మా ఊరు చాలా చిన్న ఊరు. గుంటూరుకి పది మైళ్ళ దూరం లో ఉన్నప్పటికీ, మెయిన్ రోడ్డుకు దూరం గా ఉండడంతో మరో ప్రపంచం లో ఉన్నట్లు ఉండేది. ఎండలూ, వానలూ, పొలాలూ, పంటలూ, గేదెలూ, దున్నలూ, పేకాటలూ, ఓకులాటలూ మధ్య ప్రపంచం మారకుండా, నిశ్చలంగా ఉండేది. అక్కడే పుట్టి పెరిగిన తరాలు. అవే చెట్లు. అవే ఇళ్ళు. ముఖ్యంగా అవే మనుషులు, అవే అనుభవాలు, అవే ఆలోచనలు.
ఈ ప్రపంచం లో పుట్టి పెరిగిన నాకు పుస్తకాలు మరో ప్రపంచాన్ని చూపాయి. ఎండలూ, వానలే కాదు, ఎడారులు మంచు దేశాలు ఉంటాయని పుస్తకాల్లో చదివి తెలుసుకున్నాను. ఇంకా, నగరాల గురించి, మనుషుల గురించి, వాళ్ళు దేనికోసం వెతుక్కుంటారో వాటి గురించీ తెలుసు కున్నాను. ఊహ కి ఎక్కువ పని చెప్పడం మూలాన పుస్తకాలు సినిమాల కంటే ఈ మానస జీవితాన్ని బాగా ప్రభావితం చేశాయి.
పుస్తకాలంటే నా ఉద్దేశ్యంలో అచ్చయిన ప్రతిదీ అని చెప్పుకోవచ్చు. నా మొదటి పుస్తకం చందమామ. అది ఒకటో తరగతి చివరలో చదివాను. తర్వాత వార పత్రికలు, మాస పత్రికలూ మొదలు పెట్టాను. చాటు మాటుగా అపరాధ పరిశోధనలూ, యద్దనపూడి నవలలూ వీటికి మూడవ తరగతి వచ్చే వరకే ఎదిగాను.
పుస్తకాలు మా ఊళ్ళో ఎక్కువగా ఉండేవి కాదు. అందుకే, అచ్చయిన ఏ కాగితమైనా చదివే వాడిని. కానీ, మా ఊళ్ళో అచ్చు కాగితాలు కూడా తరుగు. ఎక్కడ దొరికితే అక్కడికి, ఎవరి ఇంటిలోకైనా వెళ్లి చదివాను. స్త్రీల వ్రతకథలు ఎవరో చుట్టాల పక్కింటి ముసలమ్మ దగ్గర, గరుడ పురాణం మాదిగ పల్లె లో ఎవరి ఇంటి దగ్గరో, డిటెక్టివ్ నవలలు చాటున దాక్కొని, సీరియల్ నవలలు పుస్తకాలు మా అక్కయ్యకి చేరవేస్తూ దారిలో ఇలాగ చదివాను.
రెండవ తరగతి లో ఉన్నపుడు, నేను గేదెలు తోలుకొని బాడవ పొలం కాల్వకట్టు మీద మేతకి తీసుకు వెళ్ళినపుడు, “ఒక గొర్రెల కాపరి కథ” తీసుకు వెళ్లే వాడిని. అక్కడ, గేదెలు నెమ్మదిగా ఆకు పచ్చటి గడ్డి తింటూ ఉంటే, నేను సల్-చాక్-తొక జీవిత కథ చదువు కుంటూండే వాడిని. అది తువా దేశం లో రష్యన్ విప్లవానికి పూర్వం నాటి కథ. అక్కడ ఉప్పు దొరకదు. ఎప్పుడూ మంచు ఉండే దేశం. ఆకలి, చలి ఎప్పుడు వెన్నండే దేశం. ఆకుపచ్చని గడ్డి మీద, చెట్టుకింద కాల్వగట్టున పడుకొని, ఎప్పుడూ మంచు పడే ప్రాంతాల ప్రజల గురించి ఆలోచించు కుండే వాడిని.
ఈ రచనల ద్వారా భౌతిక ప్రపంచ వ్యత్యాసాలే కాదు, మానసిక ప్రపంచ వ్యత్యాసాలూ గమనించే వాడిని. ఏడో , ఎనిమిదో ఏట చలం బిడ్డల పెంపకం చదివినపుడు, పిల్లలను పెంచడం గురించి పుస్తకాలు ఉంటాయా అని ఆశ్చర్య పోయాను. నన్ను ఎలా పెంచుతున్నారు అని ఆలోచించుకున్నాను. ప్రేమ, పెళ్లి లాంటివి తెలియక ముందే, యద్దనపూడి పుస్తకాలు చదివి, ముచ్చట పడ్డ జ్ఞాపకం ఉంది.
ముఖ్యంగా ఆ రోజుల్లో గమనించింది ఏమిటంటే, ప్రతి పుస్తకానికి ఏదో ఒక కేంద్రం ఉంటుంది. ప్రతి పాత్ర, ప్రతి ఉద్బోధ ఆ కేంద్రం చుట్టూ తిరుగుతుంది. ఆ గంట సేపూ పేదల కన్నీళ్లు కావచ్చు, ఆగంతుకుడి హత్య కావచ్చు, సుతారంగా వోణీ సర్దుకునే ఆడ పిల్ల కావచ్చు — ఏదయినా ఆ కాసేపు నన్ను ఆ లోకం లోకి తీసుకు వెళ్లగలిగితే చాలు.
ఆ కేంద్ర విషయాన్ని నమ్మితే, నాకు ఆ కాసేపు ఆ పుస్తకంలోకి వెళ్లి పోగలిగే శక్తి వచ్చేది. ఆ కథ నా చుట్టూ పక్కల పరిసరాల్లోనే జరుగుతున్నట్లు ఉండేది. ఉదాహరణకి, మా ఊరి చెరువు గట్టు మీద మహాభారత యుద్ధం జరిగింది. ఎక్కడ భీష్ముడు అంపశయ్య ఎక్కాడో, మీకు ఇప్పటికీ చూపించగలను! సోక్రటీస్ మా పక్కింటి అరుగు మీద కూర్చొని మాట్లాడే వాడు. శరశ్చంద్ర కథ బాడవ, మా ఊరి పొలిమేరలో జరిగింది.
ఇలాగ నా పరిసరాలన్నీ, రకరకాల కథలతో, పాత్రలతో, సన్నివేశాలతో కిక్కిరిసి పోయి ఉండేది. పుస్తకాలు దొరకని రోజున, మళ్ళీ మళ్ళీ ఆ కథలు అక్కడే కళ్ళముందు ఆడించు కుంటూ ఉండేవాడిని. కొన్ని ఏళ్ల తర్వాత ఆ పుస్తకం చదివినా, నాకు ఆ ప్రపంచం, మా సౌపాడులో నాకు ఆవిష్కృతమవుతుంది. అందుకే, చదివినవి బాగా గుర్తుండేవి.
అన్ని పుస్తకాలూ చదవలేక పోయాను. నిజానికి చదివాను కానీ, తలా తోక తెలియలేదు. ప్లేటో చదువుతూ ఇంకా కథ ఎప్పుడు మొదలవుతుందని అనుకోవడం గురుతు. అలాగే హైస్కూల్ లెక్కల పుస్తకాలు అర్థం అయీ కాకుండా ఉన్నట్లు ఉండేవి. సహస్ర నామ పూజలు చదవడానికి ఓపిక చాల లేదు. కానీ నాకు పుస్తకాల మీద ఉన్న అచంచల విశ్వాసం ఇవేవీ తగ్గించలేదు.
మా ఊళ్ళో ఒక యోగిని ఉండేది. ఆవిడ యాదవ కుటుంబంలో పుట్టి, చిన్నతనంలో వితంతువై, సన్యాసం పుచ్చుకొని, ఒక చిన్న గదిలో ఉండేది. సాయంత్రం అయేసరికి, అక్కడికి ఊరి వితంతువులు వచ్చేవారు. పూజలు, భజనలు జరిగేవి. అన్నిటికన్నా ముఖ్యంగా, ఏ పురాణమో, ఏ భక్తి పుస్తకమో, ఏ వేదాంత పుస్తకమో వినాలని కోరుకునే వారు. కానీ వారికెవరికీ చదవడం రాదు. నేను వాళ్ళ చదువరిని అయ్యాను.
మూడో తరగతిలో ఉన్న నేను, ప్రతి సాయంత్రం ఇంటికి రాగానే, పలక, బలపం సంచి ఒక పక్కన పడేసి, ఆ మఠానికి పరిగెత్తుకుని వెళ్లే వాడిని. ఆలస్యమయితే, ఇంకెవరినయినా పిలుస్తారని భయం! భగవద్గీత, యోగ వాశిష్టము, బ్రహ్మంగారి చరిత్ర, రామకృష్ణ పరమహంస చరిత్ర ఇలాగ అనేక పుస్తకాలు చదివి వినిపించే వాడిని. వాళ్ళు ప్రతి ఒక పేరానో, పద్యమో చదివిన తర్వాత, దానిగురించి విశ్లేషించుకొనే వారు. కొన్నాళ్ళు పోయాక, నేను కూడా రెండు మాటలు వేసేవాడిని.
మరి కొన్నాళ్ల తర్వాత, నాలుగవ తరగతిలో ఉన్నపుడు, మా పక్కింట్లో ఉన్న బైబులు చదివాను. మొత్తమ్మీద ఎలాగో, ఒక బైబులు కూటమికి వెళ్లి కొన్నాళ్ళు, ఆ ఆచార్యుల గారి బోధనలు విన్నాను. ఒక సారి, ఆయన గోలియత్ గురించి చెబుతూ, అతడు ఎంత పెద్దగా ఉంటాడో చెప్పాడు. మరి డేవిడ్ అతడి తలను ఎలా మోశాడు అని నాకు సందేహం వచ్చి అడిగాను. చివరికి బాప్తీస్మం లేనిది పవిత్ర ద్రాక్ష రసం ఇవ్వం అని చెప్పేటప్పటికి, నా ఉత్సాహం తగ్గింది.
ఇలాగే, పుస్తకాలు చదవడం కోసం వెతుకుతూ ముల్లా గారి దగ్గర అరబిక్ నేర్చుకొనే ప్రయత్నం చేసాను. స్త్రీల వ్రత కథలూ, పంచాంగం ఫుట్ నోట్స్ లో యంత్రాంగాల విషయాలూ ఇవన్నీ చదివాను.
కానీ, ఎందుకు అని ప్రశ్న వేసుకోలేదు. చదవడం ఎందుకు? పిచ్చి ప్రశ్న. తెలుసుకోవడానికి. చెప్పే వాడెవరున్నా వినటానికి సిద్ధంగా ఉన్న వయసది!
చదవడమే కాదు, నేను పుస్తకాలని నమ్మాను. ప్రతి పుస్తకమూ ఒక వినూత్నమైన, విలక్షణమైన ప్రపంచం సృష్టించింది నాకు. ఒక దానితో మరొకదానికి పొంతనలేని ప్రపంచాలయినా ప్రతిదాన్నీ నమ్మాను. ఏ మాత్రం అభిప్రాయాలు లేని ప్రపంచం లో పెరిగిన నేను ఏ రచయిత చెప్పిన భావమైనా నమ్మాను. ఎవరో దేశభక్తులు పరాయి దేశపు భాష నేర్చుకోవడమేమిటి అని అల్లూరి సీతారామరాజు అన్నాడని రాస్తే, ఇంగ్లీష్ నేర్చుకోవడం మానేశాను కొన్నాళ్ళు!
వల్లంపాటి గారు రాశారు రచయితతో, రచనతో మమేకం అవడానికి పాఠకుడు చేసే ప్రయత్నం గురించి. ఒక విధంగా చూస్తే అది ఒక దశలో పాఠకులకి బాగా అవసరం. (వేరే విధంగా ఎలా చదవాలని చెబుతా తర్వాత). ఒక రచయిత చెప్పిందల్లా అర్థం చేసుకోవాలంటే వారి దృష్టి నుండి చూడడం ముఖ్యం కదా?
అప్పుడు తెలియలేదు కానీ, మంచి రచన కి ఉండాల్సిన లక్షణం ఇది ఒకటి. రచయిత కొన్ని ప్రాతిపదికల మీద ఆధారం చేసుకొని పుస్తకం మొదలు పెడతాడు. ఉదాహరణకి, అతడు ప్రతి మనిషికీ ఆరు కాళ్ళని కథ మొదలు పెట్టవచ్చు. (నిజానికి, ఇవి ఇంతకంటే కొంచెం తీవ్రంగానే ఉండ వచ్చు — ప్రతిదీ సమాజం యొక్క తప్పు. లేదా, పేద వాళ్లకి ఆకలి దప్పులు మాత్రమే ముఖ్యం). ఆ తర్వాత అతడు ఒక కథ అల్లవచ్చు: ఆ ప్రపంచంలో ఏం జరుగుతుంది? ఐదు కాళ్ళున్నవాడు తక్కువవుతాడా? ఏడు కాళ్ళ రాజు ఎలాగ కాలు అడ్డం తగిలి కిందపడ్డాడు? మనం ఆ ఆరుకాళ్ల విషయం నమ్మనక్కర లేదు. ఆ కాసేపు అది తాత్కాలిక విశ్వాసం గా ఉంచుకొని, కథ చదివించగలిగితే ఆ రచన సఫలం అయినట్లే. కొన్ని కొన్ని సార్లు, ఆ కథ ఎంతగా నచ్చవచ్చంటే, మనిషి కి ఆరుకాళ్ళు అని అప్పటినుండీ అనుకోవచ్చు.
[మీరు పూర్తిగా నవ్వుకోనక్కర్లేదు. బోలెడు మత గ్రంథాలు ఇలాగే ఉంటాయి. ఇంకా, అనేక ఫిలాసఫీ పుస్తకాలు కూడాను. మీకు బాగా నచ్చిన పుస్తకాలు చూసి, అందులో వాటి ప్రతిపాదికలన్నీ మీకు ప్రత్యక్ష అనుభవం ఉన్నదా అని ఆలోచించండి.]
ప్రతి రచయిత తన మొదటి రచనలలో ఆత్మచరిత్ర చెబుతాడు అంటారు. అదేమో కానీ, ఉత్తమపురుష లో చెప్పే కథలన్నీ, మనల్ని రచయిత కళ్లనుంచి చదవడం అలవాటు చేస్తాయి. ఆ రచయిత కనక, ఆ హత్య ఎందుకు చెయ్యవలసి వచ్చిందో చెబుతుంటే, అవును, నిజమే కదా అని అనిపిస్తుంది. చిన్నప్పుడు, ప్రతి పుస్తకం ఆ ఉత్తమ పురుష లోనే చదివినట్లు ఉండేది.
ఈ విధంగా చదవడం నాకు జీవితంలో బాగా ఉపకరించింది. నా ఉద్యోగ రీత్యా, నేను అనేక వ్యాపార పత్రాలు చదవ వలసి వచ్చేది. ప్రతి ఒక్క కంపెనీ ఒక్కొక్క ప్రపంచం. నేను ఆ పత్రాలని ఆ దృక్పథం, అంటే భాష, ఆచారాలు, అభిప్రాయాలు, నుండి చూస్తే గానీ అర్థం కాదు. నిజానికి, రాను రాను పూర్తిగా చదవకుండానే ఆ రచన ముఖ్య ఉద్దేశ్యం అర్థం అయేది!
ఇంగ్లీష్ లో జెలిగ్ అని వుడీ అలెన్ తీసిన సినిమా ఉంది. అందులో హీరో ఎవరి పక్కన ఉంటే వాళ్ళలా తయారవుతాడు. లావుగా ఉన్న మనుషుల మద్య ఉంటే లావుగా, సన్నగా ఉన్న వాళ్ళమధ్య సన్నగా, చైనీస్ వాళ్ళ మద్య చైనీస్ లాగ, ఉంటాడు. ఎంతగా ఎదుటి వాడి దృక్పథం గురించి ఆలోచించే వాడంటే, నొప్పులొస్తున్న ఆడవాళ్ళ మధ్యన ఉంటె వీడికీ నొప్పులొచ్చేయి.
వుడీ అలెన్ మానసిక దృక్పథం తీసుకొని, దాన్ని భౌతికంగా అభివ్యక్తీకరించి సినిమా తీసాడు. కానీ, మానవ స్వభావం ఏమిటంటే, ఎదుటి వాడితో సింపతీ చూపడం. ఎదుటి వాడి దృక్పథం నుండి ఆలోచించినపుడే, సంభాషణ సాగుతుంది. భాష ఎప్పుడూ అసంపూర్ణమే. మనం ఎదుటివాడి మనోభావాల్ని ఊహించి, ఈ అసంపూర్ణతని పూరిస్తాం. రచన చదివేటపుడూ అంతే.
ఇలాగ, రకరకాల రచయితల దృక్పథం చూసీ, చూసీ, నాకొక నిర్దుష్టమైన ప్రపంచ దృక్పథం, నాదైన మానసిక ప్రపంచం లేకుండా పోయింది. పన్నెండేళ్ల వరకూ నేను అనుకరణ ప్రపంచం లో గడిపాను. నాకు ఏదయినా నచ్చక పోతే నా తప్పు అని, నాకొక నాదైన ప్రపంచం లేకుండా చేసుకున్నాను. ప్రతి రచయితా నాకంటే తెలిసిన వాడనీ, ప్రతి రచన లోనూ తెలుసుకోదగ్గది ఉన్నదనీ నమ్మే వాడిని.
పన్నెండేళ్ల తర్వాత నేను చదివే విధానంలో బాగా మార్పు వచ్చింది. అది తర్వాత భాగంలో వివరిస్తాను.
చక్కని ప్రారంభం.
చాలా ఆసక్తిగా ఉంది..
నా చిన్నతనం గుర్తుకొస్తుంది.
చాలా ఆసక్తిగా ఉంది..
నా చిన్నతనం గుర్తుకొస్తుంది.
కన్నెగంటి రామారావు గారి ని అక్షరాల్లో ఇలా చూడాలన్న నా చిరకాల కోరిక తీరింది …”ప్రతి రచయితా తన మొదటి రచనలలో తన ఆత్మకథ చెపుతాడు” అంటోన్న రామారావు ఈ వ్యాసమూ ఆత్మ కథాత్మకం గా రూపొందించడం సహజంగా ఉంది
కళ్ళు విప్పార్చుకుని చదువుతున్నాను.
ఎదురుచూస్తుంటాను.
అక్కడక్కడా నన్ను నేను చూసుకున్నాను.
మళ్ళీ బాల్యంలోకి పునర్యానించిన లేలేత భావన.
– రామా చంద్రమౌళి
చాలా బాగుంది మీ కథనం. చిన్నప్పుడే అంత open mind కలిగి వున్నారే! Waiting for more to read!
బాగా చెప్పారు !
ఎప్పటినుంచో అడుగుతున్నా రామూని ఇట్లాంటివేమైనా రాయమని. ఇప్పటికి దారికొచ్చాడు!
ఆసక్తికరంగాఉంది. అనవసర పదాలు, వాక్యాలు, ఆవేశాలు లేకుండా ఆలోచనలను రేకెత్తించే విషయం, శైలి రెఫ్రెషింగా ఉంది.
” భాష ఎప్పుడూ అసంపూర్ణమే. మనం ఎదుటివాడి మనోభావాల్ని ఊహించి, ఈ అసంపూర్ణతని పూరిస్తాం. రచన చదివేటపుడూ అంతే” ….. తదుపరి భాగాల కోసం ఎదురుచూసే ఉత్సాహాన్ని ఇచ్చిన వాక్యం !
చాలా బావుంది రామా.
నువ్వు పల్లెటూరు నేను విజయవాడలో మాచవరం. అంతే తేడా. పట్టణం అన్నమాటే గాని నాపరిధి చాల చిన్నగా ఉండేది. అందుకని పుస్తకాలే దిక్కు.
బావుంది …
మీ పఠనా వ్యాసాంగ ప్రయాణం కోసం ఎదురు చూస్తూ..
నన్ను నేను చదువుతున్నట్లుంది.
చందమామలు, సోవియట్ రష్యా పుస్తకాలు, వారపత్రికలు, నవలలు, డిటెక్టివ్ నవలలు… మారుమూల గిరిజన గ్రామంలో పుస్తకాలు దొరక్క, దేనినైనా చదివేయాలని తపన…
“ఎదుటి వాడి దృక్పథం నుండి ఆలోచించినపుడే, సంభాషణ సాగుతుంది.”: మంచి వాక్యం. అందుకే గాబోలు దాన్ని సాగనివ్వకుండా నడుం కట్టుకున్నట్లుగా కనిపిస్తాయి ఈనాటి చర్చలూ, వాగ్వివాదాలూను!
చదివి.. మళ్ళీ ఇంకోసారి చదివి చాలా చాలా ఎంజాయ్ చేశాను. మీ రచనలోని విశ్లేషణా తత్వం …ఆరే… అవును కదా అని ఆలోచింప చేసింది. మీ అంత పుస్తకాల పురుగుని కాకున్నా….నన్నూ ఎన్నో మథుర బాల్యస్మృతులు వరదల్లా వచ్చి పలకరించాయి . ఎందుకనో… నేను చిన్నప్పుడు ఊళ్ళో జరిగిన నెల రోజుల హరికథ నాగా లేకుండా వెళ్లి… హరిదాసు హార్మోనియం లాంటి ట్యూనర్ని వారించడానికి ఎగపడటం గుర్తొచ్చింది.
ముందు ముందు ఇంకా ఏమి ప్రస్తుతిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.
…… మార్కండేయ ప్రసాద్…(APRJC 80-82.BiPC)
జ్ఞాన దాహంతో పరితపించే విలువైన వ్యక్తి యొక్క నిలువెత్తు వ్యక్తీకరణ. మీ తెలుగు కూడా చాలా అందంగా వుంది. పాఠకుడిని మీ అనుభవానికి దగ్గరగా తీసుకెళ్ళి తద్వారా మీ జ్ఞానాన్ని షేర్ చేసుకోగల నైపుణ్యం మీ స్వంతం. మీ రాబోయే వ్యాసాల కోసం ఎదురుచూస్తుంటాను.
బాగా రాశారు
ఈ ప్రకటన చేయటానికి ఇవాళ తెలుగులో చాలా ధైర్యం కావాలి…
“ఎండలూ, వానలూ, పొలాలూ, పంటలూ, గేదెలూ, దున్నలూ, పేకాటలూ, ఓకులాటలూ మధ్య ప్రపంచం మారకుండా, నిశ్చలంగా ఉండేది. అక్కడే పుట్టి పెరిగిన తరాలు. అవే చెట్లు. అవే ఇళ్ళు. ముఖ్యంగా అవే మనుషులు, అవే అనుభవాలు, అవే ఆలోచనలు”
ఎందుకంటే …
మా ముత్తవ్వే మొదటి చివరీ గురువు…
మా అమ్మమ్మ నుంచే అన్నీ…
మా నాన్నే అసలు సిసలయిన…
మా ముత్తాత కన్నీ ముందే …
అసలు మా కులమే నిజమైన…
మా ప్రాంతపు రక్తం లోనే…
అసలు నాకు జ్ఞానం పుట్టుకతోనే …
అంటే వచ్చే చప్పట్ల మోత వల్ల అలానే పాతపాట పాడాలి కాబోలనుకొంటున్న అన్ని రకాల వాదుల కి భిన్నంగా ఈ మధ్య చదివిన తొలి వాక్యం.
“ఈ ప్రపంచం లో పుట్టి పెరిగిన నాకు పుస్తకాలు మరో ప్రపంచాన్ని చూపాయి”
తర్వాత భాగం కోసం ఎదురుచూస్తున్నాము .
[…] మొదటి వ్యాసంలో, నాకు సాహిత్యం కొత్త ప్రపంచాన్ని చూపించిందని రాశాను. మొన్న ఎవరికో సాహిత్యం ఏమిచ్చిందని చెబుతూ రాసాను: “నాకు చిన్నపుడు, చిన్న ప్రపంచంలో పుట్టి పెరిగిన నాకు, సాహిత్యం పెద్ద ప్రపంచం చూపించింది. పల్లెటూళ్ళు, పట్టణాలు, హిమాలయ పర్వత సానువులు, ఎడారులు, ఉప్పు దొరకని, మంచు కరగని దేశాలూ, కాకులు దూరని కారడవులూ — వీటిలో చదువుకుంటూ, పెరుగుతూ, ప్రేమిస్తూ, పిల్లల్ని కంటూ, డబ్బు సంపాదిస్తూ, ఉన్నదాన్ని చూసి మురిసి పోతూ, దేనికోసమో తపన పడుతూ,ఉద్యమాలు నడుపుతూ, చావు పుట్టుకలు మధ్య బ్రతుకుతూ ఉన్న విలక్షణమైన మనుషులు, ఆదర్శ జీవులు, మానసిక ప్రపంచ సంచారులు, అసాధారణం గా ప్రవర్తించిన సాధారణ మనుషులు, చదువుకున్న వారు, బడుగు జీవులు, కలలు కనే అందమైన అమ్మాయిలూ, పోకిరీ యువకులు, మానసిక, శారీరిక వృద్ధులూ — వీరిని నాకు పరిచయం చేసింది, దగ్గరగా చూపింది, అర్థమయేలా విడమర్చి చెప్పింది”. […]