ఒక హృదయానికి చుట్టూ
బద్దలైన అగ్ని పర్వతాలు,
మీద కూలిపోయిన అంతరిక్షాలు
లోన కార్చిచ్చు పాకే అరణ్యాలు
గొంతులో కిక్కిరిసిన పొలికేకలు
ఎంత ప్రేమించి ఉంటే ఇంత శిక్షకు అర్హత?
త్రాసులో తూగని ఖనిజానికి
నిరూపించలేక పోయిన నిజానికి
బద్దలు చేయలేని అపోహకి
ప్రేమించడం తప్ప మరేమీ చేతకానితనానికి
విధించగల శిక్ష ఇంకేముంటుంది, మౌనం తప్ప!
ఆకాశం నుంచి శూన్యంలోకి
అకస్మాత్తుగా రాలిపడ్డ నక్షత్రశకలం
తను వెలిగిన రోజుల జ్ఞాపకాలలో
మరిగింది – కాలింది – బూడిదైంది
గాలిలో కలిసిన ఒక్కో రేణువులో
రజనులో కూడా
మరో జ్ఞాపకం మరో జ్ఞాపకం తారసపడుతుంటే
పోరాడడం మాని నిశ్చలంగా చూడడం నేర్చుకుంది
ఊరుకుంటే దాటిపోయే
దుఃఖపు తారీఖుల కొక్కాలను పట్టుకోవడం మానేసింది
తన స్తబ్ధతే తన అధివాసం ఇప్పుడు!
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
దుఃఖపు తారీఖుల కొక్కేలను పట్టుకోవడం మానేసింది