million-fake-accounts

https://www.fca.org.uk/news/press-releases/lloyds-banking-group-fined-%C2%A3117m-failing-handle-ppi-complaints-fairly

దాసరిపిట్ట

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు