అద్భుతమైన పాట- అనామక మరణం

 “ఏ చీకటి ఆపునురా రేపటి ఉదయం

ఏ ఓటమి ఆపునురా  రాగల విజయం

చేయరా సాహసం నీ జయం నిశ్చయం”

అని ఒక గొప్ప ఆశాభావాన్ని, సానుకూల దృక్పథాన్ని యువతరానికి తన పాట  రూపం లో ఇచ్చిన కులశేఖర్ మృత్యువును, ఏ ఉదయమూ, ఏ విజయమూ ఆపలేకపోయింది. జయం నిశ్చయం అనుకున్నా అపజయం తన ఆధిక్యాన్ని చాటుకుంది. కులశేఖర్  ఇక లేడు  అనుకుంటే మనసంతా బాధగా వుంది.

నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని

నిను చూసిన కంటికి ఎప్పటికి నిదురన్నది రాదు మరి

అని  వసంతం సినిమా కోసం రాసిన కులశేఖర్ జీవితం లోని అందాన్ని పూర్తిగా అనుభవం లోకి తీసుకోకుండానే వెళ్ళిపోయాడు. డిప్రెషన్ అనే మహమ్మారి, అనారోగ్యం అనే అదృశ్య రాక్షసి  అతడిని పూర్తిగా తమ స్వాధీనం లోకి తీసుకున్నాయి. 100 కి పైగా సినిమాలలో మరికొన్ని వందల పాటలు రాసిన కులశేఖర్  1971 ఆగస్టు 15 సింహాచలం లో పండిత కుటుంబం లో పుట్టా డు. మహామహోపాధ్యాయ శ్రీమాన్ ఎస్టీపీ రామచంద్రాచార్యుల వారి చిన్న కుమారుడు కులశేఖర్. చిన్నప్పటి నుండే సంగీత సాహిత్యాల పట్ల మక్కువ పెంచుకున్న అతడిలోని కవిని మొట్టమొదట గుర్తించింది తన నాయనమ్మ. ఆమె తెల్లవారుజామునే లేచి

“కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ” అని పాడుతుంటే కులశేఖర్ నిద్ర కళ్ళతోనే

” నాన్నమ్మా ఇవ్వవే పాలు ఎప్పుడో లేచాను నేనూ” అని పాడేవాడట.

అలా పాడటాన్ని  విన్న నాయనమ్మ

“ఒరే ! నువ్వు పెద్దయ్యాక కవివి  అవుతావు” అన్నదట. కవి అంటే ఏమిటో తెలియని కులశేఖర “కవి అంటే ఏమిటి నాన్నమ్మా?” అని అడిగాడట.

ఆమె నవ్వి “ఇప్పుడు  నేను పాడాను చూడు కౌసల్యా సుప్రజా రామ అనే సుప్రభాతం, దాన్ని  రాసినవాడిని కవి అంటారు ” అని చెప్పిందట.

సినిమా రంగం లోకి రావడానికి ముందే అతడు చాలా పాటలు రాసాడు. అతడి మొదటి పాట  ఇదీ అని చెప్పడం కష్టం. ఎందుకంటే తన బతుకంతా పాటతోనే పెనవేసుకుని పోయింది కాలేజీలో చదువుకునే రోజులలో

ఆంధ్ర దేశమా ! అమృత కలశమా

అన్నపూర్ణ వున్న  బిరుదు న్యాయమా

గతమెంతో ఘనం నీది వర్తమాన మేమది

భవితవ్యం మాట చాలు ఈ గంటను గడవని

పేదవాడి ఇంట  నేడు తిండి గింజలేక మాడి

వాడి క్షుద్బాధ కి పెట్టిందొక  మారుపేరు ఉపవాసమా

పేరులోన ఏమున్నది తల్లీ

వాళ్ళ పొయ్యి లోన లేవకున్నది పిల్లి

లాంటి పాటలు రాసి బహుమతులు గెలుచుకున్నా డు . పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తరువాత జర్నలిస్ట్ గా ఈ టివి లో చేరి ఢిల్లీ లో పనిచేసాడు. ఢిల్లీ నుండి మద్రాస్ కి బదిలీ అయిన తరువాత సిరివెన్నెల శిష్యరికం కులశేఖర్ అనే ప్రతిభకి తగినంత వ్యుత్పత్తిని అందించింది . తేజ చిత్రం సినిమాతో తెరంగేట్రం చేసాడు. ఒకప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి తన మొదటి సినిమాకు సింగిల్ కార్డు కావాలని పట్టుపట్టినట్టు గానే కులశేఖర్ కూడా తనకు సింగిల్  కార్డు కావాలని పట్టుపట్టాడు. తేజ అందుకు ఒప్పుకోవడం తో చిత్రం పాటల  రచయిత గా కులశేఖర్  మొదటి చిత్రం అయింది

కులశేఖర్ పూర్తిపేరు తిరుమల పల్లెర్లమూడి కులశేఖర్. చిత్రం సినిమా మేకింగ్ అప్పుడు అందరూ కులశేఖర్, కులశేఖర్  అని పిలవడం తో  అదే అలవాటుగా టైటిల్స్ లో కులశేఖర్  అని వేసి తరువాత పూర్తిపేరు వేయలేదని గుర్తువచ్చి టి. పి (తిరుమల పల్లెర్లమూడి) అనివేయమంటారా అని అడిగితే “ఎందుకు? టి. పి  అని వేశారుకదా?” అని ఎదురు ప్రశ్నించాడు ట.  కులశేఖర్  ఏమంటున్నాడో అర్ధం కాక విస్తుపోయి చూస్తూ ఉంటే “టి అంటే తేజ, పి  అంటే పట్నాయక్” అని సరదా అర్ధం చెప్పి నవ్వేసాడట. ఆ ముగ్గురి బంధం అలాంటిది.

చిత్రం పాటలు పెద్ద హిట్. ఆ తరువాత వెనక్కు తిరిగి చూసుకోలేదు. జెట్ స్పీడ్ తో కులశేఖర్  కెరీర్ దూసుకునిపోయింది. ఒక దశలో తన గురువు సిరివెన్నెల స్థానానికి పోటీ పడినంత పని చేశారు. కులశేఖర్  మీద సిరివెన్నెల ప్రభావం ఎంత ఉంటుంది అంటే కొన్ని పాటలు ఇది కులశేఖర్  రచనా? లేక సిరివెన్నెల రచనా? అని శ్రోత కన్ఫ్యూజ్ అయ్యేంతగా.

అనుకుంటే కానిది ఏమున్నది

మనిషి అనుకుంటే కానిది ఏమున్నది

చలి చీమే ఆదర్శం

బలికాక  నీ దేహం

చేయరా సాహసం

నీ జయం నిశ్చయం

ఈ పాట చాలా కాన్షియస్ గా వింటే తప్ప కులశేఖర్ ది  అని ఎవరూ అనుకోరు.  తన గురువు రైలు బండికి సొంత వూరేదో గురుతు రాదెలా  అని బెంగపడితే  కులశేఖర్  అదే రైలు బండిని మిడిల్ క్లాస్ నేల  విమానం అన్నారు . బలహీనమైన సన్నివేశాలకు కూడా బలమైన పాటలు రాయడం కులశేఖర్  బలహీనత.

కవులందరికీ గోదావరంటే మోహం ఉన్నట్టుగానే, కులశేఖర్ కి కూడా గోదావరంటే పిచ్చి. సందర్భం దొరకాలే  కానీ గోదావరి కి అక్షర హారతి పట్టకుండా ఉండడు.

నిండు గోదారి కదా ఈ ప్రేమ

అందరికి బంధువు కదా ఈ ప్రేమ

అని నువ్వు లేక నేను లో రాసి గోదావరిని అందరికి బంధువులాంటి ప్రేమకు పర్యాయ పదం చేసిన  కులశేఖర్

గోదారల్లే పొంగే నాలో సంతోషం

గోరింటల్లే  పూచే నాలో ఆనందం

అని లేలేత అరచేతిమీద పూచిన గోరింటకీ, గోదావరికి అబేధం  చెప్పి రసజ్ఞుడైన శ్రోత మనసును దోచుకుంటాడు. సందర్భం తెలిస్తే చాలు కులశేఖర్  అలవోకగా పాట  రాసేస్తాడు. పైగా తనకు కొద్దో, గొప్పో సంగీత నేపథ్యం  కూడా ఉన్నట్టు వుంది ట్యూన్ లెన్త్ ని బట్టి పదాలు అలవోకగా పడిపోతాయి.

కోదండ రాముణ్ణి చూడు కోరింది ఇచ్చేటి వాడూ

ఆ సుందరాంగుణ్ణి  చూడు  మా తల్లి సీతమ్మ జోడు

ఇలా అప్రయత్నంగా పదాలు పడిపోతాయి.  తనకు ఎంత పాండిత్యం వున్నా, ఆ పాండిత్యాన్ని ప్రదర్శించే అవకాశం వున్నా సరే అలతి అలతి  పదాలతో  పాటను అల్లుతాడు తప్పితే గాయకుడిని ఎక్కడా కష్టపెట్టడు.

ఘర్షణ సినిమాకు మంచి మాటలు రాసాడు. అన్ని పాటలు రాశాడు. కులశేఖర్  ఒక పాటలో

తనువు నదిలో మునిగి వున్నా

చెమట జడిలో  తడిసి పోతున్నా

అని రాస్తే  ఈ సినిమా దర్శకుడు గౌతమ్ మీనన్  దాని అర్ధం ఏమిటి అని అడిగాడట. శరీరం పూర్తిగా నదిలో మునిగి పోయిన తరువాత ఇంకా చెమట పట్టడం ఏమిటి? అర్ధం లేదు కదా అన్నాడట. అప్పుడు కులశేఖర్ మనసులో భయం, ఆందోళన, పెనవేసుకుని పోయినప్పుడు శరీరం నదిలో తేలిపోతున్నా, అగ్నిలో కాలిపోతున్న చెమట పడుతుంది. అది భయంవల్ల జరుగుతుంది అని చెపితే కన్విన్స్ అయి నదిలో ఒక్క షాట్ అనుకున్న దానిని మరింత పొడిగించాడట.

ఇలా పాటలు, మాటలు రాసుకుంటూ ఉంటే ఎలా ఉండేదో తెలియదు కానీ, “ప్రేమ లేఖ రాశా! ” అన్న సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా విడుదల కాలేదు. సినిమా రంగం లో మోహపెట్టే మరికొన్ని అవలక్షణాలు కులశేఖర్ ను కప్పేశాయి. బాల్యం నుండీ  చిత్ర గీత రచయిత దాకా విజయం  అనే  నావికా ప్రయాణం ఒక్కసారిగా ప్రేమలేఖ రాశా తో తలకిందులు అయింది. అన్నీ విజయాలే వరించి. విజయం అలవాటు అయ్యాక ఒక్క అపజయం పలకరించినా తట్టుకోవడం కష్టం. అప్పుడే భుజాన్ని గట్టిగా పట్టుకునే ఒక చేయి ఉండాలి. అది లేకపోతే జీవితం ఒక విషాదకర మలుపు తిరుగుతుంది.

మానసికంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. హైదరాబాద్ నుండి విశాఖ తీసుకుని వెళ్ళా రు. ఆరోగ్యం కుదుట పడింది. మళ్ళీ మునపటి కులశేఖర్ అవుతాడు అనుకునే సమయం లో కాలం అకాలం  అయింది. ఈలోగా సామాజిక మాధ్యమాలలో  కులశేఖర్ మీద బోలెడంత ప్రచారం. అది నిజమో కాదో ఎవరికీ తెలియదు. కాకినాడ బాల త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయం లో శఠారి దొంగతనం చేసాడని, బ్రాహ్మణ కమ్యూనిటీ వెలివేసిందని  ఇలా ఎన్నో. చివరకు జైలు జీవితం అనుభవించాడు.

పంజాగుట్ట దగ్గర రోడ్  ప్రమాదం లో చనిపోవడం , అనామక శవం గా మార్చ్యురీ కి తరలిస్తున్నప్పుడు విధి నిర్ణయం అన్నట్టు అటుగావచ్చిన నర్స్ చూసి కులశేఖర్  ని గుర్తు పట్టడం తో తన మరణ వార్త లోకానికి తెలిసింది. లేకపోతే అలా అనామకంగా వెళ్లిపోయేవాడే.

జాజికొమ్మ వూగినా

కాలి  మువ్వ  మోగినా

చల్లగాలి నన్ను తాకినా

నువ్వు అనే భావనే

అని కదా కులశేఖర్  నువ్వు నేను లో రాసింది. ఆ భావన పేరు జీవితం అయితే  ఆ జీవితం తనని దగా చేసింది.

*

వంశీ కృష్ణ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు