ఆయన డెబ్బయి మూడేళ్ల వృద్ధుడు. అనూహ్యంగా ఒక మూడు నెలల పాపతో స్నేహం కుదిరింది.
ఒకప్పుడు ఆయన జ్యోతిష్య పండితుడు. ఇప్పుడు పాప చూపుల్లో అతని బతుకు భవిష్యత్తు మళ్ళీ వెలుగుతోంది.
గతంలో గాన కోవిదుడాయన. ఇప్పుడు పాప నవ్వులో సంగీత గమకాలు వినగలుగుతున్నాడు.
ప్రేమించి వర్ణాంతర వివాహం చేసుకున్న కూతురు కళ్యాణిని కఠినంగా కాదనుకుని, తర్వాత ఆమె మరణంతో కృంగిపోయిన సూర్యనారాయణ శాస్త్రి ఇప్పుడు పశ్చాత్తాపంతో కుమిలి పోతున్నాడు. ఈ పాప తల్లి పేరు కూడా కళ్యాణి.. ఆయనలో నిద్రాణమై ఉన్న పితృ వాత్సల్యాన్ని తట్టి లేపిన పేరు.
భార్య కూడా మరణించడంతో దిక్కులేనివాడైన ఆయన జీవిత నౌకకు ఇప్పుడు పాపే దిక్సూచి అయింది. నడవలేని నిస్సహాయుడైన డెబ్బయి మూడేళ్ల ఆయనకు మంచమే ప్రపంచం. మూడు నెలల చంటిపాపకు ఊయలే ప్రపంచం.
అయినా ఇద్దరూ ఒక అందమైన ప్రపంచంలో రోజూ నవ్వుకుంటూ, పలకరించుకుంటూ, మాట్లాడుకుంటూ ఉంటారు. ఊసులెన్నో అంతు లేకుండా సాగిపోతుంటాయి.
వృద్ధులైన తల్లిదండ్రులను పిల్లలు నిర్లక్ష్యం చేయటం, ఆస్తి పంపకం వేసుకొని, కొన్నాళ్ళకు ‘ఎప్పుడు పీడా వదులుతుందా’ అని వాళ్లు అనుకోవటం, ‘ఈ నరకం ఇంకెంతకాలం, ఈ ప్రాణాలు గాలిలో ఎప్పుడు కలిసి పోతాయో’ అని వీళ్ళు భావించటం వంటి కథలు చదివాం. పిల్లల దాస్టికం, వృద్ధుల ఆవేదన రకరకాలుగా వర్ణించిన కథలు విన్నాం.
రచయిత వంశీకృష్ణ రాసిన “శ్యామ కళ్యాణి” కథ సాధారణంగా ప్రారంభమై, హఠాత్తుగా కథ సగం నుండి అసాధారణంగా, అనూహ్యమైన మలుపు తిరిగి పాఠకుల గుండెను తాకుతుంది.
ఆజానుబాహుడైన సూర్యనారాయణ శాస్త్రి చేతిలో జ్యోతిష్య పుస్తకం పట్టుకొని వస్తుంటే గౌరవం గా ఊరందరూ చూసేవారు. కూతురు చదువు కోసం పట్టణం వచ్చి, చిన్నప్పుడు అద్దంకి శ్రీరామమూర్తి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ లతో పాటు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గర నేర్చుకున్న సంగీతానికి మరింత పదును పెట్టుకుంటూ, తన సహాధ్యాయులనే కచేరీలకు ఆహ్వానించే స్థాయికి వచ్చారాయన. శ్యామ శాస్త్రి కి ఇష్టమైన రాగమే తనకీ ఇష్టం కనుకనే కూతురికి ‘కల్యాణి’ అని పేరు పెట్టుకున్నారు.
కన్నబిడ్డలే ఆదరించని రోజుల్లో తమ్ముడు కొడుకు ఇల్లు రాయించుకుని, హైదరాబాద్ లోని అపార్ట్మెంట్ కి తీసుకెళ్ళాడు. బాగా చూసుకుంటాడని అనుకోకపోయినా, కొన్ని రోజులకు ఆయన మకాం కారిడార్ లోకి, ఆ తర్వాత సెల్లార్ లోకి మార్చబడడంతో ఖిన్నుడై పోయాడు.
వేదం లోనూ, సంగీతం లోనూ గొప్ప పాండిత్యం ఉన్న, డెబ్బయి మూడేళ్ల సూరావజ్జల సూర్యనారాయణ శాస్త్రి ఇప్పుడు కాళ్ళు చేతులు పనిచేయక, మాట పడిపోయి, ఆస్తమాతో నిస్సహాయంగా మంచంలో పడివున్నాడు. ఆ పక్కనే పదిహేను అడుగుల దూరంలోనే వాచ్మెన్ గంగరాజు రెండు గదుల ఇల్లు.
ఒకరోజు పూర్ణ గర్భంతో గంగరాజు కూతురు పురిటి కి వచ్చింది. ఆమె పేరూ కల్యాణి కావడం కాకతాళీయమే అయినా శాస్త్రి గారి మనసు పొరల్లోని మమతల గూడుని కదిలించింది. ఆమెకు ప్రసవమై చిట్టిపాప వచ్చాక, కొద్ది రోజుల్లోనే ఆ పాప కళ్ళు తిప్పి తన వైపు చూడడంతో ఆయన శ్వాస కు ఒక ఊతం లభించినట్లయింది.
పచ్చగా బంగారు వన్నె కలిగిన తన కూతురు కళ్యాణి కంటే ఈ కళ్యాణి కొంచెం రంగు తక్కువ. ఆమెకు పుట్టిన ఈ పాప “శ్యామ కళ్యాణి” అని మనసులో నిర్ధారించుకున్నాడు. పేరు పెట్టేసుకున్నాడు.
ఇక్కడ వారిద్దరి వయసు తారతమ్యం లేకుండా స్నేహ వారధి ని రచయిత వంశీకృష్ణ చాలా అందంగా, పటిష్టంగా ఏర్పరిచారు.
జీవితం ముగిసిపోలేదు అన్న ఉత్సాహం, బ్రతుకు పట్ల గోరంత ఆశ ఆ పాప మోములో ఆయనకు లభించింది. తన దుస్థితి కి కారణం ‘కాల మహిమ’ అనే నిరుత్సాహం, నిర్వేదం, నిర్లిప్తత ను తోసేసి, జన్మ జన్మల బంధం లాగా, ఆయన కోసమే దేవలోకం నుండి దిగివచ్చిన దేవత లాగా ఆ పాప “నేను నీకోసమే వచ్చాను” అని భరోసా ఇచ్చినట్లు ఉంది ఆయనకు.
ఈ సందర్భంగా ఓ. హెన్రీ రాసిన ప్రఖ్యాతమైన “ది లాస్ట్ లీఫ్” అనే ఆశావహ దృక్పథం కూడిన కథ జ్ఞప్తికి రావడం అసందర్భం కాబోదు.
ఈ మంచానికి ఆ ఉయ్యాలకి మధ్య ఒక ఆహ్లాదకరమైన స్నేహ వారధి. అది అనిర్వచనీయం. ఇద్దరూ మాట్లాడుకోలేరు కనుక అది ఒక మౌన సంభాషణ. ఒకరికొకరు ఓదార్పు. విప్పార్చిన ఆ కళ్ళల్లో తనకు దూరమైన ప్రపంచాన్ని చూడగలిగాయన.
బీటలు వారిన మనసుపై జల్లులు జల్లులుగా కురుస్తున్న వాన లా ఉంది పాప నవ్వుల ఝరి. విరిసిన ఆ నవ్వుల్లో ఆయన ఏవో సంగీత రాగాలనే విన్నాడు. అదో కొత్త బంగారులోకం. అదో కళ్యాణి రాగం. శ్యామ కళ్యాణి రాగం.
తన మనసులో గూడు కట్టుకున్న మూగ భాసల్ని, తన సొదలనీ చెప్పుకునే వాడు ఆయన. ఏం పర్వాలేదులే అన్నట్టు పాప “బు… బ్రూ” అంటూ ధైర్య ప్రవచనాలను పంపుతుంది. ఆయన మనస్సు కొద్దిగా కుదుటపడుతుంది. తన అనారోగ్యం, అసహాయత దీనంగా కళ్ళతో చెప్తాడు ఆయన. పాప తన చిరునవ్వుతో ఓదార్పు తరంగాలు పంపుతుంది.
ప్రాణం పోతుందేమో అనుకుంటున్న సమయంలో ప్రణవనాదం లా మారిందా పాప ఊ ఊ శబ్దాలు. స్తబ్దుగా మారిన, నీరస మేఘాల ముసురుకుంటున్న జీవితంలో మెరుపుతీగలా మెరిసిందా పాప నవ్వు. వారిద్దరి మధ్య నిరంతరం సాగుతున్న సంభాషణలో మాటల్లేవు. గంటలు గంటలు కలబోసుకున్న కావ్యాలకు లిపి లేదు.
కానీ పుట్టింటికి వచ్చిన తల్లి మెట్టినింటికి వెళ్లక తప్పదు. పురిటికి వచ్చిన కళ్యాణి చంటి పాపతో భర్త సన్నిధికి వెళ్లక తప్పదు. ఆ చిట్టి తల్లి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఆ వృద్ధ హృదయం ఆక్రోసించింది. అప్పటివరకు దాక్కున్న ఒంటరితనం మళ్లీ పంజా విప్పబోతోంది. పాప స్నేహ మాధుర్యంతో మెల్లగా చేయి కదిలించగలిగేలా ఆరోగ్యం కుదుట పడుతున్న దశలో అనారోగ్య రక్కసి మళ్ళీ మీద పడబోతున్నదని భయపడ్డాడు. నిస్సహాయంగా చూశాడు పాప వైపు. విడదీయలేని స్నేహ బంధాన్ని ఎవరో కర్కశంగా తెంచేస్తున్నట్టు వృద్ధుని మనసు గిలగిలలాడింది. వెళ్ళిపోతున్న పాప ఆయన వైపు ఆదరంగా చూసినట్టు అనిపించింది. ‘జాగ్రత్త నేస్తమా’ అని నవ్వుతూ వీడ్కోలు పలికినట్లు అనిపించింది. కానీ ఆ భారాన్ని భరించే శక్తి ఆ శుష్క శరీరానికి లేకపోయింది. పాప కనుమరుగైన ఏడు గంటలకి ఆయనలోని హంస ఎగిరిపోయింది
“పల్లెటూర్లో తల్లికేదో పాడు కలలో పేగు కదిలింది” లాగానే అక్కడ పాప గుక్క పెట్టి ఏడ్చింది – అని రచయిత ముగింపు పలికినట్లు అనిపిస్తుంది. ఏది శాశ్వతమేదశాశ్వతం, ఏది సత్యమదసత్యం, ఏది జీవితమేదిమృత్యువు, ఏది నిత్యమేదనిత్యం అనిపించేలా భారంగా ఒక వైరాగ్యం మనసంతా ముసురుకుని పోయేలా ముగిస్తారు రచయిత. విడిపోతున్న బంధాలు, కొత్తగా మానవత్వంతో పెనవేసుకునే బంధాలు, లేదా కనీసం మనసులో ఊహించుకొని సృష్టించుకుని తృప్తిపడి ఆశపడే బంధాలు … అన్ని స్పురణలోకి తెచ్చే అద్భుతమైన ముగింపు.
ఎక్కడా బిగి సడలకుండా ఒకే పట్టున సాగుతూ పాఠకుడి మనసులో ముద్ర వేస్తుంది ఈ కథ. ఒకానొక అలౌకిక భావాన్ని కలిగిస్తుంది.
ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకుని చెక్కుకుంటూ వచ్చిన ” శ్యామ కల్యాణి” రూపం ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ పాఠకుడికి. చిక్కగా అల్లుకుంటూ వచ్చిన మిత్రబంధం ఏమౌతుందో అనే ఆతృత. ఆ స్నేహవారిధి తెగిపోతే ముసలి ప్రాణం తట్టుకోగలదా అనే ఉద్వేగం. రచయిత వంశీకృష్ణ గారి ముగింపు చదివాక, పాఠకులు బహుశా ఏమీ వ్యాఖ్య చేయలేరు. ఒక సుదీర్ఘమైన నిట్టూర్పు. అంతే. అదే కదా చిత్రం! అదే కదా మాయ! అదే కదా జీవితం!
పరిస్థితుల వల్ల బండ బారిన పోతున్న హృదయాన్ని తట్టి లేపింది శ్యామ సుందరమైన పాప. చావు కోసం ఎదురుచూస్తున్న ముసలి ప్రాణాన్ని ఆపి ఆదరించిందా చిట్టితల్లి చిరునవ్వు. ఇద్దరిదీ ఒక జత. వారిద్దరి మధ్య ఒక స్నేహ వారధి. అలౌకిక మైన బంధం. అనూహ్యమైన సంఘటనలతో ఆయన ఆరోగ్యం ఎలా ఊపిరి పోసుకుంటుందో వంశీకృష్ణ “స్టెప్ బై స్టెప్” అన్నట్లుగా అందంగా, నిదానంగా, పటిష్టంగా అల్లిక అల్లారు. ఈ మధ్య వచ్చిన మంచి కథ వంశీకృష్ణ గారి “శ్యామ కళ్యాణి”.
*
శ్యామ కళ్యాణి – వంశీకృష్ణ
‘ఎలా వున్నారు? ఆరోగ్యం ఎలా వుంది?
అని ఎవరైనా అడిగితే సురావజ్జల సూర్యనారాయణ శాస్త్రి అనే సూరయ్య పంతులు గారికి కోపం నసాళానికి అంటుతుంది. వొళ్ళంతా ఆవేశంతో వొణికిపోతుంది. డెబ్బయి ఏళ్ళు పై పడిన వయసు. పుల్లల్లాగా మిగిలిన కాళ్ళూ, చేతులూ, గట్టిగా రెండు మాటలు మాట్లాడటానికి అడ్డుపడే ఆస్తమా. మనిషిని చూస్తూ
‘ఎలా వున్నారు?’ అని అడగడం ఒక ఆభాస. అలా ప్రశ్న వేసిన వాళ్ళు అదేదో క్యాజువల్ టాక్ అనుకుంటారు కానీ లోలోపల అసహనంగా, అనామకంగా రగిలిపోయే సూరయ్య పంతులు లాంటి వాళ్లకి అదొక క్రూక్డ్ రియాలిటీ.
మ్యాంగో ఆర్చిడ్ అన్న అధునాతన ఐదంతస్థుల అపార్ట్మెంట్ సెల్లార్ లో, వాచ్మెన్ రెండుగదుల నివాసానికి పదిహేనడుగుల దూరం లో ఒక కుక్కి నవారు మంచం మీద ‘ ఆ రామచంద్రుడు ఎప్పుడు కరుణిస్తాడో ‘ అని ఎదురు చూస్తూ, నిత్యం ఆస్తమా తో, గొంతులో పిల్లి కూతలతో సతమతమయ్యే సూరయ్య పంతులును నలభయి ఏళ్ళ క్రితం ఆయనను తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే ‘ఆయన ఈయన ఒకరేనా? లేక మరొకరా ?’ అని కలవరపడిపోవడం ఖాయం
నలభయి ఏళ్ళ క్రితం సూర్య నారాయణ శాస్త్రి ఇలా ఉండేవాడు కాదు. ఆరడుగుల ఎత్తైన బలిష్టమైన దేహం. విశాలమైన నుదురుమీద, భుజాలకు, మోచేతికిందా, మణికట్టుపైన, నాలుగు వేళ్ళ మందం విభూతి రేఖలు, మధ్యలో ఎర్రగా సూర్యబింబాన్ని తలపించే వెడల్పైన బొట్టు, చేతిలో నేమాని వారి పంచాంగం పట్టుకుని ఆయన నడిచివస్తుంటే సాక్షాత్తు గుళ్లో ఆ దేవుడే మనిషి రూపం ధరించి నడిచివస్తున్నట్టు ఉండేది. రాయపట్నం ఆ చుట్టుపక్కల పది, పదిహేను గ్రామాలకు ఆయన ఒక్కడే పెద్ద బ్రాహ్మడు. ఏ ధర్మ సందేహం వచ్చినా ఆయనే తీర్చాలి. ఏ శుభకార్యమైనా ఆయనే చేయాలి. ఆయన లేకుంటే ఏ ధార్మిక కార్యక్రమమూ ఆ చుట్టుపక్కల ఊళ్లలో జరగదు. వృత్తి రీత్యా పురోహితుడు అయినా, సంగీతం ఆయన అభిమాన విషయం. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గర చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నాడు. అద్దంకి శ్రీరామ మూర్తి, మంగళం పల్లి బాల మురళీకృష్ణ తన సహాధ్యాయిలు . ఆ విషయం ఆయన చాలా గర్వంగా చెప్పుకునేవారు
సంగీతం మీద ఉన్న ప్రేమతోనే తనకు తొలిచూలుగా పుట్టిన ఆడపిల్లకి కళ్యాణి అని పేరు పెట్టుకున్నాడు. పిల్ల కి పదేళ్ల వయసు వచ్చేసరికి ఆయనకు రాయపట్నం ని విడిచి పెట్టకతప్పలేదు. కళ్యాణి చదువులకోసం అని అందరిలాగే ఆయన కూడా సమీపం లో ముప్పై కిలోమీటర్ల దూరం లో ఉన్న ఖమ్మం నగరానికి మకాం మార్చాడు. రాయపట్నం లో ఉన్నప్పుడు పౌరోహిత్యం ముఖ్య వృత్తి అయితే ఖమ్మం వచ్చాకే పౌరోహిత్యం వెనక్కు వెళ్లి సంగీతం ముందుకువచ్చింది. ఖమ్మం లో తానె అధ్యక్షుడు గా ‘రాగ సుధ’ అని ఒక సంగీత సంస్థను స్థాపించాడు. ‘నెల నెలా రాగ వెన్నెల’ అని ప్రతి నెలా మొదటి శుక్రవారం సాయంత్రం ఒక సంగీత కచేరి నిర్వహించేవాడు. ఆ సభ కి పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు వచ్చేవారు. ఒక సారి బాల మురళీకృష్ణ ను పిలిపించి అద్భుతమైన సంగీత కచేరీ చేయించి ఘనంగా సన్మా నించారు . ఆ తరువాత ఆ సభ గురించి కొన్ని సంవత్సరాలపాటు ఖమ్మం లో గొప్పగా చెప్పుకునేవారు .ఆ సభ తో సూర్యనారాయణ శాస్త్రి పేరు ఖమ్మం లో మారుమోగిపోయింది . ఆ తరువాత నెల అన్నవరపు రామ స్వామి వయోలిన్ కచేరీ . ఆ రోజు కొన్ని అనివార్య కారణాల వలన అన్నవరపు రాలేకపోవడం తో సూర్యనారాయణ శాస్త్రే కచేరీ చేసి ప్రేక్షకుల మెప్పు పొందారు . అలా సూర్యనారాయణ శాస్త్రి జీవితం రెండో భాగం లో సంగీతం ప్రముఖం అయింది. తన ఇంట్లోనే సంగీతం పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు. పౌరోహిత్యం చేసుకునే సూర్యనారాయణ శాస్త్రి కాస్తా సంగీతం మాస్టారు సూరయ్య పంతులుగా మారిపోయాడు. ఎప్పుడో అయితే తప్ప పౌరోహిత్యానికి వెళ్లడం మానేశారు
కళ్యాణి డిగ్రీ మొదటి సంవత్సరం లో ఉండగా తనకు నచ్చిన, తన మనసు మెచ్చిన అబ్బాయిని పెళ్లిచేసుకుంది. సూర్యనారాయణ శాస్త్రి వర్ణాంతరం అని అభ్యంతర పెట్టి కల్యాణిని దూరం చేసుకున్నాడు. కానీ సంవత్సరం తిరగకుండానే కళ్యాణి ఒక రోడ్డు ప్రమాదం లో చనిపోయింది . అది శరాఘాతం లా తగిలింది సూర్యనారాయణ శాస్త్రి కీ ఆయన భార్య నీలవేణికీ. ఒక్కగానొక్క కూతురు ని సూర్యనానారాయణ శాస్త్రే మృత్యువు పాల్జేశాడని నీలవేణి కి శాస్త్రి మీద మహా కోపంగా ఉండేది . నీల వేణి కూతురు మీద బెంగతోనే వెళ్ళిపోయింది. ఐదేళ్ల వ్యవధిలో రెండు మరణాలు సూర్యనారాయణ శాస్త్రి తట్టుకోలేకపోయాడు. పౌరోహిత్యం మీద ఆసక్తి మొదటే తగ్గిపోగా, సంగీతం మీద అనురక్తి కూడా క్రమంగా సన్నగిల్లసాగింది
ఆ రోజుల్లోనే సూరయ్య పంతులుకి ఒకసారి పెద్దగా జ్వరపడ్డాడు. ఆ జ్వరం నాలుగు నెలల పాటు తగ్గలేదు. ఒకటి, రెండు సార్లు కిందపెట్టినాక కాస్త కోలుకున్నాడు. ఒక్కడు. చుట్టుపక్కల వాళ్ళు మాత్రం ఎంతకాలం చూస్తారు? క్రమేపీ అందరూ పట్టించుకోవడం మానేశారు. ఓ రోజు ఇంటి ముందు ఉన్న నిద్ర గన్నేరు చెట్టుకింద కూర్చుని దీర్ఘంగా ఆలోచించుకున్నాడు సూర్యనారాయణ శాస్తి. తన పుట్టుక, తన వేదాధ్యయనం, పారుపల్లి వారి దగ్గర శిష్యరికం, రాయపట్నం లో పొందిన గౌరవ మర్యాదలు, నీలవేణి తో వివాహం, ఖమ్మం రాక, కళ్యాణి మరణం, నీలవేణి వెళ్లిపోవడం అంతా ఒక్క క్షణం కళ్ళముందు తిరిగింది.
‘ఇప్పుడేం చేయాలి?’
ఆలోచన తెగక ముందే చంద్రశేఖర్ వచ్చాడు. చంద్రశేఖర్ సూర్యనారాయణ శాస్త్రి తమ్ముడికొడుకు. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో మంచిపోజిషన్ లోనే వున్నాడు
‘ఇక్కడ ఎంతకాలం ఒక్కడిగా ఉంటావు. నాతో వచ్చేయ్ పెదనాన్న. హైదరాబాద్ లో మాతో కలిసివుందువు గాని.’
‘వద్దు లేరా ! ఈ ఇల్లు వదిలి ఎక్కడికీ రాను’
‘దగ్గర దగ్గర సప్తతి కి చేరావు. వొంట్లో ఓపిక లేదు. ఒక్కడివే ఎలా ఉంటావు?’
‘నేను నీ కూడా వస్తే , మీ నాన్న, మీ నాన్న ఒప్పుకుంటాడా?’
‘ ఆయన ఒప్పుకునేది ఏముంది? నా ఇంటికి కదా రమ్మంటున్నాను !’
సూర్యనారాయణ శాస్త్రి మాట్లాడలేదు. చంద్రశేఖర్ కల్పించుకుని ‘ పెదనాన్న! ఇంకేమి ఆలోచించకు వచ్చేయ్ ‘ అన్నాడు
‘ఖమ్మం లో ఈ ఇల్లు ‘
‘ఇంటి సంగతి వదిలేయి. ఇప్పటికిప్పుడు అమ్మేసినా ముప్ఫయి.నలభయ్ లక్షలు వస్తాయి. అయినా అమ్మడం ఎందుకు? నీకు నేనున్నాను కదా. ఇల్లు నాపేరున రాసేయి’
సూర్యనారాయణ శాస్త్రి కి విషయం అర్ధం అయింది.
అలా సూర్యనారాయణ శాస్త్రి ఖమ్మం నుండి హైదరాబాద్ కూకట్పల్లి లోని మాంగో ఆర్చిడ్ కి చేరుకున్నాడు. సూర్యనారాయణ శాస్త్రి కన్ఫ్యూజన్ లో ఉండగానే చంద్రశేఖర్ ఖమ్మం ఇంటిని తన పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నాడు. ఇల్లు చంద్రశేఖర్ పేరుమీద రిజిస్టర్ అయినాక సూర్యనారాయణ శాస్త్రి మాంగో ఆర్చిడ్ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ నుండి కారిడార్ లోకి అక్కడనుండి సెల్లార్ లోకి చేరుకున్నాడు
చంద్రశేఖర్ ఉదయం ఏడుగంటలకు మాంగో ఆర్చిడ్ పక్కనే ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారి పార్క్ లోకి ఉదయపు నడకకు వెళుతూ శాస్త్రి గారి మంచం దగ్గరకు వచ్చి ఒక గ్లాసు, ఫ్లాస్క్ పక్కన పెడతాడు. అప్పటికి శాస్త్రి లేచి సెల్లర్ ఎడమభాగం లో ఉన్న నీటి పంపుల దగ్గర మొహం కడుక్కుని రెడీ గా ఉండాలి. చంద్రశేఖర్ తెచ్చి ఇచ్చిన కాఫీ తాగి పక్కన పెడితే ఉదయపు నడక ముగించుకుని పైకి వెళుతూ ఫ్లాస్క్ తీసుకుని వెళ్తాడు. మళ్ళీ ఆఫిసుకి వెళ్తూ బాక్స్ లో అన్నం ఇచ్చి వెళ్తాడు. సాయంత్రం బాక్స్ తీసుకుని వెళ్తాడు.
‘మరి స్నానం? సంధ్య?’
‘ముసలాయన రోజూ స్నానం చేసి, సోకులు చేసుకుని ఏం చేయాలట?’ అంటుంది మాలతి చంద్రశేఖర్ భార్య.
‘మరీ అంత తట్టుకోలేక పోతే , ఆ మొహం కడుక్కున్న చోటే రెండు చెంబులు పోసుకుంటే పోయే ‘ అంటుంది
అలా వేదం లోనూ, సంగీతం లోనూ గొప్ప పాండిత్యం ఉన్న, డెబ్బయి ఏళ్ళు పైబడిన సూరవజ్జల సూర్యనారాయణ శాస్త్రి మాంగో ఆర్చిడ్ సెల్లార్ లో వాచ్ మెన్ గదికి పదిహేను అడుగుల దూరం లో అనామకంగా , ఉక్కిరి బిక్కిరి చేసే ఆస్తమాతో పడి వున్నప్పుడు, కాస్త పక్షవాతం చేతిని కమ్మేసినప్పుడు ఎవరైనా వచ్చి ‘ఎలా వున్నారు? ఆరోగ్యం ఎలా వుంది?’అని అడిగితే ‘కోపం నసాళానికి ‘ అంటదా?
2
సూర్యనారాయణ శాస్త్రికి మాట పూర్తిగా పడిపోయింది. మంచం మీంచి లేవడమే కనాకష్టం అయింది. ఉదయం పూట చంద్రశేఖర్ తెచ్చిపెట్టిన కాఫీ తాగితే తాగుతాడు, లేకపోతే అలాగే ఉండిపోతుంది. బాక్స్ లో తెచ్చిన భోజనం కూడా వారం లో నాలుగు సార్లు బాక్స్ లో అలాగే ఉండిపోతుంది.
‘మనిషి బాగానే వున్నాడు గా! తినడానికేం మాయ రోగం? తిండి పెట్టడం లేదని మమ్మల్ని అందరూ అది పోసుకోవడానికా ?’ అంటుంది మాలతి బాక్స్ మూత తీసి ఉదయం పెట్టిన అన్నాన్ని డస్ట్ బిన్ లో వేస్తూ.
వాచ్ మెన్ గంగరాజు రెండు గదుల ఇంట్లోకి ఆ రాత్రి ఒక కొత్త మనిషి వచ్చింది. వచ్చిన ఆ కొత్త మనిషి పూర్ణ గర్భిణి. రేపో ఎల్లుండో ప్రసవించేట్టు ఉంది. ఆ మనిషిని సూర్య నారాయణ శాస్త్రి అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. వాళ్ళ మాటలను బట్టి ఆ వచ్చింది వాచ్ మెన్ కూతురు అనీ, తొలి కాన్పు కి పుట్టింటికి వచ్చిందనీ అర్ధం అయింది. ఆయన మంచానికీ, వాచ్ మెన్ రెండు గదుల సంసారానికి పదిహేను అడుగుల దూరమే ఉండటం వలన, ఆయన మంచం వాచ్ మెన్ ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటుంది. ఆయన నోరు తెరచి మాట్లాడకపోయినా గంగరాజు ఇంట్లో ఏం జరుగుతున్నది అన్నది అర్ధమవుతూనే ఉంటుంది. నోరు పలకకపోయినా, చెవులకు బాగానే వినపడుతుంది, మెదడు బాగానే పనిచేస్తుంది కనుక అన్నీ అర్ధం అవుతూనే ఉంటాయి. గంగరాజు కూతురు పేరు కళ్యాణి.
ఆ పేరు వినగానే సూర్యనారాయణ శాస్త్రి లో ఏవో పురాతన భావనలు పురులు విప్పుకున్నాయి. కళ్ళు చికిలించుకుని, పరిశీలనగా కళ్యాణి వంక చూశాడు. అచ్చు తన కూతురు కళ్యాణి లాగే వుంది. కాకపోతే ఒక ఛాయ తక్కువ. కూతురు ను తలచుకోగానే సూర్యనారాయణ శాస్త్రి కళ్ళలో నీళ్లు ఊరాయి. రోజుకంటే ఎక్కువగా ఆరోజు ఆలోచనలలో కూరుకుపోయాడు. రాత్రి ఏ నడిజాము కో నిద్ర పట్టింది.
మర్నాడు ఉదయం కళ్ళు విప్పేసరికి గంగరాజు ఇంట్లో ఏ సందడి లేదు. తలుపులకు తాళం వేసినట్టు కనిపిస్తోంది. సాయంత్రం నాలుగు గంటలకు గంగరాజు ఆటో లో నుండి దిగాడు. వెనుకే గంగరాజు భార్య, కూతురు కళ్యాణి, చేతిలో బిడ్డను ఎత్తుకుని. వాళ్ళను చూడగానే కల్యాణికి డెలివరీ అయిందని సూర్యనారాయణ శాస్త్రి కి అర్ధం అయింది. కానీ ఆడబిడ్డో, మగపిల్లాడో అర్ధం కాలేదు.
పదిరోజులు ఇట్టే గడిచిపోయాయి. పదకొండవ రోజు స్నానం చేయించాక పైన ఫ్లాట్ ల లో ఉన్న వాళ్లంతా వచ్చి పాపను ముద్దు చేసి బెస్ట్ విషెస్ చెప్పి వెళ్లిపోయారు. చంద్రశేఖర్, మాలతి కూడా వచ్చి పాప ను చేతుల్లోకి తీసుకుని ముద్దు చేశారు. అంతా మంచం మీద నుండి చూస్తూ ఉండిపోయాడు సూర్యనారాయణ శాస్త్రి
‘ మూడో నెల వచ్చిందాకా వుంటావా ?’ అని అడిగింది మాలతి
‘ఉండాలనే వుంది కానీ నేను లేకపోతే మా ఆయన కి ఇబ్బంది అవుతుంది ‘ అన్నది కళ్యాణి
వాళ్ళ మాటలు వినపడుతున్నాయి సూర్యనారాయణ శాస్త్రి కి
‘మీ ఆయన ఏం చేస్తాడు ?’
‘ స్కూల్ పిల్లల ఆటో నడుపుతాడు. అందుకే ఒక్క రోజు కూడా ఖాళీ దొరకదు. స్కూల్ లేని రోజులలో మామూలుగా ఆటో ఏస్తాడు ‘
‘ఇవాళ మీ ఆయన రాలేదా ?’
‘ వచ్చాడు కానీ వెంటనే వెళ్ళిపోయాడు. మా ఇంట్లో మా మామ గారికి వొంట్లో బావోదు. ఆయన్ని కనిపెట్టుకుని ఎవరో ఒకరు ఉండాలి. అందుకే వెంటనే వెళ్ళిపోయాడు ‘
మరో నాలుగు మాటలు మాట్లాడి మాలతి, చంద్రశేఖర్ వెళ్లిపోయారు
ఆ పాపను చూస్తుంటే సూర్యనారాయణ శాస్త్రి కి ఆ పాప చిట్టి చేతిలో ఏదైనా పెట్టాలి అనిపించింది. కానీ ఏమి ఇవ్వగలడు? తన వంక చూసుకుంటే తనకే అసహ్యం వేసే శరీరం తప్పిస్తే మరేమీ కనిపించలేదు
సూర్యనారాయణ శాస్త్రి మంచం పక్కనే మంచాలు వేసుకుని గంగరాజు, గంగరాజు భార్య, కళ్యాణి పడుకుంటారు. పాప ఉందని సెల్లార్ లో లైట్లు ఆపకుండా వదిలేస్తారు. పైగా అపార్ట్మెంట్ పక్కనే ఉన్న కార్పొరేషన్ లైట్ కాంతి కూడా పడి సెల్లార్ దేదీప్యమానం గా వెలుగుతూ ఉంటుంది. పాప సరిగ్గా అర్ధ రాత్రి లేస్తుంది. అప్పటినుండీ ఎవరినీ నిద్ర పోనివ్వదు.
రెండు నెలలు గడిచాయి
సూర్యనారాయణ శాస్త్రి కి ఇప్పుడు పాపే కాలక్షేపం. పాపను స్నానం చేయించగానే సాంబ్రాణి ధూపం వేసి పడుకోబెడతారు. పాప పట్టుమని పదినిమిషాలు కూడా పడుకోదు. వెంటనే లేస్తుంది. ఊయల కడ్డీలు పట్టుకుని తలా తిప్పి సూర్యనారాయణ శాస్త్రి వంక చూస్తుంది. ఆయనా పాప వంక చూస్తాడు. ఇద్దరూ ఒకరి వంక మరొకరు చూసుకుంటారు
పాప బోసి నవ్వులతో ఏదో చెపుతుంది. ఆయన వింటాడు. ఆయన గొంతు పెగిలీ పెగలకుండా, మాట వచ్చీ రాకుండా ఏదో చెప్తాడు. పాప వింటుంది . సూర్యనారాయణ శాస్త్రిని చూడగానే పాప కళ్ల లో ఒక మెరుపు కనిపిస్తుంది. అది శాస్త్రి గమనిస్తాడు. పాపను చూడగానే ఆయన కళ్ల లోనూ ఒక మెరుపు కనిపిస్తుంది. పాప వయసు మూడు నెలలు. సూర్యనారాయణ శాస్త్రీ వయసు డెబ్బయి మూడేళ్ళ మూడు నెలలు. తనలో ఉన్న భావాన్ని చెప్పడానికి పాప కి భాష లేదు. తనలోపలి భావాలను చెప్పడానికి సూర్యనారాయణ శాస్త్రి కి నోటిలోనుండి భాష పెగలదు
అయినా ఇద్దరికిమధ్యా ఒక వంతెన ఏదో పడింది. ఎవరు వేసారా వంతెన? పాప కి కోపం వస్తే పెదవులు బిగించి,కళ్ళు చిన్నవి చేస్తుంది. అలా కళ్ళు చిన్నవి చేసి మూసుకుంటే శాస్త్రి కి గుండెల్లో ఏదో కలుక్కుమంటుంది. బాధగా ఉంటుంది. అప్రయత్నంగా అతడి కళ్ళ నుండి నీళ్లు కారిపోతాయి. గుండెను ఎవరో పట్టుకుని మెలి పెట్టినట్టు ఉంటుంది
పాప నవ్వులు అర్ధం అయినట్టు పాప ఏడ్పు అర్ధం కాదు. అయినా సంతోషానికి కారణం ఎందుకు? దుఃఖాన్ని నివారించడానికి కారణం కావాలి కానీ
ఒక రోజు ఉన్నట్టు ఉండి పాప ఏడవడం మొదలు పెట్టింది. కళ్యాణి పరుగున వచ్చింది. పాపను ఎత్తుకుంది. అయినా పాప ఏడ్పు ఆపలేదు. ఆకలవుతుందేమో నని పక్కకు వెళ్లి చన్ను కుడిపింది. రెండు గుక్కలు కూడా తాగకుండానే మళ్ళీ ఏడ్పు అందుకుంది. మంచం లో వుండే కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ పాప వంక చూస్తున్నాడు సూర్యనారాయణ శాస్త్రి. అతడికి తన కళ్యాణి చిన్నప్పుడు ఒకసారి ఇలాగే ఏడ్చిన విషయం గుర్తుకొచ్చింది. తానూ, నీల వేణి ఎంత సముదాయించినా కల్యాణి ఏడ్పు ఆపలేదు. దాదాపు నాలుగు గంటలు అలా వెక్కుతూనే వుంది. కారణం తెలీక నీలవేణి ఎంతలా పొగిలిపోయింది.
పాప ఏడుస్తూనే వుంది. కారణం తెలీక కళ్యాణి కంగారు పడుతోంది. అప్పుడు కళ్యాణి ఏడ్పు ఎలా ఆగింది. శాస్త్రికి గుర్తొచ్చింది. కళ్యాణి పక్క బట్టలలో చిన్న చీమ చేరి కళ్యాణి ని కుట్టడం మొదలు పెట్టింది. అదీ కారణం. ఇప్పుడూ అలాగే జరుగుతున్నదా? శాస్త్రి ఏదో చెప్పాలని నోరు విప్పాడు. నోటి నుండి మాట బయటకు రావడం లేదు. దగ్గరకు పిలిచి పాప దుస్తులు తడమాలనుకున్నాడు. పిలవడానికి చేయ పైకి లేవడం లేదు
చాలా సేపటికి పాప ఏడ్పు ఆగింది. ఏడిచీ, ఏడ్చి నిద్రలోకి జారుకుంది. ఒక్కసారిగా సునామీ వచ్చి వెలసినట్టు అయింది. శాస్త్రి మంచం పక్కన చూశాడు. పొద్దున్న ఎప్పుడో పెట్టిన ఫ్లాస్క్. కాఫీ అలాగే వుంది. చేయి చాచి అందుకోపోయాడు. చేయి లేవడం లేదు. మొన్నటి దాకా కాలే అనుకుంటే ఇప్పుడు చేయి కూడానా?
3
పాప కీ శాస్త్రికీ నడుమ ఒక స్నేహం ఏర్పడింది. వాళ్లిద్దరూ రోజూ మాట్లాడుకుంటున్నారు. ఎవరి భావం ఏమిటో మరొకరు తెలుసుకుంటున్నారు. వాళ్లకు భావాన్ని చెప్పడానికి మాటలు అవసరం లేదు. కేవలం కళ్ళను అటూ ఇటూ తిప్పడం ద్వారా వాళ్ళ మధ్య సంభాషణ జరుగుతుంది
పాప ఊయల లో అటు తిరిగితే కోపం వచ్చిందని అర్ధం. రెండు చిన్ని కాళ్ళు పైకిఎత్తి చాలా వేగంగా సైకిల్ తొక్కినట్టు ఆడిస్తే పాప హుషారుగా ఉన్నట్టు అర్ధం. పాప నోట్లో వేలేసుకుని ముసలాయన వంక చూస్తే ‘ నీకు ఆకలవుతున్నదా?’ అని ప్రశ్న వేస్తున్నది అని అర్ధం. అసలు మనుషుల మధ్య భావ వినిమయానికి , సమాచార వినియోగానికి భాష అవసరమా? ఇన్ని భాషలు, ఇంత వ్యాకరణం, ఇంత ఛందస్సు అవసరమా? అని ప్రశ్నిస్తే ఆ పండుటాకు, ఆ చిగురుటాకు అవసరం లేదనే చెప్తారు. వాళ్లిద్దరూ ఒక కొత్త భాషను సృష్టించుకున్నారు. ఆ భాషా నియమాలు ఎవరికీ తెలియవు. వాళ్ళిద్దరికీ మాత్రమే తెలుసు
ఊయల లో నుండి పాప కదలదు. మంచం లో నుండి ఆ వృద్ధుడూ కదలడు. అయినా ఇద్దరూ కలసి లోకం చుట్టి వస్తారు. హరివిల్లు పల్లకీ ఎక్కుతారు. మబ్బుల నీలిమలలోకి దూరిపోతారు. సముద్రపు ఆవిరి తో కలసి మేఘమై మళ్ళీ అనురాగపు వర్షమై కురుస్తారు. భాషను రద్దు చేసి భావాంబర వీధిలో షికార్లు చేస్తారు.
అనాది శబ్దాలకు రాగాన్ని అద్ది భావ ప్రసారం చేస్తారు. పసికందు చేసే ధ్వనులన్నీ ఒక సారి షడ్జమం లానూ, మరొక సారి మధ్యమం లానూ, ఇంకొకసారి పంచమం లానూ అనిపిస్తాయి ముసలి సూర్యనారాయణ శాస్త్రి కి. ఈ పిల్ల అన్ని సంగతులూ పాడుతుంది కానీ నిషాదం జోలికి పోదు ఎందుకని అని ఆయన లోలోపల ఆశ్చర్య పోతారు. ఈ పిల్ల తల్లి కల్యాణి అయితే ఈ పిల్ల శ్యామ కల్యాణి అనుకుంటారు ఆయన లోలోపల
ఆరు నెలలు గడిచాయి.
సూర్యనారాయణ శాస్త్రి అనూహ్యంగా కోలుకున్నాడు. కదలని చేతిని కదిలించగలుగుతు న్నాడు. కొద్దిగా మాట పలుకగలుగుతు న్నాడు.’ ఆ శ్రీ రామ చంద్ర ప్రభువు ఎప్పుడు తీసుకెళతాడో’ అని ఎదురు చూసిన వాడు కాస్తా జీవించడం లో ఉన్న పరిమళానికి ఉబ్బి తబ్బిబు అవుతున్నాడు . శ్యామ కల్యాణి బూ , బ్రూ లాంటి మంగళాశీర్వచనాలు పలుకగలుగుతోంది.
కల్యాణి అత్తగారింటికి బయలుదేరింది. శ్యామ కల్యాణి ఆకుపచ్చరంగు ఫ్రాక్ తొడుక్కుని ముద్దు ముద్దు గా బా … బ్రూ అంటూ కళ్ళని చేప పిల్లల్లా తిప్పుతోంది. అపార్ట్మెంట్ బయట ఆటో ఆగింది. ముందు సామాను అంతా ఆటో వెనుక భాగం లో పెట్టి ముందు గంగరాజు భార్య, తరువాత కల్యాణి ఆటో ఎక్కారు. శ్యామ కల్యాణి తల్లి భుజాలమీద నుండి సూర్యనారాయణ శాస్త్రి కళ్ల లోకి తొంగి చూసింది. సూర్యనారాయణ శాస్త్రి కి ఆ పిల్ల కళ్ళలో నీలి మేఘాలు ఏవో కనపడినాయి. ఆటో ముందుకు కదిలింది. శ్యామ కల్యాణి చిట్టి చేయి ఆటో లో నుండి బయటకు కనపడినంత దూరం సూర్యనారాయణ శాస్త్రి చూపులు వెంటాడాయి.
ఆ తరువాత సరిగ్గా ఆరు గంటల ఏడు నిమిషాలకు సూర్యనారాయణ శాస్త్రి కళ్ల లో నుండి జీవం ఎగిరి పంచభూతాలలో కలసి పోయింది.
అక్కడ కొత్త చోట శ్యామ కల్యాణి ఒక్కసారిగా గుక్కపట్టింది.
Add comment