పాపకి జడ వేస్తూ అమ్మ అంది “ అన్నయ్యతో గొడవ పడొద్దు చిన్నమ్మా. పాపం నోరులేని వాడు”.
“ఎహె, ఎప్పుడూ నాకే చెప్తావే?” పాప కోపంగా జడ ముందుకేసుకుని వెళ్ళిపోయింది.
పాప నేల మీద విసిరేసిన బొమ్మలు సర్దుతూ అన్నయ్య అన్నాడు “కుక్కపిల్లని పెంచుకోవద్దు. దానికేం ఖర్మ ఇంట్లో పడుండటానికి, మనుషుల్లో బతకడానికి? ఒక ఏనుగుల గుంపు నిన్ను పెంచుకుంటే నీకు బాగుంటుందా?”
సర్దిన బొమ్మలన్నీ మళ్ళీ తోసేసి, వాడి వీపు మీద ఒకటి పీకి బయటికి తుర్రుమంది.
ఆఫీస్ కి వెళ్తున్న పాపకి లంచ్ బాక్స్ సర్దుతూ అమ్మ అంది.
“నీకు తెలీదని కాదు. కానీ, అతనికి కోపం ఎక్కువలా ఉంది. ఇంకోసారి ఆలోచిస్తావా?”
“నీతో వీడు చెప్పాడా? వీడి పెళ్ళామేదో మహా గొప్ప..” అన్నయ్యవైపు కొరకొరా చూసింది.
ఆ తర్వాత పాపని అన్నయ్య ఆఫీస్ లో దిగబెట్టాడు.
ఆరోజు లంచ్ బాక్స్ నిండుగా వెనక్కొచ్చింది.
పాప సోఫాలు, కర్టెన్ లు దులుపుతుంటే అమ్మ ఫోన్ చేసింది.
“ఏమ్మా, బుజ్జిది బడికెళ్ళిందా? శెలవులకి తీసుకొస్తావా? నీ ఒంట్లో పర్లేదా?”
“ఆయన ఏమంటారో, అడగాలి.”
తల సోఫాలో పెట్టుకుని నేలమీద కూలబడింది, మాట్లాడ్దానికి గొంతు పెగలక అన్నయ్యకి ఉత్తరం రాసింది. “నిజమేరా, కుక్కపిల్లల్ని పెంచుకోకూడదు. పాపం.”
అన్నయ్య వెంటనే బయల్దేరి వచ్చాడు.
“చీకటి పడట్లా? బుజ్జిది ఎక్కడా?”
అమ్మ తెల్లటి జుట్టు దువ్వి ముడివేస్తూ పాప చెప్పింది. “వాళ్ళ మామయ్య ఇంటికెళ్లింది. వాడంటే ఎంతిష్టమో దానికి.”
“ఎన్నాళ్ళుంటావే ఇట్లా? అతను కోపిష్టి వాడే కానీ బుజ్జిదాని కోసం కలిసి ఉండకూడదా?”
అమ్మమంచం పక్కన నేలమీద దిండేసుకుని పడుకుంది పాప. పుస్తకం తెరిచి పేజ్ మార్కర్ దిండుకింద దాచింది. కొత్తసినిమా పాటేదో కూనిరాగం తీసుకుంటుంది.
“నామాట నువ్వెప్పుడు విన్నావు గనక?” మంచం మీద ముసలమ్మ నిష్టూరంగా అటువైపుకి తిరిగింది.
రెణ్ణిమిషాల్లో గురక. పాపలేచి అమ్మకి దుప్పటి కప్పింది.
కవిత్వాన్ని బ్యాలన్సు చేసే నైపుణ్యం కలిగిన స్వాతి తల్లి ( స్వాతి కుమారి గారి ) సామాజిక స్పృహ గురించి, మానవ జాతి పురోగతి, సమసమాజ నిర్మాణం ధ్యేయంగా సాగాల్సిన అభివృద్ధి పధాలవైపు సారించిన వారి దృక్కోణం గురించి వినాలని ఆశపడుతున్న …. ఓ నేలక్లాసు పాఠకుడు
పేజీలు పేజీలు అవసరం లేకుండా ఎన్ని ఎమోషన్స్ , ఎంత లైఫ్ చెప్పేశారు స్వాతీ సింపుల్ గా… మళ్ళీ మళ్ళీ చదివి దిగులు పడాలనిపించేలా!
” కృష్ణశాస్త్రి తన బాధని అందరిలోనూ పలికిస్తే, శ్రీశ్రీ అందరిబాధనూ తనలో పలికిస్తాడు.
కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ ”
~ శ్రీశ్రీ “మహా ప్రస్థానం” కి 17-7-40 న చెలం గారు రాసిన యోగ్యతాపత్రం నుండి
అని రాయాలని ఉంది కానీ, ఆడబిడ్డల జోలికిపోతే త్రిపుర తండ్రి ఖోoపడతారు!
అందునా వారికి నచ్చిన “వాగ్మూలం” కధ రాసిన స్వాతితల్లి జోలికెళితేనా ?!