అన్వర్ భాయ్ కాలింగ్

1.

నేనెక్కడున్నానో నాకే తెలియట్లేదు. అంతా చిమ్మచీకటి,అక్కడెక్కడో మూలన ఫోన్ మోగుతోంది, ఒక చిన్న వెలుగు… ఆశగా అటువైపు పరుగెత్తాను… కాళ్లకేదో తగిలి కిందపడ్డాను…బొటనవేలు పగిలింది, రక్తం కారుతోంది, నల్లగా ఉంది, నొప్పి మాత్రం లేదు.  ఫోన్ మోగుతూనే ఉంది… ఆ రింగ్‌టోన్, ఆ ఫ్లాష్‌లైట్ అంతా గందరగళంగా ఉంది… పాక్కుంటూ ఫోన్ దగ్గరికి వెళ్లాను… ఫోన్ స్క్రీన్ మీద “అన్వర్ భాయ్ – కార్ క్లీనింగ్” కాలింగ్ అని కనిపిస్తోంది అది చూడగానే నా శరీరం కంపించింది.  ఫోన్‌ను దూరంగా విసిరేసి, వేగంగా వెనక్కి జరిగాను… ధడ్!.. దేనికో గుద్దుకున్నాను… అలా కూర్చునే గోడను వెతుక్కుంటూ వెనక్కి జరుగుతున్నాను… ఇంతలో మళ్లీ ఎక్కడో ఫోన్ మోగింది, ఫ్లాష్‌లైట్ వెలుగుతోంది  , అటుగా పాకుతున్నాను..ఒక్కసారిగా మోగుతున్న ఫోన్ గాల్లోకి లేచి, నేనున్న చోటుకు వచ్చింది… మెల్లగా దానితో పాటు మరికొన్ని ఫోన్లు గాల్లోకి లేచి, నా చుట్టూ తిరుగుతున్నాయి. ఫోన్ల సంఖ్య ఎక్స్‌పోనెన్షియల్‌గా పెరిగిపోయింది. లక్షల్లో ఫోన్లు, ఫ్లాష్‌లైట్లు… అవన్నీ నా చుట్టూ తిరుగుతున్నాయి. నేను మధ్యలో రెండు కాళ్ళు కడుపులోకి ముడుచుకుని కూర్చుని ఉన్నాను. ఆ లక్షలాది ఫోన్ల స్క్రీన్ల మీద ఒక్కటే కనిపిస్తోంది… “అన్వర్ భాయ్ – కార్ క్లీనింగ్” కాలింగ్… కళ్లు గట్టిగా మూసుకున్నాను. ఇప్పుడు ఆ ఫోన్లన్నీ ఒక్కసారిగా రింగ్ అవుతున్నాయి… “అన్వర్ భాయ్ – కార్ క్లీనింగ్… ప్లీజ్ పిక్ అప్…” భయంకరంగా ఉంది ఆ శబ్దం.నేను పిచ్చిపట్టినవాడిలా గట్టిగా అరుస్తున్నాను.ఒక్కసారిగా ఆ లక్షలాది ఫోన్లు నా మీద పడుతున్నాయి… నేనెక్కడున్నానో నాకే తెలియట్లేదు.

మణికట్టు మీద పెట్టుకున్న ఆపిల్ వాచ్ “బీప్, బీప్” మంటూ అరుస్తోంది—”High heart rate notification.” మెలుకువ వచ్చింది… లేచి మంచం మీద కూర్చున్నాను. వాచ్ స్క్రీన్ మీద ఎర్ర రంగు హార్ట్ సింబల్ ఫ్లాష్ అవుతోంది.నెల రోజులుగా ఇదే కల. దీన్నేమనాలి? పీడకల అనొచ్చా? విన్నీ కి కాల్ చేశాను. ఫోన్ లిఫ్ట్ చేసి, స్పీకర్‌లోపెట్టి . కిచెన్ వైపు నడిచాను.

“మళ్లీ అదే కలా?”

“హ్మ్మ్… అవును.”

“మళ్లీ హార్ట్ రేట్ పెరిగిందా?”

“హా, అవును.”

“డాక్టర్‌తో మాట్లాడుదామా?”

“వద్దు…. Let me take my own time…చూద్దాం ఈ గాయం ఎప్పటికి మానుతుందో ”

“ఇంకెన్ని రోజులు పడుతుంది ఫార్మాలిటీస్ పూర్తి అవ్వడానికి?”

“అదే తెలియట్లేదు…  SATA(సౌదీ అరేబియా తెలుగు అస్సోసియేషన్ ) వాళ్ళు శాయశక్తులా కృషి చేస్తున్నారు.”

“ఇప్పటికే 45 రోజులకి పైనే అవుతోంది కదా విజయ్… పాపం వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ ఎంత వర్రీ అవుతున్నారో కదా?”

“హా, అవును… ఇది చాలా పెద్ద ప్రాసెస్ విన్నీ. ఇంకా ఫార్మాలిటీస్ పూర్తవ్వడానికి టైమ్ పట్టేలా ఉంది. మనం అనుకున్నంత ఈజీ కాదు… చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఇది. పోలీస్ ఇన్వాల్వ్ అయింది కదా! ఫోరెన్సిక్ రిపోర్ట్, హాస్పిటల్ క్లియరెన్స్ రావాలి. అది పోలీస్ స్టేషన్‌లో సబ్మిట్ చేస్తే వాళ్లు క్లియరెన్స్ ఇస్తారు. ఆ తరువాత ఇండియన్ ఎంబసీ వాళ్లతో మాట్లాడి బాడీనీ కార్గో చేయించాలి. కార్గోబాక్స్‌కి ఖర్చు ఐదు వేల రియాల్స్ పైనే  అవుతుంది. అన్వర్ భాయ్ వాళ్ల కఫిల్ (ఎంప్లాయర్) నాకు సంబంధం లేదంటున్నాడు. ఇండియన్ ఎంబసీ వాళ్లకి రిక్వెస్ట్ పెట్టాం. నడుస్తోంది ప్రాసెస్, చూద్దాం ఏమవుతుందో.”

“హ్మ్మ్, నువ్వు ఎక్కువ ఆలోచించకు… నువ్వేం చేయగలవు?”

“ఏమో విన్నీ… బిల్డింగ్ బయటకు వెళ్తే అన్వర్ భాయ్ గుర్తొస్తున్నాడు. అసలు అలా ఎలా జరిగిందో ఇంకా నమ్మలేకపోతున్నాను. ఒక మనిషి అలా అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు. ఒక మనిషి మరణం, అది కూడా ఇలా పరాయి దేశంలో… మన దేశంలో, మన అనుకున్న వాళ్ల దగ్గరో, మన ఊరిలోనో చస్తే ‘శవం’ అంటారు. సాయంత్రానికో, మరుసటి రోజు ఉదయానికో ఖననం చేస్తారు,అయిపోతుంది. కానీ ఇలా పరాయి దేశంలో చస్తే ఇప్పుడతను, స్టాంపు ముద్రల కోసం ఎదురు చూస్తున్న ఒక అప్లికేషన్ ఫారం. ఒక ఆఫీస్ నుంచి మరో ఆఫీస్‌కి, ఒక డెస్క్ నుంచి మరో డెస్క్‌కి మారే ఒక పేపర్. మార్చురీలో అతనిది దిక్కులేని ఒక అనాథ శవం. He is just a piece of paper, on someone’s desk. శవానికి కూడా వీసా? వాట్ ఏ మిజరీ! …

వాళ్ళ ఇంటి దగ్గరేమో, మొన్నటిదాకా మూడేళ్ల తరువాత ఇంటికి రాబోతున్న అన్వర్ భాయ్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన వాళ్లు, ఇప్పుడు ‘కనీసం చివరి చూపులైనా చూస్తామా, లేదా కనీసం వీడియో కాల్‌లో అయినా చూపించండి అని అడుగుతున్నారు అంట.”గొంతు జీర పోయింది . కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి.

“ప్లీజ్, ఎమోషనల్ అవ్వకు. నాకర్థమవుతోంది, నువ్వు మెంటల్‌గా ఎంత స్ట్రగుల్ అవుతున్నావో అక్కడ. ఈ టైమ్‌లో నేను నీతో ఉండాల్సింది, కానీ ఏం చేద్దాం? చిన్నదాని పాస్‌పోర్ట్ ఇంకా టైమ్ పట్టేలా ఉంది.”

“ఈ టైమ్‌లో నువ్వు ఇండియాలో ఉండటమే బెటర్ విన్నీ.”

“సరే, పాప లేచింది. మళ్లీ మాట్లాడుదాం. గో ఫర్ ఏ రన్… కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది. మళ్ళీ చెబుతున్నా జరిగినదాంట్లో నీ తప్పేం లేదు , అనవసరంగా గిల్టీ ఫీలింగ్ పెట్టుకోకు.”

2

రెండేళ్ల క్రితం, ఒక రోజు ఉదయం ఆఫీసుకు బయల్దేరే సమయంలో నా కారు మొరాయించింది, ఇగ్నిషన్ అవ్వట్లేదు.ఒక పది నిముషాలు ప్రయత్నించి, ఇక అయ్యేలా లేదని ,కారు దిగి బయట నిలుచున్నాను.

క్యాబ్ యాప్స్ అన్నీ తెరిచి రేట్లు చూస్తున్నాను… ఉబర్, జీనీ, బోల్ట్, కరీం… అన్నీ వంద సౌదీ రియాల్స్ పైనే చూపిస్తున్నాయి. ఒక పది నిమిషాలు ఆగితే తగ్గుతుందేమోనని అక్కడే నిలబడి ఉన్నాను. రియాద్ ఉదయపు చల్లని గాలి వీస్తోంది.

మా అపార్ట్‌మెంట్ పక్కనే ఉన్న ఒక విలాసవంతమైన విల్లా వైపు నా చూపు మళ్ళింది. పెద్ద పెద్ద జైలు లాంటి గోడలు, ఇంటి చుట్టూ ఖర్జూరపు మొక్కలు… బయటి వాళ్ళు కార్లు పార్క్ చేయకుండా సిమెంట్ దిమ్మెలు పెట్టి ఉన్నాయి. గోడలన్నీ సీసీ కెమెరాలతో నిండిపోయి ఉన్నాయి. గోడ మీద ఏవో పోస్టర్లు అరబిక్‌లో రాసి ఉన్నాయి.

నా చూపు అక్కడే, ఆ విల్లా ముందు భాగంలో ఉన్న చిన్న గేటు మీద పడింది. అదొక హౌస్ డ్రైవర్ రూమ్ గేటు దాని ముందు మెట్ల మీద ఒక మనిషి కూర్చుని ఉన్నాడు. అతని చుట్టూ పిల్లులు కూర్చుని ఉన్నాయి. చేతిలో ఒక నల్ల రంగు పిల్లి పిల్లను పట్టుకుని, పాలు పట్టిస్తున్నాడు. పక్కన అప్పుడే పిండి ఆరేసిన తెల్లని చొక్కా గాలికి రెప రెప లాడుతోంది.

అతను నా వైపు చూసి ఏమైంది అన్నట్లు సైగ చేసాడు. కారు స్టార్ట్ అవ్వట్లేదు అని నేను కూడా సైగ చేశాను.

పిల్లి పిల్లను జాగ్రత్తగా పక్కన పెట్టి, తల నిమిరి , మెల్లగా లేచి, నా వైపు నడుచుకుంటూ వచ్చాడు…భారీ కాయం, వయస్సు యాభై పైనే ఉంటాయి. పొట్ట ఒక వైపుకి ఉబ్బి ఉంది.

“సలామ్ సార్, ఏమైంది? చాలా సేపటి నుంచి నిలబడి ఉన్నారు.”

“కార్ స్టార్ట్ అవ్వట్లేదు, ఏదో ప్రాబ్లం అనుకుంటా. అందుకే క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నా.”

“అలాగా! నేను చూడనా? నేను ఆ విల్లాలో హౌస్ డ్రైవర్ని భాయ్. మిమ్మల్ని చాలాసార్లు చూశాను. మీ అపార్ట్‌మెంట్ వాళ్ల కార్లు కూడా నేనే కడుగుతూ ఉంటాను.”

“ఓహ్, అవునా! సరే చూడండి.”

“బ్యాటరీ డెడ్ అయింది సార్. చలికాలం కదా, మీరు వాడే కంపెనీ బ్యాటరీ తొందరగా డ్రెయిన్ అవుతుంది. జంప్ స్టార్ట్ చేస్తే నిమిషంలో స్టార్ట్ అవుతుంది. మీ దగ్గర ఇష్తిరాక్ (జంపర్ కేబుల్) ఉందా?” అని అడిగాడు.

“నా దగ్గర లేదు భాయ్.” అన్నాను.

“అవునా! కార్లో ఉంచుకోండి సార్, ఇలాంటి సమయంలో ఉపయోగపడుతుంది. నా దగ్గర ఉంది, ఇక్కడే ఉండండి, నా కార్ తీసుకువచ్చి జంప్ స్టార్ట్ చేస్తాను,” అని వెళ్లి, రెండే నిమిషాల్లో తన పాత టయోటా పికప్ వ్యాన్‌ను తెచ్చి నా కారు ముందు ఆపాడు.

నా కారు బ్యాటరీకి, తన కారు బ్యాటరీకి జంపర్లతో కనెక్షన్ ఇచ్చి, వెళ్లి తన కారు స్టార్ట్ చేశాడు.

“సార్, మీరు కూడా కార్ స్టార్ట్ చేయండి,” అన్నాడు.

నేను కారులో కూర్చుని, ఇగ్నిషన్ ఇచ్చాను. కారు స్టార్ట్ అయింది. అతని వైపు చూశాను. గర్వంగా నవ్వాడు.

అప్పుడే మొదటిసారి కలిశాను అన్వర్ భాయ్‌ని.

3

ఆ పరిచయం స్నేహంగా మారింది. నా కారు కూడా తానే కడిగేవాడు.  ఈ రియాద్ మహా నగరం ఒంటరి వాళ్ళని , మరింత ఒంటరిని చేస్తుంది. చుట్టూ ఎంతో మంది జనం , కానీ ఒకరితో ఒకరికి సంబంధం లేదు, ఆత్మీయంగా మాట్లాడే గొంతులే కరువు , It’s a lifeless monotony in a loop.  ఒంటరి బతుకులు ఈడుస్తున్న మా ఇద్దరికీ మాట్లాడుకోవడాని సమయం దొరికినప్పుడల్లా ఛాయ్ తాగుతూ కబుర్లు చెప్పుకునే వాళ్ళం. ..చెప్పుకోవడం కంటే అన్వర్ భాయ్ మాట్లాడుతుంటే నేను వినే వాడిని.

అన్వర్ భాయ్ మాట్లాడుతుంటే ఒక అలసిపోయిన మహా సముద్రంలా కనిపించేవాడు. ఎన్నో జీవిత సునామీలు, తుఫానులతో పోరాడిన ఆ సముద్రం ఇప్పుడు విశ్రాంతి కోరుంటున్నట్లు ఉంది .

అన్వర్ భాయ్, తెలంగాణా నుంచి వలస వచ్చిన లక్షలాది వలస బతుకుల్లో తాను ఒకడు. గల్ఫ్  ఎప్పుడొచ్చావు, ఎందుకొచ్చావ్  భాయ్ అని అడిగితే –  ఎప్పుడొచ్చావ్ , కాదు ఎప్పుడెళ్ళిపోతావ్ అని అడుగు భాయ్  అంటూ  నవ్వేవాడు. ఇరవైఏళ్లుగా గల్ఫ్ లో హౌస్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఎన్నో దేశాలు, ఎన్నో అరబ్బు కుటుంబాలకు డ్రైవర్ పని చేసాడు ఎన్నో కష్టాల కిలోమీటర్లు నవ్వుతూ దాటేశాడు .  ప్రస్తుతం మా అపార్ట్మెంట్ పక్కనే ఉన్న విల్లాలో హౌస్ డ్రైవర్.  విల్లా ముందు ఓక చిన్న డ్రైవర్ రూంలో ఉంటాడు…దాన్ని రూమ్ అనలేము,అదొక  ఇరుకు గది . ఆ చిన్న గదిలోనే  వంట చేసుకోవడానికి చిన్న గ్యాస్ స్టవ్, దాని పక్కనే టాయిలెట్ సీట్ … కిటికీలు ఉండవు.

ఒక సారి నేను తాన రూమ్ కి వెళ్లి , అక్కడ పరిస్థితి చూసి“ ఎంటి భాయ్ ఎలా ఉంటున్నావ్ ఇక్కడ- మరీ దారుణంగా ఉంది కదా,అదేంటి భాయ్ అంత పెద్ద విల్లా కట్టినవాళ్లు ఒక చిన్న గది కట్టలేదు…ఇది అన్యాయం భాయ్…” అన్నాను.

“తమ్ముడు, వీళ్ళ విల్లాలే పెద్దవి, మనస్సులు మాత్రం చాలా చాలా  చిన్నవి…నేనొక్కడినే కాదు తమ్ముడు .. మొత్తం గల్ఫ్ లో ఉన్న హౌజ్ డ్రైవర్ల పరిస్తితి … నేనన్న ఒక్కడినే ఉంటున్న, కొన్నిచోట్ల ఒక రూములో ఇద్దరు ముగ్గురు ఉంటారు… బతికుండగానే సమాధి చేయడం అంటారే, అది ఇదే నేమో…” అన్నాడు.

ఒక మనిషి ఇలాంటి దుర్భర స్థితిలో జీవిస్తున్నాడు, అది కూడా ఇరవై ఏళ్ళుగా… …అన్వర్ భాయ్ రెండేళ్లకొక సారి రెండునెలల సెలవులు, ఇంట్లో వాళ్ళతో, తన ఊరిలో గడిపి మళ్లీ తిరిగి వస్తుంటాడు… అంటే తన ఈ ఇరవయెళ్ళ గల్ఫ్ జీవితంలో గట్టిగా తన కుటుంబంతో, గడిపింది 600 రోజులు అంటే ఈ ఒక్క సంవత్సరం 8 నెలలు … ఆలోచిస్తుంటే గుండె తరుక్కుపోతుంది…నా రోజువారీ జీవితంలో నేను అన్వర్ భాయ్ లాంటి వాళ్ళని ఎందరినో చూస్తుంటాను, మాట్లాడుతుంటాను. వీళ్ళందరూ పగలడానికి సిద్ధంగా ఉన్నపచ్చి  మట్టి కుండల్లా ఉంటారు.ఆ కుండల  నిండా పొంగిపొర్లుతున్న బాధలు, కష్టాలు , కన్నీళ్లు … వాళ్లతో మాట్లాడిన ప్రతి సారి  నాకు తెలియని బాధ, నిస్సహాయత …

అన్వర్ భాయ్ నాతొ మాట్లాడే పది , పదిహేను నిముషాలు కూడా తన మేడమ్ ఫోన్ చేస్తుందేమో , సార్ పిలుస్తాడేమో అన్న హైబత్ లో ఉండేవాడు. నాతొ కూడా ఎప్పుడు ఈ గల్ఫ్ లో  జాగ్రత్త తమ్ముడు, అది ఆలా చేయకు, ఇలా ఉండు, ఇక్కడి వాళ్ళతో జాగ్రత్త అని చెప్తూ ఉండేవాడు.  ఈ ఇరవై ఏళ్ల గల్ఫ్ జీవితంలో అతనొక బానిసగా పనిచేయడం వల్లనో, తన యజమానులు తన పై జరిపిన మానసిక, శారీరక హింస వల్లనో అన్వర్ భాయ్ మాటల్లో, చేతల్లో ఎప్పడూ ఒక రకమైన భయం, అభద్రత.

అన్వర్ భాయ్ డ్యూటీ ఉదయాన్నే ఆరు గంటలకు మొదలవుతుంది, ఆ ఇంట్లో పిల్లలని, ఆఫీసులకి వెళ్లే వాళ్ళని డ్రాప్ చేసి రావడం. వచ్చి రాగానే మళ్ళీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లను షాపింగ్ కు, తీసుకెళ్లడం ఇలా ఉదయం నుంచి రాత్రి దాక ఈ డ్యూటీ నడుస్తూనే ఉంటుంది. ఈ మధ్యలో వంట వండుకోవడానికి సమయం లేక ఒక రియల్ కి దొరికే ఖుబుస్ (రొట్టె)  , బెంగాలీ హోటల్లో దొరికే చాయ్ ఏ అతని నాస్టా, భోజనం  గత ఇరవై ఏళ్లుగా.

ఎప్పుడైనా డ్యూటీ లేనపుడు, అలసిపోయి ఉన్న ఆ శరీరానికి కాస్త నిద్రతో సమాధాన పరుద్దామనో , లేదా కౌసు(నాన్ వెజ్ ) కూర వండుకోవాలనో ఆశ పడినప్పుడు – ఇతని  ఖాళీ సమయాన్ని  ఓర్వలేక కడిగిన కార్లనే మళ్ళీ కడగమనో , నీళ్ళే అవసరం లేని ఖర్జురపు మొక్కలకు నీళ్లు పట్టమనో, ఇంటి ముందు కాంపౌండ్ ఉడ్చమనో పనులు చెబుతూ ఉంటారు. “హౌజ్ డ్రైవర్ డ్యూటీ అంటేనే బానిస బతుకు తమ్ముడు, చేసేది ఎంలే … బరాయించుడే .. నూటికి తొంభై మంది హౌజ్ డ్రైవర్ల పొజిషన్ ఇదే”అంటూ ఉంటాడు.

అన్వర్ భాయ్ తన గల్ఫ్ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు,లేదు లేదు పెట్టారు. నేను ఇప్పుడు చెప్పబోయేది వింటే మీకే అర్ధం అవుతుంది …

అదొక ఆగష్టు సాయంత్రం , గల్ఫ్ లో ఆగస్టు నెల అంటే వేడి యాభయ్ డిగ్రీ సెల్సియస్ వరకు వెళుతుంది, భయంకరమైన వేడి , ఏసీలు కూడా మావల్ల కాదు అని చేతులు ఎత్తేసే సమయం.  . అలంటి ఒక రోజు అన్వర్ భాయ్ తన రూంలో పదేళ్ల పాత విండో ఏసీ నడుస్తోంటే, చెమటల్లో నిండిపోయి , నిద్రపోతున్నాడు.

ఇంతలో మేడం ఫోన్ చేసింది.

“అన్వర్,  బయటకు వెళ్ళాలి , తయారవ్వు”  అన్వర్ భాయ్ కి వెంటనే భయంగా అనిపించింది, ఈ  వేడిలో ఇప్పుడు స్నానం చెయ్యాలి, వేడి వేడి నీళ్లు ఒంటి మీద పడుతుంటే ఒళ్ళంతా  మంటలు , చెయ్యకపోతే మేడం ఊరుకోదు , చెమట కంపు వస్తుందని తిట్టిన తిట్టు వదలకుండా తిడుతుంది. చేసేది లేక  మెల్లగా లేచి ఆ వేడిలో బయటకు వెళ్లి కార్ స్టార్ట్ చేసి , ఏసీ ఆన్ చేసి , వచ్చి ఎలానో స్నానం చేసి , బత్తా(మార్కెట్) లో కొన్న ఐదు రియల్లా సెంటు కూడా రాసుకున్నాడు.

ఇంతలో మేడం వాట్సాప్ లో లొకేషన్ పంపింది, ఎదో మాల్. . .ఒక అరగంట తరువాత ఆ మాల్ దగ్గరికి చేరున్నాడు. పార్కింగ్ దొరకట్లేదు, కార్లో ఉన్న మేడం మెల్లగా అసహనానికి గురవుతోంది, అన్వర్ భాయ్ గుండె వేగం కూడా మెల్లగా పెరుగుతోంది . బేస్మెంట్ పార్కింగ్ లోకి వెళ్ళాడు , మొదటి లెవెల్ అంతా తిరిగాడు, ఎక్కడ పార్కింగ్ లేదు.  వెనకనుంచి “ఉఫ్, “ మేడం తలా ఊపుతోంది, రెండో లెవల్ కి  వెళ్ళాడు  , చుట్టూ తిరిగాడు అక్కడా పార్కింగ్ లేదు, అన్వర్ భాయ్ నుదుటిమీద చిరు చెమట , కార్ ఏసీ ఫుల్ మీద నడుస్తోంది.  ఆశతో మూడో లెవెల్ కి వెళ్ళాడు.  అంటా చికటి, లైటింగ్ సరిగా లేదు. కళ్ళు కూడా మసకగా కనిపిస్తున్నాయి.

వెనక నుంచి మేడం “ మళ్ళీ , “ఉఫ్ , “

“బస్ వహీద్ దగిగా ,  మేడం “ (ఒక్క నిమిషం మేడం) అని జవాబిచ్చాడు.  ఎక్కడో మూలన పార్కింగ్ దొరికింది. వెంటనే పార్క్ చేసాడు.

“మేడం వెంటనే కారు దిగి, “పనయ్యాక కాల్ చేస్తాను , మాల్ ఎంట్రన్స్ దగ్గరికి రా “ అని చెప్పి  , అరబ్బీ లో గొణుక్కుంటూ వెళ్ళిపోయింది”

కార్ దిగి పక్కనే కూర్చున్నాడు.  ముప్పై మినిషాలు గడిచాయి, మెల్లగా వేడి తాకుతోంది, ఉక్క పోస్తోంది. గాలి కూడా లేదు. కాసేపు కార్లో ఏసీ వేసుకుని కూర్చుందాం, అనుకున్నాడు. కానీ కార్ స్టార్ట్  చేస్తే కెమెరా ఆన్ అవుతుంది. అలాగే అక్కడే కూర్చొని ఉన్నాడు. ముప్పై నిముషాల కాస్త గంట పైనే అయింది… వేడికి గొంతు ఎండి పోయింది. కార్లో నీళ్ళు కూడా లేవు.. మెల్లగా లేచి లిఫ్ట్ ఎటు వైపు ఉందో చూసాడు… ఎం అర్దం కావట్లేదు.. లైట్లు లేవు , అంతా మసకగ ఉంది… కళ్ళు తిరుగుతున్నట్లు ఉన్నాయి… అక్కడనుంచి కదిలాడు.. ఆ పార్కింగ్ ఏరియా ఒక పద్మవ్యూహం లా కనిపిస్తోంది… గుండె దడ పెరిగింది… మేడం కి ఫోన్ చేశాడు… కట్ చేసింది… మళ్ళీ చేసే ధైర్యం చేయలేదు… అలానే నడుస్తు మెట్ల కోసం, లిఫ్ట్ కోసం వెతుకుతున్నారు. కళ్ళు బైర్లు కమ్మాయి… ఒక చోట లిఫ్ట్ ఎంట్రన్స్ కనిపించింది, ఆశగా అటు వైపు నడిచాడు… లిఫ్ట్ దగ్గరికి వచ్చాడో లేదో… స్పృహ తప్పి కింద పడిపోయాడు… అలా ఒక ఇరవై నిమిషలపాటు అక్కడే పడున్నడు… డస్ట్ బిన్ క్లీన్ చేసే బంగాలి వ్యక్తి అటు వచ్చి, అన్వర్ భాయ్ నుచూసి, నీళ్ళ తాగించి.. వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి హాస్పిటల్ కి తీసుకెళ్లారు… అలా మరణం అంచుల దాకా వెళ్లి వచ్చాడు అన్వర్ భాయ్… …

4

ఒక రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి కార్ పార్క్ చేసాను, ఎందుకో కార్ దిగాలనిపించట్లేదు. అప్పుడప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది. ట్రాఫిక్ లో  రెడ్ సిగ్నల్ దగ్గర అలా ఆగిపోవాలని, ఆలా విండ్షీల్డ్ లోంచి కనిపించే ప్రపంచాన్ని చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఈ ఎప్పటికి ఆగని పరుగు పందాన్ని కాసేపలా ఆపి, పక్కన కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది.  అలా కార్ లోంచే కూర్చుని బయట చూసాను ,అన్వర్ భాయ్ అక్కడెక్కడో స్ట్రీట్ లైట్ కింద పార్క్ చేసి ఉన్న కార్ ను కడుగుతున్నాడు. రోజులా హాంక్ చేశాను.  నా వైపు చూసి , చెయ్యి ఊపాడు.

డోర్ ఓపెన్ చేసుకుని డైరెక్ట్ గా బెడ్ రూమ్ లోకి వెళ్ళాను. అలాగే బెడ్ మీద పడి , పక్కనే ఉన్న టీవీ రిమోట్ అందుకుని టీవీ ఆన్ చేసి, ఫోన్ చేతిలోకి తీసుకున్నాను .నేను ఫోన్లో డూమ్ స్క్రోలింగ్ చేస్తున్నాను,బ్యాక్గ్రౌండ్ లో టీవీ నడుస్తోంది. అలా ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలియదు. మధ్యలో మెలకువ వచ్చింది , టీవీ ఆఫ్ చేశాను.

మధ్య రాత్రేప్పుడో ఫోన్ మోగుతోంది, దిండు కింద నుంచి తల బయటకు తీసి, ఒక కన్ను తో చూసాను,  అన్వర్ భాయ్ కాల్ చేస్తున్నాడు. కానీ ఆఫీస్ వర్క్, ట్రాఫిక్ లో పడిన కుస్తీ వలన అలసిపోయి ఉన్న శరీరం, మెదడు సైలెంట్ బటన్ నొక్కి ఇగ్నోర్ చేసేలా చేసాయి. ఫోన్ పక్కకు నెట్టి అలానే పడుకున్నాను.

తెల్లారింది, ఫోన్లో అన్వర్ భాయ్ నుంచి ఐదు మిస్ కాల్స్ ఉన్నాయి . ఇలా ఎప్పుడు చేయలేదే ?  తిరిగి కాల్ చేశాను , లిఫ్ట్ చేయలేదు.  రోజులా మొఖానికి ఒక  కార్పొరేట్ మాస్క్ వేసుకుని అపార్ట్మెంట్ బయట పడ్డాను. కార్ దగ్గరికి నడిచాను. కార్ నిన్న ఎలా వదిలానో , అలానే ఉంది. అన్వర్ భాయ్ కారు కడగలేదు.

అన్వర్ భాయ్ విల్లా వైపు చూసాను, కొంత మంది జనం గుమి గుడి ఉన్నారు. విల్లా వైపు నడిచాను.  అక్కడ  కొంత మంది జనం గుమి గూడి ఉన్నారు . నేను వెళ్లేసరికి అప్పుడే సురతే (పోలీస్) వాళ్ళు కూడా వచ్చారు.

యల్లా … రూహ్ (పక్కకు జరగండి ) అని అందరిని దూరం జరుపుతున్నారు. నేను మెల్లగా విల్లా ఎంట్రన్స్ దగ్గరికి చేరుకున్నాను. ఏమైంది అని అక్కడున్న వాళ్ళని అడిగాను. వాళ్ళేమి మాట్లాడలేదు .

పక్కన ఆ ఇంటి ఓనర్ అరబిక్ లో పెద్ద పెద్ద గా పోలీస్ వాళ్లతో ఎదో మాట్లాడుతున్నాడు. నేను జనాలను తప్పించుకుని వెళ్లి అన్వర్ భాయ్ రూమ్ బయట నిలబడి లోపలికి తొంగి

చూసాను, ఏమి కనబడట్లేదు . ధైర్యం చేసి లోపలికి వెళ్లాను… అన్వర్ భాయ్ సీలింగ్ రాడ్డుకి  కట్టి ఉన్న గుడ్డ కు వేలాడుతూ కనిపించాడు. నా చెవులలో “గుయ్, గుయ్” అని మోగుతూ, మూసుకుపోయాయి. నా గొంతు తడారిపోయింది. నా కాళ్ళు  వణుకుతున్నాయి.  నాకేం అర్ధం కావట్లేదు . నా పక్కన ఉన్న బెంగాలీ వైపు చూసాను. అతను అవును నువ్వు చూస్తోంది నిజమే అన్నట్లు తల ఊపాడు.

నేను వెనక్కి జరిగి ఆ ఇంటి ముందు ఆగి ఉన్న పోలీస్ కార్ ని అనుకునొని నిలబడ్డాను. శరీరమంతా చెమటలు పడుతున్నాయి. నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి… ఎదో ఊబిలో కురుకుపోతున్నట్లు ఉంది, ఊపిరి ఆడట్లేదు. ఆత్మ హత్య  చేకున్నాడు అన్వర్ భాయ్… మరో కొన్ని రోజుల్లో ఇంటికి పోతాను అని ఆనందంలో ఉన్న అన్వర్ భాయ్ ఎందుకు ఇలా చేశాడు… ఏమైంది… అక్కడ ఉన్న వాళ్లందరినీ అడుగుతున్నాను… ఎవరూ ఏమి చెప్పట్లేదు .

కాసేయ్యాక అన్వర్ భాయ్ బంధువు (షఫీక్) ఒకతను వచ్చాడు.

“క్యా, కామ్ కర్యా రే అన్వర్ – అల్లా, మై తేరే బచ్చోకు క్యా  బొల్న బా” (ఎంత పని చేసావు, అన్వర్… మీ ఇంట్లో వాళ్లకి ఎం చెప్పను)

“ సుబోకు మై ఆతం, టెన్షన్ నక్కో పడ్ కయం నా” (పొద్దున్నే వస్తాను, టెన్షన్ పడకు అని చెప్పా కదయ్యా )

“మై, ఆతోభి, అచ్చ రెహతా సో , తో ఎత్త కామ్ కర్లెత కల్యం నై రే ” ( నేను రాత్రే వచ్చిన బాగుండు… నువ్వు ఇంత పని చేస్తావని అనుకోలేదు రా )

తల బాదుకుంటూ అన్వర్ భాయ్ రూమ్ మెట్ల మీద కూర్చొని ఏడుస్తున్నాడు…

కాసేపటికి కాస్త  తేలిక పడ్డాడు… పోలీసులు తనతో మాట్లాడి డిటైల్స్ తీసుకుంటున్నారు…ఒక అరగంటలో పోలీసులు వెళ్లి పోయారు… అక్కడ నేను, అన్వర్ భాయ్ శవం, అన్వర్ భాయ్ వాళ్ళ బంధువు మాత్రమే మిగిలాం. నేను షఫీక్ భాయ్  తో మాట కలిపాను.

“ సలామ్ భాయ్,అన్వర్ భాయ్ నాకు బాగా తెలుసు. నేను పక్క బిల్డింగ్ లో ఉంటాను… నా కార్ కూడా తనే కడుగుతాడు..”

“అవునా సార్,”

“అవును, నిన్న రాత్రి కూడా చూసాను… ఏమైంది అసలు”

“ ఏమని చెప్పను సారు, రాత్రి కఫిల్(అన్వర్ భాయ్ యజమాని )చిన్న కొడుకు ఏదో ప్రోగ్రాం ఉంది అని రియాద్ బులేవర్డు కి తోల్క పోయిండట… పోయేటపుడు లేట్ అవుతుంది అని బాగా తొందర పెట్టీ, కారు స్పీడ్ గ నడపమని  బలవంతం చేశాడు అంట… వద్దు బాబా కి తెలిస్తే కొప్పడతాడు, కార్లో కెమెరా ఉంది అని … ఎంత చెప్పినా వినలేదు.. ఎం కాదు నువ్వు పోనివ్వు నేను చూసుకుంటా , బాబా తో మాట్లాడుతా అని చెప్ప  స్పీడ్ గా బండి నడపమన్నాడు . అలా  స్పీడ్ లో పోతుంటే ఒక సిగ్నల్ దగ్గర ముందు కారు సడెన్ బ్రేక్ వేస్తే మనోడికి  బండి కంట్రోల్ అవ్వక వెనకనుంచి గుద్దేసాడు. ట్రాఫిక్ పోలీసులు వెనక నుంచి ఎవరు గుద్దితే వాళ్ళదే తప్పు.అని  అన్వర్ మీద కేసు రాసి ఫైన్ వేశారు , ఇన్సూరెన్స్ ఉంది… కానీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు మాత్రమే, అంటే మన కారు జరిగిన డామేజ్ మనమో కట్టుకోవాలి.

కారు ముందు బాగా డ్యామేజ్ అయింది… అయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి…

“అయ్యో , మరి ఏమైంది ” అన్నాను…

“ ఈ మాట తెలిసిన కఫిల్(అన్వర్ భాయ్ యజమాని )అన్వర్ మీద కోప్పడ్డాడు , వాడేదో చిన్న కుర్రాడు వాడు పొమ్మంటే నువ్వెలా పొయ్యవ్…కారు రిపేర్ కి అయ్యే ఖర్చంతా నువ్వే కట్టాలి , లేదంటే నిన్ను ఇండియా వెళ్లనివ్వను, పాస్పోర్ట్ చింపెస్తా, పోలీసులకి పట్టిస్తా , జీవితాంతం జైలులో మగ్గి ఛస్తావ్ , అని చెప్పి బాగా  భయపెట్టాడు..

“అదే విషయం నాకు ఫోన్ చేసి చెప్పాడు, అలా ఎం అవ్వదు, కపిల్ అలా చెయ్యడు, చెయ్యలేదు… మనం ఇండియా ఎంబాస్సి, SATA(సౌదీ అరేబియా తెలుగు అస్సోసియేషన్ ) వాళ్ళ మాట్లాడుదాం… కంగారు పడకు అని చెప్పాను… భయంగా ఉంది లెక్సిస్ కారు రిపేర్ కి చాల ఖర్చు అవుతుంది , నేనెలా కట్టాలి అంత డబ్బు, నా దగ్గరేముంది, .. భయమేస్తుంది.. అన్నాడు… నేను ఎం ఫికర్ చేయకు నేను పొద్దున్నే వస్తా మనం మాట్లాడుదాం … అని చెప్పి .. నాకు డ్యూటీ ఉంటే పోయిన… రాత్రి రెండు మూడు సార్లు ఫోన్ చేశాడు.. బిజీ ఉండి  మాట్లాడలేక పోయిన , పొద్దున్నే మా బాబా దగ్గర పర్మిషన్ తిస్కున్ని పోదాం అంకుంటూ ఉన్న.. ఇంతలోనే ఇంత ఘోరం చేసుకున్నాడు…

“అయ్యో, మరి పోలీసులకి చెప్పాల్సింది కదా” అన్నాను.

పోలీసులకి చెప్పి ఆ కఫిల్ (అన్వర్ భాయ్ యజమాని) ని  అడిగిస్తే “ నేను ఏదో అప్పుడు కోపంలో అన్నాను, అయిన అట్ల ఎలా చేస్తా, నేనేం చేయలేదు, అని చెప్పి తప్పించుకున్నాడు..

ఉత్తీ పున్నాన్నికి పానం తిస్కున్నడుపోరాడు” అని ఏడుస్తూ మెట్ల మీద కుల బడ్డడు… నేను పక్కనే కూర్చున్నాను.

నాకేం అర్థం కావట్లేదు,  అన్వర్ భాయ్ నాకు రాత్రి అందుకే నా ఫోన్ చేశాడు..? కఫిల్ బెదిరించడంతో ఏమి చేయాలో తోచక తనకు తెల్సిన వాళ్ళ అందరికి ఫోన్లు చేసాడు. ఎవరు తన దగ్గరకు రాకపోయేసరికి  కఫిల్ మాట్లాడిన మాటలు, పెట్టిన భయం, కార్ రిపేర్ కి కట్టాల్సిన డబ్బు, పోలీస్ కేసు , జైలు ఇంటికి ఇంకా తిరిగి వెళ్ళలేనేమో అన్న  భయం చివరికి తన  ప్రాణాలు తీసుకునేలా చేసింది.

ఆ సమయంలో నేను ఫోన్ లిఫ్ట్ చేసి, తన దగ్గరకి వెళ్లి కలిసి, మాట్లాడి ఉంటె ఎంత బాగుండు, ఇంత ఘోరం చేసుకునే వాడు కాదేమో.. అలా ఎన్నో ఆలోచనలు  నా మెదడుని, పట్టు పురుగులా తినేస్తున్నాయి.

ఇంతలో షఫీక్ భాయ్ – “ భాయ్, నేను SATA వాళ్ళకి ఫోన్ చేశాను, వాళ్లు వస్తున్నారంట ,  మీరు కొంచెం నాతొ సహాయంగా ఉండి వాళ్ళకి కావాల్సిన పేపర్ వర్క్ కి సహాయం చేస్తారా? నాకు సదువు రాదు “ అన్నాడు.

“సరే, తప్పకుండా భాయ్ “ అని చెప్పి  ఇవాళ ఆఫీస్ కి రావడం కుదరదు అని చెప్పడానికి నా మేనేజర్ కి ఫోన్ చేశాను. మొదటి రింగ్ కె ఎత్తాడు.

“హాయ్, విజయ్, నీకే కాల్ చేద్దాం అనుకుంటున్నాను. బిజినెస్ రివ్యూ స్లైడ్స్ రెడీ గా ఉన్నైగా ?

నువ్ ఆఫీస్ కి రాగానే, రివ్యూ చేద్దాం.చాలా ఇంపార్టెంట్ , నంబర్స్ మరో సరి వెరిఫై చేయాలి. CEO తో మీటింగ్ ఉంది ఇవాళ , ఇప్పుడే మీటింగ్ ఇన్వైట్ వచ్చింది.

“ఒకే బాస్” , అని చెప్పి షఫీక్ భాయ్ కి ఉండడం కుదరదు , ఆఫీస్ లో పనుందని చెప్పి, వెళ్లి కార్ లో కూర్చున్నాను. మనస్సంతా చేదుగా ఉంది.

*

సంజయ్ ఖాన్

నా పేరు సంజయ్ ఖాన్. ప్రస్తుతం రియాద్, సౌదీ అరేబియా లో ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రోడక్ట్ మేనేజర్‌గా పని చేస్తున్నాను. స్వస్థలం తెలంగాణలోని ఖమ్మం జిల్లా, మధిర మండలం, ఖాజీపురం గ్రామం.

చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , కథలు , కవిత్వం ఇష్టంగా చదువుతున్నాను, ఇవి నా జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఎప్పుడు కథలు చవడమే గాని రాయాలని అనుకోలేదు . అనుకున్న నేను రాయలేను ,లేదా రాసేంత సాహిత్య జ్ఞానం నాకు లేదులే అని తప్పించే వాడిని. కానీ గల్ఫ్ దేశాల్లో నేను చూసిన , మాట్లాడి తెలుసుకున్న మన తెలుగు వాళ్ళ వ్యధలు, కథలు నన్ను కదిలించి ఈ కథలు రాయడానికి నన్ను ప్రేరేపించాయి. పుస్తక పఠనంతో పాటు ట్రావెలింగ్, రన్నింగ్ నా హాబీస్.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు