అనగనగా ఒక “జతి స్వరం”

సత్యం ,శివం ,సుందరం ముప్పేటలుగా అల్లుకుని ఒకే ఒక పదంగా రూపు దిద్దుకుంటే ఆ పదం పేరు అమ్మ.

మ్మంటే ఒక మాట కాదు అమ్మంటే సత్యం అమ్మంటే రెండు అక్షరాల పదం కాదు అమ్మంటే శివం అమ్మంటే ఒక బాల్య జ్ఞాపకం కాదుఅమ్మంటే సుందరం అమ్మంటే సత్యం శివం సుందరం మనిషిలో అంతర్గతం గా ఉండే ఆలోచన ,ఇఛ్ఛ ,అనుభూతి శక్తులని భారతీయ తత్వ వేత్తలు లాక్షణికులు సత్యం ,శివం సుందరం అన్నారు ఈ సత్యం ,శివం ,సుందరం ముప్పేటలుగా అల్లుకుని ఒకే ఒక పదంగా రూపు దిద్దుకుంటే ఆ పదం పేరు అమ్మ.

మాతృ గర్భం లో ఉన్నప్పుడే అమ్మతో మొదలు అయ్యే అనుబంధం ఎప్పుడు అంతం అవుతుంది భౌతిక దృష్టికి అమ్మ మరణం తో అంతం అవుతుంది అనిపిస్తుంది కానీ అది జన్మాంత రాలపాటు కొనసాగుతుంది ఆ జ్ఞాపకం ఎప్పటికీ లయించదు భౌతిక ఆత్మిక సమస్యలనే దుస్తులమాటున అనామకంగా ఉండి పోయినా ఎప్పుడో ఒక పదమో ఒక పాటో ఒక దృశ్యమో ఒక భావమో దానిని మేలుకొలుపుతుంది అప్పుడిక మనం మనలా ఉండలేము మనలోపల ఒక కొత్త వెలుగు ఏదో ప్రసరిస్తుంది ఆ జతి స్వరం మనలోపల వేళ్లూనుకుంటుంది.

శ్రీ విరించి జతి స్వరం కథ లో వసుంధర కి అదే జరిగింది వసుంధర ది అందమైన సంసారం ముచ్చటైన పిల్లలు అంతకంటే ముచ్చటైన వుద్యోగం ఏ చిక్కులు చికాకులు లేని జీవితం ఒక రోజు ఆఫీస్ నుండి దగ్గరలోనే ఉన్న ఇంటికి నడుచుకుంటూ వస్తూండగా గాలి అలల లో నుండి ఒక పాట అలా అలా తేలి వచ్చి ఆమెను తాకుతుంది . “రార … వేణు .. గోప .. బాల ” అంటూ ఒక కెచ్చు గొంతు లో నుండి ఒక జతిస్వరం ఆమెను చేరుకుంటుంది ఆ స్వరం వినగానే వసుంధర మనసు ఎవరో ఒక రాయి విసిరితే అల్లకల్లోలమైన సరస్సులా మారుతుంది అలా నిల్చుండి పోతుంది ఆ జతిస్వరం వినిపించదు కానీ ఆ స్వరం తాలూకు ధ్వనులు బొంగరాలు తిరిగినట్టుగా మనసులో గిర్రున తిరుగుతుంటాయి కెరటాలు ఒక్కఉదుటున మీదకు దూకినట్టుగా మీదకు దూకుతాయి ఆమెకు ఏమి అవుతున్నదో ఆమెకే తెలియదు అడుగు ముందుకు పడదు కళ్ళ మీదకు రెప్ప వాలీ వాలనట్టుగా వాలబోతూ వుంది పదినిమిషాలు అలా గాలిలో తేలిపోతున్నట్టు అలాగే నిలబడి పోయింది

అటుగా వస్తున్న వెంకట రామయ్య అనే స్నేహితుడు ఆమెను చూసి సమ్ థింగ్ రాంగ్ అనుకుంటాడు ఆమెను పక్కనే ఉన్న రెస్టారెంట్ కి తీసుకెళ్లి కాఫీ ముందు మంచి నీళ్లతో మొహం కడుగుకోమని చెప్పి మంచి కాఫీ తాగిస్తాడు అప్పటికి కానీ ఆమె కుదుట పడదు ఇంటివరకు వెళ్లి ఆమెను పంపిస్తాడు విషయం తెలిసి భర్తా పిల్లలు అందరూ కంగారు పడతారు మరునాడు హాస్పిటల్ కి తీసుకుని వెళతారు డాక్టర్ చేయవలసిన పరీక్షలు అన్నీ చేసి ఏ ఇబ్బందులూ లేవని నిర్ధారణ చేస్తాడు అలా ఎందుకు జరిగిందో తనూ తేల్చుకోలేక కొన్ని ఐరన్ మాత్రలు ఒక టానిక్ రాసి పంపించేస్తాడు .

పదిహేను రోజుల తరువాత మళ్ళీ ఆఫీస్ కి వెళుతుంది వసుంధర సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అప్రయత్నం గా ఆ ఇంటి ముందు ఆగి పోతుంది ఆ ఇంటి నుండి విన వచ్చిన పాటే తనను నల్ల మందు తిన్న దానిలా తయారు చేసిందన్న విషయం గుర్తుకు వస్తుంది తల ఎత్తి ఆ ఇంటి వంక తేరిపార చూస్తుంది . “రార … వేణు .. గోప .. బాల ” పాట అయితే వినిపించడం లేదు కానీ ఆ ఇంటి బాల్కనీ మీదనుండి ఒక స్త్రీ ఆమె వంకే చూస్తూనిలబడి ఉంటుంది ఇద్దరి చూపులూ కలుసుకోగానే ఆమె స్నేహ పూర్వకంగా నవ్వి వసుంధరను పైకి ఆహ్వానిస్తుంది .

నా పేరు వసుంధర మనం ఇంతకుముందు ఎప్పుడూ కలుసుకున్నట్టు లేదు “. అంటుంది

ఆమె వసుంధర చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్లి నా పేరు కనకలత మనిద్దరమూ ఎప్పుడూ కలుసుకోలేదు కానీ మీరు నాకు బాగా తెలుసు రోజూ ఆఫీస్ కి మా ఇంటి ముందు నుండే వెళుతుంటారుగా రోజూ మిమ్మల్ని చూస్తూ వుంటాను నాలుగు,అయిదు రోజులుగా ఆఫిస్ కి వెళుతున్నట్టు లేదు ” అని ప్రశ్నిస్తుంది కనకలత

నాలుగు రోజులు కాదు పదిహేను రోజులు చెప్పండి నన్నెందుకు పిలిచారు ?” కొంచెం అనాసక్తి తో అడుగుతుంది వసుంధర

నేను వూరు నుండి తిరిగి వచ్చి నాలుగు రోజులే అయింది ఇవాళ నా యాభయ్యవ పుట్టినరోజు యాభై మంది కి తాంబూలాలు ఇచ్చుకోవాలి అనుకున్నాను .” అంటూ కనకలత ఒక వెండి పళ్లెం లో తాంబూలం కొబ్బరిబోండం రవిక రెండూతినుబండారాల ప్యాకెట్లు తెచ్చి ఇచ్చి కుంకుమ పెట్టి నమస్కరిస్తుంది .

ఇలాంటి సందర్భాలలో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అనే పట్టింపు ఆడ వాళ్లకు ఉండదు కనుక మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని ఆ తరువాత తెలుగులో పసుపుకుంకుమ ల తో కలకాలం వర్ధిల్లండిమీ ఆదరానికి థాంక్స్ అన్నది వసుంధర

రెండు నిమిషాల సంభాషణ తరువాత మీ ఇంట్లో సంగీతం సాధన చేసే పిల్లలు ఎవరైనా ఉన్నారా ? “అని ప్రశ్నించింది వసుంధర

మా ఇంట్లో పిల్లలు లేరండి ఏం అలా అడిగారు 

మీ ఇంట్లో నుండి పదిహేను రోజుల క్రితం విన్నాను ఎవరో సాధన చేయడం ” వసుంధర మాట పూర్తి కాకుండానే కనకలత అందుకుంది

నిజమేనండి మరచిపోయాను మా పెద్ద ఆడపడచు మనుమరాలు పదేళ్ళది శృతి హార్మోనియం మోగించుకుంటూ సాయంత్రం ప్రాక్టీస్ చేస్తూ ఉండేది పెద్ద సంగీతం కాదు ఏవో సరళీస్వరాలు అది వున్నన్ని రోజులు మా చెవులు వాచిపోయేవి 

వసుంధరకి సమాధానం సాంతం దొరకక ఏం సాధన చేసేది ” అన్నది

రార … వేణు .. గోప .. బాల ఇదే తెగ సాధన చేసేది అని కనకలత నవ్వింది ఒక్క క్షణం ఆగి అయినా పిల్లలకి ఆ పాటలు ఎందుకు నేర్పుతారండి పట్టుమని పదేళ్లయినా ఉండని పిల్ల హార్మనీ ముందు కూర్చుని — సారసాక్ష నేరమేమి మరు బాధ కోర్వ జాల అని సాగదీసుకుంటూ పాడటం ఎబ్బెట్టుగా ఉండదా అంతటితో ఆగదు ఈ గీతం మగువను ఈలలనను ఈ సొగసును చేకొనరా

కోరిక లింపొంద అంటూ చాలా చాలా ఉంటుంది ఆ పిల్లలకి అర్ధం తెలియదు కనుక సరిపోయింది

కనకలత భావం తెలిసాక వసుంధర కూడా ఆమె నవ్వు తో జత కలిపింది కనకలత దగ్గర సెలవు తీసుకుని వసుంధర బయటకు వచ్చింది ఆమెను ఆలోచనలు స్థిరంగా ఉండనీయడం లేదు ఆపాట ఆ కీచుగొంతు తనను కల్లోల పరచిందని తెలియడానికి పదిహేను రోజులు పట్టింది ఆరోజు ఎందుకు అలా జరిగింది అని ప్రశ్న వేసుకుని సమాధానం వెతకడం లో మునిగి పోయింది ఎందుకు అన్న ప్రశ్న మనిషిని రికామీ గా ఉండనీయదు ఎందుకు అనవసరంగా ఆలోచించడం అనుకున్నది కానీ ప్రశ్నస్థిమితంగా ఉండనీయడం లేదు

పరధ్యానం ఎక్కువ అయిందని భర్తా పిల్లలూ అనడం మొదలు పెట్టారు గాలి మార్పు కోసం ఎటైనా ఒక నాలుగురోజులు వెళదామా అని భర్త అడిగాడు మన్సులోపల కల్లోల సముద్రం ఉండనీయడం లేదు లాభం లేదు అనుకుని భర్తకు తెలియకుండా ఒక సైక్రియాట్రిస్టు దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంది

మీరు బాగా మీ మనసు పొరలలోకి వెళ్లి చూడండి ఆ రార … వేణు .. గోప .. బాల ” పాట తో మీకేమైనా సంబంధం ఉంటే బయటపడుతుంది ఒకవేళ మీ వల్ల కాకపోతే హైప్నటైజ్ చేద్దాం అన్నాడు డాక్టర్

ఆ రోజు రాత్రి వసుంధర కి సునాయాసంగా నిద్ర పట్టింది ఆమె నిద్రలో వెనక్కు నడచి వెళ్ళిపోతోంది పెళ్లైన కొత్తలోకి ,

యవ్వనంలోకి బాల్యంలోకి

సవతి తల్లి రెండో పెళ్లి చేసుకున్నందుకు పరితాప పడే తండ్రిముగ్గురు అక్కలు వాళ్ళ మధ్య మరో మధ్యవయసు మహిళ

మరి అమ్మ

కొడుకు కావాలని ఉబలాటం ఆమెకు ముగ్గురూ వరుసగా ఆడపిల్లలే పుట్టారు వసుంధర కడుపులో వున్నప్పుడు మగబిడ్డే పుడతాడని ఆమె ఆశ పడింది మగ నలుసు అని పదే పదే కలవరించింది వసుంధరను మగపిల్లాడి లాగే పెంచుదామని భర్త చెప్పినా ఆమె సమాధాన పడలేదు మీరు ఆపరేషన్ చేయించుకోకండి నేను అందుకు సిద్ధం కాను మనకు మగపిల్లాడు కావాలి మరీ నిరాశ ముంచెత్తి నేల మీద కూలబడి పోయి సన్నటి కీచు గొంతు తో రార … వేణు .. గోప .. బాల ” పాడుతూ ఉండేది అమ్మ

కళ్ళలో నీళ్లు గొంతు లో జీర .

అదేపాట అమ్మ గొంతు నుండి కీచుగా వస్తోంది పాటంతా పాడి అమ్మ కళ్ళు ఒత్తుకుంది ఉయ్యాలలో పిల్ల వంక ఒక్క క్షణం ఆప్యాయంగా మరో క్షణం లో అసహనంగా చూస్తోంది పసిపిల్ల ఏడుపు మొదలు పెట్టింది

పలు మారు … గారవముగా నిన్నే

పిలిచిన పలుకవు … అలుగకురా 

అమ్మ గొంతు పసిపిల్లను ఒడిలోకి తీసుకుంటోంది నెల నెలల పిల్ల వసుంధర రెప్ప వాల్చకుండా అమ్మ పాట వింటోందీ ఆత్రం గా తల్లి వొడిలో చేరి పాలు తాగుతోంది దుర్భరమైన రోగం తో తీసుకుంటూ కూడా అమ్మ ఆ పాట పాడటం మానలేదు . “రార … వేణు .. గోప .. బాల ” పాట పాడుతూనే అమ్మ ప్రాణాలు వదిలింది పట్టు తప్పిన నెలల పిల్ల ఏడుపు ఎక్కువ చేసింది

నిద్ర లేచిన వసుంధర కి ఏమి జరిగిందో తెలియదు

ఏ బంధమో రార … వేణు .. గోప .. బాల పాట లా మారి వసుంధరను కల్లోలం చేసిందా కొడుకు కావాలి కొడుకు కావాలి అని పరితపించిన ఆ తల్లి మళ్ళీ స్త్రీ గానే పుట్టి మళ్ళీ అదే పాట సాధన చేస్తోందాసంకల్పం అంత బలీయమైనదా కోరిక అంత గాఢమైనదా అమ్మ చనుబాలు స్పర్శ తప్ప మరేమీ తెలియని వసుంధర ను అమ్మ అనే బంధం మళ్ళీ అమ్మను గుర్తించేట్లు చేసిందా బంధాల మధ్య వుండే ఒక అవిచ్ఛిన్నత ఒక తత్వ ధార అజరామరమా ?

ఎన్ని ప్రశ్నలు వేసుకుంటే వేసుకున్నన్ని జవాబులు వెతికితే మీ ఓపికున్నంత

ఈ కథను శ్రీ విరించి అనే కలం పేరుతొ ప్రసిద్ధులైన ఎన్ .సి రామానుజాచార్యులు ఆగస్టు 2006 నవ్య వార పత్రికలో ప్రచురించబడింది తరువాత శ్రీ విరించి ఏడవ కథా సంపుటి పడి లేచే కడలి తరంగాలు లో చోటు వెతుక్కుంది ఒక చిన్న వ్యాఖ్య ఒక చిన్న సంఘటన ద్వారా విశాలమైన ఆలోచనకు దారులు తీసే గొప్ప కథలు ఎన్నో శ్రీ విరించి రాశారు శ్రీ విరించి కథానికలు “Metaphysical Epiphanies” అని మునిపల్లె రాజు గొప్ప ప్రశంశ ఇచ్చారు శ్రీ విరించి కథలు మీ దాహార్తిని కచ్చితంగా తీరుస్తాయి 

*

వంశీ కృష్ణ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు