1968వ సంవత్సరంలో బహుశా ఆగస్ట్ లో అనుకుంటాను…నేను మా గురువు గారు సుబీర్ కార్ గారి దగ్గర డాక్టరేట్ కోసం నెలకి 400 రూపాయల ఉపకార వేతనంతో రిసెర్చ్ స్కాలర్ గా చేరి హాస్టల్ వన్ లోనే బ్రహ్మచారిగా కొనసాగుతూ ఉండగా, అప్పటి దాకా నా సహాధ్యాయి అయిన బి. వై. మూర్తి లెక్చరర్ గా చేరి భార్య శారదతో కాపురం పెట్టి స్టాఫ్ క్వార్టర్స్ లో ఓ ఇంట్లోకి మకాం మార్చాడు. అంతే కాదు, హైదరాబాద్ నుంచి అక్కడ ఉండే తన మోరిస్ మైనర్ కారు కూడా తెచ్సుకోడంతో కేంపస్ లో అతని పరపతి భలే పెరిగిపోయింది. ఎందుకంటే, ఆ రోజుల్లో మొత్తం ఐఐటి కేంపస్ లో మా డైరెక్టర్ ఎస్. కె. బోస్ గారిదీ, మా గురువు గారి లాండ్ మాస్టర్ తో కలిపి మహా అయితే ఐదారుగురికే కార్లు, అర డజను స్కూటర్లు ఉండేవి. సైకిళ్ళు తక్కువే. ఎందుకంటే అంతా ఎగుడు దిగుడు కొండల మయమే. అంచేత కుర్రాళ్ళ దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ నడకకే ప్రాధాన్యత ఇచ్చే వారు. పైగా నిరంతరం బొంబాయి వానలతో గొడుగు తప్పని సరి.
మూర్తి మోరిస్ మైనర్ కారుని మొదటి సారి హైదరాబాద్ నుంచి బొంబాయి ‘తోలుకుని’ వచ్చినప్పటి నుంచీ ఆ తరువాత ఐదారేళ్ళ దాకా కేంపస్ లోనే కాక మళ్ళీ ఎప్పుడు అందులో హైదరాబాద్ వెళ్లి వచ్చినా డ్రైవర్ గా మూర్తి అయితే మనది క్లీనర్ ఉద్యోగమే! మాతో పాటు సాయి దాసు, పుల్లెల సోమయాజులు గాడు కూడా వచ్చేవారు. ఎందుకంటే… కేంపస్ లో ఉండే ఎత్తు పల్లాలకే ఆ కారు విల విల లాడిపోయేది. ఇక ఆ చిన్న కారు డిక్కీలో రెండు, మూడు పెట్టెలు పెట్టగానే అంతే సంగతులు. పైగా ఇక హైదారాబాద్ దారిలో లోనావాలా, పూనా ఘాట్ రోడ్ లో కొండల మీద ఆ కారుకి వచ్చిన ఏకైక విద్య ఘాట్టిగా అరుస్తూ, ఏడుస్తూ పొగలు కక్కుకుంటూ చతికిల పడిపోవడమే. అప్పుడు మూర్తి ధనలక్ష్మీ లారీ సర్వీస్ వాళ్ళ డ్రైవర్ లా ఆ సీట్లో కూచుని స్టీరింగ్ జాగ్రత్తగా పట్టుకుని ఆ కారు కొండ మీద నుంచి కింద లోయలోకి పడకుండా చూసుకుంటూ ఉంటే, ఆ వాహనాన్ని అంగుళాల లెక్కన తోసే డ్యూటీ మా ముగ్గురిదీ అన మాట. అయినా చచ్చేంత జోకులు వేసుకుంటూ, చెమట్లు కక్కు కుంటూ, మూర్తినీ, వాడి కారునీ అడ్డమైన తిట్లూ తిట్టుకుంటూ, సుమారు రోజున్నర ఆ చిన్న కారులో ప్రయాణం చేసే వాళ్ళం. అవన్నీ తలచుకుంటే ఇప్పుడు కూడా ఆశ్చర్యం, నవ్వూ వస్తాయి. ఒక సారి ఈ తతంగం తో పాటు కారు టైర్ కూడా పంచర్ అయినప్పుడు..ఓరి నాయనోయ్…ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని, చేంతాడు తో డిక్కీలో కట్టిన ఆ వెధవ పెట్టెలు రోడ్డు మీద పెట్టి, అట్టడుగున ఉన్న స్టెఫెనీ…అంటే అమెరికాలో స్పేర్ టైర్..అనమాట…దాన్ని తీసి పంచర్ అయిన టైర్ తీసి దీన్ని బిగించినప్పుడు అందరం తిరుపతి వేంకటేశ్వర స్వామికి విడి విడి గానూ, హైదరాబాద్ లో చిక్కడ్ పల్లి హనుమాన్ స్వామికి మూకుమ్మడి గానూ మొక్కుకుని, హైదరాబాద్ చేరగానే తిన్నగా అక్కడికే వెళ్ళి మొక్కు తీర్చుకున్నాం. బాలాజీ మాట అందరం మర్చిపోయాం అని జ్ఞాపకం.
అయితే మేము ఇంకా మాస్టర్స్ డిగ్రీ లో ఉండేటప్పుడు నేనూ, రావూ, మూర్తీ శలవులకి పెద్ద గొప్పగా ఒకటి, రెండు సార్లు బొంబాయి నుంచి హైదరాబాద్ విమానం లో వెళ్లాం. ఎందుకంటే అప్పుడు విద్యార్ధులకి విమానం టికెట్ కి కన్సెషన్ ఇచ్చే వారు. ఇప్పుడు సరిగ్గా జ్ఞాపకం లేదు కానీ అప్పుడు రైలు టికెట్టు 30 రూపాయలు ఉంటే కన్సెషన్ లో విమానం టికెట్ 100 రూపాయలు ఉండేది. ఒకటి నేల మీద 18 గంటల ప్రయాణం. రెండోది గాలిలో గంటన్నర. ఆ విధంగా నా జన్మలో మొట్ట మొదటి విమాన ప్రయాణం 1968 లో మాస్టర్స్ డిగ్రీలో ఉండగా జరిగింది. ఇప్పుడు ఏడాది తిరగని మా మనవరాలు విమానాలలో నాలుగు ఖండాలు చుట్టి తిరిగింది. ఇప్పటి వాటిల్తో పోలిస్తే అప్పటి బొంబాయిలో శాంతాక్రుజ్, హైదరాబాద్ లో బేగం పేట విమానాశ్రయాలు అగ్గి పెట్టెలు లా ఉండేవి. ఒక సారి సాయి దాసు కూడా విమానం లో వస్తాను అని పేచీ పెట్టాడు. కానీ వాడు ఐఐటి స్టూడెంట్ కాదు కాబట్టి, ఏదో తొండి చేసి C.R. Vanguri అని నా పేరు మీదనే రెండు కన్సెషన్స్ సంపాదించి, వాటిల్లో ఒక దాంట్లో దాన్ని E.R. Kangari అని పెన్నుతో మార్చి పారేసి వాడికి టికెట్టు కొనేశాం. ఆ రోజుల్లో అన్నీ పేపర్ టికెట్లే కాక విమానాశ్రయంలో నువ్వు నువ్వేనా అని పాస్ పోర్ట్ లు, స్టూడెంట్ ID లు చూపించుకునే అవసరం ఉండేది కాదు. ఆ మాట కొస్తే ఒక్క లైబ్రరీ కార్డు తప్ప వేరే స్టూడెంట్ ID నాకు ఉన్న జ్ఞాపకం లేదు.
ఆ రోజుల్లోనే నా మరో ఆప్త మిత్రుడు చందూకి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. వాళ్ళది బొంబాయే. ఆ అమ్మాయి పేరు రాధ. బొంబాయే కాబట్టి చందూ గాడు ఆ అమ్మాయిని రెండు, మూడు సార్లు కలుసుకుని ఒక రోజు నా గది కి వచ్చి సంగతి చెప్పి “ఒరేయ్. నువ్వు కూడా ఆ అమ్మాయి తో మాట్లాడి ఓకే చేస్తే తప్ప కుదరదు” అన్నాడు ఇంచు మించు ఆ ధోరణి లో. సరే అని దానికి ఒక ప్లాన్ వేశాం. రాధ పని చేసేది కొలాబా ప్రాంతంలో. ఉండేది దాదర్ లో. అంటే బొంబాయి దక్షిణ కొస నుంచి నగరం మధ్య దాకా రైల్లో సుమారు అరగంట. కానీ అదే బస్సులో అయితే నాలుగు గంటలు. అంచేత ఒక రోజు రాధ ఉద్యోగం అవగానే తనూ, నేనూ బస్సులో కొలాబా నుంచి దాదర్ దాకా ప్రయాణం చేస్తే ఆ నాలుగు గంటలూ డబుల్ డెక్కర్ బస్సులో పైన కూచుని ఇద్దరం మాట్లాడుకోవచ్చుగా అనేదే మా ప్లాన్. దానికి ఆ అమ్మాయి కూడా ఒప్పుకోగా అనుకున్నట్టు గానే ఇద్దరం నాలుగైదు గంటలు కబుర్లు చెప్పుకున్నాం. తీరా చూస్తే ఆ రాధ ఎవరో కాదు. మా కాకినాడలో మా కుటుంబ స్నేహితులూ, మా చిన్నన్నయ్య కి తోటి అడ్వొకేట్ అయిన వంకా కృష్ణ బ్రహ్మం గారికి స్వయానా మరదలే. మొత్తానికి అన్నీ సవ్యంగా జరిగి చందూ పెళ్లి రాధ తో బొంబాయి మాటుంగా లో అంధ్ర మహా సభ ప్రాంగణంలో జరిగింది. దానికి నేనూ, కిశోరూ వెళ్లాం. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కాపురం పెట్టడానికి ఐఐటి ఎదురుగుండా ఒక ఫ్లాట్ , దాంట్లో వంట సామానూ, ఫర్నిచరూ మొదలైనవి సమకూర్చడానికి పాపాల భైరవుడు లాంటి మా సాయిదాసు ఉండనే ఉన్నాడు. ఆ తరువాత చందూ డాక్టరేట్ పూర్తి చేసి, ఏరోనాటిక్స్ లో లెక్చరర్ గా చేరి, “జేసీ” గా మంచి పేరు తెచ్చుకుని హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ గా ఐఐటి నుంచి రిటైర్ అయి ప్రస్తుతం కోయంబత్తూర్ లో ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రొఫసర్ గా నివశిస్తున్నాడు. చాలా ఏళ్ల తరవాత ఫేస్ బుక్ లో కలవగా రెండు నెలల క్రితమే మాట్లాడాను. అతని పెద్ద కూతురు జ్యోతి ఐఐటి లో నేను ఉన్నప్పుడే పుట్టింది. తర్వాత వాళ్ళు నాకు తెలియదు.
ఇక నాకే కాదు. అసలు ఎవరికైనా డాక్టరేట్ చేసి అవతల పారేద్దాం అనే అనుకుంటే ఎదురయ్యే మొదటి ప్రశ్న ఏ అంశం మీద పరిశోధన చెయ్యాలీ అనేదే. అంటే అప్పటి దాకా పరిష్కారం లేని, ఉన్నా వాటికంటే మెరుగైన విధంగానో పరిష్కారాలు కనుక్కోడానికి లోతుగా అధ్యయనం చెయ్యడానికీ, పరిశోధనాకీ అనువుగా ఉండే ఒక సమస్యని కానీ సమస్యా సముహాన్నీ నిర్ణయించుకోవడమే అత్యంత ప్రధానమైన సమస్య. ఒక సారి అది నిర్ధారణ అయ్యాక, ఇక చెయ్యవలసినదల్లా పరిశోధన ప్రణాళిక సిద్దం చేసుకుని నాలుగైదేళ్ళ లో పూర్తి చెయ్యడమే. ఇక్కడ నాకు వచ్చిన సమస్య ఏమిటంత మా గురువు గారు మొదటి రోజునే “నా దగ్గర నీ పరిశోధనకి కావలసిన అంశాలు ఏమీ రెడీగా లేవు. అదంతా నువ్వే తంటాలు పడు. నువ్వు అడిగిన సహాయం చెయ్యడం, సలహా ఇవ్వడమే నా పని. మిగతా దంతా నీ పనే” అని ఎంతో నిజాయితీగా శుభ వార్త చెప్పాడు. అంచేత మా ఇద్దరికీ నా డాక్టరేట్ టాపిక్ ఏమిటో తేల్చుకోడానికి ఇంచుమించు ఏడాది పైనే పట్టింది అంటే ఇప్పుడు నాకే ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయంలో ఆప్త మిత్రుడైన శివరామ్ నాకే కాదు, మా గురువు గారి భార్య నీనా గారు అతడిని తన బెంగాలీ భాష లో “షీవ్ రామ్” అని పిలిచేది. అది మాకు “షేవ్ రామ్” అని వినపడి నవ్వుఉనే వాళ్ళం. మా డిపార్ట్ మెంట్ లో అందరికీ చేసిన సహాయం అంతా ఇంతా కాదు. అతను నాకు పియుసీ లో క్లాస్ మేట్ అయినా ఒక ఏడాది వెనకబడి కాకినాడ లో ఇంజనీరింగ్ లో నాకు జూనియర్ అయి, నేను ఐఐటి లో చేరగానే అక్కడ కూడా మా ఫ్లూయిడ్ పవర్ గ్రూప్ లోనే చేరాడు. అతను రోజూ గంటల కొద్దీ లైబ్రరీ లో గడిపి అమెరికాలో “ఫ్లూయిడిక్స్’ అనే సరి కొత్త టెక్నాలజీ వచ్చినట్టు కనిపెట్టి మా గురువు గారినీ, మమ్మల్నందరినీ ఆ టెక్నాలజీ కి పరిచయం చేశాడు.
టూకీగా చెప్పాలంటే…ఎలెక్ట్రానిక్స్ లో ఎలక్ట్రాన్స్ ఎటునుంచి ఎటువెళ్లాలో నియంత్రించడానికి ప్రత్యామ్నాయంగా వాయు, ద్రవ్య కణాలని నియంత్రించే టెక్నాలజీ ని ఫ్లూయిడిక్స్ అంటారు. అంటే ఎలెక్ట్రానిక్స్ లో కరెంట్ తో పని చేసే ఏంప్లిఫియర్స్, ట్రయోడ్స్ లాంటి పరికరాలు వాయువు కానీ, నీరు, ఆయిల్ లాంటి ద్రవ పదార్ధాలని వాడే పరికరాలు తయారు చేయడం. ఆశ్చర్యం ఏమిటంటే వీటికి కారణమైన రెండు ప్రధాన సూత్రాలు మనకి రోజూ అనుభవంలో ఉండేవే. ఒక ఉదాహరణ మన బాత్ రూమ్ లో క్రిందన ఉన్న చిన్న కన్నం లోంచి స్నానం చేసిన నీళ్ళు తిన్నగా వెళ్ళే బదులు గుండ్రంగా తిరుగుతూ వెళ్తాయి. అలా గుండ్రంగా తిరగడానికి కారణం ఏమిటి? అని తెలిస్తే ఆశ్చర్య పోతారు. కాస్త పక్కకి వంగిన ధృవం కేంద్రంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ వేగానికి ఉన్న సెంట్రిఫ్యూగల్ బలానికి స్నానాల గదిలో నీళ్ళు కూడా అదే దిశ లో తిరుగుతాయి. అయితే భూమధ్య రేఖకి ఉత్తరం వేపు ఉన్న వాటిల్లో ఒక రకంగానూ, దక్షిణం వేపు ఉన్న స్నానాల గదిలో దానికి వ్యతిరేక దిశలోనూ నీళ్ళు సుడిగుండం లా తిరుగుతాయి. దీన్ని కొరియాలసిస్ ఎఫెక్ట్ అంటారు. సాంకేతికంగా అనేక ఇతర కారణాలు కూడా చాలానే ఉన్నాయి.
ఇక రెండోది….ఒక చిన్న గొట్టాం లోంచి వేగంగా గాలి కానీ నీళ్ళు కానీ జెట్ వేగంతో దూసుకు వస్తున్నాయి అనుకోండి. ఆ జెట్ తిన్నగా కొన్ని అడుగుల దాకా జోరుగా పోయి అప్పుడు కిందకి వంగుతుంది. కానీ మనం ఆ గొట్టం మూతి దగ్గర కిందన నీళ్ళకి తగలకుండానే చెయ్యి పెట్టాం అనుకోండి. అప్పుడు ఆ జెట్ మన చేతి కేసి క్రిందకి వంగుతుంది. ఎందుకూ? 1936 లో దానికి కారణం కనిపెట్టిన శాత్రవేత్త పేరిట “కోయండా” ఎఫెక్ట్ అంటారు. ఇంతకీ దానికి కారణం ఏమిటంటే ఆ జెట్ క్రిందన మన చెయ్యి పెట్టగానే అక్కడ గాలి వత్తిడి ..అంటే ప్రెషర్ తగ్గుతుంది కానీ ఆ జెట్ కి పై భాగంలో ఉన్న ప్రెషర్ ఇది వరకటి అంతే ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఆ జెట్ ని క్రింద వేపు నెట్టుతుంది. ఇక్కడ ఆ కోయండా ఎఫెక్ట్ బొమ్మా, అది ఉపయోగించి తయారు చేస్తే ఫ్లూయిడిక్ ఏంప్లిఫయిర్ బొమ్మ ఒకటీ జతపరుస్తున్నాను….క్లారిటీ కోసం. నేను ఇంజనీరింగ్ విద్య మర్చిపోయి యాజమాన్యం ..అంటే మేనేజ్ మెంట్ కి “ప్రయాణం” చేసి ముఫై ఐదు ఏళ్ళు దాటింది కాబట్టి పై సాంకేతిక ఉదాహరణలలో తప్పులు ఉంటే నన్ను తప్పు పట్టకండి. అప్పుడప్పుడు అలా సాంకేతిక నిపుణుడిగానే స్థిరపడి ఉంటే ఏ నోబెల్ బహుమానం రాకపోవునా అనే అనుమానం , అపోహలు నన్ను పీడిస్తూ ఉంటాయి.
ఇంతకీ ఆ టెక్నాలజీ గురించి ఒక ఏడాది పాటు ప్రపంచం లో ఏ సాంకేతిక పత్రికలో ఎవరు ఏం ప్రచురించినా కంప్యూటర్లు, గూగుల్ లేని ఆ రోజుల్లో మా లైబ్రరీ కి తెప్పించుకుని, రాత్రి తెల్లవార్లూ చదివి, నోట్స్ రాసుకుని సిద్దాంతపరమైన సమస్యల కి ఒక రూపం, స్పష్టత తెచ్చుకోడానికి ఒక ఏడాది పట్టింది. ఇందులో సరదా ఏమిటంటే…కొత్త సబ్జెక్ట్ కాబట్టి ఇదంతా మా గురువు గారికి చాలా మటుకు “షీవ్ రామూ”, కొంచెం నేనూ చెప్పవలసి వచ్చేది. ఇక అసలు సిసలు పరిశోధన మొదలు పెట్టడానికి ప్రణాళిక సిద్దం చేసుకోడానికి తయారు చేసుకునే సమయంలో…నా జీవితం మరొక మలుపు తిరిగింది….దానికి ఒకానొక రెడ్డి గారితో ఘర్షణ ఒక చిన్న కారణం. రెండోది కలసివచ్చిన అవకాశం. ఆ విశేషాలు….మరొక సంచిక లో…
*
Add comment