ఉత్తర ఐర్లాండ్ కి చెందిన అన్నా బర్న్స్ మూడవ నవల ‘మిల్క్ మాన్’. పాఠకులకు ఈ పుస్తకం చదవడం ఓ పరీక్ష. ఎందుకంటే ఇందులో రచయిత్రి ప్రయోగించిన శైలి చాలా క్లిష్టంగా ఉండి అయోమయానికి గురి చేస్తుంది. ఎందరో రచయితలు తమ కథ కోసం ఎన్నో రకాల శైలులను ఉపయోగించుకుని ఉంటారు. కాని ఇందులో రచయిత చేసిన ప్రయోగం మాత్రం చాలా వింత అనుభవాన్నిఇస్తుంది. ఉత్తమ పురుషలో నడిచే ఈ కథలో పాత్రల పేర్లు ఉండవు. వారు నివసించే నగరం పేరు కూడా ఉండదు. ఎక్కడా ఏ పేరు లేకుండా కథను నడిపించడం ఒక ఎత్తైతే ఇందులో వచ్చే సంఘటనలు ఓ క్రమంలో ఉండవు. పైగా నవల అంతా ఓ వ్యక్తి స్వీయ కథనం, ఆలోచనలే. వాటిని అర్ధం చేసుకుని జోడించుకుంటూ వెళ్ళడం పాఠకుల పని. ఆనందం కోసం ఆహ్లాదం కోసం అయితే ఈ పుస్తకం చదవలేరు.
ఈ నవలకు బూకర్ రావడంతో అన్నా బర్న్స్ ఈ బహుమతి పొందిన మొదటి ఉత్తర ఐర్లాండ్ రచయితగా చరిత్ర సృష్టించారు. 1970లలో ఐర్లాండ్ దేశంలోని రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ‘మిల్క్‌మ్యాన్’ కథ నడుస్తుంది. ఇంగ్లండ్ నుండి విడిపోవాలనుకునే ఐరిష్ నాగరికులు, కలిసి ఉండాలనుకునే ఇంగ్లండ్ ప్రేమికుల నడుమ సంక్షోభం రాజకీయ సంక్షోభానికి దారి తీసిన సమయం అది. కథలో వ్యాఖ్యాత ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి. ఈమెకు రాజకీయ పరిజ్ఞానం పెద్దగా లేదు. పందొమ్మిదవ శతాబ్దపు నవలలను నడుస్తూ చదవడం ఈమె కిష్టం. ఇలా నడుస్తూ నవలలు చదివే ఆమెను ఆ నగరంలోని వారంతా వింతగా చూస్తారు. ఈమె తల్లికి ఆడపిల్లలకు ఇరవై ఏళ్ల లోపు పెళ్ళి చేసేయాలనే ఆరాటం ఎక్కువ. ఈమె అన్నలు రాజకీయ గొడవలలో తల దూర్చి ఒకరు చనిపోతే మరొకరు పరారీలో ఉంటారు. ఆమె చుట్టూ ఓ రకమైన భయం గొలిపే వాతావరణం ఉంటుంది. ఇవేమి పట్టనట్లు తన ప్రపంచంలో తానుండి ఏవో చదువుకుంటూ కాలం గడుపుతూ ఉంటుంది ఈమె. అందుకే ఆమెను అందరూ అనుమానంగా చూస్తూ ఉంటారు.
ఒక రోజు అలా చదువుకుంటూ వెళుతున్న ఆమె, మిల్క్‌మ్యాన్ దృష్టిని ఆకర్షిస్తుంది, అతను ఎదో రాజకీయంగా ఆ నగరంలో క్రియాశిలక పాత్ర పోషిస్తుంటాడు. ఆమెకు తన వాన్ లో లిఫ్ట్ ఇస్తానంటాడు మిల్క్‌మ్యాన్. కాని ఆమె దానిని సున్నితంగా తిరస్కరిస్తుంది. ఇది అతని అహాన్ని దెబ్బతీస్తుంది. ఈమెకు రన్నింగ్ పై కూడా ఆసక్తి ఎక్కువ. వ్యాయామం అంటే ఇష్టపడే మూడవ అక్క భర్తతో ఆమె రన్నింగ్ కి వెళ్తూ ఉంటుంది. అలా రన్నింగ్ కు వెళ్తున్నప్పుడు కూడా ఆమె మరో సారి మిల్క్‌మ్యాన్ ని చూస్తుంది. అతనికి తనపై ఆసక్తి ఉందని, తనను వెంబడిస్తున్నాడని ఆమెకు అర్ధం అవుతుంది. అతను వ్యాన్ ఆపి ఈమెతో మాట్లాడడం చూసిన జనం వీరిద్దరి మధ్య సంబంధం ఉందన్న వార్తను ప్రచారం చేస్తారు. దీన్ని అందరూ నమ్ముతారు. మిల్క్‌మ్యాన్ వివాహితుడు పైగా ఈ అమ్మాయి కన్నా వయసులో ఎంతో పెద్దవాడు. ఈ వార్త విన్న తల్లి కూతురిని మందలిస్తుంది. ఇది కేవలం ఒక పుకారు అని ఆ అమ్మయి చెప్పినా తల్లి అది నమ్మదు. కూతురు తప్పు చెస్తుందనే నిర్ధారణకు వస్తుంది. సమయం దొరికినప్పుడల్లా కూతుర్ని మాటలంటూనే ఉంటుంది.
ఈ అమ్మాయి పెద్ద అక్క ఒకతన్ని ప్రేమించి అది ఫలించక మరొకరిని వివాహం చెసుకుంటుంది. ప్రియుడు మరణించాడని విన్నప్పుడు ఆమె ఆ దుఖంలో కొట్టుకుపోతుంది. ఈ పెద్ద బావ ఓ మూర్ఖుడు, అవకాశవాది. అతను ఈ అమ్మాయి పై వచ్చే పుకార్లకు ఆజ్యం పోస్తాడు. రెండవ అక్కకు కుటుంబంతో సంబంధం ఉండదు. మూడవ అక్క షాపింగ్లతో స్నెహితులతో పార్టిల కోసం సమయం వెచ్చిస్తూ ఉంటుంది. ఈ మూడవ బావ మాత్రం ఎవరినీ పట్టించుకోకుండా ఈ అమ్మాయిని తానుగా స్వీకరిస్తాడు. అతనొక్కడే తనను మనిషిగా గుర్తిస్తున్నాడని ఆమె నమ్ముతుంది. పైగా ఏ పుకార్లను తావివ్వకుండా మనుష్యులను తన మనసు ద్వారా చూడగలిగే వ్యక్తి దగ్గర ఎంత భద్రత ఉంటుందో ఈ మూడవ బావ దగ్గర ఆమె అనుభవిస్తుంది. కాని అతనికి తన వ్యాయామం, తన చిన్న ప్రపంచం తప్ప మరేదీ పట్టదు. దీని వలన అతన్ని ఎవరూ పెద్దగా లెక్కించరు.
ఈ అమ్మాయికి ఓ బాయ్ ప్ర్రెండ్ ఉంటాడు. అతనితో ఆమె ఓ సంవత్సర కాలంగా డేటింగ్ లో ఉంటుంది. కాని ఆమెకి తమ మధ్య బంధంలో ఏదో లోపం ఉందనే అనిపిస్తూ ఉంటుంది. అతనితో సానిహిత్యం కోరుకుంటున్నా అతనూ తన పై అధికారం ప్రదర్సిస్తూ ఉండడం ఆమె గమనిస్తూ ఉంటుంది.
మిల్క్‌మ్యాన్ ఆమెను వెంబడిస్తూ ఉంటాడు. తాను తిరుగాడే ప్రతి చోటా అతని కళ్ళు వెంటాడుతున్నట్లే ఉంటుంది ఆ అమ్మాయికి. ఈమె తండ్రి అంతకు ముందే మరణీస్తాడు. అతను మతి స్థిమితం కోల్పోయి కొన్నేళ్ళూ ఎవరికీ అర్ధం కాని రీతిలో జీవించాడు. చనిపోబోయే ముందు అతని బాల్యంలో లైంగిక వేధింపులకు గురయ్యాడనే సంగతిని అతను అపస్మారక స్థితిలో ఉండగా ఈ కూతురికి చెప్తాడు. తండ్రి పట్ల ఆమెకు అందుకే కొంత సానుభూతి ఉంటుంది. కాని తండ్రి అసహాయత కారణంగా ఒంటి చేతితో ఇల్లు నడిపి ఎన్నో విషాదాలను అనుభవించిన తల్లి అంటే ఆమెకు గౌరవం కూడా. కాని ఊరిలోని పుకారులనే తల్లి నమ్మడం తనకు చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వకపోవడం ఆమెను ఇంకా ఒంటరిని చెస్తాయి. ఈ సమయంలోనే ఆమె ప్రేమ విషయం తెలిసిన మిల్క్‌మ్యాన్ ఆమె ఆ బాయ్ ఫ్రెండ్ తో స్నెహం మానెయాలి అని లేదంటే తాను అతన్ని హత్య చేస్తానని బెదిరిస్తాడు. దీనితో ఆమె చాలా భయపడుతుంది. తన బాయ్ ప్రేండ్ తో కూడా ఏమీ చెప్పలేకపోతుంది. అతనితో సరిగ్గానూ ఉండలేకపోతుంది. ఎక్కడికి వెళ్తున్నా తనను మిల్క్‌మ్యాన్ వెంబడిస్తున్నట్లు అనిపించి అభద్రతా భావంతో కొట్టుకుపోతూ ఉంటుంది.
ఈమె బాయ్ ఫ్రెండ్ కి కార్ల పిచ్చి. ఓ పాత కారు కొని స్నేహితులకు చూపిస్తె అది శతృదేశానికి చెందిన కారని వారు అతన్ని దేశద్రోహిగా పరిగణించి గోల చేస్తారు. ఇది మళ్ళీ ఏ గొడవకు దారి తీస్తుందో అని ఆమె భయపడుతుంది. ఒక రోజు ఈమె బాల్య స్నెహితురాలు కలిసి ఆమె కున్న ఈ నడుస్తూ పుస్తకాలు చదివే గుణం వల్లే ఊరిలో అనుమానాస్పద వ్యక్తిగా ఆమె పెరు పొందిందని, ఆ అసాధారణ అలవాటు వలనే ఆమెను అందరూ అనుమానిస్తున్నారని చెబుతుంది. అంటే నలుగురిలో కలవక ఎదో వింత ప్రపంచంలో, వింత అలవాటులతో జీవించాలనుకునే వారి పట్ల సమాజంలో ఎప్పుడూ ఓ అనుమాన దృష్టి ఉంటుందన్న విషయం ఈ అమ్మాయికి అర్దం అవుతుంది.
ఈ లోగా మతి చలించిన ఓ అమ్మాయి ఈమె పై విషప్రయోగం చేస్తుంది. దానితో ఆమె కొన్ని రోజులు మంచానికి అతుక్కుపోతుంది. ఆ నాటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ సమయంలో కూడా ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోతుంది ఆమె తల్లి. ప్రతి క్షణం ఒకరి పట్ల మరొకరికున్న అనుమానం ప్రజలలో ఎంతటి అభద్రతా భావాన్ని పెంచుతుందో ఈ సంఘటన చెబుతుంది. రాజకీయ కారణాలతో దూరం అయిన కోడుకులున్న ఇంట విషప్రయోగం అయిన ఈ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకువెళితే ఆ తరువాత ఆ పోలీసుల ప్రశ్నలు, వారి అనుమానాలు ఎదుర్కోవడం కష్టం అని ఇంటి వైద్యంతోనే ఈ అమ్మాయికి చికిత్స చేస్తారు ఊరివాళ్లు.
బతికి బైట పడ్డాక చెల్లెళ్ల కోసం చిప్స్ కొందామని ఆమె దుకాణానికి వెళితే అందరూ ఆమెను చూసి భయపడి దూరం జరుగుతారు. దుకాణం వాళ్ళు చిప్స్ ఇచ్చి కనీసం డబ్బులు కూడా తీసుకోరు. అంతకు ముందు రోజు ఈ అమ్మాయి పై విష ప్రయోగం చెసిన అమ్మాయిని ఎవరో హత్య చేస్తారు. ఈ అమ్మాయి పై విష ప్రయోగం చేసినందుకు మిల్క్‌మ్యాన్ ఆమెను చంపెసాడని ఊరిలో మరో పుకారు మొదలవుతుంది. దీనితో తనను ఎవరూ నమ్మె స్థితిలో తనజీవితం లేదని ఈ అమ్మాయికి అర్ధం అవుతుంది. తనకు సంబంధం లేకపోయినా ఇప్పుడు ఊరందరి అభిప్రాయాలే తన జీవితాన్ని నియంత్రించబోతాయని ఆమెకు అర్ధం అవుతుంది.
ఈ అమ్మాయి తల్లి తమకు రోజూ పాలు తీసుకువచ్చె మిల్క్‌మ్యాన్ ని ప్రెమిస్తుంది. ఇతను నిజంగా మిల్క్‌మ్యాన్. మంచివాడు. ఈమె తల్లికి బాల్య స్నెహితుడు. అతనిపై పోలీసులు కాల్పులు జరిపడం వల్ల గాయపడి ఆసుపత్రి పాలవుతాడు ఈ నిజమైన మిల్క్‌మ్యాన్. ఆ అమ్మాయి తల్లి అతనికి సపర్యలు చెస్తుంది. ఆమె పెళ్ళి చేసుకుంది కాని ఆ భర్తని ఏ రోజు ప్రేమించలేకపోయింది. పైగా అతని అనారోగ్యం ఆమెపై భద్యతల బరువును వేసింది తప్ప జీవితంలో ఎటువంటి ఆనందాన్ని ఇవ్వలేదు. ఈ సంగతి ఆమె సంతానానికి తెలుసు. కాని వివాహ బంధాన్ని గౌరవించడం ఒక అవసరంగా మారిపోయిన తరువాత ఆమె ప్రేమను మనసులో తొక్కిపెట్టి భాద్యతల నడుమ బందీ అయి జీవించింది.
ఆ అమ్మాయి బాయ్ ప్రేండ్ తల్లి తండ్రులు వారి పిల్లల చిన్నతనంలోనే తమకిష్టం అయిన నాట్యం కోసం పిల్లలను ఇంటిని వదిలి వెళ్లిపోతారు. బాధ్యతల కన్న తమ ఇష్టాల కోసం తాము జీవించదలచుకున్నామని చెప్పి చిన్న బిడ్డలను అనాధలుగా చేసి వారు ఆ నాట్యకళలో గొప్ప పేరు ప్రతిష్టలు గడిస్తారు. వారి బిడ్డలు వారొదిలి వెళ్ళిన ఇంట తమ కాయ కష్టంతో బ్రతికి పెద్దవారవుతారు. కాని ఆ పని తన తల్లి చేయలేదని దానికి తాము కారణం అని తెలుసుకున్న ఈ అమ్మాయి తన అక్క సహకారంతో తల్లిని ఆమె ప్రేమికుడిని కలుపుతుంది.
ఓ రోజు ఈ అమ్మాయికి ఆమె బాయ్ ఫ్రెండ్ ఫోన్ చెస్తాడు. అతను తనపై వచ్చిన పుకార్లను విన్నాడని ఆమెకు అర్ధం అవుతుంది. వారిద్దరి మధ్య మాటల యుద్దం జరుగుతుంది. సర్ది చెప్పాలని అతని ఇంటిని ఆమె వెళుతుంది. అక్కడ అతని కళ్ళపై ఎవరో దాడి చేసారని ఆమెకు తెలుస్తుంది. ఇది మిల్క్‌మ్యాన్ పనెమో అని భయపడుతుంది. అతను హాస్పిటల్ కు వెళ్లకుండా ఇంట్లోనే వైద్యం చేసుకుంటూ ఉంటాడు. ఆతన్ని చాటుగా గమనిస్తున్న ఆమెకు తను తన స్నేహితుడితో శారీరికంగా చనువుగా ఉండడం ఆశ్చర్యపరుస్తుంది . అతనో హోమో అని ఆ స్నేహితుడితో అతనికి సంబంధం ఉందని ఆమెకు అర్ధం అవుతుంది. అతని ఇంటి నుండి షాక్ తో బైటకు వచ్చిన ఆమెను మళ్ళి మిల్క్‌మ్యాన్ ఆపుతాడు. వాన్ ఎక్కమని బలవంత పెడతాడు. అన్ని దారులు మూసుకుపోయినట్లుగా అనిపించి ఆమె అతని వాన్ ఎక్కుతుంది. ఆమెను ఇంటి ముందు దింపి మరుసటి రోజు ఆమెను బైటికి తీసుకు వెళతానని సిద్దంగా ఉండమని చెబుతాడు మిల్క్‌మ్యాన్. కాని అదే రోజు అతన్ని పోలీసులు హత్య చేస్తారు. అతను దేశ విద్రోహ చర్యలను పాల్పడుతున్నాడని వారి వద్ద సమాచారం ఉంటుంది. అతను కొన్ని నెలలుగా పోలీసులను తప్పుకుని తిరుగుతున్నాడు. అతని ఆచుకుని తెలుసుకుని పట్టుకునే ప్రయత్నంలో కొందరిని పోలీసులు ఇతనే అని భావించి హత్య చేస్తారు. తల్లి స్నెహితుడు నిజమైన మిల్క్‌మ్యాన్ పై కూదా పోలీసులు అతను ఈ రాజకీయ ద్రోహి మిల్క్‌మ్యాన్ అని అపోహపడి కాల్పులు జరుపుతారు. చివరకు అతనే తాము వెదుకుతున్న రాజకీయ ద్రోహిగా గుర్తించి పోలీసులు మిల్క్‌మ్యాన్ ను హత్య చేస్తారు.
మిల్క్‌మ్యాన్ మరణంతో ఆమె ఎంతో నిశ్చింతను అనుభవిస్తుంది. ఆనందంగా పబ్ కు వెళుతుంది. కాని ఆమెను ప్రేమిస్తున్నానని వెంటబడే ఓ ఆకతాయి అక్కడ ఆమెపై అత్యాచారం చేయబోతాడు. ఇంతకు ముందు అమె మిల్క్‌మ్యాన్ గర్ల ఫ్రెండ్ అని భావించి ఈమెను ఇబ్బంది పెడితె అతనేమన్నా చేస్తాడేమో అన్న భయంతో ఆమెకు దూరంగా ఉన్న ఆకతాయిలు మిల్క్‌మ్యాన్ మరణంతో విజృంభిస్తారు. మిల్క్‌మ్యాన్ వల్ల తనకు కొంత రక్షణ కూడా దొరికిందని ఆమెకు అర్ధం అవుతుంది. కాని పబ్ లోని కొందరు స్త్రీలు ఆ ఆకతాయికి బుద్ది చెప్పి ఈ అమ్మాయిని రక్షిస్తారు. చివరకు అన్నికష్టాలు తీరాయన్న నిశ్చింతతో ఆమె భవిష్యత్తులోకి ప్రయాణిస్తుంది.
ఈ నవల అంతా కూడా ఆ అమ్మాయి తనతో తాను చేసుకునే ఆలోచనల నేపద్యంలోనే నడుస్తుంది. అంటే పూర్తి నవల కూడా స్వీయ సంభాషణే. నవలలో ఎవరి పేర్లూ ఉండవు. ఇది మరీ ఇబ్బందిగా ఉంటుంది పాఠకులకు.
కాని ఇందులో స్టాల్కింగ్ (ఓ వ్యక్తిని నిరంతరం వెంబడించడం) కు గురి అయిన అమ్మాయి మనసులోని సంఘర్షణను రచయిత్రి బాగా చూపగలిగారు. ఏ తప్పు చేయకపోయినా ఆమె ప్రమేయం లేకుండా పుట్టే పుకార్ల పట్ల ఆమెలో కోపం, అసహాయత, వల్ల ఆమె ప్రవర్తనలో ఎంతో మార్పు వస్తుంది. కుటుంబంలో సమాజంలో తనను నమ్మే వారెవరూ లేరన్నప్పుడు ఆమెలో ప్రవేశించే మొండితనం ఆమె చేసే ప్రతి పనిలోను కనిపిస్తూ ఉంటుంది. ఇది ఆమెను ఇంకా ప్రమాదంలోకి నెట్టేస్తూ ఉంటుంది. పది మంది నమ్మేదాన్నే నిజం అని నమ్మే సమాజంలో ఓ వ్యక్తికి ఎదురయ్యే ఇబ్బందులను ఈ నవల చర్చిస్తుంది. రాజకీయం, కుటుంబ జీవనం, చివరకు ప్రతి మానవ సంబంధం కూడా ఓ పది మంది అభిప్రాయం పై ఆధారపడి ఉంటుంది అన్నది ప్రతి చోట పాఠకులకు స్పష్టం అవుతూ ఉంటుంది
ఈ నవల మానవ సమూహంలో అనవసరమైన మాటలు, సామాజిక ఒత్తిడికి ఉన్న శక్తిని అద్భుతంగా వివరిస్తుంది. వ్యక్తిగత లైంగిక వేధింపుల పై కనికరం లేని ప్రజాభిప్రాయం, పుకార్లకు ఉన్న బలం, అలాగే రాజకీయ విధెయత ఎలా ప్రభావం చూపుతాయో చర్చిస్తుంది.
ఈ పుస్తకం ఎందరో ప్రశంసలను అందుకుంది. ముఖ్యంగా ఇందులో రచయిత్రి ప్రయోగించిన శైలి అందరీకీ సాధ్యం కాదన్నది నిజం. రాజకీయ సంక్షోభం, ఇష్టంలేని వివాహంలోని ఇరుకు, తమకు అర్ధం కాని వ్యక్తులపై అకారణ కోపం, అపవాదుల కున్న శక్తి ఇవన్నీ మనుష్యుల జీవితాలను ఎలా సుడిగుండంలోకి నెట్టేస్తాయో, వారి ప్రమేయం లేకుండా వారిని పావులుగా ఎలా మారుస్తాయో చర్చించిన మంచి నవల మిల్క్‌మ్యాన్. కాని దీన్ని చదవడం మాత్రం పాఠకులకు ఓ సవాలన్నది మాత్రం నిజం.
*
Add comment