అదండీ మేస్టారూ…!!!

 “మా ఊరి పెసిరెంటు సారూ…  మాగొప్ప మనిసి సారూ!!”

“నిజమా!!”

“అయిబాబోయ్ తఁవరికి తెల్దేటండీ! ఈ సుట్టుపక్కల పొలాలూ, తోటలూ;  గరువులూ, దొడ్లూ,  ఊర్లో రైసు మిల్లూ, టౌన్లో సినేమాహాలూ…  అన్నీ ఆరియ్యే కదండీ”

అవునా, నాకు తెలీదులే”

“అవునండి బాబూ అన్నీ ఆరియ్యేనండీ! అన్నట్టు బాబూ, మీకు సెప్పనే లేదు కదూ, సెడ్డ  ఇదైనోడండీ మావోడు”

“ఇదైనోడా… ఇదైనోడంటే?”

“ఇదేనండీ సికాకు తఁవురితోటి. పెతీదీ అరిటిపండొలిసి సేతిలో ఎట్టినట్టు ఇడమరిసి సెప్తేగాని అరదం కాదు మీకు.  ‘ఇదైనోడంటే’… అదేనండీ. ‘మాం…ఛి ఉసారైనోడ’నండీ.”

“హుషారైనోడా? అంటే?”

“బొడ్డూడని గుంటడ్నాగ పెతీదానికీ ‘అంటే, అంటే’ అనడుగుతుంటే ఏటి  సెప్తావండీ…  ఉసారైనోడంటే…   సెడ్డ తుంటరోడని మీనింగండి! ‘క్రిస్నుడి’ లాటోడని అరదవండి!”

“ఆఁహా, అలాగా”

“తఁవురికి ఇసయం పూర్తిగా బోదపడినట్నేదుగాని,  ఇవరంగా సెప్తాను; జాగర్తగా ఇనండి మరి.”

“సరే కానియ్, ఒద్దంటే వదిలి పెడతావా ఏంటి!!”

“ఆరికో పెల్లం ఉంది కదండీ?”

“ఉందా?”

“ఉందండి. ఆయమ్మ గాకుండా ఊర్లో ఉంకో సెటప్పుందండి మావోడికి. ఆలిద్దరూ గాకుండా,  టౌన్లో ఉంకో గుంట… సినేమా ష్టారునాగుంతాదంటండీ అది… దాన్నుంచుకున్నాడండి.  ఇయి సాల్నట్టు, కంటికి నదురుగా అవుపించిన ఏ గుంటనీ ఒగ్గడండీ. అలాటికాడ కులం గిలం ఇలాటి పట్టింపులేయీ ఉండవండి మా గురువుగారికి.  ఏదో ఒక మాయచేసి, ఎలాగో ఒకనాగ, పక్కన తొంగడబెట్టీసుకుంతాడండీ. అలాటాటికి ఎంత సొమ్మన్నా మంచినీల్లాగ కర్సు పెటెత్తాడుగాని బాబూ, ఎనకా ముందూ సూడ్డంటే నమ్మండి. అయినా మీకీ సంగతులేవీ తెల్దదంతన్నారు కదండీ?”

“అబ్బే నాకెలా తెలుస్తాయివన్నీ?”

“అవున్లెండి పాపం, పొట్ట సేత్తో ఒట్టుకొని  పొన్నూరునుండి పారొచ్చినోరు,  తఁవురికెలా తెలుత్తాయీ ఇసియాలన్నీ. అది సరేగాని బాబూ, ఇంకో చీకిరేటు  సెప్పమంతారేటి తవురికి?”

“చెప్పొద్దంటే మానేస్తావేంటి!”

” ఉంకో గొప్ప సుగునవుందండి మా బాసులో”

“ఏంటో అది?”

“ఓపాలి మీద సెయ్యేసిన  గుంటన్దేన్నీ జలమలో మరిసిపోడండి మా నాయుడు! అది పెల్లైన ఆడదాయనుకోండి, దానికో, దాని మొగుడికో, ఎవలో ఒకలికి  ఏదో ఒక సిన్న ఆదారఁవన్నా  సూపించకుండా ఉండడండీ. సూపించేక్కూడా ఆల మానాన ఆల్ని ఒగ్గియ్డండీ! అప్పుడప్పుడూ   ఎంతో కొంత సేతిలో ఎడతానే ఉంతాడుగానీ, ఆల్ని ఉదిలిపెట్టియ్డండీ.”

“ఇంక పెల్లికాని గుంటల సంగతైతే బాబూ,  మరింక సెప్పనే అక్కర్లేదండీ. దగ్గిర్నిలబడి మరీ పెల్లిల్లు సెయ్యిత్తాడండి ఆలకి!! తాలిబొట్టుకీ, బట్టలికీ, బోజినాలకీ అయ్యీ కర్సంతా మా గురువుగారే, ఆరి జోబీలోంచే ఎట్టుకుంతారండి!! పైసా కూడా ఎవర్నీ కర్సు పెట్టనియ్యడండి! దరమప్రెబువండీ!! సెయ్యెత్తి దన్నవెఁట్టాలండి బాబుకి!!!

“నిజవా!!!”

“నిజవా అనడుగుతారేటండి బాబూ, ఉన్నమాటే గాని, పేనం పోయినా పొల్లుమాటాడీ వోడ్ని కాన్నేను. అన్నట్టు సిన్న పని మీనెల్తన్నానుగాని, నన్నొగ్గియ్యండి మరి. మల్లీ ఇంకోపాలి కలుత్తాన్లెండి.”

*****

“అల్లడిగడిగడిగో… సినేమాలో సిరంజీవినాగ సెడ్డ సోగ్గా తయారై ఎగురుకుంతా ఒత్తన్నాడు కదా… ఆడ్ని చూసేరా?”

“చూసేనుగాని, ఏంటి కథ?”

“ఏటి కతని అంత మెల్లిగా అడుగుతారేటండీ బాబూ!! ఉత్త  సెతకారీ ఎదవండి ఆడు.  దొంగముండాకొడుకండీ.”

“అలాగా”

“ఎందుకూ, ఏటీ అని అడక్కుండా, ‘అలాగా’ అని అంత వీజీగా అనీసేరేటండి బాబూ! తవుఁరడక్కపోయినా సెప్పకుండా నానెలాగ ఒల్లకుంతానుగాని, సంగచ్చెపుతాను; ఇనండి మరి.  కత్తిలాటి పెల్లవండి ఆడికి. సూడ్డానికి రెండు కల్లూ సాలవండి. అంత గొప్ప అందగత్తండి.  ఆడముండ… కూలీనాలీ చేసి ‘ఇత్తనాల పోతుని’ మేపినట్టు మేపుతాదండీ ఆడ్ని. ఆడేమో ఇలాగ సినేమా వేక్టరునాగ మేకప్పు కొట్టుకోని, కనిపించిన పెతీ గుంటెనకాతలా పడి తిరుగుతుంతాడండి, అచ్చోసిన ఆంబోతునాగ.”

“అంటే పనీ పాటూ ఏఁవీ చెయ్యడన్నమాట?’

“సెయ్యడా అంటే… ఏదో సేత్తాడనుకోండి; సేత్తే మాత్రం, అలాటి పనికిమాలిన పన్లు సెయ్యొచ్చేటండి ఏ ఎదవైనా? సెఁవడాలు ఎక్కదీసియ్యొద్దండీ అలాటి బేవార్సెదవలికి? నేనన్నదాంట్లో సత్తెవుందో లేదో తఁవురే సెప్పండి?”

“సత్యముందా అని అడిగితే ఉందనే చెప్పాలనుకో… అయినా,  వాడు పడీ పాటేంటో ఇంతకీ?”

“సేసీయన్నీ ఇలాటి దాగుల్బాజీ పనులే అయినప్పుడు ఆడు గవునేరైతే మనకేటి? కలెట్రైతే మనకేటి? అయినా, సెంటు బూఁవిక్కూడా టికానా లేని ఉత్తి పకీర్నా కొడుకు బాబూ ఆ జాత్తక్కువ లంజికొడుకు!! అసల్నేదు గాని బాబూ, నా సేతిలో కుసింతైనా  ఫవరుంతేనా,  ఆడి కాలో సెయ్యో ఏదో ఒకటి,  ఎప్పుడో ఇరగ్గొట్టీసి పోదును. అంత అసియ్యం ఆడంతే నాకు.”

“నిజవా!!! అయినా తెలియక అడుగుతున్నాను అతని భార్యకు లేని బాధ నీకెందుకు చెప్పు?”

“ఎందుకంతారేటండి బాబూ, అలాటి పాపిస్టెదవలున్నకాడ అదునుకి వర్సాలూ గిర్సాలూ పడతాయేటండి? కరువులూ, కాటకాలూ; రోగాలూ రొస్టులూ… ఈటితో అతలాకుతలవైపోదూ పెపంచికం!  అది సరేగాని బాబూ,  కొంచెం అరిజెంటు పనిమీన పారెల్తన్నాను, ఇప్పటికే సానా ఆలీసెం అయిపోనాది. నానెలుపొత్తాను. రేపో, ఎల్లుండో మల్లా అవుపిత్తాన్లెండి.”

*****

అదండీ  మేస్టారూ… అదీ సంగతి…!!!

ఒకరు ‘దరమ ప్రెబువూ’ ‘మా గొప్ప మనిసీ’ను!!! ‘సెయ్యెత్తి దన్నవెట్టాలా బాబుకి!!!’

మరొకడేమో ‘’సెతకారీ ఎదవా’ ‘అచ్చోసిన ఆంబోతూను’!!! ‘సెవడాలెక్కదీసీయ్యాలా లం–కొడుక్కి!!!

*

కృపాకర్ పోతుల

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు