గోగు శ్యామల రాసిన మొట్టమొదటి కథ ‘ఏనుగంత తండ్రికన్న ఏకుల బుట్టంత తల్లి నయం’. ఇది తన మొదటి కథ అంటే ఎవరికైనా ఆశ్యర్యంగా అనిపిస్తుంది. బాల్యం గురించి ప్రతి ఒక్కరికీ అనేక అనుభవాలుంటాయి. కానీ వాటి నేపథ్యాలు వేరుగా ఉంటాయి.
‘పొద్దుమూకిన యాల పిల్లలందరం ఊరికి బయట మడికట్ల గుమిగూడినం.. మేం ఆటసోయిలో పడి చుట్టుపక్కల ఏమైందో సోయిలేకుండ ఆడ్తనే వున్నం. మేం ఇట్లా ఆడుకోక శానాదినాలైంది. ఆకలిగొన్నట్లు ఆడ్తనే ఉన్నం. వానవడి ఎల్సిన గుర్తులుగా నీటి బిందువులు పచ్చిగడ్డిపై పువ్వెండలో జిగేల్ మంటున్నయి. మా సంబరానికి ఊతమేస్తూ ఏడురంగుల సింగిడి పువ్వు, మొగులు తాజాగా పూసింది. గౌరు వట్టిన నల్లమబ్బుల్లో నుండి కడిగేసినట్లు పొద్దు పొడుసుకొచ్చింది. అటుకెల్లి ఇటు, ఇటుకెల్లి అటు సింగిడిలో ఏడు రంగులున్నయా లేదా లెక్క గట్టినం.’
కథని ఇలా ఒక ఆరేడేళ్ళ పాప దృష్టి కోణం నుంచి మొదలుపెట్టిన శ్యామల ఆ తర్వాత ఎంత సంక్లిష్టమైన జీవిత పార్శ్వాన్ని ఆవిష్కరిస్తుందో చదివితీరాలి. ఇది స్వానుభవమా అని ఆమెని అడిగితే, చిన్నప్పటి నుంచి తన చుట్టూ వున్న జీవితాన్ని చూసిన అనుభవం, పరిశీలనలతో పాటు తమ జీవితాలలో స్త్రీ- పురుష భేదం లేకుండా అంతర్భాగమైన కులవివక్ష, అవమానం, వెట్టి, పేదరికం, ఆకలి, శ్రమ, విజ్ఞానం, నేర్పు, ప్రేమ, ఆప్యాయతలు, ముంగిట్లోకి రాని చదువు, స్త్రీలెదుర్కునే హింస, కనీస విద్య, వైద్య సౌకర్యాలకు కూడా నోచుకోకపోవడం.. ఇలాంటివన్నీ కలగలిస్తే నా ఈ మొదటి కథ అంటారు శ్యామల.
తన మొదటి కథ పేరుతోనే వచ్చిన కథా సంకలనానికి రాసుకున్న ముందుమాటలో “ఇంతవరకు జరిగిన ఇంకా జరుగుతున్న మారణహోమాల వలన గుండె కెలికిన గాయాలతో మనసు అతలకుతలమై తన్నుకొచ్చిన దు:ఖం, వెంటాడి తరిమిన ఆలోచనలన్నీ కలగల్సినంక రాసినవే ఈ కథలు” అని చెప్పుకున్నారు. “తాను పుట్టి మెట్టిన వెలివాడల్లా, వాటి పక్క ఊర్లల్ల.. తనకు తెల్సిన తాను చూసిన దళితుల జీవితాల చుట్టూ అల్లుకున్న వూరు సంబంధాల ఘట్టాలలోని అతికొన్ని ఆనవాల్లె ఇవి” అంటారు. “లెక్కకు మించి గడించిన అనుభవాలు ఎన్నెన్నో, చూసిన వాటిలో ఆవగింజలో అరవయ్యో వంతు భాగమైనా అక్షరాల్లోకి రాకుండా కాలంలో ఇంకిపోయిన కథలు ఎన్నో లెక్కనే లేదు. పోయినయి పొంగా అక్షరీకరించబడినవి కొన్నే” అని కూడా చెప్తారు. పైగా ఈ కథలేవీ ఏనాటి కాలానికో సంబంధించినవి కావనీ ఇప్పుడు నడుస్తున్న చరిత్రేనని, హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలోనివేనని కుండబద్దలు కొట్టినట్లు చెప్తారు శ్యామల.
పేరొందిన పెద్ద పత్రికలేవీ తన ఈ మొదటి కథను ప్రచురించలేదు. ఈ యాసలో రాస్తే పాఠకులకు భాష అర్థంకాదు, కథా ప్రమాణాలు లేవు అని తిరస్కరించారు. ఇందులోని ఇతివృత్తం గురించి క్లుప్తంగా చెప్పాలంటే, రెక్కలిరుసుకుని చిన్నప్పటినుంచి పాలేరుతనం చేసిన తండ్రి మీద అగ్రకుల దొరలు దొంగతనం మోపితే వారికి భయపడి ఊరిడిసి పట్నమెళ్లిపోతాడు. భర్త దూరమవటంతో పిల్లల్ని, ముసలి అత్తని కాచుకుంటూ వారికోసం రెక్కలరిగేలా పనిచేస్తుంది తల్లి. తండ్రికి బదులుగా పసువులను మేపటానికి బడికి పోవాల్సిన వయసులో వెట్టికి బలవుతాడు పెద్దకొడుకు. ఇద్దరు చిన్న పిల్లలు. పట్నంలో ఆగమైన తండ్రి ఇంటికి తిరిగివచ్చిన తర్వాత తన అసహాయతను ఆగ్రహంగా భార్య మీద చూపించిన హింసతో ఆమె నిస్సహాయురాలుగా పడివుంటుంది. సరిగ్గా అదే సమయంలో పెళ్ళిచేసి పంపించిన పెద్దకూతురుకు రెండు నెలల ముందే అకాల ప్రసవం అయిందని కబురు రావడంతో, మనవరాలు ప్రసవానికి కోడలు వెళ్ళలేని పరిస్థితిని కల్పించిన కొడుకు మీద ఆ ముసలితల్లి చూపించే ఆక్రోశం, చుట్టుపక్కలవారి ప్రతిస్పందనే ఈ కథ!
“ఇప్పుడేం జేస్తవురా బట్టెబాజి కొడుకా. నా కడుపుల సెడపుట్టినవ్ దాని నడుములు ఇరగొట్టి పండవెడ్తివి. ఇప్పుడు ణీ బిడ్డవి మైలబట్టలు ఎవరు ఉతుకుతర్రా? తొలుసూరు కాన్పు తల్లిజేసే తరీక. ఇప్పుడెట్ల జెయ్యమంటవ్ ఓ…” అని నెత్తికి చేయ్యివెట్టి ఏడ్సుకుంటా కూసున్నది. ఆ మందిల కెళ్ళి నింగంపల్లి సాయవ్వొచ్చి “యంతుంటే ఏం ఫాయిద బాలేన్తకిప్పుడు తల్లి కావాలె మైలబత్తలుతుక. పెద్దలూకే అన్నారా “ఏనుగంత తండ్రి పొయ్యి ఏకుల బుట్టంత తల్లి ఉండాలని” అన్నది. జర వాయిలాకు దెచ్చి ఆమె నడుములకు కాపుండమ్మ నొప్పులు మొద్దువారినట్టు అయితయని జెప్పింది. నేనింక వాయిలి చెట్టు కోసం దౌడు తీసిన”.
తెలుగు సాహిత్య ప్రమాణాలకు అనుగుణంగా లేదని తిరస్కరించబడిన శ్యామల మొదటి కథతో పాటు తన ఇతర కథలన్నీ కూడా ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంటున్నాయి. శ్యామల కథలన్నీ దాదాపు ప్రత్యామ్నాయ పత్రికలలో వచ్చినవే. ఈ కథ కూడా అలా భూమికలో 2002లో అచ్చయ్యింది. ఆ తర్వాత శ్యామల కథలన్నీ మొదటగా “ఫాదర్ మే బి యాన్ ఎలిఫెంట్ అండ్ మదర్ ఓన్లీ ఎ స్మాల్ బాస్కెట్” పేరుతో ఇంగ్లీష్‌లో నవయానా పబ్లిషర్స్ వారు 2012 జనవరిలో ప్రచురించారు. ఆ తర్వాత హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ ‘ఏనుగంత తండ్రికన్న ఏకుల బుట్టంత తల్లినయం’ కథా సంపుటాన్ని 2013లో తెలుగులో ప్రచురించారు. ఇప్పుడు ఇదే కథల సంపుటాన్ని జర్మన్ బాషలోకి కూడా అనువదించి 2018లో ప్రచురించారు. ఈ పుస్తకంతో పాటు గోగు శ్యామల ‘నల్లపొద్దు’ దళిత స్త్రీల సాహిత్యం (1921-2002) సంకలనానికి సంపాదకత్వం వహించారు. ‘నల్లరేగడి సాల్లు’ – మాదిగ, మాదిగ ఉపకులాల అడోల్ల కతలకు జూపాక సుభద్రతో కలిసి సహసంపాదకత్వం వహించారు. దళిత రాజకీయ నాయకురాలు టి.ఎన్.సదాలక్ష్మి జీవితకథను ‘నేనే బలాన్ని’ పేరుతో రచించారు. విభిన్న కథలలో (డిఫరెంట్ టేల్స్) శ్యామల రాసిన వాడపిల్లల కథలు కూడా అన్వేషి ప్రచురించింది. గీత రామస్వామి, కె.పురుషోత్తం లతో కలిసి ఆక్స్‌ఫర్డ్ ‘యాంతాలజీ ఆఫ్ తెలుగు దళిత్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్’ అనే పుస్తకానికి సహసంపాదకత్వం వహించారు. తెలుగు అకాడెమి జెండర్ స్టడీస్ మీద ప్రచురించిన ద్విభాషా పాఠ్యపుస్తకం ‘టూ వర్డ్స్ ఎ వరల్డ్ అఫ్ ఈక్వల్స్’ అనే పుస్తకానికి సహరచయితగా ఉన్నారు.
రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ ఊరవతల వున్న మాదిగవాడ నుంచి వచ్చిన శ్యామల అనేక అవరోధాలను ఎదుర్కొంటూ సాహిత్య ప్రస్థానంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఉద్యమకారిణిగా, రచయితగా, పరిశోధకురాలిగా ముందుకు వెళుతూనే హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ప్రస్థుతం అన్వేషి రీసెర్చ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్‌లో సీనియర్ ఫెలోగా పనిచేస్తున్నారు.
ఏనుగంత తండ్రికన్నా యేకుల బుట్టంత తల్లి నయం
– గోగు శ్యామల
పొద్దుమూకిన యాల పిల్లలందరం ఊరికి బయట మడికట్ల గుమిగూడినం. మొగపిల్లలంతా ఆ పక్కకు వోయి సెడుగుడాడుతుండ్రు. నా ఈడు ఆడివిల్లలంతా దాగిల్ల మూగిళ్ళాడుకుంటూ ఒకర్ని పట్టక ఒకరు ఉర్కుతున్నరిగ. మాకన్న సిన్నగున్న మొగపిల్లలు మాతో ఆడుతున్నరు. సిత్తుబొత్తేస్తే ఆకర్కి బైండ్ల రాములు ఔటయిండు. మేమంత చుట్టుపక్కల పొదల చాటున, పెద్ద పెద్ద బండరాల్ల సందులల్ల, ఎత్తుగున్న ఒరాల కింది దాస్కుంటున్నం. మేం ఆటసోయిలో పడి చుట్టు పక్కల ఏమైందో సోయిలేకుండ ఆడ్తనే ఉన్నం. మేం ఇట్లా ఆడుకోక శానాదినాలైంది. ఆకలిగొన్నట్లు ఆడ్తనే ఉన్నం. వానవడి ఎల్సింది. వానవడి ఎల్సిన గుర్తులుగా నీటి బిందువులు పచ్చిగడ్డిపై పువ్వెండలో జిగేల్ మంటున్నయి. మా సంబరానికి ఊతమేస్తూ ఏడు రంగుల సింగిడి పువ్వు మొగులు మీద తాజాగా పూసింది. గౌరు వట్టిన నల్లమబ్బుల్లో నుండి కడిగేసినట్లు పొద్దు పొడుసుకొచ్చింది. అటుకెల్లి ఇటు, ఇటుకెల్లి అటు సింగిడిలో ఏడు రంగులున్నయా లేదా లెక్కగట్టినం. డిబ్బి కడుపు నర్సికి ఎన్ని మార్లు లెక్కగట్టినగాని ఒక రంగు తప్పుతనే ఉన్నది. నాకు ఏడు రంగులు దొరికినయి. నేను దూకుకుంటు గంతులేస్తున్న. నాకు దూరం నుండి పండుగల సాయన్న పాట వినవడ్డది. ఎంటకు మల్లి జూసిన. దూరం కెల్లి ఊరజెర్వు కట్టెంబడి తలారి అంతన్న పొడుంగున్న ఆయిలి బరిగెను పట్టుకుని బర్రె మీద గూసుని కిన్నెరపాట పాడుకుంటొస్తున్నడు. నాకు ఎంతో పానమున్న ఆ పాటను సెవ్వెట్టిన్న. పాటను పట్టుకున్న. అది పండుగల సాయన్న పాట, ఎంబడే పాడుడు సురువు చేసిన.
‘‘ఒరోరి సాయన్న ఓ పండుగ సాయన్న
పాలామూరి ఈడిగొల్లయి
బియ్యం బండ్లు వోతున్నయి
పన్నెండు పుట్లు బియ్యం బండ్లు
తాండూరుకు వోతున్నయ్
పానం బోతె పాయెగని
పట్టిడువకు సాయన్న
కిన్ కిన్ కిన్ కిన్’’
అని పాడుకుంటు ఉరుకుతున్న. పొన్నాలోల్ల బాలమణి నాకు సరిజోడుగా ఉరుకుతున్నది. అది ఎప్పుడూ నాకు పోటీనే. ఆడుట్ల, పాడుట్ల, ఉరుకుట్ల పోటి.
‘‘కొత్తపేట అంగడీ నెత్తిమీద గొంగడి
సాయిలూ నీవుర్క నేనుఉర్క
సాయిలూ నీవుర్క నేనుర్క ’’ అని బేత్రిన్‌గా పాడవట్టింది.
కొంత మంది పిల్లలు ఎవరికి వాళ్ళు మడికట్లల్ల దీమనగొయ్యలోలె ఉరుకుతున్నరు. కాల్లకింద, పచ్చగడ్డి అణిగినట్లే అణగి పైకి లేస్తున్నది. గడ్డి మీద నీటి బొట్లు కరిగి పోతున్నయ్. నాట్లేయపోయిన అమ్మలొచ్చేయాలదాక ఆడుతూనే ఉన్నం. దూరం నుండి వస్తున్న వాల్లను తేరిపార జూసుకుంట మడికట్లనే నిలవడ్డం. పువ్వెండ కొంచెం కొంచెం కరిగి మొగులుకు కాకిని గట్టినట్లై గౌరువట్టింది. మాల మాదిగోళ్ల మంచినీళ్ల బాయికాడ రెండుగా చీలిన తొవ్వ దేనికది సన్నవడ్డట్లయినయి. మాదిగోళ్ళు మాదిగి కేరిలోకి, మాలోళ్ళు మాలకేరిలోకి చీమల సాలోలే వోతున్నరు. మాయమ్మ ఆల్లదాంట్ల లేదు. ఇంకా ఎదిరి చూస్తూనే ఉన్న. పెద్ద పెద్ద సినుకులతో వాన మొదలైంది. ఆడోల్లంతా ముందే తడిసినందుకేమో నడకలో మార్పు లేదు. నాకు మాత్రం పెయి తడిసి చలిపెట్టి పానమంతా నీరెంటిక వట్టింది. కాని ఆడికెల్లి కదలబుద్దిగాలే. వాన జాడిచ్చి కొడుతూనే చీకటి కమ్మింది. ఇవేవి గమనించుకోకనే చూస్తున్నా మాయమ్మ నా దగ్గర కొచ్చిందాక. వరిచేన్ల కల్వవోయిన ఆడోళ్లు పగటి వానకు తడిసి ఇంకా ఆరలేదు. తడిసిన కుల్లలు పిండుకొని నెత్తిన ఆరేసినట్లు ముసుగేసుకున్నరు. వరిసేలలో అన్ని దిక్కుల నుండి పరుసుకున్న సన్నని వరాల పొంటి సాలు కట్టినట్లు నడుసుకుంటొస్తున్నరు. మాయమ్మ కోసం చూస్తూనే ఉన్న. అందరూ కుల్లలు గప్పుకున్నరు. నాకు దూరం నుండి వాళ్లంతా ఒకేలాగా కనిపిస్తున్నరు. మాయమ్మ కొత్త ఆకుపచ్చ కుల్ల కుట్టింది. పాత చీర చింపి కొత్త కుంచి కుట్టింది. నాకండ్లు మాయమ్మ కోసం దేవులాడుతున్నా మనసులో కుంచి కథనే మెదులుతుంది. చీర మొత్తంలో మెత్తగయి చినిగిన భాగాన్ని తీసేసింది. గట్టి భాగాన్ని దానికంటగుట్టి పొడువులో ఎక్కువ, వెడల్పులో తక్కువ గుడ్డలను ఒకదానికొకటి జమాయించి నాలుగు మూలలు చేసింది. లోపల భాగానా మాయప్ప తెల్లపంచ బట్టనుపెట్టి అంట కుట్టింది. చీర అంచుకున్న జరిని చింపి కుల్ల పై భాగాన అతికేసి కుట్టింది. అది సుతారంగా వెనకభాగాన వేలాడుతుంది. కప్పుకుంటే సరిగ్గా నెత్తిపై నుండి వెనుకకు జారుతూ, దగ దగ మెరుస్తూ జరి అంచు ఎంత అందంగుంటదో. నేను దాన్ని కప్పుకొని ఆడుకునేది. రాజకుమారి ముసుగులాగ మురిసిసోయేది. దాన్ని కప్పుకోడానికి అక్క నేను పోటీలు పడేది. కొట్లాడేది. రాత్రికి కప్పుకోనికే దాన్నే గుంజులాడేది. మాయమ్మ మమ్ములాగవట్టలేక సిన్న సిన్న కుల్లలు రెండు సెరొక్కటి కుట్టింది. కుంచులు గుట్టుట్ల మాయమ్మ తెలివి ఎవరిలోను కనిపించకపోయ్యేది. అందుకే మాపక్కింటి నింగంపల్లి సాయవ్వ ‘‘నాతల్లి సేతులు బొంగురాలోలే తిరుగుతయి. సిటసిట కుంచి కుట్టుట్ల పస్టు’’ అని మాయమ్మను తెగమెచ్చుకునేది.
వానలో అట్లనే నిలవడ్డ. ఊరంత వచ్చిండ్రు. మిగిలింది మాయమ్మనే.
మసక చీకట్లో మాయమ్మ ఒక్కతె సుడిగాలొచ్చినట్లొస్తున్నది. ‘‘అక్కడ వస్తున్నామె మాయమ్మనే’’ అనే ధైర్యంతో నిలబడ్డ. నిజంగానే అమ్మ. వానలో తడిసిన నన్ను చూసి తల్లడిల్లిపోయింది. నేను పోయి అమ్మతో కలెబడినట్లు నడుముకు సుట్టేసుకున్న. ‘‘ఇంట్ల దీపం పెట్టి తమ్మున్ని వెట్టుకొని కూసోక ఎందుకు నాయన ఇక్కడున్నవ్’’ అన్నది. వానరాంగా మొండి పిల్ల నన్ను సుట్టుకుంటున్నది. అడ్వికెల్లి ఏం మోసుకొస్తున్నననుకున్నవు? ‘‘పండా పలారమా’’! అని కోపగించుకున్నది. నేను కుల్లను వెతుకుదామన్న అమ్మ సల్లిడ్వకుండ రెట్టవట్టి ఇంటికి తోలుకొచ్చింది. వచ్చేటాల్లకింకేం సిన్నోడు మా తమ్ముడు కడప మీద ఏడ్సుకుంట బుగులుతో గూసున్నడు. ఆడొట్టి పిరికోడు. మొగులు మెరిసినా, ఉరిమినా బెదురకుంట గూసున్నడు.
వాన్ని జూసి అమ్మ నన్ను తిట్టుడింకెక్కువయింది. పోతూ పోతూనే నా చేయి ఒదిలేసి వాన్ని సవిరి సంకనేసుకున్నది. ‘‘బెదిరినవా కొడుకా’’ అని వాన్ని వీపు మీద సప్పరిచ్చింది.
‘‘వీడు జూడు ఎట్ల బెదిరిపోయిండో ఏమో కొడుకు. ఏం బోగొట్టుకున్నవని వానల నిలవడ్డవ్ పెద్ద పిట్టోలే’’ అని నన్ను మల్ల తిట్టింది. అమ్మ నన్ను తిడుతుంటే సిన్నోడు సంతోషంతో భయం బోగొట్టుకున్నడు. సిన్నోడు ‘‘అమ్మా నాకాకలైందే’’ అన్న దాంతో వాడి మీద నా కోపం కూడా పోయింది. ఎందుకంటె ఆకలి నాక్కూడ ఎక్కువయింది. వాన్ని గబుక్కున కింద దించి కుంచిలో మూలకున్న పచ్చిపెసరుకాయ దీసి ఇద్దరికి వెట్టింది. మరికొంత అన్నకు తీసి వారగ ఉంచింది. ఈ పెసరు కాయకోసమే అమ్మ ఆఖరికొచ్చింది. మా కడుపులు సల్ల బర్చినంకగాని ఇంట్లోని మట్టి వాసనను పట్టించుకోలేదు. ఈ వాసన వాన వడ్డప్పుడల్లా మాయింట్లో ఉండేదే. కొటిండ్ల, పోయికాడ, అడ్డగోడ పక్కకు, వాన కుర్సి నడింట్ల మడుగు గట్టింది. గోడపోంటి అదే పనిగా కర్దూపం కారుతున్నది. ఇంట్ల వున్న రాతెండి గిన్నెలను కుర్సెదగ్గర సర్ది పెట్టింది మాయమ్మ. పెట్టి పెట్టి రాతెండివి ఒడ్సినయి. మిగితా జాగల్ల మంటి పల్లాలు వెట్టింది. ఇంకా పెట్టాల్సిన జాగలున్నయి. నేను ఏంపెట్టాలా అని దేవులాడుతున్న. అంతలోనే అమ్మ పగిలిన కుండ బోకులు తెచ్చి పెట్టింది. ఇంక ఇంట్ల జూస్కో ‘‘తపతప టిన్ టిన్ టన్ టన్’’ రకరకాల సంగీతనాదాలు. ఆ సప్పుళ్ళ నడుమ అమ్మ తిరుగులాడుతున్నది. వాటిల్లో నిండిన వాన నీళ్లు బయట పారబోస్తున్నది. నేను ఒక సేత్తో పెసరుగాయ తినుకుంట ఇంకో జెత్తో నీరును పారబోసిన.
‘‘అగగో గోలెం సాటుకు కురుస్తున్నదే’’! సిన్నోడు కేకవెట్టిండు. అమ్మ ఉరుక్కుంటొచ్చి అక్కడ ఇనుప గంప వెట్టుకుంట ‘‘ఇల్లంత జల్లెడోలైంది ఎన్నంట వెట్టాలె. ఎన్నెన్ని సర్దాలె. ఏటేటా గుడిసె కప్పుతుండె. ఈ ఏడు లేక ఈపూరిళ్లు సీపతి ఇట్లైంది’’ అనుకుంటనే మాయమ్మ గునిగింది. ఇల్లంత కలియ దిరిగుతున్నది. వాన ఏమాత్రం ఎలువలేదు. బయట వాన సప్పుడు, ఉరుముల సప్పుడు. ఇంట్ల కురిసె సప్పుడు. ఎవరు ఏం మాట్లాడినా వినవడడం లేదు.
‘‘పిలగాడు ఎంతగానం తడ్సెనో…..ఊర్లకొచ్చెనో…. అడ్విలోనే ఉన్నడో,…యాది తెల్వకొచ్చె….ముసలమ్మ ఇంకా రాకపాయె’’ అంటుండంగనే సంగవ్వొచ్చింది. లేకి కల్లాలు తిర్గి తిర్గినా ఏం దొర్కలేదంట..ఇంత పొద్దు మిగిలిందని దొర్సానింటికి పోయి మూడు సంచుల జొన్నలు సెరిగి ఇసుక జేసినందుకు సద్దిరొట్టెలు పప్పుశారు పోస్తె గురిగిల కుంచి సాటుకు పట్టుకొని తీసుకొచ్చింది. చిన్న కుల్లల మూటలోంచి తాలోడ్లు వడిపిళ్ళు తీసి శాట్ల వోసింది. వాటిని మాయమ్మ తీసి ఆరుసాటున కుర్వకుండ కుండలవోసి కప్పి పెట్టింది. అన్న నిండ తడిసి ముద్దయి ఇంటికొచ్చిండు. “రామచంద్రప్ప ఒచ్చిండని” మాయమ్మ గట్టిగా సంబరంగ అన్నది.
‘‘గోనె కొప్పెరను సూరుకు తగిలిచ్చి పటువల నీళ్లతో కాళ్లుకడుక్కొని రా కొడుక’’….. అన్నది. ‘‘కట్టిచ్చిన రొట్టె సరిపోయినాదప్ప’’ అంటూ సంగవ్వ అడిగింది. ‘‘యాడనె అవ్వ దూల్లు నన్ను కుసోని తిన్నిచ్చినయా? మల్లమల్ల పటేల్ సేండ్ల వడనీకే సూస్తున్నయ్. బరుగువట్టుకొని వాటి ముందుండి ఒరాల పోంటి మేపిన. మూడు గొట్టంగ మడ్గుల నీళ్లు తాగిచ్చిన. అవి నెమరేసుకుంట సెట్టునీడకు వండినయ్. అప్పుడు నేను రొట్టె సద్దిప్పి తిందమనుట్లనే దొంగొచ్చినట్లొచ్చింది వాన. సద్ది మూట ఇడ్సిన రొట్టెను మల్ల సుట్టుకొని ఊరు మొఖాన వచ్చిన’’ అని సిట సిటా జెప్పిండు. కుంచి బట్టతో అన్న నెత్తి తడి తుడుస్తున్న అమ్మ కోపంతో ‘‘ఆని దొంగదూల్లు ఉన్నతుండయి, నా పిలగాన్ని ఆకలికి జంపినయి, గదాంట కాలి కాలికి తిరిగి నా పిలగాడు కడుపుకు తిండిలేక గిట్టవడవట్టే….. ఈ ఏటికి అయిపోతె వాళ్ళ పీడ వోతది కొడుకా. ఒచ్చేటికయితే మీయప్ప పట్నం నుండొస్తడు అప్పు తీరుస్తడు. ఇంక శానదినాలు లేదు. ఏరొంక ఎట్లా అయిపాయె. మంటెడ్ల అమాసొంకలయితె యాడదైతది. ఉన్న నాలుగు నాగాలు పటేలుకు ముట్ట జెప్తె యాడాది నిండె’’…. అనుకుంట అమ్మ అన్న పెయ్యంత జవురుకుంట ఓదార్పు మాటలు జెప్పింది.
ఈ మాటలు జెప్పుతున్నది మాయమ్మగాని ఆమెకే నమ్మికలేదు. మాయప్ప పట్నం కెళ్లి సంపాదించుకొస్తడు, అప్పు తీరుస్తడు అని అన్న కోసం జెపుతున్నది. ఇంతలో సంగవ్వ పొయ్యిల కట్టెపుల్లలు వెట్టి అంటవెట్టింది. అందరం పొయ్యి సుట్టు జేరి కాపుకుంటున్నం. తెచ్చిన రొట్టె నాకింత సిన్నోనికింతిచ్చి మిగిలినదాన్ని అన్న తిన్నడు. అన్నపాలుకుంచిన పెసరుకాయలో మేం పాలుగూడినం. అన్న మెల్లిగా అవ్వా మాయప్ప పట్నంకెల్లెప్పుడొస్తడే, వెంకట్‌రెడ్డి పటేలోళ్లు ఇప్పుడడుగుడు బందు జేసిండు ఎందుకేమ్మ?’’ అనడిగిండు.
‘‘ఊరుకో కొడుక ఇప్పుడు ఆల్ల పేరు ఎత్తకు కడుపుల మసుల్తది. ఎర్తం మీయప్ప మీద పీడవెట్టిరి, తల్లి పిల్లలకు ఎడవాపిండ్రు. మన ఇల్లును ముంచిండ్రు. ఆల్ల ఇండ్లల్లనే దొంగను వెట్టుకొని మనల దొంగల జేసిరి. ఆ ఎల్లమ్మ తల్లి కండ్లు మూసుకోలేదు. రొట్టెమీద కారంపెట్టినట్లే ఎంబడే ఇంటి దొంగను వట్టిచ్చె. దునియ జూస్తనే ఉన్నది. మంది సంసారాలకు ఇంగులం బెడితే కాలిపోయే మంటల్ల ఆల్ల సంసారం కాలకుండ ఎట్ల వుంటది? మీయప్పను సూస్త సూస్త దొంగను జేసిరి. అయినా కాపు పటేండ్లను నమ్ముకోని రెక్కలప్పజెప్పెటోల్లం . దొంగతనం ఎట్ల జేస్తం? చేసిన రెక్కల కష్టానికే పైకం గ్యారెంటీ లేనొల్లం . పైకం లెక్కలు అడగనోల్లం. బతుకునంతా ఆల్ల కోసం ఖర్చుపెడుతున్న్లోం. ఆడ ఇంకా దొంగతనం జేస్తమా అయినా దొంగతనం జేసే జాతి మనదిగాదు. కష్టంజేసుడే ఎరుక గాని దొంగతనం తెల్వది. అన్నీ తెలిసి దొంగతనం పెట్టిరి. ఈల్లను మా కాపోల్లని నమ్మినమ్మి ఎక్కువ వెట్టిజేస్తే, ఆల్లు మాత్రం పెట్టింది దొంగతనం. ఎర్దంగా కొట్టి సంపుతరని రాజ్యంకాని రాజ్యం పొయ్యిండు. లత్కోరు బాడ్కావులు, కప్పకు తోకలేదు కాపులకు నీతిలేదని ఊకె అనలేదు పెద్దలు. ఆడు ప్రాణానికి భయపడేటోడు కాడు కాని ఇజ్జతికి పడిసచ్చెటోడు. దొంగ దొరికిన సంగతి జెర్ర మీయప్ప సెవుమీద వడినా మనుసు కుదుటవడు, ఇంటికొచ్చు కొడుకు. ఇంతవరకు రాకపాయె ఏడున్నడో? ఏం జేస్తున్నడో? ఏం తింటున్నడో పత్త తెల్వకపాయె. యాడాది దాటినా జాడలేదు, దేవుడా నా కొడుకును సల్లగ జూడు కట్ట మీది నల్ల పోచమ్మ తల్లి, నా కొడుకు నాకు దక్కితే నీకు ముడుపు కడ్త’’ అని మా సంగవ్వ ఒకటే మొక్కుతున్నది..యేల్లవోస్తున్నది.
———————————
ఆ రోజు జిన జిన వాన పడుతున్నది. అయినా మాయమ్మ వాకిలూడ్చి పెండకసువు తీసింది. కసువు గంప ఎత్తుకొని తలాకిలి దాటుతున్నదో లేదో మాయప్ప యెదురొచ్చిండు. మాయమ్మ గట్టిగా ‘‘మీయప్ప ఒచ్చిండురో… ’’అని అంటుండగనే మేమంతా దిగ్గున లేచి కూర్చున్నం. మా చిన్నోడు మా యప్పను పట్టుకొని ఇగ యేడ్సుడే మొదులు వెట్టిండు. మాయన్న, నేను దగ్గర బోయి నిలవడినం. మా తమ్మున్ని బుజంమ్మీదేసుకున్నడు. మమ్ము సెరోసేత ఎత్తుకొని ఏడుస్తున్నడు. మేం సంతోషముతో మాయప్పని కిందికెల్లి మీది వరకు చూస్తున్నము. మా సంగవ్వ లోపలికెల్లి చెంబుల నీళ్ళతో యేడ్చుకుంటూనే వచ్చింది. నీళ్ళు తీసుకొని మాయప్ప పక్కకు పెట్టుకొని అరుగు మీద కూసున్నడు. నెత్తి మీది కసువు గంప కిందవెట్టపోయింది మాయమ్మ. ఎత్తిన గంప కిందవెట్టగూడదమ్మా నాలుగడుగులుపోయి ఏసిరాపో అన్నది మా పక్కింటి ఎల్లవ్వ. ఉర్కినట్లేపోయి కసువు పెంటలేసొచ్చింది. మాయమ్మ మా అవ్వ సెరోపక్క కింద కూర్చున్నరు. కూర్చున్నరో లేదో ఇగ మా సంగవ్వ సురువుజేసింది. ‘‘ఇన్ని దినాలాయె కొడుకా – యాడుంటివీ, ఏం దింటివీ – ఏం పని జేస్తివీ అంతా నల్లకట్టెవడ్డవ్ బిడ్డా, మనిషివంతా గుంజుకపోయి సగమయినవ్ – నీ పెండ్లం, పిల్లలూ నేను పిట్టలోలె ఎదురుజూస్తుమిరా’’ అని ఎత్వానం మొదలువెట్టింది మా సంగవ్వ. మల్ల అవ్వనే ఏమనుకున్నదో ఏమో ‘‘లేవు కొడుకా కాళ్లు గడుక్కో బుక్కెడు దూపతాగి మాట్లాడుకుందం’’ అన్నది. ఆ రోజు యిత్నాలకని పోసి పెట్టిన తెల్లజొన్నలు మాయమ్మ గిర్నికి వట్టుకొచ్చింది. పొయ్యి వెలిగిచ్చి దన్న దన్న జెర్ర సేపట్లో ఉడుకుడుకు రొట్టెలు జేసింది. మాయప్ప కడుపునిండా తిన్నంక “ఇట్ల తినక ఎన్ని దినాలయిందో గీ పొద్దు తింటిరా కడుపునిండ’’ అని బేపు దీసిండు. ఇన్ని దినాలు పట్నంల ‘‘ఆగం బతుకు బతికిన’’ అని సెప్పుడు సురువు జేసిండు. పట్నంల ఒక్క తీరు పని దొరకలేదంట. ఉప్పరి పని జేసిండంట. తోడెం దినాలు అడ్డ మీద ఉన్నడంట. బుట్టి పట్టుకొని బఠాణీలు అమ్మిండంట. కూలి చేసిన పైసలతో ఉప్పరి పని కోసం పార, సల్కెపార కొన్నడంట. అప్పుడే పట్నంలో యాక్షన్ జరిగిందంట. అడ్డమీదున్న మాయప్పను పోలీసులు తీస్కపోయి జరిమానా వేసిండ్రంట. అప్పుడే పార, సల్కెపార అమ్మి ఆళ్లకి పైసలు కట్టి బయటవడ్డడంట. పెయ్యి మీదున్న బట్టలతో పోయి చినిగినబట్టల తో ఇంటికొచ్చిండు. మాయప్పను జూసి మా సంగవ్వ తల్లడిల్లి పోయింది. ‘‘ఈడనే గాశారం బాగలేదంటే ఆడకూడ పీడవట్టింది. ఆ సామాను మీద ఆ పట్నం మీద మన్ను బొయ్య. పోతే పోయినై మనిషివి తిరిగొచ్చినవ్ సాలు కొడుకా. అప్పుంటే తల్లి నల్గురం రెక్కల కష్టం జేసుకొని తీర్సుకుందం. ఎవ్వని కిందా జీతం వద్దు’’ అని మా సంగవ్వ జబ్బ జర్సి మరీ ధైర్యం జెప్తున్నది. మాయప్ప సిన్నోని నెత్తిల చేతియేళ్లు జొర్రిచ్చి కిందికి మీదికి అనుకుంట నేలకేసి జూస్తున్నడు. అంతట్లనే బాగున్నవా బాలప్ప అనుకుంట పక్కకేరి నుండి నింగంపల్లి సాయవ్వ వచ్చింది. సాయవ్వ చేతిలో పెద్ద పెండగంప నడుమ నడుమ చినిగి అతుకులేసిన రెండు గోనె సంచులు, మాసిన పచ్చ కుంచి ఉన్నయి. ఆమె దగ్గర జొబోమని ఈగలు, యాపపండు వాసన గప్పునొచ్చింది. ‘‘మనున్న మనిషి యెన్నటికయినా కంట్లపడతడంట, మంట్లెపోయిన నాడే కానరాడంట ఇన్నాళ్ళకొస్తివి బిడ్డా యా రాజ్యం తిరిగొస్తివి నాయిన. ఎర్తం నిన్ను రాజ్యాలు వట్టిచ్చిరి నియ్యతులేనోళ్లు. అత్త కోడళ్ళంటే మీవోళ్లేనప్పా.. సెల్కను సేతులవట్టిరి. ముగ్గురు పిల్లలను సాదిరి. కరువు కాలం లో బతుకు పల్లేరుగాయయ్యింది’’ అనుకుంట వల్కరించింది సాయవ్వ. ‘‘పట్నమొంకల పోయినక…యాపని దొర్కితే ఆ పని చేసిన’’ అని జెప్పిండు మాయప్ప. యెంటనే సాయవ్వ ‘‘మనిషివి మా దాంట్ల వడితివి. కష్టం జేసుకొని బతుకుండి రెక్కలున్నంతకాలం మనకు బతుకున్నద’’ని చెప్పింది. చెప్పుకుంటనే మాయమ్మను, సంగవ్వను ‘‘ఏమమ్మ సర్రున బయట వడుండి. ఈ పొద్దు మీరు ముగ్గురైతిరి గద’’ అన్నది. ఇప్పుడు మాయింట్లో పని జేసెటోళ్ళు నులుగురైండ్రు. ఎటు తిరిగి నేను, సిన్నోడే పెడితే తినేటోళ్లం. మాయక్కదైతే మనువైంది. మాయమ్మ మాకు కటారల నూకల జబురు పోసి గూట్లో వెట్టింది. ‘‘కుక్క లొచ్చి జబురు తింటే మీరు ఆకలిగుంటరు. పైలం కొడుక. తలుపు తెరిచిబెట్టి ఆటలకు తగులకుండి’ అనుకుంట అడివికి యెల్లిపోయిండ్రు. ఏరిన యాప పండును అడవిలోనే కాల్వ మడుగుల్ల కడిగి ఎండవెట్టిండ్రు. ఇంటికొచ్చేటప్పుడు యాపగింజలను కోమటి నారాయణ షావుకారుకి అమ్మిండ్రు. అమ్మి దినాం లాగానే రాత్రి గాసం కొనుక్కొచ్చిండ్రు.
‘‘కరువు కాలం బర్గాలం ఎమ్మినోడొచ్చినట్లొచ్చింది. ఈ యేడన్నా వానలు పడితే కూలిమంది బత్కుతరు. లేకుంటే ఒర్రి సచ్చే కాలం వచ్చేటట్లున్నది’ అని మాయమ్మ గునుక్కుంట తలెముంతలు తోమింది.
‘‘ఇన్ని దినాలు పిల్లలకు జబురు పోసి నడిపితిమి. నా కొడుకొచ్చిండు. ఇంట్లంత యాపసేదు నిండింది. నోరంతా ఎలుగడి వెట్టినట్లున్నది. ఈ పొద్దు దినాంకన్నా యాపగింజలు ఎక్కువనే ఏరినం. ఉప్పు, మిరపకాయ షేరు నూకలు తీస్కొచ్చి, కటిక ఇస్మాల్ దగ్గరకెళ్లి కిలో కూర తెచ్చుకొని వండుకుంటెకాదా’’ అనుకున్నరు మాయమ్మ, మాయవ్వ. అనుకున్నట్లనే అన్ని కొనుక్కొచ్చిండ్రు. నాకు, మా సిన్నోనికి మస్తు కుషిగున్నది. ఆ కుషిలో మా సిన్నోడు ఇంతింత దానికే పకపక నవ్వుతున్నడు. మా కుషిని జూసి మాయమ్మ మొఖం వెలిగి పోతున్నది. ఈ పూట నా పిల్లలకు కడుపునిండ తిన వెట్టుకుంట అన్న నమ్మకం మొఖంలో కనిపిస్తున్నది. మా సిన్నోడు వొగలు జేసుకుంట మాయమ్మ కొంగువట్టుకొని తిరుగుతున్నడు. అమ్మా ‘‘నాకు తునక’’ అంటున్నడు. వాని మాట మీద కూరలోని మెత్తటి ఎర్రతునకను పొయిల నిపుకల మీద వేసి మంచిగ కాల్చి ఇద్దరికిచ్చింది. అన్నకింత దాచిపెట్టింది. మేం తునకలు నములుకుంట బయట మా జతగాళ్ల దగ్గరకొచ్చి వూరిచ్చికుంట మరీ దిన్నం. ఇంట్ల ఒక పొయ్యి మీద కూర, ఇంకొక పొయ్యి మీద నూకల బువ్వ కుతకుతా ఉడుకుతున్నయ్. ఇంట్ల కూర వాసన గుమ్మని వాకిట్ల కొస్తున్నది. బజారుకి పోయిన మాయప్ప ఇంటికొస్తూనే ‘‘మీయమ్మ కూరొండుతున్నాదిరా…. కమ్మగ వాసనొస్తున్నది’’ అనుకుంట అరుగు మీద కూసున్నడు. ఈ పొద్దు కల్లు తాగుత ‘‘తోడెం పైసలియ్యే’’ అని మాయమ్మని అడిగిండు. “ఇంకా యాడున్నయ్ ఉప్పు, మిరపకాయ ఇంత కూర తీసుకొచ్చినంక ఇంక పైసలు మిగుల లేదు. అయి
పోయినయ్’’ అని చెప్పింది. మల్లి కొద్ది సేపటికి ‘‘తోడెం పైసలియ్యే అంటే పది మాటలు చెప్తవ్’’ అని నోరు పెద్దగ జేసి అడిగిండు. ‘‘ఇదేం అన్యాలం ఇంక నేను ఏడ దాసుకుంటి, అన్ని జూసుకుంటనే పైసలడిగితే ఏమన్నట్లు’’ అన్నది. ‘‘అన్యాలమంటావే మాటలు శానా నేర్చినవ్, అన్ని జూస్తినా, నీవేమేమి చేసినవ్, నాకేమెర్క’’ అనుకుంట మీదిమీదికి పోతున్నడు. మాయమ్మ గమ్మున పొయికాడ కొరకాసులు పొయిలోకి జరుపుకుంట కూసున్నది. ‘‘ఏమే, నేనేమి చూసినా అంటే చప్పుడు చెయ్యవు’’ అని ఎంట కెల్లి నడుంమీద తన్నిండు. నేను, సిన్నోడు అమ్మా… అని గట్టిగ అరిసినం. మాయప్ప మా వైపు ఒక్కసారి ఉరిమి చూసిండు. ఆ సూపుకి భయపడి గప్పున నోరుమూసుకొని ఒక మూలకి నతికినం. ఇక మాయమ్మను గొడ్డును కొట్టినట్లు కొడుతున్నడు. ‘‘వాయమ్మో సస్తినే నా పానం తీస్తడు’’ అనుకుంట మొత్తుకొంటూనే వుంది. అయినా మాయప్ప కొట్టుడు ఆపకొచ్చిండు. అమ్మను కొడుతుంటే నా పానం పోయినట్లైంది. మా సిన్నోడు గదగద వనుక్కుంటూ లాగులో ఒంటికి పోసుకున్నడు. మాకు దగ్గరకు పోయి ఆపే ధైర్యంలేదు. దగ్గర పోతే మమ్ముల కొడతాడేమోనని భయం. మాయమ్మ జస్తదేమోనని భయం పట్టుకుంది. మాయమ్మ ఏడ్పు సప్పుడుకు మంచినీళ్ళ బాయికి నీళ్ళకు పోయే ఆడోళ్ళంతా మా ఆకిట్ల గుమిగూడిండ్రు. వాళ్లు మాయప్పను తలా ఒక మాట తిట్టిండ్రు. వాల్ల మాటకు కొట్టుడాపి బయటకొచ్చిండు. ఇంక మేం మాయమ్మ దగ్గర జేరినం. మాయమ్మ కదలకుండా పడిపోయింది. మాకు లేపడానికే రాకొచ్చింది. అంతట్లోనే మా సంగవ్వొచ్చి మాయప్పను తిట్టుడు సురువు జేసింది. ‘‘నువ్వొచ్చి మూడు దినాలు కాకపాయే, కొట్టుడు సురువు జేసినావురా!… ఎమినోనిలాగా దాని పానానికి దగిలినవ్. ఎంతని కొడుతవ్, కొట్టి కొట్టి దాని పెయ్యంత తూట్లు పడగొట్టినవ్. షాత కాకుండా జేసినవ్, ఎట్ల పనిజేస్తది అనుకున్నవ్. గీ ఊపుడంతా నీ మీద దొంగతనం పెట్టినోళ్ళ మీద జూపియ్యి శాతనైతే. నీవు ఊరిడ్సి ఇల్లు ఇడ్సి రాజ్యం మీద పోయినపుడు పిల్లలను నన్ను వట్టుకోని సూపెట్టుకొని ఉన్నదిరా. అదిగాంగా ఉన్నది. ఇంకోకతి ఇంకోతైతే ఉండకపోవు. సగం కడుపుకు తిని కడుపు కాల్చుకొని, మా కడుపు జూసింది. అదిరా నీ పిల్లలకు తల్లి అన్నా, నాకు కోడలన్నా అదేరా! కొంగెరోడా ఎంగిలి సూపులు జూసేటోల్లను ఎవరిని ఎక్కడ పెట్టాల్నో అక్కడపెట్టి, సంసారం జేసింది’’ అని ఒక్క తీరుగ తిడుతున్నది. ఆడోళ్ళంతా మాయప్పను ‘‘గట్లనాప్ప కొట్టుడు? పట్నం బొయ్యి గదే నేర్చుకున్నావ్? అది నీకోసం కండ్లల్ల ఒత్తులేసుకొని ఎదిరి చూస్తే నీవొచ్చి ఆమె పెయ్యి మెదగగొట్టుడు గిదేం తరీక తమ్మి, మర్ది అని ఎవరి వరుసతో వాళ్ళు సర్ది చెప్పిండ్రు. అంతట్లనే ఊరుకెల్లి సుట్టాలొచ్చిండ్రు. మా అక్క కాన్పు అయిందనే సంగతి సెప్పొచ్చిండ్రు. ‘‘తొల్సూరు కాన్పయింది. దినాలు నిండక ముందే కన్నది’’ అని. ఆమె సేన్ల పెసరుకాయ బర్కవోయి కన్నదంట. ఆడోళ్ళంతా సేన్లనే కాన్పు జేసిన్రంట. ‘‘కొడవలితో బొడ్డు గోసిన్రంట. ఎడ్లబండిని కట్కపోయి తల్లిని, పిల్లను ఇంటికి జేర్చిండ్రు’’ అని సెప్పుకొచ్చిండ్రు వచ్చిన సుట్టాలు. ఇప్పటికయితే తల్లిపిల్ల మంచిగనే ఉన్నరు. ఆగేత్రానా తల్లిని తీసుకపోతమని వచ్చిండ్రు వాళ్ళు. ఇగ మా సంగవ్వకు సల్ల చెమటలు పట్టినయ్.
‘‘నా పిల్లకు ఇంక రెండు నెల్ల దినముండే కననీకె. ఇప్పుడే ఎట్లయిందప్ప? కాన్పుకు మాయింటికి తొలుకొచ్చుకుంద మనుకున్నం, దేవుడు గిట్ల జేసిండు. జర జెప్పు నాయిన తల్లి పిల్ల బాగున్నరా’’ అని మల్ల బతిమిలాడింది. అప్పుడిగ మా సంగవ్వ మాయప్పొంక మర్లింది.
‘‘ఇప్పుడేం జేస్తవురా బట్టెబాజి కొడకా. నా కడుపుల సెడవుట్టినవ్. దాని నడుములు ఇరగొట్టి పండవెడ్తివి. ఇప్పుడు నీ బిడ్డవి మైల బట్టలు ఎవరు ఉతుకుతర్రా? తొలుసూరు కాన్పు తల్లిజేసే తరీక. ఇప్పుడెట్ల జెయ్యమంటవ్ ఓ…’’ అని నెత్తికి చెయ్యి వెట్టి ఏడ్సుకుంటా కూసున్నది. ఆ మందిలకెల్లి నింగంపల్లి సాయవ్వొచ్చి ‘‘యెంతుంటే యేం ఫాయిద బాలెంతకిప్పుడు తల్లి కావాలె మైల బట్టలుతుక. పెద్దలూకే అన్నరా ‘‘ఏనుగంత తండ్రి పొయ్యి యేకు బుట్టంత తల్లి ఉండాలని’’ అన్నది. “జర వాయిలాకు దెచ్చి ఆమె నడుముకు కాపుండమ్మ నొప్పులు మొద్దువారినట్టు అయితయని” జెప్పింది. నేనింక వాయిలిచెట్టుకోసం దౌడు తీసిన.
*
గాడతతో కూడిన భావ వ్యక్తీకరణకు భాష ఆటంకం కానే కాదు…. అనడానికి ఈ కధ ఉదాహరణగా నిలుస్తుంది. అసహనంతో తండ్రులు తల్లులను తన్నుతున్నప్పుడు బితుకు బితుకుమంటూ ఏడుస్తూ పిల్లలు చూసే బిత్తర చూపే ఈ కథ. ఈ కథ చదువుతున్నపుడు సమ్మె కాలంలో మా నెల్లిమర్ల కార్మికుల కుటుంభాలలో నెలకొన్న ఇటువంటి దుస్థితి గుర్తొచ్చి నా కళ్ళు చెమర్చాయు.
మంచి కథను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. దళితుల కథ మీద ఇంకా సరైన విమర్శ రావాల్సే ఉంది. కేవలం అంకెలు, సంఖ్యల కోసమే దళిత రచయితల పేర్లు గుర్తు చేసి చేతులు దులుపేసుకునే సంప్రదాయం తెలుగు సాహిత్యంలో ఉంది. ఈ మూసను బద్ధలు కొడుతూ కథను, కథా రచయిత్రి నేపథ్యాన్ని పరిచయం చేయడం బాగుంది. శ్యామలక్క రాసిన కథల్లో ఏ కథకు ఆ కథే గొప్పది. ధన్యవాదాలు.
-డా.పసునూరి రవీందర్
మంచి కథనూ, గొప్ప రచయిత్రినీ పరిచయం చేశారు, థాంక్స్ !
అద్బుతమైన యాస, కథనం, వస్తువు. కడుపు నిండి నట్లు అయ్యింది.