చారిత్రకమైన ఖచ్చితత్వంతో కథని చెప్పడం కష్ట సాధ్యం, ముఖ్యంగా రాజకీయ కారణాలవల్ల. కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని సంజ్ఞల ద్వారా, నర్మగర్భంగా సత్యాన్ని తెలియజేయడానికి దర్శకుడు ప్రయత్నిస్తాడు. వాటిని decrypt చేసుకోవడం అనేది ప్రేక్షకుని వ్యక్తిత్వం మీద, సామర్థ్యం మీద, అవగాహన మీద ఆధారపడి ఉంటుంది.
ముఖ్యంగా కమ్యూనిస్టు దేశాలలో గొప్ప దర్శకులు తాము తెలియజేయాలనుకున్న సత్యాన్ని, రాజ్యానికి అర్థం కాకుండా, ప్రజలకు మాత్రమే అర్థమయ్యేలా, తమ చిత్రాల్లో నిక్షిప్తం చేసి రూపొందించారు. అలాగే పెట్టుబడిదారీ దేశాల్లో కూడా దర్శకులు ఈ ప్రక్రియను అవలంబిస్తూ ఉండడాన్ని మనం గమనిస్తాం. అమెరికాలో నిర్మించబడిన Sergio చిత్రం ఈ కోవకు చెందిందే.
‘ఒక వ్యక్తి ఎటువంటి వాడో తెలుసుకోవాలంటే ఒక్కసారి అతనికి అధికారం ఇచ్చి చూడాలి’ అనేది నానుడి.
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులు తమ శాంతి పరిరక్షక కార్యకలాపాల సమయంలో బోస్నియా, హెర్జెగోవినా, హైతీ, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లైబీరియా, సియెర్రా లియోన్ లలో చేసిన అకృత్యాలు అన్నీఇన్నీ కాదు.
1993లో కంబోడియాకు UN మిషన్ ప్రారంభమయింది. సుమారు 25,000 మంది పిల్లలు శాంతి పరిరక్షకుల లైంగిక దోపిడీ వల్ల జన్మించడం జరిగింది. వ్యభిచారం, మానవ అక్రమ రవాణా, లైంగిక హింస, లైంగిక దోపిడీ విపరీతంగా పెరగడానికి వీరు కారణమయ్యారు. 2004లో, కాంగోలో మహిళలు, పిల్లలతో “సర్వైవల్ సెక్స్”, రేప్ కు సంబంధించిన కథనాలు వెలువడటం ప్రారంభించాయి. ఆహారానికి బదులుగా 10 సంవత్సరాల వయస్సు గల బాలికలతో అత్యాచారం, హింస, లైంగిక దోపిడీకి శాంతి పరిరక్షకులు పాల్పడిన విషయాలూ బయట పడ్డాయి.
జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడికి ఒక లేఖలో, సెక్రటరీ జనరల్ sexual exploitation and abuse సమస్య గురించి బహిరంగంగా రాశాడు. “శాంతి పరిరక్షణ సందర్భంలో వ్యభిచారం మరియు ఇతర లైంగిక దోపిడీల తీవ్రత చాలా ఆందోళన కలిగిస్తోంది, ఎందుకంటే ఐక్యరాజ్యసమితి విచ్ఛిన్నమైన సమాజాల్లోకి ప్రవేశించి దానికి సహాయం చెయ్యాలని, స్థానిక జనాభా తమపై ఉంచిన నమ్మకాన్ని కోల్పోకూడదని ఆదేశిస్తుంది. ఈ సంస్థ యుద్ధం లేదా పౌర సంఘర్షణల వల్ల నాశనమైన జనాభాలోని బలహీన రంగాల బాధలను ఏ విధంగానూ పెంచకూడదు”.
ఇదీ సాధారణంగా UN peace missions పరిస్థితి.
తమ అధికారాన్నో, హోదానో, శక్తినో కొందరైనా మానవీయంగా, ఉపయోగించాల్సిన విధంగా ఉపయోగిస్తే గనుక ఈ లోకంలో శాంతి వెల్లివిరుస్తుంది. హింస, ఆకలి, దుఃఖాలు శాశ్వతంగా అంతమైపోతాయి.
ఒక వ్యక్తిలో మానవత్వం ఉంటే, అతని అధికార పరిధి ఎంత చిన్నదైనా అతడు సామాజికంగా గొప్ప మార్పును తీసుకురాగలుగుతాడు. సేర్గియో చిత్రాన్ని చూపినప్పుడు ప్రపంచంలో ఎవరూ తమ విధిని సక్రమంగా నిర్వహించడం లేదా అనే సందేహం కలుగుతుంది.
మానవత్వం కలవారికి యుద్దోన్మాద ప్రపంచంలో అధికారమొక ముళ్ల కిరీటం. అయితే అధికారం ఒక అవకాశం కూడా. ఎంతో మంది నిస్సహాయుల జీవితాలలో వెలుగు నింపడానికి అది శక్తినిస్తుంది. అందరికీ దొరకని అవకాశమది. దానిని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేవారు వ్యర్థులు.
ఒక దౌత్యవేత్త స్థాయిలో సెర్గియో ఏం చేయగలడు, ఏమి చేయగలిగాడు, ఏమి చేశాడు, అతడి వల్ల ఎంతటి రక్తపాతం, హింస ఆగాయో తెలుసుకుంటే ఎవరూ ఇకపై తమ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోరు.
గొప్ప అవకాశమే సేర్గియోకి దొరికింది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై-కమీషనర్ గా దశాబ్దాలుగా ఇండోనేసియా అణిచివేతకు గురైన తిమోర్ ప్రజలకు స్వేచ్ఛని ఇప్పించగలిగాడు. జరుగబోయే భారీ నరమేధాన్ని నేర్పుగా, యుక్తిగా ఆపగలిగాడు.
అగ్రరాజ్యం అమెరికా ఇరాక్ ని ఆక్రమించిన తరువాత అక్కడి మానవ హక్కుల ఉల్లంఘనకు సేర్గియో ఎదురొడ్డి పోరాడిన కథే ఈ చిత్రం. కాని అక్కడ మానవ హక్కులను ఉల్లంఘించేది ఎవరు? సాక్షాత్తు నాటో సైన్యం. అంటే పరోక్షంగా అమెరికాయే. ఐక్యరాజ్య సమితి అనేది ఎప్పుడూ అమెరికా చేతిలోని కీలుబొమ్మే అనే విషయాన్ని దర్శకుడు స్పష్టంగానే చెబుతాడు. అలాగే నాటో ఐక్యరాజ్య సమితి నిబంధనల్ని తుంగలోకి తొక్కడం, భయానకమైన నరమేధానికి పాల్పడడం, దానిని అదుపు చెయ్యడానికి నిజాయితీపరుడు, మానవతావాది అయిన సేర్గియో పోరాడడం వంటి సన్నివేశాలు మన రక్తాన్ని మరిగిస్తాయి. సంక్షుభిత ఇరాక్ లోని పరిస్థితుల్ని సేర్గియో చక్కబెట్టగలిగి ఉండేవాడా అంటే చట్ట ప్రకారం చూస్తే చక్కబెట్టగలిగే ఉండేవాడు. అతని నిబద్ధత, సామర్థ్యం అటువంటివి. కానీ ఎందుచేత అతడు విజయవంతం కాలేకపోయాడు, ఇరాక్ విషయంలో?
అయితే మరింత లోతైన విషయాలను మన అవగాహనా శక్తికి విడిచి పెడతాడు దర్శకుడు. ఈ చిత్రం నర్మగర్భంగా, వాస్తవంగా జరిగిన క్రూర ఘటనలను అర్థం చేసుకోవడానికి కొన్ని అధారాల్ని విడిచి పెడుతుంది. వాటి సాయంతో ఈ చిత్రంలో చూపించిన కథకు అంతర్హితంగా, నిగూఢంగా ఉన్న లోపలి పార్శ్వాన్ని మనం స్పష్టంగా చూడగలం.
అంత శక్తివంతమైన నాటోకి ఒక బుల్డోజర్ అద్దెకు దొరకలేదంటే అదెంత ఆశ్చర్యకరమైన విషయం? ఇలాంటి నిజమనిపించే అబద్దాలు మనకి స్పష్టంగా అర్థమవుతాయి.
ఇటువంటి చిత్రాలు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. స్ఫూర్తినిచ్చే వ్యక్తులు ఎప్పుడూ లోకంలో ఉంటూనే ఉంటారు. వారి కథలు ప్రజాబాహుళ్యంలోనికి చొచ్చుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. సేర్గియోకి లాంటివారు ఈ సమాజాన్ని మనం బాగు చేసుకోగలము అనే నమ్మకాన్ని ఇస్తారు. అటువంటి ఒక ఆశ వేల మందిని పోరాటానికి పురిగొల్పగలుగుతుంది.
(ఈ చిత్రం Netflix లో అందుబాటులో ఉంది.)
చిత్రం: సేర్గియో(2020)
దర్శకత్వం: గ్రెగ్ బార్కర్
దేశం: యు.యస్.ఏ
*
మంచి పరిచయం! తప్పకుండా చూడాల్సిన సినిమా
శ్రీ రాం! చదివి ఆశ్చర్యం! పై చూపుకు కనిపించని విషయాలు! అలాంటివాటిని చూసే నేత్రాలు ప్రత్యేకం!ఒక్కొక్క నటనను, మాటలను ఎన్ని కోణాలలొ చూడగలరొ చూసి పాఠకులకు చూపించారు. మీరు రాసిన విషయాల గురించి చాలా సంవత్సరాలవెనుక చూచాయగా చదివాను.కానీ ఇంత వివరంగా కాదు. మీరు సినీమా గురించి రాసినది చదివి ఆశ్చర్యం,బాధ, ఒక్కసారిగా. మనం ఎటువైపు వెళ్తున్నాం! అందరూ మూడుపూటలు తింటూ,(పనిచేసి ) నీడపట్టున ఎలాంటి ద్వేషాలు లేకుండ ఒకరొకర్ని గౌరవిస్తూ, అనురాగంతొ జీవించె రోజులు వస్తాయా! ఇలా మీరు సినిమా లను చూసి రాస్తూఉఃడాలి. ఎన్నో విషయాలు తెలుస్తాయి. మనఃపూర్వక అభినందనలు శ్రీ రాం మీకు.
శ్రీ రాం! చదివి ఆశ్చర్యం! పై చూపుకు కనిపించని విషయాలు! అలాంటివాటిని చూసే నేత్రాలు ప్రత్యేకం!ఒక్కొక్క నటనను, మాటలను ఎన్ని కోణాలలొ చూడగలరొ చూసి పాఠకులకు చూపించారు. మీరు రాసిన విషయాల గురించి చాలా సంవత్సరాలవెనుక చూచాయగా చదివాను.కానీ ఇంత వివరంగా కాదు. మీరు సినీమా గురించి రాసినది చదివి ఆశ్చర్యం,బాధ, ఒక్కసారిగా. మనం ఎటువైపు వెళ్తున్నాం! అందరూ మూడుపూటలు తింటూ,(పనిచేసి ) నీడపట్టున ఎలాంటి ద్వేషాలు లేకుండ ఒకరొకర్ని గౌరవిస్తూ, అనురాగంతొ జీవించె రోజులు వస్తాయా! ఇలా మీరు సినిమా లను చూసి రాస్తూఉఃడాలి. ఎన్నో విషయాలు తెలుస్తాయి. మనఃపూర్వక అభినందనలు శ్రీ రాం మీకు.