నువ్వు ఎలా ఉన్నావని అడకకండి!.
మొక్కలు పువ్వులతో నిండిఉన్నాయ్.
చుట్టూ పక్షుల అరుపులున్నాయ్.
మీకంటే బావున్నానని మట్టిని పుచ్చుకుని చెబుతాను.
నేను బాగోకపోయినా నాకు ఇష్టమే!.
నన్ను చూసేందుకు ఆకాశముంది.
పలకరించేందుకు సూర్యచంద్రులున్నారు.
ఊసుల్ని దాచుకుందుకు కోట్ల నక్షత్రాలున్నాయ్.
నేను బావున్నాననీ బాలేదనీ
తెల్లకాగితాలు, నల్ల అక్షరాలకి మాత్రమే చెబుతాయ్.
మీరంతా ఎలా ఉన్నారని నేను అడగను.
ఇదుగో, ఇలా బావున్నానని
ఉచ్ఛారణపూర్వక స్వరమే కావాలా మీకూ!?
ముందంతా ఇలానే కాలయాపన.
వేడిమిని వర్షాన్నీ చలిని సరిగ్గా తెలుసుకోలేకపోయాను.
ఆశనిరాశల తక్కెడలో మనుషుల్నే నమ్మి మరణిస్తున్నట్లయ్యాను.
అంతగా సమయం నా వెంట పడట్లేదు.
నేనూ దేన్నీ తరమట్లేదు.
అందంగా ఇప్పటినంతా చూస్తున్నా.
ఇప్పటిలో మొన్నటి చింతల్ని కొంచం కొంచం
దూరం జరుపుతున్నా.
నేను ఎలా ఉన్నానో చెప్పడానికేముందీ!?
కాలాంతపు చివర్లకి తాడులు కట్టిఉన్నాయ్.
అంతా ఉయ్యాలాటలో ఉన్నారు.
ఎవరెప్పుడు పైకివెళతారో?!
ఎవరెందుకు క్రిందికివస్తారో?!
ఎవరికిమాత్రం స్పష్టంగా తెలుసూ?..
*
చక్కని కవిత, గొప్ప తాత్వికత
Thank you sir
good one
Thank you andi