అదొక చేర్పు …అంతే!

జీవితానికీ, కథకీ మధ్య సమతూకం సాధించడం వేంపల్లె షరీఫ్ లో కనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా షరీఫ్ అన్వేషిస్తున్న జీవన మూలాల్లో వేర్వేరు కోణాలున్నాయి. సీమలోంచి మొలకెత్తిన పలుకుబడి వుంది. షరీఫ్ కొత్త కథలు వెలువడిన సందర్భంగా ఈ చిన్న సంభాషణ-

చారలపిల్లి మీ ప్రయాణంలో ఎలాంటి మైలురాయి?

అది మైలు రాయి ఎందుకవ్వాలి? అలాంటి అనివార్యత ఎందుకుంది?  నా కథా ప్రయాణంలో అదొక చేర్పు అంతే. ఇదే కాదు ఇంకేమి రాసినా నేను అలాగే చూస్తాను.

మీరు కథకుడే కాదు,విమర్శకులు కూడా! మీలోపలి కథకుడిని ఒక విమర్శకుడిగా ఎలా చూస్తున్నారు ఈ కొత్త కథల్లో?

విమర్శకుడిగా అంటే నాకు కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నాయి.  నేను కేవలం రీడబులిటీ చూస్తాను. ఆధునిక కాలంలో కథా వస్తువు మీద అనేక దృష్టికోణాలు ఉన్నాయి. కథా వస్తువులు అందరికీ నచ్చకపోవచ్చు. కానీ కథ మాత్రం చదివింపజేయాలి కదా. పాఠకుడు తన సమయాన్ని వృధా చేశానని అనుకోకపోతే చాలు. అదే పెద్ద రచన కింద లెక్క. ఆ మేరకు నేను సంతృప్తిగా ఉన్నాను. వస్తు విస్తృతి, శైలి విస్తృతి దగ్గర నాకు  కొంత అసంతృప్తి ఉంది. దాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తాను.

ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్పాలి. తెలుగు కథలు ప్రధానంగా రెండు రకాలుగా వస్తున్నాయి. 1. ఆలోచన  ప్రధానమైనవి 2. సంఘటన ప్రధానమైనవి. ఒక కొత్త ఆలోచన రాగానే దాన్ని ప్రతిపాదించడానికి కొన్ని పాత్రలు, వాతావరణాన్ని సృష్టించి రాసి మెప్పించడం ఒక పద్ధతైతే రెండో పద్ధతి నిజజీవితంలోని సంఘటనను ప్రధానంగా తీసుకుని రాసి మెప్పించడం. నా కథలు సంఘటన ప్రధానంగా కల జీవిత కథలు. వీటిని ఆ పరిధి మేరకే విమర్శా దృష్టితో చూడాలని నేను అనుకుంటాను.

హిందూ-ముస్లిం విషయాన్ని వివిధ కోణాల నుంచి ఆవిష్కరించే ముస్లిం రచయితలు ఇప్పుడు వున్నారు. వాళ్ళ మధ్య మిమ్మల్ని మీరు ఎక్కడ locate చేసుకుంటున్నారు?

ఎవరు.. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను. నాకే అభ్యంతరం లేదు.

సూఫీ సమయాలు ఇప్పుడు తెలుగు కథకుల్నీ,కవుల్నీ ఎక్కువగా ప్రభావితం చేస్తున్నట్టున్నాయి. ఆ కోణం గురించి మీరేమంటారు?

 మంచిదే. ఇప్పటికైనా సరైన దారిలో పడ్డారని అనుకుంటాను. నిజానికి తెలుగులో వస్తున్న ముస్లిం సాహిత్యమంతా సూఫీ నేపథ్య సాహిత్యమే. కవి కరీముల్లా కొంత ప్రత్యేకత కోసం ప్రయత్నిస్తున్నారు కానీ అందులో కూడా సూఫీయిజం ఉందని నా అవగాహన. ఎవరైనా ఔత్సాహికులు దీని ఆధారంగా ప్రత్యేక చర్చ చేస్తే సంతోషిస్తాను. నేను నా పరిశీలన పరిధి మేరకే ఈ విషయం చెబుతున్నాను.

“ముస్లిం కథ” అనే నిర్వచనాన్ని ఈ కొత్త కథల సంపుటి ఏమైనా మార్చుతోందా?

 అది మీలాంటి పరిశీలకులే చెప్పాలి. నా వరకు నేను సామాజిక అంశాలనే కథలుగా తీసుకుని రాశాను. నేడు సామాజిక కథే మైనార్టీ కథగా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి.. లేదా మైనార్టీ కథే సామాజిక కథగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనే కాదు ఏ ప్రగతి శీల రచయిత -రచన చేసినా అందులో మైనార్టీలు అనివార్యంగా బాధితులుగా కనిపిస్తారు. అందులో భాగంగానే ముస్లిం కథకున్న పారామీటర్స్ కూడా మారిపోయి ఉండొచ్చు.

*

ఎడిటర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు