అనువాదం రెంటాల శ్వాస!

పందొమ్మిదివందల ఇరవై దశకం తొలినాళ్ళు చాలా విశిష్టమయినవి. ముఖ్యంగా తెలుగు కవిత్వానికి సంబంధించినంత వరకు అవి ఒక తరానికీ, ఒక స్వరానికీ, ఒక జ్వరానికీ మారుపేర్లుగా నిలిచిన కవుల్ని  మనకిచ్చాయి. ప్రాంతీయ–జాతీయ పరిమితులను అధిగమించి, అంతర్జాతీయ విహాయసంలో రెక్క చాచిన తరమది. కాకలి గీతికను పల్లవిస్తూనే, ఆకలి కేకల్లోకి దొర్లిపోయిన జ్వరమది. సంప్రదాయం పొత్తిళ్ళలోంచి బయటపడుతూనే బజారుకెక్కి, అభ్యుదయ కవితను వీథివీథినా వినిపించిన స్వరాలవి. రాంభట్ల కృష్ణమూర్తి (1920), ఏల్చూరి సుబ్రహ్మణ్యం(1920), రెంటాల గోపాలకృష్ణ (1920), దేవరకొండ బాలగంగాధర తిలక్‌ (1921), అనిసెట్టి సుబ్బారావు(1922), రాచమల్లు రామచంద్రా రెడ్డి (1922), కుందుర్తి ఆంజనేయులు (1922), బెల్లంకొండ రామదాసు (1923), కె.సభా (1923), ఆవంత్స సోమందర్‌(1924), ఆరుద్ర (1925) గజ్జెల మల్లారెడ్డి (1925) ఈ తరానికీ, స్వరానికీ, జ్వరానికీ ప్రతినిధిప్రాయులుగా నిలిచారు.  వాస్తవానికి వాళ్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో మార్గం. ప్రతి ఒక్కరూ సొంత గొంతులోనే పలికిన స్వతంత్రులు. కథ, నవల, విమర్శ, వచన కవిత, వ్యంగ్య గేయం, కార్టూన్‌ కవిత, అనువాదం, జర్నలిజం,  నాటక రచన, సినిమా రచన ఇలా విభిన్న ప్రక్రియల్లో రాణించిన తరమది. వాళ్లందరిలోకీ, రెంటాల గోపాలకృష్ణ ప్రత్యేక లక్షణాలు సంతరించుకున్న కవి, కథకుడు, నవలారచయిత, నాటకకర్త, అనువాదకుడు, పత్రికీయుడు. ఆరు దశాబ్దాల సాహితీ జీవనంలో సుమారు రెండువందల పుస్తకాలు రాసిన రెంటాల శతజయంతి సందర్భం – 2020 సెప్టెంబర్‌ అయిదో తేదీతో ఓ కొలిక్కి వస్తుంది.
పలనాటి వెలలేని మాణిక్యం!
‘‘కవితా రసపు జల్లు, ఖడ్గాల ఘలుఘల్లు,  పలనాటికే చెల్లు,  ఓ పలుకులమ్మా’’ అనాలనిపిస్తుంది ఒక్కోసారి. ఖడ్గాల ఘలుఘల్లు సంగతి సరేసరి! ఇక కవితా రసపుజల్లులకు కూడా పలనాటి  సీమలో కరువులేదు. అక్కడ పుట్టకపోయినా, తన చాటువులద్వారా పల్నాటిసీమకు శాశ్వతత్వం సంతరింపచేసి, ఆ సీమలోనే కన్నుమూసి, ‘దివిజ కవివరుల గుండియల్‌ దిగ్గురనగ’ అమరపురికి అరిగినవాడు శ్రీనాథుడు. భారతానికి మినియేచర్‌లాంటి ‘పలనాటి యుద్ధ చరిత్ర’ జానపద మహాకావ్యంగా పునర్నిర్మించి తన రుణం తీర్చుకున్నాడనిపిస్తుంది. ఇక ‘గబ్బిలం’తో తెలుగులో ఓ మేఘదూతం రాశాడనిపించుకున్న ‘కవికోకిల’ గుర్రం జాషువ సరేసరి!! అలాంటి పలనాడుకు ముఖద్వారం నరసరావుపేట. స్థానికులు దాన్ని క్లుప్తంగా పేట అంటారు.బ్రిటిష్‌ పాలకులు ఈ దేశం నొసటన రాసిన అభివృద్ధి క్రమంలో భాగంగా రూపుదిద్దుకున్న రోడ్లు–రైళ్లు తెలుగునాడు రూపురేకలను తీర్చిదిద్దాయి.  ఆ క్రమంలోనే వర్తక వాణిజ్య కేంద్రంగా‘పేట’ అవతరించింది. పేటను సాహిత్యాది కళారూపాలకు కేంద్రంగా మలచిన ఖ్యాతి మాత్రం కవులకే దక్కాలి! తెలుగునాడు సాంస్కృతిక పటంలో ఓ నాడీకేంద్రంగా పలనాడు రూపుద్దికోవడంలో అభ్యుదయ కవులు నిర్వహించిన పాత్ర అద్వితీయం. ముఖ్యంగా అక్కడే పుట్టి, పెరిగి, వికసించిన కవులు ఈ పాత్ర గొప్పగా పోషించారు. ‘నయాగరా కవులు’ ఏల్చూరి సుబ్రహ్మణ్యం  స్థాపించిన నవ్యకళాపరిషత్తులో రెంటాల ప్రముఖపాత్ర పోషించారు. ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన దేవరకొండ బాలగంగాధర తిలక్‌ కృష్ణ దాటొచ్చి, నవ్యకళాపరిషత్తులో ప్రముఖ పాత్ర పోషించడం విశేషం.
మైలురాళ్ళు!
పదహారేళ్ల ప్రాయంలోనే తొలి నవల ‘‘రాజ్యశ్రీ’’ రాశారు రెంటాల. ఈ కాల్పనిక రచనకు చరిత్ర పరిశోధకులు మారేమండ రామారావు ముందుమాట రాయడం విశేషం. ఆయన ‘సంఘర్షణ’ కవితా సంపుటి అభ్యుదయ సాహిత్యవీధుల్లో ఓ మైలురాయిగా నిలబడుంది. ముఖ్యంగా ఈ సంపుటికి శ్రీరంగం నారాయణబాబు రాసిన ‘ప్రవర’  అభ్యుదయ కవుల వంశవృక్షాన్ని రేఖామాత్రంగా చిత్రించింది. రష్యన్‌ మహారచయిత టాల్‌స్టాయ్‌ రాసిన విశిష్ట వచనకావ్యం ‘ఆన కెరినీన’ రెంటాల అనువాద ప్రతిభకు అద్దంపడుంది. ప్రపంచ కథా సాహిత్యానికి మూలపురుషుడనిపించుకున్న గగోల్‌ నాటకం ‘ఇన్‌స్పెక్టర్‌ జెనరల్‌’ ఆనాటి తెలుగు జీవితానికి ప్రతిఫలనంగా రూపొందించడం గొప్ప శిల్పచాతుర్యమనిపించుకుంది. బెల్లంకొండ రామదాసుతో కలిసి, రెంటాల అనువదించిన టాల్‌స్టాయ్‌ చారిత్రిక నవల ‘యుద్ధం–శాంతి’ కొత్త తరం పాఠకులను సృష్టించింది.
ఔచిత్య విచారం!
రెంటాలగారికి గొప్ప పేరు తెచ్చిపెట్టిన అనువాదం ‘యమకూపం’. కూప్రిన్‌ నవల ‘యమా ద పిట్‌’కు అనువాదమిది. వేశ్యాజీవనంలోని చీకటి కోణాలను కంచుకాగడాపట్టి చూపించిన చరిత్రాత్మక రచన ‘యమకూపం.’ కళ్ళుచెదరగొట్టే వేశ్యల మేకప్‌ మెరుగులకింద సెలవేసిన సుఖవ్యాధుల పుళ్ళను డిసెక్ట్‌ చేసి మరీ చూపించాడు కూప్రిన్‌. దాన్ని అదే టోన్‌లో అనువదిస్తూ, రెంటాల చేసిన ఓ పని అనువాదకుడిగా ఆయన స్థానాన్ని అల్లంత ఎత్తున నిలబెడుతుంది.  కూప్రిన్‌ ప్రస్తావించే సుఖవ్యాధులన్నిటికీ ఆనాటి తెలుగు సమాజంలో వాడుకలో ఉన్న సమానార్థకాలన్నీ ప్రయోగించారు రెంటాల. మూలరచయిత స్వరాన్ని చెడగొట్టకుండా అనువదించడంతో, వేశ్యావృత్తి పేరు చెప్తేనే ఒళ్ళుజలదరిస్తుంది ఈ నవల చదివినవాళ్లకు. అది అనువాదకుడి జడ్జ్‌మెంట్‌కు నిదర్శనం! అనువాదం ఆషామాషీ వ్యవహారం కాదనీ, అందులో ఔచిత్య విచారానికి ఎంతో ప్రాముఖ్యముందనీ రెంటాల రుజువు చేశారు.
ఇక, లెక్కకు మిక్కిలిగా ఆయన చేసిన అనువాదాలు రెంటాల వెర్సటైలిటీని రుజువు చేస్తున్నాయి. నిజానికి, ఇంత విస్తృతంగా కాకపోయినా, ఈ ప్రక్రియలపై చెయ్యిచేసుకోని ఆ తరం అభ్యుదయ కవులు లేరనే చెప్పొచ్చు. కాకపోతే, ‘వాత్సాయన  కామసూత్రాలు’ ‘వాల్మీకి రామాయణం’, ‘హంసవింశతి’, ‘సింహాసన ద్వాత్రింశిక’, ‘విక్రమోర్వశీయం’, ‘మాలతీ మాధవం’, ‘మృచ్ఛకటికం’లాంటి పుస్తకాలను రెంటాలగారు మాత్రమే అనువదించారు. అనువాదాన్ని ఒక పరిశ్రమలా సాగించిన రెంటాల అక్షరాలా వృత్తి రచయిత! తెలుగునాట ఇలాంటి వ్యక్తి మరొకరు లేరనిపిస్తుంది!!
( ఈ వ్యాసం సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ పేజీ లో (ఆంధ్రప్రదేశ్) సెప్టెంబర్ 4, 2020 న ప్రచురితమైంది. సాక్షి సౌజన్యం తో పునః ప్రచురిస్తున్నాము)
                                            *

రెంటాల గోపాల కృష్ణ శత జయంతి సందర్భంగా ఆకాశవాణి ,హైదరాబాద్ వారి కోసం మందలపర్తి  కిషోర్   సెప్టెంబర్ 5, 2020 న చేసిన రేడియో ప్రసంగం ఇక్కడ

వినవచ్చు.

( ఆలిండియా రేడియో వారికి ధన్యవాదాలు)

మందలపర్తి కిశోర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు