రాజకీయాలంటే ప్రజానుకూలంగానూ, పూర్తి న్యాయబద్ధంగానూ వుండాలనే విషయం మనం ఎప్పుడో మరిచిపోయాం. ఆ ఊహే విడ్డూరంగా అనిపిస్తుంది. అధికారంలోకి వచ్చి ప్రభుత్వాలు ఏర్పరిచే పార్టీలకు ప్రజల పట్ల జవాబుదారీతనం వుండాలని ఆశించటం భయంకరమైన దురాశగా కూడా అనిపిస్తుంది. రాజకీయాలు నీతిమంతంగా వుండాలనే ఆలోచన రాగానే “ఏమిటీ పిచ్చి ఆలోచనలు?” అని మనల్ని మనమే మందలించుకునే పరిస్తితికి చేరుకున్నాం. కానీ రాజకీయాలకి సిగ్గుకీ లేశ మాత్రమైనా సంబంధం వుండాలని మాత్రం పిచ్చి ఆశ మాత్రం అప్పుడప్పుడూ అయినా కొందరికైనా కలగక మానదు. ఏం చేస్తాం మనిషి ఆశాజీవి కదా!
అభివృద్ధి అంటే కట్టడాలేనా? అభివృద్ధి అంటే జన జీవితంలో విద్య, వైద్యం, నివాసం, ఆరోగ్యవంతమైన పరిసరాలతో కూడిన సాంఘీక కల్లోలాలు లేని వాతావరాణంతో మానవ వికాస అభివృద్ధి సూచిక పైపైకి ఎగబాకటం కాదూ? ఇది లక్ష్యంగా పెట్టుకునే సంగతి పక్కన పెట్టండి అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వానికైనా ఈ దిశగా కనీసం ఆలోచన వుందా? కొత్త కట్టడాలే అభివృద్ధికి సూచిక అని మనల్ని పాలకులు నమ్మించటానికి ప్రయత్నిస్తుంటారు. ఈ బూకరింపులకి మీడియా వత్తాసు ఎలాగూ వుంటుంది. ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట పది రూపాయిలు ఖర్చు చేయటంలో వున్న లొసుగు ఏమిటో అందరికీ తెలిసినదే.
అసలు ప్రపంచం మొత్తం మీద ప్రజాస్వామిక వ్య్వవస్థ పేరుతో ప్రజల పట్ల కనీసం జవాబుదారీతనం వుండని పాలకులు మనుగడ సాగించే విషయంలో భారతదేశంతో పోటీపడగల మరో దేశం వుండదేమో! ప్రజలంటే వోట్లు వేసేవాళ్ళుగానో, లేదా తామెలా పాలిస్తే అలా పాలించబడే వాళ్ళుగానో వుండాలని భావించే “ప్రజాస్వామిక” పాలకులు భారతదేశానికే ప్రత్యేకమేమో.
****
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు దేశంలోనే అత్యంత సంపన్నవంతమైన రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఇంకేముంది బంగారు తెలంగాణ వచ్చి ప్రజల జీవితాల్లో బంగారు పళ్ళేల చప్పుళ్ళు వినబడతాయనే అందరూ ఆశపడ్డారు. ప్రజల జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదు కానీ తెలంగాణ రాజకీయ నాయకుల జీవితాల్లో మాత్రం గొప్ప మార్పులొచ్చాయి. పార్టీలు ఫిరాయించిన వారి జీవితాల్లో ఐతే మరిన్ని గొప్ప మార్పులొచ్చేసాయి. అంతేనా? అంతేనా అంటే ఇంకా చాలా వుంది! సెక్రటేరియట్ పడగొట్టేసి కొత్త సెక్రటేరియట్ కడతారట. రవీంద్రభారతిని పడగొట్టేసి ఇంకో కొత్త రవీంద్రభారతిని కడతారట. “గుట్ట” అని ప్రజలు ప్రేమగా పిలుచుకునే యాదగిరిగుట్టని “యాదాద్రి” అన్న సంస్కృతాంధ్ర పేరుతో పునర్నిర్మిస్తారట. టాంక్ బండ్ చుట్టూ ఆకాశహర్మ్యాలు లేపుతారట. అదేమిటో కానీ ఇవేం జరక్కుండానే రాష్ట్రం మాత్రం 2.50 లక్షల కోట్ల అప్పుల పాలైంది. అసలు ప్రజలకి ఏం కావాలి? కొత్త భవంతులా? రోడ్ల మీద పోతూ పోతూ ఆ పెద్ద భవంతుల్ని, గుళ్ళని చూస్తూ పోతే వారి జీవితాల్లో మౌలిక మార్పులొస్తాయా? ఈ కళ్ళు చెదిరే భవంతులు, నిర్మాణాల వల్ల వారి జీవితాల్లో “మానవ వికాస సూచిక” ప్రకారం అభివృద్ధి జరుగుతుందా? అసలు అభివృద్ధి అనేది రోడ్ల మీద జరగేదానికంటే మంచి ఆరోగ్యం, విద్య, శుభ్రమైన వాతావరణం, వలసల నివారణ వంటి అంశాల మీద ఫోకస్ తో కుటుంబం లోపల జరగాల్సిందనే ఎరుక పాలకులకు వుంటుందా అసలు? రాజుల పరిపాలనలో వారు నిర్మించిన కట్టడాలెక్కినంతగా ప్రజల కష్టాలు చరిత్రకెక్కవు. ప్రజల రక్తాన్ని తాగైనా సరే రాజులు నిర్మించిన భవంతులే వారి అభిరుచికి, పాలనా దక్షతకి తార్కాణంగా చరిత్రలో నిలిచిపోయే దౌర్భాగ్యపు చారిత్రిక దృష్టి కదా మనది. సరిగ్గా అదే పంథాని ఇప్పటి పాలకులు కూడా అనుసరిస్తున్నారు. గొప్ప పరిపాలకుడిగా కంటే కూడా గొప్ప భవనాల నిర్మాతలుగా చరిత్రలో నిలిచిపోవటానికి కృషి చేస్తున్నారు. పైగా ఈ నిర్మాణాల్లో ఎవరికేం లాభమనేది బహిరంగ రహస్యం కూడా.
నిరుపేద, దిగువ మధ్య తరగతికి, సాంఘీకంగా బడుగు కులాలకు చెందిన క్రీడాకారుల కష్టాల్ని పట్టించుకోలేని పాలకులు టెన్నిస్, బాడ్మింటన్ క్రీడాకారుల మీద కోటానుకోట్లు కుమ్మరించేస్తారు. ఒక్క కోటి రూపాయిలతో సంక్షోభంలో వున్న వందమంది బువ్వ పెట్టే రైతుల జీవితాలు ఉపశమనం పొందుతాయన్న ఇంగితం కూడా ఉండదు వీళ్ళకి. ఎక్కడి నుండి వస్తున్నదా సొమ్ము? ఏ దేశానికైనా ప్రధాన ఆదాయ వనరు ఆదాయ పన్ను కాదు. అమ్మకపు పన్ను, ఆస్తి పన్నులే. ఇవి అతి నిరుపేదల కష్టార్జితం నుండి కూడా వచ్చేవే. ఈ దేశంలో పన్ను చెల్లించని వాళ్ళంటూ ఎవరూ లేరు. బిచ్చగాళ్ళు కూడా పన్ను చెల్లింపుదారులే. అందుకే ప్రజల నుండి వచ్చిన ప్రతి పైసా పట్ల జవాబుదారీతనంతో పాలకులు వ్యవహరించాలి.
గవర్నర్లు వంటి వారి తిరుమల సందర్శనాల సంగతి సరే సరి! ఓ సారి ముఖ్యమంత్రి గారు యజ్ఞం చేసారు. యజ్ఞ వేదిక నిర్మాణం ఖర్చు, వేద పండితుల ఖర్చు ఆయనో లేదా వాళ్ళ పార్టీనో పెట్టుండొచ్చు. కానీ అక్కడికి హాజరైన వీవీఐపీల ఖర్చు ప్రజల కష్టార్జితం నుండి పెట్టింది కాదా? వారి వందిమాగధుల ఖర్చు, విమానాలు, హెలికాప్టర్లు, కార్లు, ఇంకా ఇతర లాజిస్టిక్స్, పోలీస్ సెక్యూరిటీ, ప్రభుత్వ సిబ్బంది విధులు…. ఇలా వందల కోట్ల రూపాయిల దుర్వినియోగం ప్రజాద్రోహం, ప్రజల పట్ల బాధ్యతారాహిత్యం కాదా? ప్రత్యేక తెలంగాణ వచ్చినందుకు తిరుపతి వెంకన్నకి ప్రభుత్వ ట్రెజరీ నుండి కోట్ల రూపాయిల మొక్కు తీర్చుకొచ్చారాయన. ఎన్ని సామాన్య ప్రజల జీవితాలు బాగుపడి వుండేవి నిజంగా ఆ సొమ్ముతో! అంతేకాదు తొమ్మిది ఎకరాల్లో 50 కోట్ల రూపాయిల ఖర్చుతో ముఖ్యమంత్రి అధికార నివాసం నిర్మించుకున్నారాయన. రాష్ట్రం అంతా డెంగ్యూ జ్వరాలు కాల్చేస్తుంటే ఘోరంగా చేతులెత్తేసారు పాలకులు, అధికారులు. “ఇంటి చుట్టూ డ్రమ్ములు, పూల కుండీల్లో నిలువ నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోండి” అని ఓ ఉచిత సలహా పడేసారు యువరాజా వారు. తన ఇంటి చుట్టుపక్కల తానెలా శుభ్రం చేయిస్తున్నదీ వీడియో పెట్టారాయన. ప్రభుత్వాల బాధ్యత ఇంతేనా? జ్వరాలతో ప్రజలు ఇంతగా వణికిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదంటూ హైకోర్ట్ ప్రశ్నించింది. “అసలు మంత్రులు, అధికారులు కనీసం పేపర్ చదువుతారా?” అంటు ఈసడించింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటో తెలియచేయమని గట్టిగా నిలదీసింది. ఇవన్నీ పాలకులకు పట్టవు కానీ మత పెద్దల కనుసన్నల్లో దేవాలయాల నిర్మాణాలకి పూనుకుంటారు. నేనిక్కడ ప్రభుత్వ వైఫల్యాల గురించి చెప్పటం లేదు. బాధ్యతారాహిత్యం గురించి చెబుతున్నా. ఎందుకంటే బాధ్యతారాహిత్యం వల్లనే వైఫల్యాలు సంభవిస్తుంటాయి. ఏ మాత్రం ముందు చూపు లేకుండా ఆర్టీసి కార్మికుల సమ్మెతో వ్యవహరించే ధోరణి, నల్లమలలో యురేనియం తవ్వకాల విషయానికి సంబంధించి నిలకడలేమి కూడా బాధ్యతారాహిత్యంలో భాగమే. ఈ ధోరణి ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేయటానికి, అభద్రతతో బతకటానికి దారి తీస్తున్నాయి. అయితే ఈ బాధ్యతా రాహిత్యాన్ని తేల్కగా తీసుకోవటానికి లేదు. ప్రతి నిర్మాణం వెనుక పెట్టుబడి వుంటుంది. పెట్టుబడి వెనుక అభివృద్ధి చెందిన దేశాల ప్రయోజనమూ వుంటుంది.
****
అదే రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరికీ అతి పెద్ద సమస్యగా రాజధాని నిర్మాణం అని నమ్మించటంలో చంద్రబాబు నమ్మించగలిగారు. అసలు రాష్ట్ర విభజన జరగంగానే ఆయన మొదట వ్యాఖ్యానించింది కొత్త రాజధాని నిర్మాణానికి నాలుగు లక్షల కోట్ల రూపాయిలవసరం అవుతాయని. “ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే….” అన్న సామెత గుర్తుకు రావటం లేదు మీకు? ఆయన అయిదేళ్ళ పాటూ అమరవాతి నిర్మాణ నామజపమే చేసారు. కేంద్రం నుండి సహకారం రాలేదనే చక్కటి సాకు దొరికిన మాట వాస్తవమే కానీ పరిపాలనకి, రాష్ట్ర ఆదాయానికి నిజంగానే ఒక నగర నిర్మాణమే కావాలా? అది కూడా వేలాది ఎకరాల్లో ఆరు పంటలు పండే పచ్చటి పంట పొలాలు ధ్వంసం చేసి నిర్మించాలా? పర్యావరణాన్ని హత్య చేయాలా? నిజానికి మనం పదే పదే అనుకోవాల్సింది నిర్మాణాల్లో వున్న కాంట్రాక్టు లొసుగులు, ఆ లొసుగుల్లో వున్న అమ్యమ్యా వ్యవహారాల గురించే. అసలు ఇప్పుడున్న రాజకీయ, ఆర్ధిక పరిస్తితుల్లో అలా ఒక ప్రపంచస్థాయి నగర నిర్మాణానికి వున్న ఫీజిబిలిటీ ఎంత? ఇదంతా అనవసరం పాలకులకి. ఏ మేరకి నిర్మాణం జరిగితే ఆ మేరకి లాభం. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం! అంతే. అంతేకాకుండా కరకట్ట మీద చేసిన అక్రమ నిర్మాణాంలో నివాసం ఏర్పరుచుకోవటం ఆయనకి అసలు ఒక సూత్రబద్ధ వైఖరి లేదనటానికి నిదర్శనం. ఇంక ఆయన ప్రచార యావ ఎంతటిదో అందరికీ తెలిసిందే. ఢిల్లీలో అదేదో ఒక్కరోజు ఊడబొడిసిన “ధర్మపోరాట దీక్ష” కోసం ఆయన ప్రభుత్వం మొత్తంగా పది కోట్ల రూపాయిల బడ్జెట్ విడుదల చేసిందట. హైకోర్టు మరోసారి నిర్ఘాంతపోయింది పాలకుల ఆర్ధిక దమనచర్యలకి.
బాబుగారి స్థానంలో అధికారంలోకి వచ్చిన జగన్ గారు వరద ముంపు వల్ల అమరావతి ప్రాంతం రాజధానికి పనికి రాదు కాబట్టి కొత్త రాజధాని ప్రాంతం కోసం నిపుణుల కమిటీ వేస్తున్నారట. (ఆ ప్రాంతంలో వరద ముంపు ఇంతకు ముందు ఎప్పుడు సంభవించిందో మరి ఆయనకే తెలియాలి) అవును మరి ఎవరి ఆదాయ వనరు ఖాతాలు వారికుండాలి. అంటే మళ్ళీ కొత్త నాటకం మొదలవబోతుందన్న మాట. ఆ విధంగా పరిపాలనంటే కొత్త భవంతుల నిర్మాణం అన్నమాట. దీనికి తోడు అదనంగా ఆయన ప్రభుత్వ విద్యావ్యవస్థని పటిష్టం చేయాల్సింది పోయి ప్రైవేటు విద్యా పెట్టుబడిదారులకు కొత్త ఉత్సాహం ఇచ్చేలా “అమ్మ ఒడి” పథకం పేరుతో వేల కోట్ల రూపాయిల ప్రజా ధనాన్ని వృధా చేయటానికి సిద్ధం అవుతున్నారు. ఈయన చేస్తున్నదేంటయ్యా అంటే ఆయన చేసినవన్నీ రద్దు చేసి ఈయన “స్వంత మార్గం” ఈయన నిర్మించుకోవటమే.
****
నేనేదో ఈ రెండు తెలుగు రాష్ట్రాల గురించి ముఖ్యంగా చెబుతున్నా కానీ ప్రజాధన దుర్వినియోగం దేశ వ్యాప్త ఫినోమినా. పార్లమెంట్ సభ్యుల జీతాలు ఇబ్బడి ముబ్బడిగా పెంచుకుంటున్నారు. ప్రతి అసెంబ్లీలోనూ సభ్యుల జీతాలుపెంచుకుంటూ తీర్మానాలు చేసుకుంటున్నారు. సామాన్య ప్రజల్ని గ్యాస్ సబ్సిడీలు వదులుకోమని ప్రోద్భల పరుస్తూనే పాలకులు మాత్రం తమ అలవెన్సుల్ని, సౌకర్యాల్ని, భోగాల్ని ఇష్టారాజ్యంగా పెంచుకుంటున్నారు. (అన్నట్లు దేశం మొత్తం మీద అత్యధిక వేతనం తీసుకుంటున్న ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? ఇంక వేరెవ్వరు? నెలకి రూ.5.10 లక్షల రూపాయిలతో అగ్రస్థానంలో వున్నారు మన శ్రీమాన్ తెలంగాణ ఉద్యమ ముఖ్యమంత్రిగారు. రూ.3.35 లక్షలతో నాలుగో స్థానంలో అతి నిరాడంబర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారున్నారు ) అప్పు తీర్చకపోతే రైతుల ఇంట్లోంచి సామాన్లు బైటకి విసిరేయించే బాంకుల (ఎస్.బీ.ఐ.) ద్వారా మొన్నీ మధ్యనే బకాయిలు తీర్చని కేవలం 220మంది ధనికులకి చెందిన 76వేల కోట్ల రూపాయిల బకాయిల్ని ఒక్క కలంపోటుతో రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. కాకుల్ని కొట్టి గద్దలకి వేయటమంటే ఇది కాదూ? ఎంతటి బరితెగింపుతనం నిజంగా!!
ఇప్పుడు ఢిల్లీలో కొత్తగా పార్లమెంట్ భవనం, సెంట్రల్ సెక్రటేరియేట్ భవనం, ఎం.పీ.ల అవసరాల కోసం కొత్త భవన నిర్మాణం చేపట్టారు. 2024కల్లా ఈ నిర్మాణాలు పూర్తవుతాయట. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 12450 కోట్ల రూపాయిలు! కోట్లాదిమంది దేశ ప్రజలకి ఉపయోగపడే ఎన్ని ప్రాజెక్టులు చేపట్టొచ్చు ఈ సొమ్ముతో? (అన్నట్లు కన్సల్టెన్సీ బాధ్యతల్ని ఓ గుజరాతీ కంపెనీకే ఇచ్చారట. ఎవరికీ చెప్పకండేం! అసలు పెద్దగా అనకండేం! ఎలాగోలా దేశ సైనికుల ప్రస్తావన తెచ్చి మిమ్మల్ని దేశద్రోహుల జాబితాలో తోసేయగలరు.) ఇన్ని వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న వ్యవస్థలో, ఇంత నిరక్షరాస్యత, వైద్య సహాయ లేమి, ప్రజా రవాణ రాహిత్యం, పోషకాహార లోపం, పేదరికం వంటి ఎన్నో సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దేశంలో పాలకుల భోగ లాలసత్వం, విలాసవంత నిర్మాణాలు, వందల అడుగుల ఎత్తులో లోహ విగ్రహాల ప్రతిష్టాపన, బుల్లెట్ ట్రెయిన్లు, భారీ నగర, భవనాల నిర్మాణాలు చేపట్టడం!!…..ఏమనాలి వీళ్ళని? చరిత్రలో ఏ విదేశీ పాలకుడైనా ప్రజలకి ఇంతటి అన్యాయం చేసాడా? ప్రజల పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించాడా?
ప్రజలు నిలదీయనంత కాలమూ పాలకులు జవాబుదారీతనానికి ఆమడ దూరంలో హాయిగా వుంటారు. అభివృద్ధి అంటే మానవీయ కోణంలో ప్రజలకి సంబంధించిందిగా కాకుండా (లేని) సంపద ప్రదర్శన ప్రాతిపదికగా, పాలకుల వ్యక్తిగత ప్రతిష్టల్ని పెంపొందింపచేసేదిగా వున్నంత కాలం ప్రజలు లేమిలోనూ, పాలకులు కలిమిలోనూ వుండటం తధ్యం. అంతే కాదు మన సామాజిక, ఆర్ధిక వ్యవస్థలకి సరిపడని కాంక్రీట్ నిర్మాణాల అభివృద్ధి నమూన వెనుక అగ్ర రాజ్యాల, అభివృద్ద్ధి చెందిన దేశాల వ్యాపార ప్రయోజనాలు వుండటం యాధృఛ్ఛికం అయితే కాదు. ఇది కూడా మనం లోతుగా ఆలోచించాల్సిన విషయం.
*
Very very valuable analysis. I wish, every individual should become aware of all such facts.
Thank you prasad garu!