1
ఒక సమాజం సంక్షుభితమై కుతకుతలాడుతున్నప్పుడు, సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు అట్టడుగుకు చేరి, జీవితం దుర్లభమైనప్పుడు, మార్కెట్ సృష్టించే చవకబారు అభిరుచులే విలువలుగా, సంస్కృతిగా కీర్తించబడుతు న్నప్పుడు, మాట, కదలిక, కూడలి నిరంతర నిఘా నీడన వుండాల్సివచ్చినప్పుడు మహోధృతంగా సాహిత్యం వస్తుంది. పరిమాణాత్మకంగా మీరు అంచనా వేయదలిస్తే ఈ సంవత్సరం తెలుగులో వచ్చిన కొత్తపుస్తకాలు చూడండి చాలు.
నిరసనకో, ఆగ్రహ ప్రకటనకో, నిత్యం వెంటాడుతున్న వేదనను వ్యక్తపరచడానికో, ప్రతిఘటనకు నైతిక మద్దతు కూడగట్టడానికో తక్షణ అవసరంగా వచ్చేది కవిత్వం. బలమైన వ్యక్తీకరణతో, అన్ని జీవన పార్శ్వాలను తడుముతూ ఇప్పటి యువత ఎంత కొత్తగా కవిత్వం రాస్తున్నదో చదువరులైన మీకు చెప్పనవసరం లేదు. కానీ అది ఇచ్చే అనుభూతి, ప్రేరణ చాలదు. ఇంకా కావాలి. జీవిత విస్తృతిని, లోతునూ విశ్లేషించి చూపే వచనం కావాలి. వచనం రావాలి. సృజన రంగంలో నవల, కథ మాత్రమే ఆ పని సమర్థవంతంగా నిర్వహించగలవు. అంటే మార్పులు వేగంగా జరుగుతున్న సందర్భంలో నిలబడి, దాన్ని అర్థం చేసుకొని, ఆ మార్పులు ఏ దిశగా సాగడానికి అవకాశం ఉన్నదో చెప్పాలి. మార్పులను చిత్రించాలి. వ్యాఖ్యానించాలి. పురోగామి శక్తుల పక్షాన రచయిత దృఢంగా నిలబడాలి.ప్రపంచ చరిత్ర పొడవునా ఇలాంటి ఉదాహరణలు అనేకం. ఫ్రెంచ్, రష్యన్ భాషల్లో వచ్చిన విశ్వ సాహిత్యపు గొప్ప నవలలు అందుకు తార్కాణం. భారత స్వాతంత్రోద్యమ కాలంలో బెంగాలీ, ఉర్దూ, హిందీ వంటి ఉత్తర భారత భాషల్లోనూ, మలయాళ, కన్నడ, తెలుగు వంటి దక్షిణ భారతీయ భాషలలోనూ వచ్చిన గొప్ప నవలలు మరొక ఉదాహరణ.
విప్లవాలు, ఉద్యమాలు కొత్త ఆలోచనలకు ఊపిరి పోస్తాయి. నిస్తేజమైవున్న సమాజానికి జవసత్వాల నిస్తాయి. అంతకు ముందు లేని కొత్త ఎరుకను, హక్కుల చైతన్యాన్ని, విముక్తి ఆకాంక్షలను, కొత్త విలువలను, ప్రమాణాలను ముందుకు తెస్తాయి. రచయితలు ఆ సందర్భాలను గుర్తించి రాసిన నవలలే సాహిత్యంలో మైలు రాళ్లుగా నిలిచాయి.
జాతీయోద్యమం తర్వాత, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల తర్వాత, యాభైఏళ్లకు పైగా విప్లవోద్యమమూ, పీడిత, అస్తిత్వ ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ ప్రస్తుతం తలెత్తిన సంక్షోభం గతంకంటే చాలా తీవ్రమైనది, భిన్నమైనది. ఈ సందర్భాన్ని అనేక వైపుల నుంచి, లోతుల నుంచి దర్శించి రాయడానికి చేసిన ప్రయత్నమే (శికారి నవలతో మీకు బాగా పరిచితుడైన) పాణి ‘అనేకవైపుల’ నవల.
నవల రాయాలంటే నిశ్చల పరిశీలన చాలదు. చలనంలో వున్న సమాజాన్ని, రచయిత కూడా చలనంలో ఉంటూ పరిశీలించాలి, దాని గతిశీలతని అర్ధం చేసుకోవాలి. వర్తమానంలో నిలబడి వర్తమానం అనిపించే సమీప గతాన్ని (మహా అయితే ఒక పదేళ్లు వెనక్కు) విశ్లేషించుకొని, మన నడవడిలో, సంస్కృతిలో దాని ప్రభావాన్ని లెక్కగట్టాలి. వాటి భవిష్యత్ పరిణామాలను ఊహించి చెప్పగలగాలి. అంటే ఒకరకంగా రచయిత చరిత్రకారుల బాధ్యతను నెత్తికెత్తుకోవాలి. గత వర్తమానాల మీది నుంచి భవిష్యత్తులోకి చూపు సారించాలి. ఒక సమకాలీన మార్పును, అది తెస్తున్న పరిణామాలను సృజనాత్మక రచనలో ప్రతిఫలించాలంటే రచయితకు ధైర్యం వుండాలి. ప్రతి సూక్ష్మ కదలికను చూడగలిగే నేర్పు వుండాలి. వస్తుగతంగా చూడగలిగిన దృక్పథం ఉండాలి. అన్నిటికీ మిన్నగా సత్యం పట్ల నిబద్ధత ఉండాలి.
000
సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా ఫేస్ బుక్‌లో వున్న మన మిత్రుల్లో మూడు నాలుగు రకాల మనుషులు తరచుగా అగుపడుతుంటారు. వీళ్ళలో ఒక రకం..(ఎక్కువమంది) 70లతో మొదలై 90ల వరకు ఉద్యమంలోని ఏదో ఒక ప్రజా సంఘంతో కొనసాగి అనేక కారణాల వల్ల బైటికి వచ్చినవాళ్ళు. చాలా క్రియాశీలంగా పనిచేసి ఒకస్థాయి నాయకత్వంలో కూడా ఉండి కొన్ని పరిస్థితుల వల్ల ఉద్యమాన్ని విరమించుకున్న వాళ్లు. వీళ్లకు తమ(యవ్వన) కాలం నాటి ఉద్యమాలే గొప్పవని అనిపిస్తుంటాయి. ఆనాటి పార్టీయే పార్టీ, తమ కాలం నాటి నాయకులే నాయకులు, తమ కాలమే ఉద్యమాల కాలం. తమ తరువాత నడుస్తున్నది విప్లవపార్టీనే కాదు. విప్లవోద్యమమే కాదు.
రెండో రకం 90ల దాకా కార్యకర్తలుగానో, ప్రజా సంఘాల నాయకులుగానో ఉండి దళిత స్త్రీవాద ఉద్యమాలు వచ్చినకాలంలో విడివడి కొంత కాలం తరువాత దాన్ని కూడా వదిలేసి వ్యక్తిగత జీవితానికి పరిమితమైనవాళ్ళు.
మూడో రకం ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కాదుగానీ ఉద్యమానికి సానుభూతిపరులు. పత్రికలు, సామాజిక మాధ్యమాల ప్రచారానికి తీవ్రంగా ప్రభావితం అయ్యేవాళ్ళు. వీళ్ళందరూ సమాజం మారాలనీ పీడన అంతరించాలనీ కోరుకునే వాళ్లే. తాము ఒకప్పుడు విశ్వాసించిన పార్టీ లేదా ఉద్యమమే ఆ పని చేయాలని కోరుకునే వాళ్ళు. ఆ పని తగినంత వేగంగా జరగలేదని ఫిర్యాదు ఉన్నవాళ్లు కూడా.
వీళ్లెవరూ 90ల నాటి పరిస్థితులు దాటిపోయాయని గుర్తెరుగరు. పైగా తాము చాలా అప్‌డేట్‌గా ఉన్నామని అనుకుంటూ ఉంటారు. వాస్తవ పరిస్థితులు ఎట్లా పని చేస్తున్నదీ ఆలోచించరు. అప్పటంత కానీసపు సిగ్గుగానైనా ఇప్పటి ప్రభుత్వాలు లేవని గుర్తించరు. ఇప్పటి ప్రభుత్వాలు అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తూ ప్రజాస్వామ్య ముసుగును తామే చించేసుకున్నాయి. దేశ సంపదను పెట్టుబడిదారులకు దోచిపెట్టడమే రాజ్య ఏకైక కార్యక్రమంగా చేసుకున్నారు పాలకులు. తమను విమర్శిస్తున్న, తమ కార్యకలాపాలకు అడ్డుపడుతున్న ప్రజాస్వామికవాదులను ఎంత హింసకైనా గురిచేయడానికి వెనుకాడని స్వభావం పెరిగింది. అధికారంలోవున్న ఏ పార్లమెంటరీ పార్టీ కూడా దీనికి మినహాయింపు కాదు. వీళ్ళందరూ సమిష్టిగా ప్రజలను కూడా అవినీతిపరులుగా చేయడానికి నిరంతరం కొత్త పథకాలు వేస్తున్నారు.
1980ల్లో పాలస్తీనా ఉద్యమాన్ని జాతి ఉద్యమంగా గుర్తించింది మన సమాజం. ఆనాడు భారత ప్రభుత్వంతో పాటు మెజారిటీ దేశాలు పాలస్తీనాను ఒక స్వతంత్ర రాజ్యంగా గుర్తించాయి. 2023-24 వచ్చేసరికి పరిస్థితి మారింది. ప్రపంచ పెట్టుబడిదారుల ప్రయోజనాలు తప్ప మరేదీ ముఖ్యం కాని స్థితికి చేరింది ప్రపంచం.
ఇంత మానవ హననం జరుగుతున్నా ఒకటి రెండు ఇస్లామిక్ రాజ్యాలు తప్ప పెద్దగా ప్రతిఘటన లేదు. నోటిమాట నిరసన ప్రకటన మాత్రమే అంతర్జాతీయ వేదికలమీద వినిపిస్తున్నది ఈనాడు. ఈ 40 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. ప్రపంచమంతా చాలా మారింది. ఒకప్పటి ఎల్‌టిటిఈ, బోడో, గుర్ఖాలాండ్ ఉద్యమాలు ఇప్పుడు కనిపించడం లేదు. వాటిని పాలకులు అంతగా అణచివేశారు. (అవి కనుమరుగు కావడం వెనుక ఉన్న వాటి అంతర్గత లోపాలను గుర్తిస్తున్నాను కానీ వాటిని ఇక్కడ చర్చించడం కుదరదు)
ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన యీ మొత్తం మార్పులను గమనించలేని వాళ్లు మన చుట్టూ ఉన్నారు. వీళ్ళలో కొందరు విప్లవ సంస్థలు సాంప్రదాయకంగా మారిపోయాయని ఆరోపించి బైటికి వచ్చినవాళ్లే. ఒక ఎంజీవోగనో, ప్రచురణ సంస్థగానో, గుంపుగానో ఏర్పడ్డాక (విడివడి ఏదో ఒక పార్టీగా ఏర్పడినవాళ్ళు కాదు) ఆ అప్రజాస్వామిక ధోరణులను తమ వ్యక్తిత్వాల్లోకీ, సంస్థల్లోకీ తెచ్చుకున్నారు. విమర్శను స్వీకరించలేరు. సహనంతో చర్చించలేరు. ఇప్పుడు విప్లవ ప్రజాస్వామిక ఉద్యమంలో ఏం జరుగుతుందో తెలుసుకోరు, కనీసం వినటానికి కూడా ఇష్టపడరు.
రాజ్యాంగాన్ని నమ్మి, పౌరహక్కులను, విలువలను నమ్మి పరిమితులతో నైనా ప్రజాపక్షం వహించిన మేధావులు గతంలో వుండేవారు. గొర్రెపాటి నరేంద్రనాథ్ వంటి నిజమైన గాంధేయవాదులు వుండేవారు. విప్లవోద్యమం తో తమకు అనేక విభేదాలు వున్నా ప్రజాస్వామ్య స్ఫూర్తిని నమ్మి ప్రజల హక్కుల పక్షాన నిలిచారు. ప్రజా ఉద్యమాలన్నిటినీ గౌరవించేవారు.
ఈ పద్ధతికి భిన్నంగావున్న, పైన చెప్పిన రెండు మూడు తరహాల వ్యక్తుల అసాధారణ ప్రవర్తనలను( లోపాలు అనటం లేదు) నేను మారిన ప్రపంచ పరిస్థితుల్లోనే చూస్తున్నాను. రాజకీయ పరిస్థితులు ఎంత మారినా, ఉద్యమాలకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటి నుంచి బయటపడే మార్గం మానవాళి కనుగొంటుందన్న విశ్వాసం నాకుంది. ప్రజలు విప్లవ పార్టీ నాయకత్వంలోగాని, వేరే ప్రజాస్వామిక సంస్థల నాయకత్వంలోకాని కొనసాగిస్తున్న ఆచరణ ముందుకే పోతుంది. కొన్ని ప్రయోగాలు విఫలమయినా అవి మళ్లీ మళ్లీ కొత్త ఆచరణ రూపాలుగా ముందుకు వస్తాయి. అంతిమ విజయం సాధించే దాకా ఈ ప్రయత్నాలు సాగుతూనే వుంటాయి.
ఐన్‌స్టీన్ థియరీ ఆఫ్ రేలేటివిటీ ప్రకారం ఒక చలనంలో నున్న వస్తువు స్పష్టంగా అగుపించాలంటే పరిశీలకులు కూడా చలనంలో వుండాలి. వస్తువు చలనంలో వుండి పరిశీలకులు ఒక చోట ఆగివున్నా, వస్తువు నిశ్చలమై పరిశీలకులు మాత్రమే చలనంలో వున్నా దృశ్యం తప్పుగా అర్థం అవుతుంది. తప్పుడు నిర్ధారణలకు దారితీస్తుంది. పాణి రచయితగా వుంటూనే ఉద్యమంతో పాటు చలనంలో వున్నాడు. కాబట్టి చలనంలో ఉన్న ఉద్యమాన్ని అర్థం చేసుకోగలిగాడు. సంక్షోభాలను, పరిష్కార ప్రయత్నాలను దగ్గరిగా చూశాడు. అన్నిటినీ వస్తుగతంగా చూశాడు. కాబట్టి అతడు చిత్రించిన దృశ్యం అభూత కల్పన అయ్యే అవకాశం లేదు.
వసంత మేఘగర్జన తరువాత విప్లవోద్యమం వెనుకతట్టు పట్టినాక, కొన్ని వివేచనలు, కొన్ని అనుభవాలు, గుణపాఠాలు, కొత్త మార్గాలు ఎన్నుకొని కొందరు వ్యక్తులు కలిసి 1974లో తిరిగి ప్రయత్నాలు చేపట్టారు. విప్లవానికి బాట రచించి ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ అనుభవం నుంచి 1980లో ‘ప్రజాయుద్ధం’ పార్టీని స్థాపించారు. పెద్దాయన నాయకత్వంలో సృజనాత్మక ఆలోచనలతో అది ముందుకు సాగింది. విస్తరించింది. అప్పటి నుంచి విప్లవోద్యమం కొత్త ప్రాంతాలకు, కొత్త సెక్షన్లకు విస్తరిస్తున్నా ఎన్నో తాకిడులు ఎదుర్కొన్నది. చాలా నష్టపోయింది. కానీ ప్రజలు వెనకడుగువేయలేదు. చరిత్రలో హిట్లర్ వంటి క్రూర నియంతతోనే తలపడి నిలిచించి, మహా మహా నియంతలనే మట్టి కరిపించింది ఈ మానవాళి. వెనకడుగు వేస్తుందా? పడిపోయినా లేచినిలబడే స్వభావం దానిది. అనేకమార్లు అది రుజువు అయ్యింది కూడా!
1990ల నుంచి విప్లవోద్యమ దశను ప్రత్యేకంగా పరిశీలించడం అవసరం. ఈ కాలం లోనే శత్రువుతో మొదలుపెట్టి తనలో భాగం అనుకున్న, తన మనుషులు అనుకున్న వారి నుంచి, అన్నివైపుల నుంచి దూసు కొచ్చిన శరపరంపరలకు నెత్తురోడింది ఉద్యమం. కూడదీసుకొని నిలిచి వివేచించింది. శత్రుదాడుల వెనకున్న లక్ష్యం ఏమిటో పసిగట్టింది. మిత్రుల ప్రశ్నల వెనకున్న వేదనలను గ్రహించింది. విడివడ్డ యీ శకలాలు తన శరీరంలోనివే అని నమ్మింది. మిత్రుల విపరీత పోకడలను కూడా మారిన ప్రపంచ పరిస్థితుల నేపధ్యం గానే తలచింది. పెట్టుబడి వెంట తెచ్చిన సంస్కృతి మానవ సారాన్ని ఎలా నిర్వీర్యం చేస్తున్నదో అర్థం చేసుకుంది. వలపోతలు, వగపులు వృధా అని గుర్తెరిగి కార్యాచరణకు పదును పెట్టింది. ఇది మహా ఇతిహాసం. ఎక్కడెక్కడ ఏం జరిగిందో చెప్పేదెలా? తను ఏం చేసిందో, చేస్తున్నదో బైటికి తెలిసేదెలా? ఎట్లా పడుతూ లేస్తూ ముందుకుపోతోందో అందరికీ తెలియపరచడం ఎలా?
సమాజానికి ఉద్యమానికి అనుసంధానకర్తలు రచయితలు అందువల్ల ఈ రచన ఒక సంభాషణా వేదిక. అనేక వైపుల ఉన్న తన మిత్రులతో, అయినవాళ్లతో, తనలో భాగం కావాల్సిన వాళ్లతో, అనేక శకలాలతో ఒక బహిరంగ సంభాషణ. ఒక ప్రేమ పూర్వక ఆత్మీయ ఆలింగనం. మాట పెగలని దుఃఖంలోనూ మాట్లాడుకునేందుకు సిద్ధం కావడమే ఈ నవలా శిల్పం. ఆ మాటలు మనం వినాలి. ఉద్యమం మనందరి కోసం, జనం కోసం, చరిత్ర కోసం ఏం చేసిందో, చేస్తున్నదో, చేయాలనుకుంటున్నదో ఆలకించాలి. మనందరికీ మనసులున్నాయని రుజువుపరుద్దాం. దాని కోసం ‘అనేక వైపుల’ చదువుదాం. మాట్లాడదాం, పునరేకీకరణకు సిద్ధపడదాం.
ఒక పాఠకుడిగా ఈ నవల చదవడానికి నేను ఏర్పరుచుకున్న దారిని మీకు చూపిస్తాను. నాలాగే మీకు మీదైన ఉద్యమ దర్శనం కలగవచ్చు.
2
ఈ నవల మూడు అంశాల చుట్టూ అల్లుకుంది.
ఒకటి: రాయలసీమ అస్తిత్వం: ఏళ్లుగా అన్యాయమై పోయి, తన న్యాయమైన కోరికల కోసం పడుతున్న సీమ ఆరాటం.
రెండు: నెత్తురోడుతూ విప్లవోద్యమం సాగిస్తున్న వర్తమాన ప్రయాణం.
మూడు: మనమూ, ఉద్యమమూ భాగమై ఉన్న ఈ సమాజంలోని సంఘర్షణల సారం.
ఈ మూడు అంశాలనూ అనుసంధానిస్తూ నాలగైదు కుటుంబాల కథగా సాగుతుంది ఈ నవల, మధ్యలో ఆసక్తి గొలిపే ఎన్నో ఉపకథలు. మనలాగే ఆలోచించే కొందరు వ్యక్తులు లేదా గతంలో మనకు పరిచయం ఉన్న కొందరిని పోలిన మనుషులు తారసపడతారు. వాళ్ళ ఉద్యమ జీవితం, యువతీ యువకుల జంట మధ్య ప్రేమ, సొంత దారిని వెతుక్కోవాలని బయలు దేరిన ఒకయువతి, ఆమె చుట్టూ అల్లుకున్న మనుషుల భావోద్వేగాలు,మార్పుకోసం ఆరాటం…. ఇవన్నీ కలగలిసిన యీ నవల నన్ను ఏకబిగిన చదివించింది. ఇంత పెద్ద నవలను 24 గంటల్లో పూర్తిచేసాను.
విడిగా కొన్ని అంశాల గురించి యిప్పుడు మాట్లాడుకుందాం.
మొదట రాయలసీమ. ఈ నవల రాయలసీమ రచయిత నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంత సమాజ, సాహిత్య చరిత్ర , అక్కడ జరిగిన అనేక ప్రయోగాల, అనుభవాల కొనసాగింపే అయివుంటుంది. నవల ఆరంభం నుంచి చివరి దాకా రాయలసీమ స్థల కాలాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఈ స్థల కాలాల వెనుకటి విషయాలు కొంత వివరంగానే చెప్పాలి.
తెలంగాణా నుంచి విప్లవోద్యమం వస్తువుగా కథ, నవల విస్తృతంగా వచ్చాయి. తెలంగాణా సాయుధ పోరాటాన్ని సాహిత్యంగా మలచడంలో గడించిన గత అనుభవాలు ఇందుకు దోహదపడి వుండవచ్చు. నవలలో అయితే అల్లం రాజయ్య, పి.చంద్, కాలువ మల్లయ్య మొదలు ఇటీవల హుస్సేన్ రాసిన తండ్రులూ బిడ్డల వరకు యీ ప్రయత్నం నిరంతరాయంగా కొనసాగుతున్నది. శ్రీకాకుళ విప్లవోద్యమ ప్రభావంతో మొదట కేవలం కథా సాహిత్యమే వచ్చినా భూషణం,అప్పల్నాయుడు, గౌరునాయుడు లనుంచి సువర్ణముఖి, మల్లిపురం జగదీష్ ల వరకు ఒక ధారసాగింది. అప్పలనాయుడు, గౌరునాయుడుల నవలలు వాటికి కొనసాగింపు.
విప్లవోద్యమం వస్తువుగా రాయలసీమ నుంచి ఇలా, ఇన్ని కథలు నవలలు వచ్చాయా? 2001లో పాణి రాసిన ‘నిప్పుల వాగు’ (కర్నూలు), 2004లో కనుంపల్లె రాజారాం రాసిన ‘ఎదురగ్గి’ (అనంతపురం) మాత్రమే వచ్చాయి. అందుకు కారణాలు 1. రాయలసీమ విప్లవోద్యమం ప్రధానంగా మైదాన ప్రాంత ఉద్యమం. పెద్దఎత్తున ప్రజలను సమీకరించగలిగిన దీర్ఘకాల పోరాటం జరిగిందా? అన్నది అనుమానమే. నాకు గుర్తుండి రాయలసీమ విద్యార్థి యువజన కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో జరిగిన సీమ డిమాండ్ల ఉద్యమం (1985-88) ఒక్కటే అటువంటి ప్రభావాన్ని కొంత కలిగించింది. 2. కర్నూలు జిల్లాలో అయితే విప్లవ విద్యార్థి, యువజన సంఘాల ప్రవేశం మిగతా సీమ జిల్లాల కంటే కూడా చాలా ఆలస్యం అయ్యింది. అదికూడా చాలా కాలం పాటు కేవలం కర్నూలు, ఆదోని, నంద్యాల వంటి కొన్ని పట్టణాలకు, విద్యార్థులకు మాత్రమే పరిమితం అయ్యింది. అనంతపురం, చిత్తూరు జిల్లాలో మొదటి నుంచి విప్లవోద్యమం బలంగా ఉన్నప్పటికీ నవలా, కథా సాహిత్యం అంతగా రాలేదు. ఇతర రచనలు విరివిగా వచ్చాయి.
సీమ జిల్లాలలో మొదటి ఆధునిక కథా, నవలా సాహిత్యం వచ్చింది చిత్తూరు జిల్లాలోనే. దీనికి ఆద్యులు కె. సభా. మధురాంతకం రాజారాం. ఇతర సీమ జిల్లాలవలే అక్కడి సమాజం ఫ్యాక్షనిస్టుల గుప్పిట్లో మూసుకుపోయినది కాదు. వ్యక్తికి ఎంతో కొంత స్వేచ్ఛ ఉన్న సమాజం. మద్రాసుకు దగ్గరగా ఉండటం వల్ల ఆధునిక విద్య, భావనలు, జీవన శైలి ప్రభావాలకు లోనయ్యింది. పులికంటి కృష్ణారెడ్డి, నామిని, నరేంద్ర, మహేంద్ర, పలమనేరు బాలాజీ నుంచి ఇప్పటి ఎండపల్లి భారతి, ఝాన్సీ పాపుదేసి, మేఘనాథ రెడ్డి వరకు వచనం విస్తరించింది. రాజారాం, పులికంటి, మహేంద్ర, నరేంద్ర నవలలు రాసినా అవి విప్లవోద్యమ నేపథ్యానివి కావు.
కడప జిల్లాకు 1950ల నుంచే రారా, విద్వాన్ విశ్వం వంటి ఆధునికుల వారసత్వం వుంది. అది తరువాతి తరానికి కేతు విశ్వనాథ రెడ్డి వంటి సాహిత్య కారులను ఇచ్చింది. కొనసాగింపుగా చక్రవేణు, దాదాహయత్, పాలగిరి వంటి కథకులు వచ్చారు కానీ సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి వరకు స్థానిక జీవితాన్ని చిత్రించిన నవలలు రాలేదు. అవికూడా విప్లవోద్యమ నేపద్యంలోనివి కాదు.
అనంతపురం జిల్లాలో పరిటాల శ్రీరాములు కాలానికే విప్లవోద్యమం ప్రవేశించింది. రాయలసీమ డిమాండ్ల ఉద్యమానికి బలమైన కేంద్రంగా నిలిచింది. దాని ప్రతిఫలనం కథల్లో కనిపించింది. కరువు, సమకాలీన వ్యవసాయ సమాజ చిత్రణ ప్రధాన వస్తువులుగా ఆ జిల్లా అద్భుత సాహిత్యాన్ని మనకు అందించింది. చిలుకూరి దేవపుత్ర కథలు, నవలలు గ్రామీణ, దళిత, రైతు జీవితాలను సీమ నేపథ్యంలో చిత్రించాయి. స్వామి, శాంతి నారాయణల నవలలు వాటికి కొనసాగింపు.
కర్నూలు జిల్లా పరిస్థితి మరీ అధ్వాన్నం. 1980 వరకు కూడా అవధానం, ఉగాది కవి సమ్మేళనం మాత్రమే ఏకైక సాహిత్య కార్యక్రమాలుగా చెలామణీలో వుండేవి. శతక, పద్య కవిత్వానికి ముఖ్య పోషకులు జిల్లాలోని ప్రముఖ వైశ్యులు. మధ్యతరగతి జీవితం వస్తువుగా రేడియోలకు, వార్తాపత్రికలకు కథలు రాసేవాళ్ళు వున్నా వారు 70ల కాలం నాటి సీరియల్ రచయిత్రులకు బలహీనమైన అనుకరణ. ఒక్క ఎస్.డి. వి. అజీజ్ మాత్రమే భిన్నమైన దారి ఎంచుకొని చారిత్రక నవలలు రాశాడు.
1990ల్లో మాత్రమే కులం, ఫ్యాక్షన్, జెండర్ వస్తువులుగా కర్నూలు జిల్లానుంచి సీరియస్ సాహిత్యం వచ్చింది ముఖ్యంగా కథ.
అప్పుడు మాత్రమే ఎందుకు సాధ్యమైంది?
వందల ఏళ్లుగా కర్నూలు జిల్లాలో భూస్వామ్య వ్యవస్థ వల్ల సమాజం గడ్డ కట్టిపోయింది. ఆధునిక భావనలు ఏ రూపంలోనూ చొరబడనీయనంత గట్టి పెంకు దాన్ని ఆవరించి వుంది. విద్యార్థిసంఘమైనా, యువజన సంఘమైనా సానుభూతి చూపగలిగే, పనికి పలికే యువతరం కర్నూలు వంటి పెద్ద పట్టణంలో మాత్రమే ఒక నలుగురు దొరుకుతారు. డోను, నందికొట్కూరు వంటిచోట్ల అదికూడా కష్టమే. కొన్ని చోట్ల మనుషుల సాధారణ జీవితంలో ఫాక్షన్ నాయకుల అజమాయిషీ నేరుగా వుండేది. అంతవరకు విద్యా వ్యాప్తి కూడా చాలా తక్కువ. 1953లో మద్రాసు నుంచి విడివడ్డాక రాజధాని కేంద్రంలో ఒక వైద్య కళాశాల అవసరం అని గుర్తించి ఏర్పరచిన కర్నూలు మెడికల్ కాలేజీ, 1958లో ఏర్పడిన కె వి ఆర్ మహిళా కళాశాల, 1972లో ఏర్పడిన సిల్వర్ జూబ్లీ కళాశాల తప్ప మెరుగైన విద్యావకాశాలు జిల్లాలో లేవు. మెడికల్ కాలేజీ, సిల్వర్ జూబ్లీ కాలేజీల్లో ప్రవేశానికి అవసరమైన విద్యార్థులను తయారుచేయగలిగిన నాణ్యమైన ఇంటర్మీడియట్ విద్య కర్నూలు జిల్లాలో కొరవడింది. అందువల్ల ఇవి ఆ జిల్లా కంటే బైటి జిల్లాల వారికే ఎక్కువ ఉపయోగపడ్డాయి.( మరీ ముఖ్యంగా మెడికల్ ఎంట్రెన్స్ కోచింగ్ సెంటర్లు ఉన్న నెల్లూరు జిల్లా). 1984 వరకు జిల్లాలో పి జి స్థాయి విద్య అందుబాటులో లేదు.
అప్పటికి కర్నూలు జిల్లాలో అన్నిదిక్కులా ఫ్యాక్షనిస్టుల ఏలుబడే. ఒకప్పుడు వారికి ప్రధాన ఆదాయవనరుగా ఉన్న భూమి ఎన్. టి. ఆర్ తెలుగుదేశం కాలంలో సారాకు మారింది. మెజారిటీ ఫ్యాక్షనిస్టులు రెడ్లు. అక్కడక్కడా ఈడిగ(గౌడ్), బలిజ వంటి బీసీ కులాలు కూడా రెడ్లకు వ్యతిరేకంగా ఫాక్ష్యన్ నడిపాయి. 1980-90ల వరకు కూడా నందికొట్కూరు ప్రాంతంలో ఎమ్మెల్యే, అతని కొడుకు ఆ నియోజక వర్గాన్ని ఒక సామంత రాజ్యంగా పాలించారు. ఎదురు నిలిస్తే కృష్ణలోనో, కెసి కెనాల్‌లోనో శవమై తేలాల్సిందే. ఇట్లా జిల్లాలోని ఒక్కో పాకెట్‌లో ఒక్కొక్కడి ఆధిపత్యం.
అనేక వైపుల నవలలో ప్రస్తావనకు వచ్చే రఘు అనే పాత్ర అలా బహుశా 1980లలో పార్టీ పంపగా విప్లవోద్యమ నిర్మాణం కోసం తెలంగాణా నుంచి కర్నూలుకు వచ్చాడు. ఇక్కడ పరిచయం అయిన కార్యకర్త అయిన సరోజను పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇద్దరూ ఇక్కడి అజ్ఞాత ఉద్యమంలో భాగం అయ్యారు.
‘‘గడ్డకట్టిన ఈ ఫ్యాక్షన్ సమాజాన్ని పగులగొట్టకుండా ఇక్కడ కనీస ప్రజాస్వామిక ఉద్యమాలు కూడా మనలేవు’’ అని (రఘు వంటి వారి అనుభవాల నుంచి) విప్లవోద్యమం గ్రహించింది. ఈ నవలలో రాయలసీమ లాంటి సమాజాల్లో ప్రజాస్వామికీకరణకు, విప్లవానికి ఉన్న సంబంధం గురించి అనేక చోట్ల చర్చకు వస్తుంది. చరిత్రలో చూస్తే కర్నూలు జిల్లాలో విప్లవోద్యమం నల్లమల అటవీ కేంద్రంగా ఉద్యమ విస్తరణ ప్రారంభించింది. అడవిని ఆనుకొనివున్న ఆత్మకూరు, వెలుగోడు, నందికొట్కూరు ఫ్యాక్షనిస్టులతో దానికి ఘర్షణ అనివార్యమైంది. అందులోంచి వచ్చిన ఆలోచనే ‘‘రాయలసీమ సాయుధ ముఠాల వ్యతిరేక పోరాటం’’. ప్రయోగాత్మకంగా రెండు విప్లవ పార్టీలు కర్నూలు జిల్లాలో ప్రారంభించిన ఈ ఉద్యమం అత్యంత వేగంగా ఇతర సీమ జిల్లాలకూ విస్తరించింది. ఆంద్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం గతంలో సీమ జిల్లాల్లో ఫ్యాక్షనిజం చరిత్ర, పరిణామాల గురించి చేసిన సర్వే, పరిశోధన, విశ్లేషణలు దీనికి చాలా ఉపయోగపడ్డాయి.
యీ కృషి అంతా విప్లవోద్యమందే అని నేను చెప్పబోవడం లేదు. విస్తరిస్తున్న పెట్టుబడి తన మనుగడకు, పొందబోయే లాభాలకు అనుగుణంగా సీమ సమాజాన్ని మార్చుకోవలసిన అనివార్యమైన అవసరం ఏర్పడింది. సీమలో ఎదుగుతున్న మైనింగ్, భారీ రోడ్డు రవాణా కాంట్రాక్టులు, పరిశ్రమలకు ఫ్యాక్షనిస్టులు ఇప్పుడున్న రూపంలో అడ్డంకిగా మారారు. లేవీల రూపంలో భారీ డబ్బు వాళ్ళకు సమకూర్చడం కోస్తాంధ్ర, దళారీ జాతీయ పెట్టుబడిదారులకు సమ్మతం కాలేదు. ఎస్.పి రామాంజనేయులు రూపంలో ఒక నివారణ చర్యకు శ్రీకారం చుట్టింది. మొదటి ప్రయత్నంలో ప్రతిపక్ష పార్టీ అనుకూల ఫ్యాక్షనిస్టు అనుచరులను ఎన్‌కౌంటర్‌లలో విచ్చలవిడిగా చంపడం మొదలైంది. లోపలా బయటా ఇలా తాకిడికి గురైన ఫ్యాక్షనిస్టులు అనివార్యంగా కరుడు గట్టిన తమ ముఖాలను సాఫ్ట్‌గా చూపించుకోవలసిన అవసరం వచ్చిపడింది. మొదట తామే కాంట్రాక్టర్లుగా, మైనింగ్ పరిశ్రమల అధిపతులుగా, మారుతూ క్రమంగా తామే రాజకీయ నాయకులుగానూ పరిణామం చెందారు. గతంలోని భూమి, సారా వంటి ఆదాయవనరులు ఇంకేమాత్రం లాభసాటి కాదని గుర్తించి అంతకంటే ఎక్కువ మిగులునిచ్చే, నిర్వహణ సులభమయ్యే ప్రభుత్వ పథకాల కాంట్రాక్టులలోకి ప్రవేశించారు. సంక్షేమ పథకాలు బంగారు బాతులయ్యాయి. మునుపటి బెదిరింపులు, హత్యలు అవసరం లేకుండా పర్సెంటేజీ లెక్కన ‘‘లెక్క’’ నేరుగా ప్రభుత్వం దగ్గరే సెటిల్ అయిపోవడం సెనగలు తిని చెయ్యి కడుక్కున్నట్టు అయ్యింది. సీమ చరిత్రలోనే ఇది ప్రధానమైన, గణనీయమైన మార్పు.
రాయలసీమ సాయుధ ముఠాల వ్యతిరేక పోరాటం 1993 నుంచి 1998 వరకు ఉధృతంగా సాగింది. కొన్ని పల్లెల్లో కనీసం పోలింగ్ ఏజెంట్ కూడా దొరకని ఒకనాటి స్థితి నుంచి ఫ్యాక్షనిస్టు సొంతవూరిలోనే దళితుడు చెప్పులు తొడిగి, ఖద్దరు చొక్కా వేసి విమోచన పార్టీ తరపున ఎన్నికల్లో నిలబడి అతని ఇంటి ముందే జీపు ఎక్కి తిరిగి సవాల్ చేసే స్థాయికి తెచ్చింది యీ ఉద్యమం. ఒక రకంగా ఆచరణలో దళిత హక్కుల, ఆత్మ గౌరవ పోరాటంగా కూడా యిది మారింది.
90ల నాడు యీ ఉద్యమం మొదలైన కాలంలోనే కర్నూలు జిల్లా పడమటి ప్రాంతమైన ఆదోని, ఆలూరు, ఆస్పరి తాలూకాల్లో హోటళ్లలో అమలౌతున్న రెండు గ్లాసుల పద్ధతికి వ్యతిరేకంగా పౌరహక్కులసంఘం ఉద్యమించింది. దళితహక్కులు చర్చనీయాంశంగా ముందుకొచ్చాయి. దళిత చైతన్యం ఎదిగే కొద్దీ అగ్రకుల భూస్వామ్యంతో ఘర్షణ తీవ్రమౌతూ వచ్చింది. గుడిపాడు దళితుల ఆలయప్రవేశం, మద్దూరు దళితుల భూ పోరాటం జిల్లా చైతన్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. చాలామంది విద్యార్థులు, యువకులు దళిత, విప్లవోద్యమాల్లో భాగమయ్యారు. వారికి ప్రతినిధి నవలలో రమణ పాత్ర.
1990 నుంచి 2000 వరకు విస్తరించిన కాలం అనేక రహదారుల కూడలి. ఒకవైపు విప్లవోద్యమ విస్తరణకు, హక్కుల స్పృహ పెరగడానికి, స్త్రీవాద చైతన్యం వెళ్లూనడానికి, మైనారిటీ వాదం వినిపించడానికి అవకాశం ఇచ్చింది. మరోవైపు దేశంలోకి నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు, సరళీకరణ, ప్రపంచీకరణ కూడా అంతే తీవ్రంగా వచ్చాయి. పెట్టుబడి ప్రవాహం లోపలికి వస్తుండగా మధ్యతరగతి కలలు డాలర్ల రూపంలోని అమెరికాను కంటున్నాయి. అందుకు అనుగుణంగా విద్య ప్రయివేటీకరణ తీవ్రమైంది. ఇంటర్మీడియట్ దశను సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను ఉత్పత్తి చేసే మెగా ఫాక్టరీగా మార్చి వేసింది. నేనే చేశానని చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నా, ఇండియాలో విద్య కార్పొరేట్ కావడం ఆనాటి అమెరికా అవసరం, ప్రపంచ బ్యాంకు అవసరం. పి.వి అయినా చెంద్రబాబు అయినా, వై ఎస్ అయినా వాటి పనిముట్లే, జస్ట్ సి.యి.వో లే. విద్యార్థులకు సామాజిక స్పృహను, చైతన్యాన్ని అందించే ఉద్యమాలు బలమైన ఇనుప గోడలున్న జైళ్ల వంటి కార్పొరేట్ కాలేజీల్లోకి ప్రవేశించలేక పోయాయి. యువకుల్లో ఒక ప్రధానమైన సెక్షన్ నెమ్మదిగా సామాజిక ఉద్యమాలకు దూరమైపోయింది.
కాన్షీరాం ‘‘ఓట్లు మావే సీట్లు మావే’’ నినాదం దళితుల రాజ్యాధికారానికి దగ్గరి దారి చూపినట్లు తోచింది. ఎన్నికల ప్రెషర్ గ్రూప్ రాజకీయాలు కొత్తగా, ఆకర్షణీయం గా కనిపించి మరో సెక్షన్ దారి మార్చుకుంది. ఈ నవల లోని మోహన్‌రావు లాంటి మేధావి ఆ కాలపు ప్రతినిధి.
ఈ పదేళ్ళలో జరిగిన మరో భారీ మార్పు ప్రజల అభిరుచులు, ఇష్టాలు కూడా మారడం. పెట్టుబడి ఊరికే రాదు కదా! దానికి అవసరమైన పాప్ కార్న్ సంస్కృతినీ వెంటతెచ్చుకుంటుంది. మనీ ఫ్లో బాగా పెరిగింది.
డబ్బు సంపాదన మాత్రమే పరమావధి? సంపన్నుల స్థాయిని చేరడమనే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కలను రీళ్ళు రీళ్లుగా అమ్ముకోవచ్చు. అందువల్లే
మెయిన్ స్ట్రీమ్ హిందీ, తెలుగు సినిమాలకు అండర్ వరల్డ్, మాఫియా తప్ప మరో కథాంశం లేకుండా పోయింది. 2000 వరకు మాఫియా అరాచకాలు, వాటిని అరికట్టడంలో పోలీసులు, రాజ్యం విఫలం అవటం, రాజ్య యంత్రాంగంలో కీలకమైన ప్రజా ప్రతినిధులకు, పోలీసుల కు వీరితో ఉన్న రహస్య ఒప్పందాలు చూపించబడ్డాయి. అప్పటివరకూ హీరో అన్యాయాన్ని ఎదుర్కొనే పక్షమే వహించాడు. ఎంతో కొంత న్యాయం పక్షాన వున్నట్టు చూపించారు. 2000 తరువాత హీరో పాత్రకు నెగెటివ్ షేడ్స్ చేరాయి. ఇది మార్పులో తొలిదశ. రెండో దశకంతా హీరోనే నేరుగా మాఫియా అయ్యాడు. అవినీతి లేనిదెక్కడ? ప్రభుత్వ ఆఫీసులో లంచం తిన్నా, ప్రజా ప్రతినిధి డబ్బు తిన్నా మన పని అయితే చాలు గదా! తిననిదెవ్వరు? అనే ఒక మోస్తరు ఆమోదానికి ప్రజలను తేగలిగారు. ఇప్పుడైతే ఎలివేషన్లు, ఎత్తుకు పై ఎత్తులు వంటి వూపిరి తిప్పనివ్వని సినిమా నడక ద్వారా ఎర్ర చందనం స్మగ్లర్ ను కూడా అభిమానించే స్థాయికి ప్రేక్షకుడిని దిగజార్చారు. దీన్ని సినిమా మాధ్యమం ద్వారా సమ్మతి కూడగట్టడం (consent manufacturing) అనుకోవచ్చు.
సర్వ జనుల విద్యా, ఆరోగ్యానికి ఉచిత సేవలు అందించాల్సిన సంక్షేమ రాజ్యం వాటిని ప్రయివేటు పరం చేసి ఆ బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకుంది. దారిద్య్ర రేఖకు దగ్గరగా, లేదా దిగువన ఉన్న ప్రజల అసంతృప్తిని చల్లార్చడానికి( మొదలు చంద్రబాబు తరువాత వై ఎస్ ) ద్వారా ఇబ్బడిముబ్బడిగా ఉచితాలు ప్రవేశపెట్టింది. అంతే కాదు ఆ సెక్షన్‌లోని యువత తన కనుసన్నల్లోనే ఉండటానికి గాను వాళ్ళను మొదట పార్టీ కార్యకర్తలుగా, తరువాత వాలంటీర్లుగా మార్చుకుంది. కింది వర్గాల్లో
ఒక గట్టి పునాది వుండేట్టు చూసుకోవడం, పీడిత ప్రజల్లోని ఒక సెక్షన్ ను పైరవీకారుగా చేయడం దీని లక్ష్యం. మైదాన ప్రాంత గ్రామీణ, పట్టణ యువతలో కొంత భాగం అలా క్రమంగా అన్ని పోరాటాలకు దూరమైంది. రాజకీయ పార్టీల ఈ చర్యల ఫలితంగా పల్లెల్లో యువత కూడా పార్టీల పరంగా నిలువునా చీలిపోయి వుండటం మరో అంశం. కాబట్టి సమస్యల ప్రాతిపదికన అయినా కూడా వాళ్ళను కలిపి ఉంచడం అసాధ్యం.
2000లు కొన్ని భ్రమలను పటాపంచలు చేశాయి. అందులో మొదటిది ఆధిపత్య వర్ణం, ఆధిపత్యవర్గం పార్లమెంటులో తన అధికారాన్ని నిలుపుకోడానికి దళిత పార్టీల బలాన్ని కావాలిసినంత వాడుకుంది. కానీ అదే పార్లమెంటరీ రాజకీయాలనే అడ్డుపెట్టుకొని దళితులను రాజ్యాధికారంలోకి రాకుండా ఆపింది. తన మనువాద ధర్మాన్ని అంగీకరించే దళితులను, బహుజనులను మంత్రులుగా, రాష్ట్రపతులుగా ప్రమోట్ చేసింది. తనతో కొంతకాలం కొనసాగిన సఖ్యత మాటున దళిత బహుజన పార్టీలను నిర్వీర్యం చేయగలిగింది. దళితబహుజనుల సమూహం లోంచి బి.సి.లను వేరుచేయగలిగింది. దళితు లలోనూ ఉన్న అంతర్గత విభేదాలను, ఉపకుల రిజర్వేష న్ విభజన డిమాండును ఎల్లకాలం రగులుకునేట్టు చూస్తూ, మరో 20 ఏళ్ళు ఆ నాటకం తన కసుసన్నల లోనే జరిగేట్టు చేయగలిగింది. దానికి పరిష్కారం లేకుండా చేసింది. దళిత కులాల మధ్య విభేదాలను వైషమ్యాల స్థాయికి తెచ్చి భవిష్యత్తులో వాటి ఐక్యతను దాదాపు అసాధ్యం చేయగలిగింది.
1990ల్లో వచ్చిన అన్ని అస్తిత్వ వాద ఉద్యమాలు ( ఉనికి ఉద్యమాలని ఇటీవల కొందరంటున్నారు) చాలా సున్నితమైన అంశాలను, వాస్తవాలను చర్చకు పెట్టాయి. పార్లమెంటరీ, నాన్ పార్లమెంటరీ అనే విభజనతో సంబంధం లేకుండా అన్ని రాజకీయపార్టీలు అనివార్యంగా తమ తమ దృక్పథాలను పునస్సమీక్షించుకునేట్టు చేశాయి. వాళ్ళు చేసిన విమర్శ ఎక్కువ భాగం విప్లవోద్యమం పైకి ఎక్కుపెట్టబడింది. సాహిత్య రంగం వాహికగా సైద్ధాంతిక వాద వివాదాలు, చర్చలు జరిగాయి. కవిత్వం, కథ సృజనకు సరికొత్త దారులు పడ్డాయి. కొత్త తరం యువత ఆ దారులవెంట నడిచింది.
ఏ అంశాలను చర్చకు పెట్టాలని అస్తిత్వ ఉద్యమాలు ఆశించాయో వాటిని చర్చకు పెట్టాక, ప్రగతిశీల శిబిరంతో స్థూలంగా వాటిని అంగీకరింపజేశాక తరువాతి కార్యక్రమం ఏమిటో వాటికి స్పష్టత లేకపోయింది. రాజకీయ కార్యక్రమం లేకపోవడంతో విస్తరణ లేకపోయింది. తమ వెంట నడచిన యువతకు ఏ దారిని చూపాలో స్పష్టత కొరవడింది. మాయావతి బి.ఎస్.పి పార్టీ పార్లమెంటరీ దారిలో విఫలమవడం క్యాడర్ లో తీవ్రనిరాశను కలిగించింది. స్త్రీ వాదం నేలకు దిగి గ్రామీణ, దళిత స్త్రీలను కలుపుకొని విస్తృత ఆచరణ దిశగా వెళ్ళాల్సినది. ఏ రాజకీయ కార్యక్రమమూ లేక ఎన్. జీ. ఓ.ల దిశకు మళ్లి అక్కడే నిలిచిపోయింది. మైనారిటీల ఉనికే నిరాకరింపబడుతున్న నేలమీద ఒక్క మైనారిటీ వాదం మాత్రమే రోజు రోజుకూ బలపడుతున్నహిందూత్వ శక్తులతో పోరాడటానికి అవసరమైన సైద్ధాంతిక భూమికను ఏర్పరచుకోవడంలో నిమగ్నమైఉంది.
అస్తిత్వ ఉద్యమాలు ప్రధానంగా హక్కుల ఉద్యమాలు. అన్ని రకాల అసమానతలకు వ్యతిరేకంగా ఎలుగెత్తాయి. సమానత్వ ప్రాతిపదికన సమాజ పునర్నిర్మాణానికి పిలుపునిచ్చాయి. ఆ చైతన్యం మరింత నిర్లక్ష్యం చేయబడిన ఇతర సెక్షన్ల ఆకాంక్షలకు ఊపిరిపోసింది. ఉపకులాల వర్గీకరణ డిమాండు గానీ, ఎల్. జి. బి టి జెండర్ ఉద్యమం గానీ దళిత స్త్రీ వాదాల కొనసాగింపు గానే నేను అర్థం చేసుకుంటాను. ఈ అన్ని ఉద్యమాలు ప్రతిపాదించిన విలువల ద్వారా మన సమాజం మరింత ప్రజాస్వామికీకరణ చెందుతుందని నా విశ్వాసం. ఇదీ స్థూలంగా అనేక వైపుల నవల ప్రారంభానికి ఉన్న నేపధ్యం.
0 0 0
ఇన్ని మార్పులతో సమాజం కల్లోలంగా ఉన్నప్పుడు విప్లవోద్యమం ఎలావుంది? ఏం చేసింది? ఏం చేస్తున్నది?
ఉద్యమం అందుబాటులో వున్నప్పుడు ఏదో ఒక సమస్యతో ఐడెంటిఫై అయ్యి, కొన్ని కోణాల్లో ఏకీభావం కుదిరి మనుషులు అందులో భాగం అవుతారు. ఉద్యమం తో సంబంధంలోకి వచ్చాక ఎన్నో అంశాల్లో అది మనలను ఎడ్యుకేట్ చేస్తుంది. సాంప్రదాయ ఆలోచనలు వదులుకునేట్టు, పాత ప్రవర్తనలను మార్చుకునేట్టు చేస్తుంది. మనజీవితాల్లోకి కొత్త హక్కుల స్పృహను, కొత్త విలువలను తెస్తుంది. మన జీవనవిధానాన్ని సమూలంగా మార్చివేస్తుంది. విప్లవోద్యమ కార్యకర్తలు కొందరు నిన్ను కలుస్తారు, చర్చిస్తారు, నీతో ఘర్షణ పడతారు, కోప్పడతారు. నిన్ను అనంతంగా ప్రేమిస్తారు. నువ్వు మనిషివి అన్న ఎరుక నీకు కలిగిస్తారు. పుస్తకాల స్నేహం మొదలౌతుంది. వీళ్ళ పరిచయం తరువాత ‘కొత్త నువ్వు’ నిర్మాణం జరుగుతుంది. పాత పరిచయాల స్థానంలో కొత్తవి వచ్చాయి గనుక పాత మిత్రుల అభిరుచులు, ఆలోచనలు చాలా ‘‘లో లెవిల్’’ గా అనిపిస్తాయి. ఆ స్థాయి దాటి వచ్చానని నీకు అర్థమౌతుంది. కళలు సాహిత్యం నీ జీవితాన్ని వికశింపజేయటం మొదలౌతుంది.
ఇలా నీ జీవితం చైతన్యవంతంగా నిగనిగలాడు తున్నప్పుడు ఏవేవో కారణాల వల్ల వాళ్ళు హఠాత్తుగా అందుబాటులో లేకుండాపోతారు. రేపు కలవాల్సిన వ్యక్తి పొద్దున్నే ఎన్‌కౌంటర్ వార్తగా నిన్ను చేరతాడు. జీవితంలో శూన్యం నిండుతుంది. ఒక సజీవ లంకె తెగిపోయింది. పాత స్నేహితుల వద్దకుపోలేవు, కొత్త స్నేహం దూరమైంది. నీవు ఒంటరి. చాలా మంది అనుభవంలో సరిగ్గా ఇదే జరిగింది. విప్లవోద్యమం మీది నిర్బంధం అంటే కేవలం మనుషుల్ని చంపేయడమే కాదు. విప్లవ వ్యక్తిత్వం గల మనుషులు తయారు కాకుండా ఉద్యమానికి ప్రజలను దూరం చేయడం. ఈ కోణంలో ‘అనేక వైపుల’ చాలా లోతైన చిత్రణ చేసింది.
1990ల నాటికి ఉధృతమైన విప్లవోద్యమం 2010 సంవత్సరానికి తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. తన క్యాడర్‌ను రక్షించుకునేందుకు, విస్తరణ వ్యూహంలో భాగంగా నల్లమల నుంచి, ఉత్తర, దక్షిణ తెలంగాణాల నుంచి తన సాయుధ బలాలను వెనక్కు తీసుకొని రక్షిత ప్రాంతానికి తరలించవలసి వచ్చింది. దీనితో మైదాన ప్రాంతపు మనుషులు ఒంటరి అయ్యారు. ఉద్యమ లేమివల్ల ఏర్పడిన ఒంటరితనం కూడా యీ నవల నిండుగా కనిపిస్తుంది. అది మనుషుల ఆలోచనల్లో, జీవించే పద్ధతుల్లో తీసుకొచ్చిన మార్పులను చిత్రించింది.
ఈ మార్పులు మధ్యతరగతి మనిషికి విప్లవోద్యమంపై ఎన్నో అనుమానాలు లేవదీస్తాయి. ఈ ఇరవై ఏళ్లలో ఉద్యమం మైదాన ప్రాంత ప్రజలను, సమస్యలను గాలికి వదిలేసిందా? కేవలం తన రక్షణ మాత్రమే చూసుకుందా? చాలా ప్రశ్నలు వేసుకోవచ్చు కానీ గమనించాల్సిన మరో అంశం, విప్లవోద్యమం వదిలిన యీ గ్యాప్‌ను మరే ఇతర పార్టీలు, ఉద్యమాలు పూరించలేకపోయాయి.సమాజాన్ని మొత్తంగా చూసే దృష్టి పదేళ్లుగా కొరవడివుండటం వల్ల దళిత, బహుజన, స్త్రీవాద ఉద్యమాలు తలతిప్పి పరిస్థితి గమనించే లోపే ఈ గ్యాప్ లోకి మతవాదం ప్రవేశించింది. లేకుంటే వరుస సామాజిక ఉద్యమాల వారసత్వం కొనసాగిన తెలంగాణాలో పరువు హత్యలా? అయ్యప్ప దీక్షలో ఉన్న విద్యార్థికి కాలు తాకితే టీచర్ తో కాళ్ళు మొక్కించడమా? ఉచ్చలజలధి తరంగా సంకలనకర్త, రచయిత్రి మెర్సీమార్గరెట్ కు వేధింపులా, తమకు నచ్చని పుస్తకం అమ్ముతున్నారని ఎన్. వేణుగోపాల్ కు బెదిరింపులా?
సమాజానికి, హక్కులకు పరోక్షంగానైనా బలమైన రక్షణగా నిలబడే, మతవాదంతో ఎటువంటి యుద్ధానికైనా తెగించి నిలువగలిగే విప్లవోద్యమాన్ని రక్షించుకోవడం ఆ ఉద్యమ కార్యకర్తల, సానుభూతిపరుల కర్తవ్యం మాత్రమే కాదు అన్ని ప్రజాస్వామిక ఉద్యమాల బాధ్యత కూడా అని యీ అనుభవంలో రుజువు అయ్యింది.
సమాజం చాలా వేగంగా మారుతున్నా, అనేక నినాదాల తో ఆందోళనలు జరుగుతున్నా ఉనికి ఉద్యమాలు మనుషుల్ని మొత్తంగా కూడేసి, మారుతున్న పరిస్థితులకు అవసరమైన కొత్త మనుషులను తయారు చేయలేక పోయాయి. ఆ వెలితి ఇప్పటి సమాజ సంక్షోభంలో భాగం. తిరిగి ఆ పని చేయగల అవకాశం విప్లవోద్యమానికే ఉన్నదని చెప్పడం, సమాజంలో, వ్యక్తుల ముందు ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానాలు విప్లవోద్యమమే వెతకగలదని చెప్పడమే యీ నవల. సమాజంలో కొత్తగా ఏర్పడుతున్న వైరుధ్యాలను అర్థం చేసుకోడానికి విప్లవోద్యమపార్టీ ఏం చేసింది? మైదానప్రాంత ఉద్యమాల్లో ఐక్య సంఘటన ద్వారా కొత్త పోరాటాల నిర్మాణం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. తన అధీనంలోని భూభాగంలో వాటిని అమలు జరుపుతున్న ది. ప్రత్యామ్నాయ విద్య ఆరోగ్యం వ్యవస్థలు,వ్యవసాయం లో సహకార పద్ధతులు, ఒక మానవీయ న్యాయ వ్యవస్థ, అన్నిటినీ రూపొందించిన జనతన సర్కార్. ఈ ఆన్నింటి గురించి రచయిత మనతో జరిపిన సంభాషణ యీ నవల.
3
రాయలసీమ భూమిక నుంచి ఈ నవల వచ్చినందువల్ల ఈ ప్రాంత సామాజిక రాజకీయ సాహిత్య పరిణామాలతో పాటు, ఈ ఇరవై ఏళ్లలో విప్లవోద్యమంలో వచ్చిన పరిణామాలు, మొత్తంగా మన సమాజంలో వచ్చిన ఇతర మార్పులు కలిసిన విస్తారమైన నేపథ్యం ఈ నవలకు ఉంది. ఇదంతా ఇంత వివరంగా ఎందుకు రాయవలసి వచ్చిందంటే, ఇప్పుడు 30,35 ఏళ్ళు ఉన్న యువతకు యీ పరిణామాల చరిత్ర తెలియదు. యదార్థం మాట్లాడు కోవాలంటే వాళ్ళు టీన్స్‌లోకి వచ్చేసరికే విప్లవోద్యమం నేరుగా వారికి అందుబాటులో లేకపోయింది. బయట కొన్ని ప్రజా సంఘాలు ఉనికిలో ఉన్నప్పటికీ అవి వారి రీచ్‌లో లేవు. కాబట్టి వారు సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న అభిప్రాయాలనే సత్యం అనుకునే ప్రమాదం వుంది. ఈ విషయాలను కూడా ఈ నవల చిత్రించింది. విప్లవోద్యమం అందుబాటులో లేకపోతే సమాజం ఏమవుతుందో, మానవ సంబంధాలు ఏమవుతాయో లోపలి నుంచి, బైటి నుంచి కూడా నవల చర్చ చేసింది. తిరిగి ఈ స్థితి నుంచే విప్లవోద్యమం ముందుకు పోవడానికి ఉన్న అవకాశాలను కూడా ఆచరణాత్మకంగా నవల చిత్రించింది.
నవలలో పురుష పాత్రలకంటే ఎక్కువగా స్త్రీ పాత్రలు ఉన్నాయి. వాళ్లు ఈ సమాజంలో, విప్లవోద్యమంలో అనేక పనుల్లో ఉంటారు. పురుషులను కూడా ప్రభావితం చేయగల వ్యక్తిత్వాలు వాళ్ళవి. అయినా మన సమాజంలో పితృస్వామ్యం ఇంకా బలంగానే ఉన్నది. ఈ నవలలో సింగె అనే ఒక స్థాయి నాయకురాలు తన సహచరుడు ఉద్యమం నుంచి వెళ్లిపోయినా దృఢంగా నిలబడుతుంది. ఆమెలాంటి సాహసికమైన, సృజనాత్మక మైన స్త్రీలు ఎందరో విప్లవోద్యమంలో ఉన్నందు వల్లనే అలాంటి పాత్రలు నవలలోకి వచ్చాయి. కానీ విప్లవాచరణ లో పితృస్వామ్యం పూర్తిగా పోలేదు. ఈ నవల బైటి పరిస్థితులను ఎంత విమర్శనాత్మకంగా చిత్రించిందో, ఉద్యమంలోని సవాళ్లను, సమస్యలను కూడా అంతే స్పష్టంగా చిత్రించింది. వాటిని అధిగమించడానికి ఉద్యమకారులు చేస్తున్న ఆలోచనలు, పథకాలు చెబుతుంది. సింగె ఒక సందర్భంలో ‘భర్త ఉద్యమాన్ని విరమించుకుంటే అతనితో పాటే తుపాకీ వదిలేసే సహధర్మచర్యం కూడా మన పార్టీలో ఉన్నది. అది ఎంత ప్రమాదకరమో ఆలోచించు’’ అంటుంది. మరో ముఖ్య పాత్ర ప్రధాన్ ‘‘విప్లవంలో కూడా ఆడవాళ్లకు ఈ తిప్పలు తప్పడం లేదు’’ అని అంటాడు. ఈ ఇద్దరు కేవలం విమర్శించే వాళ్లు కాదు. ఉద్యమంలో భాగమై ఆత్మవిమర్శ ద్వారా సమాజాన్ని, ఉద్యమాన్ని కూడా మార్చడానికి సిద్ధమైన వాళ్లు.
ఆచరణలో ఉండే పార్టీ నిరంతరం కొత్త పార్టీగా మారుతూ ఉంటుంది, అనేక వైపుల విస్తరిస్తూ సవాళ్లను ఎదుర్కోడా నికి అన్నిటినుంచి శ్రద్ధగా నేర్చుకుంటుంది. అనేక ముఖాల లోపలా, బైట జరిగే పోరాటానికి సిద్ధంగా ఉంటూ రాటుదే లుతున్నది. ఈ ప్రయాణంలో చాలా సంఘర్షణ, దు:ఖం, వేదన ఉన్నాయి. కొత్త సంబంధాలను నిర్మించే ఉద్యమం వాటిని అనుభవిస్తూనే తాను ఎదుగుతూ సమాజాన్ని ముందుకు తీసుకపోవాలి. ఈ ప్రయత్నాన్ని రచయిత నవలలో చిత్రించాడు.
9 ఆగస్టు 2014న సదాశివం అనే 89 ఏళ్ల వృద్ధుడి పాత్ర పరిచయంతో నవల ప్రారంభమవుతుంది. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న చివరి తరానికి ప్రతినిధి అతడు. చంద్రశేఖర్ ఆజాద్, రాంప్రసాద్ బిస్మిల్ భావాలతో ప్రేరణ పొందినవాడు. ప్రజాస్వామిక విలువలను గౌరవించే అప్పటితరం జాతీయవాది (ఇప్పుడు జాతీయవాదం హిందూ మతవాదం, మనువాదం అయికూర్చుంది). ఆయన యాంటి కమ్యూనిస్టు కూడా. కానీ నిరంతరం నేర్చుకునే ఆసక్తి, ఓపెన్ మైండ్ వున్న వ్యక్తి. తన ఆలోచనల్లో తప్పువుందని చూపితే సరిదిద్దుకొని అప్డేట్ కాగలిగిన ధైర్యం వున్నవాడు.
తెలంగాణా రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న కాలంలో తొలుత సమైక్యరాగం ఎత్తుకున్న సీమ నాయకులు తమ ఉద్యమానికి సమ్మతిని పొందడానికి సదాశివాన్ని ముందుపెట్టారు. ఇంక రాష్టం విడిపోక తప్పదన్న సంకేతాలు వచ్చాక ప్లేటు మార్చి ప్రత్యేక రాష్ట్రం నినాదం అందుకున్నారు. అది ముసలాయనకు మనుమడు చెప్పేదాకా తెలియదు. తాతా మనవడు మధ్య చర్చగా మొదలై సీమ సమస్యలు, రాయలసీమ సంఘాల జె.ఏ. సి, సీమ ఉద్యమం ముందుకు వెనక్కు నడుస్తూ కొంత చరిత్రగా, కొన్ని జ్ఞాపకాలుగా, కొన్ని ఆచరణ అందించిన అనుభవాలుగా నవలలో రికార్డు అయ్యాయి.
సదాశివం మనుమడు బిస్మిల్. తన పేరు ముస్లిం వాసన వేస్తున్నదని, అది తనకు అవమానకరంగా ఉన్నదనీ తాత దగ్గర కోప్పడతారు. అతడు ‘తనదైన ఒక దేశీయ ఆలోచనను కలిగి, ఆధునికత, పాశ్చాత్యం ఈ దేశాన్ని నాశనం చేశాయి, మనదైన ఒక సనాతన సాంప్రదాయికత మాత్రమే దానికి పరిస్కారం’ అని నిజాయితీగా నమ్మిన వ్యక్తి. లోకాన్ని ఇంకా పెద్దగా చదవని వాడు. ముస్లిం ద్వేషి.
మూడో పాత్ర సాధన. ఆమె తల్లి కర్నూలులోని హంద్రీ ఒడ్డున ఉండే క్రిష్ణనగర్‌లో ఇసుక కార్మికుడు మాదిగ రామస్వామి కూతురు మేరీ(పార్టీ పేరు సరోజ). తండ్రి విప్లవోద్యమంలో పని చేస్తున్న రఘు. 1985 కాలంలో ఆ ప్రాంతంలోని పేదల గుడిసెలు తొలగించడానికి గూండాలు ప్రయత్నించినపుడు దాన్ని అడ్డుకునే ఉద్యమంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి రఘు సరోజలు పెళ్లిచేసుకున్నారు. వాళ్లు కర్నూలు జిల్లాలోనే పనిచేస్తూ నిర్బంధం తీవ్రమయ్యాక అటవీప్రాంత ఉద్యమంలోకి వెళ్లిపోయారు. వాళ్ళ పాపే సాధన. కొంతకాలం సుధ, సత్యం అనే సానుభూతిపరుల దగ్గర పెరిగింది. వాళ్ళు విడిపోగా ఏడేళ్ల వయసు నుంచి విజయ, శ్రీనివాసులు అనే జంట దగ్గర పెరిగింది. కొంతకాలానికి సరోజ ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది. తండ్రి రఘు ఇంకా విప్లవోద్యమంలో వున్నాడు.
సాధన నిలువనీటి జీవితం వద్దనుకుంది. కొత్తగా తనను తాను వెతుక్కోవడానికి హైదరాబాద్ నుంచి కర్నూలు వచ్చింది. ఇక్కడ సీమ జె.ఏ.సి.లో భాగమైంది. స్వాతంత్య్రమంటే చాక్లేట్ కోసం చేయిసాచి తీసుకునే స్వేచ్ఛ మాత్రమే కాదు. నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా ఉండాలి అని నమ్మే వ్యక్తి.
నాలుగో పాత్ర సుల్తానా బేగం. ఇస్లాం సంప్రదాయవాది అయిన ఒక మౌల్వీ భార్య. చిన్న తనంలో కాస్త చదువుకున్నది. పెద్ద కొడుకు రసూల్ అంటే యెంతో ప్రేమ. అతను కూడా తల్లి మనసు నెరిగినవాడు. డిసెంబర్ 6న పరివార్ కూల్చింది కేవలం బాబ్రీ మసీదును మాత్రమే కాదు. భారత ప్రజాస్వామిక విలువలపై కోట్లాదిమంది పెట్టుకున్న ఆశలను కూడా. అది మొదలు అభద్రతకులోనై ఎక్కడ ఏం మాట్లాడాలన్నా భయం భయంగా, బెరుకుబె రుకుగా బతుకుతున్న మైనారిటీలకు అండగా నిలిచిన విప్లవోద్యమం పట్ల ఏర్పడిన అభిమానం అతని ఆచరణగా మారింది. రసూల్ విప్లవోద్యమంలోకి వెళ్లి, అక్కడ చనిపోతే తల్లి గుండెలవిసేలా ఏడ్చింది. బంధువుల హెచ్చరికలను కాదని చిన్న కొడుకును ఒప్పించి శవాన్ని తెచ్చుకున్న తల్లి ఆమె. కొడుకు మరణం తరువాత ఉదాసీనంగా మారిపోయింది. ఇంట్లో మాటలు కరువయ్యాయి. తన శరీరమే తనకు బరువయ్యింది.
అటువంటి దశలో పార్టీ అతని అమరత్వాన్ని గుర్తుచేసుకుంటూ సుత్తి, కొడవలివున్న ఎర్రజెండాను, రసూల్ రాసుకున్న డైరీని ఆమెకు అందజేసింది. ఆ డైరీ నిండా ప్రతి నిత్యం అతను తల్లికి రాసుకున్న ఉత్తరాలే. అందులో అటవీ ఉద్యమంలో ఏం జరుగుతోందో రాసి ఉంటాడు. తమ ఆచరణ ఎలా మానవీయమైనదో, ఉద్యమంలోని అన్ని రంగాల్లో ఎందుకు మహిళలే అధికంగా వున్నారో, అక్కడ జీవితం ఎంత కష్టంగా వున్నా తమకు ఎందుకంత ఇష్టమైనదో ఆ ఉత్తరాల్లో చెబుతాడు. విప్లవాచరణలో న్యాయ భావన ఎలా వున్నదో, అక్కడి రైతుల కోసం జనతన సర్కార్ ఏం చేస్తున్నదో తల్లికి చెబుతాడు. ఏ చదువూ లేని అమాయక ఆదివాసీలు ఉద్యమం దగ్గర ఎట్లా చదువుకొని, నాయకులుగా, టీచర్లుగా, డాక్టర్లుగా తయారవడమే కాదు మానవీయ వ్యక్తిత్వాలు సంతరించుకుని ఉద్యమాన్ని ఎలా నడుపుతున్నారో తల్లికి వివరిస్తాడు. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆదివాసీ అమ్మాయి హిడ్మే గురించి కూడా ఆ ఉత్తరాల్లో రాస్తాడు. ఆ డైరీ చేతికి అందాక సుల్తానా బేగం జీవితం పూర్తిగా మారిపోయింది. మునుపటి నిరాసక్త జీవితంలోకి కొత్త వెలుగు ప్రసరించింది. అతను రాసిన దాంట్లో ఆమెకు ఎంత అర్థమయ్యిందో ఏమో కానీ ఇతరుల కోసం ప్రాణమిచ్చే తన కొడుకువంటి మంచి మనుషులింకా వున్నారని ఎరుక కలిగింది. వాళ్ళు పేదల పక్షాన, బాధలలో ఉన్న వాళ్ళ పక్షాన దృఢంగా నిలిచి వున్నారు అని స్పష్టమైంది. అందుకు తాను గర్వపడుతుంది కూడా.
కొంతకాలం ఉద్యమంలో పనిచేసి పోలీసులకు లొంగిపోయి బయటికి వచ్చిన రమణ ఈ నవలలో మరో ముఖ్యమైన పాత్ర. ఆయనకు తన గమ్యం ఏమిటో తనకే అర్థం కాదు. ఆస్తి పంచీయమని అన్నలను అడగమని భార్య పోరు. నిద్రలో సుఖం లేదు, మెలకువలో కొత్తగా దుఃఖం లేదు. రెంటిమధ్య అంతులేని ఒంటరితనం. నల్లమలలో తన సహచరుడుగా ఉన్న శ్రీధర్ ఎన్ కౌంటర్ జరిగితే ఏడవటానికి కూడా అనువైన ఏకాంతం లేని జీవితం. ఇక్కడ ఆస్తి కోసం తాను తోడబుట్టిన అన్నలతో కొట్లాడుతుంటే అక్కడ స్వంత ఆస్తి రద్దు దిశగా జరిగే ఉద్యమంలో శ్రీధర్ అమరత్వం. ఎంత వైచిత్రి. అతని శవాన్ని చూడటానికి ఎన్ని రకాల, ఎన్ని రంగాల, ఎన్ని స్వభావాల మనుషులో…! వీళ్ళందరికీ శ్రీధర్ ఎలా అనుసంధానమయ్యాడు. అయినా మనసులోని యీ యాతన కొన్నాళ్లే. కాలం ఆగేది కాదు. నీవు సిద్ధం కావాలే గానీ కాలం కొత్త దారిలోకి జీవితాన్ని సులభంగా నెట్టేస్తుంది. మాట్లాడే నేర్పు ఉన్నవాడు కావడంతో త్వరలోనే కులసంఘం నాయకుడుగా ఎదిగాడు. బహుజన నాయకుడుగా గుర్తింపు వచ్చింది.
సుదీర్ఘ జైలుజీవితం నుంచి బయటికి వచ్చిన పార్టీ నాయకుడు ప్రధాన్. అతనికి మనుషులపైన అమితమైన ప్రేమ. మైదాన ప్రాంతంలో మనుష్యుల మధ్య తెగిపోయిన లింకులను కలిపే బాధ్యత భుజానికెత్తుకున్నాడు. ఒకానొక కాలంలో అతడు కె.ఎస్. కావచ్చు, మరోకాలంలో అతడు గంటిప్రసాదం కావచ్చు. వేరొకరు కావచ్చు. మారిన పరిస్థితుల్లో పరిష్కరించవలసిన సమస్యలు అనేకం వున్నాయి. చెయ్యాలంటే చేతినిండా పని వుంది కానీ మనుషులు కావాలి. ముందు విడిపోయిన సమూహాలను కలపాలి, వాళ్ళ అసంతృప్తి ఏమిటో వినాలి. మనుషులు మాటలు కరువైన స్థితిలో వున్నారు. ఎన్ని పరిమితుల్లో వున్నా వాళ్ళను ఏదో ఒక పనిలో భాగం చెయ్యాలి. విడివడిన మనుషులను ఒక సమూహంగా కూర్చగలగాలి. వాళ్ళతో కొత్త రాజకీయ కార్యాచరణను రూపొందించాలి. అది మైదాన ప్రాంతాల్లో నిర్మించబోయే ఐక్య సంఘటనకు పునాది అవుతుంది. క్రమంగా లోపలి ఆచరణకు బయటికీ కొత్త దారి ఏర్పడుతుంది. మనుషుల మధ్య సజీవ సంబంధాలు ఏర్పరచడానికి కొత్తగా ప్రయోగాలు చెయ్యాలి. ఏ చిన్న పని జరిగినా అది ఉన్న స్థితిని మెరుగు పరుస్తుంది. పాతమనుషులే మళ్లీ కొత్తగా నిర్మింపబడతారు. ఇదీ అతని విశ్వాసం. ఈ ప్రయోగంలో తన ప్రాణాలు కూడా పోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాజ్యం ఏ కదలికనూ సహించే స్థితిలో లేదు. అధికారంలో ఉన్న ఇప్పటి ప్రభుత్వానికి పోటీ మరే ఇతర రాజకీయ పార్టీ కాదు. ప్రత్యామ్నాయ ప్రజారాజ్య వ్యవస్థకు పునాది వేస్తున్న విప్లవోద్యమమేతన ప్రధాన శత్రువని వాళ్లే ప్రకటించారు. దాన్ని సమూలంగా నిర్మూలించకుంటే తన వ్యవస్థ మనుగడ కష్టం అన్న స్పష్టత జాతీయ స్థాయిలో రాజ్యానికి వుంది. ప్రధాన్ కు ఇప్పటి ఉద్యమ అవగాహనల పట్ల నిశిత పరిశీలనే కాదు, పొరపాట్ల పట్ల కటువైన విమర్శకూడా వుంది. “మన బలాలను రక్షితప్రాంతానికి తరలించి వ్యక్తులను కాపాడుకున్నాం కావచ్చు, కానీ అక్కడ పార్టీని మొత్తం కోల్పోయాం. పార్టీ అంటే నిర్మాణంలోని వ్యక్తులేకాదు. విప్లవంలో దశాబ్దాలు గా భాగమైన ప్రజాలుకూడా… ఒక్కోసారి వెనక్కు తగ్గాల్సి రావచ్చు కానీ రీ ఎంట్రీ లేకపోతే నష్టపోయేది ఉద్యమమే కాదు సమాజం కూడా.”
అలాగే ప్రత్యేక తెలంగాణా ఉద్యమం గురించి కూడా “తెలంగాణాలో విప్లవోద్యమంలోంచి రెండుతరాల కొత్త బూర్జువా నాయకత్వం తయారైంది.అనేక కారణాలతో మనం బలహీనపడటం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బలపడటం ఒకే సారి జరిగింది.తెలంగాణా ఉద్యమం మనకూ బూర్జువా క్లాస్ కు మధ్యనున్న గీత చెరిపేసింది క్లాస్ ప్రాక్టీస్ దెబ్బతినింది.”
ఇక్కడ అంతకుముందు నేను ప్రస్తావించని నాలుగో రకం మనుషుల గురించి చెబుతాను. వీళ్ళు సమాజం దృష్టిలో మేధావులు. పునాది రీత్యా విప్లవోద్యమం నుంచి లేదా ఆ ప్రభావంనుంచి వచ్చిన కవులు, రచయితలు. పైన చెప్పిన గీత చెరిగిన కాలంలో విప్లవోద్యమాన్ని వదిలేసి తెలంగాణా రాష్ట్ర సమితి చంకనెక్కినవారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక పదవులకు, పంపకాలకు, పైరవీలకు అలవాటు పడ్డవారు. టి ఆర్ ఎస్ అధికారంలో ఉన్న కాలంలో జరిగిన ఏ ఒక్క దారుణం మీద, అణచివేత మీద మాట్లాడని వారు. తమ పార్టీ నాయకత్వం బీజేపీ తో చెలిమి నెరుపుతున్నా ఏనాడూ నోరు విప్పనివారు. 2024 లో అధికారం పోయాక హఠాత్తుగా నేలకు దిగి ఇప్పుడు ప్రజాసంఘాల వేదికలమీద హక్కులు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే అసహ్యంగా అనిపిస్తుంది. వీళ్ళలో మరికొందరు మహా ఘనులు వెంటనే కొత్త ప్రభుత్వంతో కూడా బేరం కుదుర్చుకొని పదవులు పొందగలిగారు. క్లాస్ పాలిటిక్స్ ఇన్ కమాండ్ లేకపోతే క్యాడర్ ఏం కాగలదో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చూసి తెలుసుకోవచ్చు. అందుకనే నవలలో ఒక పాత్ర “రేపు రాయలసీమ ఉద్యమం కూడా మనం జాగ్రత్త పడకపోతే ఇదే దారిలో పోతుంది” అని స్పష్టంగా చెబుతుంది.
ప్రధాన్ చేసిన పరిశీలనలు, అతని అవగాహనలు కొన్ని చూడండి
‘ఇప్పటి కొత్త మధ్యతరగతి గతంలోని పాత మధ్యతరగతి కంటే భిన్నమైనది. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుమీద రోజుకు పన్నెండు గంటలు పైగా పనిచేస్తున్నది. తానొక బాధిత సమూహమని గుర్తుచేసేవరకు తెలుసుకోలేని మోస్ట్ ఆన్ ఆర్గనైస్డ్ లేబర్’.
‘ఒకవైపు విప్లవం అత్యవసరమైన జనాలను వాడే తయారుచేస్తున్నాడు. వాళ్ళను మనదగ్గరికి రానీయడం లేదు, మనలను వాళ్లదగ్గరికి చేరనీయడం లేదు. మనచూపు అక్కడిదాక ప్రసారించి, మన చేతులు వాళ్ళను అందుకునే దాకా చాచ గలిగితే కొత్త విస్తరణ సాధ్యమౌతుంది.’
మరి రాయలసీమ గురించి: ‘అడుగడుగునా తొక్కివేయబడ్డ పెద్దమనుషుల ఒప్పందం. డెబ్భై ఏళ్లుగా నిర్లక్ష్యం చేయబడ్డ, వెకిలి చేయబడ్డ, అవమానించబడిన శ్రీబాగ్ ఒడంబడిక. రాయలసీమ మరొక సారి నాలగురోడ్ల కూడలిలో నిలబడి ఉంది.
కృష్ణా నదిలో న్యాయంగా రావాల్సిన నీటి వాటా కావాలని గతం లోనూ ఉద్యమాలు జరిగాయి కానీ అప్పుడవి రాజకీయ పార్టీల చేతిలో ఉండేవి. ఇప్పుడలా కాదు ఆనాటికంటే మరింత తీవ్రంగా ప్రజాస్వామిక శక్తుల నాయకత్వంలో ఇప్పుడు రాయలసీమ ఉద్యమం నడుస్తున్నది. ఈ ప్రజాస్వామిక వాతావరణానికి గతంలో నడిచిన విప్లవ, ప్రజాస్వామిక హక్కుల ఉద్యమాలే కారణం. కనీసం తెలంగాణా విడివడ్డాకనైనా కనీసం నీళ్లు నిధులు తెచ్చుకుందామని తపనపడే సుదర్శన్, వెంకటరెడ్డి సార్లు. ఈ దశ రాయలసీమ ఉద్యమం
గతంలో నీటి వాటా విషయంలో చేసిన వాదనలకంటే మరింత హేతుబద్ధమైన , న్యాయబద్ధమైన అవగాహన సంతరించుకుంది. గత రాయలసీమ ఉద్యమం మిగులు జలాలైనా ఇవ్వండనే డిమాండ్‌తో నడిచింది. ఈ విడత ఉద్యమం ఉన్న నీళ్లన్నీ లెక్కలు వేసి తిరిగి పంచండి. న్యాయంగా రాయలసీమకు రావాల్సినవి చట్టబద్ధంగా ఇవ్వండి అనే డిమాండ్‌తో నడుస్తున్నది.
రాజధాని అంశం కేవలం రాష్ట్ర సమస్య మాత్రమే కాలేదు. భార్యాభర్తల మధ్యకూడా తంపు పెట్టింది. రాయలసీమ ఉద్యమకారుడు వెంకటరెడ్డి సారు కూతురు జగతి పెళ్లి విజయవాడ దగ్గరి కుటుంబం శ్రీకాంత్ రెడ్డితో జరిగింది. అబ్బాయిది బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం. పెళ్లి అయిన కొద్దిరోజులకే అమరావతి వచ్చింది. అప్పులు చేసి అయినాసరే అమరావతిలో అరఎకరం స్థలం కొనాలని అతని పట్టుదల. భార్యకు తెలియకుండా, ఆమె అనుమతి లేకుండా ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన నగలు అమ్మేశాడు. ఇంకా తక్కువొచ్చింది. కర్నూలులో జగతి పేరుకున్న ఇంటి స్థలానికి ఎసరు పెట్టాడు. ఎవరు ఏమైనా, ఎటుపోయినా తన ప్రయోజనం మాత్రమే ముఖ్యమనుకునే అతని మనస్తత్వం రాష్ట్రంలో కోస్తాంధ్ర నాయకులను తలపిస్తున్నదా? ఈ రెండు సంసారాలూ ఈడేరేనా? ‘ వెంకటరెడ్డి సారు అనుమానం.
రాయలసీమ ద్రోహులు కేవలం కోస్తాంధ్ర పెట్టుబడి దారులు మాత్రమే కాదు. స్వప్రయోజనాలు మాత్రమే ఆశించే సీమ పాలక వర్గాలు కూడా అనే స్పష్టతతో ఇప్పుడు ఉద్యమం ఉంది. “నేను అధికారం లోకి వస్తే వేదవతి ప్రాజెక్టు కట్టిస్తా ఆనండి చాలు. ప్రచారమంతా దానిచుట్టే తిప్పండి. మీరు గెలవక పోతే అప్పుడు అడగండి” అని ఒక రిపోర్టర్ కర్నూలు జిల్లా లోని ఎమ్మెల్యే అభ్యర్థితో అంటే అతని జవాబు ” నీళ్లొస్తే ఈనిగాళ్లకు కిందా మీదా బలిసి మనమాట ఇంటరా? సేద్యం చేసుకుంటా మనకెల్లి తొక్కి సూడరు. ఆదిగాదులే ఇంకో మాట చెప్పు” అంటాడు
బాబు రాయలసీమకు నీళ్లిస్తా అంటాడు. పథకాలు పోలవరంకు తిప్పుతాడు. ఇక్కడేమో టయానికి నీళ్లు అందక’ పంటలు ఎండిపోయి అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు చాగలమర్రి రైతులు ఆశీర్వాదం, నరసింహారెడ్డి. నికరజలాలున్న కె సి కెనాల్ కే నీళ్లు ఇయ్యడంలేదు. ఇచ్చినకాడికి నీళ్లు పారవు. ఏదో ఒకయేడాది దండిగా వానలొచ్చి పారినా టయానికి పెట్టుబడి ఉండదు. అదృష్టానికి అదికూడా కుదిరితే పంట చేతికొచ్చే టయానికి మార్కెట్ లో రేటువుండదు. ఇదీ ఆశీర్వాదం తమ్ముడు జార్జి చెప్పిన ఆత్మహత్య కారణం.
విప్లవోద్యమం పదేళ్ల కింద ఎక్కడో చిక్కుకు పోయింది ఇప్పుడెవ్వరూ ఏమీ చేయలేరు అంటున్న శ్రీనివాసులు వంటి మధ్య తరగతి. ఆస్తిత్వానికీ, అస్తిత్వవాదానికీ తేడా చూడలేని, చూపలేని కొందరు మేధావులు. విప్లవం కంటే ముందు ఈదేశంలో ప్రజాస్వామికీకరణ ముఖ్యం ఆ తరువాతే విప్లవం అయినా అంటూ ఏ ఆచరణలోనూ భాగం కాని లాయర్ చందర్ వంటి కుర్చీ మేధావి. ‘ఉద్యమంలో ఒక మార్పు మొదలైంది. దీన్ని ఎవరు ఎట్లా అర్థం చేసుకుంటున్నారో మరి. నేనైతే దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నా… ’ అనే ఆలోచనలతో రాయలసీమ ఉద్యమంలోకి వచ్చి అక్కడి నుంచి విప్లవోద్యమాన్ని తెలుసుకోవాలని అనుకున్న సాధన.
ఒకే ఉద్యమాన్ని భిన్నకోణాల్లో చూస్తున్న, అర్థం చేసుకుంటున్న, వ్యాఖ్యానిస్తున్న మనుషులు. ఈ పాత్రలన్నిటి ద్వారా ఉద్యమాన్ని వాస్తవికంగా పాఠకులు తెలుసుకుంటారు. ముఖ్యంగా సాధన ఈ నవలలోని పాత్రలన్నిటికీ కేంద్రంగా ఉంటూ, తాను విప్లవోద్యమం గురించి తెలుసుకుంటూ పాఠకులకు తెలియజేస్తుంది.
ఈ నవలా కాలం కేవలం ఐదారేళ్లు మాత్రమే. అయినా దీని విస్తృతినే కాకుండా లోతును కూడా చిత్రించడానికి ఇంత విస్తారంగా రాయాల్సి వచ్చింది. ఈ నవలలో పైన చెప్పిన అనేక మంది వ్యక్తులు ఏమయ్యారు? కలవగలిగారా? వాళ్ల మధ్య సంబంధాల్లోని ఘర్షణలు, ప్రేమలు ఏమయ్యాయి? వాళ్లు కలిసేనాటికి, లేదా విడిపోయే నాటికి ఆ పాత్రల చైతన్యంలో, వ్యక్తిత్వంలో ఎట్లాంటి మార్పులు వచ్చాయి. ఈ ఇరవై ఏళ్లుగా విప్లవోద్యమం ఎన్ని భిన్న ప్రయత్నాలు చేసిందో వాటి పర్యవసానాలు ఎలా ఉన్నాయో ఈ పాత్రల ద్వారా, వాళ్ల అనుభవాల ద్వారా, ప్రవర్తనల ద్వారా నవల చిత్రించింది. ఈ నవల విప్లవాభిమానులకే కాక, దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్న వాళ్లకు, ఏ అంచనాలకూ రాలేని వాళ్లకు, విమర్శలతో, అసంతృప్తులతో ఉన్నవాళ్లకు, వ్యతిరేకులకూ కూడా ఈ దశ విప్లవోద్యమాన్ని భావోద్వేగపూరితంగా అనుభవంలోకి తెస్తుంది. విప్లవోద్యమ చరిత్ర క్రమాన్ని మొత్తంగా మన సమాజ చారిత్రక సంఘర్షణలోంచి చిత్రించే ప్రయత్నం చేసినందు వల్ల ఈ నవలలో అనేక కోణాలు మనకు కనిపిస్తాయి. ఇందులోని వాస్తవాలను శోధించండి, నచ్చని అంశాలతో సహేతుకంగా విభేదించండి, చర్చించండి.
ఇది రాజకీయ, సామాజిక, సాంస్కృతిక నవల. టాల్‌స్టాయ్, దోస్తావిస్కీ నవలల్లో లాగా సమాజం, వ్యక్తి, సంబంధాల గురించిన చర్చ ఉంది. వాళ్ల కాలానికంటే పూర్తి భిన్నమైన ఇప్పటి ఆధునిక అవగాహనతో, విప్లవోద్యమ ఆచరణ నుంచి ఈ నవల వచ్చింది. ఇందులో తీవ్రమైన సామాజిక సంఘర్షణ ఉంది. అది వ్యక్తుల్లో, సంబంధాల్లోంచి వ్యక్తమవుతుంది. ప్రేమలు, అభిమానాలు, దుఃఖాలు, మానవోద్వేగాలు కలగలిసిన మనుషుల సమాహారం ఈ నవల. మనుషుల్లో కలవలేని వాళ్లు, మనుషులను కలవడానికి ఆరాటపడేవాళ్లు, సత్యం తెలుసుకోడానికి నిత్యం వెతుకులాడేవాళ్లు, సొంత అభిప్రాయాలే నిజమని ప్రచారం చేసుకొనేవాళ్లు, వీళ్లందరి చుట్టూ ఉధృతమవుతున్న అనేక ముఖాల సంక్షోభాలు, విప్లవోద్యమానికి, పాలకులకు మధ్య అనేక రంగాల్లో సాగుతున్న యుద్ధం.. ఇట్లా మన చుట్టూ ఉన్నవన్నీ నవలలో కనిపిస్తాయి.
చరిత్ర మరుగునపడిన కొన్ని విశేషాలను కూడా ఈ నవల ప్రస్తావించింది.
ఉదాహరణకు సదానందం సమకాలీనుడు, మిత్రుడు సర్దార్ నాగప్ప ప్రస్తావన వస్తుంది. ఆయన గాంధేయవాది. బహుశా అప్పటికి జిల్లాలో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన మొదటి దళితుడు. జిల్లాలో శాసనోల్లంఘన ఉద్యమంలో నిరాహారదీక్ష చేసి జైలుకెళ్లిన తొలివ్యక్తి. 18నెలల జైలుశిక్ష అనుభవించాడు. ఆనాడే కర్నూలులో దళిత విద్యార్థుల కోసం హాస్టల్ నడిపాడు. 1937లో మద్రాస్ ప్రెసిడెన్సీలో కర్నూలు జనరల్ స్థానానికి పోటీ చేసి గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ తరుపున రాజ్యాంగ సభకు ఎన్నికై మైనార్టీల ప్రాతినిధ్యం, రిజర్వేషన్లు వంటి అంశాల చర్చలో పాల్గొన్నాడు. మీ కాలపు స్వాతంత్రోద్యమం లో మహిళలు ఎందుకు తక్కువగా వున్నారు? అని సాధన అడిగిన ప్రశ్నకు సదానందం ఆలోచనల్లో కేవలం సుభద్రమ్మ ఒక్కతే కనిపించింది. నాగప్ప జైలులో ఉన్న కాలంలో అతని భార్య సుభద్రమ్మ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కొనసాగించింది. తానూ( గర్భిణిగాఉండి) అరెస్టు అయ్యి జైలుకు వెళ్లిన తొలిమహిళ.
సదానందం పాత్ర కర్నూలులో ఉన్న మత సామరస్యం గురించి చెబుతూ బహుశా గులాం రసూల్ ఖాన్ కారణమేమో అంటాడు. ఎవరీయన? కర్నూలు స్టేట్ చిట్ట చివరి నవాబు. సామ్రాజ్యవాద వ్యతిరేక వహాబీ ఉద్యమంతో ప్రభావితమైన వాడు. దక్షిణ భారతంలో ప్రధానమైన వాడు.టిప్పు సుల్తాన్ వలె దేశభక్తి, బ్రిటిష్ వ్యతిరేకత మెండుగా కలవాడు. తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడని తెల్ల ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. 1840లో ఓడించి తిరుచురాపల్లి జైలులో వుంచింది. అతని సేవకుడిని లోబరుచుకొని మందు పెట్టి చంపించింది. ఆ తరువాత విచారణ పేరుతో ఆ సేవకుడినీ చంపింది. పాత కర్నూలు జిల్లా విలక్షణత ఏమంటే కర్నూలు, బనగాని పల్లె, ఆదోని ఈ మూడూ ముస్లిం నవాబుల ఎలుబడిలో వుండినవి. కర్నూలు , బనగానిపల్లి, ఆదోని నంద్యాల, ఆత్మకూరు వంటి పట్టణాల్లో ఇప్పటికీ ముస్లిం జనాభా గణనీయం. అయినా ఎన్నడూ మత ఘర్షణలు జరగలేదు. (అదోనిలో మాత్రం ప్రేరేపితంగా ఒక్కసారి జరిగింది.) సామరస్యం, కలివిడి తనం ఇరువైపులా ప్రజల సంస్కృతిలో భాగం.
ఈ నవల ఎవరితో ప్రారంభమయ్యిందో ఆ వ్యక్తి మరణం తో (ఫిబ్రవరి 2020 చివర) ముగుస్తుంది. నవల పూర్తి అయ్యే కాలానికి 92 ఏళ్ల ఆ వృద్ధుడి అవగాహనలో వచ్చిన మార్పు “మన రాజకీయాల్లో లౌకికవాదం లేదు, మన సుప్రీంకోర్టులో న్యాయం లేదు, మన జీవితాల్లో ప్రజాస్వామ్యం లేదు, అంతా ధ్వంసం అయిపోయింది. హిందూత్వ మాత్రమే మిగిలింది’ రామజన్మ భూమి తీర్పు తరువాత స్వాతంత్ర్య సమర యోధుడు సదాశివం లోకానికి ఇచ్చిన చివరి సందేశం.
గతంలో తెలుగులోనూ, ఇతర భాషల్లో వచ్చిన ఉద్యమ నవలలకంటే ఈ నవల భిన్నమైనది ఎందుకంటే
అవన్నీ ఆ ఉద్యమం గడిచాక లేదా కొంత కాలం తరువాత వచ్చినవి. అలాంటప్పుడు ఉద్యమ పరిణామాలు, పర్యవసానాలు తెలుసుకొనే అవకాశం, అంచనా వేసుకునే సమయం రచయితకు వుంటుంది. విశ్లేషణ పరికరాలు కూడా అందుబాటులో ఉంటాయి. యీ నవల అలా కాదు. ఇది నడుస్తున్న, ముందుకు పోతున్న చరిత్రను రాశాడు. యీ రచనలో పాణి ఎంత వరకు విజయం సాధించాడో చదివి మీరే చెప్పాలి.
నవలలోని పాత్ర సుధ చెప్పిన ఈ మాటతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను. “ఈ యుద్ధంలో తాత్కాలికంగా మనం ఓడిపోవచ్చు. పూర్తిగా పడిపోవచ్చు. కానీ ఆ బూడిద కుప్పలోంచి ఇంకో పార్టీ పుట్టుకొస్తుంది. అది మనం వేసిన రహదారిని కాదనలేదు. ఇక్కడినుంచే ముందుకెళుతుం ది. చరిత్ర ఇట్లాగే అదేశిస్తుంది, నిర్దేశిస్తుంది.”
*
“అనేక వైపుల ” నవలను సమగ్రంగా అర్థం చేసుకోడానికి ఈ నోట్స్ చక్కగా ఉపయోగపడుతుంది. నవలలో చిత్రించబడిన వివిధ సంఘటనల పునాది విషయాలను ఈ నోట్స్ చక్కగా వివరించింది. నవలను మరింత అవగాహన చేసుకోవడానికి నోట్స్ అందించిన శ్రీనివాస మూర్తి సార్ కు ధన్యవాదములు.