అనుబంధాల ఆసు మిషన్ తో అల్లిన మెత్తని నేతచీర – “మల్లేశం”

పెద్ద హీరోల వంశపారంపర్య పాలన నశించినట్టే కనిపిస్తోంది. జనం రుచీ పచీ లేని పెద్ద బడ్జెట్ సినిమాలను విసిరి కొడుతున్నారు.

“మల్లేశం” సినిమా గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరుగుతోంది. చింతకింది మల్లేశం, అతను తయారు చేసిన ఆసు మిషన్… ఇవి ఈ పాటికి చాలామందికి తెలిసిన విషయాలే.

మల్లేశం సినిమా బాగుంది. అందరూ నేలమీద నడిచే మనుషులు. అరకొర డబ్బుతో బ్రతికే చిన్న జీవితాలు. చక్కటి కుటుంబ విలువలు. వీటన్నిటినీ తెలంగాణా సంస్కృతితో కలిపి ఎంతో మక్కువతో సినిమాలోకి ఒదిగించటం జరిగింది.

మల్లేశం చిన్నతనం నుండీ ఆసుపోసి పోసి అరిగిపోయిన అమ్మ భుజానికి ఆసరా కావాలనుకున్నాడు. చిన్నతనంలోనే చదువాగిపోయింది.  వయసు పెరిగి పెండ్లయింది.  హైదరాబాద్ వచ్చి పొట్ట పోషించుకోవటానికి చిన్నచిన్న వ్యాపారాలు చేశాడు. ఏవి ఎలావున్నా మల్లేశంలో అమ్మ మీద ప్రేమా, అమ్మ కష్టం తీర్చటం కోసం ఆసు పోసే మిషన్ తయారు చేయాలన్న కోరికా చెక్కుచెదరకుండా వుండిపోయి, అతన్ని నిద్ర పోనివ్వవు.

చెక్క పేళ్లూ, అరిగిపోయిన మోటార్లూ, చక్రాలూ లాంటి వాటితో మొదలుపెట్టి, ఏళ్ల తరబడి సొంత ఊహలకు పదునుపెట్టి, చదివి నేర్చుకున్న పరిజ్ఞానాన్ని ఊహలకు జోడించి, సంపాదిస్తేగానీ గడవని రోజులతో తంటాలు పడి, చివరకు తన కలను పండించుకుంటాడు. ఆసు మిషన్ను తయారుచేసి చాలామంది అమ్మల భుజాలను సేదదీరుస్తాడు.

చింతకింది మల్లేశం జీవితకథ ఇలాంటి మలుపులతో రాజ్ రాచకొండ చేతిలో సినిమాగా వచ్చింది.

ఏలే లక్ష్మణ్ దీనికి ఆర్ట్ డైరెక్టర్ కావటం వల్ల తెలంగాణా గ్రామీణ దృశ్యం ఈ సినిమాలో authenticity ని సాధించింది.  నేల గంధపు పరిమళాన్ని ఇప్పటికే తన కథలతో అందరికీ పంచుతున్న పెద్దింటి అశోక్ కుమార్ మల్లేశం సినిమాకు మాటలు రాయటం, కథ జరిగిన ప్రాంతపు యాసమీద దృష్టి పెట్టటం ఈ సినిమా సహజంగా అమరటానికి బాగా ఉపయోగపడ్డాయి. ఈ చిన్న సినిమాకు సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బానర్ నుంచి విడుదలైన హోదా కూడా దొరికింది. ఇక ప్రేక్షకుల ఆదరణ… దొరికి తీరుతుందనే నమ్మకం కుదిరింది ‘మల్లేశం’ చూశాక.

పెద్ద హీరోల వంశపారంపర్య పాలన నశించినట్టే కనిపిస్తోంది. జనం రుచీ పచీ లేని పెద్ద బడ్జెట్ సినిమాలను విసిరి కొడుతున్నారు. ‘మల్లేశం’ తెలుగు సినిమాను, ముఖ్యంగా చిన్న బడ్జెట్ సినిమాను మరో మెట్టు పైకి ఎక్కించింది.

ఈ మధ్య కొన్ని ‘భయోపిక్స్’ చూసిన తరువాత, వ్యక్తిగత విజయాలకు పడుతున్న హారతులు వెగటు, చిరాకు, కోపం, విసుగూ పుట్టించాయి. పొగడ్తలూ, ఉన్నవీ లేనివీ చేర్చటాలు, అసలు విషయాలను మూసిపెట్టటాలు, ముఖ్యంగా సినిమాటిక్ ఆర్ట్ లేకపోవటం… ఇదే భయోపిక్ అంటే. వీటికి పూర్తి ఎక్సెప్షన్ ‘మంటో’, ‘పాన్ సింగ్ తోమర్’ లాంటి అరుదైన బయోపిక్ లు.

‘మల్లేశం’ సినిమాలో అతని విజయం కూడా భయోపిక్ ల్లో వున్నట్టుగా అద్భుతం మహాద్భుతం అన్న లెవెల్లో ఎక్కడా వుండదు. జీవితంలోని కష్టం, సుఖం, విజయం అన్నీ నిజజీవితంలో వున్నంత మామూలుగానే కనిపిస్తాయి. ఆసు మిషన్ ను కష్టపడి తయారు చేయటం, అందులోని టెక్నికాలిటీ మామూలుగా అయితే చాలా డ్రై సబ్జెక్ట్. కానీ దీన్ని చదువులేని మల్లేశం తయారు చేయటంలో వేసిన తప్పటడుగులూ, దిద్దుబాట్లు, సరిచేసుకోవటాలు ఆసక్తికరంగా తయారవటానికి కారణం ఆసులో దారాల్లా తిరిగిన మల్లేశం జీవితంలోని మనుషులూ, వాళ్ల అనుబంధాలూ. పల్లెటూరి వాతావరణాన్ని, అనుబంధాల తీపిని, సంప్రదాయాన్ని  ఏ మాత్రం వెగటు కొట్టకుండా (అంటే మెలోడ్రామా, కృత్రిమత్వం లేకుండా) రుచికరమైన పరమాన్నంలాగా అందించటంలో దర్శకుడు మంచి జాగ్రత్త తీసుకున్నాడు. తమిళ్ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ చెళియన్ “నాటకంలో అయితే నటులు నటించాలి. సినిమాలో బిహేవ్ చెయ్యాలి” అంటాడు. నటులంతా సహజంగా బిహేవ్ చెయ్యటమే ‘మల్లేశం’ సినిమాకు పెద్ద బలం. ఝాన్సీలాంటి ఆరితేరిన నటి దగ్గరనుంచీ బావా బావా అంటూ మల్లేశం చుట్టూ తిరిగే భార్య పద్మగా చేసిన అనన్య వరకూ ప్రతిఒక్కరూ ‘మల్లేశం’కు బలమైన కోటలా నిలిచారు.

దూరంగా వున్న జాజితీగ నుంచి మెల్లగా తేలుతూ వచ్చే పూలవాసనలా వుంటుంది ఇందులో భార్యాభర్తల మధ్య రొమాన్స్. మల్లేశానికి తల్లితో వున్న అనుబంధం కొన్ని సీన్లలో నేతచీరమీది అందమైన డిజైన్ లా ఎంతో చక్కగా వచ్చింది. తండ్రి చదువు మానేయమన్నప్పుడు కోపం తెచ్చుకున్న ఈ పిల్లవాడిని సముదాయించి, దారం పోగులను కలిపి చుడుతూ ఏ పనీ కష్టం కాదనీ, చిన్నచిన్న భాగాలుగా విడగొట్టి పని చేస్తే అయిపోతుందనీ సున్నితంగా నేర్పిన తల్లి మాటల్లోనూ, మిషన్ తయారయిందని మల్లేశం మురిసిపోతుంటే ‘ఇలా కాదు బావా, ఇది ఎనిమిది లాగా రావాలం’టూ  భర్త ఆనందాన్ని చెడగొడుతున్నాననే భావంతో బెదురుగా మాట్లాడే భార్య స్వరంలోనూ సున్నితత్వం, ఆర్ద్రత నిండుగావుంటాయి. పెండ్లయిన దంపతుల చేత గడప దగ్గర పేర్లు చెప్పించే దృశ్యం కూడా నిండుగా వుంటుంది.   మల్లేశం నాయనగా వేసిన చక్రపాణి నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పిల్లవాడి మీద ప్రేమనూ కోపాన్నీ అథారిటీనీ అచ్చమైన ఇంటిపెద్దలాగానే చూపిస్తాడు. మల్లేశం తల్లి, భార్య ఇద్దరూ మంచితనం, వ్యక్తిత్వం, తెలివీ వున్న ఆడవాళ్లు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణా నేలమీద కురిసిన మృగశిర కార్తె మట్టి పరిమళం ‘మల్లేశం.’

లోపాలెన్నటం అని కాదుగానీ, సంస్కృతిని చూపించటంలో కొంత ఆశ ఎక్కువైందేమో అనిపించింది. పీర్ల పండుగలో వేషం, గంగిరెడ్లు, పటం కథ … ఇవన్నీ పెట్టినా వీటిని ఆర్గానిక్ గా ముందూ వెనకా వచ్చే షాట్లతో కలగలపటం సరిగ్గా కుదిరినట్టు లేదు. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా సాగాలనే ఉద్దేశ్యంతో ప్రతి సీన్ కూ ఇంత సమయం మాత్రమే కేటాయించాలని లెక్కలు వేసుకున్నట్టుగా వుంది. దీనివల్ల  ప్రతి అనుభూతీ కత్తిరించినట్టు అయిపోతుంది. ఇంత చక్కని ఎమోషనల్ డ్రామా మరీ నెమ్మదిగా కాకున్నా మధ్యలయలో వుంటే మనసు నిండుగా ఇంకిపోయే అవకాశం ఎక్కువ వుంటుంది. బాలూ కామెరా పనితనం బాగున్నా వాతావరణాన్ని ఎస్టాబ్లిష్ చేయటంలో బడ్జెట్ పరిమితుల మధ్య పనిచేసినట్టు తెలుస్తుంది. ఆసు మిషన్లో ఎనిమిది ఆకారంలో దారం తిరగటం మనకు పూర్తిగా చక్కగా ఎక్కడా కనబడదు. చిన్నతనం నుంచీ తల్లికి ఆసుపోయటంలో సాయం చేసిన మల్లేశానికి ఎనిమిది ఆకారంలో పోయటం గురించి భార్య గుర్తు చేయాల్సి రావటం వంటి స్క్రిప్ట్ లోని చిన్నలోపాలు సరిదిద్దుకోదగినవే. అయితే ఇంత మాత్రాన సినిమాకున్న అందం తగ్గినట్టేమీ కాదు.

సినిమాలో సింక్ సౌండ్ చక్కగానే కుదిరింది. కానీ సౌండ్ డిజైనింగ్ లో తెలుగువాళ్లు ఎప్పటికీ కొత్తదనాన్ని, సృజనాత్మకతనూ తీసుకురాలేరా అని నిరాశ కలుగుతుంది. ఏ తెలుగు సినిమా అయినా అంతే. ఒకే ఒక్క మినహాయింపు ‘అర్జున్ రెడ్డి.’ ఆ సినిమా సౌండ్ డిజైన్ చూసి కూడా తెలుగు సినిమాలు తీసేవాళ్లు ఏమీ నేర్చుకోలేరా?

తెలంగాణా పల్లెలనూ ల్యాండ్ స్కేప్ నూ మొదటిగా చాలా చక్కగా చూపించినది శ్యాంబెనెగల్. అన్నట్టు శ్యాంబెనెగల్ ‘సుస్మన్’ సినిమా కూడా పోచంపల్లి నేతపనివారి గురించి తీసినదే. ఆయన తీసిన అంకుర్, నిశాంత్, మండీ సినిమాల్లో దక్కను పీఠభూమి రాళ్ల అందాలు స్పెషల్ గా కనిపిస్తాయి. ఇప్పుడు రాళ్లన్నీ కరిగిపోవటంతో ఇక్కడి లాండ్ స్కేప్ మైనింగ్ రాక్షసులు ఇస్త్రీ చేసినట్టుగా వుంది. ఆ సినిమాలలోని దృశ్యాలు గతకాలానికి ఆనవాళ్లు. ఇప్పుడు ‘మల్లేశం’ శక్తిమేరకు పందొమ్మిది వందల ఎనభై, తొంభైల్లో నేతపనివారి ఇండ్లలోని తెలంగాణా సంస్కృతిని రికార్డ్ చేసింది. తరువాతి తరాలకు ఇటువంటి సినిమాలు రెఫెరెన్సులుగా కూడా పనికొస్తాయి.

సినిమా ఫాస్ట్ పేస్ లో నోస్టాల్జిక్ గా ఉండటమే కాకుండా తెలంగాణా సంస్కృతి పట్ల గౌరవం, ఆత్మగౌరవం రాష్ట్రం విడిపోయిన ఐదేళ్ళ తరువాత కూడా ప్రజల్లో బాగా అలుముకొని వుండటమనే మరో కారణం వల్ల కూడా  ‘మల్లేశం’ సినిమా ఇక్కడ ఘన విజయం సాధిస్తుందని నమ్మకంగా వుంది. ఆంధ్రా నుంచి ‘C/O కంచరపాలెం’ తరువాత మంచి సినిమాలు ఇంకా రావాల్సివున్నాయి. మొత్తానికి తెలుగు సినిమా సాంస్కృతికంగా  ముందడుగు వేస్తోందనే సంతృప్తిని కలిగిస్తుంది ‘మల్లేశం.’

*

 

 

ల.లి.త

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బయోపిక్, భయోపిక్ ల మధ్య ఉండే తేడాలను వత్తి చెప్పారు. ఇప్పుడు వస్తున్న తెలుగు సినిమాలంటే భయపడే నా బోటి వారికి కూడా ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలనే ఆసక్తిని కలిగించింది మీ సమీక్ష. ధన్యవాదాలు. ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యులైన మిత్రులు పెద్దింటి అశోక్, వెంకట్ సిద్ లకు అభినందనలు.

  • Beautiful piece of writing….the emotional arc of the characters , the aesthetic merits and flaws in filmic narration and it’s success in giving a satisfying experience are explained in a evocative way.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు