ప్రతి పదంలో
మనుషులపై పెంచుకున్న
మమకారపు మధురిమ పలకరిస్తుంది
ఋుతువు వసంతవనమై పులకరిస్తుంది
ఒక ప్రేమవలయం వెలుగులు విరజిమ్ముతూ
భూమి చుట్టూ పరుగులు తీస్తుంది
కాంతి గర్వంతో
తలెగరేసే సూర్యుడు చిన్నబోయి
చిన్నపిల్లాడిలా
మేఘాల మాటున దాగుంటాడు
ఇన్ని ఊహలఊసులను
ఎక్కడ తవ్వుకువచ్చావు
ఉప్పెనలై ముంచెత్తే
నెమలీకంత మెత్తని భావాలని
ఎక్కడ కొల్లగొట్టావు
నువ్వు తాకితే చాలు
అనంతమైన ఆకాశం
రంగులగోరింటై అరచేతిలో ఇమిడిపోతుంది
తేటనీటి తేనెధారల ఊట
చేదేకొద్దీ నీ బావిలో ఊరుతుంటుంది
నీ రహస్యం నాకు తెలుసు
కొండకోనల దారుల్లోంచి
అవధుల్లేని అరణ్యాలలోంచి
రాసులకొద్దీ
పూల పరిమళాలను ఏరుకొస్తావు
సముద్రాలను అవలీలగా ఎత్తుకుంటావు
నదులనూ సెలయేరులనూ
నేస్తాలలా వెంట తిప్పుకుంటావు
తోటల వద్ద హరితాన్నంతా కొల్లగొట్టి
ముద్ద చేస్తావు
మంచులో తడిసిన
లేలేత ఆకులా చిగురిస్తావు
నీ లోతులలోని జలనిధికి కట్టుబడి
సమస్త ప్రకృతీ నీకు లొంగిపోతుంది
చెప్పు చెప్పు
అప్పుడే కదా
నీ వాక్యం గొంతెత్తి
ప్రపంచం చెవిలో
తీయగా పాడుతుంది
వెన్నెలపిట్ట రెక్కవిప్పి
నాట్యం చేస్తుంది
అప్పుడేగా కవిత్వం కరిగి నీరై
ఎండిన కనులకనుమలను
జీవనదిలా తడుపుతూ
ప్రవహించిపోతూ ఉంటుంది
అప్పుడే కదా
(కవుల కోసం)
తేట నీటి తేనె ధారల ఊట చేదే కొద్దీ నీ బావిలో ఊరుతుంది
మీ విలువైన స్పందనకు ధన్యవాదాలు సర్
కవిత్వం బాగుంది. అభినందనలు.
మీ విలునైన స్పందనకు ధన్యవాదాలు సర్