అప్పటి హృదయం ఒక పచ్చి పుండు

తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం సందర్భంగా-

థ రాయాలి. దేని మీద రాయాలి. జీవితం కథ అవుతుందని అప్పుడు నాకు తెలీదు. పల్లెలో వ్యవసాయం అచ్చి రాక అప్పుల పాలైన కుటుంబంతో అప్పటికే పూర్తిగా చితికిపోయి ఉన్నాను. ఏమి చేయాలో తోచక పచ్చి పుండు మాదిరి ఉన్న హృదయాన్ని మోసుకుని హైదరాబాద్‌ వచ్చి ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నాను.

ఆంధ్రజ్యోతి సండేలో ఉద్యోగం. అక్కడికొచ్చే కథలు చదివేవాణ్ని. ఆ కథల్లో అన్నీ నాకున్న అనుభవాలే. నా జీవితమే.. నా కష్టమే. ఈ కథలకే అందరూ అహా.. ఓహో.. అంటున్నారు. మరి నేనెందుకు రాయకూడదు? “నాకున్న కష్టాలు రాస్తే వీళ్లంతా ఏమైపోతారో..పాపం’’ అనిపించింది.

రాశాను. ఏడ్చుకుంటూ రాశాను.  గుండెలు బాదుకుంటూ రాశాను. మా నాన్న పడ్డ కష్టమంతా తల్చుకుంటూ రాశాను. అప్పుడింత అప్పుడింత, రాసింది మళ్లీ మళ్లీ చదువుకుంటూ, వెనక్కి ముందుకు వెళ్తూ మొత్తానికి వారం రోజులకు పూర్తి చేశాను. అంత పెద్ద కథ నేనెప్పుడూ అంతకుముందు రాయలేదు. అసలు కథ అయిందో లేదో తెలీదు.

సండే ఇన్‌ ఛార్జ్ ‘వేమన వసంత లక్ష్మి’గారికి చూపిస్తే “మన దగ్గర పనిచేసే అబ్బాయి మంచి కథకుడు అయితే మాకూ సంతోషమే కదయ్యా.. వేస్తాను’’ అన్నారు. సరిగా గుర్తు లేదు కానీ అలా అన్న రెండు నెలలకేమో కథ పేజీలకు ఎక్కించే వంతు వచ్చింది. కథల పేజి పెట్టేది ఖదీర్‌. అతను కథను పేజీలకెక్కిస్తూ పేరు ‘జీపొచ్చింది’గా మార్చాడు. అప్పుడది నాకు నచ్చలేదు. తర్వాత దానికి మించిన పేరు నాకు తట్టలేదు.

అలా తొలి కథ వెలుగు చూసింది. మా నాన్న వ్యాపారంలో చేతులెత్తేసి వ్యవసాయదారుడిగా మారేసరికి ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి కూర్చున్నాడు. ఇక అతను వచ్చినప్పటి నుంచి రైతులను పెట్టిన బాధలు అన్నీ ఇన్నీ కాదు. అర్ధరాత్రులు, అపరాత్రులు పొలానికేళ్లేవాళ్లం. కరెంటు ఎప్పుడొస్తుందో, పోతుందో తెలీదు. అందరూ ఎక్కడెక్కడి నుంచో వైర్లు లాగి మోటార్లు ఆడించుకునేవాళ్లు. ఎక్కడ చూసినా అతుకులు, అంతంత బతుకుతు. అప్పుడప్పుడు చీకట్లో వైర్లో, పాములో తెలియక తొక్కేస్తామేమో అని దిగులు. పురుగూ, పుట్ర, కీచురాళ్లు. అంతా భయం భయంగా దిగులు దిగులుగా గడిచాయి రోజులు.

కథ రాయడానికి కూర్చున్నప్పుడు మా నాన్నే పక్కకొచ్చి కూర్చున్నాడేమో అన్నట్టుగా ఉన్నింది. “ఇక్కడ ఇది రాయలేదు చూడు.. అక్కడ అది మర్చిపోయావు చూడు..’’ అని గుర్తు చేస్తూ కూర్చున్నాడు. అతనికి పొట్టకోస్తే అక్షరమ్ముక్క రాదు, కానీ జీవితాన్ని అందరికంటే బాగా చదివి నాకు కథల్లో చాలాచోట్ల పాత్రయి నిలిచినాడు.

కథ అచ్చయ్యాక అనేకమంది ప్రశసంలు. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే, జీవితంలో వచ్చే ఒడిదొడుకులు ఎదుర్కొంటూనే మరోవైపు నాకు తోచినన్ని కథలు రాశాను. నేను ఇప్పటికి మూడు కథల పుస్తకాలు వేసి నేనూ రచయితను అనిపించుకుంటున్నాను అంటే దాని వెనుక ఎందరిదో ప్రోత్సాహం, తిరస్కారం ఆ తిరస్కారం, ప్రోత్సాహంతో నాలో కలిగిన ఆగ్రహం, వేదనా, ఉత్సాహం అన్నీఅన్నాయి. ఇప్పుడవన్నీ చెప్పుకుంటూపోతే కథ కన్నా ఈ నేపథ్యమే ఎక్కువ అవుతుంది. అందుకే ఇక్కడితో ఆపేస్తాను.

-డా. వేంపల్లె షరీఫ్‌

*

జీపొచ్చింది

మిట్టమధ్యాహ్నం ఒంటి గంటయ్యింది. మూడెకరాల నల్లరేగడి నేల నీళ్లు లేక మలమలమాడిపోతోంది. దొంగపూత కొచ్చిన శెనిక్కాయ చెట్లు మెలి గుడ్లేసుకుంటున్నాయి. పొలంవారగా ఉన్న ఒక చిన్న స్టార్టరు పెట్టె ఎండకు చరచరా కాలిపోతూ గుయ్యిమని శబ్దంచేస్తూ…  ఉన్నాయా లేవా అన్నట్టున్న బోరుపైపులోని నీళ్లను బయటకు లాగుతోంది. బయటికొచ్చిన నీళ్లు సన్నగా కారి కాలువలో పడి తాబేల్లా పాకుతున్నాయి. కాలువ్వార చెట్లన్నీ సల్లగా పచ్చదనాన్ని పులుముకోనున్నాయి.

‘పొలమంతా అలా అయ్యేదెప్పుడు?’ వందోసారి అనుకున్నాడు వెంకట్రెడ్డి. కాళ్లు కాలకుండా అతను కాలువలో నిలబడుకున్నాడు. నెత్తికి తడి టవాల చుట్టు కున్నాడు. చేతిలో పార.

అతని మనసంతా అదోలా ఉంది. ఒకవైపు ఎండుతున్న పంట. మరోవైపు బోరులోంచి వస్తున్న ఒంటేలు ధారలాంటి నీరు. దానికి తోడు పోతూ వస్తున్న కరెంటు.

ఆ రొన్ని నీళ్లతో కాలవ పారేదానికే గంట పడుతుంది. ఇక పంటెప్పుడు తడుపుకోవాలి?  వెంకట్రెడ్డి మనసులో అనుకుంటుండగానే తుస్సుమంటా కరెంటుపోయింది. ఆడుతున్న స్టార్టరు కాస్తా ఆగిపోయింది. బోరుపైపులోంచి వచ్చే ఆ కొద్దినీళ్లు ఆగి పోయాయి.

‘‘థూ… దీనెమ్మె…’’ తిట్టుకున్నాడు వెంకట్రెడ్డి. యింక ఒక్క నిమిషం కూడా అతనికి పొలంలో ఉండబుద్ధి కాలేదు. కడుపులో చరచరమని కాలుతున్నా తెచ్చుకున్న అన్నం తినబుద్ధి కావడంలేదు. పయ్యంతా అలసటగా ఉండడం వల్లనేమో ఇంటికెళ్లి కాసేపు సల్లగా పడుకుందామనిపించింది. తెచ్చుకొన్న సద్దిని ఎనక్కి తీసుకొని,  పోయిన కరెంటును తిట్టుకుంటా మెల్లగా కాలిదావ పట్టి ఊర్లోకొచ్చాడు. కాళ్లీడ్చుకుంటా అంతదూరం నుంచి ఊరికి చేరేసరికి ఆడంత గోలగోలగా వుంది.

‘‘ఏందిరా వెంకట్రెడ్డి ఇంకా ఇక్కడే ఉండావు. ఉరికెత్తురా… పొలాల్లోకి కరెంటోలెల్నారు. కరెంటోళ్ల జీపెళ్లింది. ఉరికి స్టాటరు పెట్టె దాసుకోపో… ఉరుకూ..’’ వెంకట్రెడ్డిని చూసి మల్లన్న అరిచాడు.

వెంకట్రెడ్డికి మొదట అర్థం కాలేదు. అర్థం అయ్యాక గుండె జారిపోయింది. కరెంటు మామూలుగా పోలేదు, కరెంటోళ్లే లైన్‌ ఆఫ్‌ చేసి పొలాల మీద పడ్డారని తెలిశాక వళ్లంతా చమట పట్టింది. ఊర్లో సగంమందికి పైగా కరెంటు బిల్లులు కట్టని, కట్టలేని రైతులే. అందరూ ఎక్కడోళ్లక్కడ పరిగెత్తుతున్నారు. కంగారు కంగారుగా హడావుడి పడుతున్నారు.

వెంకట్రెడ్డికి ఏం చేయాలో తోచలేదు. అట్నుంచే అటే ఎనక్కి పరుగందుకున్నాడు. చేతిలో సద్ది ఎప్పుడో నేలకూలింది. కడుపులో ఆకలి, నీరసం. అయినా అతనికి కళ్లు మూసినా తెరిసినా పొలంలో ఒంటరిగా వున్న స్టార్టరు పెట్టే కనిపిస్తోంది. స్టార్టరిప్పుడు అతనికి ప్రాణం. అది లేకుంటే అతనికి నిజంగానే బతుకులేదు. అదుంటేనే బోర్లో ఉన్న ఆ కొద్దినీళ్లైనా బయటకొస్తాయి- సగం పంటైనా బతుకు తుంది.

‘‘ఒరె దేవుడా! నేనెళ్లేలోపల కరెంటోళ్లు నా పొలంకాడికి రాకుండా చూడు సోమి. వాళ్లొచ్చేలోపల నేనెళ్లి నా స్టాటరు దాచుకుంటా’’ మనసులో ప్రార్థించుకున్నాడు వెంకట్రెడ్డి. అంతలోనే అతడికి స్టార్టరు పెట్టెకున్న అతుకులు గుర్తొచ్చాయి.

‘‘స్టాటరూడదీసెటప్పుడు జాగ్రెత్తగా ఉండాలా… అసలే ఫీజు గడ్డలు పగిలిపోయి ఉండాయి. ఫీజుకడ్డీ పాడూ తగిలితే పాణానికే సేటు. పాణం పోయినా పరవాలా. ఇప్పుడుగన కరెంటు తగిలి కాలో, సేయో పడిపోతే దిక్కెవరు? అప్పు లెవరు తీరుస్తారు? దప్పికై ఉన్న పైరుకు నీళ్లెవరు పారగొడతారు?’’

వెంకట్రెడ్డికి అతడి భార్య గంగాదేవి గుర్తుకొచ్చింది.

‘‘పని విషయంలో గంగాదేవిని ఆడమనిషి అనుకోకూడదు. కొంగు బిగించి పనిలోకి దిగితే పదిమంది పని ఒక్కతే సులబంగా చేసేయగలదు… కానీ అది ఇప్పుడు సన్నబిడ్డ తల్లే’’ మనసులో అనుకున్నాడు.

‘‘అయినా ఇప్పుడు కరెంట్లేదుగా’’ మళ్లీ వెంకట్రెడ్డి ఆలోచనలు పొలం మీదికి మళ్లాయి.

‘‘ఏమో ఉండొచ్చేమో? మన ఖరమ. కరెంటు లాకపోతే స్టాటరు పెట్టెలు పెరికేసి మూడు నిమిసాల్లో దాసేస్తామని కరెంటోళ్లు మళ్లీ కరెంటు వదలనైనా వదిలిండొచ్చు. మన జాగ్రెత్తలో మనముండాల. మన్నట్టనే కదా పక్కపొలం సంటి గాడు పాణాలు పోగొట్టుకుంది. పొలాల్లోకి వస్తున్న సొసైటోళ్ల జీపు చూసి కరెంటోళ్ల జీపనుకొని బిత్తరపోయినాడు. ఎట్టరా దేవుడా చేసేదని సచ్చా బతుకుతా పోయి మోటారు ఆడతండంగానే స్టార్టర్‌ పెట్టెను పట్టుకొని పెరికినాడు. పీజులూడబీకలేదు. అసలే నాసిరకం వైర్లాయా. యాడ చూసినా అతుకులే. గుడ్డపీలికలు కూడా సుట్టుకోలేక పోయినాడు నాయాళ్లు. కరెంటు తగిలి ఆడికాడే గొంతు కోసిన కోడిలాగా గిలగిలా కొట్టుకొని పాణాలు వొదిలేసినాడు. ఇంటిదిక్కు పోతే వాడి పెళ్లాం పిల్లల్లో ఒకటే బాధ. ఇప్పటిక్కూడా నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఒకవేళ నేనెళ్లేసరికి జరగాల్సిందంతా జరిగిపోతే…’’ ఆ ఊహకు భయపడిపోయాడు వెంకట్రెడ్డి.

కరెంటు బిల్లు రెండు వేలు దాకా ఉంది. ఇప్పుడు దాన్ని కట్టి స్టార్టరు విడిపించుకోవడం వెంకట్రెడ్డికి సాధ్యమయ్యేపని కాదు. వెంకట్రెడ్డికి గతం ఒక్కసారిగా కళ్లముందు కదలాడిరది.

అతడికి ముచ్చటగా మూడెకరాల పొలం ఉంది. అదీ ఎక్కడో ఊరికి దూరంగా ఓ మూలగ ఉంది. అక్కడికెల్తే రాలేరు, వస్తే పోలేరు బండి ఉంటే తప్ప. అలాంటి పొలాన్ని నమ్ముకొని కాలినడకతోనే ఈదుకొస్తున్నాడు వెంకట్రెడ్డి. దాని చరిత్ర అమాంతం కష్టాలు, కన్నీళ్లు, నష్టాలు, అప్పులు. మొన్నకు మొన్నే చుక్కలు చూసి చెమ్మకోసం బోరేశాడు వెంకట్రెడ్డి.

అసలే విపరీతమైన కరువుకాలం. ఈ కాలంలో బోరేయడానికి పూనుకోవడ మంటే మాటలుకాదు. అసలు ఆ ఆలోచనే వెంకట్రెడ్డికి లేదు.

‘‘బంగారట్ట బూమెట్టుకొని ఎందుకురా కట్టపడతావు. అదే బూమి మాకుంటేనా? సించి ఆరేసోటోల్. మా మాటిని అప్పో, సప్పో చేసి బోరేయరా. నీ కట్టాలన్నీ పారిపోతాయి. ఎన్ని దినాలని రాని వానకోసం ఎదురు సూస్తూ పంట లేస్తా వుంటావు. లెక్కుంటే పొలంలోనే వర్సం కురిపించొచ్చు. పాతాళగెంగను బయటికి తేవొచ్చు. ఒకసారి ఆలోసించు. అడుక్కుతిని అయినా ఓ యాభై వేలు సంపాదించుకున్నావనుకో. నీ జాత్కమే మారిపోతాది’’ ఏ కొంచెం కష్టం కలిగినా తరచూ మిత్రులనే మాటలు వెంకట్రెడ్డి చెవుల్లో పదేపదే గుయ్యిమన సాగాయి. ఆ మాటలు అతని హృదయాంతరాల్లో ఎక్కడో ఓ మూల ఆశలు రేపాయి.

నీరు పడితే అతని బతుకుపూల వనం. లేకపోతే అప్పుల కాష్టం. రకరకాలుగా ఆలోచించాడు. అధైర్యపడ్డాడు. అందరినీ సలహాలు అడిగాడు. ‘‘అప్పుసేసి అంత పని సేయటం మాబోటోళ్లకు మంచిది కాదురా’’ అన్నారు కొందరు వెంకట్రెడ్డిని కలుపుకొని. ‘ప్రయత్నించి చూడు ఆపై దేవుడున్నాడ’ని దీవించారు మరికొందరు.

అయినా వెంకట్రెడ్డి ధైర్యం చేయలేకపోయాడు. ఆ ఆలోచనను అలాగే మనసులో ఉంచుకొని కాలం గడుపుతుంటే ఓరోజు వెంకట్రెడ్డి భార్య గంగాదేవి నోరు తెరిచి ‘‘మావా ఎక్కడ్నుంచో ఒకసోట్నుంచి లెక్కతెచ్చి బోరెద్దాం మావా. నాకెందుకో మన పొలంలో నీళ్లు పడ్తాయి. మన కట్టాలు తీర్తాయి అనిపిస్తాంది మావా ’’ అంటూ వెంకట్రెడ్డిలో ఆశలు రేపింది.

ఇక ఊరుకోలేకపోయాడు వెంకట్రెడ్డి. తన ఇల్లాలు ఏదైనా చెబితే అది కచ్చితంగా జరిగి తీరుతుందని వెంకట్రెడ్డికి ఒక చిన్న నమ్మకం. వెంకట్రెడ్డికి గంగాదేవి మీద ఎనలేని అభిమానం. ప్రేమ. తన మామకు ఎప్పుడు ఏం కావాలో అడగందే తెలుసుకొని అందించే నైజం గంగాదేవిది.

అందుకే ఆరోజు ఏదైతే అదైందని గుండెల నిండా ఊపిరిపీల్చుకున్నాడు. వెంటనే ఆ ఊర్లో ఓ పెద్దమనిషి దగ్గర అప్పు కోసం వెళ్లాడు. వడ్డీ ఎక్కువన్నా నెరవ లేదు. డబ్బు తీసుకున్నాడు. నోటు రాయించాడు. ‘‘నీళ్లు పడితే పొలం నాది. పడక పోతే అప్పిచ్చిన ఆసామిది’’ కళ్లు మూసుకొని మనసులో గట్టిగా పదిసార్లు అను కున్నాడు.

మరుసటిరోజే బోరు బండి వెంకట్రెడ్డి పొలంలోకి అడుగుపెట్టింది. కాటు రామయ్యను పిలిపించి ఒకటికి రెండుసార్లు అంజనం వేయించాడు వెంకట్రెడ్డి. అంజనంలో ఎక్కడా టెంకాయ గుండ్రంగా తిరగలేదు. చివరికి మనసు గుటకలు మింగుతూ ఉంటే పొలమంతా కలియతిరిగి వెంకట్రెడ్డే ఒకచోటు చూపించి రామయ్యను అంజనం తిప్పమన్నాడు. అంతే టెంకాయ గిర్రున తిరిగింది. బోరు వెయ్యందే నీళ్లు పడ్డట్టు వెంకట్రెడ్డి ముఖం ఆనందంతో వెలిగిపోయింది.

కాటురామయ్య అంజనం వేసి కొబ్బరికాయ తిప్పితే ఇక సందేహమే లేదు. అక్కడ నీళ్లు పడ్డట్టే. అందుకే ఎక్కడున్నా వెతికి గాలించి పట్టుకొని ‘‘నాకు పనుంది, కుదరదు’’ అన్నా వినిపించుకోకుండా ‘‘వంద రూపాయలు ఎక్కువిస్తా’’నని చెప్పి మరీ బతిమాలి పిలుచుకున్నాడు కాటు రామయ్యని వెంకట్రెడ్డి.

కొబ్బరికాయ తిరగడం చూసి కాటు రామయ్య ‘‘ఇక్కడ ఖచ్ఛితంగా నీళ్లు పడతాయయ్యా’’ అని పసుపు, కుంకుమ చల్లి తిరిగిన టెంకాయనే టప్పుమని రాతికేసి కొట్టి ‘శుభం’ పలికాడు. అంతే బోరు బండి చెవులు మ్రోగిపోయేలా శబ్దం అందుకుంది. కాటు రామయ్య ఆనందంగా జేబులు తడుముకుంటూ వెళ్లి పోయాడు.

బోరుబండోడికి అడ్వాన్సు, కూలీలకు అన్నాలు, మామూళ్లు. మధ్య మధ్యలో వారికి కాఫీలు, టీలు, మంచినీళ్లు… వెంకట్రెడ్డి దంపతులు వారి సేవలో మునిగిపోయారు. బోరు పొలంలోనే వేస్తున్నా అది వెంకట్రెడ్డి గుండెల్లో అన్నట్టుంది పరిస్థితి. ఒక రేయి, ఒక పగలు పొలంలో బోరు బండి గొంతు చించుకొని అరిచింది. ఒట్టి సుద్ద పొగ ఎగుర్తోంది తప్పితే మూడువందల అడుగులు దాటినా బోరు రాడ్డుకు చెమ్మ తగల్లేదు.

వెంకట్రెడ్డి దంపతుల ముఖాలు దిగులుగా మారిపోయాయి. వారి శరీరాల్లో రక్తం ఇమిరిపోయింది. అడుక్కింత బోరుబండికి రేటు పెరిగిపోతోంది. కూలీలు, బోరు బండి యజమానితో సహా అందరూ పెదవి విరిచేశారు. యింక ఎంత లోతు బోరు వేసినా డబ్బులు వృధా, శ్రమ తప్పితే నీరు పడవు తర్వాత మీ ఇష్టం అని చెప్పారు.

ఏం మాట్లాడాలో తెలీక బిక్చచచ్చిన వెంకట్రెడ్డి బోరు బండికి ఆనుకొని కూలబడిపోయాడు. అతని ముఖంలో కన్నీళ్లొక్కటే తక్కువయ్యాయి. బోరు వేయడం ఆపించి వెంకట్రెడ్డి సమాధానం కోసం కాసేపు ఎదురుచూశాడు బోరు యజమాని. వెంకట్రెడ్డి ఏం పలక్కపోయే సరికి రివర్స్‌ గేర్‌ వేయమని కూలీలను ఆజ్ఞాపించాడు. అంతలో గంగాదేవి మెల్లగా నోరు విప్పింది – ‘‘అయ్యింకాడికయ్యింది. ఇంకో యాభై అడుగులేయండి’’

“ఇప్పుడు మాను కుంటే మీకు ఆ యాభై అడుగుల డబ్బులైనా మిగులుతాయి. లేకపోతే అంతా నష్టమే,’’ అన్నాడు బోరు యజమాని.

గంగాదేవి ఒప్పుకోలేదు. వెంకట్రెడ్డితో చెప్పి ఒప్పించింది. వెంకట్రెడ్డి అప్రయత్నంగానే ఊకొట్టాడు. బోరు బండి మళ్లీ ముందుకు శబ్దం అందుకుంది. అందరూ బోరు వైపే చూస్తున్నారు.

‘దేముడా! ఈ గండాన్ని గట్టెక్కించు తండ్రీ. ఏదైనా నీరు పడకుంటే నా మావ బతకడు. అదే జరిగితే అందుకు కారణం నేనే. నేను నా పిల్లలం… కూడా బతకం. నేను ఆశపెట్టినందుకైనా మా పొలంలో నీళ్లు పుట్టించి. నా మావను బతికించు తండ్రీ’ మనసులో అనుకొని కన్నీళ్ల పర్యంత మవుతూ బోరుగుంత వైపే చూస్తోంది గంగాదేవి.

బోరు బోరున శబ్దం చేస్తూనే ఉంది. అప్పుడప్పుడు రాళ్లు పడిన శబ్దం. వెంకట్రెడ్డి పొలమంతా ఎర్రటి ధూళి మేఘాలు నిండుకున్నాయి. అంతలోనే బోరు రాడ్డు పాతాళంలో చెమ్మను తాకింది. ఎర్రటి నీళ్లు, ధూళితో నిండిన నీళ్లు. బోరు బండి గుండెల్నిండా గట్టిగా గాలి పీల్చి వదిలింది. ఆ గాల్లోంచి నీళ్లెగిరి పైకి చిమ్మాయి. అదిగో నీళ్లు. వెంకట్రెడ్డి ముఖంలో రక్తం ఏమూలగా వెళ్లిపోయిందో అప్పుడే వచ్చి చేరుకుంది. గంగాదేవి ఆనందంగా కన్నీళ్లు తుడుచుకుంది.

అక్కడున్న కూలీల్లో కూడా ఏదో తెలీని పరవశం. బోరు యజమాని కూడా కాస్తంత ఉత్కంఠ తర్వాత అప్పుడే ఊపిరి పీల్చుకున్నాడు. అయితే – ‘‘నీళ్లు చాలా లోతులో పడ్డాయి. ఒకటిన్నర యించు కన్నా ఎక్కువ రావు… అవి కూడా ఎప్పుడుంటాయో ఎన్నాళ్లుంటాయో చెప్పలేం వెంకట్రెడ్డి. నీకు తెలుసుగా ఇప్పటికే వరసగా మూడేళ్లవుతోంది సరిగా వర్షాల్లేవు. ఈ సంవత్సరం కూడా కురుస్తాయని నమ్మకాల్లేవు. నీళ్లున్నంత కాలం నీ అదృష్టం అనుకో.’’ -మొత్తం నాలుగువందలు అడుగుల వరకు బోరు దించి డబ్బులు చేతికి తీసుకుంటూ చివరిగా బోరు యజమాని అన్న మాటలవి.

నీళ్లు పడ్డాయన్న సంతోషం తప్పితే అవి ఎంత పడ్డాయి? ఎన్నాళ్లుంటా యన్నది వెంకట్రెడ్డి కెక్కలేదు. అతని బుర్రంతా ఇక మోటారెలా తేవాలా, ఎప్పుడు మోటారు పొలంలో ఆడించాలా, తన పొలంలో నీళ్లు బోర్లోంచి పాల నురగలా తెల్లగా దుముకుతుంటే చూసి ఎప్పుడు ఆనందించాలా… అని ఆలోచిస్తోంది.

‘‘కొన్నాళ్లు బోరాడించనీకి మోటార్ని అద్దెకు తెచ్చుకుందాం మావా. తరవాత కావాలంటే నిదానంగా సొంత మోటార్ని కొనుక్కోవచ్చు’’ మెల్లగా అంది గంగాదేవి మోటారు కోసమే ఆలోచిస్తున్న వెంకట్రెడ్డితో.

‘‘లేదే పిచ్చి మొఖెమా. అద్దెకని తీసుకుంటే పది దినాలకొకసారి మోటారికి లెక్క కడుతూనే ఉండాల. మనం ఆడించుకున్నది లేన్ది ఎవరూ పట్టించుకోరు. కరెంటున్నా లాకున్నా…’’

కరెంటు మాట వచ్చేసరికి వెంకట్రెడ్డి ముఖం ఒక్కసారిగా, ఉన్నపళంగా కలల సౌధం నుంచి కూలిపడింది.

‘‘అవును కరెంటు కావుద్దు. కరెంటు లాకుండానే మోటరాడుతాదా ఏంది? కరెంటు మహా పిర్రెం. కరెంటోళ్లు కరెంటు కన్నా పిశేచం. అప్పుడెప్పుడో గుడిసెలో సిన్న కరెంటు బుడ్డి ఏసుకున్న పాపానికి వచ్చి సానా రాద్దేంతం సేసినారు. దేసానికి సెరుపు తెచ్చినట్టు మండిపోయినారు. వీధిన అంతా మానం తీసినారు. బంగారెట్ల వైరు లాక్కుపోయినారు. నాయనా..  నాయనా  మీకు పుణ్ణెం  ఉంటది, పిల్లోళ్లు  రాతిళ్లు నేల మీద పడుంటారు, పురుగు పుట్రా వస్తాయని గంగాదేవి బతిమాల్తే ఆడ కూతురని కూడా సూడకుండా తిట్నారు. ఇట్టమొచ్చినట్టు సేసి పోయినారు. ఇంకోసారి ఇలాజేస్తే కేసెడతామని బెదిరించినారు’’ గుర్తు చేసుకొని మనసులో గజగజ వణికిపోయాడు వెంకట్రెడ్డి.

తన మామలోని భావాలను పసిగట్టింది గంగాదేవి. ‘‘అందుకే నా మాటిను మావా’’ అంది బుజ్జగింపుగా- మారు మాట్లాడ్లేదు వెంకట్రెడ్డి. అచ్చం గంగాదేవి చెప్పినట్లు చేయడానికి సిద్ధమయ్యాడు.

వెంటనే గాలి సుదర్శనాన్ని కలిశాడు. మోటారు అద్దెకు కావాలని అడిగాడు. సుదర్శనం సవాలక్ష షరతులు చెప్పాడు. తల తిరిగిపోయింది వెంకట్రెడ్డికి.

‘‘మోటారు బోర్లోకి దించేటప్పుడు తీసేటప్పుడు ఇరుక్కుపోతే బాధ్యత నీదే, చెక్‌ చేసేటప్పుడు కరెంటు వల్ల స్టార్టరు కాలిపోయినా, మోటారు మాడిపోయినా యింకా ఏ ప్రమాదాలు జరిగినా నష్టం నీవే భరించాలి. నా దగ్గరైతే ప్రస్తుతం మోటారు రెడీగా లేదు. శంకర్‌ రెడ్డి తోటలో బోరెండిపోయిండాది. మోటారు తెచ్చివ్వమంటే ఈరోజు, రేపు అంటున్నాడు. గట్టిగా మాట్లాడదామంటే పెద్ద మనిషి, ఎప్పుడు తెచ్చిస్తే అప్పుడు తీసుకోవాలి. లేదా అవసరమనుకుంటే మనమే మధ్యలో పోయి తెచ్చుకోవాలి. ఇప్పుడు నీకవసరం అంటున్నావు కాబట్టీ నీవే నీ సొంత ఖర్చులతో వెళ్లి ఆ బోరులోని మోటారును నీ బోరులోకి మార్చుకో. మూడు నెలల అడ్వాన్సు ముందే ఇవ్వాల. అలా ఇష్టమైతే సెప్పు లేకపోతే వదిలేయ్‌’’ తీరిగ్గా అన్నాడు గాలి సుదర్శనం.

షరతులకు తలూపి సుదర్శనంకు డబ్బు కట్టడం తప్పితే వేరే మార్గం లేక పోయింది వెంకట్రెడ్డికి. వెంకట్రెడ్డిని నమ్మి అంత విలువైన మోటారు అద్దెకిచ్చే వాళ్లు ఆ ఊర్లో మరెవరూ లేరు. అందుకే సుదర్శనం ఎన్ని షరతులు పెట్టినా తిరిగి మాట్లాడలేకపోయాడు వెంకట్రెడ్డి.

అక్కడ్నుంచి పది కిలోమీటర్లు దూరంలో ఉంది శంకర్‌రెడ్డి పొలం. మెకానిక్‌ కూలీలతో అక్కడికి చేరుకున్నాడు వెంకట్రెడ్డి. మూడు పొడవాటి ఇనుప స్తంభాలను గోపురంలా నిలబెట్టి చైన్‌తో బర్‌బర్‌మని ఆరు గంటలసేపు లాగి మెకానిక్కు, కూలీలు ఎండిన బోర్లోంచి మోటారును బయటికి తీశారు. వారికి కూలి చెల్లించి వారి సామాన్లను వారి స్వస్థలాలకు చేర్చి శంకర్‌రెడ్డి పొలంలోని మోటారును తన పొలంలోకి తీసుకెళ్లేసరికి తల పానం తోక కొచ్చింది వెంకట్రెడ్డికి. ఏ అర్ధరాత్రో ఇంటికి చేరుకున్నాడు కానీ నిద్ర పట్టడం లేదు.

‘‘ఉన్న లెక్కంతా బోరుకు, అద్దె మోటారుకు, సేతి ఖర్సులకే అయిపాయ. ఇంకాస్త ఎగేస్తే కాని మిగిలింది కరెంటోళ్లకు కట్టనీకి సరిపాదు. బోరైతే ఏసినా. నీళ్లైతే పడ్నాయి. పాతాళంలో ఉన్న గెంగను బయటికి తియ్యడమెట్లా? నా వల్ల అవుతుందా? అనెవసరంగా శక్తికి మించిన పని సేయడానికి పడ్డానే. దారి సూపు తండ్రి’’ ప్రతిక్షణం వెంకట్రెడ్డిలో ఆందోళన.

ఏదో తెలీని భయం, పిరికితనం కీడును తలపిస్తూ వెంకట్రెడ్డిని దయ్యంలా పట్టి పీడుస్తున్నాయి. అయినా ఎప్పటికప్పుడు ధైర్యం తెచ్చుకుంటూ చేయాల్సిన పనులకు సిద్ధం అవుతూనే ఉన్నాడు వెంకట్రెడ్డి.

‘‘కరెంటుకు లెక్క కట్టాలా? ఎలా కట్టాలా? ఎక్కెడ్నుంచి తేవాలా?’’ గుడిసెనకాల దొడ్లోకి వెళ్లాడు వెంకట్రెడ్డి. ఇంటికి పెద్ద దిక్కులాంటి కర్రెటి ఎనుము. మిల మిల మెరిసిపోతోంది. తనింటి కల్పతరువు. మౌనంగా తల వంచుకొని గడ్డి మేస్తోంది. గంగాదేవి ప్రతిరోజూ దానికి నీళ్లుపోసి పరిశుభ్రంగా ఉంచుతుంది. ఆ దృశ్యం చూడగానే బొటబొటా వెంకట్రెడ్డి కన్నుల్లోంచి నీళ్లు… ఒక్కసారిగా బోరుమన్నాడు వెంకట్రెడ్డి. ఎనుము కాళ్లు పట్టుకొని పసివాడిలా ఏడ్చాడు. తనను క్షమించమన్నట్లు వేడుకున్నాడు.

పనులున్నా, లేకపోయినా, పంటలు పండినా పండకపోయినా పూటకింత పాలిస్తూ తనని తన పిల్లల్ని రోడ్డున పడకుండా కాపాడుకొస్తున్న ఎనుము. రుణపడి ఉండాల్సింది పోయి దాన్ని సంతకు తరలించాల్సి వస్తున్నందుకు వెంకట్రెడ్డి గుండె నోరుకొట్టుకుంటోంది. ఆ పొలం వొద్దు… నీళ్లొద్దు.. ఈ ప్రపంచమే తనకొద్దు. తనకు, తనింటికి ఎంతో ఇష్టమైన ఆ ఎనుమొకటి తోడుంటే సాలు అనుకున్నాడు. కాని ఆచరించలేని నిస్సహాయత అతణ్ణి ఒక్కసారిగా కమ్మేసింది. పొలాన్ని నమ్ముకొని తనకున్న ఒకానొక ఆధారాన్ని అమ్ముకోవడానికి సిద్ధపడ్డాడు వెంకట్రెడ్డి. పక్కనే రెండు పల్లెలు దాటిపోతే సంత. ఆ రాత్రి ఎనుమును సంతకు తోలుకుపోయాడు. అనుకున్న రేటుకు ఎవరూ ముందుకు రాలేదు. కాని అవసరం. అడిగినంతకిచ్చేసి వెనక్కు తిరిగి చూడకుండా ఇంటికొచ్చాడు వెంకట్రెడ్డి. ఆ రోజంతా ఏదో కోల్పోయినట్లు బాధపడుతూనే గడిపాడు.

మరుసటిరోజు అన్యమనస్కంగానే కరెంటు ఆఫీసుకు బయలుదేరాడు. కొత్త కనెక్షన్‌ కావాలని అప్లికేషన్‌ రాయించుకెళ్లి యిచ్చాడు. వారం పదిరోజుల వరకూ అవి లేవు, ఇవి లేవని ఏవోవో కారణాలు చెప్పి ఒకటికి పదిసార్లు వెంకట్రెడ్డిని తిప్పారు. అతని సహనాన్ని పరీక్షించి చివరికి పరికరాలతో పనిలోకి దిగారు. చేతి వాటం ప్రదర్శించి మామూళ్లన్నారు. కూళ్లన్నారు. టిఫెన్లన్నారు. భోజనాలన్నారు. సామాన్లన్నారు. వెంకట్రెడ్డిని పీల్చి పిప్పి చేసి వదిలారు. చివరికి మెకానిక్‌ దగ్గరి కెళ్తుంటే అమ్మోరు ముందు బలికెళుతున్నట్లు అనిపించి విషాదంగా నవ్వుకున్నాడు వెంకట్రెడ్డి.

మిగిలింది నేరుగా మెకానిక్‌ చేతిలో పెట్టి నువ్వేడిపించడానికి నా దగ్గరేమి మిగల్లేదనే భావంతో చేతులు ముడుచుకొని దీనంగా నిలబడ్డాడు. మెకానిక్‌ వెంకట్రెడ్డి వాలకం చూసి ఏమీ మాట్లాడలేకపోయాడు. రంగంలోకి దిగి మోటారును బోర్లుకి దించాడు. స్టార్టరుకు కరెంటు కనెక్షన్‌ యిచ్చి పచ్చ బటన్‌ నొక్కాడు. అది చూసి వెంకట్రెడ్డి మనసు ‘ఏడుకొండలోడా వెంకట్రమణ’ అనుకుంది.

మోటరు బొడక్‌… బొడక్‌మని రెండుసార్లు అరిచింది కాని నీళ్లు పైకి రాలేదు. వెంకట్రెడ్డిలో అతృత. నేలతల్లి కడుపులోంచి తన పొలంలో నీళ్లు దూకుతుంటే చూడాలని ఆశ. అవి తన పొలంలో దూకితే తను సంపన్నుడైనట్లే. అతని కష్టాలు తీరినట్లే. బోరు నోరు వైపే కన్నార్పకుండా చూస్తున్నాడు వెంకట్రెడ్డి. కాసేపటి తర్వాత మెకానిక్‌ మళ్లీ బోర్లో వైర్లతో బిగించిన మోటారును కదిలిం చాడు. ఈసారి మాత్రం నీళ్లు. పసిపిల్లలు ఒంటికి పోస్తున్నట్లు… బోరు గొట్టంలోంచి సన్నగా… ! ఇక దూకుతాయి, ఇంకా దూకుతాయి, నీళ్లు… దూకుతాయి…. అల్లంత దూరంలో ఎగిరిపడతాయి. తనెన్నిసోట్ల సూల్లేదూ… తన పొలంలో కూడా నీళ్లు అలా అల్లంతా దూరంలో ఎగిరిపడాలని కోరుకోలేదూ… మరి దూకలేదే?… అనుమానంగా మెకానిక్‌ వైపు చూశాడు, మరేదైనా చేసి నీళ్లు రప్పిస్తున్నాడేమో అని.

మెకానిక్‌ తన పనంతా అయిపోయినట్టు సామాన్లు సర్దుకుంటున్నాడు. తన పొలంలో నీళ్లు యింతకన్నా ముందుకు దూకలేవని తెలిసిపోయింది వెంకట్రెడ్డికి. మాట పడిపోయింది. ‘‘ఈ నీళ్లకోసమేనా యింతగా కష్టపడింది. యిన్నాళ్లు కలలు కనింది.’’ అతనిలో బాధ, ఆవేశం, నిరాశ, నిస్పృహ. ఏడుద్దామనుకున్నాడు. ఏడవ బుద్ధి కాలేదు. నీళ్లులేని కళ్లతో మెకానిక్‌ వైపే చూస్తుండిపోయాడు.

పరిగెత్తుతున్న వాడల్లా ఒక్కసారిగ నడి పొలాల్లో మొకాళ్లమీద కూలిపోయి వెక్కివెక్కి ఏడ్సుకున్నాడు వెంకట్రెడ్డి గతాన్ని తల్సుకొని- అప్పటికే ఆలస్యమైపోతోంది. మళ్లీ స్టాటరు మీది మమకారం అతన్ని పరుగందుకునేలా చేసింది. కన్నీళ్లు మాత్రం చెంపలపై నుంచి ధారాళంగా కారిపోతూనే ఉన్నాయి. మనసు ఒకవైపు దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. అతనితోపాటు ఆలోచనలు కూడా మళ్లీ గతంలోకి పరుగందు కున్నాయి.

ఊర్లో అందరికీ తెలిసిపోయింది -‘‘వెంకట్రెడ్డి బోరు ఎత్తిపోయిందని. యించి నీళ్లైనా వస్తాయనుకుంటే అందులో సగం కూడా రావడంలేదని. అవి కూడా ఏ క్షణంలోనైనా అయిపోయి బోరు గుండె ఆగిపోవచ్చని, వెంకట్రెడ్డి కూడా ఇక తమ మధ్య చాలారోజులు మెదిలే సూచనలు కనిపించడంలేదని’’.

‘‘సచ్చిపోయేదెట్టా?’’ అని ఆలోచిస్తూనే మూడునెలలు బతికాడు వెంకట్రెడ్డి. అంజిగాని దగ్గరికెళ్లి గడ్డం పట్టుకున్నాడు. అతని పెళ్లాం, పిల్లల్ని ఒప్పించి ఎద్దుల్ని ప్పించుకున్నాడు. ఎంత దూరమైనాసరే వెళ్లి టయానికింత పచ్చగడ్డి కోసుకొచ్చి మేపుతానని, ఎలా ఉండే ఎద్దుల్ని అలా తిరిగి అప్పజెప్పుతానని మాటిచ్చాడు.

ఆ సుక్కసుక్క నీళ్లనే జాగ్రత్తగా పోగు చేసుకొని పొలం తడుపుకున్నాడు. దినమంతా పారగొట్టినా తడిసేది మూడు బోదెలే. అయినా ఓపికపట్టాడు. అలాగే కష్టపడ్డాడు. ఆ నీళ్లున్నంత వరకైనా ఒక పంట చేతికి తీసుకుంటే తను తిన్నా, తినక పోయినా వచ్చిందాంతో అప్పుభారం సగమైనా తీర్చుకుందామనుకున్నాడు. రేయి పగలు రెక్కలు ముక్కలు చేసుకొని పొలంపై విరుచుకుపడ్డాడు. సేద్యాలు పూర్తయ్యాయి. అంజిగాడి ఎద్దుల్ని జాగ్రత్తగా అన్నమాట ప్రకారం తిరిగి అప్పజెప్పాడు. సెరివాళ్లకు (బదులు) అక్కడిన్నీ, ఇక్కడిన్నీ గింజలు అడుక్కోని పొలంలో వేసుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి.

ఒకవైపు రోజు రోజుకు పెరిగిపోతున్న కరెంటు ఛార్జీలు, మరో వైపు నిర్బంధ వసూళ్లు రైతుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎక్కడ చూసినా కరెంటోళ్ల దాడులు. పొలాలపై పడి నిర్దాక్షిణ్యంగా వైర్లు, స్టార్టర్లు ఎత్తుకుపోతున్నారు. ఏ మాత్రం జాలి, దయ, కరుణ చూపడం లేదు. బ్రిటీషోళ్లు పన్నులు వసూలు చేస్తున్నట్లుంది పరిస్థితి.

ఎప్పుడు ఎవరి స్టార్టరు ఎత్తుకు పోతారో, ఎప్పుడు ఎవరి గుండె పగిలిపోతుందో తెలీదు. ఒక్కొక్కరు వేలతో కరెంటు బాకీలున్నారు. అందరూ స్టార్టర్లనే గుండెలు చేసుకొని బతుకుతున్నారు. ముందు జాగ్రత్తతో కరెంటు పోగానే స్టార్టర్లను తీసి దాసేసి ఇళ్లకు వస్తున్నారు. కొందరు పొలాల్లోనే కాపలా కాసుక్కూర్చున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో వెంకట్రెడ్డి ఆరోజే కొంచెం నిర్లక్ష్యం చేసి స్టార్టరును పొలంలో ఒంటరిగా వదిలేసి ఇంటికొచ్చాడు. అదే అతని ప్రాణాల మీదికి తెచ్చింది.

పాణాలకు వేలాడుతూ ఆయాసపోతూ, వగరుస్తూ మబ్బులొస్తున్న కళ్లను మూస్తూ, తెరుస్తూ పొలం చేరుకున్నాడు వెంకట్రెడ్డి.

అయిపోయింది. అంతా అయిపోయింది. తనేదైతే జరక్కూడదని ఇంత వరకూ కలలు కంటూ, పడుతూ, లేస్తూ, చస్తూ -బతుకుతూ వచ్చాడో అదే జరిగి పోయింది. అల్లంతా దూరం నుంచే తన పొలంలో స్టార్టరును ఊడదీస్తున్న కరెంటోళ్లను గుర్తించాడు వెంకట్రెడ్డి.

‘‘యింగెట్ట చేసేదిరా దేవుడా’’- పరుగుపరుగున వెళ్లి వారి కాళ్లందుకున్నాడు. ‘‘సార్‌… అద్దె మోటార్సార్‌… ఎండగాలుతున్న పైరు సార్‌… సుక్కాసుక్కా నీళ్లు సార్‌…’’

వాళ్ళు విన్లేదు. వెంకట్రెడ్డి అరిచాడు. గీపెట్టాడు. మొత్తుకున్నాడు. తల బాదు కున్నాడు. శక్తి కొద్దీ ఏడ్చి వారి కాళ్లు తడిపాడు. అయినా కరగలేదు వాళ్లు. వెంకట్రెడ్డి కాళ్లు వదలనేలేదు. తీగలా అల్లుకుపోయాడు.

‘‘స్టాటరెత్తుకుపోతే నేను, నా పెళ్లాం ఎల్టీన్‌ తాగాల్సార్‌ – పుణ్ణెం ఉంటాది సార్‌…’’

జాలి బదులు విసుగొచ్చింది వాళ్లకు. కోపంతో మండిపోయారు. అమ్మనా బూతులు తిట్టారు.‘‘కరెంటేమైనా నీ అబ్బ సొమ్మనుకున్నావురా బిల్లులు కట్టకుండా మోటరాడిరచుకోనీకి…’’

‘‘లేద్సార్‌… పంటొస్తానే అంతా కట్టేస్తా… టైమియ్యండ్సార్‌…’’

‘‘ఆలోగా మా ఉద్యోగాలు పోవాలనా’’ పళ్లు పటపటా కొరికారు వాళ్లు. పురుగును విదిల్చినట్లు కాళ్లకు చుట్టుకున్న వెంకట్రెడ్డిని గట్టిగా విదిల్చికొట్టారు. అల్లంత దూరంలో పడ్డ వెంకట్రెడ్డి మళ్లీ వచ్చి కాళ్లకు చుట్టుకున్నాడు. వారు మళ్లీ విదిల్చికొట్టారు. వెంకట్రెడ్డి మళ్లీ వచ్చాడు.

వీడు సామాన్యంగా వదిలేలా లేడు అనుకున్నారు వాళ్లు. ఈసారి లేవలేని విధంగా దొబ్బాలనుకున్నారు. దొబ్బి వదిలేశారు. ఎగిరి గెనుంపై పడ్డ వెంకట్రెడ్డి మళ్లీ లేవలేదు. అంతా నిర్మానుష్యం.

వారు వడివడిగా అడుగేలేసుకుంటూ వెళ్లి స్టార్టరుతో జీపెక్కి కూర్చున్నారు. జీపు స్టార్టయ్యింది. ఇప్పుడు వారికి, వారి జీపుకు అడ్డు ఎవరూలేరు. జీపు ముందుకు కదిలింది. దుమ్ము లేపుకుంటూ వెళ్తున్న ఆ జీపు వెంకట్రెడ్డి ప్రాణాన్ని తీసుకెళుతున్న యముని వాహనంలా ఉంది.

ఆదివారం ఆంధ్రజ్యోతి, 18 మే 2003

కడప కథ,  ‘రైతు కథలు’ సంకలనం `2012

వేంపల్లె షరీఫ్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు