అద్దంలో ప్రపంచ సినిమా

కేపీ అశోక్ కుమార్ ‘అనగనగా ఒక సినిమా’ పుస్తక సమీక్ష

తెలుగులో హాలీవుడ్ / వరల్డ్ సినిమాల సమీక్షలు రావడం అరుదు. ఇప్పుడు ఫేస్ బుక్ లో చాలా వస్తున్నాయి గానీ వృత్తి విమర్శకులు రాసేవి కన్పించవు. హాలీవుడ్ / వరల్డ్ సినిమాల సమీక్షలకి తెలుగులో ఏకైక చిరునామా కేపీ అశోక్ కుమార్. 1988 లో ‘ఆంధ్రభూమి’ లో ప్రింట్ మీడియాతో మొదలై, ప్రస్తుత డిజిటల్ మీడియాలోనూ చురుగ్గా సమీక్షలు రాస్తున్న సుదీర్ఘ అనుభవమున్నసీనియర్ విమర్శకుడు. అటు సాహిత్య విమర్శలతో బాటు ఇటు సినిమా విమర్శలూ చేస్తూ పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తి. వెయ్యి వరకూ హాలీవుడ్ / వరల్డ్ సినిమాల సమీక్షలు రాసి రికార్డు సృష్టించారు. వీటిలో కొన్ని హాలీవుడ్ సినిమా సమీక్షలతో ‘హాలీవుడ్ సినిమా’ పేర గతంలో ఒక పుస్తకంగా తీసుకొచ్చారు. ఇప్పుడు రెండో పుస్తకంగా, వరల్డ్ సినిమాల సమీక్షలతో ‘అనగనగా ఒక సినిమా’ వెలువరించారు. అన్వీక్షికి పబ్లిషర్స్ తరపున వెంకట్ సిద్ధారెడ్డి ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఇలా వొక ప్రసిద్ధ విశ్లేషకుడి పుస్తకాన్ని సమీక్షించడం సాహసమే. తనే కోరారు కాబట్టి సాహసించి చూద్దాం.

ఈ పుస్తకంలో మొత్తం 25 వరల్డ్ సినిమా సమీక్షలున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, రష్యా, చైనా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మొదలైన దేశాలు నిర్మించిన చలన చిత్రాలున్నాయి. అకిరా కురసావా నుంచీ స్టీవెన్ సాడెర్బర్గ్ వరకూ ప్రఖ్యాత దర్శకుల సినిమాలపై విశ్లేషణ లున్నాయి. వరల్డ్ సినిమాలు మన దేశంలో ప్రదర్శనలకి నోచుకోవు. చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించాల్సిందే. వీటి పట్ల అభిరుచిగల ప్రేక్షకులు వీడియోల్లో చూసుకోవాల్సిందే. వినోదాత్మక – వ్యాపార సినిమాల మయమైన మన దేశంలో వాస్తవిక సినిమాలకి ఆదరణ లేదు. వరల్డ్ సినిమాలంటే ఆర్ట్ సినిమాలే. మన దేశంలో తీసే ఆర్ట్ సినిమాలకి ఏ పాటి ప్రేక్షకులుంటారో వరల్డ్ సినిమాలకీ అంతే ప్రేమికులు. అందువల్ల థియేటర్లలో ఆడవు. విదేశీ సినిమాల్లో ఒక్క హాలీవుడ్ సినిమాలకే మన దేశంలో మార్కెట్ వుంది. ఇవి వినోదాల వ్యాపార సినిమాలు కాబట్టి.

వరల్డ్ సినిమాలతో తెలుగు ప్రాంతాల సంబంధం చూస్తే, ఒక వర్గం విద్యావంతులకే ఇవి పరిమితం. అదీ ఆన్ లైన్లో  వీక్షించడానికివి లభిస్తున్నాక. అలాగే ఈ వరల్డ్ సినిమాలు తెలుగు సినిమాలతో ఎంతగా పెనవేసుకు పోయాయంటే కొందరు నయా మేకర్లు వీటితో ప్రేరేపితులై తెలుగులో ఇలాటివి తీసేసేంత! తీసి చేతులు కాల్చుకునేంత. వరల్డ్ సినిమాల పట్ల నయా మేకర్ల మోజు నష్టాలకి పరాకాష్టగా మారిపోయేంత. వరల్డ్ సినిమాల్లో కమర్షియల్ సినిమాల కథా నిర్మాణం, పాత్ర చిత్రణలూ వుండవు. ఉన్నట్టయితే ఆ సినిమాలు ఇండియాలో విరగబడి అడేవి హాలీవుడ్ సినిమాలతో బాటు. ఈ వ్యత్యాసం తెలుసుకోక వరల్డ్ సినిమాల్ని తెలుగీ కరించేస్తున్నారు నయా మేకర్లు. మన దేశంలో ప్రధానస్రవంతి సినిమాలకి దగ్గరగా వుండేవి కేవలం హాలీవుడ్, కొరియన్ సినిమాలేనని తెలుసుకుంటే తప్ప పరిస్థితి మారేలా లేదు.

ఈ నేపథ్యంలో విశ్లేషకుడు అశోక్ కుమార్ పుస్తకాన్ని చూసినప్పుడు మెదిలే ప్రశ్నలు రెండు – ఇది ఎవరి కోసం, దేనికోసం అన్నవి. ఈ ప్రశ్నలు వేసుకుని ఈ పుస్తకం చదవడం మొదలు పెడితే ఒకటొకటే సమాధానాలు దొరుకుతాయి. ఈ సమాధానాల్ని చివర్లో ప్రస్తావించుకుందాం. ముందుగా ఈ పుస్తంలో ఏర్చి కూర్చిన సినిమాలేమిటో చూద్దాం. సుపరిచితుడైన విప్లవ యోధుడు చే గెవేరా మీద స్టీవెన్ సాడెర్బర్గ్ తీసిన ‘అర్జెంటైన్’, ‘గెరిల్లా’ అనే రెండు కళా ఖండాలతో ప్రారంభమవుతుందీ పుస్తకం. ఈ రెండు సినిమాల్ని విశ్లేషిస్తూ పోరాట యోధుడి జీవితాన్ని సమగ్రంగా ఆవిష్కరించారు. రెండో ప్రధాన సినిమా అకిరా కురసావా తీసిన ‘రషోమాన్’. దీని గురించి తెలియని వారుండరు. దీని కథన పధ్ధతి ‘రషోమాన్ ఎఫెక్ట్’ గా పాపులరయింది తెలిసిందే. ఈ టెక్నిక్ ఆధారంగా తర్వాత ఎన్నో హాలీవుడ్ సినిమాలూ వచ్చాయి. అయితే ఒక సినిమాక్ టెక్నిక్ ఆధారంగా నవల రావడమనే విశేషాన్ని ప్రస్తావించారు అశోక్ కుమార్. ప్రసిద్ధ రచయిత అంపశయ్య నవీన్ రాసిన ‘దృక్కోణాలు’ అన్న నవల ‘రషోమాన్ ఎఫెక్ట్’ స్ఫూర్తితో రాసిందేనని పేర్కొంటూ ఆ నవల సంక్షిప్త పాఠాన్ని ఇచ్చారు.
అలాగే మరో తెలిసిన ప్రసిద్ధ సినిమా ‘సినిమా పారడిజో’ గురించీ వుంది. ఈ మూడూ తప్పిస్తే మిగిలిన ఇరవై రెండూ మనకి కొత్తగా పరిచయమయ్యే సినిమాలు. మధ్య యుగపు చైనీస్ టాంగ్ రాజవంశపు ‘కర్స్ ఆఫ్ ది గోల్డెన్ ఫ్లవర్’, అక్రమ వలస కూలీల ‘షింజుకు ఇన్సిసిడెంట్ (జపాన్), 1453 లో టర్కుల యుద్ధ విజయాల ‘ఫతే’ (టర్కీ), యజమానీ సేవకుల సంబంధాల ‘ఇన్ టచబుల్స్’ (ఫ్రాన్స్), తాలిబాన్ల పాలనలో స్త్రీల అణి చివేతల ‘సఫరే గాందేహార్’ (ఆఫ్ఘనిస్తాన్), బ్రతుకు పోరాటంలో శవాలంకరణ వృత్తుల  ‘ఒకురిబిటో’ (జపాన్), బాల్య జ్ఞాపకాల ‘డిసెంబర్ బాయ్స్’ (ఆస్ట్రేలియా), సరిహద్దు ఉద్రిక్తతల ‘లెమన్ ట్రీ’ (ఇజ్రాయెల్), దుఃఖిత స్త్రీల ‘బోల్’ (పాకిస్తాన్)…ఇలా విభిన్న ఇతివృత్తాల ప్రపంచ సినిమా ముఖచిత్రం ఈ పుస్తకంలో కన్పిస్తుంది.

అశోక్ కుమార్ విశ్లేషణ సింపుల్ గా వుంటుంది. విశ్లేషణ తక్కువ, కథా సంగ్రహం  ఎక్కువగా వుంటుంది. ముందు ఒక పేరాలో సినిమా పరిచయం, తర్వాత అనేక పేరాలతో పూర్తి కథ, చివర ఒక పేరాలో సంక్షిప్తంగా విశ్లేషణ, లేదా తన అభిప్రాయం వుంటాయి. పూర్తి కథ ఇవ్వడంతో ఆ సినిమా ఏమిటో చూడకుండానే ఆమూలాగ్రం తెలిసిపోతుంది. తెలిసిపోయాక చూసే ఆసక్తి ఎంతవరకుంటుందనేది పాఠకుల మీద ఆధారపడి వుంటుంది. పరిశోధనాత్మక వ్యాసాలకి పూర్తి కథ వెల్లడించక తప్పదు. ఈ వ్యాసాలెలాగూ అందరూ చదవరు. కానీ సామాన్య ప్రేక్షకుల నుద్దేశించి వుండే సాధారణ సినిమా సమీక్షలు కథ ముగింపు (స్పాయిలర్) చెప్పకుండా, సమగ్ర విశ్లేషణలతో, విమర్శనాత్మకంగా వుంటూ మనకి కన్పిస్తాయి. అశోక్ కుమార్ దీనికి భిన్నం. ఒకవేళ పూర్తి కథ ఇచ్చినా, విశ్లేషణ ఎక్కువ చేస్తే ఆ సినిమాల అంతరార్ధాలు, మంచి చెడ్డలు, సాంకేతిక విశిష్టతలు తెలుగు కమర్షియల్ ప్రేక్షకులకి కొత్తగా తెలిసే అవకాశముంటుంది. ఇలాటి సినిమాలైనా, సినిమా పుస్తకాలైనా తెలుగు కమర్షియల్ ప్రేక్షకులకి తెలియని కొత్త ప్రపంచాలు చూపించేవే.

ఇకపోతే, ఈ పుస్తకం ఎవరికోసం, దేనికోసం అన్న ప్రశ్నల గురించి. ఎవరి కోసమంటే జిజ్ఞాస వున్న అందరి కోసం. దేనికోసమంటే ప్రపంచాన్ని తెలుసుకోవడం కోసం, ప్రపంచ రాజకీయాలు, విప్లవాలు, యుద్ధాలు, సరిహద్దులు, వాదాలు, మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, లైంగిక సంబంధాలు, స్త్రీల జీవితాలు, జీవనపోరాటాలు… ఇవన్నీఇతర దేశాల్లో ఎలా వున్నాయీ తెలుసుకుని లోకజ్ఞానాన్ని పెంపొందించుకునే పద్ధతిలో ఈ పుస్తకంలో సినిమాల పరిచయాలు కొలువుదీరాయి. ఇది సాధించినందుకు అశోక్ కుమార్ గార్ని ప్రత్యేకంగా అభినందించాలి.

అయితే ఈ వాస్తవిక సినిమాల మధ్య కొన్ని కాలక్షేప కాల్పనిక సినిమాల ప్రసక్తి పుస్తకానికి శిల్ప భంగం గావించినట్టయ్యింది. ‘రన్ లోలా రన్’ అనే థ్రిల్లర్, ‘డ్రెడ్ వర్సెస్ రెయిడ్ 2’ అనే నేరసామ్రాజ్యపు యాక్షన్, ‘అడ్మిరల్’ అనే కాలక్షేప దినుసుల బయోపిక్- ఈ మూడూ పానకంలో పుడకల్లా వున్నాయి. ఆ మాటకొస్తే ‘రషోమాన్’, ‘సినిమా పారడిజో’  కాల్పనికాలు కూడా శిల్ప భంగమే.

మొత్తానికి ‘అనగనగా ఒక సినిమా’ ఒక విజయవంతమైన ప్రయత్నం. ఇలాటి ప్రయత్నం మరిన్ని వరల్డ్ సినిమాలతో మరోటి చేస్తారని ఆశిద్దాం. ప్రపంచ పరిస్థితికి అద్దం పట్టే వరల్డ్ సినిమాలతో ఇలాటి పుస్తకమొక బయోస్కోప్ అవుతుంది.

*

సికిందర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు