ఆఫీసు ఇంటికొచ్చేసరికి రాత్రి తొమ్మిదయ్యేది. నెలలో దాదాపు పది రోజులు ప్రయాణాల్లో గడపాల్సి వచ్చేది. నాలాంటి వాళ్లను వెతుక్కుంటూ వచ్చింది లాక్‌డౌన్. అనూహ్యంగా వరించిన ఆ గృహనిర్బంధానికి నాకన్నా ఎక్కువ సంతోషించింది నా శ్రీమతి రాజ్యలక్ష్మి. మా అమ్మాయి హిమవర్ష, అబ్బాయి భాస్వంత్‌లూ ఇంటికే పరిమితమయ్యారు. ఎప్పట్నుంచో పెండింగ్‌లో ఉండిపోయిన ఒక్కో పుస్తకాన్నే చదవటం మొదలు పెట్టాను. అప్పుడప్పుడూ రాయటం, పిల్లలతో కబుర్లు, ఇంటిపనిలో శ్రీమతికి సహకారం… ఒక కొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. కానీ, రోజులు గడిచేకొద్దీ పరిస్థితులు చిత్రంగా మారిపోయాయి. అందరి మధ్యా మా ఆవిడ ‘ఒంటరి’దై పోయింది. ‘‘ఇంతకన్నా మీరు ఆఫీసుకీ, అమ్మాయి కాలేజీకి వెళ్లినప్పుడే బాగుంది’’ అని ఓరోజు ఆమె అత్యంత శాంతంగా బద్దలైంది. అదిగో, అప్పుడు నిజాయితీగా రాసిన కథ ఇది.
- -ఎమ్వీ రామిరెడ్డి
విశ్రాంతి కరవైన ఇల్లాలి నిట్టూర్పులా భారంగా నడుస్తోంది లాక్‌డౌన్.
ప్రభుత్వ నిబంధనల కన్నా భానుడి కట్టడి కారణంగా వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి.
కొడుకు భాస్వంత్‌తో కలిసి హాల్లో క్యారమ్స్ ఆడుతున్నాడు వెంకట్. కాయిన్స్ పడినప్పుడల్లా ఇద్దరూ కేరింతలు కొడుతున్నారు. కూతురు హిమవర్ష సోఫాలో కూర్చొని లాప్‌టాప్‌లో మునిగిపోయింది. మధ్యమధ్యలో ఫోన్ మాట్లాడుతోంది.
లంచ్ తర్వాత పది నిమిషాలు నడుం వాల్చి, లేచి, అపార్ట్‌మెంటుపైకి వెళ్లి ఆరేసిన బట్టలు తెచ్చి, మడతబెట్టి, టీ పెట్టి, భర్తకూ కూతురికీ చెరో కప్పు ఇచ్చి, తనూ ఓ కప్పు తాగింది రాజ్యలక్ష్మి.
ఖాళీకప్పులు సింక్‌లో పడేసి, బుక్‌ర్యాక్‌లోంచి పుస్తకం తీసుకుని కుర్చీలో కూర్చొని వట్టికోట ఆళ్వారుస్వామి ‘జైలు లోపల’ కథలు చదవడం మొదలు పెట్టింది.
కూతురు కోయంబత్తూరులో హాస్టల్లో ఉండి, సోషల్‌వర్క్‌లో పీజీ చదువుతోంది. కొడుకు ఎనిమిదింటికే స్కూలుకెళ్తాడు. భర్త ఉదయం ఆఫీసుకి వెళ్లగానే ఇంటిపని పూర్తి చేసుకుని లంచ్ చేశాక, ప్రతిరోజూ గంటసేపైనా ఏదో ఒక పుస్తకం చదవటం ఆమె అలవాటు.
నయం, పుస్తకాలు చదివే అలవాటుండబట్టి బుర్ర భూతాలకొంప కాలేదు.
భర్త ఉద్యోగం తప్ప మరో ఆధారం లేదు. జీతం రాగానే సాదా ఖర్చులకు మాత్రమే ఉంచుకుని మిగతాదంతా తన చేతిలోనే పెడతాడు. పొదుపుగా వాడేది. రెండు చిట్టీలు కట్టి, బ్యాంకులోను తీసుకుని రెండేళ్ల క్రితమే ఆ అపార్టుమెంటులో రెండు పడగ్గదుల ఫ్లాట్ కొనుక్కున్నారు.
కథ సగం కూడా పూర్తి కాకముందే ‘‘కన్నయ్యా, నీకిప్పడు పకోడీలు తినబుద్ధి అవుతుంది కదూ’’ అన్నాడు వెంకట్ తన కొడుకు వంక కొంటెగా చూస్తూ.
‘‘అవున్నాన్నా, నాకిప్పుడు పకోడీలు కావాలి’’ అన్నాడా కుర్రాడు తండ్రికి వంత పాడుతూ.
‘‘నాకూ కావాలి’’ కూతురు కూడా గళం కలిపింది.
రాజ్యలక్ష్మి అయిష్టంగానే పుస్తకంలో బుక్‌మార్కర్ పెట్టి, వంటగదిలోకి నడిచి, ఉల్లిపాయలు తరగటం మొదలు పెట్టింది. ఉల్లిఘాటు తీగసాగి మనసులోకి దిగుతోంది.
విధినిర్వహణలో భాగంగా భర్త నెలలో అయిదార్రోజులైనా టూర్లలో ఉంటాడు. మిగతా రోజుల్లో ఇంటికి చేరేసరికి రాత్రి తొమ్మిది దాటుతుంది. భాస్వంత్‌తోనే కాస్తో కూస్తో కాలక్షేపం.
ఆరోజు మధ్యాహ్నం భర్త ఫోన్‌చేసి ‘‘హిమవర్షను అర్జెంటుగా హాస్టలు ఖాళీ చెయ్యమన్నారట. రాత్రి ఫ్లైటుకు బుక్ చేశాను, వచ్చేస్తోంది’’ అని చెప్పాడు.
రాజ్యలక్ష్మి ఎగిరి గంతేసినంత పనిచేసింది. కూతురంటే ప్రాణం ఆమెకు. ప్రతిరోజూ తను పుస్తకం చదవటం పూర్తయ్యే సమయానికి కూతురు ఫోన్జేస్తుంది. ఆరోజు ఏమేం క్లాసులు జరిగాయో, ఎలా జరిగాయో చెబుతుంది. ఉదయం ఉపాహారం గురించి, మధ్యాహ్నం ఉడకని ఆలూబిర్యానీ గురించి, స్నేహితుల పుట్టినరోజుల గురించి పూస గుచ్చినట్టు వివరిస్తుంది.
మూడు నెలలైంది కూతుర్ని చూసి. ‘ఓసారి వెళ్లి వద్దా’మని భర్తను సతాయించింది.
‘‘పదిరోజల్లో ఫైనల్ ఎగ్జామ్స్. ఇరవై రోజుల్లో సామాను సర్దుకుని వచ్చేస్తుంది. ఇప్పుడెందుకు వెళ్లటం?’’ అన్నాడు. కరోనా కారణంగా ఇప్పుడా పరీక్షలు వాయిదా పడ్డట్టున్నాయి.
హిమవర్ష విమానం దిగి, క్యాబ్‌లో ఇంటికొచ్చేసరికి అర్ధరాత్రి దాటింది.
ఆ సమయంలో… కూతురికిష్టమైన గుంటపునుగులు వేసి పెట్టింది.
‘రూరల్ క్యాంప్ ఎలా జరిగింది? వైవా ఎప్పడుంటుంది? క్యాంపస్ ప్లేస్‌మెంట్లు ఇంకా ఉన్నాయా?’ భర్త కూతురి కెరియర్‌ను స్కానింగ్ తీశాడు.
‘బట్టలెలా ఉతుక్కుంటున్నావు? తలస్నానం ఎలా చేస్తున్నావు? రాత్రిపూట ఎన్నింటికి పడుకుంటున్నావు? హాఫ్‌బాయిల్డ్ కూరలు తినబుద్ధి అవుతుందా?’ అంటూ ఆరా తీసిందామె.
రెండ్రోజుల తర్వాత హైదరాబాదులోనూ లాక్‌డౌన్ ప్రకటించి, కంపెనీలు మూసేశారు.
భర్త కూడా ఇంట్లోనే బందీ అయ్యాడు. కొడుక్కి స్కూలెలాగూ మూసేశారు.
చాలా కాలం తర్వాత భర్త, పిల్లలు ఇంట్లో తన కళ్లముందే ఉండిపోవటంతో ఆమెకి కోవిడ్ వైరస్ పెద్ద ప్రమాదకారిలా అనిపించలేదు.
ఏళ్ల తరబడి మనసుమూలల్లో గుట్టలుగా పేరుకుపోయిన కబుర్లను భర్తతో పంచుకోవటం మొదలు పెట్టింది. పిల్లలకు కథలు చెప్పటం ప్రారంభించింది.
నాలుగైదు రోజులు పర్వదినాల్లా గడిచిపోయాయి.
వెంకట్ ఉదయాన్నే బయటికెళ్లి పాలప్యాకెట్లు, కూరగాయలు తెచ్చేవాడు.
కాఫీపెట్టి ఇచ్చేవాడు. కూరగాయలు తరిగేవాడు. దోసెలు వేసేవాడు. ఇల్లు తుడిచేవాడు.
పిల్లలు ఆమె చెప్పే కథలు ఆసక్తిగా వినేవారు. పద్యాలు నేర్చుకునేవారు.
రోజులు గడిచేకొద్దీ వంటపని మీద ఆయనకీ, కథల మీద పిల్లలకీ విసుగు పుట్టింది.
వాళ్లు ఇంట్లోనే తమ ప్రపంచాన్ని నిర్మించుకున్నారు.
డిజిటల్ టెక్నాలజీకి మొక్కులు చెల్లించి; తెలుగు, హిందీ, ఇంగ్లిషు సినిమాలకు తెరదీశారు.
వాళ్ల సరదాకు ఆటంకం కలిగించకుండా పదిరోజులు ఇష్టంగా వారికి అన్నీ చేసిపెట్టింది.
ఉదయం ఆరున్నరకే లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, వాకిలి ముందు ముగ్గేసి, బయట తాళం వేసి, మాస్కు పెట్టుకుని రోడ్డు మీదికి వెళ్లి, పాలప్యాకెట్లు, పండ్లు తీసుకొచ్చి, అరగంట సేపు ఓ ఛానెల్లో వస్తున్న మహాభారతం చూసి, ఎనిమిది గంటలకు భర్తనూ పిల్లల్నీ లేపి, ఇద్దరికీ కాఫీ; పిల్లలకు పాలూ కలిపి, బట్టలుతికి, టిఫిన్ తయారు చేసి, నలుగురూ కూర్చొని తింటారు.
ఆనక, వాళ్లు హాట్‌స్టార్‌కో నెట్‌ఫ్లిక్స్‌కో ప్రైమ్ వీడియోకో అంకితమైపోతారు.
తను కుర్చీలూ సోఫాలూ కిటికీలూ పొడిబట్టతో తుడిచి, ఇల్లూడ్చి, గదులన్నిటినీ తడిబట్టతో శుభ్రంజేసి, వాష్‌రూములు కడిగి, స్నానంజేసి, కూరగాయలు కోసి, మిక్సీ వేసి, కుక్కర్ ఆన్‌జేసి… మధ్యాహ్న భోజనం సిద్ధం చేస్తుంది.
ఒకటిన్నర సమయంలో మంచినీళ్లతో సహా అన్నీ తెచ్చి హాల్లో పెడుతుంది.
ముగ్గురూ హడావుడిగా కాళ్లుచేతులు కడుక్కొని వచ్చి, తింటూనే సినిమాను కొనసాగిస్తారు.
తిన్న పళ్లేలు, గిన్నెలు, స్పూన్లు, గ్లాసులు సింక్‌లో పడేసి, పది నిమిషాలు నడుం వాల్చి; లేస్తూనే వంటగదిలోకి వెళ్లి, సింక్‌లోని ఎంగిలివన్నీ తోమి, నీరు వొడిసేలా వాటిని ఆరబెట్టి, పై అంతస్తుకెళ్లి ఆరిపోయిన బట్టలు తీసుకొచ్చి, బెడ్‌రూములో వేసి, వేటికవి వేరుచేసి, మడతలు పెట్టి, బీరువాలో సర్ది, టీ పెట్టి భర్తకూ కూతురికీ ఇస్తుంది. తనూ తాగుతుంది.
మధ్యమధ్యలో ‘నాకు మైసూరుపాక్ కావాలి’ అని కొడుకు, ‘కజ్జికాయలు కావా’లని కూతురు, ‘గారెలు కావా’లని భర్త కోర్కెల చిట్టాలు విప్పుతుంటారు.
అదేదో తన బాధ్యత అన్నట్టు సమయం గణించుకుని చేసిపెడుతూనే ఉంది.
కానీ, లోపల ఏదో కదలిక మొదలైంది.
శక్తి సన్నగిల్లుతున్నట్లు, ఒకే పాట పదేపదే పాడుతున్నట్లు, గతించిపోయిన దృశ్యాలే మళ్లీ మళ్లీ కళ్లముందు ప్రత్యక్షమవుతున్నట్లు… ఏదో విసుగు! తెలియని అయిష్టం!
బట్టలు మడత పెడుతుంటే చేతులు నొప్పి పుడుతున్నట్లు అనిపిస్తోంది.
కూరగాయలు కోస్తుంటే భుజాలు పీక్కుపోతున్నట్లు అనిపిస్తోంది.
రావిచెట్టు నుంచి రాలిన పండుటాకు గిరికీలు కొడుతూ భూమ్మీద వాలినట్లు… ఏదో అసంతృప్తి మెల్లగా ఆమె మనసులోకి జారుతోంది.
ఇల్లు తుడుస్తుంటే నడుం ఒంగిపోయి, మళ్లీ నిటారుగా లేవదేమోననిపిస్తోంది.
వంట చేస్తుంటే పట్టుబడిన విద్యేదో పత్తా లేకుండా పోతున్నట్లనిపిస్తోంది.
గానుగెద్దు కాడి దించేస్తున్నట్లు, బావిలోని కప్ప పైకి ప్రయాణం ప్రారంభించినట్లు, ఒంటరి గొర్రె కట్టు తెంచుకోటానికి సిద్ధమైనట్లు… వింత భావనలు!
‘‘అమ్మా, పకోడీలు రెడీనా?’’ కొడుకు కేకతో ఆలోచనలు చెదిరిపోయాయి.
పకోడీలు పళ్లేల్లో పెట్టి తీసుకొచ్చేపాటికి క్యారమ్ బోర్డును పక్కనబెట్టి, ముగ్గురూ హిందీ సినిమా చూస్తున్నారు. వాళ్లు టీవీ నుంచి కళ్లను విడదీయకుండానే పకోడీలు ఆరగించారు.
ఆమె ఒక్కో పకోడీ తింటూ మిగతా కథ పూర్తి చేసింది.
మరుసటి రోజు త్వరగా పని తెముల్చుకుని, ఉదయం పదకొండు గంటలకంతా హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని, పేపరు చేతుల్లోకి తీసుకుంది.
‘‘ఏమోయ్, ఇవ్వాళ రెండోకప్పు కాఫీ ఇంకా రాలేదు?’’ వెంకట్ అడిగాడు భార్యవైపు చూస్తూ.
ఆమె మాట్లాడలేదు.
‘‘అమ్మా, నాకు శాండ్‌విచ్ కావాలి’’ భాస్వంత్ మారాం.
రాజ్యలక్ష్మి పేపర్లోంచి తలెత్తలేదు.
‘‘అమ్మా, సాయంత్రం గుంట పునుగులేస్తావా?’’ హిమవర్ష అభ్యర్థన.
ఆమెకి చిర్రెత్తుకొచ్చింది. పేపర్ విసిరికొట్టింది.
‘‘ఏమనుకుంటున్నారు మీరు? యంత్రంలా కనిపిస్తున్నానా? కామధేనువు ననుకున్నారా? తప్పదని భావించి సమయానికి వండి వారుస్తున్నా. తినుబండారాలూ తీరుస్తున్నా. కానీ, నేనొకదాన్ని ఉన్నానని మీకు గుర్తుందా?’’
టీవీ మ్యూట్‌లో పెట్టి ముగ్గురూ ఆమె వంక చిత్రంగా చూస్తుండిపోయారు.
‘‘మీకు ఆఫీసుంటేనే నయం. టంఛన్‌గా రెండింటికి ఫోన్జేసి భోంచేశావా అనడుగుతారు. భాస్వంత్ గాడు నాలుగింటికి ఇంటికొచ్చి నోరారా ముచ్చట్లు చెబుతాడు. సరిగ్గా అయిదింటికి హిమ ఫోన్జేసి, ‘అమ్మా, ఈరోజు రెండు క్లాసులే జరిగాయి. నా రూమ్మేట్ హన్నా బర్త్‌డే, బిర్యానీ తిన్నాం. కొత్త స్కిట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాం’ అంటూ ముఖ్యమైన వార్తలన్నీ చదివేస్తుంది…’’
టీవీ ఆఫ్ చేశారు.
‘‘కరోనా ఎట్టబోతే నాకెందుకు, మా ఆయనా పిల్లలూ నా కళ్లముందున్నారు చాలనుకున్నాను. కానీ, మీ ప్రపంచంలో మీరు మునిగిపోయారు. ఇంట్లోనే నేను ఒంటరి ద్వీపాన్నయ్యాను…’’
ముగ్గురూ అలాగే చూస్తూండిపోయారు.
%%%%%%
రాత్రి సరిగా నిద్ర పట్టకపోవటంతో రాజ్యలక్ష్మికి ఏడింటి దాకా మెలకువ రాలేదు. లేచి చూసేసరికి, భర్తా పిల్లలూ అప్పటికే ఏవేవో పనుల్లో మునిగిపోయారు.
వాళ్లవంక నోరెళ్లబెట్టి చూస్తూ నిలబడింది.
‘‘డియర్, అర్జెంటుగా బ్రష్ చెయ్’’ ఆదేశించినట్లు అన్నాడు వెంకట్.
ఆమె వాష్‌రూముకు వెళ్లి, ఆశ్చర్యపోయింది.
సింక్ దగ్గరున్న అద్దం అంత శుభ్రంగా ఉండటాన్ని కూడా వింతగా చూసింది.
ఆమె బ్రష్ చేసుకుని వచ్చేసరికి కాఫీ కప్పుతో సిద్ధంగా ఉన్నాడు భర్త. తనకో కప్పు అందించి, మరో కప్పు తాగుతూ నవ్వుతూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.
లోపలి సంతోషాన్ని బయటికి వ్యక్తం చేయదల్చుకోలేదు రాజ్యలక్ష్మి.
కాఫీ తాగి, ఉల్లిపాయలు కోయటానికి కిచెన్‌లోకి వెళ్లింది.
అప్పటికే అక్కడ ఆ పనిలో మునిగిపోయి ఉంది కూతురు.
‘‘అమ్మా, నువ్వు ముందు స్నానంజేసి రా’’ బలవంతంగా నెట్టింది హిమ.
ఆమె స్నానం చేసి వచ్చేసరికి… కొత్త చీర, జాకెట్, పెళ్లినాటి హారం మంచం మీద సిద్దంగా ఉన్నాయి. గబగబా కూతురు గదిలోకి వచ్చి, తల్లి కొత్తచీర కట్టుకునేదాకా వదల్లేదు.
ఆమె సరికొత్తగా సిద్ధమై వచ్చేసరికి ముగ్గురూ హాల్లో ఉన్నారు.
ఆమెను ముగ్గురూ పట్టుకుని తీసుకొచ్చి, కుర్చీలో కూర్చోబెట్టారు.
ఆ కుర్చీకి ఎదురుగా చిన్న టీపాయ్. దానిమీద అందమైన కేకు. ఆమె ఏదో అనబోయింది.
‘‘అమ్మా, నువ్వేమీ మాట్లాడొద్దు. కట్ చెయ్’’ అంది కూతురు.
భాస్వంత్ ఆమె చేతిలో ప్లాస్టిక్ నైఫ్ ఉంచాడు.
ఆమె కేక్‌ను కట్ చేయబోతుండగా ముగ్గురూ ముక్తకంఠంతో ‘హ్యాపీ బర్త్‌డే టు యూ…’ అని పాడుతూ చప్పట్లు కొట్టారు. భాస్వంత్ ఫొటోలు తీయటంలో మునిగిపోయాడు.
ఆమె కేక్ కట్ చేసి, భర్తకు తినిపించబోయింది. ముందుగా ఆయనే ఓ ముక్కను చేతిలోకి తీసుకుని, శ్రీమతి నోట్లో పెట్టాడు. తర్వాత కూతురికి, కొడుక్కి తినిపించింది.
ముగ్గురూ ఆమెకు ఘనంగా బర్త్‌డే విషెస్ చెప్పారు. ఆమె సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయింది.
‘‘ఎలా? ఎలా తయారు చేశారు కేక్?’’ అడిగిందామె ఆశ్చర్యంగా.
‘‘దీనికి మాత్రం నీ కొడుకే సూత్రధారి. నిన్నంతా యూట్యూబ్‌లో చూస్తూనే ఉన్నాడు. వాడి డైరెక్షన్‌లో నేనూ, అమ్మాయీ తయారు చేశాం’’ చెప్పాడు భర్త.
అందుకవసరమైన వస్తువులన్నీ ఎలా సిద్ధం చేసుకుందీ వివరించింది కూతురు.
రాజ్యలక్ష్మి ముగ్గురినీ ఒకేసారి కౌగిలించుకుని ఏడ్చినంత పనిచేసింది.
‘‘ఆఆ… అప్పుడే అయిపోలేదు. జీడిపప్పు ఉప్మా కూడా సిద్ధంగా ఉంది’’ అన్నాడు భర్త.
‘‘అంతేనా, మధ్యాహ్నం వంట బాధ్యత మాదే. ఏ కూర వండినా బుద్ధిగా తినాలి’’ బుంగమూతి పెట్టి చెప్పింది కూతురు.
‘‘సాయంత్రం నేనే స్వయంగా నీకు శాండ్‌విచ్ చేసిపెడతానమ్మా’’ అన్నాడు కొడుకు.
ఆనందంతో కళ్లు తుడుచుకుందామె.
వాళ్ల ప్రణాళిక ప్రకారమే ఆ రోజంతా సంబరంలా గడిచిపోయింది.
రాత్రికి తండ్రీకూతుళ్లు కలిసి వెజిటబుల్ బిర్యానీ చేశారు.
అన్నీ బాగా కుదిరాయి. ఆమె సంతృప్తిగా తిన్నది.
‘ఇవ్వాళే కాదు, ఇకపై ప్రతిరోజూ పొద్దున్నే లేచి నీ పనిని పంచుకుంటాం’ ముగ్గురూ మూడు రకాలుగా చెప్పారుగానీ, సారాంశం మాత్రం అదే!
రాత్రి తొమ్మిదిన్నరకు టీవీలో ఆమెకు అత్యంత ఇష్టమైన ‘మిస్సమ్మ’ సినిమా పెట్టారు.
సినిమా అయిపోయేసరికి రాత్రి ఒంటిగంట దాటింది.
‘‘అమ్మా, అందరం ఒకే బెడ్రూములో పడుకుందాం’’ గోముగా అడిగాడు భాస్వంత్.
‘‘అలాగే’’ ఆనందంగా ఒప్పుకుంది రాజ్యలక్ష్మి.
భర్త, పిల్లలు డబుల్ కాట్ మీద పడుకోగా, తను కింద పరుపు వేసుకొని పడుకుంది.
ఏసీ ఆన్ చేశారు. చాలా రోజుల తర్వాత ఆమె హాయిగా నిద్ర పోయింది.
%%%%%
ఫోన్ మోగటంతో మెలకువ వచ్చింది రాజ్యలక్ష్మికి.
ఉలిక్కిపడి లేచి, ఫోన్ కట్ చేసి, టైమ్ చూసింది. ఎనిమిదవుతోంది.
అంత పొద్దెక్కినా మెలకువ రానందుకు తనను తానే తిట్టుకుంటూ లేచి, లైట్ వేసింది.
‘‘అమ్మా, లైట్ ఆఫ్ చెయ్’’ కూతురు విసురుగా అనేసి, దుప్పటి నిండా కప్పుకొంది.
కొడుకైతే కదలకుండా నిద్ర పోతున్నాడు.
‘‘ఏమండీ’’ భర్తను లేపటానికి ప్రయత్నించింది.
‘‘అబ్బా, నిద్రొస్తోందే. ఒక్క అరగంట’’ అంటూ తనూ దుప్పట్లోకి ముణగదీసుకున్నాడు.
ఆమె కొన్ని సెకన్లపాటు అలాగే నిలబడి, భర్త వంకా కూతురి వంకా ఒకలా… చూసింది.
ఆమె చూపులోని, మనసులోని ఆంతర్యాన్నీ అంతర్మథనాన్నీ గ్రహించగలిగిన వారు ఈ దిగువ ఇచ్చిన వాటిలో సరైన సమాధానం ఎదుట టిక్ మార్కు పెట్టండి:
అ) ఇంటిబాధ్యతంటే బర్త్‌డే సాంగ్ కాదు
ఆ) ఇక్కడ నిర్దేశిత పనిగంటలుండవు
ఇ) మీకు తప్పినా నాకు తప్పుతుందా
ఈ) పైవన్నీ
—–0—–
ప్రస్తుతం నడుస్తున్న ఇంటింటి రామాయణం, బలే రాసారు మేము పైకి తిట్టలేక చాకిరీ చేస్తున్నాం.
Options లో అందరిదీ ఈ నే .
రాజేశ్వరి.
ధన్యవాదాలు రాజేశ్వరి గారూ.
కథ చాలా బాగుంది. కరోనా నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబాల్లోని మహిళల మనోవేదనను చక్కగా చిత్రించారు. ఇంట్లో సభ్యులంతా కలిసి పని పంచుకున్నప్పుడే ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటారనే విషయాన్ని సమర్థవంతంగా చెప్పారు.
ధన్యవాదాలు సర్
reality is always good.
Thank you very much sir.
భార్య మానసిక స్థితిని చక్కగా వివరించారు.నిరంతరం తమ కుటుంబావరికి, పుట్డినింట్లొ పెళ్ళికి ముందు. మెట్టినింట్లో పని బారం సహంగా వుంటుంది. పైవన్నీ అన్నీ అన్న ది నా సమాదానం.
భార్య మానసిక స్థితిని చక్కగా వివరించారు.నిరంతరం తమ కుటుంబానికి పుట్డినింట్లొ పెళ్ళికి ముందు. మెట్టినింట్లో పని బారం సహంగా వుంటుంది. పైవన్నీ అన్నీ అన్న ది నా సమాదానం. కరోనా సమయం ,మరింత భారం చెప్పకనే చెప్పారు ఆమెకు.మంచి కథను చెప్పినందుకు అభినందనలు💐
ధన్యవాదాలు అశ్వర్థ గారూ. మీ సమాధానంతో నేనూ ఏకీభవిస్తున్నాను.
Ramireddy garu. .. marvellous. …. andari illallonu ide paristhiti. Kadha mugimpu different and super. Choice of questions tho story ending Awasome. Story chaduvutunte andaru identify avutharu. .. nenu ayyanu. 👌
ధన్యవాదాలు శ్రీనివాస్ గారూ. అందరూ idetify అవుతున్నారనేది అక్షరసత్యం. నా ప్రయోగాత్మక ముగింపు మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు.
– ఎమ్వీ రామిరెడ్డి
Sir Very Nice “Story”. My heart is not accepting to term it as “Story”. It is a Well narrated event, i felt as if it happen in my home.
Great Work Sir.
Thanks a lot Madhusudan garu.
నాకు తోచిన నాలుగో అప్షన్.
రాజ్యలక్ష్మి చూసిన ఆ చూపులో మీకు తప్పితే నాకు తప్పుతుందా ?అని లేదు. బతుకంటే బర్త్ డే సాంగ్ కాదన్న భావమూ లేదు..ఇంట్లో గిరి గీసిన పనిగంటలు ఉండవన్న తలపూ తోసుకురాలేదు. ఒక్క సారి కన్నెర్ర చేసి, గొంతు పెంచితే చాలు, భర్తా పిల్లలూ అర్థం చేసుకున్నారు. నిన్న రోజంతా తలో చెయ్యీ వేసి, వేడుక చేశారు. అర్థరాత్రి దాటే దాకా అంతా కలిగి మిస్సమ్మ ఎంజాయ్ చేశారు. అవన్నీ తలుకుని ..ఆ ముగ్గురినీ ఆ పూట కి మన్నించింది. సరే కాసేపు నిద్రపోండర్రా అనుకుంటూ
ఎందుకె రాధా ఈసు నసూయలు..అని పాడుకుంటూ…
అలవాటైన పని లోకి అడుగుపెట్టింది..
సరికొత్తగా విశ్లేషించారు. ధన్యవాదాలు సర్.
కథ అద్భుతంగా ఉంది.
‘‘ఉల్లిఘాటు తీగసాగి మనసులోకి దిగింది’’… ఈ వాక్యమైతే ఇంట్లో ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు సఫకేట్ ఫీలయ్యే ్ప్రతివాడూ రిలేట్ చేసుకుంటాడు. ప్రతి ఇల్లూ రిలేట్ చేసుకుంటుంది.
డిజిటల్ తల్లికి ముడుపులు గట్టి ఓటీటీని టీవీ మండపంలో ప్రతిష్ఠింపజేసినట్టు రాసిన ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు… సామాన్య పదాలనూ కవితాత్మకంగా రాయడం చూసి నవ్వూ, సంతోషం రెండూ ఫీలయ్యా.
ఇక కథ ముగింపు ఎంతగా సంతృప్తినిచ్చిందో చెప్పలేను. ఇది రొటీన్ ఉపదేశాల కథ కాకుండా… రియలిస్టిక్ మానవ ప్రవృత్తులు చెప్పే సార్వకాలీన కథగా మలచింది ఈ ముగింపే.
– యాసీన్
ధన్యవాదాలు యాసీన్.
Though, many of us got relaxation from work for few days, mother’s still worked day & night to satisfy their families’ and make their children happy. Their work from home was unpaid and unthankful since ages.
But, Hats off to the author who had tried to portray the ‘inner voice’ of a house wife in the form of a story.
Thank you so much, Rami Reddy Garu (Naanna) for making us to understand, ‘how important and joyful it is, to share household chores among ourselves”.
Thanks a lot for all the mother’s🙏 for your never ending love and care…🤗💞
Thank you Hima
కథ వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. తమ కుటుంబ సభ్యుల పేర్లతో కథ బాగా నడిపారు. ఇంటి ఇల్లాలి భావాలకు అద్దం పట్టారు. లాక్ డౌన్ సమయంలో చాలా ఇళ్లల్లో జరిగిన సంఘటనలకు మీరు కథారూపం ఇచ్చారు. అలసిపోయిన కుటుంబ సభ్యులకు ఆ మాత్రం ఆటవిడుపు ఇవ్వాలనే ఉద్దేశంతో రాజ్యలక్ష్మి గారు తనకు అలవాటైన పనిలో పడడం వింతేమీ కాదు. అభినందనలు రామిరెడ్డి గారూ!
మీ అభిమానానికి ధన్యవాదాలు జనార్దన్ గారూ.
రామిరెడ్డి గారి ‘అభావం’
సగం చదివి ఇంతకు ముందు ఇలాంటి కథలు వచ్చేశాయే అనుకునే లోపు చిన్న మెలిక తో అయన మార్క్ ముగింపు.
ప్రారంభ వాక్యం, ఉల్లిఘాటు తీగసాగటం,
“పండిన రావి ఆకు గింగిరాలు తిరుగుతూ నేలమీద పడినట్టు ఆమె మనసులో ఆలోచనలు ”
కథలో ప్రతీ సాధారణ చర్య లేదా సంభాషణ కొత్తగా చెప్పటం, పట్టి పట్టి రాసే ఫస్ట్ ర్యాంక్ కుర్రాడిలా కథ లో ఒక్కో పదం చూసుకుని మరీ రాయటం రామిరెడ్డి గారి ప్రత్యేకత.
అభినందనలు సర్
మీ సహృదయ విశ్లేషణకు ధన్యవాదాలు ఉమామహేష్ గారూ.
సర్,
మీ కథ చాలా బాగుంది.
అయితే ఈ విషయం నేను ప్రత్యేకంగా
చెప్పక్కర్లేదు.
ఎందుకంటే- గతంలోనూ మీ కథలు కొన్ని చదివాను.
కథ ఏదైనా సరే… నిత్య జీవితంలోంచి
పుట్టుకొచ్చింది; కేవలం కల్పనకు మాత్రమే పరిమితం కాకుండా, జీవిత అనుభవాలను రంగరించి, వాస్తవాలను కథల్లో ప్రతిబింబించడం మీ ప్రత్యేకత.
చాలా కొద్దిమంది కథకుల్లో మాత్రమే కనిపించే లక్షణమేమో!
ఇక, మీ ముగింపు కూడా చాలా బాగుంది.
ఆలోచన రేకెత్తించేలా,
ఆత్మ విమర్శ చేసుకునేలా!
అలాగే- మీదైన ‘Native’ పద ప్రయోగం..worth mentioning!
శుభాకాంక్షలు!
I could retrospect my self, the kind of contribution, I am making to lessen the burden for my wife, in day-to-day life.
Realised, I should be doing more and more!
Thanks for nice story, really an eye opener!
Thanks a lot Bhaskar ji.
ఆర్యా. నమస్కారములు
శ్రీ రామిరెడ్డిగారి కథ. “అభావం ” అద్భుతంగా. ఉంది ..అప్పుడెప్పుడో శ్రీపాదవారి
చిన్న కధలని తలపించింది . ఈమధకాలంలో స్త్రీల సమస్యలపై ఇంతచక్కని
కథ చదవ లేదంటే అతిసయొక్తి కాదు . లాక్డౌన్లో. ఇల్లాళ్ళ. అంతరగాన్ని. వారి కుటుంబ నేపద్యమనే తీరంలో నిలబెట్టి తిలకింపజేసారు ” ప్రారంభ వాక్యమే పరాకాష్టని పించింది .
ఇంత మంచికధను అందించిన రచయిత ,అంత మంచి సాహిత్యాన్ని అందించిన సారంగ పత్రిక. నూటికి నూరు పాళ్ళు. అభినందనీయులు .
కథ,కథనం కథలో లాగే హాయిగా ఆనందంగా సాగింది.చరమాంకంలో జీవితం మలుపుతిరిగిందని పించింది.కానీయింటి ఇల్లాలు house wife లాగానే,పాట్లు పడటం తప్పదు అని తేల్చారు. కానీ కరోనా రోజుల వరకైనా ఆమె పనుల్లో తోడై వుంటే బాగుండేది.
నాకు నచ్చిన కథాంశం,ఇంటి ఇల్లాలికి మంచికథలుచదివే అలవాటు,మంచి సినిమాలు చూసే అలవాటుండడం.
కథ చాలా simple గా ,చాలా బాగుంది.