అసాధారణం కావలసిన ఘటనలూ పరిణామాలూ అతిసాధారణం ఎందుకవుతున్నాయి?
సకల చరాచర సృష్టిలో తన జాతే ఉత్కృష్టమైనదని తనకు తాను కితాబులు ఇచ్చుకునే మానవజాతి, తనవి కాని అలవాట్లన్నిటినీ పాశవికమూ జాంతవికమూ అని ఈసడిస్తున్న మానవజాతి నీచత్వాన్నే అతిసాధారణ ప్రవర్తనగా ఎట్లా మార్చుకుంటున్నది?
మనిషి మీద మనిషి హింస, పీడన, అధికారం, మరీ ముఖ్యంగా అసహాయుల మీద దౌర్జన్యం ఎప్పుడైనా అసాధారణంగా, నీచంగా కనబడాలి. మానవజాతి వదులుకోవలసిన అనాగరిక చర్యలుగా విమర్శనీయం కావాలి. కాని అవే చర్యలు పదే పదే ప్రతి దినమూ ప్రతి క్షణమూ మన కళ్ల ముందర జరిగిపోతున్నాయి. అంత ఘోరం జరిగిపోతుంటే మన హృదయం కదిలిపోవడం లేదు, మన కళ్లు చెమర్చడం లేదు, మన కనురెప్పలు అల్లల్లాడడం లేదు. దౌర్జన్యంలో అత్యాచారంలో హింసలో హత్యలో మౌన భాగస్వాముల సంఖ్య దౌర్జన్యపరుల సంఖ్య కన్న మించిపోతున్నది.
అవి అసాధారణమేమీ కాదనీ, ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయనీ, ఇటీవల ప్రచారసాధనాల విస్తరణ వల్ల, ప్రచారం వల్ల మాత్రమే ఎక్కువగా, అతి సాధారణంగా కనబడుతున్నాయనీ ఒక వాదన వినిపిస్తుంటుంది. కాని అంకెల్లో చూసినా, గతాన్నీ వర్తమానాన్నీ పోల్చి చూసినా అది నిజం కాదు. ఆ అసాధారణ ఘటనలు అతి సాధారణంగా మారిపోతుండడానికి స్పష్టమైన, దృశ్యమానమైన కారణాలున్నాయి.
ఆస్తి కోసం, అధికారం కోసం, అభిప్రాయాల కోసం, కులం పేరిట, మతం పేరిట, ప్రాంతం పేరిట జరిగే హింసల సంగతీ, హత్యల సంగతీ, అవి కూడ అసాధారణమే కాని, ఇప్పటికి కాసేపు పక్కన పెడదాం. వాటికి అకారణాలో, సకారణాలో ఏవో చూపవచ్చుననుకుందాం.
కాని మనిషి మీద మనిషి అత్యాచారం సంగతేమిటి? ఎంతో కొంత కాలం నెచ్చెలిగా ఉన్న వ్యక్తినీ, స్నేహాన్ని నిరాకరించిన వ్యక్తినీ, కోరికను కాదన్న వ్యక్తినీ ప్రాణం తీసేంత దౌర్జన్యాగ్రహం ఎక్కడి నుంచి వస్తున్నది? అవతలి వ్యక్తి అయిష్టం ప్రకటించినా అత్యాచారం చేసి అధికారం స్థాపించుకునే దుర్మార్గం ఎక్కడి నుంచి వస్తున్నది? అవతలి వ్యక్తి అయిష్టం చెప్పడానికి కూడ అవకాశం లేని ముక్కు పచ్చలారని చిన్నారి శిశువు అయినప్పుడు, లోకం తెలియని అమాయక బాలిక అయినప్పుడు, కాటికి కాళ్లు చాచుకుని కూచున్న వృద్ధురాలైనప్పుడు కూడ అత్యాచారం జరుగుతున్నదంటే ఆ ప్రవృత్తి ఎంతటి అమానుషమైనదీ, అసాధారణమైనదీ అయి ఉంటుంది? ఎంత పెద్ద ఎత్తున గర్హనీయమైన అసహ్యకరమైన చర్య అయి ఉంటుంది? అటువంటి అసాధారణ ఘటనలు కూడ అతి సాధారణంగా మారిపోవడానికి, జరుగుతుండడానికి, కనబడడానికి, మిగిలినవాళ్లందరూ కళ్లూ నోరూ చెవులూ మూసుకుని తప్పుకుపోవడానికి కారణాలేమిటి?
ఈ దుర్మార్గ ఘటనల్లో స్త్రీపురుష సంబంధానికి, లైంగిక చర్యకు ఎంతో కొంత స్థానం ఉన్నది గనుక కావచ్చు, ప్రచారసాధనాలు దీన్ని ప్రేమోన్మాదం అనీ, కామోద్రేకం అనీ పిలుస్తున్నాయి. లోతుగా ఆలోచించడానికి బద్ధకించే ఆలోచనాపరులు కూడ ఈ మాటనే పునరుక్తం చేస్తున్నారు.
కాని ఈ దుర్మార్గాన్ని, దౌరన్యాన్ని, ఆధిపత్యకాంక్షను, హంతక ప్రవృత్తిని మరే పేరుతోనూ పిలవడానికి వీల్లేదు. ఉదాత్తమైన ప్రేమ తోనో, సంస్కారం దిద్దుకున్న సహజాతమైన కామం తోనో దాన్ని పోల్చడానికి ఎంతమాత్రం వీలు లేదు.
ప్రేమ ఒక మానవ సంబంధం. సాధారణ మానవ ప్రవృత్తి. సహజాతం. సంఘ జీవులైన మనుషులలో ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన, ఉన్న సహానుభూతి, సహకార్యాచరణ, సదవగాహన ప్రేమ. ఆ ఇద్దరు మనుషులు ఎవరైనా సరే ప్రేమ ఏర్పడవచ్చు. కాని స్త్రీ పురుషుల మధ్య అనురాగాన్ని ప్రేమ అనీ, మిగిలిన ప్రేమలను స్నేహమనీ, వాత్సల్యమనీ, ఆప్యాయత అనీ, ఆత్మీయత అనీ, అనుబంధమనీ ఒక స్థాయి తగ్గించి పిలవడం అలవాటు చేసుకున్నాం.
ఆ స్త్రీపురుషుల ప్రేమకు సహజమైన, తార్కికమైన, ఆరోగ్యకరమైన, ఉన్నతమైన కొనసాగింపు కామం. అది రెండు శరీరాల కలయిక కన్న ఎక్కువ రెండు హృదయోద్వేగాల కలయిక. మనశ్శరీరాల కలయిక అన్నారు. కాని అవతలి మనసేమిటో తెలియని, తెలియనక్కర్లేదనుకునే, తెలిసినా తన పురుషాహంకారం కింద అణగదొక్కవచ్చుననుకునే, అసలు అవతల మనసే లేదనుకునే దౌర్జన్యపు దురాక్రమణ తత్వాన్ని కామోద్రేకమనో, వాంఛ అనో అనడం కూడ అనవసరపు గౌరవమే.
ఆ దుర్మార్గ దురాక్రమణ ఇంకా ఎదగని మొగ్గలు చిన్నారి పిల్లల మీద, రాలిపోతున్న పండుటాకుల మీద కూడ జరుగుతున్నదంటే దానికీ స్త్రీపురుష సంబంధానికీ ఎంతమాత్రం సంబంధం లేదు. అది కేవలం దౌర్జన్యం. అది ఒక అధికార ప్రదర్శన.
అవతలి మనిషి సమానమైన మనిషి కాదనీ, అణగదొక్కవలసినదనీ, ఆమె మీద అటువంటి దౌర్జన్యం చేయవచ్చుననీ, ఆ దుర్మార్గ అధికారాన్ని ప్రదర్శించవచ్చుననీ మన భావజాలం పురుషుడికి మప్పుతున్నది. ఆ భావజాలం ప్రచారసాధనాల వెయ్యి పడగలుగా విస్తరించి ఉన్నది. ఆ వెయ్యి పడగలు సరిపోవేమోనని, ఆ అధికార స్థాపనలో ఇంకా ఎక్కడైనా వెనుకడుగువేస్తాడేమోనని వాజీకరణ మద్య ఔషధాలు తాగబోయించి, అధికార స్థాపనే జీవన సార్థక్యమని ఊదరగొట్టి మనిషిని పందెపు కోడిలా మారుస్తున్నది. ఆ పుంజు కాళ్ల మధ్య కట్టిన కత్తి గాట్లకు నాగరికత అనుక్షణం గాయపడి నెత్తురోడుతున్నది.
ఇంత అసాధారణత్వం అతి సాధారణంగా మారడమే అసలు కుట్ర.
ఆర్ద్రమైన, సహజమైన, మానవీయమైన స్త్రీ పురుష సంబంధపు మధు భాండంలో పెరుగుతున్న ఈ విషప్రభావాన్ని అసాధారణమైనదనీ, తొలగించవలసినదనీ ఎప్పుడు గుర్తిస్తామో అప్పటిదాకా ఇది అలవాటైపోయిన, అతి సాధారణమైన, స్పందన అవసరం అనిపించని మామూలు విషయమే అయిపోతుంది.
*
Well written.
అమానుషత్వమే సాధారమౌతున్న వేళ…మీ స్పందన చాలా బాగుంది వేణుగారు.నిజంగా ప్రతి ఒక్కరుకూడా అలోచించి అర్ధం చేఇసుకోవాల్సి వుంది..