మామూలు చదువులు , పొట్టకూటికోసం పడే తిప్పలు తీర్చే చదువులు చదువుకొని, పల్లెటూరి నేపథ్యం వల్ల అందరిలోనూ అన్నింటిలోనూ అపురూపాన్నే చూస్తూ సాహిత్యమంటే మరీ అపురూపమైందనే నమ్ముతూ దాని ఆకర్షణ లో పడి , నిజాయితీగా దాని ప్రేమలో పడి, మీటింగులనీ సమావేశాలనీ జీవితాన్ని దాని కోసమే వెచ్చించే పిచ్చిలో పడి, దానికి వూడిగం చేసే కార్యకర్తలా మారి మెల్లగా కవిత్వ సృజనలోకి వచ్చిన వాళ్లు తెలుగు సాహిత్యంలో కొందరు కన్పిస్తారు . ఇంటిలో అటేడు యిటేడు తరాలలో సాహిత్య వాసనే లేని వీళ్లు ఆపాదమస్తకమూ సాహిత్య పరిమళం వెదజల్లుతూ వుంటారు . అట్లాంటి వాళ్లలో అనిల్ డ్యానీ వొకడు . అనిల్ సాహిత్య కార్యకర్తృత్వాన్ని నేనేమీ చెప్పడంలేదు గానీ, కవిగా యితని వినయపూర్వక ప్రయాణంలోని ఒక మజిలీని పరిచయం చేస్తున్నాను . అనిల్ యిప్పటికి నాలుగు కవితా సంపుటాలలో కన్పిస్తాడు . మొదటిది ఖమ్మం ప్రభావంతో తీరం దాటిన నాలుగు కెరటాలలో ఒకడిగా , తర్వాత తాను స్వంతంగా అద్దిన ఎనిమిదో రంగుగా , తర్వాత తాను బలంగా దిద్దాలనుకున్న స్పెల్లింగ్ మిస్టేక్ తో, ఇప్పడు తాజాగా కురిసిన గాంధారి వానలా.
నిజానికి గాంధారి వాన, అనుకోని అకాల వర్షమనో , అక్కర్లేని ముమ్మరమైన వాననో యిదిమిధ్ధమైన అర్థాన్ని వివరించదు . ఈ శీర్షికలో కవిత కూడా లేదు . వినూత్నమైన శీర్షిక వొడిసిపట్టుకొని పెట్టేసాడు . అనిల్ వినూత్న రీతిలో శీర్షికలను పెడతాడని యీ గాంధారి వాన పుస్తకం( ‘ శ ‘ ఒక శీర్షిక) చదివితే తెలుస్తుంది . అట్లా అని యేదో పటాటోపమైన పదాలతో కవిత్వ ప్రదర్శన చేస్తాడనీ కాదు . అనిల్ చాలా నేలమీద వుంటాడు . ఏ గారడీలూ చేయడు . వస్తువుకే ప్రాధాన్యత యిస్తాడు . సంఘటనాత్మక కవితల కంటే సమకాలీన కవిత్వాన్ని రాసాడు .
గాంధారి వాన లో అనిల్ డ్యానీ లోని బహుళ ఆలోచనలు కన్పిస్తాయి . దళిత దృక్కోణంలో రాసిన కవితలున్నాయి .
దిగువ మధ్యతరగతి మగ దృక్కోణంలో రాసిన కవితలున్నాయి. స్త్రీ వాదం వేసిన ప్రభావం వల్లా , దళిత స్త్రీ వాదం వేసిన ప్రభావం వల్ల కూడా రాసిన కవితలు కన్పిస్తాయి . వర్తమాన సామాజిక ఉద్యమాలను అనిల్ సమర్ధిస్తాడు . వాటికి మద్దతుగా రాసిన కవితలున్నాయి .
ఇటీవల కాలంలో సమాజాన్ని కల్లోలం చేసిన కరోనా వైరస్ దాని ఐసోలేషన్ చుట్టూ కొన్ని కవితలున్నాయి . అట్లాగే ఒక వస్తువు అని పట్టి చూపించలేని ‘ అనిర్ధిష్టమైన ‘ అర్థాలనిచ్చే కవితలు కూడా గణనీయంగా వున్నాయి. ఇవన్నీ కూడా గత ఇరవై, ఇరవైయైదేళ్లగా తెలుగు కవిత్వం చేసిన ప్రగతిశీల ప్రయాణంలో భాగాలే . అనిల్ ఆ పరంపరలో ఒక తనదైన కొనసాగింపే .
‘మర్లబడ్డ పిండాలం
నడుస్తున్నాం దేవరా నడుస్తున్నాం
వెలపటా దానటా రగుల్తున్న
నిప్పు శోకాల రవ్వల నడిమిట్లా
కాళ్లు జారుకుంటూ ఉరుకుతున్నాం…'( వీరంగం)
దళితులు యీ దేశంలో మర్లబడ్డ పిండాలై నేల జారుతున్నారు . పుట్టిన వాడు పుట్టినట్టే బతుకు కోసం ఉరుకుతున్నాడు . ఇది భౌతికమైన ఆకలే కాదు , యింకా లోతైనది.వారిని ఉరుకులాడిస్తున్నది ఒక దుర్మార్గమైన వ్యవస్థ.
‘ పానం గాసుకుందామని
పొట్ట జేతపట్టుకొచ్చిన పిలగాండ్లకి
పొలిమేర దాటొచ్చినా
ఆకలిదీరని రోజులుంటాయని’
ఎరుక నిరంతరం యీ వర్గాలను వెంటాడుతుంటుంది . ఎంత ఎదిగి ఎంతటి సమూహాల్లో కలసి తిరిగినా ,
‘ ఏదో ఒక మాటో
ఎక్కడో నువ్వు చేసిన పనిలో నీ చేతగాని తనమో బయటపడ్డాక ‘ ( శీర్షిక లేదు, కవిత)
ఒక ఆత్మ న్యూనతా భావం వెంటాడుతూనే వుంటుంది. అందుకే కవి స్థిరపరిచిన వాక్యాలు యిలా నిర్ధారించుకుంటాడు.
‘ దైవమే ప్రాణం విడిచిన తర్వాత కూడా
ఊరికీ వాడకీ మధ్యన తెర చినగనేలేదు
ఆనాడు పరుచుకున్న చీకటి ఇంకా ఊరిచివర చిక్కగానే వుంది / ఏ నదీ జలానికీ ఎండిన ఒలీవ మొక్కని
బతికించే శక్తి లేదు
ఇప్పటికీ నిజం అదే ముప్పై వెండి రూకలకి అమ్ముడుపోతానే వుంది
నీలవర్ణపు భూగోళం మీద స్పష్టంగా నల్లటి
వివక్ష మరకలు ‘.(కొత్త ఆశ)
ఈ వివక్షలను యీ కవి అంతమైపోవాలని కోరుకుంటాడు . దానికి పోరాటాల అవసరాన్నీ గుర్తిస్తాడు .
‘ తప్పు చేసినదానికి అనుభగించమన్నావ్
తప్పుగాయి తల్లీ
పిడికిలెత్తుతున్నాం!’ (వీరంగం) అంటాడు.
ఆ అనడంలో గడుసుదనం కన్పిస్తుంది ‘తప్పుగాయి తల్లీ
చేతులెత్తి మొక్కుతున్నాం ‘ అనాల్సిన చోట , ‘పిడికిలెత్తుతున్నాం’ అని అనడమంటే , మేమేమీ సాగిలబడడం లేదు . పోరాటం చేస్తామని చెప్పడం .
దళిత ధిక్కారాన్ని ద్రావిడ జాతిగతంగా అన్వయం చేసుకోవడం అనిల్ లో జరిగింది. ఈ దేశంలోని ఆర్య
ద్రావిడ అనాది సంఘర్షణ లో కవిగా తను ఎటువైపు వుండాలో స్పష్టత వుంది . ద్రావిడ నాగరికత ను ఒక యింటిగా భావించి, ఆ యిల్లే మాయమైపోయిందనీ దాన్ని కొత్తగా నిర్మించేందుకు కలగంటున్నాననీ అంటాడు.
‘ వర్ణాల దండయాత్రలో విరిగిపడి
ఈ మట్టిలో కల్సిపోయిన
ద్రావిడ కోటల్ని కలగంటున్నాను
కూలిపోయిన ఇంటి స్థానంలో
సరికొత్త దేశాన్ని కోరుకొంటున్నాను ‘ ( ఇల్లు).
‘వాళ్లే లేకపోతే ‘ కవితలో అణగారిన కులాలకు చెందిన పారిశుద్ధ్య కార్మికుల గురించి మంచి పరిశీలన చేసాడు అనిల్ . ఈ కవితలో సూచనాత్మకమైన ఒక కార్యకారణ సంబంధమున్న విషయముంది . పంటపొలాలను చంపేసి
వ్యాపారసముదాయాలను నిర్మించి వందలాదిమందికి విందుభోజనాలు పెట్టాక , ఆ విస్తళ్లను శుభ్రంగా ఎత్తి
పడేసేది , తిరిగి ఆ పంట పొలాల్లో పనిచేసిన వ్యవసాయ కూలీలుగా వుండిన , యిప్పుడు వలస కూలీలైన అణగారిన ప్రజలే . తినడం యెంత ముఖ్యమో , తిన్నవి ఎత్తేయడమూ అంతే ముఖ్యం. అయినా వాటిని చేసేవాళ్లకు గౌరవం వుందా?
. పంటలు పండించడంలో
‘ ముందు వరుస వాళ్లని/ ఆఖరి వాళ్లని చేసినందుకు ‘.
ప్రాయశ్చిత్తం వుందా ? అనడుగుతాడు కవి.
అనిల్ కవిత్వంలో సమూహంగా అంతర్మధనమూ , ఒక ధిక్కారమూ కన్పిస్తూనే , సవర్ణ సమూహాలతో ఒక ఆత్మీయమైన సంభాషణ జరపాలనే కల కూడా కన్పిస్తుంది. ( రంగుల కల, కవితలో)
’ ఒక్కడివే ఎంత దూరం నడుస్తావ్
ఈ చేయి దగ్గరగా తీసుకో
శీతాకాలంలో రెండు చేతుల
మధ్యలో కరచాలనం వెచ్చదనం ‘ అని తననూ కలుపుకోమని ఆహ్వానిస్తాడు.
‘మా అమ్మలు ‘ పేరుతో , దళిత తల్లుల మీద గొప్ప పద్యమొకటి రాసాడు అనిల్ . దళిత ఈస్తటిక్స్ మెండుగా వున్న కవితది . అనాదిగా దళిత స్త్రీ బతుకు పోరాటంలో వున్న ఆత్మగౌరవంతో పాటు ఆమె శ్రమకు వున్న ప్రాముఖ్యతనూ వర్తమాన కాలంలో దాన్ని చూడాల్సిన దృష్టికోణాన్ని వ్యక్తీకరించాడు . తాను తీయని సొమ్ముకు చింతకాని చర్చి ఫాదర్ జోజప్ప , మరియమ్మ అనే చర్చిలో పనిచేసే పేదరాలిని పోలీసులతో కొట్టించి చంపేసిన సంఘటనపై ‘ నల్ల మరియమ్మ’ అనే పదునైన కవితను రాసాడు అనిల్ . చర్చిల్లో జరుగుతున్న దుర్మార్గాలపై నిరసనను తెలియజేశాడు. దళిత మహిళలనే కాదు రక్తగతం చేసుకున్న స్త్రీ పక్షపాతం యీ కవిలో కన్పిస్తుంది.
‘ కడుపులోనుంచి బయటికి వచ్చిన ప్రతీవాడూ
ఆ కడుపునే తన్నాలని చూస్తాడు
రంగుతోనో, కులంతోనో, అహంకారంతోనో
ఆమెని విపణిలో మానసికంగా వివస్త్రని చేస్తాడు…’
అంటూ ‘ గర్భాలని తన్నిన కాళ్లు ‘ అనే కవితలో మగ ప్రపంచంలో మహిళ పడుతున్న అవస్థలూ , ఎదుర్కొంటున్న వివక్షలూ , స్త్రీ వాద కోణంలో ఆవిష్కరించాడు .
అనిల్ లో కన్పించే మరో విషయం , దిగువ మధ్యతరగతి మనోభావాలు . ‘అండర్ మెయింటినెన్సు ‘ , ‘ నిర్లిప్తత ‘ ,
‘ శూన్యతమ్ ‘ , ‘ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ‘ లాంటి కవితల్లో యివి కన్పిస్తాయి .
‘ఎవరితను, నాన్ననా, మనింట్లో వుంటాడా?
వీళ్ల వూరు ఆఫీస్ కదా!’ … అనే పిల్లలూ.
‘ బిందెలన్నీ కారుతున్నాయా…
సిలెండర్ వంటిల్లు చేరడానికింత
చెమట పడుతుందా? ‘ అనే సందేహాలూ.
‘ పదయింది యింకా రాలేదు?
వస్తున్నా ..!
గొంతుదాటి రావడానికి మాట ‘ పడే మొహమాటాలూ.
‘ మగత గుమ్మం దగ్గర నిలబడగానే
పగటి ప్రయాణమంతా పక్కమీదకి వస్తుంది
కాస్తా డబ్బులు అవసరం కొంచెం పెందలాడే
రావొచ్చు కదా! ఒక మాటా లేదు మంచీ లేదు
పంచుకోవడానికి నిద్రేమీ ఆస్తి కాదు.’ అనే యిల్లాలి ఫిర్యాదులూ. ఈ కవితలన్నీ యిలాంటి కుటుంబ కథలే.
ఇక నార్మల్ హ్యూమన్ బీయింగ్ కవితైతే మధ్య తరగతి మగవాడి మోనోలాగ్ . ఈ అనుభవాలన్నీ మన మగ కవుల అందరి స్వంత గోలలే. ఇదే మధ్య తరగతి మగా దృష్టి కోణం ఒక పాలు ఎక్కువై ‘ నాన్నలు గ్రహణాలూ ‘ అనే కవిత అనిల్ రాసాడు .
‘ నాన్న స్వయంప్రకాశకుడు
అందరం రాహువుల్లా మారి నెలలో ఒక్కసారైనా
తిట్లతో మింగేసినా మనం ఓడించలేని యోధుడు…
నాన్నల కోపాలూ గ్రహణాలూ ఒకటే
ఎక్కువసేపు వుండవు…’ అంటాడు.
వీటితోపాటు యీ దేశంలోని మధ్య తరగతి ప్రజలు సమాజంలో జరుగుతున్న అనేక విషపరిణామాల పట్ల
నిర్లిప్తతంగా వుండిపోతున్నారనేది ఆలోచనాపరులలో వున్న ఒక ఫిర్యాదు. అందులో నిజమూ వుంది. దాన్ని అనిల్ చాలా సరళంగా ఒక కవితలో చెప్పేస్తాడు .
‘ఒక గొంతెత్తాలని లేదు
ఒక నినాదమవ్వాలనీ లేదు
అరుస్తున్న వాళ్లతో కలిసి నాలుగు అడుగుల
కలుపుదామనీ లేదు
టన్నుల టన్నుల నిర్లిప్తత
ఎంత పొర్లాడినా పొద్దుగుంకే దాకా
అదే బధ్ధకపు బానిసత్వం
ఇంత జరుగుతున్నా నాకేం పట్టడం లేదంటే
ఏదో ఒకటి నా యింటిలో జరిగితే బాగుండు.’
ఉద్యమ సంబంధమైన స్పృహ యీ కవికి కావాల్సినంత వుంది .ఈ కవిత్వం లో తక్షణ సంఘటనాత్మక కవితలు తక్కువగా వున్నప్పటికీ, కరోనా లో ముస్లిం సమూహాన్ని యిబ్బంది పెట్టిన మర్కజ్ గురించీ , ముస్లిం ల మీద జరుగుతున్న నిర్బంధం ( కొత్త సంగతి) గురించీ, హిందూ మూఢనమ్మకాలతో ఎదిగిన ఆడపిల్లలను బలి యిచ్చిన
మదనపల్లె తలిదండ్రుల(మథనపల్లె) గురించీ, మంచి కవితలున్నాయి. ఇక నిర్బంధం పేరుతో రాసిన కవితలో హక్కులవుద్యమకారులనీ ,విప్లవోద్యమ సానుభూతిపరులనూ నిర్బంధించడాన్ని నిరసిస్తాడు .
తెలుగు ప్రజలకు , మరీ ముఖ్యంగా కోస్తా ప్రజలకు భాగ్యనగరమైన హైదరాబాద్ మీద తీరని మమకారం.
‘ ఆకలేసి తనవైపు జాలిగా చూసినప్పుడు
అరచేతుల్లో జీతం పూలని రాల్చిన చెట్టు కదా
పోగుబడ్డ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్లకి
అపాయింట్మెంట్ ఆర్డర్ కదా ఈ నగరం
దిగాలు పడిన ఎందరో నాన్నల గుండెలకు
ధైర్యం చెప్పి అమ్మలా అక్కున చేర్చుకున్న..’నగరం.
యీ భావనతోనే అనిల్ కూడా’ భాగ్య నగరం’ ను కవిత జేసాడు.
‘ నన్నెంత దూరం ఉంచాలని చూసినా
నేను మాత్రం నా సరిహద్దుల నుంచి
నాలుగు మీనార్ల మీద కపోతాల మెడ నిమురు’తానంటాడు.
అయితే యీ కవితలో ఎందుకు దూరంగా వుంచిందో
నిజమైన( విభజన చుట్టూ వున్న) కారణాల్ని చెప్పకుండా , హిందూ ముస్లిం మత కల్లోలాల అసంగత విషయాన్ని ప్రస్తావించాడు . ఇప్పుడు హైదరాబాద్లో మత విద్వేషాల వూసే లేనప్పుడు దాన్ని ప్రస్థావించడం ద్వారా , అసలైన విషయాన్ని కవి చెప్పకుండా దాటేసాడు .
ఇవన్నీ ఒక ఎత్తయితే, పాఠకులకు అర్థం అవుతున్నట్లే వుంటూ అర్థం కాకుండా పోయే మార్మికత నిండిన కవితలను కూడా అనిల్ సృజించి వుండటం మరో ఎత్తు. ఇలాంటి కవితలు గణనీయంగా వుండటం అనిల్ కు కవిగా యిబ్బంది కల్గించే అంశం. ‘ లాహిరి ‘ , ‘ ఉక్కబోత ‘ , ‘కళ’ , ‘ విస్మయం ‘ , ‘ కంచె ‘ , ‘ వాన దృశ్యం ‘ , ‘ సాలభంజి క రహస్యం ‘ , ‘ మాంజా ‘ , ‘ నీటిమూట’ లాంటి పదికి పైగా కవితలు చదువుతూంటే అర్థమైనట్లే వుంటూ కవి వుద్దేశ్యం యేమిటో తెలియనీయ్యవు. తెలుగు ఆధునిక సాహిత్యంలో కొందరు కవులు యీ తరహా శైలిలోనే తమ
సృజనను రంగరిస్తున్నారు . ఇలాంటి భిన్నత అనిల్ డ్యానీ లాంటి ప్రగతిశీల దృక్పథం గల కవులకు నప్పదు.
లేదూ అవే కవితలను నిర్మాణ పరంగా సరిజేసి అర్థవంతంగా పలికించే వొడుపును కవి సాధించాల్సి వుంది.
వాస్తవంలోని చేదును జనసాంద్రమైన వాక్యగతిగా మార్చే శక్తిగల అనిల్ వర్తమాన సామాజిక కాలాన్ని దాని బహురూపాలతో పట్టుకొని మనకు దృశ్యమానం చేస్తున్నాడు . ఒక వీరంగ భూమికతో తరతరాల యింటా బయటా నిష్టూరాలను ధిక్కార జీరతో రొదపెడుతున్నాడు . వైయ్యక్తిక వైఖరులనూ సామూహిక ధోరణులనూ వేటికి వాటిగా నిర్ధారించుకునే శిక్షణ అనిల్ చాలా పొందాడు . కవిత్వం లోకి యే యే అంశాలు యే యే పాళ్లలో వొదిగించుకోవాలో( ఆ విద్య) బాగా అబ్బిందని గాంధారి వాన నిరూపిస్తుంది . దృక్పథ స్పష్టత యెట్లాగూ వుంది . వైఫల్యాలనూ విజయాలనూ , విమర్శలనూ ప్రశంసలనూ సమానంగా చూసే దృష్టితో ముందుకు వెళ్లగలడనే భరోసా వుంది .ఈ పుస్తకం తన సాహిత్య ప్రయాణంలో ఒక మజలీ మాత్రమే . మరిన్ని మజిలీలు చేరాలనీ ప్రయాణ దాహం ముందుకే చేర్చాలనే
ఆకాంక్షిద్దాం.
*
మంచి సమీక్ష
ధన్యవాదాలు మిత్రమా
మంచి వ్యాసం. అనిల్ కవితలు సహజంగా అన్నీ అర్ధమయ్యేవే ఉంటాయి నాకు. ఆ దిశగా మీ వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. చదివించిన వ్యాసం
ఇప్పటివరకు అనిల్ డానీ రాసిన కవితలు సులభంగానే అర్ధమవుతూ వచ్చాయి .అయితే మీరు చెప్పిన సూచనను కవి పరిగణలోకి తీసుకోని ఆ దిశగా ఆలోచించాలి.మీ సమీక్ష బావుంది సర్ అభినందనలు
పైకి సాదా సీదా గా కనిపించే అనిల్ లోని లోతైన భావాల్ని చక్కగా చెప్పారండి.