అనిసెట్టి సుబ్బారావు నా కవితా గురువు : రెంటాల

ప్రముఖ అభ్యుదయ కవి గా, నిబద్ధత గల పాత్రికేయులు గా , నవలా రచయిత గా , నాటక రచయిత గా , సినీ సమీక్షకులు గా , శతాధిక గ్రంథకర్త గా రెంటాల గోపాలకృష్ణ వారి కృషి బహుముఖాలుగా సాగింది. నేను అనిశెట్టి సాహిత్యం పై పరిశోధించే సందర్భంగా (12-06-1984, 10-6-1987) విజయవాడ లో రెండు సార్లు ఆయనను కలిసి అనిసెట్టి సాహిత్యం పై , అనిసెట్టి తో ఆయన అనుబంధాన్ని గూర్చి, అప్పటి “ నవ్య కళా పరిషత్”, “ నయాగరా “ కవితా సంపుటి ని గురించి ఎన్నో  విషయాలు చర్చించాను. వాటికి సమాధానాలు గా ఆయన చెప్పిన విశేషాలను వివరించడమే ప్రస్తుత వ్యాస ముఖ్యోద్దేశ్యం.

ప్ర: మీ బాల్యం, విద్యాభ్యాసాన్ని గూర్చి చెప్పండి?

రెంటాల : నేను సెప్టెంబర్ 5, 1920 లో నరసరావు పేట సమీపం లో ఉన్న రెంటాల గ్రామం లో పండిత కుటుంబం లో జన్మించాను. హైస్కూలు విద్యాభ్యాసం నరసరావు పేట మున్సిపల్ ఉన్నత పాఠశాల లో 1932 నుంచి 37 వరకు సాగింది. తర్వాత గుంటూరు ఏ. సి. కళాశాల నుంచి బి. ఏ. ( తెలుగు సాహిత్య ప్రధానాంశం గా) 1941 లో డిగ్రీ పొందాను.

ప్ర: అనిసెట్టి గారితో మీ అనుబంధాన్ని చెప్పండి?

రెంటాల: అనిసెట్టి  నా బాల్య మిత్రుడు. హైస్కూలు లో నా సహాధ్యాయి. 1932 నుండి 1937 వరకు నరసరావు పేట మునిసిపల్ ఉన్నత పాఠశాల లో అనిసెట్టి , కుందుర్తి, మాచిరాజు  దేవీప్రసాద్, తదితరులు నా సహాధ్యాయులు. ఏల్చూరి సుబ్రహ్మణ్యం మా సీనియర్ విద్యార్ధి . ప్రముఖ భావ కవి నాయని సుబ్బారావు చరిత్ర ఉపాధ్యాయులు. ఆయన సాన్నిహిత్యం తో నేను ఛందస్సు  పై మమకారంతో విశేష వృత్తాలు, గీత పద్యాలు రాసే వాణ్ణి. అనిసెట్టి  కూడా తొలి రోజుల్లో ఛందో బద్ధమైన కవిత్వం రాసేవాడు. అది అచ్చయిన దాఖలాలు లేవు.

ప్ర: మీ రచనా వ్యాసంగం ఎప్పటి నుంచి ప్రారంభమైంది?

రెంటాల: హైస్కూల్లో చదివే రోజుల్లో 1936 లో “ రాజ్యశ్రీ” అనే చారిత్రక నవల రాశాను. దానికి ప్రముఖ చరిత్రకారులు, అధ్యాపకులైన శ్రీ మారేమండ రామారావు ముందు మాట రాసి ప్రశంసా స్పోరక అభినందనలు తెలిపారు. 1939 లో మిత్రుల సహకారం తో ఆ నవల ను ప్రచురించాను. దానికి మంచి పేరు వచ్చింది.

ప్ర: అనిసెట్టి , మీరూ ఆధునిక దృక్పథం వైపు మరలడానికి ప్రేరకులు ఎవరు?

రెంటాల : శిష్ట్లా, శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణ బాబుల ప్రేరణలు, ప్రభావాలతో మా సాహితీ పయనం అభ్యుదయ పథం వైపు మళ్ళింది. నరసరావు పేట కేంద్రం గా ఏల్చూరి సుబ్రహ్మణ్యం అధ్యక్షులు గా, అనిసెట్టి సుబ్బారావు ప్రధాన కార్యదర్శిగా 1942 లో ‘ నవ్య కళా పరిషత్’ ప్రారంభమైంది. అందులో నేను, బెల్లంకొండ రామదాసు, గంగినేని సభ్యులుగా ఉన్నాం. దేవరకొండ బాలగంగాధర తిలక్ కూడా సభ్యుడిగా చేరాడు. 1943 లో తెనాలి లో తాపీ ధర్మారావు అధ్యక్షతన జరిగిన తొలి అభ్యుదయ రచయితల మహాసభల సందర్భంగా నవ్య కళా పరిషత్ లో అభ్యుదయ దృక్పథం ఉన్న సభ్యులంతా అందులో చేరాం. అనిసెట్టి , నేనూ కార్యవర్గ సభ్యులుగా పని చేశాము.

ప్ర: ‘ నయాగరా’ కవితా సంపుటి ని గురించి చెప్పండి?

రెంటాల : 1943 లో అరసం ఆవిర్భావం తర్వాత ఏల్చూరి, కుందుర్తి, బెల్లంకొండ రాసిన 12 కవితల తో నవ్య కళా పరిషత్ ఆధ్వర్యం లో 1944 లో అభ్యుదయ కవితా ఉద్యమానికి మేనిఫెస్టో గా ప్రసిద్ధమైన తొలి అభ్యుదయ కవితా సంపుటి ‘ నయాగరా’ ప్రచురించారు. ఆ సంపుటి ప్రచురణ లో నేను సహాయకుడిగా సహకారం అందించాను. 1945లో అనిసెట్టి  పెళ్లి సందర్భంగా ‘ నయాగరా’ కవితా సంపుటి ని అనిసెట్టి  దంపతులకు అంకిత మిచ్చాము .

ప్ర: మీ రచనల పై ఎవరి ప్రభావం ఉంది ?

రెంటాల : అనిసెట్టి  నా కవితా గురువు. నా రచనలు ‘ సంఘర్షణ’, ‘ సర్పయాగం’ వంటి అభ్యుదయ కవితా సంపుటులపై శిష్ట్లా , శ్రీశ్రీ, అనిసెట్టి, నారాయణ బాబుల ప్రభావం ఉంది.  నా ‘ హిరోషిమా’ కవిత ను అనిసెట్టి ‘ అణు సంగీతం’ (1945) కవితా ఖండిక ప్రభావం తో రాశాను. దాన్ని శ్రీశ్రీ  1952 లో ఇంగ్లీష్ లోకి అనువదించి విజయవాడ లో జపాన్ సాంస్కృతిక బృందం ఎదుట చదివి వినిపించి నన్ను అభినందించాడు.

‘ మూడో యుద్ధం,’ ‘ ఆటంబాంబు’ వంటి మూకాభినయాలు ( ఫాంటో మైమ్స్) అనిసెట్టి తొలి మూకాభినయం ‘ శాంతి’ ప్రభావంతో రాశాను.

ప్ర: మీ పాత్రికేయ జీవితాన్ని గూర్చి చెప్పండి?

రెంటాల : విద్యార్ధి దశ నుంచి ‘ పాత్రికేయ వృత్తి ‘ పట్ల ఉన్న అభినివేశం తో ప్రభుత్వ రైల్వే ఉద్యోగాన్ని వదులుకున్నాను. బి. ఏ. పూర్తి అయిన వెంటనె 1942 లో గుంటూరు నుంచి  చల్లా జగన్నాథం గారి సంపాదకత్వం లో నిర్వహించే ‘ దేశాభిమాని’ పత్రిక లో కొన్నాళ్ళు పని చేశాను. తర్వాత కొంత కాలం చదలవాడ పిచ్చయ్య గారి సంపాదకత్వం లో వచ్చే ‘ నవభారతి’ పత్రిక లో పని చేశాను. 1960 నుండి నీలంరాజు వెంకట శేషయ్య గారి సంపాదకత్వం లో వచ్చే ‘ ఆంధ్రప్రభ’ దిన పత్రిక లో నేనూ, అవసరాల సూర్యారావు, బెల్లంకొండ రామదాసు లతో పాటు సంపాదక మండలి సభ్యుడు గా చేరాను. అందులో వివిధ స్థాయిల్లో ఉప సంపాదకుడిగా , చిత్రప్రభ సంపాదకుడి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. కొత్త సినిమాలకు ఆసక్తికరమైన, ఔచిత్యమైన సమీక్షలు  రాసి  పాఠకుల అభిమాన సినీ విమర్శకుడిగా పేరు తెచ్చుకున్నాను.

ప్ర: అనిసెట్టి సినీ రంగ ప్రవేశాన్ని గూర్చి చెప్పండి?

రెంటాల : 1948 ప్రాంతం లో ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీ పై, అ. ర. సం. పై నిషేధం విధించటం తో అ. ర. సం. సభ్యులంతా అండర్గ్రౌండ్ కి వెళ్లారు. జీవనోపాధి కోసం అనిసెట్టి, ఆరుద్ర, శ్రీశ్రీ లు సినీ రంగాన్ని ఆశ్రయించారు. అనిసెట్టి 1952లో ‘ గిడుతూరి సూర్యం’ ప్రోత్సాహం తో ‘ ప్రియురాలు’ చిత్రం లో మొత్తం 15 పాటలు రాసి సినీ ప్రేక్షకుల మెప్పు పొందాడు. దాదాపు 50 సినిమాలకు పాటలు రాశాడు. కొన్ని సినిమాలకు కథ, మాటలు కూడా రాశాడు. పినిసెట్టి తో కలిసి కొన్ని సినిమాలకు మాటలు రాశాడు. దాదాపు 30 డబ్బింగ్ సినిమాలకు సంభాషణ లు రాశాడు. సినీ రచయిత గా ప్రసిద్ధుడయ్యాడు.

ప్ర: అనిసెట్టి సంపాదకత్వం లో వచ్చిన ‘ కల్పన’ కవితా సంకలనం గురించి చెప్పండి?

రెంటాల : అనిసెట్టి సంపాదకత్వం లో 1953 లో ‘ కల్పన’ కవితా సంకలనం వచ్చింది. అందులో నేను, బెల్లంకొండ రామదాసు, అవసరాల సూర్యారావు సంకలన కర్తలుగా ఉన్నాము. మా కవితల తో పాటు 55 మంది ఆధునిక యువ కవుల కవితలు అందులో ఉన్నాయి. ఈ సంకలనాన్ని గంగినేని వేంకటేశ్వర రావు పెళ్లి సందర్భంగా అంకితం చేశాము.

ప్ర: అభ్యుదయ కవితా ఉద్యమం లో భాగం గా నిజాం నవాబు నిరంకుశ చర్యలను నిరసిస్తూ వచ్చిన కవితా సంపుటాల వివరాలను చెప్పండి?

రెంటాల : తెలంగాణ ఉద్యమం లో నిజాం నిరంకుశ చర్యలను నిరసిస్తూ కాళోజీ, దాశరధి, వట్టికోట ఆలవారు స్వామి వంటి తెలంగాణ ప్రాంత కవులు ఉద్యమంలో  ప్రత్యక్షం గా పాల్గొని తమ కవితాల తో ప్రజలను ప్రేరేపించి జైలు జీవితాన్ని అనుభవించారు. నవాబు దారుణాలను నిరసిస్తూ పరోక్షం గా , ఉద్యమం లో పాల్గొనకుండా , ఆంధ్ర ప్రాంత అభ్యుదయ కవులు సోమసుందర్ ‘ వజ్రాయుధం’, ఆరుద్ర ‘ త్వమేవాహం’, అనిసెట్టి ‘ అగ్నివీణ’, గంగినేని ‘ ఉదయిని’,  నేను రాసిన ‘ సంఘర్షణ, సర్పయాగం వంటి కవితా సంపుటాల్లో నిజాం నిరంకుశ చర్యలను నిరసిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని రేకెత్తించాయి. అభ్యుదయ కవితా లక్షణాల్లో ఒకటైన వీరావేశ విప్లవ ప్రబోధం నేను రాసిన ‘ సమర గీతం’ ఖండిక లో పుష్కలం గా ఉంది.

“ పగలేయ్  నిజాం కోట / ఎగరేయ్  ఎర్ర బావుటా

పగబట్టే త్రాచు లా / పసి గట్టి రేచు లా

చిటపట ధ్వనులతో / పట  పటార్భలతో

పగ వాడి వెన్ను లో /  బల్లెయులు పొడవండి

అభిమాన్యులై / పద్మ వ్యూహాలు చీల్చండీ “

శ్రీశ్రీ ప్రభావం ఈ కవిత పై గాఢం గా ఉందని విమర్శకులు ప్రశంచించారు.

ప్ర: అభ్యుదయ కవులందరి లో ఉన్న ‘ యుద్ధ విముఖత- శాంతి కాముకత ‘ మీ కవిత్వం లో, అనిసెట్టి కవిత్వం లో ఎక్కువగా కనిపిస్తుంది. మీ మీద ఎవరి ప్రభావం వల్ల గాంధేయ భావాలు వచ్చాయి?

రెంటాల : అనిసెట్టి పై, నా పై గాంధేయ ప్రభావం ఉండటానికి ప్రేరణ త్రివేణి సంపాదకులు శ్రీ కోలవెన్ను రామ కోటేశ్వర రావు గారు. ఆయన ప్రభావం వల్ల మాకు గాంధేయ దృక్పథం అలవడింది. అందువల్ల మా కవిత్వం లో యుద్ధం పట్ల విముఖత, శాంతి భావన బాలీయంగా ఉంది. జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకీ ల పై అమెరికా బాంబులతో దారుణ మారణ కాండ సృష్టించిన సందర్భం లో 1945 ఆగస్టు లో తొలి సారిగా ఆ సంఘటన పై స్పందించి అనిసెట్టి “ అణుసంగీతం” దీర్ఘ కవిత రాశాడు. ఆ ప్రభావం తో నేను ‘ హిరోషిమా’ అనే ఖండికను రాశాను. దీనిపై ఇతర అభ్యుదయ కవుల కవితలేవీ లేవు. హిరోషిమా కవిత ను 1952 లో శ్రీశ్రీ ఇంగ్లీష్ లోకి అనువదించి జపాన్ శాంతి సంఘం వారి ముందు వినిపించి నన్ను అభినందించారు.

అభ్యుదయ కవితా ఉద్యమం లో ప్రసిద్ధమైన రెంటాల ‘ సంఘర్షణ’ కావ్యానికి శ్రీరంగం నారాయణ బాబు ‘ ప్రవర’ పేరుతో రాసిన పీఠిక లో “ ఈ తరం లో గోపాలకృష్ణ ప్రతిభావంతమైన కవి. సంఘర్షణ అనే కావ్యం చక్కగా రచించాడు. భాషా ప్రయోగం లో ఛందస్సు ల పోకడ లో, ఒక వింత గమనం, ఉద్వేగం, భావ ఔన్నత్యం కనబడతాయి” అని ప్రశంసించాడు.

రెంటాల ‘ సర్పయాగం’ కావ్యాన్ని గురించి ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు ‘ అభ్యుదయ కవిత్వం లో ప్రసిద్ధమైన రెంటాల ‘ సర్పయాగం’ లో గీతాల మహాప్రస్తానం గీతాలకు సన్నిహితాలు. సన్నిహితత్వం, అనుసరణ కాదని గ్రహించాలి” అన్నారు. అందులో —

“ అవతరిస్తాను నేను/ ఆకలి ప్రాణుల నోట

అవతరిస్తాను నేను / అన్యాయం ఉన్నచోట

అన్యాయాన్ని ఎదిరించి ఆకలి బాధలు తీర్చడమే అసలు సిసలైన అభ్యుదయ కవి గా తన లక్ష్యాన్ని ప్రకటించడం హర్షణీయం.

ప్రముఖ కవి , విమర్శకులు డా . అద్దేపల్లి రామమోహన రావు “ ప్రజోద్యమ కవిత్వానికి అపూర్వమైన ధైర్యం తో కూడిన ఆవేశం, మూలశక్తి రెంటాల కవిత్వం లో ప్రతి అక్షరం లో కనిపిస్తుంది. ఆయన కవిత్వం లో లయ అంతా దీని కనుగుణంగా ప్రవహిస్తుంది” అని అక్షర సత్యం గా వ్యాఖ్యానించారు.

రెంటాల గోపాల కృష్ణ  ప్రముఖ అభ్యుదయ కవిత గా, నిబద్ధత గల పాత్రికేయుడి గా, నవలా రచయిత గా, శతాధిక వైవిద్య భరిత మైన అనువాద గ్రంధ కర్త గా చిరస్మరణీయుడు. ఆధునిక రచయితలకు అనుసరణీయులు.

(బహుముఖ ప్రజ్ఞా శాలి రెంటాల గోపాలకృష్ణ గారి శత జయంతి సందర్భంగా  ఆయనతో జరిపిన ఇంటర్వ్యూలు ఆధారంగా వ్రాసిన ప్రత్యేక వ్యాసం )

*

డాక్టర్ పి.వి. సుబ్బారావు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు