అనేన

‘ఎందుకు చేశావమ్మా ఇలా’.

అమ్మేం మాట్లాడలేదు.

సంవత్సరం తర్వాత కలిశాం. తనే వచ్చింది. ఓవారం ఇద్దరం మాట్లాడుకోలేదు.

***

అడుగులందరివీ ముందుకో వెనక్కో. నాకుమాత్రం పక్కకి, అప్పుడప్పుడూ. పక్కకిపడ్డ ప్రతీఅడుగూ మనసులోంచి పడ్డదే. ఎంత తిన్నని దారినైనా త్రిభుజ రాపిడిలో అదోఇది.

పెద్ద ఉద్యోగం, డౌలూ దర్జా, నౌకర్లూ చాకర్లూ, ఏసీ నుంచి ఏసీ ద్వారా ఏసీకి. అన్నీ సర్దిపెట్టినట్టుగా, అనుకున్నవి అనుకోనట్టుగా, అనుకోనివి సరిపడ్డట్టుగా ` సరిపుచ్చుకొనేట్టుగా. అన్నీ టైంకి సమకూరిపోతున్నాయి  నా ప్రమేయమేమీ లేకుండానే.

ఒక్కోసారి నా పుట్టుకలోనే ఛాయిస్‌ లేదనిపిస్తుంది. పుట్టడమే అందంగా, పెరగడం అందంగా, పెరిగి మరింత అందమవడం అంతా ఇప్పటికీ సంధిగ్ధతే నాకు.

అమ్మా, నాన్నా, తను, ఇద్దరక్కలు, ఇద్దరన్నలు  వీరందర్నీ కుటుంబమంటారని తనకెవరూ, ఎన్నడూ చెప్పినట్టుగా గుర్తులేదు. వియార్‌ ఫామిలీ అన్నది ఈ మధ్యనే చెవినపడుతున్న మాట.

మా రెండెద్దులు, రెండెకరాల్తోబాటు ఊరి మూడువైపులా పచ్చటిచేలు, నాలుగో వైపు పెద్దగుట్టలు, అడివి. గూనపెంకులిల్లే అయినా చుట్టూతా ఏపుగా జవరాళ్ళగోడ ` మట్టిలో తలమునకల తల్లికి, ఈడేరిన ఈదులు ఇద్దరక్కలకీ అత్యవసర నామోషీకి. బహుముఖ పాత్రని అలవోకగా మోస్తున్నట్టు నటిస్తూ దాంట్లోనే తమందరికీ రెక్కలు పొదుగుతూనే అమ్మ. ఇద్దరన్నల గురించి అంతగా చెప్పాల్సిందేం లేదు. చదివించబడ్డారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, హాయిగా జీవించబడుతున్నారు.

అమ్మ గురించి చెప్పేముందు  నాన్న.

పైవాళ్ళందరికంటే నేనంటే నాన్నకి చాలా ఇష్టం ఆ మాటకొస్తే అమ్మక్కూడా. కానీ ఆ విషయం తనకర్థమయేట్టుగా చెప్పే సమయం సందర్భం ఉండేవికాదు  చెప్పే పరిస్థితిలోనూ ఉండేవాడు కాదాయన. ఆర్నెల్లకో ఏడాదికో ఒక్కసారైనా, నాన్నతో మాట్లాడిన ఒక్కరోజైనా  అయనేదో చెప్పాలని ప్రయత్నించేవాడు  అమ్మా నాకెందుకో బాధగా ఉంటుందే నిన్ను చూస్తుంటే, భయం వేస్తుంది కూడా అప్పుడప్పుడూ  నువ్వు నా బంగారు తల్లివే అనేవాడు. అంటూనే, అనుకుంటూనే నిద్రపోయేవాడు.

ఒక రోజు నా జాతకం చూపించుకొచ్చాడు. ఫలానాలో ఫలానావాడున్నాడు. ఇంకొకాయన తొంగిచూస్తున్నాడు నీచంగా అన్నాట్ట చెప్పినాయన. నాన్న అవేం గుర్తుంచుకోలేదు కానీ మెట్లెక్కుతావటే నువ్వు, ఒడుదుడుకులూ ఉంటాయన్నాడు. నా తలమీద చెయ్యేసి  సుఖపడతావన్నాడు అంటూ చివాల్నలేచి వెళ్ళిపోయాడు.

ఆరోజు గంటలోపే తిరిగొచ్చాడు తూలుతూ  చెప్పేవాడికి వాడి జాతకమే తెలియదు అంటూ. మర్నాడు నాన్న ఆయన్నేదో అన్నాడని ఊర్లో పంచాయతీ. ఎందుకో నాన్న ఇద్దరక్కల జాతకాలూ చూపించడానికి ఇష్టపడలేదు వాళ్ళ పెళ్ళిళ్ళటైంలో  ఆ పక్కవాళ్ళెంత పట్టుబట్టినా బంగారు బొమ్మలు నాకూతుళ్ళు అంటూ.

అమ్మ దేశవాళీ ఆవు ` పాలకీ తనే, మోతకీ తనే. మేం పక్కన నడుస్తున్నప్పుడు కుమ్మడానికి సిద్ధంగా ఉన్న ఆబోతులా నడిచేది అమ్మ. ఇంటి వాకిట్లోకి రాగానే అమ్మ గోమాతే. ఓసారి అందర్నీ తనివితీరా కళ్ళతోనే నాకి చూసుకొనేది ` ఈ రోజుకి గూటినపడ్డాం అనుకొనేదో ఏమో.

నాన్న మకాం ఆరుబయట సావిట్లోనే. కాలమార్పిడిలో గువ్వలసవ్వడి అరుదుగా అటువైపునుంచి.

అమ్మ లెక్క ఎప్పుడూ తప్పేదికాదు ` నెలసరులు, ఆరుతడులు, గల్లాపెట్టె, నాన్న బీడీలు ` ఏవైనాసరే. సరిగ్గా నా పద్దెనిమిదో పుట్టినరోజున తెచ్చేసిందో సంబంధం ` అప్పటికి నేను నల్లాడితో కమిటయి నెలలోపే. అమ్మే ముందుగా చెప్పేయడంతో నాకు మాట్లాడే అవకాశం రాలేదారోజు.

అమ్మ చెప్తోంది  తెలిసిన సంబంధం, ఇంజనీరు, గవర్నమెంటుద్యోగం పట్నంలో  తోబుట్టువులు కూడా లేరు అంటూ.

ఆ రాత్రి కలిసినప్పుడామాట చెప్తే నవ్వి ఊరుకోలేదువాడు …

వాడికి ఇరవైరెండు. పక్కవూరికి పక్కనుండే పల్లె. వాడెలా తగిలాడో నాకిప్పటికీ అంతుబట్టదు.

పల్లెకి ఊరికి దూరమైనా రెండూళ్ళకి దూరం అంతంతమాత్రమే ` అందునా ఇలాంటి తగిలికలు అంటుకున్నప్పుడు రెండూ కలిసిపోతాయి.

గణపతుల్లో కలిసినవాడు మళ్ళీకలవడం ఆ దీపావళికే. కటికచీకటి మా పల్లెమీద. నీ రెండు కళ్ళు రెండు నక్షత్రాలు నాకు అన్నాడు. అమ్మకి కూడా అని అప్పటికి వాడికీ నాకూ తెలియదు.

నాల్రోజుల తర్వాత నాన్న ` వాణ్ణెవణ్ణో మన ఎద్దు కుమ్మిందట, నడుములు పడిపోయాయి పాపంÑ దండగ కట్టేశాంలే ` అమ్మ మెళ్ళోంచి గంటల చప్పుడు.

చతికిలబడ్డది వాడేకానీ నక్షత్రశకలంకాదు. అలాగని ఆ కొద్దిరోజులూ అమోఘమైన ప్రేమకావ్య సదృశాలనీ కాదు. ముద్రలూ, మరకలూ ` గుర్తులే ` జ్ఞాపకాలేంలేవు. అనుకొన్నానప్పటికి.

ఒక్కోసారి నాపై నాకే అసహ్యమేసేది ` ఇంత జరిగినా ఎలా మిన్నకున్నానని.

కనీసం వాడినోసారి కలిసే ప్రయత్నమైనా ఎందుకు చెయ్యలేదని. అమ్మ తలూపడం మానేసి ఎందుకు బోరెత్తుకు తిరుగుతోందని. అమ్మ నాలిక గుర్తొచ్చినప్పుడు తన వళ్ళెందుకు బరకెత్తుతుందని ` గుర్తుల్ని జ్ఞాపకాలుగా మలుచుకోలేని నా అసహాయతకి, నిరాసక్తతకి.

మెల్లమెల్లగా నక్షత్రశకలం మాయమైంది. గుర్తులు మరకలయ్యాయి, మరకలు ముద్రలయ్యాయి. కొన్ని రోజులకి అవీ మాసిపోయాయి. అప్పటిమటికి.

నా కూతురు కడిగిన వజ్రం అంది అమ్మ. పల్లెలో ఓ తల్లి వాడు నాకొడుకు అనుకొంది ` కొత్తగా కుట్టించుకొన్న కిర్రుచెప్పులేసుకుని చకచకా నడిచిపోతున్నవాణ్ణి చూస్తూ …

అమ్మ మకాం సిటీకి మార్చేసింది, ఉన్న భూమిని అమ్మేసి. ఊర్లో ఇంటికి బయట, కాంపౌండుకి రంగు వేయించింది. పెద్దక్క ఇంటిదగ్గర్లోనే రెండుగదుల పోర్షను. నాన్న మిగిలిన ఎద్దూ మాత్రం ఊర్లోనే ` పెచ్చులూడుతున్న సావిట్లో. ఇప్పుడాయన ఊళ్ళకీ పల్లెలలకీ దూరాల్లేవు.

డిగ్రీ అయిపోయింది. పీజీ చివర్లో ఉండగా రాసిన పరీక్షల్తో యకాయకీ పెద్దుద్యోగమే వచ్చేసింది.

అమ్మ బేరం పెట్టేసింది. పెద్ద బిజినెస్సు, ఆ ఊళ్ళో రెండిళ్ళు, ఈ ఊళ్ళో రెండిళ్ళు, బోల్డు పొలం, పట్నంలో పెద్ద ఫ్లాటు. ఓ పడవకారు, అదనంగా ఓ చిన్నకారు ` మేనేజరు వాడుకోవడానికి. అమెరికాలో ఎమ్బియ్యే చేశాడట. నా ఫొటోచూశాట్ట, నన్ను కూడా ఎక్కడో కాఫీషాప్‌లో చూశాట్ట ` పబ్బుకి తన ముద్దుపేరు.

కాదనడానికేం కారణం కనబళ్ళేదు నాకు. ఔననీ అనలేదు. ఉద్యోగం వచ్చాక చూద్దాంలే అనుకొన్నా.

ఆర్డరొచ్చేసింది. ట్రైనింగ్‌. క్యాంపస్‌లోనే ఉండాలి, సంవత్సరంపాటు. ఎప్పుడో రోజో పూటో తప్ప.

బయలుదేరడానికింకో రెండ్రోజుల ముందు నాన్నొచ్చాడు. బాగా తగ్గిపోయాడు. అప్పటికప్పుడు గీసిన గెడ్డం, ముడతలుపడ్డ బట్టలు. అమ్మ టీ ఇచ్చింది. అలా చూస్తూనే కూర్చుండిపోయాడు.

‘చెప్పు నాన్నా ఎలా ఉన్నావ్‌’.

‘నేను బాగానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావ్‌ తల్లీ’.

‘బాగున్నాను నాన్నా, ఎల్లుండి ట్రైనింగ్‌కి వెళ్ళాలి ` సంవత్సరం’.

అమ్మ టీకప్పు తీసుకొని వంటింట్లోకెళ్ళింది.

‘ఊళ్ళో అందరూ ఎలా ఉన్నారు నాన్నా.’

‘అందరూ బావున్నారమ్మా ` ఊళ్ళోను, పల్లెలోనూ’.

అడక్కుండా ఉండాల్సింది అనుకొంది తను. ఇంకొంచెం వివరంగా చెప్పాల్సింది అనుకొన్నాడు నాన్న.

సంవత్సరంపాటు అద్దె దండగని అమ్మ పెద్దక్క వాళ్ళింటికెళ్ళింది. నాన్న ఊరెళ్ళిపోయాడు.

మూణ్ణెల్లు గడిచాయి. శరీరాలు దిద్దుకుంటున్నాయి. మనుష్యులు కొద్దికొద్దిగా విచ్చుకొంటున్నారు. బుద్ధులు పదునెక్కుతున్నాయి. జీవితాలు వెంటాడుతూనే ఉన్నాయి ` ఏదో ఒక మగమనసు మళ్ళీ వినిపిస్తోంది ` ఈసారి అది ఓ కవిది.

క్లాసుల్లో పక్కపక్కన కూర్చొన్నాయి మనసులు. కలిసి తింటున్నాయి, కబుర్లాడుకొంటున్నాయి. రెండు మూడు సినిమాలకెళ్ళాయి ` చేతి వేళ్ళ పలకరింపులు. అరచేయి పైవరకు కబుర్లు.

సడెన్‌గా చెయ్యిలాగేసుకుంది తను. మనసోమారు ముఖం పరికించింది. ఏంకనబడకపోయేసరికి కబుర్లు అటకెక్కాయి, అప్పటికి.

నీతోవుంటే టైం తెలియడంలేదు అన్నాడతను.

ఇదేమాట వాడూ అన్నాడు అనుకొన్నా లోలోపల.

‘ఏమైనా మాట్లాడొచ్చుకదా’ ` అదే డైలాగ్‌.

‘నీ హాబీస్‌ ఏమిటి?’ ` ఇది కొత్తదే.

‘ఇంటర్వ్యూలో అడిగారు ` బుక్స్‌ చదవడం, స్పోర్ట్సు అని చెప్పాను’.

‘ఇప్పుడు చెప్పుకదా’.

‘స్పోర్ట్సు కరక్టే, పుస్తకాలు అంతంతమాత్రమే’.

‘ఎందుకలా’.

‘మనుష్యుల్ని చదవటం ఇష్టం’.

‘ఎవరెవర్ని చదివావ్‌ ఇంతవరకూ `’

తనేం మాట్లాడలేదు. ఆకాశంలోకి చూస్తూ కూర్చుంది.

స్విమ్మింగ్‌పూల్‌ పక్కన కూర్చున్నారిద్దరూ. అప్పుడే పొద్దుపోతోంది.

పోనీ నిన్ను నువ్వు చదువుకుంటున్నావా అడిగాడతను కాసేపాగి.

నన్ను నేను చదువుకోవడమంటే ఓటమితో పోటీపడటమే ` యధాలాపంగా అనేసింది తను.

ఆశ్చర్యంగా చూశాడతను. హాబీస్‌లో కవిత్వం లేదే అన్నాడు.

నవ్వేసి ఊరుకున్నాను …

ఈ కలయిక, కబుర్లు ఎటుదారి తీస్తున్నాయో ` బెడ్‌మీద బోర్లాపడుకుని అనుకుంది తను.

ఇది మొదలయ్యాక ఎందుకో ఆ నల్లాడే గుర్తొస్తున్నాడు మాటిమాటికీ ` వాడి కోనేటిముక్కు, ఆ తెంపరితనం ` అవేకదా కొంపముంచింది. మధ్యలో గోడలు మెత్తుతూ అమ్మ ` వళ్ళంతా అలికి ముగ్గెయ్యని వాకిలే.

వాడెలా ఉన్నాడో ` నాన్నని అడిగితే చెప్పేవాడే. ఆయనకి చెప్పాలనేవుంది ` తనడిగితే కదా ` బలుపు, కాదు ` భయం. తనకంటే అమ్మకింకా భయం ` ఆ భయమే వాడి నడకని కాటేసింది.

ఏంజరుగుతోందని తన్నడగలేదమ్మ, చూసిన పిసరంతకి తనే చిలవలు పలవలు అల్లుకుంది ` పండ్లొక్కటి తక్కువ ` రోజూ నడిచే అమ్మకి ఊరుకి పల్లెకి దూరం అడుగుల్తోసహా తెలుసు, తమ రెండిళ్ళకి కూడా. ఆసాయంత్రం ఎలపట దాని చెవిలో ఏదో చెప్పుకుంది అమ్మ, దాని మెడని నెమ్మదిగా దువ్వుతూ.

మర్నాడు నోట్లోంచి జారిన చేపపిల్లని మళ్ళీ గాల్లోనే అందిపుచ్చుకున్న పిట్టలా అమ్మ మౌనం …

రానురాను ఈ కవిగాడూ దగ్గరవుతున్నాడా. అసలు తనకంటూ ఒక మనస్సు, దానికో ప్రేమంటూ ఉన్నాయా లేవా. ఎవడ్నిపడితే వాణ్ణి ఇష్టపడిపోవడమే దానిపని. అయినా ఎంతమందయ్యారు కనుక, ఇద్దరే.

ఆ పాతలెక్కలిప్పుడొద్దు ` ఆ రెండో మూడో ` దె ఆర్‌ అడొలెసెంట్‌ అబెర్రేషన్స్‌ .. ఓప్‌ా నో… నల్లాడు వేరు ` వాడో పోతపోసిన ఆరడుగుల గుండె. ఆ శకలాలే ఇంకా ఈదులాడుతున్నాయి తనలో.

ఇలా తాత్సారం చేస్తూనే నెత్తిమీదకి తెచ్చుకున్నావ్‌ ` ఆ నల్లాడిని దింపుకోలేకపోతున్నావ్‌. వాడొకడు చాలు ` ఈ కవిగాడికి చెప్పెయ్‌, నిష్కర్షగా ` రేపే.

అవును.అంతే.

ఆరోజు రాత్రే అమ్మ ఫోన్‌చేసింది. ఆ అమెరికా అబ్బాయి వచ్చాడట, ఓవారం ఉంటాడట, నిన్ను చూస్తానంటున్నాడు అంటూ. నషాళానికెక్కింది నాకు. వీడొకడు ` ఇప్పుడే దొరికిందా టైంవీడికి అని లోపలనుకుంటూ ` ఈ వారం కుదరదు నాకు అన్నా. పోన్లే వచ్చేవారమే చూద్దాం, అలా చెప్పేస్తాను అంది అమ్మ. చేసేదేంలేక సరేనంది తను.

గూగుల్‌ ఆ అబ్బాయిని బాగా చూపించింది. డబ్బుంది, చదువుంది, బిజినెస్‌ పెద్దదే. అమ్మ హోంవర్క్‌ బాగానే చేసినట్టుంది.

చదువుతోబాటు ఉద్యోగం ఉంది. ఇద్దరూ పనిచేసుకోవచ్చు. కుటుంబవిషయాలేం తెలియకపోయినా మధ్యతరగతికైతే తగ్గదు.

వీటన్నిటితోబాటు డబ్బు కట్టలున్నాయి. సోషల్‌ స్టాటస్‌ ఉంది. అతనూ కావాలనే ముందుకొస్తున్నాడు. అన్నిటికీ మించి అమ్మకిష్టమైంది.

చివరివిషయం అమ్మకెంతముఖ్యమో తనకీ అంతే. ఒక పిసరు ఎక్కువేమో కూడా. ఎన్ని కష్టాలుపడిరది అమ్మ. ఎన్ని ఆటుపోట్లు తట్టుకుంది. వాటిలో ఒకటి నాన్నకి పల్లెలో కొద్దిలోతైన సంబంధం అనికూడా నాకు చిన్నప్పుడే తెలుసు. ఒక్కో సిచ్యుయేషన్ని ఒక్కోరకంగా తనదైన పద్ధతిలో డీల్‌ చేసుకొచ్చింది అమ్మ. డబ్బు నుంచి మనుషులు, పశువులు, మాటలు, చేతలు ` అన్నీ వాడుకుంది. ఒక్కోసారి పుకార్లని కూడా. అమ్మకి ఎండ్స్‌ ముఖ్యం. మీన్స్‌ ఆవిడే నిర్ణయిస్తుంది, నిర్దాక్షిణ్యంగా. దీనిని ఆవిడ ప్రొటెక్టివ్‌ ఇన్‌స్టింక్ట్‌ అనొచ్చేమో ` ఏమన్నా మనమటుకే ` ఆవిడకేం పట్టదు.

అసలు పెళ్ళి అంత అవసరమా. అప్పుడప్పుడు శరీరానికి తప్ప ఎప్పుడూ మనసుకైతే పెళ్ళి కష్టమే ` అంత కమిట్‌మెంట్‌ తనకవసరమా, తను ఆ రిలేషన్‌షిప్‌లో సక్రమంగా ఉండగలదా ` ఉండలేకపోవడానికేముంది ` అందరూ ఉండటం లేదూ ` వాళ్ళందరూ పైనుంచేమన్నా దిగొచ్చారా ` మనలాంటి వాళ్ళేకదా. ఎవరి మనసులో ఏముందో ` ఎవరేం కోరుకుంటున్నారు, ఏ పొందుతున్నారు, ఎంతవరకు తృప్తి పొందుతున్నారు. ఎంత అసంతృప్తి పేరుకోపోతే శరీరాలు బరువులయి సంసారాల్లో తేల్తున్నాయి. అందరూ పైకైతే హాపీగానే, సంతోషంగానే కనబడుతున్నారు. కనబడటమేమిటి జీవిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నించుకొంటే, దానికి పెళ్ళే ఏదోఒక సమాధానం ఇచ్చి సరిపుచ్చదా ` అంతగా వేళ్ళూనుకుపోయిన వ్యవస్థ కదా. దానివరకు ఎందుకు, కింద కుటుంబముంది. అదేమన్నా తక్కువ తిన్నదా. ఇద్దర్నీ కట్టిపడేసైనా సరే సుఖంగానే ఉంచడంకదా దాని రాసిపెట్టని రూలు.

ఇలా పట్టుబట్టి, పట్టిపట్టి ఆలోచించేకంటే ఏది ఎలావస్తే అలా తీసుకుని హాయిగా కాలం గడిపేయడమే కదా జీవితం ` ఎవరో బాగానే చెప్పినట్టున్నారే ` ఏమో మనసు పరిపరివిధాలుగా పోతోంది. నిద్రపట్టేసింది …

అమ్మకి బాగాలేదట ఊరెళ్ళి రెండ్రోజుల్లో వచ్చేస్తానన్నాడు కవీశ్వరుడు.

‘అలాగా ఏమిటి ప్రాబ్లెమ్‌’.

‘జ్వరమంటున్నారు. నాన్నలేరు. అమ్కొక్కత్తే ఉంటుంది’.

జాగ్రత్త, కాల్‌చెయ్‌ అంది తను.

ఇతనికి చెప్పేస్తే ఓపనైపోతుంది అనుకొంది ` తనొకటి తలిస్తే …

పోనీలే టైం దొరికింది కదా. ఆలోచించుకోవచ్చు ` అంటే ఇతనిమీద అంతో ఇంతో ఉన్నట్టేగా ` నీకస్సలు బుద్ధిలేదు. అవును ఉంటే అందరిలానే ఉండేదాన్ని. ఆ అమెరికా సంబంధానికి ఓకే చెప్పడానికి ఇంత ఆలోచించేదాన్ని కాదు. అసలా నల్లాణ్ణి నెత్తినెందుకెక్కించుకొనేదాన్ని. అలా కాదులే ` ఆ మనస్సుంది కాబట్టే ఇంకా బతుకున్నావ్‌ నువ్వు. నువ్వు ఫ్రీబర్డ్‌వి. పుట్టురెక్కలునీవి. ఎవరూ వాటిని తాకనైనాలేరు. అసలు కనబడవవి అందరికీ ` ఎగరనిచ్చే గాలికి, గొంతుకలిపే కోకిలకి తప్ప ` నీకు తప్ప …

అమ్మకి బావుంది. రేపు శెలవేకదా. ఊరొచ్చెయ్యకూడదూ, చూసినట్టుంది ` ఎంత మామూలుగా అడిగేశాడతను ఫోనులో, అదేదో పెద్ద విషయమేమీకానట్టు, తమ పరిచయం ఎన్నేళ్ళో అయినట్టు, చూసినట్టుంటుందిట ఎవరు, ఎవర్ని, ఎందుకు. అసలతనికా చనువిచ్చినందుకు నన్ను నేననుకోవాలి. ఇది పొగరా, అహమా, ధైర్యమా, అధికారమా, రెక్వెస్టా ` లేక పురిపడుతున్న మరో చిరుకొసా.

నేనుమాత్రం కాదనో, కోప్పడో, చిరాకునటించో, మరోటో చేసి కాదనచ్చుగా, రానని, వీలుపడదని కచ్చితంగా చెప్పచ్చుగా, చెప్పుండచ్చుగా…

తగుదునమ్మా అని బయల్దేరింది. మూడుగంటల ప్రయాణం బస్సులో ` ఒంటరిగా చాలాకాలానికి. మధ్యమధ్యలో నన్నెవరైనా చూస్తున్నారా లేదా చెక్‌చేసుకోవడం ` చూస్తుండకపోతే తన అందమంతా ఏమవుతున్నట్టు, అసలు తన ఉనికే ప్రశ్నార్థకమవుతున్నట్టు కాదూ. బయటకి ఇలా చెప్పడం, కనీసం అనుకోవడం అంత సబబుకాదేమో. ఈ అందాలపంపకం కూడా అంత విధివిధానాలున్నదేంకాదు. ఎవరి తోవ వాళ్ళది, ఎవరి గీతలు వాళ్ళవి. కథకులకి, నటకులకి, అందులోపడి గిలగిల్లాడేవాళ్ళకే కాదు, సర్వసృష్టికీ అవగతమైందే ` కొంత బయటపడుతుంది, మరికొంత మరుగునపడిపోతుంది.

ఓ చూపు మామూలుకంటే ఎక్కువగా, చురుగ్గా కాక చనువుగా, రెగ్యులర్‌ ఇంటర్వెల్స్‌ ఏదో మూలనుంచి గుచ్చుకొంటోంది. తను తలతిప్పిచూస్తే బావుండదేమో. ఆ చూపుకి అంత విలువివ్వడమంటే అందాల ఆరబోతలో ఓనమాలు అటూఇటూ అయినట్టే. అహం దెబ్బతినిపోదూ ` వాడెవడో చూస్తుంటే తలంతా వెనక్కితిప్పి ఓ రెండుక్షణాలు వాణ్ణి చూడడం ` అవసరంలేదు. కానీ మెడమీద కాస్సేపటితర్వాత ఆ చురుకు ఒరిపిడి తగ్గుమొహం పట్టడంతో కొంత ఆశ్చర్యమూ కలిగింది, మరికొంత అవమానం కూడా.

బస్సాగింది. బాగ్‌ తీసుకుని ఒక్కసారి వెనక్కి చూద్దామన్న కోరికకి అహంతో అడ్డుపడి దిగేసరికి కవీశ్వరుడు రెడీగా ఉన్నాడు. అతని కళ్ళల్లో, మొహంలో, మనిషిలో తెచ్చిపెట్టుకున్న ఆనందం, ఉత్సాహం, పిలవగానే వచ్చేసిందనే సంతోషం ` ఏమీ కనబడలేదు. మామూలుగానే ఉన్నాడతను. ప్రయాణం బాగా జరిగిందా అన్నాడు కాజువల్‌గా. ఇతను నాకంటే కూల్‌గా ఉండే ప్రయత్నంలో ఉన్నాడా లేక ఈ మనిషి తత్వమే అంతా. ఎందుకొచ్చేనబ్బా అనిపించింది. ఒక్క క్షణమే.

కారు డోర్‌ తనే తీశాడు. దిగేటప్పటికి వాళ్ళమ్మ ఎదురొచ్చారు. బావున్నారావిడ. చిన్న ఇల్లే అయినా ఏదో వింత అందం ` హాల్లో గోడలకి పటాలు, వాటికి వెలిగించిన అగరవత్తుల ఛాయలు, పాత చెక్కసామాను, వంటింట్లో నాలుగైదు ఇత్తడి గిన్నెలు ఊరగాయ జాడీలూ, వీధి అరుగుమీద ఒక పాత చెక్కబల్లా, రెండు కుర్చీలు …

కాళ్ళు కడుక్కోమ్మా, భోంచేద్దురుగాని అన్నారావిడ. అప్పటికే పడిపోతున్న ఆలోచనల్లోంచి బయటకొచ్చాను.

భోజనాలయ్యాయి. కారు తిరిగి ఇచ్చొస్తాను అన్నాడతను. సరే అందావిడ. ఓ పావుగంటలో తిరిగొచ్చాడు. బయటకెళ్ళొద్దామా అన్నాడు. ఈ లోపులో వాళ్ళమ్మగారు చాలా కబుర్లు చెప్పారు.

‘వీళ్ళ నాన్నగారు చిన్నప్పుడే పోయారమ్మా, అమాయకుడు వీడు, ఒళ్ళంతా మనసే వీడికి. ఏవేవో చెప్తుంటాడు ` కవిత్వమంటాడు, కథలంటాడు. అసలు వీడికీ ఉద్యోగం ఎలా వచ్చిందో, వీడీ ఉద్యోగాన్ని ఎలా నిలబెట్టుకుంటాడో.’

‘ఎందుకాంటీ అలా’.

‘ఏమోనమ్మా ఏవేవో పుస్తకాలు చదువుతుంటాడు, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంటాడు. అందరూ మంచివాళ్ళే అనుకుంటాడు. అందర్నీ నమ్మేస్తాడు. వాడిదో తరహా అమ్మా ` ఈ ప్రపంచాన్నంతట్నీ తనే బాగుచెయ్యాలనుకుంటాడు. అందరి బాధలూ తనవే అనుకొంటాడు. ఒక్కసారి ఈ భూమ్మీదకొచ్చి చూడరా అంటే నువ్వే రామ్మా అంటాడమ్మా ` భయం వేస్తుంటుంది.’

మీ వంటలు వేరుగా ఉన్నాయి ఆంటీ కానీ రుచిగా ఉన్నాయి అన్నాను ` మాటమారుస్తూ.

‘వంటలే వేరమ్మా, రుచులన్నీ ఒకటే, అన్నీ ఆ జిహ్వకే. అయినా వంటదేముందమ్మా చక్కగా నేర్చేసుకోవచ్చు ` దాంట్లో కొంచెం ప్రేమ పడిరదనుకో రుచదే వస్తుంది’.

సాయంత్రానికేం వండుతున్నావమ్మా అన్నాడతను.

‘చెప్పరా ఏంకావాలి’.

‘నేనూ తనూ బయట భోంచేసి వెళ్ళిపోతాంలే అమ్మా. నీ మధ్యాహ్న భోజనానికే బోరుకొట్టేసుంటుంది తనకి’.

‘అబ్బే అదేంలేదు. ఆంటీ వంట చాలా బాగుంది’.

‘పోన్లేమ్మా వాడన్నట్టుగానే బయటేతినండి. ఇంటికి వచ్చివెళ్ళండి. లేటు బస్సు కదా’ అన్నారావిడ.

ఒక్కసారిగా అతను మంచి మూడ్లోకొచ్చాడు. నవ్వుతూ మాట్లాడాడు. ఎక్కువ భాగం కవిత్వంమీదే. మంచి పుస్తకాలిస్తాను చదువుదువుగాని అన్నాడు.

ఏం తింటావ్‌ అన్నాడు.

ఏదయినా ఫర్వాలేదంది తను.

బేరర్‌ని పిలిచి రెండు భోజనాలు, ఒకటి వెజ్‌ ఇంకోటి నాన్‌వెజ్‌ అన్నాడు.

అవసరంలేదు ఈపూట ఇద్దరం వెజ్‌ తిందాం అంది తను.

ఇంట్లో అమ్మ రెడీగా ఉన్నారు ` చూస్తూన్నాన్రా బస్‌ టైంఅవుతోందని అంటూ.

ఇంట్లోకి తీస్కెళ్ళి బొట్టుపెట్టుకోమ్మా అన్నారు. చేతిలో ఓ రెండు వందల రూపాయలు పెట్టి ఏవన్నాకొనుక్కోమ్మా అన్నారావిడ.

కొత్తగా అనిపించినా బావుంది.

అనుకోకుండానే వంగి ఆవిడకి దణ్ణంపెట్టాను. దగ్గరికి తీసుకుందావిడ. ఫ్రైల్‌ బాడీ. సుతిమెత్తగా ఉంది. హాయనిపించింది. కావల్సిందానికంటే ఒక్కక్షణం ఎక్కువే ఉంది తను ఆవిడ ఆలింగనంలో.

తన బాగ్‌కూడా అతనే పట్టుకొన్నాడు. బస్టాండ్‌కి ఆటోలో. బస్సులో పక్కపక్కనే. వదిగి కూర్చొన్నాడతను.

ఒక్కమాట కూడా లేదతని వైపునుంచి. తనకీ కొంచెం వింతగానే ఉంది. ఎంతమార్పు నిన్న సాయంత్రానికి ఇప్పటికి.

అనుమానం వస్తోంది ` నిజంగా వాళ్ళమ్మగారికి వంట్లో బాగాలేదా లేక బాలేదని చెప్పి నన్ను ఆవిడకి చూపించడానికి తీసుకొచ్చాడా. ఏదేమైనా వాళ్ళింట్లో వాతావరణం బావుంది. సింపుల్‌ పీపుల్‌, భేషజాలేంలేవు.

అతను కిటికీ బయటకి చూస్తూ కూర్చొన్నాడు.

ఏదైనా చెప్పచ్చుకదా అంది తను.

‘ఏం చెప్పను’.

‘ఏదో ఒకటి చెప్పు’.

‘వేరేగా చెప్పడానికేముంది, అంతా చూశావుకదా. అమ్మ మనస్సెప్పుడూ నామీదే ఉంటుంది. నాన్నపోయి చాలా ఏళ్ళయింది. టీచర్‌. ఆవిడకొచ్చే పెన్షన్‌తోటే నన్ను చదివించింది అమ్మ. ఇప్పటికీ తనకిది కావాలని అడగదు. ఈపని ఇలా చెయ్యమని చెప్పదు. ఏంచెప్పినా సరే అంటుంది. ఆవిడకి కావాల్సిందొక్కటే ` నా ఆనందం’.

తను వింటోంది.

ఓ నాలుగైదు నిముషాల తర్వాత ` ‘ఎందుకో అమ్మకి నీగురించి చెప్పాలనిపించింది’.

‘ఒకసారి తీసుకురారా అంది. దానికే నీకు అబద్ధం చెప్పాల్సొచ్చింది, ఆవిడకి బాగోలేదని’ ` ఒక్కసారి తనకేసి చూసి మళ్ళీ తలతిప్పేసుకున్నాడు.

నీ గురించి చెప్పు అన్నాడు.

‘అన్నీ తెలుసుననుకునేకదా మీ అమ్మదగ్గరికి తీసుకెళ్ళావ్‌’.

‘తెలుసుకోవాల్సింది తెలియాల్సింది ఎవరిదగ్గిరా ఏమీ ఉండదు. అంతా అందరికీ తెలిసిందే. ఏదీ ఎవ్వరికీ తెలియందే. మనగురించి మనక్కూడా. ఒక్కోసారి మనకి మనమెంత దూరంగా ఉంటామంటే మనమున్న ప్రదేశం మనకి తెలియదు, మన మేమిటో మనకి తెలియదు. అదే తెలిస్తే జీవితంలో ఇక వెతుకులాటకి చోటెక్కడుంటుంది. తనగురించే తనకి తెలియనప్పుడు పక్కవాడిని గురించి తెలుసుకోవలసిన అవసరం ఏముంటుంది. పోనీ తెలుసుకుని చెయ్యగలిగింది మార్చగలిగింది మార్చుకోగలిగింది ఏముంటుంది. ఒకరి పాస్ట్‌ ఇది ` అందువల్ల తన ఫ్యూచర్‌ ఇలా అని చెప్పడానికేముంటుంది చెప్పు. అందుకే నేడే నిజం అన్నాడు కవి’.

‘ఆయనెన్నయినా చెప్తాడు. అనుభవించేవాడికి తెలుస్తుంది’ అంది తను.

‘సరే అయితే చెప్పు’.

‘నాకో రిలేషన్‌షిప్‌ ఉంది ఊళ్ళో’.

అతనేం మాట్లాడలేదు. వింటున్నాడు.

‘ఎన్నో వెన్నెలలు, చీకట్లు పంచుకొన్నాం, నక్షత్రాలేరుకొన్నాం. నేనొచ్చేశాను అన్నీ వదిలేసి’.

‘ఇప్పటి పరిస్థితేమిటి’.

‘నువ్వే అన్నావ్‌ కదా మన ప్రదేశం మనకి తెలియదు, మన పరిస్థితీ మనకి తెలియదని …’

ఐదు నిముషాలు గడిచాయి. వదిలేశాడనుకొన్నాను.

సడెన్‌గా ` రిలేషన్‌షిప్‌, ఫిజికల్‌ కాదుకదా అన్నాడు.

‘అవును. ఫిజికలే’.

అతనో రెండు నిముషాలు కళ్ళుమూసుకొన్నాడు ` తలొంచుక్కూర్చుని.

అప్రయత్నంగానే అతని తలమీద నా చెయ్యి.

మెల్లిగా తన భుజంమీద తలవాల్చాడతను.

అప్పుడప్పుడే కొంచెంకొంచెం పెరుగుతున్న అతని అంటకత్తెర తనమెడని సుతారంగా పొడుస్తోంది బస్సు ఊపుతో లయకలుపుతూ.

ఓ క్షణాన తన గుండెలమీద అతని కంటితునక.

తెలిసేలోగానే నా కన్నోడ్చిన ఓ మనోశకలం ` నేతోడంటూ.

ఆ రాత్రి మా ఇద్దరి మధ్య ముసుగులేం లేవుకానీ నన్ను నేనే పూర్తిగా చెరుపుకోలేకపోయాను.

విశ్వమంతా నిశ్శబ్దం రాజ్యమేలిందా, లేక మేమిద్దరమే మూగలమయ్యామా ` ప్రయాణపర్యంతం.

బరువులైతే తగ్గాం ` ఇద్దరం …

ఆ తర్వాత ఓ రోజు ఓ డ్రైవిన్‌లో `

ఏం ఆలోచిస్తున్నావ్‌ అంతగా అన్నాడు.

మన గురించే ` నిన్ను కలవకముందు నేనేమిటో నాకు చెప్పు. నిన్ను కలిశాక మనమేమిటో నన్ను చెప్పనీ అన్నాను.

ఖంగుతిన్నాడు ` విషయానికంటే భాషకి.

‘నాదెప్పుడూ ఒకేమాట `

నువ్వు ఎత్తున ఎగిరే పక్షివి, నేలనపూసే పూవువి

స్వేచ్ఛ నీ నిత్యావసరం ` నీలాకాశపు గూటిలో

నువ్వున్నచోట వెలుతురు, నీలో కటికచీకటి

మిణుగురునై నీలో నన్ను వెలగనీ

నేనడిగేదల్లా ఒకటే `

ఓ క్షణం నీగొంతు మొలిపించుకో

నాకో పాటపాడు, పాడుతూనే ఉండు

వేయి గొంతులు జతకలపనీ …’

‘నీలా అర్థంకాని పాటలు పాడడం నావల్లకాదు. విషయం చెప్పు’.

ఓ నిముషం ఆగాడు.

మనం పెళ్ళిచేసుకుందాం అన్నాడు.

ఆశ్చర్యమేం లేదు.

‘ఓకే ` నువ్వంటున్నట్టు మనమొకటయ్యాక మనమేమిటో నన్ను చెప్పనీ ` ఈ ఎగిరే పక్షిని నువ్వు ఎల్లకాలం భరించలేవు. గతాన్ని తవ్వకుండా ఉండగలవేమోగానీ వర్తమానాన్ని ఉపేక్షించలేవు. ఏదో ఆవేశంలో అనేశావుకానీ ` జీవితం కవిత్వమొకటే కాదు. దాని నడక ఎప్పటికీ ఒకలాగే ఉండదు ` ఈ విషయం నీకూ తెలుసు.

ఇక నావైపుకొస్తే ` నువ్వు చూసిన నాలోని చీకటి నిన్ను, అమ్మని అలుముకోవడం నాకిష్టంలేదు. మిణుగుర్లు నాకు సరిపోవు.

కానీ నువ్వు, నీ మాటలు నన్ను కట్టిపడేస్తాయని ఏమూలో చిన్నభయం. ఎంతతీయని మాటలు నీవి ` నువ్వెళ్ళిపోయాక వలుచుకు తింటున్నప్పుడు పదానికో పండు.

అసలు పెళ్ళే చేసుకోవా అంటావా `

పెళ్ళితో కౌటుంబిక, సామాజిక వ్యవస్థలోకి నేనేమీ ప్రత్యేకంగా వ్రవేశించేది లేదు, దానినుంచి ఆశించేదీ లేదు.

ఐ డోన్ట్‌ వాన్ట్‌ టు గెట్‌ స్టక్‌ ఎట్‌ దిస్‌ ఎర్లీస్టేజ్‌ …’

‘ఇంకా చెప్పాల్రా …

ఎంత కాదనుకున్నా ఆ నల్లాడు నన్నొదలడం లేదు ` వాడి కాలిచెప్పైన ఎలపటదానిలా.

ఆరోజు మీ ఇంటికొచ్చినప్పుడు బస్సులో నా వెనక వాడేనని నాకు తెలుసు. ఆ చూపు రాపిడి నాకు సుపరిచితం. అహం పెత్తనం మనసుమీద ఎల్లకాలం చెల్లదు. మూడు ముక్కలాటలో వాడు ఇస్పేట్‌ ఆసు.

ఈ స్థితిలో వాణ్ణి భుజాన్నేసుకుని నీతో రాలేను. పోనీ నన్నొదిలెయ్యరా అందామంటే ఆ రెండు కన్నీటి చుక్కలు నాగుండెల్లో ఎన్నటికీ ఇంకవు.

నావల్ల కాదు నిన్ను కాదనుకోవడం ` మరింత ముందుకెళ్ళాక. అలాగని నన్ను నేను చంపుకోగలననీ కాదు.

నా రెండు రెక్కల్లో ఒకటెప్పటికీ నువ్వేరా’ అంటూ అతన్ని హగ్‌ చేసుకున్నాను.

***

ట్రైనింగ్‌ పూర్తయింది.

పోస్టింగ్స్‌ చెరోమూలా.

ఆర్నెల్లలోపు నా పెళ్ళి ` అమ్మతెచ్చిన సంబంధమే, ఓ సంవత్సరం తర్వాత కవిగాడిదీ.

అతను కవిత్వం చెప్పడం మానలేదు, కలిసిన ప్రతిసారీ ` ఫోనులో అప్పుడప్పుడూ ` అవేతీపి, కొండొకచో చిరుచేదు పలుకులు …

నల్లాడికీ ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో మంచి ఉద్యోగమే వచ్చింది.

ఒకసారెప్పుడో వాట్సప్‌ డిపి బావుందంటే ఓసారి కలుద్దాం అన్నాడు.

కుదరలేదు ` కావాలనే కుదుర్చుకోలేదు.

ఆ విషయం వాడికీ తెలుసు.

అమ్మ హాపీగా ఉంది. అల్లుణ్ణి దగ్గరుండి చూసుకుంది.

అతను ప్రాక్టికల్‌. డిపిప్లిన్డ్‌ చిన్నప్పట్నుంచి. చాలా యాంబిషస్‌ ` చదువులో, తర్వాత బిజినెస్‌లో ` టైప్‌ ఏ కారెక్టర్‌. చదివే కొద్ది పుస్తకాలూ నాన్‌ఫిక్షనే.

కాంప్స్‌ ఎక్కువ. ఊళ్ళో ఉన్నా మీటింగుల్తో బిజీగా ఉండేవాడు. ఇద్దరి టైమింగ్సూ కుదిరేవికాదు.

మాటలు తక్కువతనికి. సైలెంట్‌గా ఉండటానికిష్టపడేవాడు.

తను పారేవాగయితే అతను నిండుకుండ.

మనిషి మంచివాడే. అదొక్కటే సరిపోదుకద. ఎందుకో ఏదో ఒక వెలితి త్వరగానే, తొందరపడేమో చోటుచేసుకుంది మాలో.

పద్ధతులు బాగా తెలిసినవాడతను ` పాటించేవాడు కూడా ` ఇంటా బయటా ` బెడ్‌రూంలో కూడా. బలప్రయోగం అతని డిక్షనరీలో లేనిమాట. గౌరవం పుణికి పుచ్చుకున్న మనిషి.

నేనెంత లేటయినా ఏమనేవాడుకాదు ` తనే కాఫీ కలిపి ఇచ్చేవాడు. నేనెప్పుడు కాల్‌చేసినా, ఎంతపనిలో ఉన్నా మాట్లాడేవాడు. తనే ఆంక్షలు పెట్టింది ` ఆఫీసవర్స్‌లో కాల్‌ చెయ్యద్దని.

నా మూడ్‌ బావున్నప్పుడు అన్ని విషయాలూ అతనికి చెప్తుండేదాన్ని. ఆఫీసులో కొలీగ్సు, వాళ్ళల్లో కొందరి ఆరాటం, వింతపోకడలు, అన్‌వెల్‌కమ్‌ అడ్డాన్సెస్‌ వగైరా. ఓసారి బాస్‌ మాటొచ్చి ఆయనా ఆశపడుతుంటాడని పొరపాటున అనేశాను. తనే మూడ్‌లో ఉన్నాడో ఏమో ` నువ్వు ముసలాళ్ళని కూడా వదిలిపెట్టవే అన్నాడు. మరోసారి నువ్వు కుటుంబాలేకాదు రాజ్యాలు కూడా కూల్చే స్టఫ్‌వి అన్నాడు.

‘తిన్నగా మాట్లాడు. ఏ కుటుంబం కూల్చాన్నేను. లేనిపోనివి ఊహించుకోకు’.

‘లేనిపోనివేముంది ` మీ ఊళ్ళో ఆ నల్లాడి గురించి నువ్వే చెప్పావ్‌. పెళ్ళికి ముందుకదా అని భరించాను. వాడెవడికో కవిత్వం పిచ్చంటూ వాడి గురించి చెప్పావ్‌ ` విన్నాను. ఇప్పటికీ వాడితోనే తిరుగుతున్నావ్‌ ` ఇంతకంటే ఏంచెయ్యాలి నువ్వు’.

‘షటప్‌. పిచ్చిపిచ్చిగా మాట్లాడకు’.

అంతే నా చెంపఛెళ్ళుమంది …

ఆనాడే తనకర్థమయిపోయింది. ఇన్నిరోజులూ అతనిది తెచ్చిపెట్టుకున్న గౌరవం. పూతపూసిన భాష ` అన్నీ కాలుక్యులేటెడ్‌ మూవ్సే. ఇప్పుడు బయటపడుతున్నాడు అసలు మనిషి. నిజం చెప్పడం తప్పయింది. చెప్పినవాటికి ఇంకో నాలుగు తనకు కావల్సినట్టుగా అల్లుకొని ఆ గూట్లోనే కొట్టుమిట్టాడుతున్నాడతను.

ఎన్ని భరించిందితను. అతనంత అందగాడుగాడు. తనకేమాత్రం సరితూగని ఫిజిక్‌. తన వెనక, అమ్మతో సహా, ఎందరేమనుకొన్నా తనావిషయం పట్టించుకోలేదు. పిల్లల విషయంలో కూడా లోపం అతని వైపునుంచేనని డాక్టర్‌ చెప్పినా కనీసం అమ్మకైనా చెప్పకుండా దాచిపెట్టింది తను. ఇంత చేసినా ఇప్పుడు లేనిపోనివి కల్పించుకొని రాద్ధాంతం చేస్తున్నాడు. తన మూవ్‌మెంట్‌ డ్రైవర్లనడిగి తెలుసుకొనే స్థితికి దిగజారిపోయాడు. ఇతని ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌ రోజురోజుకీ పెరిగిపోతోంది. దానితోబాటు జెలసీకూడా.

దొరికే కొద్దిటైంకూడా నరకసదృశమైపోతోంది. ఒక్కోసారి ఒకళ్ళనొకళ్ళు కళ్ళల్లోకి చూసుకోలేని పరిస్థితి. బుద్ధిప్రధానుడవడంతో అతనికంత తాడికిలేదుకానీ మనస్సుని నమ్ముకున్న నాకే ఈ ఆటుపోట్లన్నీ. ఎంతవరకూ ఈ సర్దుకుపోవడం. పెళ్ళై ఏడేళ్ళయినా తనకేంకావాలో అర్థంకావడం లేదతనికి, కనీసం తెలుసుకొనే ప్రయత్నంకూడా చెయ్యడంలేదు. ఎంతసేపూ తనూ తన బిజినెస్సు, తన కస్టమర్లూ, లాభాలూ.

అన్నిటికీ మించి మనిషిమీద నమ్మకం లేకపోవడం ఘోరం ` తనసలు భరించలేకపోతోంది. ఏమైనా ఉంటే తన్నే అడగొచ్చుకదా ` వాళ్ళనీ వీళ్ళనీ అడగడమెందుకు, అమ్మనికూడా. ఆవిడకూడా అల్లుడికే సపోర్టు. డిఫెన్సులో పడిపోతున్నట్టుంది. అంతా సాఫీగానే ఉంది, ఇద్దరూ సంతోషంగా ఉన్నారు, మంచి జంట అనిపించుకోవడమే ఆవిడకి ముఖ్యం. ఇద్దరిమధ్య ఏవో పొరపొచ్చాలు వస్తూపోవడం సాధారణం అనుకుంటుందావిడ. వాటి మూలాలలోకి వెళ్ళడం ఇష్టముండదావిడకి. లోలోపల ఎంత మసలుతున్నా పైకిమాత్రం ఏదీ కళపెళ్ళాడకూడదని గట్టిగా కోరుకుంటుందావిడ.

ఇతనోపక్కా, ఆవిడోపక్కా ` ఇద్దరికీ భయపడే తనూ ఎక్కువసేపు ఆఫీసులోనే గడుపుతోంది ` అంతగా పనున్నా లేకపోయినా.

అప్పుడప్పుడూ ఏదో ఆఫీసుపనంటూ వస్తున్న ఆ కవిగాడి తోటీ కాలం అందంగానే ఉంది. నా మాటల్లో కొంత అసంతృప్తి, అతని కవిత్వంలో సోకాల్డ్‌ తృప్తిగురించి పాకులాట ` కొంత డైరెక్ట్‌గా, ఇంకొంత పూతపూసి కన్వేచేస్తూనే ఉంటాడు ` అటూఇటైతే వెనక్కి తీసుకొనే వెసులుబాటలాగే ఉంచుకొని ` గమనించీ గమనించనట్లు తను. ఆ ఆలస్య ఘడియల్ని ఈయన బాగానే ట్రాక్‌చేస్తున్నాడు, బయటపడలేదు కానీ ` మొన్నటివరకు.

ఇక ఆ నల్లాడో మొండివాడు. వాడు పట్టిన కుందేటికి కాళ్ళసలులేవు ` వాడో విహంగశశాంకం. ఎంతదూరంగా ఉంచుదామన్నా, ఎగురుకుంటూ దగ్గరవుతున్నాడు.

సూటిగా చెప్పేస్తాడు నల్లాడు ` ‘నువ్వు సంతోషంగా లేవని నాకు తెలుసు. నీకు కావల్సింది మీ ఆయన దగ్గర లేదు. చెప్తున్నాను విను ` మనిద్దరం ఎప్పటికైనా కలుసుకుంటాం. వెయిట్‌ చెయ్యడం నాకేం కొత్తకాదు’.

‘కలుసుకుంటూనే ఉన్నాంగా’.

‘ఈ కలుసుకోవడాలు కాదు ` అవి ` మన ఊళ్ళోలాగ’.

ఒకరోజు నాకు చిరాకో, ఫ్రస్ట్ట్రేషనో ` నీ దగ్గరే ఉన్నాగా, కలిపేసుకో, నీ పనైపోతుంది ` ఇంకనేనంటూ ఏంమిగలను అన్నాను.

బాగా హర్టయ్యాడు.

అయినా పట్టువదలడువాడు ` ఎప్పటికైనా సిసలైన ప్రేమని మళ్ళీ నువ్వు రుచిచూసేది నానుంచే అంటూ ఛాలెంజ్‌చేసి వెళ్ళిపోయాడు.

వీళ్ళిద్దరిలో ఒకటే సేవింగ్‌ గ్రేస్‌ ` వాళ్ళుగీసుకున్న హద్దులు దాటరు. వాళ్ళ మాటలు ఊళ్ళేలుతాయి, కాళ్ళు ఇల్లు కదలవ్‌.

***

ఓ పండక్కి ఊరెళ్ళాం నేనూ, అమ్మా. ఆయనా ముందురోజే సింగపూరెళ్ళాడు.

ఆ రాత్రి నల్లాడూ నేనూ …

చీకట్లో వెలుతురు గుమ్మరిస్తున్నాననుకొంటూ అమ్మ ` ఆమె వెనక అల్లుడు.

దుప్పటి కప్పని చీకటి `

నాలో నేను పగులుతున్న చప్పుడు.

మర్నాడే అతని ఫ్లాట్‌కి నేను మూసేసిన దారులు ` వాకిట్లో పెద్దపీటమీద గౌరవానికోదండ.

***

‘ఎందుకమ్మా ఇలా …’

‘ముద్దుగా పెంచుకొన్నానే నిన్ను ` పెంచుకున్నాం అనలేను. చిన్నప్పట్నుంచి నీ ఆలోచనలు వేరు, ఆటపాటలు వేరు ` నీ అడుగులు నీవే.

ఒంటికాలు మీదా నువ్వే, మూడోకాలూ నీకే ` అందుకే ఆ స్థిరత్వం నీకు ` ఎన్ని గంతులేసినా, ఎన్నెన్ని చిందులుతొక్కినా.

దేన్నీ దాచుకొనేదానివి కాదు, ఉన్నదున్నట్టు మొహంమీద చెప్పెయ్యడమే ` నీ పలుకుల్లో రంగూరుచులు గూభాళించేవి` చీల్చి చెండాడేవి కూడా.

ఆరోజు నిన్నడగడమే పొరపాటైంది ` చెప్పేశావ్‌ ` ఆ నల్లాడంటే ఇష్టమని, ఎందుకో నీకే తెలియదని, వాడి పక్కనుంటే వేరేదీ గుర్తుండదనీ ` ఆ క్షణాల్ని వర్ణించబోయావు కూడా.

నాకు తెలుసు ` నిన్ను కోప్పడ్డా, కాదన్నా, తిట్టినా తిమ్మినా ఏం ఉపయోగం ఉండదని. అదే అక్కల్నయితే భయపెట్టేదాన్ని. నీ విషయంలో సంయమనం ముఖ్యమనుకొన్నాను ` నిన్ను కోల్పోలేను. ఇటువంటప్పుడే నాన్న అవసరం, పశుబలం తనది ` విషయాన్ని అంతటితో ముగించేశాడు ` ఎలపటిదాన్ని మర్చిపోలేకపోయాం ఇద్దరం.

నువ్వు తిరగబళ్ళేదు, కొట్లాడలేదు, కనీసం విషయాన్ని తిరగతోడలేదు ` నీ నైజానికి విరుద్ధంగా. సిటీలో చదువులోపడ్డావని పొరబడ్డాం. ఆ కసితోనే ఉద్యోగం సంపాదించుకొన్నావనుకొన్నాం.

ఆ అమెరికా సంబంధం చెప్పినప్పుడు కాదనలేదు నువ్వు. నల్లాణ్ణి మర్చిపోయావా, నటిస్తున్నావా అర్థంకాలేదు. అయినా మీ నాన్న ఎప్పటికప్పుడు అన్నీ చేరవేస్తున్నాడని నాకు తెలుసు. నేనూ చూచాయగా చెప్పినా నువ్వేం కదల్లేదు …

ఓ క్షణం ఆగి నాకేసి చూసి మళ్ళీ మొదలెట్టిందావిడ ` తనలో తాను మాట్లాడుకుంటున్నట్టుగా `

‘నిలదొక్కుకుంటున్నావనుకొంటుంటే ఆ కవిగాడి గురించి చెప్పావ్‌. మనసున్నవాడన్నావ్‌. వాడు పిలవగానే వాళ్ళూరెళ్ళావ్‌, చెట్టాపట్టాలేసుకు తిరిగావ్‌ ` ఇదంతా ఆ సంబంధం గురించి తేల్చకుండానే.

అనుమానం వచ్చింది ` నువ్వు వీళ్ళతో ఆడుకుంటున్నావా అని. నా కూతురలాంటిది కాదు అని సరిపెట్టుకొన్నాను.

అయినా నువ్వు ఫలానావాడే కావాలని ఎప్పుడైనా గట్టిగా చెప్తే కనకనా’ `

ఈసారి తలెత్తిచూడ్డం నావంతయింది.

‘నాక్కూడా పెళ్ళిలో అతన్ని దగ్గర్నుంచి చూసినప్పుడు కొంచెం తేడాయే తోచింది. నీ మొహంలో వెతికినా అసంతృప్తి లేదు, నవ్వు తప్ప.

నేనేమన్నా అనవసరంగా ఊహించుకుంటున్నానా అనిపించేది.

రెండేళ్ళయింది. పిల్లలు ప్లాన్‌చెయ్యడం లేదన్నావ్‌. ఐదేళ్ళకి ప్రొమోషన్‌ ` ఇరవై నాలుగ్గంటలూ ఉద్యోగమే కదమ్మా అంటూ నవ్వేసేదానివి. నేను కుట్టించి దాచుకున్న పట్టుపావడాలప్పటికి బుడిబుడి అడుగులేసేవి ` బీరువాలోనే.

ఏ రాత్రో వచ్చేదానివి ఇంటికి, పనున్నా లేకపోయినా.

ఎంత దాచడానికి ప్రయత్నించినా ` నీతో సమయం, కనీసం ఇంట్లో ఉన్నంతసేపైనా గడపలేకపోతున్నాననే బాధతోపాటు, నువ్వు బయటకెళ్తున్నప్పుడు, నవ్వుతూ ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ముందు కొంచెం చిరాకు, క్రమేణా అసూయా ప్రస్ఫుటమయ్యేవి అతనిలో ` కొట్టొచ్చినట్లు కనబడేవి.

రెండు మూడుసార్లు ఆ కవిగాడు నిన్ను దిగబెట్టడం, బై చెప్తూన్నప్పుడు నీ మొహంలో మెరుపు, వదిలివెళ్తూ వాడి నిర్లిప్తత ` గమనిస్తూ నేనూ, అతనూ ` త్వరలోనే మీ డబుల్‌బెడ్‌కింద దూరిన ఓ సింగిల్‌ పరుపు.

ఏరోజూ మీ గదిలోంచి నిశ్శబ్దమో, గొడవో తప్ప గుసగుసలున్నాయా.

ఆ నల్లాడి గొడవయినరోజు మీ నాన్నని కొట్టినంతపని చేశాను ` ఊర్లో ఉండి ఏంచేస్తున్నావని. మీ తండ్రీకూతుళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకటే ` నేను వేరుకాదని ఎప్పటికి తెలియాలి మీకు’ ` అమ్మ ఏడుస్తోంది.

‘తెలుసమ్మా’ ` నాకూ కన్నీరాగలేదు.

‘మాకుమాత్రం ఎవరున్నారు, నువ్వు తప్ప’.

‘ఉంటే ఎందుకు చెప్పలేదే’ ` అమ్మ ఉక్రోషం.

‘ఏం చెప్పనమ్మా, ఎలా చెప్పను’.

‘నాకూ నల్లాడూ కావాలనుంది, కవిగాడూ కావాలనుంది, అతనూ మంచివాడేనని చెప్పనా, చెప్పగలనా. నాకు నేను కన్విన్స్‌ అయ్యానా ` ఏమో.

నల్లాణ్ణి మర్చిపోయేందుకే ట్రైచేశాను. కావాలనుకొంటూనే ఆ కవిగాడికి నువ్వు నన్ను భరించలేవని చెప్పేశాను. అసలు పెళ్ళి చేసుకొంటానో లేదో ఇప్పట్లో అన్నాను.

కానీ అమ్మా, నిన్ను కాదనలేకపోయానమ్మా’ ` అమ్మ ఒళ్ళో నా తల.

‘నువ్వేం చెప్పినా, చేసినా నా మంచి గురించేనని నాకు తెలుసు.

ఆ సంబంధం ఎన్ని కోణాల్లో ఆలోచించి చేసుకోమన్నావో తెలుసు. కాదనలేకపోయానమ్మా `  కాదనదలచుకోలేదు ` కానీ గతం అంతగా వెంటాడుతుందని తెలసుకోలేకపోయాను …’

కాలింగ్‌బెల్‌ మోగింది.

కవిగాడు …

‘అలా ఆఫీసుకెళ్తూ ` చెప్పాపెట్టకుండా వచ్చేశానా’ ` అంటూ నమస్తే ఆంటీ, ఎలాఉన్నారు అన్నాడు అమ్మని చూస్తూ …

బావున్నామయ్యా అంది అమ్మ ముక్తసరిగా.

మీరేదో సీరియస్‌గా మాట్లాడుకొంటున్నట్లున్నారు, వస్తాను అంటూ లేవబోయాడు.

కూర్చో, కవిత్వం మాత్రం చెప్పకు అన్నాను, వీడేదో మొదలెడుతున్నాడే కొత్తగా అనుకుంటూ

వాతావరణం కొంచెం చల్లబడిరది.

సడెన్‌గా సింగిల్‌గుండె థీరీ తెలుసా అన్నాడతను.

తెలియదన్నట్లు తలూపింది తను.

అమ్మ వింటోంది.

‘ఒకటే గుండె, ఒకే ప్రేమ, ఒకే జీవితమనే పిచ్చిసిద్ధాంతం ` ఎవడు రుద్దాడో మనిషిమీద’.

‘ఎవడో మగాడే అయ్యుంటాడు ` గుండెకి నాలుగు అరలుంటాయని, అలాంటి గుండెలు వళ్ళంతా నిండి ఉంటాయని, ఒక్కో అరలో ఒక్కొక్కరికి ప్రత్యేక స్థానముంటుందని ఒప్పుకోడానికిష్టపడక’ ` అమ్మ.

ఆశ్చర్యంగా చూశాం ఇద్దరం.

‘ఆడాళ్ళదేమన్నా భిన్నాభిప్రాయమా దీనిమీద’ అన్నాడతను.

తనాపుకోలేకపోయింది `

‘నీ తాకిడి వేరు. వాడి అలికిడివేరు. నీ ఊసులు వేరు, వాడి బాసలు వేరు. నువ్వువేరు, వాడువేరు. ఇద్దరూ కావాలి నాకు. ఇద్దరి చెలిమీ, చలీ, వేడీ కావాలి. గడ్డకట్టాలి, దహించుకుపోవాలి `  ఏకకాలంలో.

ఎవరిని కాదనను, ఎవరిదానను నేననను. ఎవరికి బైచెప్పను. ఎవరిని స్వాగతించను. ఎవరికి ఏమయిన దానను నేను.

పుట్టుకలో వీళ్ళెవరూ లేరే, మధ్యలో వచ్చి నన్ను పెళ్ళి చేసుకున్నానని, ప్రేమిస్తున్నామని శాసించయత్నించే వీళ్ళకి నామీదున్నది నిజమైన ప్రేమా. ఉంటే నన్ను మూడుముక్కలు కోసుకోడానికైనా ఎందుకైనా వెనుకాడరు.

నేనూ నేనుగా వీళ్ళకి అరగను. నా యూనిటీ వీళ్ళకి చచ్చినా నచ్చని కాన్సెప్ట్‌.

నేనెవరినైనా ఊహించుకోవచ్చు ` వేరొకరిని తాకుతూనే. నిద్దర్లెన్నయినా ఎవరి కునుకు వాళ్ళతోనే. తెల్లారాక ఎవరి హృదయశకలం వాళ్ళ లాక్‌ అండ్‌ కీలో.

ప్రేమతో, మనసు నీడన ` ఇదే నా వీక్‌నెస్‌, వాళ్ళ స్ట్రెంగ్త్‌కూడా.

నాకోసం మిగిలినవాళ్ళ ఛాయని కూడా భరించలేని వీళ్ళు నన్ను స్వతంత్రీకరించడానికి, నా పాతివ్రత్యాన్ని పదికాలాలపాటు కాపాడటానికి ఏకంకావడానికి కూడా వెనకాడరు.

వీళ్ళ ఉదాత్తత అంతా నామీద వాళ్ళ అధికారాన్ని సుస్థిరం చేసుకోడానికే, నన్ను కట్టుబానిసని చెయ్యడానికే. బజార్లో పరువూ, ప్రతిష్టా కంటే నా ఆనందం తక్కువ తూగుతోంది వీళ్ళకి.

ఇదే సర్వజీవన సారాంశమా ` అన్నీ జీవనసాఫల్యాలే, అందరూ ప్రేమతత్వ విచారంలో తలలు పండినవాళ్ళే ` అందరిలోనూ కనీస ప్రేమజడిలో తడవని బహుపార్శ్వాలే …’

` స్వగతమా ` ఏమో!

నే వెళ్ళొస్తాను అన్నాడు కవి.

అమ్మ అతన్ని సాగనంపింది గుమ్మందాకా.

చెప్పమ్మా అంది తను.

‘ఏంచెప్పనమ్మా `

నీ మనసు తెలుసుకోలేక ఏ తల్లీచేయకూడని రాద్ధాంతమే చేశాను. అందర్నీ రోడ్డున పడేశాను. సర్వం కోల్పోయాను.

నువ్వే కరెక్టు. నీ జీవితం నీది. నువ్వు నీలాగే, చిన్నప్పట్లాగే ఉండు. నీ మనసేం చెబితే అదే చెయ్యి తల్లీ ` చిన్నదానివి క్షమించమని అడగలేనే …’

నా ఒళ్ళో వాలిపోయింది అమ్మ.

***

మూడేళ్ళ తర్వాత `

ఊరి పొలిమేరలో రెండెడ్లబండిలో నల్లాడు.

కారుదిగి ఒకమారు ఎలపటిదాన్ని నిమిరి బండెక్కాను.

కూడా అమ్మ …

ఆరాత్రి చుక్కల్లెక్కపెడుతూ

‘పార్టీ జరుగుతోందీ ఎడారిలో

ఏ నింగినుంచో నువ్వూడి పడ్డావనుకో

వేపేసుకు తిననూ నా వంటిమీద’ `

ఆ కవిగాడికి ఫోనులో తను.

అదేదో ఆ నల్లాడికి చెప్పు. ఆల్‌ ది బెస్ట్‌ అన్నాడు వాడు.

వీడు వింటూనే ఉన్నాడు. నువ్వు కూడా ఉంటే బాగుంటుందని ` అంటూ తన ట్రేడ్‌మార్క్‌ నవ్వు నవ్వింది, నల్లాణ్ణి దగ్గరికి లాక్కుంటూ.

జవరాళ్ళ గోడ కిసుక్కుమంది.

ఊరూ పల్లే జుగల్‌బందీలో అమ్మా నేనూ నల్లాడు.

****

చిత్రం: రాజశేఖర్ చంద్రం 

చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చదువుతున్నంతసేపూ మబ్బు పట్టిన ఆకాశం కింద ఉన్న అనుభవం కలిగింది. దిగులుకి, సంతోషానికి మధ్యస్థం ఆ స్థితి. పురాస్మృతులు ఏవో మళ్ళీ పలకరించాయి. చిందర వందరగా పడున్న సామాన్ల మధ్య తన జ్ఞాపకాలు ఎక్కడున్నాయో వెతుక్కోవాలి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు