అబ్బూరి ఛాయాదేవి గారి మరో మార్గం!

ఇవాళ అబ్బూరి ఛాయాదేవి గారు నిష్క్రమించిన రోజు. ఆ సందర్భంగా ఒక పాత రచన.

ళ్ళీ ఇల్లు మారుతున్నాం.
ఇట్లా ఇల్లు మారినప్పుడల్లా పాత కాయితాల్లోంచి కొన్ని అద్భుతాలు మెరుస్తాయి, నిన్నటి జ్ఞాపకాల తళతళతో- అట్లా అబ్బూరి ఛాయాదేవి గారు కల్పనకి రాసిన వొక వుత్తరం కనిపించింది.
ఛాయాదేవి గారి కుదురైన చేరాత చూస్తూ కాసేపు ముచ్చటపడి, పుస్తకాలు సర్దుకోవడం అయిపోయాక ఇవాళ సాయంత్రం తీరిగ్గా ప్రశాంతంగా చూద్దామని టేబుల్ మీద పెట్టుకున్నాను.
సాయంత్రం కొంతమంది తెలుగు మిత్రులతో మా వూళ్ళోని షూకిల్ నదీతీరానికి నడక ప్లస్ డిన్నర్ కార్యక్రమం ముగించుకొని, తిరిగి వస్తున్నప్పుడు కొండవీటి సత్యవతి గారి ఫేస్ బుక్ మెసేజ్—ఛాయాదేవి గారు ఇక లేరని! ఇవాళ పొద్దున్న లేవగానే చూసిన/ తారసపడిన కుదురైన అక్షరాల సమూహం వొక్కసారిగా చెరిగిపోయినట్టుగా అనిపించింది. యింటికి వచ్చాక ఛాయాదేవి గారి వుత్తరం చదువుతూ వుంటే, ఆ అక్షరాల వెనక ఆమె అందమైన ఆహ్లాదమైన వ్యక్తిత్వం కనిపిస్తూ వుంది.
ఛాయాదేవిగారితో ముఖాముఖీ పరిచయం ముప్పయ్యేళ్లు పైనే- పరోక్ష పరిచయం యింకో అయిదేళ్లు వెనక్కి- అంటే, దరిదాపూ ఆమె పేరు నా ఆలోచనల్లోకి అడుగుపెట్టి ముప్ఫై అయిదేళ్లు.
1
డిగ్రీ చదివే రోజుల్లో కవిత్వం చదవడం అనే జ్వరం బాగా వేడెక్కినప్పుడు ఆశ్చర్యంగా చేతికందిన అందమైన పుస్తకాల్లో “కవిత” వొకటి.
కవిత్వ పుస్తకాలు- ఆ మాటకొస్తే యే పుస్తకమైనా అయితే, 1/8 డెమ్మీ లేదూ, ¼ డెమ్మీ, లేదూ క్రౌన్ సైజులో మాత్రమే కనిపించే లెటర్ ప్రెస్ యుగం అది. ఆ మూడింటికీ భిన్నమైన సైజులో “కవిత”. దాన్ని ‘unsize’ అనేవాళ్లం. అది మొదటి ఆశ్చర్యమైతే, రెండోది: అసలు కేవలం కవిత్వానికి మాత్రమే పరిమితమైన వొక ప్రత్యేక సంచికని చూడడం గొప్ప ఆనందం. అన్నింటికంటే పెద్ద ఆశ్చర్యం: మహిళా ఎడిటర్ నిర్వహణ! అంటే, అబ్బూరి ఛాయాదేవి గారి సంపాదకత్వం.
ఏడాదికి మూడు సార్లు రావాల్సిన “కవిత” రెండు సంచికల దగ్గిరే ఆగిపోయిందని తరవాత విన్నాను. నా దగ్గిర వొకటి యెలానూ వుంది కాబట్టి, రెండోది కూడా దొరకపుచ్చుకోవాలని ఆ సమయంలో చాలా ప్రయత్నం చేశాను. నాకు తెలిసిన లైబ్రరీలన్నీ గాలించాను, ఖమ్మం నుంచి బెజవాడ టాగోర్ లైబ్రరీ దాకా- ఇక నాకు అందుబాటులో వున్న వ్యక్తిగత లైబ్రరీలు -వేగుంట మోహన ప్రసాద్, హీరాలాల్ మోరియా, నండూరి రామమోహన రావు గారు, టీయల్ కాంతారావు గారు మొదలుకొని హైదరాబాద్ దాకా-
అప్పటికి నాకు ఛాయాదేవి గారు తెలీదు. పూర్తిగా కొత్త వ్యక్తులతో స్నేహహస్తం చాచే కలుపుగోలుతనం లేదు. కానీ, జీవితం అనేది దానికదే విచిత్రమైంది కాబట్టి- ఆరుద్రగారు హైదరాబాద్ వస్తూ, “నువ్వొస్తే మనం కొంతమందిని కలుద్దాం” అని ఆయనే నండూరిగారికి చెప్పి నాకు మూడు రోజుల సెలవు ఇప్పించారు. అవి నేను బెజవాడ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న రోజులు.
కేంద్ర సాహిత్య అకాడెమీ కోసం ఆరుద్ర గారు 1975 తరవాతి కవిత్వాన్ని సంకలనం చేసే బాధ్యత తీసుకున్నారు. దానికి నన్ను సహాయకుడిగా పెట్టుకున్నారు. ఆరుద్ర గారు ఇటు బెజవాడ, అటు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఆయనే నండూరి గారికి చెప్పి, “ అఫ్సర్ ని నేను కిడ్నాప్ చేస్తున్నా” అని తన వెంట తీసుకువెళ్తున్న రోజులవి. అట్లా హైదరాబాద్ లో మొట్టమొదటిసారి ఛాయాదేవి గారిని కలిశాను.
కలవగానే ఆమె అన్న మొదటి వాక్యం: “అఫ్సర్ కదా..ఆ పేరు నాకిష్టం. మా కాపురం మొదలు పెట్టిన మొదటి ఇంటి పేరు అఫ్సర్ మంజిల్!” అన్నారు చాలా సంతోష పడిపోయి- అది చిన్న సంతోషమే కావచ్చు కానీ, ఆ సంతోషం ఆమెని చాలా గతంలోకి లాక్కు వెళ్లింది. అప్పటి హైదరాబాద్, హిమాయత్ నగర్…అవన్నీ ఆమె నెమరేసుకుంటూ, మధ్యలో “కవిత” గురించి చెప్పడం మొదలు పెట్టారు. నాకు కావలసిన అసలైన సమాచారం దొరకడం మొదలు పెట్టింది.
“కవిత” మొదలైంది 1954లో- ఆధునికత అనే భావనకి వొక ఆకారమేదో యేర్పడుతున్న కాలం అది.
ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా సాహిత్య వాతావరణంలో కొత్త మార్పు వస్తోంది. తెలుగు భాషకి సొంత అస్తిత్వం కావాలనే కాంక్షతో పాటు కాస్మోపోలిటన్ సంస్కృతి వల్ల హైదరాబాద్ hybrid సాహిత్య ప్రయోగాలకు అది తొలి దశ. వొక వైపు “కవిత” సంచికల మీద వివాదం మొదలయింది. ఆ కవిత్వంలోని ఆధునికత, ప్రయోగ ధోరణి మీద ప్రధాన స్రవంతి పత్రికలన్నీ కరవాలాలు దూస్తున్నాయి. ఆ ప్రయోగంలో దేశీయత లేదన్నది ప్రధానమైన విమర్శ. దానికి దీటుగా “తెలుగు స్వతంత్ర”లో శ్రీశ్రీ సమాధాన అస్త్రం. యిట్లాంటి ప్రయోగాలు వచ్చి తీరాల్సిందేనని మొండి సమాధానం. అట్లాంటి వాతావరణంలో కవిత్వంలో మాత్రమే వుండకుండా, వచనం వైపు మళ్లారు ఛాయాదేవి. ఆ తరవాత అదే “తన మార్గం”గా ఆమె ప్రకటించుకోలేదు గాని, అంతకంటే యెక్కువ ఏకాగ్రతతో రచనావ్యాసంగం కొనసాగించారు.
తెలుగు సాహిత్యంలో స్త్రీవాదం వొక్కసారిగా పెల్లుబికిన వుద్యమం కాదు. అనేక దశల్ని దాటుకుంటూ 1985 తరవాత స్థిరపడిన అస్తిత్వ వుద్యమం అది. భారతీయ సాంస్కృతిక రాజకీయ చరిత్రలో the long 50s గా భావించే యాభైల గురించి మనకింకా సరైన పరిశోధన గాని, చరిత్ర నిర్మాణం గాని జరగలేదు. ఆ పరిశోధన సాధ్యపడి, ఆ దశకానికి సంబంధించిన సాహిత్య ఆకరాలు దొరికితే తప్ప తెలుగు సాహిత్య చరిత్ర పునర్ నిర్మాణం సాధ్యపడదు. ఆ దశకంలో ఛాయాదేవి గారి వంటి రచయిత్రులు చేసిన కృషి కూడా వెలుగులోకి రాదు.
అయితే, ఛాయాదేవి గారు ఆ దశలో రాసిన కథల్లోనే నగరజీవితం ఎక్కువగా కనిపించడానికీ, హైదరాబాదీ సాంస్కృతిక వెలుగునీడల్లో వరద రాజేశ్వర రావుగారూ ఆమె కలిసి నడిచిన అడుగుల ప్రభావం చాలా వుందని మాత్రమే యిప్పటికి నేను చెప్పగలను. ఇక్కడ కూడా నాకు బాగా ఆకట్టుకున్న విషయమేమిటంటే- రాజేశ్వరరావు గారి దారికి భిన్నంగా ఛాయాదేవి గారు తనదైన మార్గాన్ని discover చేసుకోవడం. తన దారి మీద తనదైన గొప్ప నమ్మకంతో ముందుకు కొనసాగడం—ఆ విధంగా ఆమె రెండు రకాల hegemony ని subtle గా ప్రశ్నిస్తూ ముందడుగు వేశారని నాకు అనిపిస్తుంది.
2
ఆరుద్రగారి వల్ల ముందే పరిచయమైనా, నేను యింకో రెండు మూడడుగులు ముందుకేసి, ఆమె స్నేహ హస్తాన్ని అందుకున్నది మాత్రం 1992 తరవాతనే!
అదే సంవత్సరం నా కవిత సంపుటి “ఇవాళ”కి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు దక్కింది. అప్పట్లో మా తరానికి ఆ అవార్డు ఫ్రంట్ రాంక్ సత్కారమే! హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో అవార్డు ప్రదానం జరిగింది. ఆ సభకి సిరి చుక్కల్లాగా మొదట వచ్చిన వారిలో ఛాయాదేవి గారు వొకరు. “ అఫ్సర్ కి మంజిల్ దొరికింది!” అన్నారామె మనస్ఫూర్తిగా అభినందిస్తూ.
ఆ మర్నాడు వాళ్ళ యింటికి బ్రేక్ ఫాస్ట్ కి పిలవడం వల్ల మరిన్ని కబుర్లు చెప్పుకునే అవకాశం దొరికింది. అదే సమయంలో నా రీడింగ్ జర్నీలో మరో అద్భుతం జరుగుతూ వుంది. అది అబ్బూరి రామకృష్ణా రావు గారి “ఊహాగానం మరి కొన్ని కృతులు” అనే మరో అందమైన పుస్తకం- ఎర్రట్ట పుస్తకం మీద బంగారు రంగు అక్షరాల ఎమ్బోజింగ్ తో వచ్చింది ఆ పుస్తకం. చేతిలో పట్టుకుంటే దానికదే అలంకారంగా వుండేది.
యీ రెండో కలయికలో కబుర్లన్నీ యెక్కువగా అటే మళ్లాయి. అయితే, అవి మనకున్న మరో నగరం విశాఖ పట్నం చుట్టూ తిరిగిన విషయాలు. అభ్యుదయ వుద్యమం, అందులో అబ్బూరి వారి పాత్రా…యిట్లా అనేక గత జ్నాపకాల సంచారం.
నాకు గుర్తున్నంత మేరకు ఛాయాదేవి గారి దృష్టి, ఆమె అనుభవాల బలమంతా హైదరాబాద్ జీవితం నించి వచ్చిందే. ఆ రోజు చెప్పిన విషయాల్లో నాకు ఆమె విశాఖ – హైదరాబాద్ లు యే రకంగా భిన్నమైన ప్రభావాలో యెక్కువగా చెప్తూ వచ్చారు.
బహుశా, ఆ భిన్నత్వం అర్థమైంది కాబట్టే ఆమె అయిదు నక్షత్రాల ఆసుపత్రుల కొర్పోరేట్ మార్కెట్ గురించి కథ రాయగలిగారు. నాకు తెలిసీ, ఆ రకమైన కార్పొరేట్ జీవన విధానం సాహిత్యంలోకి తీసుకువచ్చిన తొలి రచన ఆమెదే కావచ్చు. అయితే, ఈ కథ కంటే ముందే ఛాయాదేవి గారు రాస్తూ వచ్చిన కథల్లో హైదరాబాదీ మధ్యతరగతి మహిళ చాలా బలమైన subjectivity తో కనిపించడం మొదలెట్టింది. ఆ కోణాన్ని ప్రోటో-ఫెమినిస్టు దృక్పథం నించి గమనిస్తే, ఆమె సృష్టించిన స్త్రీపాత్రలన్నీ స్వయం వ్యక్తిత్వంతో అందంగా ప్రకాశిస్తూ కనిపిస్తాయి.
3
ఛాయాదేవి గారిని 1992 తరవాత యెన్ని సార్లు కలిశానో నాకు గుర్తు లేదు. కానీ, మరో మరచిపోలేని సందర్భం నేను మాడిసన్ విస్కాన్సిన్ వచ్చే ముందు చేకూరి రామారావు గారితో కలిసి, వాళ్లింటికి వెళ్ళాం.
ఆ సమయంలో మాడిసన్ వెళ్లాలా వద్దా అన్న డైలమాలో విపరీతంగా నలిగిపోతున్నప్పుడు “లేదు, వెళ్ళాల్సిందే!” అని ఖరాఖండిగా చెప్పి, యెందుకు వెళ్లాలో సాక్ష్యాధారాలు చూపించే ప్రయత్నంలో చేరాగారు నన్ను వాళ్లింటికి లాక్కు వెళ్లారు.
వరద రాజేశ్వర రావు గారు కొన్నాళ్లు మాడిసన్ లో పాఠాలు చెప్పారు, చేరాగారు మాడిసన్ వెళ్లడానికి అటూ యిటూగా- మాడిసన్ జీవితంలోని మాధుర్యం గురించి కథలు కథలుగా వాళ్ళిద్దరూ ఆ రోజు చెప్పుకుంటూ వెళ్ళడం యిప్పటికీ గుర్తుంది. మాడిసన్ రావడానికి ముందు నన్నూ కల్పనని భోజనాలకు పిలిచిన సందర్భాలు కూడా కొన్ని వున్నాయి. కల్పన నవల తన్హాయీ వెలువడినప్పుడు ఆ నవలకి మనస్ఫూర్తిగా స్వాగతమిస్తూ విపులమైన సమీక్ష రాశారు ఛాయాదేవి గారు.
నిజానికి ఆ సమీక్ష ఆమె రాశారని తెలీదు. ఆ సమీక్ష అచ్చయ్యాక యెవరో చెప్తే, తెప్పించుకొని, చదివి, మేమే మళ్ళీ ఫోన్ చేశాం, ఆస్టిన్ లో వుండగా-
ఆమెని దగ్గిరగా చూసిన వాళ్ళకి రెండు విషయాలు అర్థమవుతాయి. వొకటి: ఆమెలోని నిలకడ, రెండు: జీవితం యెట్లాంటి చేదు అనుభవాలిచ్చినా, తను మాత్రం స్నేహామో ప్రేమో తిరిగివ్వడం.
ఆమె వ్యక్తిగత, సాహిత్య జీవితాల్లో గొప్ప నిగ్రహమూ, విశ్వాసంతో నిండిన నిలకడ వుంది. ఆమె మొదటి కథ నించి తాజా రచన దాకా ఆమెలోని ఆ కుదురైన బతుకు ఇరుసు చెక్కుచెదరలేదు.
ఛాయాదేవి గారు యెక్కడున్నా తనున్న చోటుని ఆహ్లాదంగా అందంగా నిరాడంబరమైన aesthetic beauty తో నింపుకుంటారు.
అవి పుస్తకాలా, చిత్రాలా, తనదే అయిన స్వచ్చమైన presence …వీటిల్లో దేనిది ఆ అందమూ చెప్పడం కష్టమే! బహుశా, వాటన్నీటి కంటే యెక్కువగా ఆ చల్లనైన చిరునవ్వు కావచ్చు. స్నేహితుల పట్ల తనకున్న నిండైన ప్రేమభావమంతా వ్యక్తమయ్యే తన కదలిక కావచ్చు.
కాలంతో పాటు మారే శక్తి అంత తేలికేమీ కాదు. పైగా, కొన్ని తరాల చరిత్రని చూస్తూ చూస్తూ కాలంతో పాటు వచ్చే ప్రతి కదలికని తన మార్గంలో కలుపుకుంటూ వెళ్ళడం యింకా కష్టం. ఛాయాదేవి గారి జీవితం నేర్పే పెద్ద పాఠం అదే అనుకుంటాను.
*

అఫ్సర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు